శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-13
సీతను ఎత్తుకునిపోయిన విరాధుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (17-06-2018)
శ్రీరామచంద్రమూర్తి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి,
అక్కడే నిద్రించి, ఉదయాన
స్నానసంధ్యాది కార్యక్రమాలను తీర్చుకుని, వారి
అనుమతి తీఉస్కుని, అడవిలోకి పోయాడు.
ఆ అడవి అనేక రకాలైన మృగాలతో వ్యాపించి వున్నది.
అనేక రకాలైన వృక్షాలున్నాయి. అనేకరకాలైన
పక్షులున్నాయి. చెట్లతీగెలు, పొదలున్నాయి.
అవన్నీ, విరాధుడి భయంతో అక్కడికీ ఎవరూ
రానందున, చివికి నశించాయి. వీటితో
పాటున్న నీరులేని మడుగులను చూసుకుంటూ సీతారామలక్ష్మణులు అడవిలో పోసాగారు.
ఇలా అడవిలో పోతున్న శ్రీరామచంద్రమూర్తి ఒక క్రూరుడిని చూశాడు.
పర్వత శిఖరంలాగా పొడగాటి దేహంతో, పెద్ద
ధ్వని చేస్తూ మనుష్యులను తినేవాడిగా, లోతైన
పెద్ద కళ్లతో, భయంకరమైన పెద్ద నోటితో, భయంకరమైన
వికార ఆకారంతో, కొత్తగా నెత్తురుకారే పులిచర్మం కప్పుకుని, మూడులోకాలని
మింగే విధంగా నోరు తెర్చుకుని, యముడిలాగా
భూతాలకు భయంకరంగా వుండి, నాలుగు పులులు,
రెండు తోడేళ్లు, పది
దుప్పులు, ఏనుగుతల శూలంకొనలో గుచ్చి, పెద్దగా
బొబ్బలు పెట్తూ వున్నాడు ఆ క్రూరుడు.
ఆ విరాధుడు సీతారామలక్ష్మణులను చూసి కోపించి, భూమి
గడగడలాడేట్లు, ప్రళయకాలం నాటి యముడిలాగా, విజృంభించి,
భయంకరంగా ధ్వని చేస్తూ, తటాలున
వాళ్లమీద పడ్దాడు. పడి, సీతాదేవిని
ఎత్తుకుని, చంకలో వుంచుకుని, శ్రీరామలక్ష్మణులతో
ఇలా అన్నాడు:
"మీరెవ్వరు? ఋషులలాగా
జడలు, చర్మాలు ధరించి మిక్కిలి పొగరుగా, కత్తి,
విల్లు, బాణాలు ధరించి భార్యతో అడవిలో
తిరుగుతున్నారు? మునీశ్వరులకు వయసు ఆడది తోడెందుకు? దుష్ట
ప్రవర్తన కలవారా మీరు? మీ వ్యవహారం వేరే విధంగా
కనిపిస్తున్నది. మీరు పాపాత్ములు...మునులకు
అపకీర్తి తెస్తున్నారు. మీరు నా
చేతిలో చావనున్నారు. నా వృత్తాంతం చెప్తా వినండి.
న అపేరు విరాధుడు....నేను
వీరుడను. కాబట్టి, ఆయుధాలు ధరించి,
మునులను చంపి, వారి
మాంసం తింటూ, సంతోషంగా ఈ అడవిలో తిరుగుతున్నా. పాపాత్ములైన
మిమ్మల్ని యుద్ధంలో చంపి, మీ
నెత్తురు తాగి, ఈ ఆడదానిని నా పెళ్లంగా
చేసుకుంటా". ఇలా విరాధుడు చెప్పిన మాటలకు సీతాదేవి భయపడి
పెద్దగాలికి అరటి చెట్టులాగా వణికింది.
సీతాదేవి ఇలా రాక్షసుడి ఒడిలో వణుకుతుంటే, శ్రీరామచంద్రమూర్తి
దుఃఖపడుతూ లక్ష్మణుడితో ఇలా అన్నాడు: "లక్ష్మణా!
జనకమహారాజు ప్రియపుత్రిక, నా భార్య,
నిడివికళ్లది, రాచబిడ్డ,
సీతాదేవి మనసులో వున్న భయంతో రాక్షసుడి ఒడిలో ఎలా వణుకుతుందో చూసావా?
తమ్ముడా, భూమి పుత్రికకు ఎలాంటి గొప్ప ఆపద
వచ్చిందో చూశావా? కైక్ ఏ ప్రయోజనం కోరి నన్ను అడవులకు
పొమ్మందో, అది తొందరగానే ఆమెకు చేకూరింది. ఆమె
దూరాలోచనకలది కాబట్టే సర్వజనప్రియుడనైన నేను నగరంలో వుందగా భరతుడికి రాజ్యం
స్థిరపడదని భావించింది. ప్రజలందరూ
నాకే వశపడుతారనీ, నామీద ప్రేమతో భరతుడిని
విరోధిస్తారనీ ఆమెకు తెలుసు. కాబట్తి
నన్ను అడవులకు పంపితే, నా వెంట పతివ్రత సీత
ఎలాగూవస్తుందని ఆమెకు తెలుసు. ఆ వచ్చిన సీత రాక్షసుల వాత పడి,
కష్టాలు సహించలేక చనిపోతుందనీ తెలుసు. ఆమె చస్తే రామచంద్రుడు బతకడని
ఆమె కోరిక. అలా జరుగుతే రాజ్యానికి భరతుడు స్థిరపడుతాడనుకుంది. ఇలా ఆలోచించి నన్ను
అడవులకు పంపింది. ఆమె కోరిక తొందరగానే ఫలించింది. తండ్రి మరణ వార్త విన్న దుఃఖం
కంటే, రాజ్యం పోయిన దుఃఖం కంటే, సీతాదేవిని
ఇతరులు తాకడం ఎక్కువ దుఃఖాన్ని కలిగించింది”.
ఈ విధంగా
చెప్పి దుఃఖంతో కన్నీళ్లు కారుతుంటే బాధపడుతున్న శ్రీరామచంద్రమూర్తిని చూసి కోపంతో
పాములాగా బుసకొట్తూ లక్ష్మణుడిలా అన్నాడు: "విష్ణుతేజా!
సమస్త భూతకోటికి నువ్వే దిక్కు. చిత్త
ఔన్నత్యం విడిచి దిక్కులేనివాడిలాగా ఎందుకిలా దుఃఖపడతావు? ఇప్పుడేం
చెడిందని ఇంత దుఃఖం? ఏ పనైనా చేయడానికి నీ సేవకుడిని
నేను లేనా? నీ సేవ చేయడానికే కదా నేను వచ్చింది? నేనిప్పుడు
ఏం చేస్తానంటావా? నా బాణాలతో వాడి భుజాలను
పడగొడ్తాను. వీడెక్కడికి పోతాడు? ఆనాడు
భరతుడిమీద వచ్చిన కోపం ఆయన శరణాగతుడైనందున పరిహారం లేకుండా వ్యర్థమైంది.
ఆ కోపాన్ని ఇంద్రుడు కొందమీద వజ్రాన్ని విడిచిన విధంగా వీడిమీద
విడుస్తా. స్పష్టమైన నా భుజబలంతో వదిలిన బాణాలు వేగంగా పోయి వాడి రొమ్ములు
చీల్చి వాడిని పీనుగగా చేస్తాయి".
No comments:
Post a Comment