Sunday, June 3, 2018

తను హనుమ వెంట రాలేని కారణాన్ని చెప్పిన సీత ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


తను హనుమ వెంట రాలేని కారణాన్ని చెప్పిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (04-06-2018)
"ఆంజనేయా! నేను సొమ్ములను మూటవేసిన స్థలం నాకు గుర్తుంది. అక్కడికి, ఇక్కడికి చాలా దూరం. ఇంతదూరం నన్ను ఎట్లా మోసుకుని పోతావు? నీమాటలు వినడానికే వింతగా వున్నాయి. ఇంతవరకు నీవు నిజంగా కోతివో, కాదో అన్న అనుమానం, సందేహం వుండేవి. ఇప్పుడు నీబుధ్ధిని పట్టి చూస్తే నీవు నిజంగా కోతివేనని, నిశ్చయించుకుంటున్నాను. ఈడ్చి కొలిస్తే నువ్వు జానెడు కూడా లేవు....నీవు నన్నెట్లా మోసుకుపోతావు" అన్న సీతాదేవిమాటలకు హనుమంతుడు విచారపడ్డాడు. ఎప్పుడూ, ఎవరివల్లా జరగని అవమానం, నేడు ఒక ఆడదానివల్ల జరిగిందికదా అని ఆలోచించసాగాడు. సీత తనను అవమానించాలన్న ఉద్దేశంతో మాట్లాడి వుండదనీ, తనెంతటి వాడినో, తన మహత్త్వమెట్టిదో తెలియక, లక్ష్యం లేక మాట్లాడిందనీ అనుకుంటాడు. తనమాట నిజమనీ, తనంత కార్యం చేయగల సమర్ధుడననీ, నిజంగా నమ్మని సీత నమ్మేటట్లు చేయటానికి, తన స్వరూపం చూపించాలని తలుస్తాడు. వెంటనే తన దివ్యాకారాన్ని చూపటానికి నేలమీదకు దూకి శీఘ్రంగా శరీరాన్ని పెంచనారంభించాడు హనుమంతుడు.

మండుతున్న అగ్నిహోత్ర కాంతితో వెలుగుతూ, మేరుపర్వతంతో సమానమైన ఆకారంతో, ఎర్రటి ముఖంతో, వజ్రాయుధం లాంటి గోళ్లతో, కోరలతో, సీతాదేవి ముందరర నిలబడి: "దేవీ! ఈ లంకను, కొండలతో, వనాలతో, బురుజులతో, ప్రాకారాలతో, తోరణాలతో, రావణాసురుడితో సహా పెల్లగించి, అత్యంత వేగంగా తీసుకునిపోయే శక్తి నాకుంది. నేను చిన్నవాడినన్న అభిప్రాయం మానుకో. ఆలస్యం చేయకుండా రాముడి దగ్గరకు పోదాం రా!" అంటాడు హనుమంతుడు సీతతో.

హనుమంతుడలా చెప్పగానే, ఆశ్చర్యం, భయం కలిగించే అతడి ఆకారాన్ని చూసి: "కపీశ్వరా! నీ బలగర్వం, వాయువేగం, కార్చిచ్చులాంటి నీశరీరం, ఎలాంటిదో తెలుసుకున్నాను. నీవు సామాన్య కోతివికావు. ఇంత గొప్పవాడివి కాకపోతే నువ్వెట్లా సముద్రాన్ని దాటి, రహస్యంగా లంక ప్రవేశించి, నన్ను వెతకగలిగే సమర్ధుడవవుతావు? ఇంతపని మామూలు వాళ్లకు సాధ్యమవుతుందా? నన్ను వేగాతిశయంతో, రామచంద్రమూర్తి దగ్గరకు తీసుకుపోగలవని నమ్ముతున్నాను. నీపై నాకెంత విశ్వాసమున్నా, శీఘ్రంగా నామగడి కార్యం నెరవేరే ఉపాయం నేను ఆలోచించాల్సిన అవసరముందికదా! కాబట్టి నేను నీవెంట రాకూడదు. వాయువేగంతో సమానంగా పోయే నీ వేగాన్ని, సహించలేక నేను దిగ్భ్రమ చెందుతాను. పైపైకి వస్తున్న అలలను చూసి తలతిరిగి సముద్రంలో పడితే తిమింగలాలు, మొసళ్లు, నన్ను పీక్కు తింటాయి. ఇదీ నా సంగతి. నీవిషయంలో కూడా నాకు కొంత సందేహముంది".

