Friday, June 1, 2018

సకల జనుల సంబురం....నాలుగేళ్ల నవనవ్య పాలన-6 : వనం జ్వాలానరసింహారావు


సకల జనుల సంబురం....నాలుగేళ్ల నవనవ్య పాలన-6
వనం జ్వాలానరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (02-06-2018)
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి వేగవంతం చేయడంలో, వారికి సమాన ప్రతిపత్తి కల్పించడంలో, ఆర్థికంగా సామాజికంగా వారిని గౌరవంగా నిలిపేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలకు ఉపక్రమించింది. దీనికి అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కొరకు  ప్రగతి పద్దు ప్రణాళిక కింద నిధులు కేటాయించి, తదనుగుణంగా ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రకటించింది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఖర్చుకాని అభివృద్ధి నిధి మిగిలి ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగింది.

తెలంగాణాకు హరితహారం: పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం అన్నది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో సాహసోపేతమైన చర్య. పచ్చదనంతోపాటుగా, వాతావరణ సమతుల్యాన్ని పెంపొందించడానికి తద్వారా స్థిరమైన జీవనోపాధి సాధించడానికి చర్యలు చేపట్టడం లక్ష్యంగా ఎంచుకుంది. వర్షాలు పెరగడానికి, జన జీవనంలోకి వచ్చే జంతువులు, కోతులు వంటివాటిని నిరోధించడంలో పచ్చదనం తప్పనిసరి అని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం 230 కోట్ల మొక్కలను ప్రస్తుతమున్న పచ్చదనానికి అదనంగా చేర్చాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం కింద సింగపూర్ లో చేపట్టిన విధంగా కార్యాచరణ రూపకల్పన చేసి, ఆ విధంగా ఒక పద్ధతిని అనుసరించి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీధి కూడళ్లలో నాటే మొక్కల కార్యక్రమం వంటిది కాకుండా భిన్నమైన సమగ్ర పద్ధతిని అవలంభించడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైంది.

ఉద్యానశాఖను పటిష్ట పరచడం: వ్యవసాయరంగంతోపాటుగా దానికి అనుబంధంగా ఉన్న ఉద్యాన రంగాన్నీ పటిష్ట పరచడం అన్నది ముఖ్య భూమిక వహిస్తుందనే సత్యాన్ని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. మంచి సారవంతమైన భూములు ఉన్నప్పటికీ రాష్ట్ర అవసరాలకు వచ్చే సరికి 70శాతం కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకొనే పరిస్థతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మైక్రో ఇరిగేషన్ సౌలభ్యాలను కల్పించి రైతులకు 5 హెక్టార్ల వరకు సబ్సిడీ రూపేణా వెసులుబాటు కల్పించి, అన్నిరకాల పంటలు పండించేందుకు వీలు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి కార్పొరేషన్ ను స్థాపించి, పంటల ఉత్పత్తి, సమీకరణ, భద్రపరచడం, వాటిని సరఫరా చేయడం వంటివి సుసాధ్యం చేసింది.

గోదాముల నిర్మాణం: 17.30 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను భద్రపరచుకునేలా రాష్ట్రంలో పెద్ద ఎత్తున 330 చోట్ల భారీ గోదాములను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. అనేకచోట్ల వీటి నిర్మాణం పూర్తికావడంతోపాటు వినియోగానికి సిద్ధంగా ఉంచడం జరిగింది.

దళితులకు భూమి కొనుగోలు పథకం: ఎస్ సీ, ఎస్ టీ కుటుంబాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో భూమి కొనుగోలు పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి తోడూ, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో నైపుణ్య పెంపుదల, స్కాలర్ షిప్ (ఉపకార వేతనం) లు అందజేయడం, విదేశీ విద్యకు ఆర్థిక సాయం అందించడం, ప్రతి గృహ వినియోగానికి 50 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ ను అందించడం వంటివి చోటు చేసుకోగా, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంలో భాగంగా నూతనంగా స్టడీ సర్కిళ్లను తెరవడం, అంచలంచలుగా వాటిని విస్తృత పరచడం, గిరిజన గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మహత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ విద్యానిధి కింద బీసీ విద్యార్థులు ఇతర దేశాల్లో చదువుకునేలా ఆర్థికంగా వారిని ఆదుకోవడం వంటి చర్యలు చేపట్టడం జరిగింది. బీసీల సంక్షేమంలో భాగంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు ఎంబీసీ (మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్) సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు వెసులుబాటు కల్పించడం జరిగింది.

