Showing posts with label ఇ.ఎం.ఆర్.ఐ. Show all posts
Showing posts with label ఇ.ఎం.ఆర్.ఐ. Show all posts

Wednesday, September 19, 2012

సింగపూర్‌లో అందరికీ అందుబాటులో ఆరోగ్య వైద్య సదుపాయం: వనం జ్వాలా నరసింహారావు


సింగపూర్‌లో అందరికీ అందుబాటులో ఆరోగ్య వైద్య సదుపాయం
వనం జ్వాలా నరసింహారావు

సింగపూర్‌లో అమల్లో వున్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారని, సింగపూర్ జనరల్ ఆసుపత్రిలో ప్రొఫెసర్-సీనియర్ కన్సల్టెంట్‍గా పని చేస్తున్న భారతీయుడు డాక్టర్ వి. అనంతరామన్ చెప్పారు. సింగపూర్‌కు వెళ్లిన నేను, భారత దేశంలోని పలు రాష్ట్రాలలో 108-అత్యవసర వైద్య సహాయ సేవలను అందిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‍మెంట్-రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) లో పనిచేస్తున్న రోజుల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చిపోతుండె అనంతరామన్‍ను కలవడానికి, ఆయన పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, సుమారు రెండు గంటలు ఆయనతో గడిపాను. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలో అనేక ఔట్ పేషంట్-ఇన్ పేషంట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, సింగపూర్‌లోని పౌరులకు-విదేశీయులకు వారి-వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన వైద్య సౌకర్యం కలిగిస్తున్నాయని అనంతరామన్ అన్నారు. ఇందులో ప్రాధమిక ఆరోగ్య-వైద్య సదుపాయం, ముందస్తుగానే జబ్బులు రాకుండా అరికట్టేందుకు అవసరమైన వైద్య సౌకర్యంతో పాటు, ఆరోగ్య సంబంధిత మైన విద్యావిధానాన్ని అమలు పర్చడం చేస్తోంది సింగపూర్ ప్రభుత్వం. ఆ దేశంలో అమలవుతున్న ఆరోగ్య-వైద్య సౌకర్యాల గురించి వివరంగా మాట్లాడారు అనంతరామన్. భారత దేశంలో మాదిరిగానో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానో కాకుండా, సింగపూర్‌లో నూటికి ఎనభై శాతం మేర ప్రాధమిక వైద్య సౌకర్యం సుమారు 2000 వరకూ వున్న ప్రయివేట్  ఆసుపత్రులలో లభ్యమవుతుంది. ప్రభుత్వ పరమైన పాలీ క్లినిక్‌లు కేవలం 18 మాత్రమే. భారతదేశంలో, అందునా ఆంధ్ర ప్రదేశ్‌లో, ప్రయివేట్ రంగంలో ఎక్కువగా స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం మాత్రమే వుంటుంది. ప్రాధమిక వైద్య సౌకర్యం దాదాపు లేనట్లే. సింగపూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో 80% స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం దొరుకుతుంది. ఆసుపత్రి పడకల సంఖ్య కూడా ప్రభుత్వ రంగంలోనే అధికం-సుమారు 80% పైగా. ప్రయివేట్ ఆసుపత్రులలో కేవలం 20% మాత్రమే! డాక్టర్ల సంఖ్య కూడా అంతే. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేవారి సంఖ్య 80% కాగా, ప్రయివేట్ రంగంలో 20% మంది మాత్రమే వున్నారు. 

                సుమారు 52 లక్షల జనాభా,  704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగిన సింగపూర్ దేశమంతా అదే పేరు కలిగిన ఒక పెద్ద నగరం. బహుశా ప్రపంచంలో అలాంటివి అతి తక్కువగా వున్నాయి. ఆసియా ఖండం మొత్తంలో అత్యున్నత ఆరోగ్య వైద్య ప్రమాణాలను పాటిస్తున్న దేశం సింగపూర్. 1965 లో సింగపూర్‌కు స్వాతంత్ర్యం లభించిన కొద్ది రోజుల్లోనే, అప్పటికే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అంటువ్యాధులను ముందస్తుగానే అరికట్టే ప్రక్రియ ఆరంభమైంది. పెద్ద ఎత్తున ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దరిమిలా, భవిష్యత్‍లో ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా జాగ్రత్త పడేందుకు 1983 లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. రాబోయే 20 సంవత్సరాలలో చేపట్టి అమలుపర్చాల్సిన ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన గురించి ఒక నిర్దుష్ట కార్యక్రమాన్ని రూపొందించింది. ఏటేటా ఆ కార్యక్రమాన్ని సమీక్షించి తప్పులను సరి దిద్దుకుంటూ ముందుకు సాగుతోంది.

 సింగపూర్ జనరల్ ఆసుపత్రి-ఎస్.జి.హెచ్

సింగపూర్ ఆరోగ్య వైద్య విధానంలో అత్యంత కీలకమైన "మెడి సేవ్"-వైద్య పొదుపు పధకానికి నాంది పలికింది. సింగపూర్‌లో మూడు విభాగాల ఆరోగ్య వైద్య నియంత్రణ వ్యవస్థలున్నాయి. మొదటిది ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెండోది కేంద్రీయ భవిష్యత్ నిధి, మూడోది సింగపూర్ మానిటరీ అథారిటీ. ఆరోగ్య సంరక్షణ సేవల పూర్తి పర్యవేక్షణ బాధ్యత మంత్రిత్వ శాఖదే. పొదుపు పధకాన్ని అమలు పర్చాల్సిన బాధ్యత భవిష్యత్ నిధిది. సింగపూర్ పౌరులందరూ-శాశ్వత నివాసీయులందరూ, వర్తమానంలోను, భవిష్యత్‍లో పదవీ విరమణ చేసిన తరువాత ముసలితనంలోను, తమ పోషణ బాధ్యత-ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలలో, తామే విజయవంతంగా తమపై వేసుకునే విధంగా భవిష్యత్ నిధి చర్యలు తీసుకుంటుంది. బీమా రంగానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించి, భీమాదారులెలాంటి ఇబ్బందులకు గురి కాకుండా-వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను, సింగపూర్ కేంద్రీయ బాంక్ లాగా, మానిటరీ అథారిటీ వ్యవహరిస్తుంది. ఈ మూడు వ్యవస్థలు ఒకదానికి మరొకటి సరైన సహాయ సహకారాలు అందించుకుంటుంది.

