విల్లంబులు ధరించి బయల్దేరిన శ్రీరాముడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-20
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
దినపత్రిక (05-08-2018)
ముందు శ్రీరామచంద్రమూర్తి పోతున్నాడు. ఆయన వెనుక రామలక్ష్మణులకు మధ్యలో సీత
పోతున్నది. ఆమె వెనుక దనుర్ధరుడై లక్ష్మణుడు ప్రేమతో నడుస్తున్నాడు.
(ఇలా జరగడంలో ప్రణవస్వరూపం, ప్రణవార్థం వుందని వ్యాఖ్యాతలంటారు."ఓం"అనే
అక్షరానికి ప్రణవమని పేరుంది. ఈ ఓం అనేది కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు. దాంట్లో
అకార, ఉకార, మకారాల మూడక్షరాలున్నాయి.
"అ+ఉ"=సంధి కలిసి "ఓ" అయింది. దానికి "మ్" చేరగా
"ఓమ్" అయింది. ఇందులో అకారం, ఉకారం, రెండూ అచ్చులు కావడంతో సజాతీయాలు ఒక విజాతీయంతో కలిసి ఒక్కటైనందున దాన్ని
ఏకాక్షరమంటారు. ఇక ప్రణవానికి అర్థమేంటో తెలుసుకోవాలి. ఈ జగత్తు విష్ణువు వల్ల
పుట్టింది. ఆయనలోనే వుంది. ఈ ప్రపంచానికి స్థితి సంయమకర్త ఆయనే...ఆయనే జగత్తు.
జగత్సృష్టి, స్థితి, సంహారాలు చేసేవాడు
విష్ణువే. ఆయనే అకారవాచ్యుడంటారు. అకార, మకారాల మధ్యన వుండే
ఉకారం లక్ష్మీదేవిని గురించి చెప్తున్నది. సర్వదేవేశ్వరుడైన విష్ణువును అకారంతో
చెప్పడం జరిగింది. విష్ణువుతోఉద్దృతైన లక్ష్మీదేవిని ఉకారంతో చెప్పడం జరిగింది.
విష్ణువే శ్రీరామచంద్రమూర్తి. లక్ష్మే సీత. శేషుడే లక్ష్మణుడు. ఈ తత్వాన్ని
బోధిస్తూ వాళ్లు ఈ వరుసలో నడచారు. ఇందులో విష్ణువు, సర్వదా
లక్ష్మీ విశిష్టుడై వుంటాడుకాబట్టి విడిచి వుండడు.
ఇక ఉకారం లక్ష్మిని తెలుపుతుంది కదా! ఆ కారణాన జీవుడు ఈమెను దాటికాని
భగవంతుడిని చూడలేడు. ఈమెకే మాయ అని పేరుంది. ఈ మాయను దాటనివాడికి భగవత్ప్రాప్తి
లేదు. కాబట్టి జీవుడు ఆమెను అనుసరించి పోవాలి. జీవుడిని భగవంతుడికి కలపడమే ఆమె
కృత్యం. దీన్నే పురుషకారం అంటారు. కాబట్టు ఉకారం జీవాత్మ-పరమాత్మలకు నిత్య
సంబంధాన్ని చెప్తున్నది. ఈమె ఇరువురి మధ్యన వుండడం వల్ల భగవదనుగ్రహం ఆమె వల్లే
రావాలి. మూర్తీభివించిన భగవంతుడి కరుణే లక్ష్మీదేవి. భగవంతుడి ప్రాప్తి
లక్ష్మీదేవి వల్లే కలగాలికదా! మూర్తీభవించిన భగవంతుడి కరుణే లక్ష్మీదేవి. భగవంతుడి
ప్రాప్తి భగవంతుడి కరుణవల్లే కలగాలికదా! భగవంతుడు కూడా కరుణవల్లే కదా జీవుడిని
అనుగ్రహించాలి. విష్ణువు వక్షస్థలంలో కదా లక్ష్మీదేవి వుండేది! తన హృదయానికి
తెలియకుండా ఎవరైనా ఏపనైనా ఎలా చేయగలరు? కాబట్టి శిరస్సు విష్ణువనీ, కంఠం కింది మధ్యభాగం
లక్ష్మీదేవి అనీ, భగవత్ సంకల్పం ప్రకారమే లక్ష్మీదేవి
చేస్తున్నదనీ అర్థం. ఇక లక్ష్మణుడు శ్రీరాముడికి దాసుడుకానీ ఇతరులకు కాదుకదా!
శ్రీరాముడు ముందుపోవడం వల్ల ఆయనను అనుసరించి సీత, ఆమె వెనుక
లక్ష్మణుడు పోవడమంటే, ఈ ఇరువురికీ రక్షకుడు రాముడైనట్లు,
ప్రకృతికి-జీవుడికి ధారణ-పోషణకర్త భగవంతుడే అని స్పష్టమవుతున్నది.
లక్ష్మణుడు ఇరువురికీ వెనుకపోవడం వల్ల అయనకు సీతారాములిద్దరూ సేవ్యులే అని
అనుకోవాలి.
ఇదంతా సత్యమేకాని దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సీతారామలక్ష్మణులు మొదట అరణ్యంలో ప్రవేశించినప్పుడు,
లక్ష్మణుడు దారి చూపిస్తూ ముందు పోతుండేవాడు. దందకలో ప్రవేశించి
ఋషులతో స్నేహం అయినతరువాత రామచంద్రమూర్తి ముందు పోసాగాడు. ఈ మార్పుకు కారణమేంటి?