సమాచార సంకేతిక రంగం: తెలంగాణ రాష్ట్రం మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం సమాచార, సాంకేతిక (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో దేశంలోనే ముఖ్య కేంద్రంగా భాసిల్లుతోంది. బహుళ జాతీయ సంస్థలైన మైక్రోసాఫ్ట్, గుగూల్, ఐబీఎం, ఒరాకిల్ వంటివే కాకుండా దేశీయ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటివి పేర్కొనదగ్గవి. ఇవి వాటివాటి కార్యాలయాలకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకొని నిర్వహించడం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం టీ-హబ్ ను నవంబర్ 2015న ఏర్పాటు చేసింది. ఇది వినూత్నంగా పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ మరియు ఇతర మూడు ప్రధాన సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నేషనల్ ఎకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నేతృత్వంలో నిర్వహించడం జరుగుతోంది. టీ-హబ్ రూపకల్పన లక్ష్యం.. సాంకేతిక పరమైన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించడంతోపాటుగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, ఆవిష్కరణలకు ప్రాధ్యాన్యతను అందించడం. రాష్ట్ర ప్రభుత్వం టూ టైర్ నగరాలైన వరంగల్, కరీంనగర్ లలో ఐటీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి, వాటికి శంఖుస్థాపలు కూడా చేశారు.

శాంతి భద్రతల పరిరక్షణ: ప్రజలకు భద్రత కల్పించడంలో అతికొద్ది సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ విధమైన భద్రత కారణంగా స్థానికంగా ఇతర రాష్ట్రాల, విదేశీ పెట్టుబడులకు వెసులుబాటు కల్పించినట్లయింది. పోలీస్ వ్యవస్థకు పటిష్టమైన ఆధునిక సాంకేతిక నిఘా అందించడంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. షీ టీమ్స్ ఏర్పాటు ద్వారా మహిళలకు భద్రతను కట్టుదిట్టం చేయడంలో ప్రభుత్వం విజయవంతమైంది. తెలంగాణలో అక్రమ మద్యం, గ్యాంబ్లింగ్ వంటివి నిషేధించడం కూడా జరిగింది. తెలంగాణ పోలీస్ విభాగానికి సమర్థ నిర్వహణకు గాను దేశంలోనే ప్రథమస్థానం దక్కించుకునే అవకాశం లభించింది. ఇవేకాకుండా తెలంగాణ రాష్టం ఒక సవాలుగా స్వీకరించి వినూత్న కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెట్టడం, ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా దేశంలోనే ఎన్నడూ ఆవిష్కరించనటువంటి కార్యక్రమాలకు తెరతీసిన ఘనత దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నడూ ఇటువంటి వినూత్న కార్యక్రమాలకు ఆలోచన చేయడం జరగలేదన్నది ఇక్కడ గుర్తించాల్సిన నిజం.


మెరుగైన రిజర్వేషన్లు: రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీలలో తొలిసారిగా రిజర్వేషన్ పద్ధతిని ప్రవేశపెట్టడం, తద్వారా పేద, అట్టడుగు వర్గాలకు, ప్రత్యేకించి మహిళలకు లబ్ధి చేకూర్చినట్లయింది. బీసీలకు 29శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించింది.  భూ వివాదాలకు స్వస్తిపలుకుతూ భూ రికార్డుల ప్రక్షాళన గావించడంలో ఎన్నో కొత్త మార్పులను తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో భాగంగా 11, 19, 111 సాదా బైనామాలు, 15, 68,171 సర్వే నంబర్లకు సంబంధించిన పత్రాలను ప్రక్షాళన చేసి, వాటిని క్రమబద్ధీకరించడం జరిగింది. వ్యవసాయాన్ని మరింత విస్తృత పరచి, సమర్థవంతంగా లాభదాయకంగా నిర్వహించేందుకు ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్ గా పరిగణించి ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ఆయా క్లస్టర్లకు నియమించి, ఆ అధికారి నిర్వహణలో తగు సూచనలు, సలహాలు రైతులకు అందజేయడం జరుగుతోంది.

