Sunday, February 26, 2012

ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్ డార్ఫ్: వనం జ్వాలా నరసింహారావు


బహుముఖ క్రియాత్మక వ్యూహంతో 
గిరిజనుల సమస్యలకు సూచనలిచ్చిన 
ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్ డార్ఫ్
          
              ఒకనాటి నిజాం హైదరాబాద్ రాష్ట్రం-ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ లోని, ఆదిలాబాద్ జిల్లా, జైనూర్ మండలం, మర్లవాయి గ్రామంలో అనేక సంవత్సరాలు నివసించిన ప్రపంచ ప్రఖ్యాత మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్ జ్ఞాపకార్థం, అక్కడి గిరిజన సాంప్రదాయాల ప్రకారం, అంతిమ సంస్కారాలు జరిపించడానికి ఆయన కుమారుడు నికోలస్, మనుమడు హేమెన్‍డార్ఫ్ జూనియర్, ఆ గ్రామానికి వచ్చారని పత్రికలలో వార్తలొచ్చాయి. సతీమణి ఎలిజబెత్‌తో కల్సి హేమెన్‍డార్ఫ్ ఆ  ప్రాంతానికి నిజాం రాష్ట్ర "ఆదివాసీ సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ" సలహాదారుడుగా, 1941 లో అడుగుపెట్టి, అక్కడే ఒక గుడిసెలో సంవత్సరాల తరబడి వుండిపోయారు. భార్య మరణానంతరం లండన్ వెళ్లి అక్కడే మరణించారు. బహుశా హేమెన్‍డార్ఫ్ స్థాయిలో రాష్ట్ర గిరిజన సమస్యలపై అధ్యయనం చేసి సూచనలిచ్చిన వారు ఎవరూలేరంటే అతిశయోక్తి కాదు.

ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్, ఆస్ట్రియా దేశంలో, సంపన్నుల కుటుంబంలో జన్మించినప్పటికీ, యవ్వనంలో అడుగుపెట్తూనే, రబీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం పట్ల ఆకర్షితుడై, భారతీయ సంస్కృతీ-సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. వియన్నాలో మానవ పరిణామ శాస్తాన్ని, పురావస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేసారు. నాగా హిల్స్ లో నివసిసించే గిరిజన సామాజిక వ్యవస్థ స్థితిగతులపై పరిశోధనాత్మక వ్యాసాన్ని రాశారు. సమకాలీన మానవ పరిణామ శాస్త్రజ్ఞులతో పరిచయాలు పెంపొందించుకోవడానికి హేమెన్‍డార్ఫ్ లండన్ నగరానికి వెళ్లారు. 1936 లో నాగాలాండుకు వచ్చి అక్కడి గిరిజనుల భాష నేర్చుకున్నారు. కొంతకాలం నీఫా-ఈశాన్య సరిహద్దు భారత ప్రాంతానికి వెళ్ళి, నిజాం ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసేందుకు దక్షిణ భారతానికి వచ్చారు. ఆయన గిరిజన సమస్యలపై తీసుకున్న చొరవ వల్ల, నాటి నిజాం ప్రభుత్వం హేమెన్‍డార్ఫ్ ను రాష్ట్ర గిరిజన, వెనుకబడిన వర్గాల "ఆదివాసీ సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ" సలహాదారుడిగా ఎంపిక చేసేందుకు దోహదపడింది. వారి సమస్యలలో ప్రధానమైంది భూమి సమస్య.

