Sunday, April 15, 2018

సీతాదేవి సందేహం తీర్చిన హనుమంతుడు .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవి సందేహం తీర్చిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (16-04-2018)

సీతాదేవి తనను సందేహిస్తున్నదనుకున్న హనుమంతుడు, అది పోగొట్టడానికి, తియ్యటి మాటల్తో, రామచంద్రమూర్తిని ఇలా కీర్తిస్తాడు:

"రామచంద్రమూర్తి రాజుల్లో శ్రేష్టుడు, ప్రతాపంలో సూర్యుడు, చంద్రుడిలా ఆహ్లాదకరుడు, కుబేరుడిలా లోకమంతటికీ ప్రభువు, జగమంతా వ్యాపించిన కీర్తిగలవాడు, విష్ణుమూర్తిలాగా పరాజయం ఎరుగని శౌర్యమున్నవాడు, సౌందర్యమ్లో మన్మధాకారుడు, సత్యం చెప్పడంలో ప్రీతిగలవాడు, తీయటిమాటలు చెప్పడమ్లో బృహస్పతి, శత్రువులకు భయంకరుడు, లోకమంతా స్థిరంగా జీవించడానికి నీడనిచ్చే శ్రీకరములున్నవాడు".

ఇలాంటి గుణాలున్న శ్రీరాముడు, లేడినెపంతో తనను దూరంగా పంపించి, సీతను ఎత్తుకునిపోయి, దుఃఖానికి గురిచేసిన, విరోధి రావణుడి జాడ తెలుసుకుని, వాడిపాపానికి తగ్గ ఫలితం అనుభవించేట్లు చేసేందుకు, రామదూతగా వచ్చానని హనుమంతుడు చెప్తాడు సీతతో. తన విషయంలో వాస్తవమైన రామదూతో, కాదోనని సందేహించవద్దంటాడు. యుద్దంలో ప్రళయకాల రుద్రుడిలాగా, తనపదునైన బాణాలతో విజృంభించి, సీతను అపహరించాడన్న కోపంతో, రావణుడిని చంపబోతున్న ఆ శ్రీరాముడి దూతగా, ఆయన పంపగా వచ్చానని విన్నవించుకుంటాడు హనుమంతుడు. పతివ్రతా శిరోరత్నమైన సీత, తనను సందేహించవద్దనీ, తాను రావణుడిని కాననీ, మాయావిని కాదనీ, నమ్మమని మరీ-మరీ అంటాడు. ఇంకా ఇలా చెప్తాడు సీతాదేవితో:

"నీ ఎడబాటువల్ల కలిగిన వ్యధతో, రామచంద్రమూర్తి, రేయింబగళ్లు, తనను సంతోషపెట్టిన, తామరరేకుల్లాంటి, చంద్రుడిలాంటి ముఖమున్న సీతాదేవిని చూసే ప్రాప్తం లేదని బాధపడ్తున్నాడు. నన్ను పోయి తన క్షేమం ఆమెకు చెప్పి, ఆమె క్షేమం తనకు తెలియచేయమంటే, ఆయన ఆజ్ఞ ప్రకారం, నేను బయల్దేరి వచ్చాను. నేనొచ్చేటప్పుడు, నిన్ను కన్నెత్తైనా చూడని లక్ష్మణుడు, నిండు భక్తితో, నీపాదాలకు నమస్కరించి, నీ క్షేమం కనుక్కుని రమ్మన్నాడు. తనప్రాణదాత, అభయదాతా అయిన రామచంద్రుడిని, తండ్రిలాగా భావించే సుగ్రీవుడు, నిన్ను తల్లిలాగా తలంచి, నీ క్షేమం కనుక్కుని రమ్మన్నాడు. రామచంద్రమూర్తి నీకోసం దుఃఖిస్తున్నాడో, రాజ్యం పోయినందుకు దుఃఖిస్తున్నాడో, బంధువులకు దూరమయినందుకు దుఃఖిస్తున్నాడో, నీకెట్లా తెలుసని నన్నడిగితే, నాపాలిట శ్రీమహాలక్ష్మివైన నీతో అబద్ధం చెప్పను. ఆయన రహస్యంగా తనలో తను ఏడవలేడు. లక్ష్మణుడు, సుగ్రీవుడు దగ్గరున్నప్పుడు వారితో చెప్పుకుని ఏడుస్తుంటే, వారూ నీకై దుఃఖపడ్డారు. మా అదృష్టం వల్ల, రాక్షసుల చేతచిక్కినా, నీవు వారిచేతుల్లో చావక బ్రతికే వున్నావు. నీవే మరణించి వుంటే, మేమందరం చచ్చేవాళ్లమే! ఇక జరగబోయేది చెప్తా విను" అంటాడు హనుమంతుడు.