సమగ్ర కుటుంబ సర్వే: దేశంలో మునుపెన్నడూ జరగని వినూత్న ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం సవాలుగా తీసుకొని ప్రజలకు సంబంధించిన వేర్వేరు వివరాలను సమగ్ర కుటుంబ సర్వే ద్వారా నిర్వహించి, వాస్తవ వివరాలు స్వీకరించడం జరిగింది.  ఈ సర్వేను రాష్ట్రం మొత్తం మీద ఒక్క రోజులో నిర్వహించి సాంఘిక, ఆర్థిక వివరాలను స్వీకరించి 1 కోటి 9 లక్షల కుటుంబాల వివరాలు సమీకరించడం జరిగింది. సర్వే ఆధారంగా వివిధ పథకాలను, ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం జరిగింది. ఇదొక జాతీయ రికార్డును సాధించడటంతోపాటుగా  లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కడం జరిగింది.

విద్యార్థులకు సన్న బియ్యం: హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మద్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని అందించడం జరుగుతోంది. అంగన్ వాడీలకు కూడా ఈ వెసులుబాటును కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32,569 విద్యా సంస్థల్లో చదువుకుంటున్న 32,70,370 మంది విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తోంది ఈ సన్నబియ్యం పథకం.

అంతర్ రాష్ట్ర ఒప్పందాలు  -  సహకార విధానాలు: గత ప్రభుత్వాలు అంతర్ రాష్ట్ర జల వివాదాలకు పెట్టింది పేరుగా ఘనత వహిస్తే, అందుకు భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తూ, వాటిని సవాలుగా తీసుకుంటూ, మూడు ఒప్పందాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో స్వయంగా సంతకం చేశారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2016 ఆగస్ట్ 23 తేదీన నూతనంగా మూడు బ్యారేజీలను పెన్ గంగ ప్రాణహిత, గోదావరి నదిపై చనాఖ – కొరాట తంబిడి హట్టి, మేడిగడ్డలపై ఏర్పాటుగావించేందుకు, ఆ విషయంలో సంతకం చేసేందుకు స్వయంగా ప్రాతినిథ్యం వహించారు.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను పరిరక్షించుకోవడం, రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం అనే సవాలును ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత చాకచక్యంగా సమర్థవంతంగా నిర్వర్తించడంలో తనదైన శైలిని అవలంభించారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకు కావలసినవాటిని కోరటం పర్యవసానంగా వాటిని సాధించడం, అనుమతులను, పెట్టుబడులను పొందటం విజయంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ అనుకున్న దాన్ని సాధించడానికి తన గళాన్ని ఎప్పుడూ పెంచుతూనే వచ్చారు. వాటిని పొందుతూ వచ్చారు. ఉదాహరణకి ఏప్రిల్ 2017లో తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు (విద్యా సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ విషయంలో, నియామకాలు, రాష్ట్రాల్లో పదవులు సాధించడంలో) 2017 బిల్లును తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, కౌన్సిల్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం జరిగింది.  అనేక సందర్భాల్లో ముస్లిం మైనారిటీలను బీసీ – ఈ కేటగిరీలో రిజర్వేషన్ కోటా పెంపునకు షెడ్యూల్డ్ తెగల కొరకు వాదన వినిపిస్తూ, నొక్కి వక్కాణిస్తూనే వచ్చారు. శాసనసభలో గట్టిగా వినిపించిన మాటల్లో ‘‘ పెంపుదలను యాచించడంలేదు, దానికోసం పోరాడుతున్నాను. దీన్ని నీతి ఆయోగ్ లో ప్రస్తావిస్తాను. అవసరమైతే ఎపెక్స్ కౌన్సిల్ ముందు ప్రవేశపెడతాను.’’ అన్నారు.