సింగపూర్ మొత్తంలో, పదమూడు ప్రయివేట్ ఆసుపత్రులు, పది ప్రభుత్వ ఆసుపత్రులు, అనేక స్పెషలిస్ట్ క్లినిక్‌లు వున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన చార్జీలు అమల్లో వున్నాయి. పేషంట్లు తమకిష్టమైన సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు, తాను వెళ్లదల్చుకున్న ప్రభుత్వ-లేదా-ప్రయివేట్ ఆసుపత్రికి కాని, పాలీ క్లినిక్‌కు కాని వెళ్లవచ్చు. ఎమర్జెన్సీ సేవలైతే 24 గంటలు అందుబాటులో వుంటాయి. ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులన్నీ కూడా అధునాతన వైద్య సదుపాయాలను కలిగి వుంటాయి. అక్కడా-ఇక్కడా కూడా అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఎప్పుడో, 2000 సంవత్సరం నాటికే సింగపూర్ ఆరవ రాంకు సంపాదించింది. శిశు మరణాల విషయంలో అత్యంత తక్కువ శాతం సింగపూర్‌లోనే. ప్రసూతి మరణాలు దాదాపు లేనట్టే. 

ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా విధానంలో మూడు రకాలున్నాయి. మొదటిది "మెడిఫండ్". దీని ద్వారా, తమంతట తాము ఎలాంటి పద్ధతిలోను వైద్య ఖర్చులు భరించలేని వారికి ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వమే కలిగిస్తుంది. ఇదొక రకమైన శాశ్వత నిధి. రెండోదైన "మెడిసేవ్" ద్వారా, దాదాపు 85% మంది జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదొక రకమైన నిర్బంధ పొదుపు విధానం. మూడొదైన "మెడిషీల్డ్" కింద ప్రభుత్వమే ఒకరకమైన ఆరోగ్య భీమా పథకం అమలు పరుస్తుంది. నిర్బంధ పొదుపు ద్వారా, సబ్సిడీ విధానం ద్వారా, ధరలు అదుపు చేయడం ద్వారా, మెడిషీల్డ్ అమలు సులభతరమవుతుంది. అన్నింటిలోకి ప్రధానమైంది "మెడి సేవ్". ఇది మరొక రకమైన జాతీయ ఆరోగ్య భీమా ప్రణాళిక. మెడిసేవ్ పథకాన్ని ఏప్రిల్ 1984 లో, జాతీయ వైద్య పొదుపు గణాంక పద్ధతిన, ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. తక్షణం ఆసుపత్రిలో చేరడానికి, ఔట్ పేషంట్ విభాగంలో చికిత్స పొందడానికి, డే సర్జరీకి ఈ పొదుపు ఖాతాను ఉపయోగించవచ్చు. ప్రతి ఉద్యోగి తమ ఆదాయంలో, వారి-వారి వయసుకు అనుగుణంగా, 6.5-9.0% మేరకు,  తమ వ్యక్తిగత మెడిసేవ్ అకౌంట్‍‍లో జమ చేస్తారు. అలా పొదుపు చేసిన డబ్బు నుంచి, వైద్య-ఆరోగ్య బిల్లులు చెల్లించవచ్చు. సింగపూర్‌లో నిరుద్యోగం కేవలం రెండు శాతం లోపే. అంటే, దాదాపు అందరికీ పొదుపు చేసే వీలుంటుంది. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పొదుపు ఖాతాదారులైతే, వారందరిదీ పూల్ చేసి కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు. ప్రతి వ్యక్తికీ, వారు చికిత్స పొందే సమయంలో, వారు ఎంపిక చేసుకునే మూడు రకాల సబ్సిడీలలో ఒకటి వర్తిస్తుంది.

ప్రభుత్వ పరంగా కాని, ప్రయివేట్ పరంగా కాని, ఏ స్థాయి సబ్సిడీ పొందుతున్న వారికి కాని, సింగపూర్ జాతీయ ఆరోగ్య ప్రణాళిక ప్రాధమిక సూత్రం ప్రకారం, "ఉచితం" అనే మాట వారి నిఘంటువులో అసలే కనిపించదు. ఏదీ-ఎవరికీ ఉచితం కానే కాదు. అలాగే, ఎవరికీ-ఎట్టి పరిస్థితుల్లోను, ఆరోగ్య వైద్య సేవలను నిరాకరించే ప్రసక్తే లేదు. రోగి ఫీజు కట్టాడా-లేదా అనే విషయాన్ని వైద్య సేవలను అందించడానికి ముడి పెట్టే సమస్యే లేదు. భారత దేశంలోను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోను వున్న ప్రయివేట్-ప్రభుత్వ ఆసుపత్రిలో-పాలీ క్లినిక్‌లలో మాదిరిగా కాకుండా, పేషంటు దగ్గర ఫీజు మొత్తాన్ని, మందులతో సహా, డిశ్చార్జ్ చేసేంతవరకు వసూలు చేయరు. వాళ్లు బిల్లు చెల్లించినా, చెల్లించ లేకపోయినా డిశ్చార్జ్ నిలుపుదల చేయరు. ఫీజు చెల్లించకుండా వెళ్లిన వారి విషయంలో, అది రాబట్టుకొనేందుకు వేరే యంత్రాంగం తరువాత కృషి చేస్తుంది కాని కట్టేంతవరకు డిశ్చార్జ్ చేయమని అనరు. ఫీజు కట్టకుండా వెళ్లి పోయేవారెంతమంది అని డాక్టర్ అనంతరామన్‍ను అడిగినప్పుడు, ఒక శాతం లోపే అని సమాధానం వచ్చింది. వారు కూడా సాధారణంగా కట్టలేని విదేశీయులే! ఏదీ ఉచితం లేకపోవడానికి కారణం, అనవసరంగా ఎవరూ వైద్య సేవలను దుర్వినియోగం చేయకూడదనే. వైద్య ఖర్చులు వారి-వారి స్థాయి సబ్సిడీని పట్టి వున్నప్పటికీ, "ఔట్-ఆఫ్-పాకెట్" వ్యయం మాత్ర్తం స్థాయిని బట్టి మారుతుంటుంది. ఎక్కువ స్థాయి సబ్సిడీ లభించే వారికి "ఔట్-ఆఫ్-పాకెట్" ఖర్చులు కూడా ఎక్కువగానే వుంటాయి. తక్కువ వారికి అంతగా వుండవు. మొత్తం మీద వారికీ-వీరికీ చివరకు పడేది దాదాపు ఒకే రకం భారం. క్రమేపీ పెరుగుతున్న ప్రయివేట్ రంగం వైద్య సేవలను ఎక్కువగా, ప్రయివేట్‌గా భీమా చేయించుకున్నవారు, విదేశీయులు, ఖర్చు భరించగల శక్తి వున్నవారు, "ఔట్-ఆఫ్-పాకెట్" ఖర్చుకు భయపడని వారు, ఉపయోగించుకుంటున్నారు. ఎంతగా ప్రయివేట్ రంగం విస్తరిస్తున్నప్పటికీ, ఇప్పటికీ, 70-80% మంది సింగపూర్ దేశీయులు ప్రభుత్వ పరంగానే వైద్య సేవలను పొందుతున్నారు.