"త్వరలో నువ్వు రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని లంకలో చూస్తావు. నేను మాయలమారి రావణుడిని కాను. నీకు కనిపిస్తున్న రూపమే నా అసలు రూపం. నేనుకోతినే. పేరు హనుమంతుడు. సూర్యపుత్రుడు, వానరరాజు అయిన సుగ్రీవుడికి మంత్రిని. అధముడను కాను. ఇలాంటి నేను నీకొరకై, రామాజ్ఞ ప్రకారం సముద్రాన్ని దాటాను. లంకలో ప్రవేశించాను. రావణుడి నెత్తిమీద దొంగచాటుగా కాకుండా, పరాక్రమంతో కాలుపెట్టాను. ఇదంతా చేసి నిన్ను చూడటానికి వచ్చాను. నన్ను నమ్ము. నేను నువ్వనుకుంటున్నట్లు రావణుడను కాను. సందేహం మాని, పరులతో ఎలా సంభాషించ వచ్చన్న అనుమానం లేక, నీ దాసుడైన నాతో, నీబిడ్డతో మాట్లాడినట్లే మాట్లాడు" అంటాడు హనుమంతుడు.

రావణుడు మారువేషంతో వస్తే: రావణుడి నెత్తిపై పాదంపెట్తాననీ, రావణుడిని రాముడు చంపుతాడనీ అనడు కద!. కాబట్టి హనుమంతుడితో మాట్లాడవచ్చని నిశ్చయించుకుంటుంది సీత. అయితే రామదూతే అని నిర్ణయించుకోవడానికి, సందేహం తీరక ప్రశ్నిస్తుంది మరలా. (హనుమంతుడు ప్రత్యక్ష, పరోక్ష నిదర్శనాలతో, సీతాదేవిని పరీక్షించి [ఆచార్యుడు-శిష్యుడిని] చూసుకున్నట్లే, సీతాదేవి కూడ హనుమంతుడిని [శిష్యుడు-ఆచార్యుడిని] ప్రత్యక్షంగా పరీక్షిస్తుంది మొదలు. అంటే శిష్యుడిని గురువు పరీక్షించినట్లే, గురువును కూడా శిష్యుడు పరీక్షించాలి. వీధిన పోయే ప్రతివాడినీ నమ్మి "ఆచార్యుడి"గా చేర రానీయకూడదు.)

 సందేహ నివృత్తి కొరకు హనుమంతుడిని ఈవిదంగా ప్రశ్నిస్తుంది సీత: "శ్రీరామచంద్రమూర్తికీ, నీకూ స్నేహమెలా కలిగింది? లక్ష్మణుడెట్లు తెలుసు నీకు? నరులు, వానరులు, ఒకరిని చూస్తే ఇంకొకరు బెదురుతారు కదా! ఎట్లా మీరిరువురూ ఒకచోట చేరారు? అన్నదమ్ములిద్దరికి ఎలాంటి గుర్తులున్నాయి? రాముడికీ, లక్ష్మణుడికీ తొడలెలా వుంటాయి? చేతులెట్లా వుంటాయి? నీవు నిజమైన వానరుడవే అయితే, రామదూతవే అయితే, వాస్తవం చెప్పి నన్ను మెప్పించు".

( శ్రీరామ-లక్ష్మణుల చిహ్నాలేంటని సీతాదేవి హనుమంతుడికి వేసిన ప్రశ్న ఒక విషమ ప్రశ్న. అందులో రెండు భాగాలున్నాయి. చేతుల విషయం ఎవరైనా చెప్పొచ్చు....అందరికీ కనిపిస్తాయి కాబట్టి. "తొడలెలా వుంటాయని" కూడా అడుగుతుంది. అంటే మర్మాంగాలను గురించి ఆరా తీస్తున్నదన్న మాట. దీంట్లో గురువును పరీక్షించే తీరు కనిపిస్తుంది. జవాబు చెప్పేటప్పుడు ఔచిత్యం కనబరుస్తాడా? లేదా అని పరీక్షించ దల్చింది. దీనర్థం: "ఆచార్యుడు", భగవత్ తత్వాన్ని ఆమూలాగ్రంగా, రహస్యాలతో సహా తెలిసిన వాడై వుండాలని.)

No comments:

Post a Comment