"నన్ను తీసుకునిపోతున్న నిన్ను చూసి రావణాజ్ఞ ప్రకారం రాక్షసులు నిన్నాపగా, నీకూ, వారికీ, భయంకర యుద్ధం జరుగుతుంది. వారు ఆయుధాలతో, నిన్ను కొట్తారు. వారితో నీవు గెలుస్తావో, లేదో తెలయదు. దూరం నుండి కొట్టే వారితో ఆయుధాలు లేని నీవెట్లా యుద్ధం చేస్తావు? నన్నెట్లా రక్షిస్తావు? నీవు వారిదగ్గరకు పోయి కొట్టాలికదా! నిన్ను కొట్టుతుంటే నాకు దెబ్బలు తగలవా? దెబ్బల సంగతి అటుంచి, క్రూర రాక్షసులను చూడగానే నామనస్సు తల్లడిల్లదా? నేను సముద్రంలో పడిపోతానేమో! పడగానే నన్ను, పట్టుకుని రావణుడికి అప్పగిస్తారుకదా! ఇందులో ఏది జరిగినా క్రమ మార్గం తప్పుతుందికదా! వారికి చిక్కిన నన్ను ముక్కలు, ముక్కలుగా కోయరా? జయాపజయాలు దైవాధీనాలు. బలహీనుడు గెలవొచ్చు, బలవంతుడు ఓడిపోవచ్చు. నీవు గెలిచినా, సముద్రంలో నేను పడిపోక పోయినా, రాక్షసుల సింహనాదాలు వినగానే నాప్రాణాలు పోవా? అప్పుడు నీవు చేపట్టిన పనంతా వ్యర్ధమే కదా!"

"నేనిలా మాట్లాడుతున్నానంటే, నువ్వు యుద్ధంలో రాక్షసులను గెలవలేవని అర్థం కాదు. నీవు తప్పక గెలుస్తావు. అలా నీవు గెలిస్తే, లోకమంతా అనివార్యంగా, నిరంతరంగా నిండివున్న రామచంద్రుడి కీర్తి తగ్గిపోదా? అలా చేయడం నీకు తగిన పనేనా? అలాకాకపోయినా, రాక్షసులు నన్ను పట్టుకునిపోయి, రామలక్ష్మణులకు, వానరులకు తెలియరాని చోట దాచిపెట్తే, నీశ్రమకు ఫలితం వుండదుకదా? ఇంకో సంగతి, రామలక్ష్మణుల ప్రాణం, సుగ్రీవుడి ప్రాణం క్షేమంగా వుండాలంటే, అది నా క్షేమంపైనే అధారపడి వుంది. నేను క్షేమంగా లేకపోతే, మీకెవరికీ క్షేమం లేదు. కాబట్టి వెంటనేపోయి, సీత సుఖంగా వుందని చెప్పి, రాముడిని ఇక్కడకు తీసుకునిరా. నీకు శుభం కలుగుతుంది".


"నీ వెంట రాకపోటానికి, మరో ముఖ్య కారణముంది. నా భర్తపై నాకున్న భక్తివల్ల, మగవాడిని, రాముడిని, తప్ప మరెవ్వరినీ తాకను. రావణుడు తాకలేదా అంటే, అప్పుడు నేను పరాధీనను, మూర్ఛపోయాను, బలం లేనిదాన్ని, వేరే సహాయం లేనిదాన్ని, దిక్కులేనిదాన్ని, ఒంటరిదాన్ని. ఇక రావణుడు, బలవంతుడు, సహాయ సంపత్తికలవాడు. నేను అప్పుడు ఏమీ చేయలేని స్థితి. ఇప్పుడలాకాదు. నేను బుధ్ధిపూర్వకంగా నిన్ను తాకాలి. అలా చేయటానికి నామనస్సు ఒప్పుకోదు. ఈ వాస్తవాన్ని ముందే చెప్పితే, నీవేమనుకుంటావోనని, చివరకు చెప్తున్నాను".

