Saturday, August 18, 2018

శాసన, న్యాయపరిధిపై చర్చ అవసరం : వనం జ్వాలానరసింహారావు


శాసన, న్యాయపరిధిపై చర్చ అవసరం
వనం జ్వాలానరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (19-08-2018)
శాసనసభ, మండలి సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తున్న గవర్నర్‌పై మైక్ విసిరినట్టి అనుచిత ప్రవర్తన తీవ్రమైనది అయినందున ఇరువురు కాం గ్రెస్ సభ్యులను బహిష్కరిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ విషయంలో న్యాయ కార్యదర్శి లేదా అసెంబ్లీ కార్యదర్శి పాత్ర ఏమీ లేదు. సభ చేసిన ఏకగ్రీవ తీర్మానమది. సభకు అటువంటి తీర్మానం చేసే అధికారం ఉన్నది. వారు కోర్టు ఆదేశాలను కనుక అమలుచేస్తే శాసనసభా ధిక్కారం కిందికి వస్తుంది. సభ్యుడిని సస్పెండ్ చేయడం లేదా బహిష్కరించడం ద్వారా శిక్షించే అధికారం శాసనసభకు రాజ్యాంగంలోని 194(3) అధికరణం ద్వారా, పార్లమెంట్‌కు 105(3) అధికరణం ద్వారా సంక్రమించింది. బ్రిటిష్ కామన్స్ సభకు ఉన్నట్టి విశేషాధికారాలు, రక్షణలు 1950 భారత రాజ్యాంగం ద్వారా మన చట్టసభలకు సంక్రమించి కొనసాగుతున్నాయి.

శాసన, న్యాయశాఖల మధ్య తరచు ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో, శాసనసభ విధులు, న్యాయశాఖకు హెచ్చు అధికారాల పరిధిపై జాతీయస్థా యి చర్చ జరుగడం అవసరం. శాసనసభనుంచి బహిష్కృతులైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరణపై తమ ఆదేశాలను అమలు చేయనందుకు హైదరాబాద్ హైకోర్టు అసంతృప్తిగా ఉన్నది. బహిష్కృత ఎమ్మెల్యేలు వేసిన కోర్టు ధిక్కార కేసు లో తెలంగాణ శాసనసభ కార్యదర్శిని, న్యాయకార్యదర్శిని పిలిపిస్తామని, స్పీకర్ మధుసూద నాచారిని చేరుస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది. పిటిషనర్లను బహిష్కరిస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. తాము ఈ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పిటిషనర్ల శాసన సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడం, వారికి వేతనాలు చెల్లించకపోవడం, భద్రతను పునరుద్ధరించకపోవడం, కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి అన్నారు.

ఈ లోగా ఎమ్మెల్యేల బహిష్కరణ, ఖాళీలపై ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేసషన్లను పక్కనబెట్టిన హైకోర్టు డివిజన్ బెంచి ముందు అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులు అప్పీల్స్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి జారీచేసిన ఆదేశం అమలులో తమ పాత్ర లేదని వారు పేర్కొన్నారు. ఇది న్యాయ, శాసనశాఖల మధ్య ఘర్షణ, వివాదాలకు దారి తీస్తుం దా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పరస్పర నియంత్ర ణ, సమతుల్యతలపై జాతీయస్థాయి చర్చ జరుపడానికి ఇది తగిన సమయం.

శాసనశాఖ అధికారాలు, విధులపైనా, శాసన న్యాయశాఖలు ఒకదానిపై ఒకటి ఏమేర అధికారం నెరుపగలవనే దానిపైనా విశ్లేషించడం అవసరం. రాజ్యాంగం మూడు శాఖలను ఏర్పరచింది. అవి- శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఒక్కో శాఖకు ప్రత్యేక అధికారాలు కల్పించి, నియంత్రణ-సమతుల్యతలను ఏర్పరుచడం చాలా ప్రాముఖ్యం గల నిర్ణయం. నియంత్రణ- సమతుల్యత అనే పదబంధం అంటేనే ఏ ఒక్క శాఖ పూర్తి అధికారాలు చెలాయించలేదు. ఈ విధంగా రాజ్యాంగం అధికార పృథక్కరణ జరిపింది.


ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని 212 అధికరణం స్పష్టంగా ఒక విషయం చెబుతున్నది. అది- చట్టసభలోని చర్చలపై న్యాయస్థానాలు విచారణ జరుపలేవు. నియమబద్ధంగా లేవనే కారణంగా శాసన సభ చర్చల చెల్లుబాటును ప్రశ్నించకూడదు. రాజ్యాంగం ప్రకారం- చట్టసభ వ్యవహారాలు నిర్వహించే అధికారం ఉన్న అధికారి లేదా సభ్యుడు అట్టి అధికారాలను నిర్వహించినప్పుడు అది న్యాయశాఖ పరిధిలోకి రాదు. దీన్నిబట్టి చట్టసభలోని వ్యవహారాల చెల్లుబాటును కోర్టులు విచారించలేవని స్పష్టమవుతున్నది.

న్యాయశాఖతో పాటు అన్నిశాఖల నిర్మాణం, పరిమితులు, పాత్రను, వాటి పరస్పర సంబంధాలను, నియంత్రణ-సమతుల్యతలను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. మన పార్లమెంటరీ చరిత్రలో శాసన, న్యాయశాఖల మధ్య పట్టుదల తలెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు చేసిన చట్టాలను ఎన్నిక కాని న్యాయమూర్తులు ఎట్లా కొట్టివేస్తారంటూ, న్యాయశాఖ ఆధిపత్యానికి ప్రభుత్వం అనేకసార్లు అభ్యంతరం తెలిపింది.కాలం గడిచేకొద్దీ పార్లమెంట్, న్యాయశాఖ తమ అధికారాలను పెంచుకోవడంవల్ల వాటి మధ్య ఘర్ష ణ తలెత్తుతున్నది. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే పరమోన్నతమైనది. ప్రజలే సార్వభౌములు, వారి అధికారాన్ని తగ్గించడం సాధ్యం కాదు. కానీ ప్రజలు తమ అధికారాన్ని తమంత తాము ఉపయోగించుకోలేరు. తామెన్నుకున్న ప్రతినిధుల ద్వారా అధికారాన్ని నెరుపుతారు. ప్రజలు తామే సార్వభౌ మ అధికారాన్ని చెలాయిస్తే, దేశంలో అరాచకం ప్రబలుతుంది. అందువల్ల ప్రజల సార్వభౌమ అధికారం శాసనశాఖ సార్వభౌమ అధికారంగా పరివర్త న చెందింది.

ప్రజల చేత ఎన్నిక కాని న్యాయమూర్తులు అనేక అధికారాలు పొంది, ఎన్నికైన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు తలొగ్గడానికి తిరస్కరించడం అప్రజాస్వామికమని చెప్పవచ్చు. కానీ అధికారాల విభజన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక లక్షణం కనుక, దీన్ని పరిరక్షించాల్సిందే. అయితే మూడు శాఖల మధ్య అధికార పృథక్కరణ అనే అనే భావనను ఎన్నిక కాని న్యాయమూర్తులు మార్చివేశారు. బ్రిటన్‌లో పార్లమెంటే పరమోన్నతమైనది. ఇదేవిధంగా మన దేశంలో కూడా శాసనశాఖే నిస్సందేహంగా ఉన్నతమైనది. న్యాయశాఖకు తన పరిధిలో పూర్తి అధికారాలు ఉన్నట్టే, రాజ్యాంగంలోని 122, 212 అధికరణాల ప్రకారం శాసనశాఖ తన పరిధిలో ఉన్నతమైనది. శాసనశాఖ ఉన్నతి మొదలైనచోట న్యాయశాఖ ఉన్నతి ముగుస్తుంది.