దలైలామాతో వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్


సలహాదారుడి పాత్రను పోషించుకుంటూ, అనేక ప్రదేశాలలో గిరిజన విద్యా సంస్థలను నెలకొల్పడం, వినూత్నమైన పథకాలను వారి సంక్షేమం కొరకు రూపొందించడం, వాళ్ల సంస్కృతీ-సంప్రదాయాలను పరిరక్షించడం లాంటి కార్యక్రమాలను కూడా హేమెన్‍డార్ఫ్ చేపట్టడం జరిగింది. 1953 లో నేపాల్ దేశానికి వెళ్లి అక్కడి గిరిజనుల సమస్యలపైనా అధ్యయనం చేశారు. భారతదేశంలోని గిరిజనులపై అధ్యయనం చేయాలన్న ఆయన ఆసక్తి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరడానికి దారితీసింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో నివసించే వారితో సహజీవనం చేస్తూ, వారి జీవన స్థితిగతులపై పరిశోధనలు జరిపారు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే గోండుల, చెంచుల, రెడ్డిల మీద అధ్యయనం హేమెన్‍డార్ఫ్ కు ప్రధాన అంశంగా మారింది. ఆయన ప్రయాణం చేసిన గిరిజన ప్రాంతాలు చాలావరకు అంతకు ముందు ఎవరూ వెళ్లనివే! సమాంతరంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిని కూడా కొంతకాలం చేశారు. మానవ జాతి శాస్త్రంపైపది "ఏక విషయక రచన" లు చేశారు. వాటిలో ప్రధానమైనవి చెంచుల మీద, గిరిజన రెడ్డిల మీద, గోండుల మీద, నేపాల్ గిరిజనుల మీద, నాగాల మీద ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు. మానవజాతి శాస్త్రంపై ఏకంగా సుమారు 3650 పేజీల అధ్యయన గ్రంధం రాశారు. వృద్ధాప్యంలో మానవ పరిణామ శాస్త్రంలో అధ్యాపకుడిగా లండన్‌లో ఉద్యోగం చేస్తూ, భార్య మరణానంతరం 1987 లో అనారోగ్యానికి గురై, కోలుకోలేక, చివరకు జూన్ 11, 1995 న ఆయన 85 వ ఏట లండన్‌లో మరణించారు.

హేమెన్‍డార్ఫ్ చొరవతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవ పరిణామ శాస్త్ర (యాంథ్రపోలొజీ) విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాఖలోనే ఆయన ఆచార్యుడుగా పనిచేసేవారు. ఆ శాఖలో మొదటి బాచ్ విధ్య్రార్థిగా చదివిన వరంగల్ జిల్లా వాసి పి. కమలా మనోహర రావు, దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ప్రప్రధమ డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ తెగల-వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా ఆరంభించడానికి కూడా హేమెన్‍డార్ఫ్ కారకులు. ఆ శాఖలో ట్రయినీ నిర్వాహకుడుగా పనిచేసేందుకు కమలా మనోహర్ రావును ఎంపిక చేశారు హేమెన్‍డార్ఫ్. 1985 లో రాష్ట్ర ప్రభుత్వం పాలనా సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు "రుస్తుంజీ అసోసియేట్స్" ను కన్సల్టెంటులుగా నియమించింది. ప్రప్రధమ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా 1966 లో ఆ శాఖ ఏర్పడినప్పుడు బాధ్యతలు స్వీకరించి, 1975 లో పదవీ విరమణ చేసిందాకా ఆ శాఖలోనే పనిచేసిన పి. కమలా మనోహర రావును గిరిజన సంక్షేమానికి సంబంధించినంతవరకు సంస్కరణల విషయంలో సూచనలిచ్చేందుకు రుస్తుంజీ నియమించింది.