సింగపూర్ జనరల్ ఆసుపత్రి-ఎస్.జి.హెచ్, ఆదేశం మొత్తంలో, అతి పెద్ద-పురాతనమైన ఆసుపత్రి. దాని పునాదులు 1821 లో వేయడం జరిగింది. "సింగ్ హెల్త్" అనే పేరుతో, ఆ గొడుగు కింద, ప్రభుత్వ రంగంలోని అనేక స్పెషలిస్టు ఆసుపత్రులు నడుస్తున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రి, కాన్సర్ ఆసుపత్రి, హృద్రోగ ప్రత్యేక ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, డెంటల్ ఆసుపత్రి, న్యూరో ఆసుపత్రి ఆ గొడుగు కింద పనిచేస్తాయి. ఎస్.జి.హెచ్ లో సుమారు 600 మందికి పైగా వైద్యులు, 29 క్లినికల్ స్పెషాలిటీల్లో పని చేస్తున్నారు. ప్రతి పేషంటుకు వ్యక్తిగతంగా వారి-వారి వైద్య అవసరాలకు అనుగుణంగా, నిబద్ధతతో పనిచేస్తారీ డాక్టర్లు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో తప్ప, మామూలు పరిస్థితుల్లో పేషంటును ఆసుపత్రిలో చేర్చుకోవాలంటే, ఆ అవసరం వున్నదని, ఎవరో ఒక స్పెషలిస్ట్ సూచించాలి. అడ్మిషన్ డేట్ తేలిన తరువాత, ముందస్తు జాగ్రత్తలెన్నో పేషంటుకు వివరిస్తారు. వాళ్లకు ఏ రకం సబ్సిడీ లబిస్తుందో, ఆ స్థాయికి తగ్గ గదులనే కేటాయిస్తారు. డార్మెటరీ కూడా కావచ్చు. అడ్మిషన్‌కు ముందుగానే, ఫీజు చెల్లించే విధానం, అవసరమైన డాక్యుమెంట్ల విషయం, అందాజాగా ఫీజు మొత్తం వివరించడం జరుగుతుంది. అడ్మిషన్ కంటే ముందే, ఎక్స్-రే, రక్త పరీక్షలు, ఇ.సి.జి లాంటి అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు.

సింగపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాని, ప్రభుత్వ స్పెషలిస్ట్ కేంద్రాలలో కాని, పాలీ క్లినిక్‌లో కాని, చికిత్సకు వెళ్లిన వారి క్లినికల్ పరీక్షల వివరాలను, "నేషనల్ ఎలెక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ సిస్టం" అనే పేరుతో, ఒక సెంట్రలైజ్డ్ డాటా బేస్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పేషంట్ మెడికల్ హిస్టరీ మొత్తం ఒకే చోట బధ్ర పరిచి, కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఆరోగ్య కేంద్రాలు ఒకే గొడుగు కింద పనిచేసే ఈ విధానం వల్ల, ఒక సారి ఒకచోట క్లినికల్ టెస్టులు చేయించుకున్న పేషంటు, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు, ఆయన దగ్గర కంప్యూటర్లో ఇవి చూసే వీలుంటుంది. మళ్లీ-మళ్ళీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా, సమయం వృధా కాదు.  

సింగపూర్ జనరల్ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఎమర్జెన్సీ శాఖలో, ప్రతి షిఫ్ట్ లోను, ఒక సీనియర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ తప్పనిసరిగా పనిచేస్తుంటారు. పేషంట్ రోగ తీవ్రతను బట్టి, అవసరానికి అనుగుణంగా, ప్రాధాన్యతా స్థాయిని ఎంపిక చేస్తారు. ఫలానా చోట వారికి అవసరమైన చికిత్స జరుగుతుందంటూ, వారిని, అక్కడకు వెంట తీసుకెళ్తుంది ఆసుపత్రి సిబ్బంది. నాలుగు రకాల ప్రాధాన్యతా పరమైన వెయిటింగ్ ప్రదేశాలుంటాయి. తీవ్రంగా బాధ పడుతున్న పేషంట్లకు ఒక విధంగా, మేజర్ ఎమర్జెన్సీకి ఇంకో విధంగా, మైనర్ ఎమర్జెన్సీలకు మరో విధంగా, ఎమర్జెన్సీ కాదని భావించిన వాటికి వేరే విధంగా చికిత్స ప్రారంభమవుతుందక్కడ. జ్వరాలతో బాధపడుతూ వచ్చే పేషంట్లను, వారి ఇన్‌ఫెక్షన్ ఇతరులకు తగలకుండా, మరో ప్రత్యేకమైన ప్రదేశానికి తరలిస్తారు.