"రామచంద్రమూర్తి వచ్చేవరకు ఆగలేను.  అయినా, నేనురాలేను. జరగాల్సింది ఏంటంటే, రాముడు, రావణుడిని, యుద్ధంలో, ఈలంకలోనే చంపి నన్ను తీసుకోపోవడం. అదే ఆయన యోగ్యతకు తగిన పని. ఆయన రాడు, నన్ను రక్షించలేడు, అన్న సందేహం వుంటేకదా, నేను నీవెంట రావాల్సింది. నాకా, అట్టి సందేహం ఏమాత్రం లేదు. శ్రీరాముడి యోగ్యతకు తగనిదీ, ఆయనకు కష్టసాధ్యమైనదీ, సందిగ్దమైంది, నేనుకోరడం లేదు. ఎలాంటి విరోధులనైనా చంపేశక్తి, దండించే పరాక్రమం, ఆయనకున్నదని చెప్తే విన్నాను. కళ్లారా చూసాను. ఆయన శక్తి నాకు తెల్సు. ఆ సమర్ధుడి ఎదుట యుధ్ధభూమిలో నిల్చే శక్తి ఇంద్రాది దేవతలకు కానీ, పన్నగులకు కానీ, దేవదానవ రాక్షస సమూహాలకు కానీ లేదు".

"జయాపజయ విచారం సామాన్యుల విషయంలోనేకాని, రామచంద్రమూర్తి విషయంలో అపజయం అనే శంకలేదు. రాముడితో ఎదుటబడి యుద్ధం చేయడం మాటలా వుంచితే, యుద్ధంలో ఆయనను చూసి సహించే బలశాలి ఎవరూ లేరు. మహాబలశాలి, ఇంద్ర పరాక్రముడు, చిత్రమైన ధనస్సున్నవాడు, ఆశ్చర్యకరమైన నడవడికలవాడు, లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తి, యుద్ధంలో కనిపించగానే, గర్వభంగం కాని మొనగాడెవడూ లేడు. వాయువు ప్రేరణున్న అగ్నిలాంటివాడిని, అష్టదిగ్గజాలకు సరితూగేవాడిని, ఎదిరించి బ్రతుకగలవాడెవరయ్యా! ప్రళయకాల రుద్రుడివలె వేడికలవాడు, గురితప్పని లక్ష్యమున్న బాణంకలవాడు, వ్యర్థంకాని సంక బలుడు, రామచంద్రమూర్తి, లక్ష్మణుడిని కూడి వుండగా, యుద్ధంలో ఎదిరించేందుకు మనసునందైనా సాహసించేవారున్నారా? కాబట్టి హనుమంతా! నేను చెప్పిన ఈ ఉపాయం తప్ప తక్కినవన్నీ వదిలేయి. నీవు త్వరగా లక్ష్మణ, సుగ్రీవులతో కూడిన రామచంద్రమూర్తినే లంకకు తీసుకొచ్చి, రావణుడిని చంపి, నన్ను తీసుకుని పొమ్మని ఆయనతో చెప్పు. ఆయనకొరకు తీవ్ర దుఃఖంతో వున్న నన్ను కృతార్ధురాలిని చేయి. నీకు పుణ్యముంటుంది" అని చెప్తుంది.