ఆంధ్ర ప్రదేశ్ లో గిరిజన సంక్షేమ పాలనా విధానాన్ని క్రమబద్ధం చేయడానికి హేమెన్‍డార్ఫ్ శిష్యుడు కమలా మనోహర రావు "ఏక గవాక్ష పద్ధతి" ని సూచించారు. దాంతో పాటు వికేంద్రీకరణ దిశగా బహుముఖ క్రియాత్మక వ్యూహాన్ని కూడా సూచించారు. ఆ నివేదిక పలువురి ప్రశంసలను అందుకుంది. హేమెన్‍డార్ఫ్ తన లెటర్ హెడ్ మీద, స్వదస్తూరీతో, కమలా మనోహర రావుకు నివేదిక విషయంలో తన అభిప్రాయాలను తెలియచేస్తూ, ఒక సుదీర్ఘమైన వుత్తరం రాశారు. ఆ లేఖ రాసిన తేదీ 11-12-1985. అప్పట్లో ఆయన ఆఫ్రికా-ఆసియా దేశాల లండన్ అధ్యయన సంస్థలో పనిచేస్తున్నారు. కాకపోతే వుత్తరం రాసింది హైదరాబాద్ "రాక్ కాజిల్" హోటెల్ లో వున్నప్పుడు. ఆ నివేదిక తయారుచేసినందుకు కమలా మనోహర రావును అభినందించారాయన. గిరిజన ప్రాంతాలలో విప్లవాత్మకమైన మార్పులకు సంబంధించి కమలా మనోహర రావు చేసిన విశ్లేషణలను హేమెన్‍డార్ఫ్ పొగిడారు. ఆ నివేదికలో గిరిజన ప్రాంతాలలో ప్రాజెక్ట్ అధికారి ఏర్పాటుకు సంబంధించిన అంశం కూడా వుంది. కలెక్టర్‌తో సమానమైన అధికారిక హోదాకల ప్రాజెక్ట్ అధికారి నియామకం ఆవశ్యకతను హేమెన్‍డార్ఫ్ గట్టిగా సమర్థించారు. గిరిజన సహకార సంస్థ పనితీరుకు సంబంధించి, స్వతంత్ర ప్రతిపత్తిగల గిరిజన సాంస్కృతిక పరిశోధనా శిక్షణా సంస్థ ఏర్పాటు గురించి, సచివాలయ స్థాయిలో షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవహారంలో పాలనాపరమైన మార్పుల గురించి ఆ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ హేమెన్‍డార్ఫ్ అభినందనలందుకున్నాయి.

సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ తెగల-వెనుకబడిన వర్గాల విభాగాన్ని పటిష్టం చేయడానికి హేమెన్‍డార్ఫ్ తన శిష్యుడు, కమలా మనోహర రావును ఎంపిక చేసుకున్నారు. ఆ కలయిక ఫలితంగానే, వరంగల్ జిల్లాలో, "హైదరాబాద్ గిరిజన ప్రాంతాల నియంత్రణ చట్టం 1949" అమలుకు నోచుకుంది. దరిమిలా హేమెన్‍డార్ఫ్ సూచనతో, వారిరువురి కృషి ఫలితంగా, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖను వేరు చేయడం జరిగింది. దానికి డైరెక్టర్‌గా కమలా మనోహర రావును ఎంపిక చేసింది ప్రభుత్వం. 

గిరిజనులను "ఆది వాసీలు" గా సంబోధించడానికి కారణం, ఆది నుంచీ భారతావనిలో నివసిస్తున్నవారు వారేనని. ఆంగ్లంలో ఆదివాసీలనే, "ఎబ్ ఒరిజినల్స్" గా, హిల్ ట్రయిబ్స్" గా,  "ఫారెస్ట్ ట్రయిబ్స్" గా రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రాధమిక దశలో అసలైన గిరిజనులు గుట్టలపైన, అడవుల్లోను, గుహలలోను, చెట్ల నీడలలోను నివసించేవారు. నాగరిక ప్రజలను చూడగానే వారిలో ఏదో భయం వేసేది. సాధారణంగా నీటి వసతి సహజసిద్ధంగా లభించే ప్రాంతాలనే వారు తమ నివాసాలుగా ఎంచుకునేవారు. ఒక ఆవాస స్థలమంతా కలిసి పది-పదిహేను గుడిసెల కంటే ఎక్కువ వుండకపోయేది. ఆ గుడిసెలకు కిటికీల లాంటివి కాని, తలుపుల లాంటివి కాని వుండకపోయేది. మట్టితో- వెదురు కర్రలతో తయారైన గుడిసెలోనే వారి నివాసం. ఇక వారి ఇంటి పేర్లు ఒక జంతువు పేరుకు సంబంధించి కాని, ఒక చెట్టుకు సంబంధించి కాని వుండేవి. ఇప్పటికీ ఇంకా అలానే వున్నాయనవచ్చు. ఉదాహరణకు "నక్కల", "మామిడి", "గుర్రం", "పాముల" లాంటి ఇంటి పేర్లతోనే వారిని సంబోధించేవారు.

