తన విషయం శ్రీరాముడికి చెప్పమని హనుమను కోరిన సీత
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (25-06-2018)
చూడామణిని హనుమంతుడికిచ్చిన సీతాదేవి, ఈమణి
రామచంద్రమూర్తికి బాగా తెలుసనీ, దీన్ని చూడగానే తనను, తన తల్లినీ, దశరథ మహారాజునూ, ఆయన
స్మరించుకుంటాడనీ చెప్తుంది. వివాహ సమయంలో, దీనిని జనకమహారాజు తనతల్లి చేతికిచ్చాడనీ, ఆమె, దశరథుడు, రాముడు చూస్తుండగా, తనతలలో అలంకరించిందనీ అంటుంది. హనుమంతుడికి ఉత్సాహం
కలిగేవిధంగా, చెప్పగలిగినంత చెప్పాననీ, ఇక ముందున్న కార్యం
ఎట్లా చేస్తే బాగుంటుందో,
అది ఆయన్నే ఆలోచించుకోమనికూడా చెప్తుంది. (ఇప్పుడు ఆడవారు
ధరించే పచ్చబిళ్ల లాంటిదే, ఈ జడబిళ్ల కూడా. సీతాదేవి జడబిళ్ల అంతా రత్నమే! అంత పెద్ద కెంపు అయినందునే
దాన్ని "అతులితము", "మహార్హము"
అని వర్ణించారు)
ఆంజనేయుడి మనసంతా, ఎక్కడో వున్నదని గ్రహించిన సీత, తను చెప్పేది
వినమనీ, శ్రీరామచంద్రమూర్తినీ, ఆయన తమ్ముడినీ, ఆయనకూ, తనకూ ముఖ్యులైన
వారితో కూడిన సుగ్రీవుడినీ, వానరులందు పెద్దవారినీ, ధర్మ పద్ధతిలో
యధాచితంగా క్షేమాన్ని విచారించానని చెప్పమంటుంది. మహాబలవంతుడైన శ్రీరాముడు, ఏవిధంగా, మోయలేని ఈ దుఃఖ
సముద్రాన్నుంచి తన్ను దరిచేరుస్తాడో, ఆ విధానాన్ని తెలుసుకుని, ఆ
పద్ధతిలోనే ఆయన్ను ఒప్పించి, కీర్తిమంతుడివి కమ్మని చెప్తుంది. తాను దేహాన్ని
చాలించకముందే, తనమగడు తన్నెట్లా రక్షించగలడో ఆలోచించి, బుధ్ధి, చమత్కారాలున్న హనుమంతుడు, ఆయనకు నచ్చచెప్పి
పుణ్యం కట్టుకొమ్మని అడుగుతుంది.
"సాహసవంతుల్లో అగ్రగణ్యుడవైన నీవు, సందేహానికి తావులేని మాటలతో, ఉత్సాహంతో చెప్తే, ఆ ప్రోత్సాహంతో, నా భర్త నన్ను ఆపద అనే సముద్రం నుండి కాపాడుతాడు. అట్లా
కాకుండా, నువ్వు నీళ్లు నములుకుంటూ,
లంక చాలా దూరముంది, చుట్టూ
సముద్రముంది, దాటడం కష్టం, దాటినా
రావణుడు బలవంతుడు, ఎలానో, ఏంటోనని
సంశయాత్మకంగా చెప్పొద్దు. రామచంద్రా! లే! సీతాదేవిని ఆ దుష్టుడైన రావణుడు
బాధిస్తున్నాడు, మనం వెళ్లేవరకు బ్రతుకుతుందో లేదో, రావణుడేమీ లెక్క కాదు, నిమిషంలో పోయి లంకను నాశనం
చేసి, రావణుడిని చంపి సీతను తీసుకొద్దామని చెప్పు. ఒక ఆడది
దిక్కులేక, అల్లాడుతుంటే, ఇందరం మగవాళ్లం, పరాక్రమవంతులం, వూరికే వుండరాదని
చెప్పు. నీవు నేను చెప్పినట్లు అనుకూల వాక్యాలతో చెప్తే, రాముడు
తనపౌరుషాన్ని రాక్షసులపై చూపుతాడు" అంటుంది సీతాదేవి.
