శ్రీరామ లక్ష్మణుల చిహ్నాలను సీతకు వివరించిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (23-04-2018)
జవాబుగా హనుమంతుడు: "దేవీ! నా అదృష్టం కొద్దీ, నేను రావణుడను
కానని నమ్మి, మౌనం చాలించి, నీభర్త గుర్తులు, లక్ష్మణుడి చిహ్నాలు, యోగ్యంగా, వాస్తవంగా
చెప్పమని అడిగావు. చెపుతావిను. రామచంద్రమూర్తి కమలపత్రాక్షుడు. సర్వసత్వ మనోహరుడు.
సమస్తజంతువుల మనస్సు హరించే గుణమున్నది. సౌందర్య,
దాక్షిణ్యాలతో పరిపూర్ణుడై పుట్టాడు. తేజస్సులో సూర్యుడికి, ఓర్పులో
భూదేవికి, బుధ్ధిలో బృహస్పతికి, సమానుడు. కీర్తికి
ఇంద్రుడి లాంటివాడు. తనకులవృత్తి ధర్మాన్నేకాకుండా, లోకమందున్న వారందరి కులవృత్తి ధర్మాలను రక్షించేవాడు.
మానవులకు ఏదిమంచో తెలుసుకుని,
దాన్ని తాను అనుసరించి, తర్వాత లోకులకు ఇట్లా చేయమని చెప్పే గుణమున్నవాడు.
రామచంద్రుడిలో కేవలం చెప్పే పాండిత్యమే కాకుండా, చేసే సామర్ధ్యం కూడా వుంది. కాంతికలవాడు, సాధుపూజితుడు, తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠ వున్నవాడు, సాధువులకు ప్రీతిపాత్రుడు, వైదిక కర్మ
విధాన్నంతా ఆసాంతం పూర్తిగా తెలిసినవాడు, రాజ్యవిద్యలందు
కడుసమర్ధుడు, సదాచార సంపత్తికలవాడు, అందరి
ఎడలా నీతిగా ప్రవర్తించేవాడు. ఋగ్వేద
సామవేద,
అధర్వణవేదాలూ,
వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, చందస్సు, నిరుక్తం,
జ్యోతిష్యం, కల్పాలూ, యజుర్వేద, ధనుర్వేదాలూ నిపుణంగా
తెలిసినవాడు".
ఇంతవరకూ చెప్పినవన్నీ ఆత్మగుణాలనీ, దేహగుణాలను కూడా
చెప్తాననీ ఇలా వర్ణిస్తాడు: "వెడల్పైన మూపులున్నాయి, పొడవైన చేతులతో ప్రకాశిస్తుంటాడు, శంఖం
లాంటి కంఠంముంది, పూర్ణచంద్రుడితో సమానమైన ముఖముంది, ఎర్రటికళ్లు,
గంభీర ధ్వని, బలిష్టమైన అవయవ సౌష్టవం, మెరిసే దేహకాంతి, మేఘవర్ణంలాంటి దేహవర్చస్సూ వుంది. ఏ అవయవం ఎంత పరిమాణంలో
వుండాల్నో, అంతమాత్రమే వున్నవాడు. మరోవిధంగావున్నట్లు
తెలియనివాడు. హెచ్చు తగ్గులు లేని శరీర కొలతలున్నవాడు. ఎర్రటి కనుకొనలు, గోళ్లు, అరచేతులు,
అరికాళ్లున్నాయి. కనుబొమ్మలు, చేతులు, వృషణాలు, పొడుగ్గా వుంటాయి.
రొమ్ము, మడికట్టు, పిడికిలి, స్థిరంగా వుంటాయి.
పొత్తికడుపు, బొడ్డు, రొమ్ము
ఎత్తుగా వుంటాయి. పాదరేఖలు, తలవెంట్రుకలు, లింగం, నున్నగా వున్నవాడు. గంభీర కంఠధ్వని, నడక,
లోతైన బొడ్డు కలవాడు. కంఠంపైన మూడు రేఖలున్నాయి. తలవెంట్రుకల కొనలు,
వృషణాలు, మోకాళ్లు, సమానంగా వుంటాయి.
చనుమొనలు, స్తనముల రేఖలు పల్లంగా వున్నాయి. సమంగా, గుండ్రంగా, విశాలంగా వున్న శిరస్సుకలవాడు. బొటనవేలు
కింద మూడు వేదాలను సూచించే గీతలున్నాయి. నొసట నాలుగు రేఖలున్నాయి. అరికాలిలో,
అరచేతిలో,
ధ్వజం, వజ్రం, అంకుశం, శంఖం లాంటి నాలుగు రేఖలున్నవాడు. చేతులు,
మోకాళ్లు, పిక్కలు, తొడలు, సమంగా వున్న
బలశాలి. తొంభై ఆరంగుళాల ఎత్తుంటాడు. దొండపండులాంటి పెదవి, బలసిన చెక్కిళ్లు, పొడుగ్గా, నిక్కపొడిచిన
ముక్కున్నవాడు. కనుబొమలు, ముక్కుపుటాలు, కళ్లు చెవులు, పెదవులు, చనుముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు,
కటిప్రదేశాలు చేతులు, కాళ్లు, పిరుదులు, సమానంగా వుంటాయి.
