Showing posts with label శమీ శమయతే పాపం. Show all posts
Showing posts with label శమీ శమయతే పాపం. Show all posts

Thursday, June 6, 2013

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part TWO: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part TWO
వనం జ్వాలా నరసింహారావు

బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా అక్కయ్యతో పాటు మాకూ సంబరమే! దసరా పండుగకు ముందు వచ్చేది బతుకమ్మ పండుగ. ఒక విధంగా దసరా, బతుకమ్మ పండుగలు ఏక కాలంలోనే జరుపుకుంటాం. బతుకమ్మ పేర్చడానికి కావాల్సిన పూలను మేం ఇంటింటికి వెళ్లి సేకరించేవాళ్లం. మా జీతగాళ్లు తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లు. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. ఒక్కొక్కరి స్థోమతను బట్టి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ ఒక సంరక్షిత దేవత. తెలుగువారు, అందులో తెలంగాణ వారు ప్రముఖంగా పూజించే దేవత బతుకమ్మ. బతుకమ్మ బొమ్మను వుంచాల్సిన పళ్లెం, ఆకులతో కాని, వెదురుతో కాని చేసే వాళ్లు. గుమ్మడి పూలు పళ్లెంలో అమర్చి, చుట్టూ ఇతర పూలను చేర్చి, పసుపుతో తయారు చేసిన బతుకమ్మ (గౌరమ్మ) ను వుంచేవారు. ఇలాంటివే మరికొందరు చేసిన వాటిని ఒక స్థలంలో వుంచి పూజిస్తారు. ధర్మాంగ-సత్యవతి దంపతులకు లక్ష్మీదేవి కటాక్షం వల్ల పుట్టిన బిడ్డ బతుకమ్మ. బతుకమ్మను ఆడేటప్పుడు పాటలు పాడుతూంటారు స్త్రీలు. ఉదాహరణకు..."ఒక్కొక్క పూవేసి చందమామ, ఒక్క ఝాము ఆయె చందమామ, పోయిరా గౌరమ్మా, పోయిరా గౌరమ్మా, పోయి అత్తవారింట్లో గౌరమ్మా, బుద్ధిగా వుండాలి గౌరమ్మా...." అనే పాటలు పాడేవారు. కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మ చెక్క లాడడం, బతుకమ్మ పండుగలో భాగం. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. ఓ గుడి ముందో, లేకపోతే ఎవరో ఒకరి ఇంటి ముందో దీనికి అనువుగా వుండే స్థలాన్ని ఎంపిక చేసుకునేవారు. ఎనిమిది రోజులపాటు...అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలెట్టి, తొమ్మిదో రోజున మా వూరు సమీపంలోని ముత్తారం పక్కన వున్న వూర చెరువు దగ్గర చద్దుల బతుకమ్మ ఆడేవారు. ఆడి, బతుకమ్మను నీటి ఒడిలో చేర్చేవారు. చద్దుల బతుకమ్మ రాత్రి బాగా పొద్దుపోయే దాకా ఆడేవారు. స్త్రీలతో పాటు పురుషులు కూడా వచ్చి దూరం నుంచి చూసి ఆనందించేవారు. ఐదు రకాల ప్రసాదాలను ఆ పండుగలో పంచి పెట్టే వారు. పెసర పప్పు, గోధుమ పిండి, బియ్యం పిండి, కొబ్బరి, అల్లంతో తయారు చేసినవవి. ఒకప్పుడు తెలంగాణ మొత్తం విరివిగా ఆడే బతుకమ్మ, నగరాల్లో దరిమిలా దాదాపు కనుమరుగై, గ్రామాల్లో కూడా అదే స్థితికి చేరుకుని, మళ్లీ ఇటీవలే తెలంగాణ జాగృతి పుణ్యమా అని గత వైభవాన్ని గుర్తుకు చేస్తోంది. బతుకమ్మ పండుగను బలే ఎంజాయ్ చేసే వాళ్లం మేం.