ప్రభుత్వాలెన్ని మారినా గిరిజన సమస్యలు ఎప్పటికప్పుడు తెరమీదకొస్తూనే వుంటాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కలిసి వున్నప్పుడు, అప్పటి బ్రిటీష్ పాలన, గిరిజనులను జనజీవన స్రవంతిలో కలుపుతూ, మిగతా వారి మాదిరిగానే ఒకే గొడుగు కిందకు తెచ్చింది. కాకపోతే కొన్ని రాయితీలు కలిగించింది. ఒక రకమైన నిర్దిష్ట జాతికి-భాషకు చెందిన సామాజిక వర్గంగా ఆదివాసీలకు పూర్తి రక్షణలు కలిగిస్తూ, ఏజెన్సీ వ్యవస్థను 1839 చట్టం ద్వారా వలస పాలన ప్రవేశ పెట్టింది . అలా మొదలైంది గిరిజన సంక్షేమం. అయినా ఆదిలో ఎలా వుందో ఇంకా అలానే వున్నాయి వారి జీవన స్థితిగతులు.

ఈ నేపధ్యంలో, ఏ ప్రాంతంలోనైతే హేమెన్‍డార్ఫ్  ఆయన సతీమణి ఎలిజబెత్‌తో కలిసి, గిరిజనుల సంక్షేమం కొరకు ఏళ్ల తరబడి కృషి చేశారో, అవే పరిసరాలలో, వారిద్దరినీ శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు జ్ఞాపక చిహ్నాలను ఏర్పాటుచేయడం అభినందించాల్సిన విషయం. హేమెన్‍డార్ఫ్  భార్య ఎలిజబెత్ మరణానంతరం (హైదరాబాద్ లో) ఆమెను మర్లవాయి గ్రామంలోనే సమాధి చేసారు. అప్పుడక్కడ లేని హేమెన్‍డార్ఫ్, తనకూ ఆమె పక్కనే సమాధి కావాలన్న కోరికను వ్యక్త పరిచారు. ఆయన కోరినట్లు గానే అక్కడి గిరిజనులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు, ఇన్నేళ్లకు మళ్లా ఆ ప్రాంతానికి ఆయన కుమారుడు నికోలాస్, మనుమడు జూనియర్ హేమెన్‍డార్ఫ్ వచ్చి వారికి నివాళులర్పించడం విశేషం. End