1964లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను తమ ఎదుట హాజరుకమ్మని ఆదేశించిన తీవ్రస్థాయి ఉదంతం కూడా భారత చట్టసభ చరిత్రలో ఉన్నది. సభా ధిక్కారాని కి పాల్పడిన పౌరులను శిక్షించే అధికారం తమకు ఉందనే వాదనను యూపీ అసెంబ్లీ ముందుకు తెచ్చింది. రాజ్యాంగానికి వ్యాఖ్యానం చెప్పే అధికా రం కూడా తమకు రాజ్యాంగం కల్పించిందనే ప్రాతిపదికను ఈ సందర్భంగా శాసనసభ ఉటంకించింది. సభా ధిక్కారానికి పాల్పడిన కేశవ్ సింగ్ అనే వ్యక్తిని అసెంబ్లీ స్పీకర్ జారీచేసిన వారంట్ ఆధారంగా అరె స్టు చేసి జైలుకు పంపారు. ఈ కేశవ్‌సింగ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను స్వీకరించి ఆయనను విడుదల చేయాలనే మధ్యంతర ఉత్తర్వు లు జారీచేసినందుకు న్యాయూర్తులకు శిక్షగా వారిని కస్టడీలోకి తీసుకొని హాజరుపరుచాలని అసెంబ్లీ స్పీక ర్ ఆదేశించారు. ఆ తర్వాత కేశవ్‌సింగ్ తన పిటిషన్‌లో అనేక వాస్తవాలను దాచిపెట్టారని న్యాయస్థా నం గ్రహించింది. వాస్తవాలు తెలిసిన మీదట కోర్టు కేశవ్‌సింగ్‌ను సరిగానే శిక్షించారని భావించి, ఆయన పిటిషన్‌ను కొట్టివేసి, మిగతా స్వల్ప శిక్షా కాలానికి జైలుకు పంపింది. ఈవిధంగా కథ సుఖాంతమైంది.

శాసనసభ, మండలి సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తున్న గవర్నర్‌పై మైక్ విసిరినట్టి అనుచిత ప్రవర్తన తీవ్రమైనది అయినందున ఇరువురు కాం గ్రెస్ సభ్యులను బహిష్కరిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ విషయంలో న్యాయ కార్యదర్శి లేదా అసెంబ్లీ కార్యదర్శి పాత్ర ఏమీ లేదు. సభ చేసిన ఏకగ్రీవ తీర్మానమది. సభకు అటువంటి తీర్మానం చేసే అధికారం ఉన్నది. వారు కోర్టు ఆదేశాలను కనుక అమలుచేస్తే శాసనసభా ధిక్కారం కిం దికి వస్తుంది. సభ్యుడిని సస్పెండ్ చేయడం లేదా బహిష్కరించడం ద్వారా శిక్షించే అధికారం శాసనసభకు రాజ్యాంగంలోని 194(3) అధికరణం ద్వారా, పార్లమెంట్‌కు 105(3) అధికరణం ద్వారా సంక్రమించింది. బ్రిటిష్ కామన్స్ సభకు ఉన్నట్టి విశేషాధికారాలు, రక్షణలు 1950 భారత రాజ్యాంగం ద్వారా మన చట్టసభలకు సంక్రమించి కొనసాగుతున్నాయి.

శాసనసభలో జరిగినట్టుగా, న్యాయస్థానంలో ఎవరైనా న్యాయమూర్తి మీదికి ఏదైనా వస్తువును విసిరేస్తే తత్పరిణామం ఏవిధంగా ఉండేది? గవర్న ర్ పైకి మైకులు విసిరేసిన కాంగ్రెస్ శాసనసభ్యుల బహిష్కరణ కన్నా మరీ ఎక్కువ శిక్షే పడేది. అందువల్ల నియంత్రణలు, సమతుల్యతలపై జాతీయస్థా యి చర్చ అవసరం.

No comments:

Post a Comment