బాల్యంలో...ఆ మాటకొస్తే కొంచెం పెద్దైన తరువాత కూడా ఆనందంతో జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు. దసరాకు, మా ఊరూ-వాడా, వూరి బయట పైలు పెంట సమీపంలో, పాఠశాలకు ఎదురుగా, పాతిన జమ్మి చెట్టు దగ్గర గుమిగూడి, "శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం" అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. విజయ దశమి (దసరా) కి, మా ప్రాంత పరిసరాలకి కొంత అవినాభావ సంబంధముంది. మా వూరికి అతి సమీపంలో వున్న "బాణాపురం" గ్రామ సరిహద్దులలోని జమ్మి చెట్టుపైనే, పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందర, వారి శస్త్రాస్త్రాలను వుంచారట. అదే విధంగా, సమీపంలోని మరో గ్రామం నేలకొండపల్లిలో "విరాటరాజు గద్దె" వుంది. భీముడు వంట చేసిన పెద్ద గాడి పొయ్యిలు కూడా వున్నాయి. ఇప్పుడా గద్దె పురా తత్వ శాఖ వారి ఆధీనంలో వుంది. దసరా పండుగ రోజుల్లో మా ఇంట్లో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసేవారు. ఇక వూరి బయట వున్న జమ్మి చెట్టు వద్ద, "యాట" (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు. సాధారణంగా గ్రామాల్లో దసరా పండుగ నాడు నివురు గప్పిన నిప్పులా వున్న తగాదాలే మన్నా వుంటే బయట పడతాయి. ఒక ఏడాది మా వూళ్లో అదే జరిగింది. మా గ్రామ రాజకీయాలనే పూర్తిగా మార్చి వేసిన ఆ వివరాలు మరో సందర్భంలో ప్రస్తావిస్తాను.

మేం ఆనందంగా జరుపుకుంటుండే మరో పండుగ దీపావళి. దీపావళికి మా చిన్నతనంలో "రోలు-రోకలి" అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు. అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా) లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. అదే విధంగా, రాత్రిపూట కాల్చుకునే టపాసులు ఎంతో ఆనందాన్ని కలిగించేవి. అన్ని టపాసుల్లోకి చీమ టపాకాయలు  బలే మజా వచ్చేవి. దీపావళి నాడు కాల్చగా మిగిలినవి బధ్రపర్చుకుని, కార్తీక పౌర్ణమికి కాల్చే వాళ్లం. ఆ రోజున ముత్తారం దగ్గరలో వున్న వూర చెరువులో దేవుడి "తెప్ప ఉత్సవం" జరిగేది. దీపావళి పండుగకు ముత్తారం నుంచి దేవుడి ఉత్స విగ్రహాలను వూరేగింపుగా మా వూళ్లోకి తీసుకొచ్చేవారు. కొఠాయి మీద వుంచి పూజలు చేసే వాళ్లు. ఆ రోజంతా హడావిడే. చాలా సరదాగా గడిచేది. ముక్కోటి ఏకాదశికి కూడా దేవుడు వూళ్లోకి వచ్చేవాడు. ముక్కోటి రోజుల్లో జొన్న పంట "వూస బియ్యం" తయారయ్యేవి. జొన్న కంకులలోంచి అవి కొట్టుకుని వుడకబెట్టుకుని తింటుంటే బలే సరదాగా వుండేది.