Tuesday, February 21, 2012

నిధి నిక్షేపాలు-అపోహలు, అవాస్తవాలు: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరం నడి బొడ్డులో, రాష్ట్ర సచివాలయానికి కూత వేటు దూరంలో, విద్యారణ్య పాఠశాల ఆవరణకు ఆనుకుని వున్న నిజాం (పోనీ నేటి ప్రభుత్వ) భూమిగానే రికార్డులలో ఇప్పటికీ వుందని భావిస్తున్న స్థలంలోని ఒక సొరంగంలో నిధి-నిక్షేపాలున్నాయన్న నమ్మకంతో తవ్వకాలు సాగుతున్నాయి. ఎప్పుడో-ఎవరో నిర్మాణ కూలీకి, అక్కడ సొరంగ మార్గం కనిపించడంతో, ఆసక్తి చంపుకోలేని ఆ వ్యక్తి ద్వారా ఆ నోటా-ఆ నోటా బడి ఆ సమాచారం బయటకు పొక్కడంతో, చివరకు పురావస్తు శాఖ అధికారులు, అధికారికంగా, తవ్వకాలు చేసే వరకూ పోయింది వ్యవహారం. ఈ నేపధ్యంలో విన వస్తున్న కథ కూడా ఆసక్తికరంగానే వుంది. ఆ కథ నిజమైనా కావచ్చు-కల్లా కావచ్చు. ఆ నిర్మాణ కూలీ తాను కనిపెట్టిన సొరంగ మార్గం గుండా వెళ్లినప్పుడు అతనికి ఇనుప తలుపొకటి కనిపించిందనీ, దాని రంధ్రంలోంచి చూస్తే బంగారు-వెండి నిక్షేపాలు, నగలూ-నాణాలూ కనిపించాయని, దాంతో కళ్లు చెదిరిపోయిన ఆ వ్యక్తి వాటిని తవ్వి తీసే మార్గం తెలియక సహచరులను సంప్రదించాడని, అంతా కలిసి కోల్ ఇండియాలో పనిచేసే అధికారికి విషయం చెప్పారని, ఆయన-వాళ్లు కలిసి పురావస్తు శాఖ అధికారులకు తెలియచేశారని, దరిమిలా తవ్వకాలు ఆరంభమైనాయనీ పత్రికలలో వస్తున్న వార్తలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వీటిలో నిజానిజాలెంతవరకున్నా, తవ్వకాలు జరుగుతున్నది మాత్రం వాస్తవం. ఏదో ఒకటి బయట పడడానికి అవకాశాలు అంతో ఇంతో వుండడమూ వాస్తవమే! ఇక నిధినిక్షేపాలుంటాయా? వుండవా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!

ఈ కథలో అంతర్లీనంగా వున్న మరో కథ, పోనీ, వాస్తవం: నిజాం నవాబు-ఆయన ఇచ్చిన భూమిలో పాఠశాల నిర్మించిన మహబూబ్‌నగర్ జిల్లా వాసి  రాజా రామేశ్వర రావు-గత స్మృతిగా నిలిచిపోయిన అలనాటి (నేటి విద్యారణ్య) పాఠశాల భవనం. నిజాం సంపదగా చెప్పుకుంటున్న నిధులున్నది ఇక్కడే! ఇంతకీ తవ్వకాలు జరుగుతున్న భూమి రాజా రామేశ్వర రావుకి చెందుతుందా? లేక నిజాం ఫర్మానాల ఆధారంగా అదింకా నిజాందేనా? ప్రస్తుతానికి నిజాం లేడు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వానిదా? భూమి ఎవరిదైనా నిధి నిక్షేపాలను, బంగారం లాంటి లోహాలను పకడ్బందీగా పసిగట్టే టెర్రెస్ట్రియల్ స్కానర్లు, ఇతర పరికరాలతో సర్వే చేసి మరీ నిధిని బయటకు తీసే ప్రయత్నంలో వుంది ప్రభుత్వం. నిజాం నగలు అక్కడుండడానికి కారణాలనూ బయటపెట్తున్నారు కొందరు పురావస్తు శాఖ అధికారులు. వారి దగ్గర వున్న ఆధారాల ప్రకారం విద్యారణ్య పాఠశాల సమీపంలో బయటపడనున్నది  రెండో స్ట్రాంగ్ రూమ్ అనీ, మొదటిది హోం సైన్స్ కాలేజీలో ఉందనీ, దాన్ని ఏడాది క్రితం తవ్వి తీశామనీ, ఈ రెండూ కాకుండా మరో రెండు కూడా ఉన్నాయనీ, రికార్డుల ఆధారంగా చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు వీటిలో ఉంటాయనీ ఒకరిద్దరు పురా శాస్త్ర అధికారులు అంటున్నారు. నిజం నిలకడ మీద వెల్లడవాలి. ఇంతకీ అంతుచిక్కని ప్రశ్న "హోం సైన్స్ కాలేజీ" లో బయటపడ్డ స్ట్రాంగ్ రూమ్‌లో దొరికిన నిధుల విలువ ఎంత? ఆ నిధులేమయ్యాయి? ఎవరూ మాట్లాడరేం?