సింగపూర్లో అత్యవసర వైద్య సహాయ సేవలను, "ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్" పేరుతో, "సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్" నిర్వహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో 108 సేవల వలనే, ఇక్కడ 995 నంబర్‌కు ఫోన్ చేసి ఈ సేవలను పొందవచ్చు. జీవన్మరణ సమస్య తలఎత్తినప్పుడు మాత్రమే 995 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరాలి. ఫోన్ చేసిన వెంటనే 108-అంబులెన్స్ తరహాలోనే ఇక్కడా అంబులెన్స్ వస్తుంది. వైద్య సహాయం కావాలని కోరుకునే నాన్-ఎమర్జెన్సీ పేషంట్ సౌకర్యం కొరకు, వారికి అంబులెన్స్ పంపేందుకు 1777 అనే మరో నంబర్ కేటాయించింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే, 995 నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కోరినవారి దగ్గర నుంచి 180 సింగపూర్ డాలర్లు ఫీజు కింద వసూలు చేస్తారు. లేకపోతే ఈ సౌకర్యం ఉచితమే. అంబులెన్సులలో పేషంట్లను ప్రమాద స్థలానికి అతి సమీపంలో వున్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుస్తారు. అలా చేయడం వల్ల తక్షణ వైద్య సదుపాయం లభిస్తుంది. సింగపూర్ మొత్తంలో  14 అంబులెన్స్ స్టేషన్లు, 40 ఎమర్జెన్సీ అంబులెన్సులు వున్నాయి. 

డాక్టర్ వి. అనంతరామన్

డాక్టర్ అనంతరామన్ వెంట నేను మొత్తం సింగపూర్ జనరల్ ఆసుపత్రిని చూశాను. అంగుళం-అంగుళం అత్యంత జాగ్రత్తగా, హైజినిక్‍గా కాపాడుతున్నారు ఆసుపత్రిని. బహుశా ఇండియాలోని "బెస్ట్ ఆఫ్ ద ఆసుపత్రి" లో కూడా లేని ఔట్ పేషంట్ సౌకర్యం ఇక్కడ వుందనవచ్చేమో! ఇక్కడ ఎమర్జెన్సీ అడ్మిషన్లు ఇరవై నాలుగు గంటలూ కాగా, నాన్-ఎమర్జెన్సీ ఔట్ పేషంట్ సౌకర్యం నిర్ధారిత సమయాలలో మాత్రమే లభిస్తాయి.

Tuesday, September 6, 2011

108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ట్రస్టీ ఏర్పడాలి: వనం జ్వాలా నరసింహారావు

108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ట్రస్టీ ఏర్పడాలి

108 ఒడిదుడుకుల వాస్తవాలు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-09-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఇ.ఎం.ఆర్.ఐ - 108 ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య మాజీ కన్సల్టెంటు

అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సర్వీసులను నడిపే శక్తి ప్రభుత్వానికి లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నట్లు వార్తలొచ్చాయి. అంబులెన్సుల నిర్వహణ విషయంలో సర్కారు ఇరకాటంలో పడిందన్న వార్తలూ పొక్కాయి. రెండేళ్లుగా వీటిని నిర్వహిస్తున్న జీవీకే సంస్థనుంచి వాటిని తొలగించే అవకాశం వున్నట్లు కూడా సమాచారం. ఎవరు-ఎలా నిర్వహిస్తారో అనే విషయం పక్కన పెడితే, తిరగవలసిన 802 అంబులెన్సుల్లో సుమారు 300 వరకు ఏమైనా యో-ఎక్కడున్నాయో అంతుపట్టకుండా పోయింది. 108 సేవల కొన సాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఒక్కో అంబులెన్సుకు నెలకు ఇంతవరకు ఇస్తున్న రు. 1, 12, 499 కంటే తక్కువగా కేవలం రు. 95 వేల చొప్పున మాత్రమే చెల్లించాలని సూచించినప్పటికీ, .ఎం.ఆర్.ఐ అంగీకరించడం వెనుక కారణాలు అర్థం చేసుకోవడం కష్టమే! రు. 42 కోట్ల బ్యాంకు రుణాన్ని తీర్చేందుకు కూడా జీవీకే సంస్థ ఒప్పుకున్నదట! 108 నిర్వహణ అధ్వాన్నంగా మారిన విషయం జగమెరిగిన సత్యం. అసలు ఆ సంస్థకు అంబులెన్సులు నడవడం కన్నా, ఆ సేవలను ఎలాగైనా నిర్వహించడమే ప్రధానంగా కనిపిస్తోంది.

ఒక్కో 108 అంబులెన్సు ప్రతి రోజూ కనీసం 3-4 పర్యాయాలైనా ఎమర్జెన్సీ సేవలందించేందుకు సంఘటనా స్థలానికి వెళ్లాలి. సగటున అవి ఇప్పుడు 1-2 సార్లన్నా చేస్తున్నాయో-లేదో అనుమానమే! కాల్ సెంటర్ కు వచ్చే ఫోన్లు కూడా గణనీయంగా పడిపోతున్నట్లు సమాచారం. ప్రతిసారీ రామలింగ రాజు హయాంలో యాక్సెస్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రు. 42 కోట్ల రుణానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తుంటారు. అదేదో ఘన కార్యం చేస్తున్నట్లు తాను ఆ రుణానికి పూచీకత్తు పడతానని సంస్థ చైర్మన్ అనడం గమనించాల్సిన విషయం. సంస్థ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రు. 60 కోట్ల నిధులను (రాజు హయాంలో చేసిన అప్పుల కింద?) సమకూర్చానని సీఎం వద్ద ఆయన వాదిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా మరో 9 రాష్ట్రాలకు సహాయ సేవలను విస్తరించానని, జీవికే అనడం హాస్యాస్పదం. సంస్థ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన చొరవతో కనీసం ఒక్క టంటే ఒక్క రాష్ట్రం కూడా కొత్తగా 108 సేవల నెట్‌వర్క్ లోకి రాలేదనే ది వాస్తవం. పైగా అంతకు ముందున్న రాజస్థాన్ రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పరిధి నుంచి వైదొలగింది కూడా.

"లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ప్రక్రియను ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్టి యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ దే. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" అభివర్ణించబడిన 108 అంబులెన్స్-అత్యవసర సహాయ సేవలు, ఇతర రాష్ట్రాలలో అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంటే, అవి ఆవిర్భవించిన రాష్ట్రంలో, కుంటుపడడం దురదృష్టం. 108 సేవలను తన సొంత నిధులతో ఆరంభించిన రామలింగ రాజు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లిన తర్వాత తలెత్తిన పరిస్థితులను సమీక్షించిన ప్రభుత్వం, అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది రెండున్నరేళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయం. దానికి ప్రత్యక్ష సాక్షులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే. సత్యనారాయణలతో సహా పలువురు ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వ ప్రతినిధులు.

.ఎం.ఆర్.ఐ సొంత నిధులతో ఆగస్ట్ 15, 2005 న హైదరాబాద్ లో అంబులెన్సులను ప్రవేశ పెట్టింది. తర్వాత తిరుపతి-విశాఖపట్నం-విజయవాడ-వరంగల్ పట్టణాలకు, రాష్ట్రంలోని అన్ని జిల్లా-రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు మొత్తం 70 వాహనాలతో విస్తరించింది. జనవరి 2007 లో గ్రామీణ ప్రాంతాలకు సేవలు విస్తరించడం, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 502 అంబులెన్సులు సేవలందించడం జరిగింది. మే నెల 2008 లో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి, నిర్వహణ వ్యయంలో 95% ప్రభుత్వం భరించాలని, అంబులెన్సుల సంఖ్యను దశలవారీగా 802 కు పెంచాలని నిర్ణయించింది. అప్పటినుంచి ఇంతవరకు 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం, పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం మొదలైంది.అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? మరెందుకీ సంస్థ-అది అందిస్తున్న అత్యవసర సహాయ సేవలు ఇబ్బందులకు లోను కావాలి? అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమా? యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? ఇటీవల కింది స్థాయి సిబ్బందికి కూడా సకాలంలో జీతాలు చెల్లించడం లేదని వార్తలొస్తున్నాయి. కనీసం నాలుగొందల వాహనాలు సేవలను అందించలేని పరిస్థితుల్లో నిరుపయోగంగా పడి పోయాయంటున్నారు. ఏది నిజం?

ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వభావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వి.కృష్ణారెడ్డి, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. ఐనా సమస్యలు కొనసాగడంతో, ప్రభుత్వం నియమించిన కమిటీ, ఆర్థిక శాఖ కొంచెం లోతుగా అధ్యయనం చేయడం మొదలెట్టింది. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో ఇంకొక ముసాయిదాను తయారు చేసి, పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో ప్రభుత్వం-.ఎం.ఆర్.ఐ మధ్య కుదుర్చుకున్న మొదటి, రెండో, మూడో ఎంఓయు విషయంలో గాని, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో గాని ఏ విధమైన అభ్యంతరాలను ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రాతిపదిక ఆధారంగా ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది.

ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్., ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. దరిమిలా నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం. ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది కొత్త ముసాయిదాలో. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు !) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే (జీ.వి.కె) .ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. రాజు చైర్మన్ గా తొలగిన సమయానికి ఇ.ఎం.ఆర్.ఐ ఇరుక్కుపోయిన సుమారు రు. 120 కోట్ల "అప్పుల ఊబి" వ్యవహారం కూడా ఆర్థిక శాఖకు ఎంతమాత్రం రుచించలేదు. అసలు విషయాలిలా వుంటే ఎంఓయు ఎలా కుదురుతుంది?

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు? నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు? కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు? రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు? ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు? బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా? ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు? ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు? చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న వారు చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ?

సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజుపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. దాన్ని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

కొత్తగా సహాయ సేవలను కోరుకునే ప్రతి రాష్ట్రం ముందస్తుగా నిధులను విడుదల చేయడం జరిగింది. గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా విడుదల చేసింది. ఆ తర్వాత కాలంలో ప్రతి రాష్ట్రం పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన నాడే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఎంఓయు నిబంధనల ప్రకారం ఆ నిధులను, ఆ రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు ప్రధానంగా ఉపయోగించాలి. సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. అలా చేయడం "దుర్వినియోగం" కింద కు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం.

ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని-సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని-అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని)ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సిందే.

రామలింగ రాజు జైలుకెళ్లే ముందర తన వారసులెవరైతే బాగుంటుందన్న విషయం కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. రాజు గారి కుటుంబ సభ్యులకు పిరమల్-జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వున్నట్లు లేదు మొదట్లో. కాకపోతే, ఎంత కాదనుకున్నా వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ఆ తర్వాత జి.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు. పిరమల్ అధినేత, జి.వి.కె. లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి.

రాజు సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం అవసరం. తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో-ఆయన సలహాదారులో అలా చేయించారో? సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షణ లేని" వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మీద, "సిద్ధాంతపరంగా" ఎన్నో వ్యాసాలు-మరెన్నో పరిశోధనలు పుంఖానుపుంఖాలుగా లభ్యమయినప్పటికీ, "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" ఆ ప్రక్రియకు భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందిస్తున్న భారత దేశంలోని పది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న వర్తమాన పరిస్థితులలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ, అధిగమించడానికి చర్యలు చేపట్టాలి.