శ్రీరామావతారం అనుష్టాన అవతారమనీ, శ్రీకృష్ణావతారం
ఆచార్యావతారమనీ చెప్పడం జరిగింది. తన నడవడితో లోకులందరినీ సందేహం లేనివారిగా చేసి
ధర్మాన్ని గ్రహించేట్లు చేసినవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఋషిమయమైన
దండాకారణ్యం ప్రవేశించగానే ఆయన వెంట వారు రాసాగారు. వారందరూ భగవత్ ధర్మ
కర్మనిష్టపరులైనప్పటికీ అంతా ఒక రకం వారు కాదు. కాబట్టి తత్త్వ విచారంలో
సందేహాలున్నాయి వారికి. శ్రీరామాదులు అలా పోవడం వల్ల ఋషుల సందేహాలు ఎలా
తీరాయంటే....ఎల్లప్పుడూ ఋషులు బ్రహ్మవిచారంలోనే వుంటారు కాబట్టి ఈ ముగ్గురి స్థితి
వాళ్లకు ప్రణవాన్ని జ్ఞాపకానికి తెస్తుంది. ప్రణవానికి మూడక్షరాలున్నప్పటికీ,
ఏకాక్షరమని చెప్తారు. అలాగే, ప్రకృతి పురుష
విశిష్టుడైనా బ్రహ్మానికి అవి శరీరమని చెప్పడం వల్ల, శరీరం-శరీరి
ఒక్కటిగా లెక్కించినట్లే, బ్రహ్మం ఒక్కటే అని ఋషులు
గ్రహించారు. శ్రీరాముడు అరణ్యవాసం చేశాడంటే, సీతాలక్ష్మణులతో
చేసెననేకదా అర్థం?
ప్రపంచమంతా భగవంతుడే అన్నప్పుడు, స్థూలంగా మనకు కనపడే ప్రకృతినీ, దానికి జీవభూతుండైన
పురుషునీ, వీటిని శరీరంగాకల బ్రహ్మమును, మూడింటినీ ఒక్కటిగానే గ్రహించాలి. స్థూల శరీరం కనబడ్తుంది. సూక్షమైన
అంతర్యామి మనకు కనబడడం లేదు. వ్యష్ఠిగా భేద దృష్టితో చూస్తే, తత్త్వాలు మూడని చెప్పాల్సి వుంటుంది. సమిష్ఠిగా చూస్తే ఒక్కటనే చెప్పాలి.
ఈ మూడు ఏ దశలోనూ వేరు కాదు. ఏది, ఏకాలంలో, ఏ అవస్థలో వేరుపడకుండా, నిత్యంగా-సత్యంగా
అంటివుంటాయో, అది ఆ పదార్థంగానే చెప్పడం లోక వ్యవహారానుసారం.
ఎండను చెప్పినప్పుడు సూర్యుడు లేనిదిగానూ, సూర్యుడిని
చెప్పినప్పుడు ఎండలేనివానిగా గ్రహింపలేం. మూడు వేరని కూడా అనవచ్చు. ఒకటనికూడా
అనవచ్చు. జీవుడు కడతేరే మార్గం లక్ష్మణ చర్య-కైంకర్యం వల్ల నేర్చుకోవాలి. ఇప్పుడు
జీవుడైన లక్ష్మణుడు పరమాత్మ ఐన రామచంద్రమూర్తికి మధ్యలో సీత (ప్రకృతి) వున్నది.
ఆమె తెర అడ్దం తీస్తేనేకాని రాముడు లక్ష్మణుడికి కనబడడు. వారిరువురికి సేవచేస్తేనే
ఆ అడ్దం తొలగిపోతుంది. ఇది వారి అనుగ్రహంవల్ల రావాల్సిందేకాని మన ప్రయత్నం వల్ల
సాధ్యమయ్యేది కాదు. ఇలా గ్రహించిన ఋశీష్వరులు తమ సందేహాలను తీర్చుకున్నారు. ఈ
ప్రణవార్థం పరమార్థ తత్త్వాన్ని వివరంగా చూపుతున్నది).
సారవంతమై, కొత్తగా వికసించే కమలాల-కలువల
పరిమళాల గుమాయింపులతో ప్రకాశించే కొలకులను; నదీతీరాలలోని
ఇసుకదిబ్బలలో తిరిగే అందమైన చక్రవాక దంపతుల సమూహాలను, కొండల్లో
వున్న సుందర గుహల్లో పడుతున్న నీళ్ల పవిత్రమైన కొందవంకల ప్రవాహాలను, పూలతో అందమైన పొదల్లో గుంపులుగా ఝంకారం చెసే తుమ్మెదలను, భయంకరమైన అడవి పందులను, పెనుపాములను, అడవి దున్నపోతులను, ఏనుగుల సమూహాలను, సింహాలను, గుహల సమూహాలను చూసుకుంటూ పోయారు
సీతారామలక్ష్మణులు. ఇవన్నీ చూస్తూ దూరంగా పోయి, సాయం
సమయమైనందున, వేలాడేట్లున్న సూర్యబింబం కిరణాలతో
ప్రాకాశిస్తున్న ఒక యోజనం సమంగా పొదవైన ఒక తటాకాన్ని చేరారు. ఆడుతుమ్మెదల గుంపులతో
నల్లగా కనిపిస్తూ, తామరాకులతో, తామరపూలతో
మనోహరంగా కనిపిస్తూ, హంసలతో, అవ్యక్త
మధుర ధ్వనులతో వున్న ఆ తటాకం ఒడ్డునుంచి దాని తీరాన్ని చూసారు శ్రీరామలక్ష్మణులు.
No comments:
Post a Comment