ఇలా అన్న సీతాదేవితో హనుమంతుడు:" దేవీ! శ్రీరాముడు
వానరులతో, భల్లూకాలతో, శీఘ్రంగా ఇక్కడకు
వచ్చి, శత్రువులను చంపి, నీ దుఃఖాన్ని పోగొట్టుతాడు. నీకొరకు రామచంద్రమూర్తి యుధ్ధప్రయత్నం చేస్తే, దేవతలు, మానవులు, పన్నగులు, ఇంద్ర, సూర్య, యములు, ఎవరడ్డమొచ్చినా చచ్చిపోవాల్సిందే. ఇలా జయించి, ఈ భూమండలమంతా, పరిపాలించగలడు. రామచంద్రమూర్తి పరాక్రమాన్ని
వర్ణిస్తున్నానేకాని, నిజానికి ఆయన విజయానికి మూలకారణం నీవే కదా! సత్యవంతుడికి సావిత్రిలాగా, రాముడికి నీవని
చెప్పావుకదా! ఎందుకు మర్చిపోయావు?
నీ పాతివ్రత్యం వ్యర్ధమై పోదు. ఆయన్ను గెలిపించడానికి
అదొక్కటే చాలు" అని బదులు చెప్తాడు ఆచార్యావతారమైన హనుమంతుడు. (ఆచార్యుడు
అంటే జీవాత్మ-పరమాత్మలను అనుసంధానించే వాడని అర్థం. సీతమ్మ జీవాత్మ కాగా, రామచంద్రుడు
పరమాత్మ కద! ఆచార్యుడిని భగవంతుడి అవతారంగా పెద్దలు భావిస్తారు.)
ఇలా చెప్పిన హనుమంతుడి మాటలకు, చెప్పిన విధానానికి, వాటిలోని
యదార్ధానికి, సీత సంతోషించి, ఆయన్ను ఎంతగానో మెచ్చుకుంటుంది. లంకలోనే, ఎక్కడైనా,
ఆ పూటవరకు చాటుగావుండి, మర్నాడు సముద్రాన్ని దాటి పోవచ్చుకదా అంటుంది. (హనుమంతుడు
లంకకు వస్తున్నప్పుడు సముద్ర మధ్యంలో మైనాకుడు ఎదురు వచ్చి కించిత్తు విశ్రమించి
వెళ్లమంటే, ఇది రామకార్యం, రామబాణంలాగా వెళ్లి వస్తానని వానరులకు మాట
ఇచ్చి బయలుదేరాను, మధ్యలో ఆగజాలను, అన్న మహానుభావుడు
ఇప్పుడు ఒక రోజు ఆగమంటే ఆగగలడా?
కార్య ఔచిత్యాన్ని, ఆవశ్యకాన్నీ హనుమంతుడు ఎలా భావించాడో తెలిసిందే. ఇది
తెలుసుకుందామని సీతమ్మ కూడా తలచిందేమో! హనుమంతుడు పరీక్షలో నెగ్గాడు. అరణ్యానికి
రాముడు బయలుదేరి వెళ్లే సమయంలో కూడా దశరథుడు రామచంద్రుడిని ఒక్క రోజు ఆగి
వెళ్లమంటాడు. రాముడు ఆగనేలేదు. రోమరోమంలో రామభావాన్ని నింపుకున్న రామదూత రాముడి
వలనే ప్రవర్తించడం గమనార్హం) ఇది తన మనస్సులోని మాటనీ, ఆయన మనసుకు నచ్చితే అలా చేయొచ్చనీ సూచిస్తుంది. అప్పుడే వచ్చి, మళ్లా అప్పుడే
పోవటమంటే అలసటగా వుండవచ్చని చెప్పినా, ఆమె
మనసులోని అసలు భావన: కొంతసేపైనా హనుమంతుడు సమీపంలో వున్టే, తనకు ధైర్యంగా
ఉంటుందనే ఆశ. అంతసేపన్నా శోకతాపాలను విడిచి బ్రతకగలుగుతానన్న ఉద్దేశంతో అలా
చెప్తున్నానని కూడా అంటుంది.
"ఆంజనేయా! ఒకరోజు నువ్విక్కడుంటే, నాకొచ్చే లాభం ఏంటి? ఆ తర్వాతైనా ఎప్పడిలాగా ఏడ్వాల్సిందేకదా! నువ్వు మాత్రం
ఎన్నాళ్లుంటావిక్కడ? నీకిక్కడ ఆలస్యమైతే, నీకోసం ఎదురుచూస్తున్న రామచంద్రమూర్తి, నాకంటే ఎక్కువగా పరితపిస్తాడుకదా! నువ్వు ఇక్కడుంటే
జరగాల్సిన పనులెలా జరుగుతాయి?
అందుకే శ్రీరాముడి దగ్గరకు వెళ్లి మళ్లీ రామచంద్రుడితో రా!
