Sunday, August 19, 2018

రావణుడిని సభలో చూసిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


రావణుడిని సభలో చూసిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (20-08-2018)
ఇంద్రజిత్తు ఆలోచన చేస్తున్నప్పుడే, రాక్షసులు కోతిని తాళ్లతో కట్టి, కట్టెలతో కొట్తూ, పిడికిళ్లతో గుద్దుతూ తీసుకునిపోయి, రావణుడి ముందర నిలబెడ్తారు. "కోతిని తెచ్చాం" అంటే, "కోతి" అన్నమాట మొదట విన్న రావణుడు, ఇంద్రజిత్తును కూడా చంపేశాడేమోనని అనుకుంటాడన్న భయంతో, "తెచ్చాం కోతిని" అంటారు. వెంటనే ఆ సభలో వున్నవారందరూ: "వీడెవడు? ఎక్కడనుండి వచ్చాడు? ఎవరు పంపారు? ఏం పనుండి వచ్చాడు? ఎందుకిలా చేసాడు?" అని ఒకరితో ఒకరు అనుకుంటుంటే, ఇంకొందరు మదించిన గర్వంతో హేళనగా మాట్లాడసాగారు. "కట్టేయండి, కొట్టండి, కాల్చండి, మింగండి" అనడం మొదలెట్టారు వాళ్లు. ఇవన్నీ వింటూనే రామదూత హనుమంతుడు, రాక్షసుల వెంటపోయి రావణుడి పాదాలదగ్గర వున్న మంత్రులను, దిట్టలను, ముసలివారిని, సేవకులను, దివ్య రత్నఖచితమైన సభా మంటపాన్ని చూసాడు.

వికారమైన అకారమున్న రాక్షసభటులు, ఇరుప్రక్కలా ఈడ్చుకుంటూ.....రారా! అని సంభోదిస్తుంటే, వచ్చి ఎదుట నిలబడిన, భయంకర తేజమున్న హనుమంతుడిని రావణుడు చూసాడు. సూర్యకాంతితో, బలంతో, తేజంతో, కోపంతో, కఠిన ముఖంతో వున్న మహిమగల రావణాసురుడిని హనుమంతుడప్పుడే చూశాడు. భయంకరమైన తన ఇరవై కళ్లు ధగధగా మెరుస్తుంటే, తనదగ్గర కూర్చున్న బుధ్ధిమంతులైన మంత్రి శ్రేష్టులను, కులంలో, ఆచారంలో పెద్దలను, వీడెవ్వడో తెలుసుకోమని కోరాడు రావణుడు. వారు రాజాజ్ఞ ప్రకారం అలానే ప్రశ్నించగా, తాను వానర రాజైన సుగ్రీవుడు పంపితే వచ్చానంటాడు ఆంజనేయుడు. వీడొక కోతి, నీచ ప్రాణి. నేను రాజునుకద! నేరుగా నేను వీడితో మాట్లాడేదేమిటి? అని రావణుడి అహంకారం, స్వాతిశయం. మంత్రి ద్వారా హనుమంతుడిని ప్రశ్నించేట్లు చేస్తాడు. కానీ హనుమ మంత్రులకు నేరుగా జవాబు చెప్పడు. రావణుడితోనే మట్లాడుతాడు. రావణుడిని లక్ష్యపెట్టడు. మొదట రాముడిని కలిసినప్పుడు లక్ష్మణుడి ద్వారా హనుమంతుడికి జవాబిస్తాడు రాముడు.

రావణుడు చేయించిన పనులకు ఆశ్చర్యపడ్డ హనుమంతుడు, కోపంతో, ఎర్రటికళ్లతో, కలహానికి కాలుదువ్వుతున్న రావణుడిని నిర్లక్ష్యంగా చూశాడు. రావణుడున్న తీరు, ఆ కొలువుకూటం హనుమంతుడికెలా అనిపించిందంటే:


 వెలగల ముత్యాలతో చుట్టబడి, అసమానమైన కాంతిని విరజిమ్మే కిరీటం ధరించాడు. రావణుడు మనసుకు నచ్చిన బంగారు ఆభరణాలను ధరించి ప్రకాశిస్తున్నాడు. తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి, ఎర్రటి గంధం పూసుకుని సువాసనలు వెదజల్లుతున్నాడు. చూడ బుద్దేస్తున్నా తెరిస్తే భయం కలిగించే కళ్లున్నవాడు. మెరిసే కోరలు, వేలాడే పెదవి, పదితలలతో, పాములతో కూడిన మందర శిఖరంలా వున్నాడు. కాటుక కుప్ప లాంటి నల్లటిమెడలో, ముత్యాలదండలు, అందంగా కనపడుతుంటే, చంద్రబింబం లాంటి ముఖం కలిగున్నాడు. చిత్రాలు గీసి, స్ఫటికాలు, రత్నాలు చెక్కిన సింహాసనం పైన కూర్చుని వున్నాడు. రెట్టకడియాలు, చేతికడియాలతో, గంధంపూత రంగులో ఐదుతలల పాములా ప్రకాశిస్తున్న భుజాలతో తేజరిల్లుతున్నాడు. యువతులు తమ చేతి కంకణాలు గణగణా మ్రోగుతుంటే ఆయనకు వింజామరలు వీస్తున్నారు. భూమిని నాలుగు సముద్రాలు చుట్టుకొన్నట్లు ఆయన చుట్టూ మంత్రులు, ప్రహస్తుడు, నికుంభుడు, దుర్ధరుడు, మహాపార్శ్వుడు, ఆయనకు ఆలోచనలందిస్తున్నారు. దూరాన్నుంచే దేవతలు ఇంద్రుడిని కొలిచినట్లే, ఇతర మంత్రులు రావణుడికి ఎడంగా వుండి సేవిస్తున్నారు. మేరుశిఖరం చివరలో వుండే నీళ్లలాంటి మేఘంలా నల్లగా వున్నాడు రావణుడు.

