Monday, August 27, 2018

లంకకు వచ్చిన కారణం రావణుడికి తెలిపిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


లంకకు వచ్చిన కారణం రావణుడికి తెలిపిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-08-2018)
ప్రహస్తుడడిగిన ప్రశ్నలకు వాడంటే లక్ష్యంలేకుండా, రావణుడంటే జంకు లేకుండా, మాట తడబడక, తనవృత్తాంతాన్నంతా చెప్తా వినమంటాడు. ఇంద్రుడు, వరుణుడు, యముడు పంపితే తాను రాలేదు అంటాడు. కుబేరుడికి తనకు ఏనాడూ స్నేహంలేదనీ, విష్ణువిక్కడకు పొమ్మని అనలేదనీ చెప్పాడు. తానే ఆకారంలో కనిపిస్తున్నాడో, ఆ జాతివాడినేననీ, దుర్లభమైన రాక్షసరాజు దర్శనంకోరి ప్రమదావనాన్ని పాడుచేసాననీ అన్నాడు. యుద్ధం చేయడానికి రాక్షసులొస్తే తన్ను కాపాడుకోవటానికి మాత్రమే వారితో పోరాడానంటాడు.

 తనను ఇంద్రాది దిక్పాలకులెవరూ కూడా అస్త్రాలతో కట్టెయ్యలేరనీ, తానే కావాలని పట్టుబడ్డాననీ చెప్పాడు. "బ్రహ్మ చేత నీవొక్కడివే వరాలు పొందలేదు. నేనుకూడా ఇట్టి వరాలు పొందినవాడినే. రాక్షస రాజును చూడగోరి బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డాను. రాక్షసులు నన్ను తాళ్లతో కట్టినప్పుడే ఆ అస్త్ర బంధాలూడిపోయాయి" అంటాడు. రావణాసురుడిని చూడాలని పట్టుబడ్డ తను, రాచకార్యం మీద ఆయన్ను చూడదల్చుకున్నాననీ, గొప్ప పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తి బంటుననీ, రాక్షసరాజుకు కొన్ని క్షేమకరమైన మాటలు చెప్తా వినమనీ హెచ్చరికగా అంటాడు హనుమంతుడు. 

తాను లంకకు వచ్చిన కాకారణం చెప్తా వినమంటాడు హనుమంతుడు రావణుడితో:
"సుగ్రీవుడి ఆజ్ఞానుసారం నిన్ను చూడటానికి ఈ పట్టణానికి వచ్చాను. నీ తమ్ముడు వానర రాజు, సుగ్రీవుడు నీ కుశలవార్త అడిగాడు. నీకు ఇహపరాలలో సుఖం కలిగించే ధర్మ వాక్యాలను చెప్పి పంపాడు. దానిని నీకు చెప్తా విను. చతురంగ బలాలున్న దశరథుడనే మహారాజున్నాడు. ప్రజలకాయన తండ్రిలాంటి వాడు. తేజంలో ఇంద్రుడికి సాటి. అతడి పెద్దకొడుకు, భూజనులను సంతోషపెట్టేవాడు, కీర్తిమంతుడు. పేరు శ్రీరామచంద్రుడు”.

(ఈమాటలు హనుమంతుడు స్వయంగా తానే చెప్పినా సుగ్రీవుడిమాటలవలె చెప్పాడు. కొన్ని మాటలు ఆయన చెప్పినవి కాకపోయినా దూతధర్మంగా ప్రభువు మాటలను ఆయన అభిప్రాయానికి అనుకూలంగా చెప్పాడు).

“ఆ రామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞప్రకారం భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు తోడురాగా దండకారణ్యంలోకి వెళ్లాడు. ఆయన భార్య ఒకనాడు అడవిలో కనిపించక పోయేసరికి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వెతుక్కుంటూ ఋశ్యమూక పర్వతం వద్దకు వచ్చారు".

