అభివృద్ధిలో తెలంగాణ
నమూనా
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక
(30-08-2018)
సుమారు యాబై నెలలకు పైగా, జూన్ నెల 19, 2014 నుండి ఈ
నాటివరకూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాన పౌర
సంబంధాల అధికారిగా, ఆయన నాయకత్వంలో యావత్తు అధికార-అనధికార
బృందం, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి చేపట్టి అమలు పరుస్తున్న
అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ఒక ప్రత్యక్ష సాక్షిగా, పాఠకులతో
పంచుకునే ప్రయత్నం ఇది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని విజయవంతంగా
నడిపి, 29వ
రాష్ట్రంగా అది ఏర్పడగానే ఆ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ
స్వీకారం చేశారాయన. జూన్ 2, 2014 న సీఎం గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం
నుండే,
వైవిధ్యభరితమైన సుపరిపాలనను రాష్ట్ర ప్రజలకు అందించడానికి, ప్రజల
అవసరాలకు-ఆకాంక్షలకు అనుగుణంగా, స్వయంగా పథకాలను,
అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసి, అమలు
చేయడానికి అహర్నిషలూ కృషి చేస్తూ వచ్చారు కేసీఆర్.
కేసీఆర్ సీఎం
పదవి చేపట్టిన పక్షం రోజులకు, జూన్ 17, 2014 న, మధ్యాహ్నం నుండి
రాత్రి పోద్దుపోయేవరకూ, సుమారు ఎనిమిది గంటలకు పైగా జరిగిన ఒక
అనధికారిక సుదీర్ఘ సమావేశంలో, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ గురించి తన మనసులోని
భావాలను, తన విజన్ ను, సీఎంవో
అధికారులతో పంచుకున్నారు. ఆ సమావేశంలో వున్న నేను అక్షరం పొల్లుపోకుండా ఆయన విజన్
కు సంబంధించిన అంశాలను నోట్ చేసుకున్నాను. ఆ సమావేశంలోనే ముఖ్య మంత్రి, ఒకటికి పది
సార్లు, తెలంగాణ
రాష్ట్ర పునర్నిర్మాణం గురించి, పునర్వికాసం గురించి, తనను తాను
నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదపడే విషయాల గురించీ కూలంకషంగా వివరించారు.
తెలంగాణ
బడ్జెట్, ఆదాయ వనరుల
సమీకరణ, వ్యవసాయ ఋణ
మాఫీ, ఫీజ్
రీఇంబర్స్మెంట్, కేజీ టు పీజీ
ఉచిత విద్య, సాగునీటి
ప్రాజెక్టులు, తాగునీటి
ప్రాజెక్ట్, చెరువుల
పునరుద్ధరణ, కోతలు లేని
విద్యుత్ సరఫరా-విద్యుత్ ప్రాజెక్టులు, పేదలకు రెండు పడక
గదుల ఇళ్లు, ఉద్యోగ
అవకాశాల కల్పన, ఏక గవాక్ష
పారిశ్రామిక విధానం, పోలీసు సంస్కరణలు, హైదరాబాద్
నగరాభివృద్ధి, భారీ ఎత్తున
మొక్కలు నాటడం, మన వూరు-మన
ప్రణాళిక, గ్రామజ్యోతి, దళితులకు
మూడెకరాల భూమి, రైతు
సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనారిటీల అభున్నతి-సంక్షేమం, గ్రామీణ
ఆర్ధిక వ్యవస్థ పటిష్టం మొదలైన అంశాల విషయంలో ఆనాడే స్పష్టత ఇచ్చారు. ఆనాటి ఆయన
విజన్ కు అనుగుణంగా, ఎన్నికల్లో ఆయన సారధ్యంలోని టీఆరెస్ పార్టీ చేసిన
వాగ్దానాలకు అనుగుణంగా, అప్పటినుండి ఇప్పటి వరకూ అనేకానేక
అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు జరుగుతూ వస్తున్నది.