ఈ నేపధ్యంలో, ఇప్పుడు హైదరాబాద్‌లో తవ్వకాలు జరుగుతున్న విద్యారణ్య పాఠశాల ఆవరణ యజమాని రాజా రామేశ్వర రావు స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఎదురైన ఒక స్వానుభవం గురించి చెప్పాలి. అచ్చు ఇలానే, నిధులున్న సంగతి ఒక కూలీ ద్వారా బయటకు పొక్కడం, ఆ విషయం మా దాకా చేరడం, అవేంటో కనుక్కుందామని వెళ్ళిన మాకు అవి (నిధులో-కావో కాని అలానే బంగారపు పోతను పోలి వున్న పోత విగ్రహం) కనిపించడం, ఏం చేయాలో తోచని మేము మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయడం, అవేవీ ఫలించక పోవడం, ఇంకా అ మిస్టరీ అలానే వుండడం (మాకు తెలిసినంతవరకు), ఈ విషయాలన్నీ పాఠకులతో పంచుకోవాలనేదే ఈ ప్రయత్నం. ఎవరికైనా " స్వానుభవం" అనేది ఒక రకమైన "కిక్కు లాంటిదే"! అది పొందిన వారికి మాత్రమే అర్థం అవుతుంది. చంద్రమండలం మీద కాలు మోపే అనుభవం-అవకాశం అందరికీ కలగక పోవచ్చు! అందరూ ఎవరెస్టు శిఖరం అధిరోహించక పోవచ్చు! కాకపోతే, వారి-వారి పరిధుల్లో అంతో-ఇంతో కొన్ని స్వీయ అనుభవాలు కలగవచ్చు. అలాంటిదే సరిగ్గా ముప్పై రెండేళ్ల క్రితం, అక్టోబర్ 1980 లో మాకు కలిగింది. ఫలానా చోట నిధి నిక్షేపాలున్నాయని మా దాకా వచ్చిన వార్తలో నిజా-నిజాలు అవగాహన చేసుకోవడానికి ఔత్సాహిక బృందంగా బయలుదేరి, దట్టమైన కొల్లాపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా) అడవిలో ఒక మినీ సాహసయాత్ర చేశాం. ప్రకృతి సహజంగా ఏర్పడిందో, లేక, మానవ నిర్మితమైందో అర్థం కాని రీతిలో వున్న ఒక సొరంగ మార్గంలోకి ప్రవేశించ గలిగాం. ముందుకు మాత్రం సాగే ధైర్యం చేయలేకపోయాం.  

మాకు తెలవడానికి కొన్ని రోజుల క్రితం, మహబూబ్‌నగర్ జిల్లా, అచ్చంపేట అటవీశాఖ డివిజన్‌లోని కొల్లాపూర్ రేంజ్‌లో వున్న అడవి ప్రాంతంలో పనిచేస్తున్న ఒక కూలీ, ఒక "అడవి పందిని" వేటాడుతూ, తనకు తెలియకుండానే, ఒక గుట్టలోని చిన్న గుహలోకి జొరబడ్డాడు. ఒక్క క్షణ కాలంపాటు తనకేం జరిగిందో అర్థం కాలేదతనికి. భయభ్రాంతుడైన ఆ కూలీ, తనను ఏవో మానవాతీత శక్తులు అక్కడికి తరుముకొచ్చాయని భ్రమపడ్డాడు. వచ్చిన దారిలోనే తక్షణం వెనుతిరిగాడు. తన అనుభవాన్ని తోటి కూలీలకు వివరించి, తాను ఆ ప్రదేశంలో, రకరకాల బంగారు విగ్రహాలను చూశానని చెప్పాడు. తిరిగి ఆ గుహలోకి పోతే, మానవాతీత శక్తుల వల్ల తమకు, తమ కుటుంబాలకు ఆపద కలుగుతుందని భావించిన ఆ కూలీలు, ఆ విషయాన్ని అంతటితో మర్చిపోదామనుకున్నారు. కాకపోతే, వారిలో ఒకడు, ఆ వార్తను, అప్పట్లో అచ్చంపేట అటవీ రేంజర్‍గా పనిచేస్తున్న (స్వర్గీయ) కె. ఎస్. భార్గవకు చేరవేశాడు. కొల్లాపూర్ అటవీ ప్రాంతం అచ్చంపేట రేంజ్‌లోకి వస్తుంది. ఏం జరిగిందో పూర్తి వివరాలతో తెలుసుకోవాలనుకున్నాడు భార్గవ. భార్గవ మాకు మంచి స్నేహితుడు. తనంతట తానే అక్కడకు పోకుండా, ఆ విషయాన్ని మాకు చెప్పాడు. అందరం కలిసి అక్కడకు వెళ్లి విషయం స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాం. మా బృందంలో నాతో పాటు, భార్గవ, అప్పట్లో జూనియర్ స్థాయిలో పనిచేస్తున్న (దరిమిలా ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు) ఐఏఎస్ అధికారి జంధ్యాల హరినారాయణ్, విశ్వవిద్యాలయంలో హిస్టరీ-ఆర్కియాలజీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆయన భార్య శ్రీమతి కామేశ్వరి, ప్రముఖ పాత్రికేయులు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక విలేకరి స్వర్గీయ జి. కృష్ణ, అప్పట్లో ఆకాశవాణి విలేకరిగా పనిచేసి దూరదర్శన్ న్యూస్ ఎడిటర్‌గా పదవీ విరమణ చేసిన పాత్రికేయుడు భండారు శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్‌క్రాస్ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ ఏ. పి. రంగారావు వున్నారు. మేమంతా కలిసి అక్కడకు పోవడానికి నిశ్చయించుకున్నాం. అక్టోబర్ 1980 లో వెళ్లాం.