"సుగ్రీవుడు సీతను వెతికిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రాముడు వాలిని చంపి, సుగ్రీవుడికి వానరరాజ్యం ఇస్తానని వాగ్దానం చేసి, ఇచ్చిన మాట ప్రకారమే యుద్ధంలో వాలిని చంపి, సుగ్రీవుడిని రాజును చేసాడు. వాలి ఎవరో, ఎట్టివాడో నీకూ తెలుసు . అలాంటివాడు ఒక్క రామబాణానికి చచ్చాడు. ఆ తర్వాత సీతను వెతికేందుకు వేలాదివేల వానరులను అన్ని దిక్కులకూ పంపాడు సుగ్రీవుడు”.

( రావణుడిని జయించిన వాలిని రాముడు ఒక్క బాణంతోనే చంపాడని చెప్పడంలో ఉద్దేశ్యం స్పష్టం. వాలి అంతటి వాడినే ఒక్క బాణంతో కూల్చి పారేసిన రాముడికి రావణుడొక లెక్కా! అని హెచ్చరించడమే!)

“గరుత్మంతుడితో సమానమైన వేగంగా పోగలిగే వానరవీరులు, భుజ బలసంపన్నులు, సీతాదేవిని అన్నిప్రదేశాల్లో వెతుకుతున్నారు. సుగ్రీవుడి దగ్గర నాలాంటివాళ్లు అనేకమంది వున్నారు. నన్నొక్కడిని జయించడమే నీకింత కష్టమైతే, వారందరూ ఒక్కసారే వస్తే నువ్వేమి చేయగలవో ఆలోచించుకో".


"నేను వాయుపుత్రుడిని. పేరు హనుమంతుడు. సీతాదేవిని వెతుక్కుంటూ నూరామడల సముద్రాన్ని దాటి ఇక్కడకు వచ్చాను. ఆమెను నీ ఇంట్లో చూసాను. నేను చెప్తున్నదంతా సత్యం”.

(దూత ధర్మం ప్రకారం, సీతను రావణుడు దొంగిలించాడని చెప్పలేదు. అయితే దొంగసొత్తు వాడింట్లో వుందని స్పష్టంగా చెప్పాడు).

"విధానాన్ననుసరించి ధర్మశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసావు. ప్రపంచం మెచ్చేరీతిలో తపస్సు చేసావు. ఇంత గొప్పవాడివి, పరపురుషుల స్త్రీలను బాధపెట్టడం ధర్మమా? రాక్షసవంశాన్ని నీ ఈ అధర్మ కార్యం కూకటివ్రేళ్లతో నాశనం చేసే విపత్తుకు దారితీయదా? నీవంటి బుధ్ధిమంతుడు, ఇలాంటి పనులు చేయవచ్చా? నాకెవడూ కీడుకలిగించలేడని అనుకోవద్దు. రామచంద్రమూర్తి కోపంగా వదిలే బాణాలకు, లక్ష్మణుడి బాణాలకు, నీవేకాదు దేవదానవులందరు కలిసి ఎదిరించినా నిలువలేరు. శ్రీరామచంద్రమూర్తికి కీడుచేసిన వారెవ్వరైనా, ముల్లోకాల్లో ఎక్కడైనా ప్రాణాలతో వుండడం సాధ్యమేమో నీవే ఆలోచించు. నిన్ను జయించి కారాగృహంలో బంధించిన కార్తవీర్యార్జునిడిని ఓడించి, ఇతర రాజులందరినీ ఇరవై ఒక్క సార్లు చంపిన పరశురాముడిని అరగడియలో బాణప్రయోగం లేకుండానే ఓడించాడాయన".

"ధర్మమైనదీ, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు పనికొచ్చేదీ, సుఖలాభాలతో కూడినదైన సుగ్రీవుడి మాటలు విను. జానకీదేవిని రాముడికివ్వు. ఆమె ఎక్కడుందో చూశాం. వున్నా స్థలం తెలిసిపోయింది. మిగిలిన కార్యం రామచంద్రమూర్తే చేస్తాడు. రామచంద్రమూర్తి చూసిరమ్మన్నాడే కాని తీసుకుని రమ్మనలేదు కాబట్టి ఒక్కడినే వెళ్తున్నాను. సీతాదేవిని నేను చూసాను. ఆమె స్త్రీయేకదా అని నువ్వనుకుంటే అదిపొరపాటు. నిన్ను చంపడానికి నీ మెడకు చుట్టుకున్న ఆడ త్రాచుపాము. ఆమె దగ్గరకు పోతే చస్తావు. నిన్ను చంపటానికి ఆమే చాలు. విషం కలిపిన అన్నం తినడం ఎలాంటిదో, ఆమెను స్వీకరించాలనుకోవడం అలాంటిదే. కడుపులో చేరిన విషంలాగా ఆమె నీ ఇంట్లో చేరిందనుకో. నిన్ను చంపకుండా ఆమెవదలదు కాబట్టి, ఆమెను నువ్వువదులు".