ఇంతవరకూ జరిగిందే దో జరిగింది. ఇక ముందైనా, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రయివేట్ సంస్థ కాని-వ్యక్తి కాని ఏ ఒక్కరో కాకూడదన్న నిబంధన రావాలి. పటిష్టమైన "ట్రస్టు" చేతుల్లో ప్రయివేట్ పరమైన యాజమాన్య బాధ్యతలు వుంచాలి. ఇ.ఎం.ఆర్.ఐ అప్పులను, దానికున్న ఆస్తులతో కలిపి విశ్లేషించాలి. అవెవరివో తేల్చాలి. అప్పుడే మరో అడుగు ముందుకు వేయాలి. అంతవరకు, 108-అత్యవసర సహాయ సేవలు ఆగకుండా-నాణ్యతతో నిర్వహించాలి. ప్రభుత్వానికి వాటిని నడిపే శక్తి లేదని సంబంధిత మంత్రి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. 104 కాల్ సెంటర్ సేవలను, నిర్ధారిత తేదీ సహాయ సేవలను హెచ్.ఎం.ఆర్.ఐ నుంచి తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపగలిగిన శక్తి వున్న ప్రభుత్వానికి 108-అత్యవసర సహాయ సేవలు నడపగలిగే సామర్థ్యం లేదా?


Saturday, December 25, 2010

రాజశేఖర రెడ్డి "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో అపశృతులు: వనం జ్వాలా నరసింహారావు


ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అపశృతి, ఈ మాత్రం సేవలు కూడా దక్కవా?,
నిధుల మళ్ళింపుతో సమస్యలు, పెరిగిన రుణ భారం, ఉద్యోగులకు అభద్రత
(సూర్య దినపత్రిక:19-01-2011)

వనం జ్వాలా నరసింహారావు
కన్సల్టెంటు హెచ్ఎంఆర్ఐ & ఇ.ఎం.ఆర్.ఐ మాజీ సలహాదారుడు

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో అత్యవసర సహాయ సేవలందించే 108 అంబులెన్సులను, నడపకుండా నిలుపుదల చేస్తామని, గత ఐదేళ్లు గా వాటిని నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. నడపకుండా నిలుపుదల చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి రెండు వారాలు గడవక ముందే, ఆ సంస్థ సీఈఓ వెంకట్ చెంగవల్లి రాజీనామా చేసారు. రెండేళ్ల క్రితం .ఎం.ఆర్.వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు రాజీనామా కంటే సీఈఓ రాజీనామా ప్రభావం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణపై పడడం, సేవలు సంక్షోభం దిశగా పయనించడం వాస్తవం అనవచ్చునేమో!.

వ్యక్తిగత పట్టింపులకు, పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో అనుకుని అలా హెచ్చరికలు జారీచేయడం ఎంతవరకు సమంజసం? ఏదో వంక చూపి, అత్యవసర సహాయ సేవలను నిలుపుదల చేస్తామని లిఖిత పూర్వ కంగా ఇవ్వడం నేరంగా పరిగణించాలి కదా! 108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై ఏడెనిమిది నెలల క్రితం ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడే, ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాలి. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఇరువురు భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం. అలా జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడం కొరకు కమిటీలను వేయడమంటే 108-అత్యవసర సహాయ సేవలు పౌరులకు గతంలో మాదిరి నాణ్యమైన సేవలు లభ్యం కాకుండా చేయడమే! అంబులెన్సుల సేవలు ఆగిపోతే నష్టపోయేది పేద వారే కాని ధనికులు కాదు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించి "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" తొలుత భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సారధ్యంలోని అలనాటి రాష్ట్ర ప్రభుత్వం. "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడానికి భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న నేపధ్యంలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ నేరస్తులే.

ప్రభుత్వ పరంగా ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ దోహద పడుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "ఎంఓయు-అవగాహనా ఒప్పందం".

"భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా, ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, వైద్య-అగ్నిమాపకదళ-పోలీసు సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) ఆవిర్భావం జరిగింది. తొలుత ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, సగటు పౌరుడిపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. 95% ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో) హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ జీ.వి.కృష్ణారెడ్డి, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు.

అలాంటప్పుడు ఇ.ఎం.ఆర్.ఐ ఎందుకు అల్టిమేటం ఇవ్వాల్సి వచ్చింది? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా? జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? జీ. వి. కృష్ణారెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకు ముందు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో "పి.పి.పి ఒప్పందం" పేరుతో కొత్త ముసాయిదాను పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో నాలుగు పర్యాయాలు కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో ఏ విధమైన అభ్యంతరాలను చెప్పని ప్రభుత్వం, ఈ సారి రకరకాల ఆక్షేపణలు తెలియచేయడానికి కారణాలే వై వుండొచ్చు? అప్పట్లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా మొదటి నాలుగు ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" తెరలేపింది ప్రభుత్వమైనా అవకాశం ఇచ్చింది మాత్రం ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యమే అనాలి. ఇలా జరగకుండా వుండాల్సింది.

నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రత్యక్ష నిర్వహణ వ్యయం కింద రు. 1, 12, 499 చొప్పున ఇ.ఎం.ఆర్.ఐ కి ఇస్తామని 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ప్రభుత్వం, అంబులెన్సుల సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తుంది. జీ.వీ.కె యాజమాన్యం 95% నిర్వహణ వ్యయాన్ని 100% పెంచమని, అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు!) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు. అధికారిక లెక్కల పుస్తకాలలో నెలనెలా నిర్వహణ వ్యయం ఒక్కో అంబులెన్సుకు సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికొచ్చింది.

"రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా 2005 లో ఇ.ఎం.ఆర్.ఐ ని గుర్తించిన ప్రభుత్వం, 2006 లో "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో ప్రవేశ పెట్టదలిచిన అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను కూడా "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అదే సంస్థకు అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ "నమ్మకం-విశ్వాసం" తో తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది. అయితే అప్పటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న. 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు, తర్వాత 802 కు పెరిగినప్పుడు, దగ్గుతోందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో !

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రామ లింగరాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న సిఇఓ చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి?

అత్యవసర సహాయ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ తోడ్పాటుతో ప్రారంభించిన ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. సేవలను ఆరంభించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వాన్సుగా నిధులను విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" అలా విడుదలైన నిధులను ఉపయోగించే సాంప్రదాయానికి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ తెర లేపింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. అదే క్రమేపీ రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. ఆ రుణభారంలోనే రు. 40 కోట్ల బాంకు అప్పు కూడా వుంది!