(హనుమంతుడి వెంటపోనని సీత అనటానికి సరైన కారణముంది. ఆ కారణాలు విశ్లేషించి చూస్తే: రాముడు రావణుడిని గెల్వలేక, రావణుడిలాగానే దొంగచాటుగా సీతను అపహరించుకుని పోయాడన్న నిండా, హనుమంతుడే లేకపోతే, రాముడు సీతను దక్కించుకోలేడన్న అపకీర్తి తన మగడికి వస్తుంది కనుక అలా చేయవచ్చునా అన్న సందేహం మొదటి కారణం. వెంటపోతే తనప్రాణం దక్కుతుందేమోకాని, రావణుడికి శిక్షపడేదెట్లా? శిక్షించకపోతే వాడు ఇంకెన్ని అనర్ధాలు చేస్తాడేమోనన్న సంశయం రెండో కారణం. మరోకారణం, రావణుడెత్తుకొచ్చిన స్త్రీలకు తనలాగా విముక్తి కలగాలంటే, వాడు చావాలి. వాడిని చంపగలిగిన వాడు తన మగడేనన్న విశ్వాసం. ఇకచివరిది, రామచంద్రమూర్తి రావణుడిని చంపుతానని చేసిన ప్రతిజ్ఞ నెరవేరాలంటే, తాను ఇక్కడే వుండాలన్న నిర్ణయం. "మగవాడిని, రాముడిని" తప్ప అన్యులను తాకను అనడంలో అర్థం: శ్రీరామచంద్రుడొక్కడే పురుషుడని, తక్కిన వారందరూ స్త్రీలని అనుకోవాలి."భగవంతుడు, వాసుదేవుడు" మాత్రమే పురుషుడు. తక్కిన బ్రహ్మాదులతో కూడిన ప్రపంచమంతా స్త్రీ మయమే! స్త్రీ-స్త్రీ తో కలిస్తే ఆనందం లేదు కదా! అంటే, "జీవాత్మ", "భగవంతుడితో" సాయుజ్యం పొందితేనే ఆనందం కలుగుతుందికాని, బ్రహ్మాదులతో సాయుజ్యం కలిగితే మళ్లీ పుట్టాల్సిందే, మళ్లీ దుఃఖపడాల్సిందే!

సీతాదేవి మరో అభిప్రాయంలో "ఆత్మనిక్షేపం, పారతంత్ర్యం"  స్పష్టంగా చెప్పడం జరిగింది. "ప్రపన్నులు" తప్ప తక్కిన "ముముక్షువు" లందరూ, భగవత్ ప్రాప్తికి, "భక్తో, కర్మయోగమో, జ్ఞాన యోగమో, అష్టాంగ యోగమో", ఏదో ఒకటి సాధనంగా [ఉపాయంగా] స్వీకరిస్తారు. ప్రపన్నుడు ఈ సాధనాలేవీ ఆశించడు. భగవత్ ప్రాప్తికి భగవంతుడే సాధనమనీ, ఆయనే వచ్చి తనను తీసుకోపోవాలనీ భావిస్తాడు. ప్రపన్నుడు భగవంతుడిని తప్ప మరే సాధనం కోరినా, భగవత్ ప్రాప్తి తప్ప మరే ఫలం కోరినా, భగవంతుడిని తప్ప మరే దేవతను ఆశ్రయించినా, ప్రపత్తి చెడుతుంది, ఫలించదు. హనుమంతుడి వెంట సీతాదేవి వెళ్ళి వుంటే, ఆమెను రామచంద్రమూర్తి భ్రష్టురాలివైనావని స్వీకరించి వుండడు. కాబట్టి "ప్రపన్నులు" అన్ని విధాలుగా "అనన్యు" లై వుండాలి. "భక్తుడికీ, ప్రపన్నుడికీ" భగవంతుడు తన పాలిట వున్నాడనుకోవటానికి అనేక నిదర్శనాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయి. వాటిని బట్టి తక్కినవి ఊహించుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి తక్కిన అందరు దేవతలకంటే గొప్పవాడని తెల్సుకోగలుగుతాడు. ఇట్టి ఉత్తమోత్తమ దేవతను సాధించే "ప్రపత్తి"నే ఉత్తమోత్తమ "ఉపాయ"మని ఎరిగి దృఢ చిత్తంతో, అనన్యుడిగా వుండాలి. అందుకే సీత అంటుంది: తక్కిన అన్ని "ఉపాయాలూ" వదలమని. గుహలో వున్న భగవంతుడిని తాను వెతుక్కుంటూ పోలేను, ఆయన్నే ఇక్కడకు రప్పించమని. శిష్యుడు, ఆచార్యుడిని కోరడమే యిది. హనుమంతుడి జవాబులో "ఆచార్య కృత్యం" కూడా వుంది).

No comments:

Post a Comment