మళ్లీ ఎన్నాళ్లకొస్తావో, ఏంటో! అంతవరకు నా ప్రాణం ఉంటుందో, లేదో? చెప్పలేను. ఎందుకంటున్నానంటే, నిన్ను చూడగానే పోయే ప్రాణాలు నిలబడ్డాయి. మరి నువ్వుకూడా
పోతే ఆ ప్రాణాలుంటాయో, పోతాయో చెప్పలేను" అంటుంది.
"నువ్వెట్లాగూ సముద్రాన్ని దాటిపోతావు. రాముడికి నాసంగతులన్నీ చెప్తావు. ఆ
అన్నదమ్ములిద్దరూ, వానర సేనతో సముద్ర తీరానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే ప్రశ్న.
ఎలుగుబంట్లు, వానరులు, రాజకుమారులు, అలవికాని ఆ
సముద్రాన్ని ఎట్లా దాటుతారయ్యా?
ఈ భూప్రపంచంలో, నువ్వూ, గరుత్మంతుడు, వాయుదేవుడు,
తప్ప ఇంకెవరూ ఈ సముద్రాన్ని దాటలేరని నా అభిప్రాయం.
నేనాలోచిస్తున్న కొద్దీ, వారిక్కడకు రావడం, అసాధ్యమైనపనిలాగానే తోస్తున్నది. అయినా కార్యదక్షుడవైన నీకు చేయలేని
పనేదీలేదు. దీనికి ఏమంటావు? ఎలా నెగ్గుకొస్తావో నాకు తెలియదుకాని, సాధించగలవాడివి మాత్రం నీవొక్కడివే! నీవలె ఎవరూ చేయలేరు, కీర్తినీ పొందలేరు." అని తన సందేహాన్ని వెలిబుచ్చుతుంది
సీతాదేవి. ఇంకా ఇలా అంటుంది ఆమె:
"రామచంద్రమూర్తి సైన్యంతో వచ్చి, యుద్ధంలో బల-పరాక్రమాలను ప్రదర్శించి, రావణుడిని చంపి, నన్ను అయోధ్యకు
తీసుకొని పోతేనే అది నాకు కీర్తికరం. అప్పుడే నేను వీరపత్నినన్న బిరుదుకు కూడా
అర్హురాలిని అవుతాను. ఇది రాముడికి సాధ్యపడుతుందా,
పడదా అనేసంగతి వేరేవిషయం. కాని ఇంకే విధంగా జరిగినా నాకు కీర్తికరం కాదు. నేను
చెప్పినట్లు చేసి, తన బలంతో, బాణాలతో లంకను భస్మం చేసి, నన్ను వెన్ట
తీసుకునిపోతే, నాకేకాదు, శ్రీరాముడికీ కీర్తి. ఆయన వంశానికీ కీర్తి
దక్కుతుంది. నాకోసం కాకపోయినా, తనకోసమైనా నేను చెప్పినట్లు చేయాల్సిందేనని నా కోరిక.
ఆడదానినైన నా ఆలోచనావిధానమిది. యుద్ధంలో శూరుడైన రామచంద్రమూర్తికి తగినటువంటి చర్య
ఏదో ఆలోచించి చెప్పు".
సీతాదేవి చెప్పిన మాటలన్నీ, హితమైనవిగా,
యుక్తియుక్తంగా, నిర్దోషమైనవిగా,
ప్రయోజనంతో కూడినవిగా వున్న మంచిమాటలని భావించిన మారుతి చెప్పదలుచుకున్న మిగిలిన
మాటలను ఆమెకు చెప్తాడు.
(సీత కోరరాని కోరికేమీ కోరలేదు. "పరమ భక్తులు, ప్రపన్నులు" భగవంతుడే స్వయంగా వచ్చి, తమను
పిల్చుకోపోవాలని కోరుకుంటారు కాని, దూతలతో పిలిపించు కోవటానికి ఇష్టపడరు. అలా కాకపోతే
మహారాజును ఆశ్రయించినా, వాడి సేవకుడిని ఆశ్రయించినా తేడా
లేనట్లేగదా! సీత చెప్పిన "ఉపాయం" వలన, భక్తి-ప్రపత్తుల
శ్రేష్టత్వం నిరూపించబడింది. సీత చెప్పిన "ఉపాయం" గొప్పదైనా, "ఉపేయం" కూడా గొప్పదే! ఉపేయం గొప్పదైతే, దాన్ని సాధించే ఉపాయం కూడ గొప్పగానే వుండాలి.
"ఉపేయం" రామచంద్రమూర్తి, దాని
సాధనోపాయం రామచంద్రమూర్తి రావడమే! )
No comments:
Post a Comment