అలాగే, రాష్ట్ర అవసరాల మేరకు జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రిజర్వేషన్ల అంశంలో నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించాలని ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా   కోరారు. పరిపూర్ణత చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్రం రాష్ట్రాలకు ఆ హక్కు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947లో ఉన్న పరిస్థితులు నేడు లేవని, 70 ఏళ్ల క్రితం మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నామని, ప్రస్తుత తరుణంలో జనాభా పెరిగిందని, ఎక్కువ అవకాశాలు, ఎక్కువ పరిజ్ఞానం పెరిగిందని, ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువగా కోరుకుంటున్నారని, మనదేశం అబివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా రిజర్వేషన్ల అంశం ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరారు. తెలంగాణ సాధన సమయంలో జరిగిన అన్యాయాలను, వ్యతిరేకతలను, పక్షపాత వైఖరిని ఖండించి ప్రత్యేక రాష్ట్రం దక్కించుకునే సమయంలో ప్రతిఒక్కరూ సహకరించడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం ఎంతైనా అవసరం. అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించని పక్షంలో కలహాలు తలెత్తి, పోరాటాలకు దారితీసే పరిణామాలు రాకపోవచ్చని అన్నారు.

           కేంద్రంతో సంబంధాల విషయానికొస్తే కొన్ని అంశాలను విశదీకరించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సహకార సమాఖ్యల ప్రస్తావన ఎంతైనా అవసరం. భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. సహకార పద్ధతిలో ఎన్నో రాజకీయ వ్యవస్థల సమాహారంగా వైవిధ్య భరితమైన సహకార సమాఖ్యగా పేర్కొనవచ్చు. అది కేవలం అక్షరాలకే పరిమితమా లేక చర్చనీయాంశమా అనేది అనవసరం. ప్రపంచ ఆర్థిక సమావేశాల నిమిత్తం చైనా పర్యటన రెండేళ్ల క్రితం జరిపిన సందర్భంలో ముఖ్యమంత్రి భారత సహకార నిర్ణయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో రాష్ట్రాలన్నీ ఇందుకు ముఖ్యభూమిక వహిస్తాయని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తన నిధులను, హక్కులను ఆయా రాష్ట్రాలకు కల్పించింది. గతంలో చెప్పుకునే ప్రణాళికా సంఘం స్థానే నీతి ఆయోగ్ రూపకల్పన కావించి, అన్నిరాష్ర్టాల ముఖ్యమంత్రులకు సభ్యులుగా స్థానం కల్పించి ప్రధానమంత్రి అధ్యక్షతన టీమ్ ఇండియాగా చూపడం జరిగింది.  అదే విధంగా ప్రధానమంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాగస్వామ్య సభ్యత్వంతో అన్ని రాష్ట్రాలు సమానంగా ప్రణాళికలు తయారు చేసుకొని, దేశ అభివృద్ధికి సహకార సమాఖ్య ఏర్పడి, ఏకైక భారతదేశంగా రూపాంతరం చెందాలి. ఇందుకు అన్ని రాష్ట్రాలు కలసి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి. తమవంతు కృషి చేయాలని అన్నారు.

           ఏది ఏమైనప్పటికీ గడచిన ఏడాది నవంబర్ నెలలో మైనారిటీల సంక్షేమం గురించి శాసనసభలో చర్చించే సందర్భంలో రాష్ట్రాల అవసరాలను కేంద్రం స్వీకరించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించడం జరిగింది. దేశాన్ని సమీకృత పద్ధతిలో ముందుకు తీసుకుపోవలసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం రాష్ట్రాల ఆశలను, ఆశయాలను, అభిలాషలను దృష్టిలో ఉంచుకొని వాటి పరిధిలో ఉన్న పథకాలను ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరారు. సాంఘిక వెనుకబాటుతనాన్ని, రాష్ట్రంలో మైనారిటీల రిజర్వేషన్ల శాతాన్ని పెంపొందించాలని కోరారు. దీన్ని కేంద్రం 9వ షెడ్యూల్ లో చేర్చనైనా చేర్చాలి లేదా నిరాకరించి సుప్రీంకోర్టును ఆశ్రయించేలా వదులుకోవాలి. ఈ విషయంలో శాసనసభలో, టీఆర్ఎస్ ఎంపీలచే పార్లమెంట్ లో వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కోరారు.