వీటన్నింటికీ తగిన చిహ్నాలున్న స్త్రీవి నీవొక్కతవే ఎట్లున్నావో, లోకంలో నీకు తగ్గట్టి ఇట్టి చిహ్నాలున్న పురుషుడు
ఆయనొక్కడే!"
"నాలుగు ప్రక్కలా దంష్ట్రలు (పైపళ్ల వరుసలో
రెండుప్రక్కలా, దిగువ పళ్ల వరుసలో రెండు ప్రక్కలా చేరి
నాలుగు ప్రక్కలుంటాయి. అందులో ఒక్కొక్క దాంట్లో నాలుగేసి కోరల్లాంటి పళ్లున్నాయని
అర్థం. ఈరెండు వరుసలలోనూ,
మధ్యనున్న నాలుగు పళ్లకు, రెండుప్రక్కలా ఒక్కొక్క "పన్ను" వుంటుంది. దాన్ని
"దంష్ట్ర" అంటారు. ఇలాంటివి నాలుగు ప్రక్కలా నాలుగున్నాయని అర్థం)
కలవాడు. సింహం, ఏనుగు, శార్దూలామ్, వృషభం లాగా నడుస్తాడు. వీపు, దేహం, చేతుల, కాళ్ల వ్రేళ్లు, చేతులు, ముక్కు,
కళ్లు, చెవులు, లింగం
నిడుపులుగా వున్నవాడు. చేతులు, వ్రేళ్లు, తొడలు, పిక్కలు, ఎనిమిది నిడుపులగు
వాడు. కళ్లు, దంతాలు, చర్మం,
పాదాలు, వెంట్రుకలు, మెరుస్తుంటాయి.
ముఖం, కళ్లు, నోరు, నాలుక, పెదవులు, దవడలు,
చన్నులు, గోళ్లు, చేతులు,
కాళ్లు,
పద్మాలవలె గుండ్రంగా వుంటాయి. శిరం, నొసలు, చెవులు,
కంఠం, రొమ్ము, హృదయమ, కడుపు, చేతులు, కాళ్లు,
పిరుదులు,
పెద్దవిగా వున్నవాడు. వ్రేళ్ల గణుపులు, తలవెంట్రుకలు, శరీరంపై వెంట్రుకలు,
చర్మం, లింగం, మీసంలోని
వెంట్రుకలు, సూక్ష్మ బుధ్ధి, సూక్ష్మ దృష్టి, సూక్ష్మంగావున్నవాడు".
(సీతమ్మ రాముడి తొడలు ఎలా వుంటాయనీ, లక్ష్మణుడి తొడలు ఎలా వుంటాయనీ అడగటమేమిటి? తప్పుకద! అలా
అనిపించడం సహజం. విశేషించి పరపురుషుడిని, అందునా పరిచయం లేనివాడిని అడగటమంటే, ఇదొక పరీక్ష
హనుమంతుడికి. ఆమెకు రామలక్ష్మణుల స్వరూపం తెలుసు. కాబట్టి అడిగింది. హనుమంతుడు
చెప్పేదానిలో ఆ వివరాలు సరిపోతే ఆమె నమ్మగలుగుతుంది. అది అలా వుంచుదాం. కంటికి
కనిపించే అవయవాలను వర్ణించి చెప్పవచ్చు. కంటికి కనిపించని మర్మావయవాలను ఎలా
వర్ణించగలం? తెలిసే అవకాశం లేదే! ఒకవేళ చూడడం సంభవించినా, స్త్రీ ముందు వివరించి చెప్పడం ఔచిత్యం కాదుకద! హనుమంతుడు
బుద్ధిమంతులలో శ్రేష్టుడు. సాముద్రిక శాస్త్రవేత్త. ఆ శాస్త్రం వ్యక్తుల రూపురేఖా
విలాసాలను చెప్పి, వాటి ఫలితాలను వివరిస్తుంది. ఏ ఏ జాతులవారు ఎలావుంటారో, సర్వావయవ పరిమాణాలను బట్టి విశ్లేశిస్తుంది. సాముద్రిక
శాస్త్ర జ్ఞాని హనుమంతుడు అయినందున, కంటికి కనిపించే అవయవాల పరిమాణాలను బట్టి, పొందికను బట్టి, కంటికి కనిపించని
[మర్మ] అవయవాలను వర్ణించగలుగుతాడు. సీతమ్మ ఉద్దేశ్యం కూడా అదేనేమో! రామలక్ష్మణుల
ముఖాలనూ, బాహువులనూ, వక్షస్థలాలనూ గమనించిన వాడు,
మిగిలిన వాటిని చెప్పగలడా? లేడా?
అని. అంటే, ఈ దూత చూసినదే
వల్లిస్తాడా? లేక చూసిన దానిని బట్టి,
ఇంగిత జ్ఞానంతో, తదుపరి ఆలోచన చేయగలడా? లేదా?
అని గ్రహించటానికే. హనుమంతుడు జయశీలుడు. పరీక్ష నెగ్గాడు.
సీతకు విశ్వాస పాత్రుడైనాడు)
No comments:
Post a Comment