Sunday, June 17, 2018

హనుమకు చూడామణి ఇచ్చి రామలక్ష్మణులకు సందేశం పంపిన సీత ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమకు చూడామణి ఇచ్చి రామలక్ష్మణులకు సందేశం పంపిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (18-06-2018)
"అమ్మా, నేను పోయి సీతాదేవిని చూశాననగానే, శ్రీరాముడు, లక్ష్మణుడు  సుగ్రీవుడు, వానరులైన నా స్నేహితులు, మాకేం చెప్పిందంటే, మాకేం చెప్పిందని అడుగుతారు. నీమాటలుగా, వారందరికీ ఏం చెప్పాలో చెప్ప" మని ఆంజనేయుడు అడుగుతాడు సీతను. దుఃఖంతో కన్నీరుకారుస్తూ, సీతాదేవి సమాధానమిస్తుంది హనుమంతుడికిట్లా:

"కుశలమడిగానని చెప్పు. నాకు బదులుగా ఇదిసీత నమస్కారమని రాముడికి మ్రొక్కు. మీ క్షేమ సమాచరం అడిగానని చెప్పు.  నేను రక్షించమని అడిగానని మాత్రం చెప్పవద్దు. నీవు మిత్ర శ్రేష్టుడవు. ఇదే నీవు నాకు చేయవలసిన ఉపకారం. (ఇదివరకు తన్ను రక్షించమనికోరి మహాపరాధం చేసాననుకుంటుంది. ప్రపన్నురాలు అలాంటి కోరికలు కోరరాదు. భగవత్ కృత్యం ఆయనకు నేర్పి "దురహంకారి" నైనా ననుకుంటుంది సీత. అంటే ఆయనపై "విస్మృతి" దోషం ఆరోపించినట్లే! ఆయన రక్షణ చేస్తాడన్న విషయంలో విశ్వాసం లేక పోవటమే! అయన సొత్తు కాపాడుకున్నా, పోగొట్టుకున్నా, బలవంత పెట్టేందుకు తనెవరనుకుని, దోష నివృత్తి కొరకు, ప్రాయశ్చిత్తంగా "నమస్కరిస్తున్నా" ననిమాత్రమే చెప్పమంటుంది.)

"ఆంజనేయా! శ్రీరాముడు, నేనూ అడవులకు రావటానికీ, లక్ష్మణుడు రావటానికీ, చాలా తేడా వుంది. రామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞ మీరలేక, నిర్బంధంగా వచ్చాడేకాని, సంతోషంగా, బుధ్ధిపూర్వకంగా రాలేదు. ఆయన వచ్చాడు కాబట్టి భార్యనైన నాకు తప్పిందికాదు. రాముడి రాకను సమ్మతించిన వారెవ్వరూ లేరు. లక్ష్మణుడి విషయం అలాంటిదికాదు. అరణ్యాలకు రావాల్సిన కారణంలేదు. ఆయన చేసిన పనికి, ఆయన భక్తికి అందరూ సంతోషించారు, సమ్మతించారు. సంచారయోగ్యమైన, మనోహరమైన ఇళ్లను, భోగభాగ్యాలను, సేవకులను, బుధ్ధిపూర్వకంగా వదిలేసి, తల్లి, తండ్రులను గౌరవించి, సమాధానపర్చ్చి, వారి అనుగ్రహానికి పాత్రుడై అరణ్యాలకు బయల్దేరాడాయన. తనలా పోవడంవల్ల ప్రయోజనం లేకపోయినా, అన్న ఒక్కడే పోతున్నాడన్న ఆలోచనతోనూ, ఆయన పిలుస్తే మారు పలికే మనిషిలేడనీ, ఆయన ఏకాంతానికి ఏ ఇబ్బందీ లేకుండా చూద్దామనీ అడవుల్లోకి వచ్చాడు. ఆయనెంత సుగుణవంతుడో కదా!"

"అడవుల్లో ఎట్లా వున్నాడో తెలుసా? అసమానపరాక్రమవంతుడైనా, గర్వమనేదిలేక వినయంగా మసిలేవాడు. అది ఆయన గురువులవద్ద నేర్చుకున్న విద్యాఫలం. సత్పురుషులకు ప్రియంగా వుండేవాడు. సుఖాలన్నీ త్యాగం చేసి, అన్నకొరకే, కష్టకాలంలో, ఆయనకనుకూలంగా, ఆయన సేవే చేస్తుండేవాడు. ఆయనకు మేలుచేయటమే తెలుసుకాని, ద్రోహబుధ్ధి అంటే ఏమిటో తెలియదు. ఆయన్ను చూస్తుంటే సౌమ్యుడనే విషయం వెంటనే తెలిసిపోతుంది. సింహబలుడిలాంటివాడు. అన్నివిషయాల్లోనూ, మా మామగారికి సమానమైన వాడు. రావణాసురుడు నన్నెత్తుకొచ్చిన సంగతి ఆయనకు తెలిసుండదు. తెలిస్తే వాడినక్కడనే చంపేసేవాడు".