మా ఇంటి ముందు భాగాన వున్న ధాన్యం పాతర్లు

మరో పండుగ "సంక్రాంతి". ఆ పండుగ రోజుల నాటి గొబ్బిళ్లు, హరిదాసులు, "గంగిరెద్దులు", రేగు పళ్లు....మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి. సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. మా జొన్న కల్లం మా ఇంటి పక్కనే తోటలో వేసే వాళ్లం. ధాన్యం కొలవడానికి ఉపయోగించే "కుండ" లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" మా వూరి రైతుల్లో అతి కొద్ది మందికి మాత్రమే వుండేవి. మా ఇంట్లో వుండేవి. ధాన్యం కొలవడానికి మా ఇంటి నుంచి చాలా మంది తీసుకెళ్తుండేవారు. కుండకు పదిన్నర మానికలు...మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు...తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు...సోలకు నాలుగు గిద్దెలు...ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. కొలత కొలిచేటప్పుడు కుండకు కాని, మానికకు కాని, తవ్వకు కాని, సోలకు కాని, గిద్దెకు కాని, ధాన్యం పూర్తిగా నిండి పై వరకు వచ్చే విధంగా పోయాలి. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. ఆశ్చర్యకరమైన విషయం....పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. రాజకీయ కొట్లాటలున్న గ్రామాలలో తప్ప, మిగతా చోట్ల ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది. పొలంలో కల్లం పూర్తైన తరువాత, వూళ్లోని కొంత మందికి "మేర" అని ఇచ్చే ఆచారం వుండేది. గ్రామంలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, నీరుకాడు, షేక్ సింద్....ఇలా కొద్ది మందికి కల్లంలో కొంత ధాన్యం వారు ఏడాది పొడుగూ చేసే పనులకు ప్రతిఫలంగా ఇవ్వడం ఆనవాయితీ. ఆ ప్రక్రియ అంతా కళ్లల్లో మెదుల్తూంది.

అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు చిన్నతనం నుండి నేటి వరకు హాజరవుతూనే వున్నాం. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. ముత్తారంలోనే స్థిరపడి పోయిన వనం గోపాలరావు బాబాయింట్లో అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు.

మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా జరుపుకునే పండుగ "పీర్ల పండుగ". గ్రామంలో బత్తుల వారి ఇంటి సమీపంలో "పీర్ల గుండం" వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి, ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు. మా కుటుంబానికి వంశ పారంపర్యంగా "హస్సేన్-హుస్సేన్" పీర్లుండేవి. ఏడవ సరగస్తు నాడు వాటిని బయటకు తీసేవారు. కుదాయ్ సాహిబ్ వీటిని నిర్వహించేవాడు. 

చిన్నతనంలో మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం (రాత్రవుతుండగానే) జరిగే ఒక కార్యక్రమం నాకింకా గుర్తుంది. మాది పెద్ద వ్యవసాయం. జీతగాళ్లు కూడా పది మందికి పైగా వుండేవారు. రోజువారీ కూలీకి వచ్చే వాళ్లు కూడా కొందరుండేవారు. పొలం పనులు చూసుకుని ఇంటికి తిరిగొచ్చి, పశువులకు ఆ రోజుకు వేయాల్సిన దానా, ఇతర పనులు పూర్తైన తరువాత జీత గాళ్లకు "పొగాకు" పంచే కార్యక్రమం మొదలయ్యేది. జీత గాళ్లకు ఏటా ఇచ్చే జీతంతో పాటు, ఏడాదికి రెండు జతల చెప్పులు, ప్రతి రోజు తాగడానికి (పీల్చడానికి) పొగాకు (లేదా బీడీలు) ఇవ్వడం ఆనవాయితీ. మా నాన్న గారు ఒక కుర్చీలో కూచుని, హుందాగా ప్రతి రోజు పొగాకు కాడల పంపకం చేసేవారు. ఒకే సారి నెలకో-పదిహేను రోజులకో కలిపి ఇవ్వక పోయేవారు. పొగాకు పంపిణీ జరిగే సమయంలోనే ఆ రోజు పొలం పనులను సమీక్షించేవారు. జీత గాళ్లకు పొగాకు ఇవ్వడానికి మేం పొగాకు పంట కూడా వేసే వాళ్లం మొదట్లో. ఆ తరువాత రోజుల్లో పొగాకు పంట వేయడం ఆపుచేశాక బీడీలు పంపకం చేసే వాళ్లం