Monday, August 13, 2018

హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో బంధించిన ఇంద్రజిత్తు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో బంధించిన ఇంద్రజిత్తు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (13-08-2018)
తండ్రిమాటలు విన్న ఇంద్రజిత్తు, వినయంతో ఆయనకు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తాడు. దేవతలతో సమానమైన బలమున్న ఇంద్రజిత్తు, గర్వంతో యుధ్ధానికి తగిన ప్రయత్నాలు చేసి, బంధువులందరి గౌరవాభిమానాల మధ్య, పున్నమినాటి సముద్రిడిలా పొంగిపోయి, గరుడవేగంతో సమానంగా పోగల గుర్రాలు కట్టిన రథమెక్కి ఇంటినుండి కదుల్తాడు. ఉత్తమోత్తమ రథికుడైన ఇంద్రజిత్, హనుమంతుడిని సమీపిస్తుంటే, అతడి రథచక్రాల ధ్వనినీ, అల్లెత్రాటి మ్రోతనూ విన్న ఆంజనేయుడు, తగినవాడే యుధ్ధానికి వస్తున్నాడని సంతోషంతో సింహనాదం చేసాడు. ఏం జరుగుతుందో చూద్దామని ఆకాశంలో సంచరించే నాగులు, యక్షులు, ఋషిశ్రేష్టులు గుమిగూడారు ఆనందంతో.

భయంకరమైన విల్లు, పదునైనబాణాలు పట్టుకుని యుధ్ధానికి పోతున్న ఇంద్రజిత్తు వేగానికి జంతువులు అరిచాయి, దిక్కులు కాంతిహీనమయ్యాయి, పక్షులు ఆకాశానికెగిరి కూయసాగాయి. ఇంద్రజిత్తు బాణవర్షాన్ని కురిపిస్తూ, హనుమంతుడి దగ్గరకు పోయేప్రయత్నం చేయగా, ఆయన కంఠధ్వనికి, కొండలు బద్దలయ్యి, భూమికదిలి, మేఘాలు చెదిరిపోయాయి. ఇంద్రజిత్తు వేస్తున్న బాణాలు, విచ్చలవిడిగా వచ్చి హనుమంతుడిని తాకాయి. ఈ వీరులిద్దరూ దేవదానవుల్లా విరోధంతో యుద్ధం చేయసాగారు. సందులేక వస్తున్న ఇంద్రజిత్తు బాణాలను అడ్డుకునేందుకు, దేహాన్ని పెంచిన ఆంజనేయుడు వాయుమార్గంలో తిరగసాగాడు. ఇంద్రజిత్తు బంగారుకొన ములుకు బాణాలను అతివేగంగా వేస్తుంటే, రాక్షసుల ఆనందానికి హద్దులేకుండాపోయింది. ఆంజనేయుడేమో, కోపంతో, ఇంద్రజిత్తు వేస్తున్న బాణాలను వ్యర్ధం చేయటానికీ, తనకు తగలకుండా చేసుకోవటానికీ, సకలప్రయత్నాలూ చేసాడు. కాసేపు ఆ బాణాలమధ్య వేగంగా తిరిగాడు. కాసేపు ఎదురుగా కనిపించాడు. కనిపించాడని బాణం వేసేలోపల, ఆకాశంలోకి ఎగిరిపోయేవాడు. ఇంతలోనే మీద దూకేవాడు. కాసేపు చేతులడ్డం పెట్టుకునేవాడు.

ఇద్దరూ యుద్ధంలో, సమర్ధులే! ఇద్దరూ అతివేగంగా, అంతులేని పరాక్రమంతో, భూతసమూహాలు ఆశ్చర్యపోతుంటే యుద్ధం చేసారు. వారిద్దరిలో తేడా కనిపించలేదు. ఒకరిలోపం ఇంకొకరికి తెలవడం కష్టమయింది. తన బాణాలన్నీ వ్యర్ధమైపోతుంటే, ఏంచేయాలన్న ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తు.

ఆంజనేయుడెంతకూ తనకు చిక్కడంలేదనుకున్న ఇంద్రజిత్, భుజబలంతో వీడిని చంపడం వీలుకాదనీ, ఏవిధంగానైనా కట్టేయాలనీ, భావించి బ్రహ్మాస్త్రం సంధించాడు. అది ఆంజనేయుడిని కట్టేయడంతో, కోతి నేలకూలిందని సంతోషించారు రాక్షసులు. కాళ్లూ, చేతులూ కదిలించలేక సోలిపోయిన ఆంజనేయుడు, బ్రహ్మ తనకిచ్చిన వరాన్ని గుర్తుచేసుకుంటాడు. భుజపరాక్రమం చాలించి, బ్రహ్మ ఆజ్ఞను దాటకుండడమే మేలని తలుస్తాడు. రాక్షసులకు కొంచెం సేపు చిక్కిపోయినా, తనకు వరాలిచ్చిన బ్రహ్మ, ఇంద్రుడు, తండ్రి వాయుదేవుడు, తన్ను రక్షిస్తుంటే, తనకొచ్చిన భయమేదీలేదనుకుంటాడు.