ఇలావున్న రావణుడిని చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు ఆయన్ను గురించి "ఏమి రూపం,  ఏమి తేజం, ఏమి బలం, ఏమి ధైర్యం" అని అనుకుంటాడు. వాడి అవయవ సంపద చూసి చకితుడై పోతాడు. (హనుమంతుడు రాముడి దివ్యమంగళ విగ్రహాన్ని చూసాడు. ఇప్పుడు మళ్లీ రావణుడిని చూస్తున్నాడు. రాముడిని చూసి ఆయన కమల పత్రాక్షుడనీ, సర్వసత్త్వ మనోహరుడనీ అంటాడు. ఇలాంటి సౌందర్యం, సంపద, ఆకర్షణ ఇద్దరిలోనూ వున్నాయి. కానీ, రూప దాక్షిణ్య సంపన్నత, ఇతరుల పట్ల కరుణ,  రక్షించాలనే బుద్ధి రాముడిలోనే కనిపిస్తున్నాయి. రావణుడిలో లేవు. అందువల్లే రావణుడికంటే రాముడే గొప్ప అని నిశ్చయించుకుంటాడు) రాజులకుండాల్సిన చిహ్నాలన్నీ వున్నాయే ఇతడికి అనుకుంటాడు. ఇట్టివాడు ధర్మ విరుధ్ధమైన పనులే చేసి వుండకపోతే, ఇంద్రుడున్న స్వర్గాన్ని కూడా తన శక్తి, యుక్తులతో పరిపాలించేవాడుకదా! అని భావిస్తాడు. "కఠినమైన మనస్సుతో, భూతదయ లేకుండా ఉన్నందునే కదా జనులు దూషిస్తున్నారు. దేవదానవులు వణుకుతున్నారు. వీడుకోపించి, పరాక్రమించి, లోకాలన్నీ ప్రళయకాలంలోని సముద్రం లాగా చేయదల్చుకుంటే ఆ తేజస్సును అడ్డగించే వారుండరు కదా!" అనుకుంటాడు.

పచ్చటికళ్లున్న వానరుడిని, ఎదురుగా వున్న ఆంజనేయుడిని, ఎగాదిగా చూసి ఆలోచనలో పడ్డాడు రావణుడు. కైలాసపర్వతాన్ని పెళ్లగించినప్పుడు, తనను శపించిన నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చైనా వుండాలి లేదా, తన శత్రు పక్షంలోని బాణుడన్నా కోతిరూపంలో వచ్చి వుండాలని సందేహిస్తాడు. సందేహంతో, కోపంతో కళ్లెర్ర చేసాడు. వచ్చిన దుష్టాత్మకుడెవ్వడు? లంకకేపనిమీద వచ్చాడు? వీడిని పంపిందెవ్వరు? ఉద్యానవనాన్ని ఎందుకు పాడుచేసాడు? రాక్షస స్త్రీలనెందుకు బెదిరించాడు? యుధ్ధమెందుకు చేసాడు? ఈ విషయాలన్నీ అడగమని తన ముఖ్యమంత్రి అయిన ప్రహస్తుడిని ఆజ్ఞాపించాడు. వెంటనే అతడు రావణుడి ఆదేశం మేరకు కోతిజాతివాడా అని ఆంజనేయుడిని సంభోధిస్తూ ప్రశ్నిస్తాడు. ఊరడిల్లమనీ, భయపడవద్దనీ, నిజం చెప్పితే వదిలిపెట్తామనీ, అసత్యం చెప్తే ప్రాణాలతో వదలమనీ అంటూ, హనుమంతుడినెవరు తమ రాక్షసనగరానికి పంపించారని ప్రశ్నిస్తాడు ప్రహస్తుడు. "యముడా, కుబేరుడా, వరుణుడా, రాక్షసులను గెలవదల్చుకున్న విష్ణుమూర్తా" ?  ఎవరు పంపారని అడుగుతాడు. హనుమంతుడిలాంటి అసమాన పరాక్రమం సామాన్యకోతిలో వుండవనీ, ఆకారంలో వానరుడైనా వాస్తవానికి మారువేషంలో వచ్చిన మరెవరో అయ్యుండాలనీ కూడా అంటాడు. నిజం చెప్తే వదిలేస్తామనీ, అసత్యం చెప్తే మెడమీద తలుండదనీ భయపెడ్తూ, రాక్షసరాజు నగరానికి ప్రవేశించిన కారణం సర్వం విన్నవించమంటాడు ప్రహస్తుడు.

No comments:

Post a Comment