అధికారంలోకి
వచ్చిన నాటినుండీ, తన విజన్ ను ముందుకు తీసుకు పోవడానికి, క్రమం
తప్పకుండా, అనునిత్యం,
అవసరమైనప్పుడల్లా గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, తనదైన శైలిలో
ప్రజలకు కావాల్సిన ప్రతి అంశాన్నీ స్పృశిస్తూ, ప్రతి ఒక్కరి
అభివృద్ధి-సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగుతోంది. ఇప్పుడున్న తెలంగాణా రాష్ట్రం
గతంలో ఈ విధంగా ఏనాడూ లేదనీ, దీన్నొక నూతన రాష్ట్రంగానే చూడాలనీ, దానికి
అనుగుణంగా ఒక చారిత్రాత్మక ఆరంభం జరగాలనీ పదే-పదే చెప్తుంటారు కేసీఆర్. ఆ కోణంలోనే
ఎన్నో నూతన పథకాలకు వినూత్నమైన పద్ధతిలో రూపకల్పన చేసి, శ్రీకారం
చుట్టి, నిరంతరాయంగా
అమలు చేయడం జరుగుతున్నదీ రాష్ట్రంలో. వీటన్నిటి వెనుక ముఖ్యమంత్రి స్వయం చొరవ, స్వీయ
పర్యవేక్షణ వుండడం విశేషం.
యాభై నెలల
పైబడి అధికారంలో వున్న కాలంలో, సీఎం కేవలం రెండే-రెండు పర్యాయాలు విదేశీ
పర్యటనకు వెళ్లారు. ఒక సారి సింగపూర్ కు, మరో సారి చైనాకు
వెళ్ళిన సీఎం, రెండు సార్లు
కూడా విదేశీ పెట్టుబడుల నిమిత్తమే వెళ్లారు. ఆహ్వానం మేరకు,
చైనా-దాలియాన్ లో 2015 లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో
పాల్గొన్నారు కేసీఆర్.
తెలంగాణ
ఆవిర్భవించిన అనతికాలంలోనే, కేవలం యాబై నెలల కాలంలో, అనూహ్యమైన
ప్రగతిని సాధించింది. యావత్ భారతదేశానికే తెలంగాణ ఒక అభివృద్ధి నమూనాగా
రూపుదిద్దుకుంది. ఒకనాటి సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై దెబ్బతిన్న అనేక
రంగాలు క్రమేపీ పునర్వికాసం పొందాయి. ప్రజలే కేంద్ర బిందువుగా రూపుదిద్దుకున్న
సంక్షేమ-అభివృద్ధి పథకాలు పేదవారికి, అట్టడుగు వర్గాల
వారికి, అణగారిన
వర్గాల వారికి, అన్ని
కులాల-మతాల వారికి, అగ్రకులాల పేదవారికి మేలు కలిగించి అండగా రక్షణ
కలిగిస్తున్నాయి. సీఎం విజన్ కు అనుగుణంగా రాష్ట్రం తనను తాను పునర్నిర్మించుకుంటూ
జాతి ప్రగతికి, అభ్యున్నతికి, నిర్మాణానికి
తనవంతు కృషి చేస్తున్నది.
రాష్ట్ర
ఆవిర్భావం నాటికి అగమ్యగోచరంగా వున్న తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, దరిమిలా
చోటుచేసుకున్న వ్యవసాయిక సంక్షోభాన్ని అధిగమించి, దాన్ని
పటిష్ట పరిచి రైతులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కేసీఆర్ ప్రభుత్వం అనేక
చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే, 35.29 లక్షల రైతులకు లబ్ది
చేకూరే విధంగా రు. 17,000
కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ
చెల్లింపు,
వ్యవసాయ శాఖకు రవాణా పన్ను రద్దు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల
నష్టపరిహారం రు. 6 లక్షలకు పెంపు, సకాలంలో ఎరువులు-విత్తనాలు సరఫరా, కల్తీ
ఎరువులు-పురుగుల మందులు-విత్తనాలు సరఫారా చేసిన వారిపై కఠిన చర్యలు లాంటి చర్యలు
చేపట్టి అమలుపరుస్తున్నది ప్రభుత్వం.
దేశంలో
రైతులకు ఉచితంగా, జనవరి 2018 నుండి, కోతలు లేని నాణ్యమైన
విద్యుత్ ను, ఇతర రంగాలకు
సమానంగా, 24 గంటలూ
సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే ఇక
చిమ్మ చీకట్లే అన్న వాళ్లు తమ మాటలను తామే మింగాల్సిన పరిస్థితి ఇప్పుడు.
అనతికాలంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా రూపుదిద్దుకోనుంది.
సంఘటిత శక్తిలో వున్న బలాన్ని రైతులకు తెలియచేయడానికి రైతు సమన్వయ సమితుల
ఏర్పాటు జరిగింది. ఇవి రైతులకు ఎల్ల వేళలా, విత్తనం
వేసినప్పటి నుండి, పంటకు గిట్టుబాటు ధర లభించే వరకూ
సహాయపడుతుంటాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా, సామాజిక న్యాయం
అమలు కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ విధానాన్ని
ప్రవేశ పెట్టి వాళ్లు చైర్మన్లుగా అయ్యే అవకాసం కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం.
భూ
తగాదాలకు శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి, భూ
సంబంధిత రికార్డులు పారదర్శకంగా నిర్వహించడానికి,
భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం జరిపించింది. ప్రభుత్వ బృహత్తర ప్రయత్నం
వల్ల సుమారు 94% భూముల యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. “ధరణి” వెబ్సైట్
ద్వారా భూముల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో నూటికి నూరు శాతం పారదర్శకత సాధించేందుకు
వీలుకలిగింది.
రైతులు
ఎదుర్కొంటున్న వ్యవసాయ పెట్టుబడి సమస్యను అధిగమించడానికి “రైతుబందు” పేరుతో
వినూత్నమైన పథకాన్ని అమలుచేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో భూమిపై
యాజమాన్య హక్కు వున్న ప్రతి రైతుకు ఎకరానికి పంటకు రు. 4000 చొప్పున రెండు పంటలకు
కలిపి రు. 8000 ఈ పథకం ద్వారా సమకూరుస్తున్నది ప్రభుత్వం. రు. 5111 కోట్లను 49,49,000 మంది రైతులకు మొదటి
పంటకు పంపిణీ చేయడం జరిగింది. ఇంత భారీ మొత్తంలో రైతులకు ఒకేసారి ఆర్ధిక సహాయం
చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.
భారత జీవిత భీమా సంస్థ ద్వారా ఆగస్ట్ 15, 2018
నుండి రైతు భీమా పథకాన్ని అమలు చేస్తూ, రాష్ట్రంలో ఏ రైతైనా, ఏ కారణానైనా మరణిస్తే అతడి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, రైతు చనిపోయిన పదిరోజుల్లోపల రు. 5 లక్షల భీమా సొమ్ము చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది
ప్రభుత్వం. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
కోటి
ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు, తెలంగాణ
రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సాగునీటి ప్రాజెక్టుల
రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. గత పాలకులు లోపభూయిష్టంగా రూపొందించిన
ప్రాజెక్టుల డిజైన్లను నిపుణుల సలహా-సూచనల మేరకు మళ్లీ కొత్తగా డిజైన్ చేసింది
ప్రభుత్వం. కేసీఆర్ స్వయంగా ఈ బాధ్యతను తనపై వేసుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం
శరవేగంగా సాగుతున్నది. మిషన్ కాకతీయ పథకం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసానికి
గురైన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, పూడికతీత పనులు
జరుగుతున్నాయి.
గ్రామీణ
ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం చేయడానికి,
కులవృత్తులను ప్రోత్సహించాలని ఆర్ధిక సహాయం అందిస్తున్నదీ ప్రభుత్వం.
గొల్ల-కురుమలకు 75% సబ్సిడీ మీద పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ కార్యక్రమం
అమలవుతున్నది. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు యూనిట్ కు రు. 80,000 ల వ్యయంతో పాడిరైతులకు పాడిపశువుల పంపిణీ జరుగుతున్నది. చేపల
పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం చేప-రొయ్య పిల్లల్ని ప్రభుత్వం సరఫరా
చేస్తున్నది. చేనేత, పవర్లూం కార్మికుల స్థితిగతులను
మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అనేక పథకాలను అమలు
చేస్తున్నది.
నాయీ
బ్రాహ్మణులకు, రజకులకు, కల్లుగీత
కార్మికులకు, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సంచార కులాల, ఆశ్రిత కులాల సంక్షేమం కోసం ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటైంది. బ్యాంకులతో
నిమిత్తం లేకుండా నూటికి నూరు శాతం ఉచితంగా బీసీ కుల్లల వారందరికీ స్వయం ఉపాధి
కోసం ఆర్ధిక సహాయం అందచేస్తున్నది ప్రభుత్వం.
పేదరిక నిర్మూలనే
లక్ష్యంగా, అగ్రవర్ణ పేదలను ఆదుకోవడానికి ఆసరా
పెన్షన్లు, రేషన్ బియ్యం,
కల్యాణలక్ష్మి,
కేసీఆర్ కిట్స్ లాంటి పథకాలను అమలు పరుస్తున్నది ప్రభుత్వం. అన్నికులాల
వారికి హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయించాలని నిర్ణయించింది.
రు. 40,000 కోట్లతో అమలవుతున్న 40 కిపైగా సంక్షేమ పథకాలలో భాగంగా
వృద్ధులకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, నేత, బీడీ కార్మికులకు,
చేనేతవారికి, ఎయిడ్స్ బాధితులకు,
దివ్యాంగులకు, వృద్ధ కళాకారులకు, ఒంటరి
మహిళలకు, బోదకాలు బాధితులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నది
ప్రభుత్వం. అసహాయులందరికీ కనీస జీవన భద్రత కలుగుతున్నది. ఒక్కో వ్యక్తికీ ఆరు
కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది వున్నా అంతమందికి రూపాయికి కిలో చొప్పున బియ్యం
ఇస్తున్నది. సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లో వుంది.
పేదింటి ఆడపిల్లల
పెళ్లికి రు. 1,00116 ఆర్ధిక సహాయంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు
అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఇతరకులాలలోని ఆర్థికంగా వెనుకబడిన
వారి పిల్లల విదేశీ విద్యకు రు. 20 లక్షల స్కాలర్షిప్ అమల్లో వుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం
కోసం ప్రత్యేకంగా ప్రగతి పద్దు చట్టాన్ని పకడ్బందీగా అమలుపరుస్తున్నది ప్రభుత్వం.
వారికి జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నది. వారికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేసే విధంగా, ఒక ఏడాది ఖర్చు చేయని నిధులు మరుసటి సంవత్సరానికి బదలాయించే
విధంగా చట్టంలో రక్షణ వుంది. దేశంలో ఎక్కడాలేని రీతిలో దళితులకు మూడెకరాల భూమి
పంపిణీ కార్యక్రమం తెలంగాణాలో అమలవుతున్నది.
మైనారిటీల
సంక్షేమం కోసం అనేక పథకాలు అమల్లో వున్నాయి. అలాగే మహిళల సంక్షేమం కోసం, రక్షణ కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, షి-బృందాలు,
ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి లాంటి పథకాలున్నాయి. వివిధ రకాల
ఉద్యోగుల జీతాలు ఎప్పటికప్పుడు పెంచుతున్నదీ ప్రభుత్వం.
మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం
ఆవిష్కరించిన ఒక అద్భుతమైన ఇంటింటికి మంచినీటి సరఫరా పథకం. పేదలకు మెరుగైన వైద్యం
లభింప చేయాలని ప్రభుత్వాసుపత్రుల్లో వసతులను అభివృద్ధి చేసింది. వైద్య పరీక్షల
సౌకర్యం కలిగించింది. కొత్తగా వైద్యకళాశాలలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో
బస్తీ దవాఖానలను నెలకొల్పింది. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడానికి కేసీఆర్
కిట్స్ పథకం అమల్లో వుంది. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా 542 కొత్త గురుకులాలను, బీసీల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది.
తెలంగాణాకు హరితహారం ద్వారా కోట్లాది మొక్కలను నాటించింది ప్రభుత్వం. పాలాన
సంస్కరణల్లో భాగంగా మొత్తం 31 జిల్లాలు, 69 రెవెన్యూ
డివిజన్లు, 584 మండలాలు ఏర్పాటయ్యాయి. పంచాయితీల సంఖ్య 12,751 పెరిగింది. సింగిల్ విండో పారిశ్రామిక విధానం ద్వారా రు. 1,32,000 పెట్టుబడితో, 8.37 మందికి ఉపాధి కలిగే విధంగా, 7679 పరిశ్రమలు నెలకొన్నాయి. అన్ని రంగాలలో అభివృద్ధి తెలంగాణ
యాబై నెలల పాలనా ప్రగతి ప్రత్యేకత.
No comments:
Post a Comment