కేసీఆర్ ప్రభుత్వం సహకార ఆర్థిక ఫెడరలిజం సాధన కోసం పాటుపడుతోంది. రాష్ట్రాలు పరిణితి చెందాయి. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాలు దిశా నిర్దేశాలు చేసుకోగలుగుతున్నాయి. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయ గలుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పటిష్టంగా ఉండే రాష్ట్రాలు, పటిష్టమైన దేశాన్ని, జాతినీ  తయారు చేసుకోగలుగుతుందని జాతి అభివృద్ధి రాష్ట్రాల చేతుల్లో ఉంటుందన్నారు. ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా, యూనియన్ గవర్నమెంట్ తన పట్టును మార్చుకుని కేంద్రం నుంచి రాష్ట్రాలను ప్రణాళికలను పంచిందని పేర్కొన్నారు. అలాగే, ప్రణాళికా సంఘం స్థానే నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాల సహకారంతో కో ఆపరేటివ్ ఫెడరలిజం సాధించే క్రమంలో కొంత ముందడుగు వేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనపడలేదన్నారు. ఈ దశలో జాతీయ పాలసీలను ప్రవేశపెట్టడంలో రాష్ట్రాలు స్వేచ్ఛను కోరుకుంటున్నాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో నీతి ఆయోగ్ కేంద్ర ఏజెంట్ గా పనిచేసిందని పేర్కొన్నారు. ఐనప్పటికీ కాలక్రమేణా మార్పులువచ్చి దేశాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం దిశగా మారాల్సిన అవసరం ఉందన్నారు.

           సైద్ధాంతిక ఉచ్చుల్లో పడకుండా కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం విషయ సంబంధంగానే ఉంటూ వచ్చింది. డీమానిటైజేషన్ సందర్భంలో, జీఎస్టీ ప్రవేశ పెట్టిన సందర్భాల్లో తెలంగాణ తొట్ట తొలుత రాష్ట్రంగా వాటిని ఆహ్వానించింది. జాతికి వాటివల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుందని ఆశించింది. కొన్ని సందర్భాల్లో కేంద్రంతో విభేదాలు లేకపోలేదు అన్నదీ వాస్తవమే. ఇంతపెద్ద భారతదేశంలో ఇన్ని వైవిధ్యాల నేపథ్యంలో అవి సర్వ సామాన్యం. అవి ముస్లింలకు రిజర్వేషన్ల అంశంలో కావచ్చు. ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టం కింద తీసుకోవాల్పిన చర్యలకు సంబంధించి కావచ్చు.

         వీటన్నింటి నేపధ్యంలో దేశంలో, దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాల్సిన ఆగత్యాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల పదేపదే ప్రస్తావిస్తున్నారు. దేశంలోని పలువురు ప్రధాన వ్యక్తులను, పలు రంగాల ప్రముఖులను కలిసి ఈ విషయంలో తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నారు. రానున్న రోజుల్లో దెస రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం అనివార్యంగా కనిపిస్తున్నది.

పరివర్తన సాధనలో క్రమంలో: తెలంగాణ ప్రభుత్వం ప్రస్థానాన్ని చిన్నగా ప్రారంభించి, కాలక్రమేణా ఆర్థికంగా బలంగా నిలదొక్కుకో గలిగింది. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం గడచిన ఆరు దశాబ్దాల కాలంలో వివక్షకు లోనవడం జరిగింది.  అప్పట్లో రెవెన్యూ వసూళ్లలో తనదైన ఉనికిని, తన వంతును అందిస్తూ వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తూ వివక్షకు గురికావలసి వచ్చింది. తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. తనదైన అభివృద్ధి పథంలో ప్రజల ఆశయాల సాధనలో వెనుదిరగని ప్రయాణం సాగించింది. అయితే ఈ క్రమంలో ప్రజల భాగస్వామ్యంతో కష్టతరమైన ప్రయాణాన్నీ సునాయసంగా పూర్తి చేయగలిగింది. సంకెళ్లతో కూడుకున్న ఆర్థిక స్థితిని అధిగమించి చెర విముక్తి చెందిన సంపూర్ణ ఆర్థిక వ్యవస్థను చేజిక్కించుకొని ప్రజల దీర్ఘకాల అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చడంలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో విజయాల్ని సాధించింది.

           ఈ పరివర్తన క్రమంలో పెరుగుదలను గతంతో నిమిత్తం లేకుండా ప్రస్తుతంతో పోల్చుకోకుండా ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ఆర్థిక స్థితి పెంపుదలకు దోహద పడతాయని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అందుకు పెద్ద పీట వేస్తుందని ఆశిద్దాం.

No comments:

Post a Comment