"లక్ష్మణుడు పెద్దలదగ్గరుండి వారిసేవ చేసినవాడు. కాంతిమంతుడు, మితంగా మాట్లాడుతాడు. మామగారికి ముద్దులకొడుకు, నాకు ముద్దులమరది. ఎంతకష్టమైన పనిచెప్పినా, చేతకాదనకుండా చేసేవాడు. ఎంతబరువైనా మోసేవాడు. ఆయన పక్కనుండడంతో, తండ్రి లేడే అన్న భావనేలేకపోయింది. దయాగుణం కలవాడు, దాక్షిణ్య స్వభావమున్నవాడు. నిర్మలమైన, మృదువైన, మనస్సున్నవాడు. ఎట్టిదోషం లేనివాడు. శ్రీరాముడి ప్రియ సోదరుడు. అలాంటి లక్ష్మణుడి క్షేమం అడిగానని చెప్పు హనుమంతా! ఎలా నచ్చ చెపితే, శ్రీరామచంద్రమూర్తి తక్షణమే ఇక్కడకు వస్తాడో, ఆవిధంగానే విషయాలన్నీ క్షుణ్ణంగా చెప్పు".


"వానరేంద్రా! నా దుఃఖం సమసిపోవాలి. ఇదే నాకు కావాల్సింది. దానికొరకు నామగడు, ఎలాంటి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించగలడో, అదంతా ఆయనతో చేయించాల్సిన వాడివి నీవే! ఆ భారం నీమీదే వుంది. ఒక్కమాటమాత్రం ఆయనకు మళ్లీ-మళ్లీ చెప్పు. ఎంత కష్టమైనా సహించి ఇంకొక్కనెల ప్రాణాలు బిగపట్టుకుంటాను. ఆపైన నేను నిల్పుకోవాలన్నా ప్రాణం నిల్వదు రామచంద్రా! అన్నానని చెప్పు. పూర్వం ఇంద్రుడికి రాజ్యలక్ష్మిని చేర్చినట్లు నన్నుధ్ధరించమను. తన సొమ్మును తనే కాపాడుకోవాలని చెప్పు".

(రావణుడిచ్చిన గడువు ఇంకా రెండు నెలలుండగానే, నెలరోజులకే ప్రాణం విడుస్తానని ఎందుకంటున్నది సీత? ఇది పద్నాలుగవ సంవత్సరం, ఫాల్గుణమాసం. సీతారామలక్ష్మణులు అయోధ్య విడిచి వెళ్లింది చైత్ర శుధ్ధ చతుర్ధి. పద్నాలుగు సంవత్సరాలు నిండడానికి ఇంకా పంతొమ్మిది రోజులే మిగిలి వున్నాయి. పదిహేనవ సంవత్సరం మొదటి రోజున, రాముడు రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని భరతుడు శపథం చేసాడు. రామచంద్రమూర్తి దాన్ని ఒప్పుకున్నాడు. అంటే ఆరోజుకింకా ఇరవయ్యోరోజు, అయోధ్యలో రాముడుండక తప్పదు. భరతుడు మరణిస్తే, కౌసల్య, సుమిత్ర, కైకేయి, శత్రుఘ్నుడు కూడా మరణిస్తారు. వంశనాశనం జరుగుతుంది. దాన్ని నాకొరకు రామచంద్రుడు ఎట్లా సహించగలడు? కావున అయోధ్యకు పోక తప్పదు. రాముడొస్తాడు, తన్ను రక్షిస్తాడన్న ఆశతో వున్న సీతకు, ఆయన అయోధ్యకు పోయాడని తెలిసి, ఆశాభంగమై ప్రాణాలు పోతాయి. అందుకే నెలరోజులు గడువిచ్చింది)

తనమాటలుగా రామచంద్రమూర్తికి చెప్పమని ఎన్నో విషయాలు చెప్పిన సీతాదేవి, ఆ తర్వాత తన కొంగులో ముడివేసి దాచుకున్న "చూడామణి" ని తీసి, రామచంద్రమూర్తికిమ్మని హనుమంతుడికిస్తుంది. నిత్యమూ శ్రీరాముడికి పాదాభివందనం చేయడం సీతమ్మకు అలవాటు. అలా చేస్తున్నప్పుడు  చూడామణిని (నాగరం లేదా కొప్పుబిళ్ల) రాముడు చూస్తుండడంవల్ల దానిని ఆయన తేలిగ్గా గుర్తుబడతాడు. అందువల్లనే చూడామణిని ఇచ్చింది సీతమ్మ. ఆమె ఇచ్చిన ఆ జడబిళ్లను హనుమంతుడు తనవేలికి పెట్టుకున్నాడు. అప్పుడాయన చేయి పెద్దగాలేదు. సీతకు చూపించిన ఆకారాన్ని తగ్గించి, పూర్వంలాగా చిన్నగయ్యాడు. ఆ జడబిళ్ల ఆయన వేలికి ఉంగరంలాగా సరిపోయింది. తర్వాత ఆమెకు ప్రదక్షిణ చేసి, నమస్కరించి నిలబడ్డాడు. వచ్చిన పని అయిపోయిందన్న సంతోషంతో, హనుమంతుడు, శరీరాన్ని సీత దగ్గరుంచినా, మనస్సును రాముడిపై మళ్లించి, ఆయన్ను ఎప్పుడు చూస్తానా అని త్వరపడసాగాడు. అసమానమై, ఉత్తములు మాత్రమే ధరించదగి, సీతాదేవి తన మహాత్మ్యం వల్ల ధరించిన, చూడామణిని, హనుమంతుడు, తన బుధ్ధిబలంతో పొంది, సంతోషించి, శ్రీరాముడి దగ్గరకు త్వరగా పోవాలన్న ఆలోచనలో పడ్డాడు.

1 comment: