జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
మా ఆవిడేమో ఖమ్మంలో
కాలక్షేపం...నేనేమో నాగ్ పూర్ లో చదువు
ఇంతలో ఒక శుభ వార్త
వనం జ్వాలా
నరసింహారావు
మా
ఆవిడకు కిడ్నీ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన తరువాత కూడా సుమారు మూడు-నాలుగు
నెలలపాటు వరంగల్ లోనే వాళ్ళ కుటుంబం వుండిపోవాల్సి వచ్చింది. కారణం మా మామ గారికి
జాండిస్ సమస్య ఇంకా నయం కాకపోవడమే. అందువల్ల ఆయనింకా ఎంజీఎం దవాఖానలోనే చికిత్స
తీసుకుంటూ వుండేవారు. ఒకవైపు చికిత్స కొనసాగుతూ వుంటే, మరో వైపు వీళ్ళను చూడడానికి వచ్చి-పోయే బంధువులతో వీళ్లుండే అద్దె ఇల్లు కోలాహలంగా వుండేది. అలోపతికి జాండిస్ నయం అయ్యే సూచనలు
కనిపించకపోవడంతో వరంగల్ లొ ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ప్రతివాడ భయంకర శటగోపాచారిని
సంప్రదించారు. ఎంజీఎం నుండి డిశ్చార్జ్ అయ్యి శటగోపాచారి ఇంట్లోనే అద్దెకుండే
వాళ్లు మా మామగారి కుటుంబం. ఆయుర్వేదం కూడా పని చేయలేదు. ఫలితం కనిపించకపోవడంతో ఒక
నిర్ణయం తీసుకుని ఖమ్మం మకాం మార్చారు. వచ్చిన రెండు-మూడు రోజులకు రాయవెల్లూర్ కు
మామగారిని తీసుకుపోయాడు మనోహర్. అక్కడ ఒక పదిహేను రోజుల చికిత్స తరువాత కొంచెం
కుదుటపడి ఖమ్మం తిరిగొచ్చారు. మొత్తం మీద నయం అయింది.
మా
ఆవిడ తన మొదటి ఆపరేషన్ తర్వాత తొమ్మిదో తరగతి పరీక్షలు రాసి, పాసయ్యి పదవ తరగతిలో చేరింది కాని చదువు కొనసాగలేదు సరిగ్గా.
ఇంతలో రెండో ఆపరేషన్ కూడా అవడం వల్ల దాదాపు చదువుకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే
అనుకోవాలి. ఆమె తన కుటుంబ సభ్యులతో సహా, వరంగల్ నుండి ఖమ్మం
వచ్చిన కొన్నాళ్ళకు, నా పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి
కావడంతో నేను కూడా మూడు నెలలు ఖమ్మంలోనే వున్నాను. నాగ్ పూర్ లో వున్నంత కాలం నాకు, మా ఆవిడకు అంతవరకున్న ఉత్తరాల అనుబంధం, నా ఖమ్మం
రాకతో, అక్కడ వుండడంతో ఇద్దరి మధ్యా అన్యోన్య అనుబంధం
పెరగసాగింది. చిన్న తనమైనా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలైంది. సినిమాలకు, షికార్లకు పోవడం, మా ఆవిడ అడపా-తడపా మా ఇంటికొచ్చి
వుండడం మొదలైంది. పెళ్ళైన ఏడాదిలోపుల అల్లుడైన నన్ను మామగారు తన ఇంటికి లాంచనంగా
తీసుకుపోవడం, అలాగే కోడలైన మా ఆవిడను మా నాన్నగారు వాళ్ళు తమ
ఇంటికి తీసుకుపోవడం జరిగింది. ఇదొక వేడుక. ఈ వేడుక అందరి ఇళ్ళల్లో జరిగేదే.
తీసుకుపోయిన అల్లుడికి వాళ్ళు, కోడలికి వీళ్లూ బట్టలు
పెట్టడం సాంప్రదాయం. అదే జరిగింది మా విషయంలో కూడా. మా ఆవిడను మా గ్రామంలో,
మా ఇంట్లో దించేసి (అప్పట్లో మా కుటుంబం ఎక్కువగా మా ఊళ్లోనే కాపురం వుండేది)
ఖమ్మం వెళ్ళారు. మా ఇరువురి మధ్య అనుబంధం మరింత పెరగడానికి ఆమె మా ఇంట్లో వున్న
రోజుల్లో వీలైంది. ఇంతలో మా కజిన్ కల్మలచెర్వు రమణారావు పెళ్ళికి మిర్యాలగూడెం
దగ్గరున్న వాళ్ల వూరికి (కల్మలచెర్వు) పోవాల్సి వచ్చింది. సతీసమేతంగా వెళ్లాను.
పెళ్లి తతంగమంతా చాలా సరదాగా జరిగింది. బస్సులో చేసిన ప్రయాణం మినహా మిగతాదంతా
ఎడ్ల బండిలోనే.
కల్మలచెర్వు నుండి
తిరిగి మా వూరికొచ్చాం. ఇది సుమారు 1970 మే-జూన్ నెలల ప్రాంతంలో. వచ్చిన
ఒకటి-రెండు రోజుల్లో మా వూరికి సమీపంలోనే వున్న నాచేపల్లి గ్రామంలో నివసిస్తున్న
మా తాతగారికి (అమ్మ తండ్రిగారు) వంట్లో సుస్తీ చేసినందువల్ల అమ్మా-నాన్న అక్కడికి
వెళ్లాల్సి వచ్చింది. మమ్మల్ని ఇద్దరినీ మా వూళ్ళో (వనంవారి కృష్ణాపురం) వదిలేసి వాళ్ళు
వెళ్లారు. మేం మూడు-నాలుగు రోజులు వుండి, నాచేపల్లి
మీదుగా (ఎడ్ల బండ్లో ప్రయాణం) నేలకొండపల్లి వెళ్లి అక్కడ బస్సెక్కి ఖమ్మం వెళ్లాం.
ఒంటరిగా మా వూళ్ళో వున్న ఆ మూడు-నాలుగు రొజులు భార్యా-భార్తలమైన మేం ఒకరినొకరు
అర్థం చేసుకోవడానికి దోహదపడ్డాయి.
ఇక్కడ మా తాతగారి
గురించి కొంత చెప్పాలి. ఆయన పేరు ముదిగొండ వెంకటరామ నర్సయ్య గారు. అమ్మమ్మ పేరు
సుభద్రమ్మ గారు. వీరికి సంతానం కలగనందున మా అమ్మ సుశీలను దత్తత తెచ్చుకున్నారు.
పసిపిల్లగా ఉన్నప్పుడే అమ్మ వీళ్ళింటికి వచ్చింది. అందుకే అమ్మ పుట్టింది బలపాలైనా
మావరకు మాకు అమ్మమ్మగారిల్లంటే నాచేపల్లే. మా అమ్మతో పాటు మరికొన్నాళ్లకు మరొక మగపిల్లవాడిని
కూడా దత్తత తెచ్చుకున్నారు. ఆయనకు చలపతిరావు అని పేరు. ఆయనకే మా అక్కయ్యనిచ్చి
పెళ్లి చేసాం. మా తాతగారు అపర శ్రీరామ భక్తులు. ఇంట్లో గంటలతరబడి పూజాపునస్కారాలు
చేయడమే కాకుండా అను నిత్యం వాళ్ల గ్రామంలో వున్న పురాతన రామాలయానికి పోయి
వచ్చేవారు. వాళ్ల గ్రామ కరిణీకం ఆయనే చేసేవారు. తాతగారికి రామాయణ, భారత, భాగవత గ్రంథాలకు సంబంధించిన అనేక
విషయాలే కాకుండా వర్తమాన సామాజిక-ఆర్ధిక-రాజకీయ పరిజ్ఞానం అపరిమితంగా వుండేది. ఆ
తరువాత కొద్ది రోజులకు ఆయన దివంగతులయ్యారు. మా చిన్నతనమంతా,
ముఖ్యంగా శలవుల్లో, అమ్మమ్మగారింట్లోనే గడిచింది.
ఖమ్మంలో కొద్ది
రోజులుండి జులై నెలలో పీజీ రెండవ సంవత్సరం కొనసాగించడానికి నాగ్ పూర్ వెళ్లాను.
ఎప్పటిలాగే రొటీన్. నా రూమ్మేట్ ఎబెనజార్ కేరళకు చెందినవాడు. వాడితో మాట్లాడుతుంటే
అడవిబాపిరాజు నవల నారాయణరావు చదువుతున్నట్లుండేది. వాడు చూడడానికి అంత బాగా వుండకపోయేవాడు.
కాని నాతో ఎప్పుడూ “నా అంత అందగాడు ఎవరూలేరు జ్వాలా” అనేవాడు. కొంచెం మతిమరుపు
కూడా వుండేది. ఉదయం టూత్ పేస్ట్ కు బదులు షేవింగ్ క్రీం వాడిన రోజులు చాలా
వున్నాయి. నేను తరచూ ఖమ్మం వెళ్లి వస్తుండడం వల్ల రూమ్ అద్దె నాది కూడా వాడే
కట్టేవాడు. వచ్చినతరువాత అప్పు తీర్చేవాడిని. చాలా సరదా మనిషి అయిన ఎబెనజార్
ఎక్కడున్నాడో ఏమో!
అడపా-దడపా ఖమ్మం
వచ్చిపోతున్న నాకు అలా ఒక సారి వచ్చినప్పుడు, నవంబర్
1970 లో, మా ఆవిడ ఒక శుభ వార్త చెప్పింది. ఆవిడ తల్లి, నేను తండ్రి కాబోతున్నానన్నది. ఆ విషయాన్ని విన్న మా అమ్మా-నాన్న, అత్తగారు-మామగారు, అటువైపు-ఇటువైపు కుటుంబ సభ్యులు
అందరూ సంతోషించారు. వెంటనే హైదరాబాద్ వచ్చి అప్పట్లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సీతను
సంప్రదించాం. ఆమె అంతా సవ్యంగా జరుగుతుందని భరోసా ఇచ్చింది. మా ఆవిడ ఖమ్మం, నేను నాగ్ పూర్ ప్రయాణమై పోయాం.
nice information article
ReplyDeletehttps://goo.gl/Ag4XhH
plz watch our channel