(ఇంద్రజిత్తు బుద్ధిహీనతకు ఇది ఒక దృష్టాంతం అనిపిస్తున్నది. అస్త్రాలన్నింటిలోనూ అవక్ర పరాక్రమం గలది బ్రహ్మాస్త్రమే! దానికి ఎదురులేదు. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని అల్ప కార్యాలను సాధించడానికి ప్రయోగించరాదు. ఆవేళ సీతమ్మ తృప్తికై కాకిని శిక్షించడానికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఇంద్రజిత్తు తన ప్రబల శత్రువైన రాముడిని తప్పించి హనుమంతుడిపైన వేయడమేమిటి? అవివేకం కాకపోతే! పైగా హనుమంతుడు దూతకదా! ఓర్పూ-నేర్పూ లేనివాడిగా ఇంద్రజిత్తు మిగిలిపోయాడు)

బ్రహ్మ రుద్రేందాదుల వరాలను పొందిన నిరుపమ పరాక్రమశాలి హనుమంతుడు. అతడిని ఏ అస్త్రాలూ బంధించలేవు. కించిత్తు దైవ శాపం వుంది కనుక హనుమను బ్రహ్మాస్త్రం కించిత్తు సమయమే బాధించగలిగింది. తరువాత విడిచి పెట్టింది. ఇది గమనించిన ఇంద్రజిత్తు ఇదంతా తన ప్రభావమే అనుకుంటాడు. అసమర్థతను సామర్థ్యంగా భావించిన ఇంద్రజిత్తును చూసి, ఇదీ తనకు మేలేనని భావిస్తాడు హనుమంతుడు.

వీళ్లకు చిక్కినా తన్నేమీ చేయలేరనీ, ఏంచేయాలన్నా రావణాజ్ఞ తప్పనిసరనీ, ధైర్యం తెచ్చుకుంటాడు. తనను పట్టుకుని రావణుడి దగ్గరకు తీసుకునిపోతారుకనుక, వాడితో మాట్లాడటానికీ, వాడి అభిప్రాయం తెలుసుకోవటానికీ, ఇదొక మేలైన అవకాశమని భావిస్తాడు. ఇలా ఆలోచిస్తూ హనుమంతుడు, కదలక, మెదలక వూరుకుండిపోయాడు. దుష్ట రాక్షసులు తనమీదపడి, నారతాళ్లతో, నారగుడ్డలు కలిపి, తన్ను కట్టేస్తుంటే, కోతిగుణం తెలిపేవాడిలా కేకలు వేయసాగాడు.

హనుమంతుడు పడిపోవడం చూసిన రాక్షసులు కోపంతో, బలమైన పగ్గాలను నారవస్త్రాలతో ముడేసి, కడు ప్రయత్నంతో తన్ను కట్టేస్తుంటే, రావణుడిని చూడవచ్చుకదా అన్న కోరికతో, ఆ కట్లు సహించి వూరుకున్నాడు ఆయన. రాక్షసులు తాళ్లతో, పగ్గాలతో, హనుమంతుడిని కట్టేయగానే, బ్రహ్మాస్త్రబంధాలు తెగిపోయాయి. బ్రహ్మాస్త్రబంధాలు మరో బంధాలతో కలిస్తే వ్యర్ధమైపోతాయి. అసమాన శక్తిగల ఈ అస్త్రం, ఈవిధంగా నిష్ప్రయోజనమైపోవడం చూసిన ఇంద్రజిత్త్తు, శోకిస్తూ, అయ్యో! ఎంతగొప్ప ప్రయత్నం ఇలా వ్యర్ధమైపోయిందేనని బాధపడ్తాడు. ఈ రాక్షసులు అజేయమైన మంత్రశక్తిమీద నమ్మకంలేక ఇలా చేసారుకదా! అనుకుంటాడు. ఈ అస్త్రం మళ్లీ ప్రయోగించలేమనీ, ఇది వ్యర్ధమైన చోట మరింకే అస్త్రం పనిచేయలేదనీ, ఇప్పుడేంగతనీ, రాక్షసులందరూ నాశనమైపోయే రోజొచ్చిందనీ బాధపడ్తాడు. తన దేహాన్ని కట్టేసిన అస్త్రబంధాలు వదిలిపోయిన సంగతి ఎరుగని ఆంజనేయుడు చిక్కుబడివున్నాడనీ, తెలిస్తే విజృంభిస్తాడనీ, అప్పుడేంగతనీ  ఇంద్రజిత్తు ఆలోచనలో పడిపోయాడు.

(ఇంద్రజిత్తు హనుమంతుడిని, "బ్రహ్మాస్త్రం"తో బన్ధిన్చిన తర్వాత, రాక్షసులు, తాళ్లతో, పగ్గాలతో తిరిగి కట్టేయగానే, బ్రహ్మాస్త్ర బంధాలు తెగిపోయాయి. బ్రహ్మాస్త్ర బంధాలు మరో బంధాలతో కలిస్తే, ఆ బంధాలు విడిపొయినట్లే! దీనర్థం: ప్రపత్తి చేసినవాడు, దాని మీద విశ్వాసం లేక పోతే, ప్రపత్తికి సహాయ పడుతుందని వేరే సాధనాన్ని వుపయోగిస్తే, "ప్రపత్తి" చెడిపోతుంది. ప్రపత్తి లో వున్న అపాయం ఇదే! ఇతర "ఉపాయాల"ను అది సహించదు. ఉత్తములు నీచ సహవాసాన్ని సహించరుకదా! అంతే భరన్యాసం చేసినవాడు మళ్లీ సొంత ప్రయత్నం చేస్తే వాడికి భరన్యాస ప్రభావం మీద నమ్మిక లేనట్లే! భరన్యాసం చేసినవాడు అకించనుడిగా భావిస్తూ వుండాలని పెద్దలంటారు)

No comments:

Post a Comment