ఇ.ఎం.ఆర్.ఐ వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని, అంతగా అత్యవసరం లేని, ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో యాజమాన్యం వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంది. ఇ.ఎం.ఆర్.ఐ రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని, సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది.

సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. యాజమాన్యం అంగీకరించిందన్న మిషతో, సుమారు నలబై లక్షలు ఖరీదు చేసే అధునాతనమైన కారును ఇతర రాష్ట్రాల నిధులతో ఖరీదు చేయడం కూడా ఎంతవరకు సబబు? అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ప్రధానంగా సిఇఓ దే!

జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడినా తన వారసులెవరనే విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండొచ్చు. కుటుంబ సభ్యులకు పిరమల్, జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వుండకపోయుండవచ్చు. వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు సిఇఓ. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు.

అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం, ఇండిపెండెంట్ ’తరగతి గదులు’, కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి", "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు.

ఈ నేపధ్యంలో ఏ ప్రయోజనం కోరి ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం, అత్యవసర సహాయ సేవలను అర్థాంతరంగా ఆపుదల చేస్తామని, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ లేఖ పంపించిందో అన్న అంశంపై విచారణ జరగాలి. లేఖ ఇవ్వడం ద్వారా ఎటువంటి ఒత్తిడిని ప్రభుత్వంపై యాజమాన్యం తేవాలనుకుందో వెల్లడి కావాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవచ్చా? భవిష్యత్ లో ఏం జరుగబోతోంది?

ఇదిలా వుండగా, ఆరోగ్య నిర్వహణ-పరిశోధనా సంస్థ (హెచ్‍‍ఎంఆర్ఐ ) సమకూరుస్తున్న "104 నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు బదలాయించింది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, కొత్త యాజమాన్య విధానాన్ని రూపొందించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. 104 సంచార వాహన సేవలు ఆరంభించడానికి ఒక మహత్తర ఆశయం వుంది. కనీస వైద్య సౌకర్యం కూడా నోచుకోని నిరక్షరాస్యులైన నిరుపేద గ్రామీణులు, తమ గ్రామానికి 104 సంచార వాహనం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇచ్చినంత కాలం ఆనందించారు. రాని రోజున ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియనందున మౌనం దాల్చారు. అలాంటి నాలుగు కోట్ల మంది అభాగ్యులకు 104 సంచార వాహన సేవలు మొదలయ్యేంతవరకు అలాంటి సేవలుంటాయనే విషయమే తెలియదు. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమై ఇంతవరకు నిరంతరాయంగా ప్రజలకు లభ్యమవుతున్న సేవలు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారానే లభించాలను కోవడం ఎంతవరకు సమంజసమో కూడా భవిష్యత్తే నిర్ణయించాలి? ఇప్పటికే పండిన పంటలు చేతికి రాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న లక్షలాది మంది పేద రైతులకు సకాలంలో ఇప్పటివరకూ లభ్యమవుతున్న ఆరోగ్య వైద్య సేవలు కూడా మృగ్యమవుతే ఎలా?

ఏదేమైనా రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో అపశృతులు చోటుచేసుకోవడం మాత్రం వాస్తవం! End

Thursday, December 23, 2010

ఆచరణలో విఫలమవుతున్న "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం"-3

108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?-III
వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2009 న "సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణం" వ్యవహారంలో, చైర్మన్ రామ లింగరాజు తాను "దోషి" నని, "తప్పుచేసానని" బహిర్గతం చేయడానికి అర గంట ముందు, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓకు ఫోన్ చేసి, మరి కాసేపట్లోనే తానొక "సంచలనాత్మక" ప్రకటన చేయబోతున్నానని, ఆ ప్రకటన ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని చెప్పారు. అయినప్పటికీ, తనకు అత్యంత గౌరవ ప్రదమైన-ప్రీతిపాత్రమైన-హృదయానికి చేరువైన 108-అత్యవసర సహాయ సేవలను "ఎన్ని కష్ట నష్టాలెదురైనా" నిరాటంకంగా కొనసాగించాలని కోరారు (అభ్యర్థించారు?).

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రామ లింగరాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న సిఇఓ చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ఇలాంటి వాటికి సమాధానం రాజు గారే ఏనాడో ఒకనాడు ఇవ్వాలి తప్ప ఇతరులకు జవాబు వెతకడం సాధ్య పడేది కాదు.

సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు గారు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజు గారిపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా సేవలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో, ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. ఆ తాకిడిని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

అత్యవసర సహాయ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ తోడ్పాటుతో ప్రారంభించిన ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట (2007 లో) ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. తాత్కాలిక అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసింది. అప్పట్లో, అంత భారీ మొత్తంలో ఒకే దఫాగా బయట నుంచి నిధులు రావడం, అదే మొదటిసారి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతవరకు, అంత మొత్తానికి, ఒకే చెక్కును ఇవ్వడం జరగలేదు. ఇతర రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పై అంత విశ్వాసంతో-నమ్మకంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో సేవలను ఆరంభించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన తక్షణమే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఎంఓయు నిబంధనల ప్రకారం ముందస్తుగా విడుదల చేసిన ఆ నిధులను, అదే రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు (అంబులెన్సులు కొనడానికి, కాల్ సెంటర్ నెలకొల్పడానికి) ప్రధానంగా ఉపయోగించాలి. అయితే ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఆపాటికే ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయానికి తెర లేచింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. ఒక రాష్ట్రంతో-కొద్ది మొత్తంతో ఆరంభమయిన ఆ సాంప్రదాయం "ఇంతై-ఇంతింతై- వటుడింతై" అన్న చందాన రాజుగారు నిష్క్రమించేనాటికి రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. రాజుగారి నిష్క్రమణంతో ఆ రుణ భారం మోసేదెవరన్నది "మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా" మిగిలిపోయింది. రాజు గారి స్థానంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జీ.వీ.కె. రెడ్డి రు. 70 కోట్లకు పైగా సమకూర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఆ రుణభారంలోనే రు. 40 కోట్ల బాంకు అప్పు కూడా వుంది!