"రావణా! నీకు లెక్కకు పదితలలున్నా, మంచి, చెడు ఆలోచించేందుకు, ఒక్క తలకూడా ఉపయోగపడడంలేదు. ఎంతో కష్టపడి తపస్సు చేసావు. అది మర్చిపోయి, తపోధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేసావు. నీ తపస్సు వ్యర్ధమై పోతున్నదని మర్చావు. నీ తపఃఫలంతో దేవదానవులెవ్వరూ నిన్ను జయించకుండా వరం పొందావు. ఇంక నాకేం భయమని గర్వపడ్డావు. ఆ వరాలేవీ నిన్నిప్పుడు రక్షించలేవు. ఎందుకో చెప్తా విను".

"నువ్వు దేవతలతో, దానవులతో, రాక్షసులతో, గంధర్వులతో, నాగులతో చావకుండా వరం పొందావు. సుగ్రీవుడు అమరుడు కాదు, అసురుడూకాదు, గంధర్వుడుకూడ కాడు, దానవుడూ కానే కాదు, నాగులలో చేరినవాడూ కాదు. మరి నీవరాలు నిన్నెట్లా రక్షిస్తాయని అనుకుంటున్నావు? ఆ వరాల బలంతో నీవెట్లా బ్రతుకుతావు? కాబట్టి తపోబలం వుందన్న గర్వం వదులుకో. చీకటి, వెలుతురు ఒకేసారి రానట్లే, పాప-పుణ్యఫలాలు రెండూ ఒకేసారి అనుభవించలేం. నువ్వు పుణ్యఫలం అనుభవించుతున్నంత వరకూ, పాపఫలం దరికిరాదు. ధర్మఫలం అధర్మఫలాన్ని చెరిపేపేస్తుంది. చీకటి ఎలాగైతే వెలుతురును చెరచలేదో, అలానే అధర్మఫలం ఇంకా నీకనుభవంలోకి రాలేదు. నీ తపఃఫలం వల్ల నీకసలే పాపఫలం రాదనుకుంటున్నావేమో! అష్ట ఐశ్వర్యాలను అనుభవించేవాడికి రోగాలు రావా? నీ తపస్సు నీకు దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, నువ్వుచేసిన పరస్త్రీ అపహరణనే పాపపు పనివల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరుగవు కాబట్టి, నీ చావింతవరకూ ఆగింది. అదేకాకుండా, తపస్సు చేసినవాడు వ్రతఫలం కోరకుండా వుంటే ఆ ఫలం అందరినుండీ కాపాడేది. నీ వ్రతఫలంగా దేవదానవుల చేతుల్లో చావులేకుండా వరం కోరావు. నరవానరులను నిషేధించావు. నీ తపఃఫలం వారినుండి నిన్ను కాపాడదు. ఇక నీ పూర్వపుణ్యం పూర్వపాపాన్నే హరిస్తుంది. కాని ఇప్పుడు చేస్తున్న పాపకార్యాలనుండి నిన్ను రక్షించదు. నేడు చేస్తున్న భోజనం, నిన్నటి ఆకలిబాధ తీరుస్తుందేకాని, రేపటిబాధను కాదుకదా! పశ్చాత్తాపం చెందితే, ప్రాయశ్చిత్తముంటుంది. నీవు బలవంతంగా ఎత్తుకొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరివారికి వారిని అప్పగిస్తే నీ దోషం పోతుంది".

No comments:

Post a Comment