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను మళ్లించడానికి బాధ్యులైన వారు, తక్షణ సమాధానం ఇవ్వాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని, అంతగా అత్యవసరం లేని, ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకోలేరు. అలా చేసిన వ్యయం "ఆస్తుల సంపాదన" కిందకు వస్తుంది. ఇ.ఎం.ఆర్.ఐ రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని, సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది.

ఇంతకూ ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న నిధులను ఇ.ఎం.ఆర్.ఐ ఆయా రాష్ట్రాల అవసరాలకు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ అవసరాలకు వాడి వుండే ఆస్కారం వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టమేమీ కాదు. బాంక్ దగ్గర్నుంచి తెచ్చిన రుణం-ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం ఖర్చయ్యాక, ప్రతి రాష్ట్ర సహాయ సేవల నిర్వహణ వ్యయంలో భరించాల్సిన 5% వాటా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు కావాల్సిన అదనపు మూలధనం ఖర్చు, పాలనా పరమైన వ్యయం, శిక్షణా సంబంధమైన వ్యయం (మౌలిక సదుపాయాలతో కలిపి), సీనియర్ ఉద్యోగుల జీత భత్యాలు, సాంకేతిక సంబంధమైన మూల ధన వ్యయం లాంటివన్నీ ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడాల్సిన అవసరం కలిగింది. ఆ పాటికే రాజుగారు నిధులను ఇవ్వడం నిలిపేశారు. అడగాల్సిన సిఇఓ తన బాధ్యతను విస్మరించారు. ఇతర రాష్ట్రాల నిధుల మళ్లింపే తేలికనుకున్నారు. సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. యాజమాన్యం అంగీకరించిందన్న మిషతో, సుమారు నలబై లక్షలు ఖరీదు చేసే అధునాతనమైన కారును ఇతర రాష్ట్రాల నిధులతో ఖరీదు చేయడం కూడా ఎంతవరకు సబబు? ఇలాంటి అనుమానాలను మీడియా అప్పట్లో వ్యక్తం చేసింది కూడా. అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ప్రధానంగా సిఇఓ దే!

ఇ.ఎం.ఆర్.ఐ అప్పట్లో ఎదుర్కున్న కష్టాల్లో ప్రధానమైంది "ప్రయివేట్ భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన వ్యక్తుల-సంస్థల అన్వేషణ". మాజీ చైర్మన్ పై పలు ఆరోపణలు, సుప్రీం కోర్టులో సంస్థపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం, మీడియా వ్యతిరేక ప్రచారం, మధ్యలో అకౌంట్ స్థంబింప చేసిన యాక్సెస్ బాంక్, కింది స్థాయి ఉద్యోగులకు కూడా సరైన సమయంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పుల వాళ్ల బాధలు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత... వెరసి అన్నీ కష్టాలే. ప్రయివేట్ భాగస్వామిని పొందే ప్రయత్నంలో పిరమల్, జీ.వి.కె సంస్థలు మాత్రమే చివరి దాకా ఆసక్తి కనబరిచాయి. ఇ.ఎం.ఆర్.ఐ ని దక్కించుకోలేక పోవడం పిరమల్ సంస్థ దురదృష్టమా, లేక, దక్కించుకోవడం జీ.వి.కె అదృష్టమా భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.

జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడినా తన వారసులెవరనే విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. కుటుంబ సభ్యులకు పిరమల్, జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వుండకపోయుండవచ్చు. వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు సిఇఓ. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు. ఆ విషయం సూచన ప్రాయంగా బహిర్గతం చేశారే మో! జీ.వీ.కె తొలుత సానుకూలంగా స్పందించి జనవరి 24, 2009 న ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు కూడా.

ఇంతలో, మళ్ళీ ఏమైందో గాని, రాజుగారి కుటుంబం దృష్టి మరో మారు పిరమల్ వైపు మళ్లింది. స్వయంగా వారి కుటుంబ ప్రతినిధి పిరమల్ ను కలుసుకొని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రప్పించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లో లేనందున ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్యను ఉదయమే వెళ్లి కలిశాం. సుమారు అర్థ గంట పైగా సమావేశం జరిగింది. సంస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు రోశయ్య. వారి ఆసక్తిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత వారూ ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు. అంతా సవ్యంగా వుందనుకుంటుండగానే, నిరాసక్తతను వ్యక్త పరిచారు పిరమల్ అధినేత. ఇక ఆ తర్వాత మే 26, 2009 న ముఖ్యమంత్రి చొరవతో జీ.వీ.కె. రెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ బరువు బాధ్యతలు స్వీకరించారు. పిరమల్ అధినేత అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యను కలిసినప్పుడు, డాక్టర్ జీ.వీ.కె. రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో మాట్లాడినప్పుడు (బహుశా) లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి.

అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం, ఇండిపెండెంట్ ’తరగతి గదులు’, కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి పూర్వాపరాల గురించి తెలుసుకునే ముందర, రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకు ముందే తెలియచేసినట్లు, తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో, ఆయన సలహాదారులో అలా చేయించారో తెలుసుకోవాలంటే, సమాధానం చెప్పాల్సింది రాజు గారే. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు.

ఈ నేపధ్యంలో ఏ ప్రయోజనం కోరి ఇ.ఎం.ఆర్.ఐ ఐ యాజమాన్యం, అత్యవసర సహాయ సేవలను అర్థాంతరంగా ఆపుదల చేస్తామని, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ లేఖ పంపించిందో అన్న అంశంపై విచారణ జరగాలి. లేఖ ఇవ్వడం ద్వారా ఎటువంటి ఒత్తిడిని ప్రభుత్వంపై యాజమాన్యం తేవాలనుకుందో వెల్లడి కావాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవచ్చా? భవిష్యత్ లో ఏం జరుగబోతోంది? END