హైదరాబాద్ నగరానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో, నాగర్ కర్నూల్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. కూలీ చూసిన గుహలున్న ప్రాంతం, దట్టమైన అడవిలో, కొల్లాపూర్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వుంది. కొల్లాపూర్ నుంచి తూర్పుగా, చింతపల్లి గ్రామం దాటి, దట్టమైన అడవిలో సుమారు రెండున్నర గంతలు ప్రయాణం చేస్తే వస్తుందా ప్రాంతం. మా వెంట ఒకే ఒక్క జీపు వుండడంతో, రెండు బృందాలుగా విడిపోయి, ఒక రోజు ముందరే అక్కడకు చేరుకుని ఆ రాత్రి గడిపాం అక్కడ. ఆనాటి మా అడవీ ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్ గా వుందనాలి.

అటవీశాఖలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల సహాయ సహకారాల వల్ల, అక్కడ పనిచేస్తున్న కూలీల సహాయం వల్ల, గుహలోకి వెళ్లడానికి, మాకు మార్గం సులభతరమైంది. మధ్యాహ్నానికల్లా బాచ్‍ల వారీగా లోపలికి వెళ్లడం ఆరంభించాం. చిన్న గుట్టలాగా వున్న ఆ ప్రాంతంలో వున్న గుహలోకి ప్రవేశించడం అంత సులువైందే మీ కాదని అర్థం ఐంది. ఒకటిన్నర అడుగుల వ్యాసం మాత్రమే వున్న చిన్న మార్గం గుండా పది-పదిహేను అడుగుల దూరం పాకుకుంటూ పోయి, ఆ తరువాత కొద్ది దూరం, కూర్చున్న భంగిమలో ముందుకు సాగి, కొంచెం తలఎత్తి-దించి వంగుకుంటూ పోతే అసలైన గుహలోకి ప్రవేశించగలిగాం. థ్రిల్లింగ్‍గా వున్నప్పటికీ, అంత చిన్న ఇరుకైన మార్గంలో ప్రయాణం చేయడం కాస్తంత ఇబ్బందిగానే వుంది. లోపలికి చేరుకోగానే, సుమారు ఆరేడు అడుగుల వెడల్పు, ఎనిమిది-తొమ్మిది అడుగుల ఎత్తు వున్న గుహ మార్గం కనిపించింది. ఇంకొంచెం ముందుకు సాగితే, అన్ని వైపుల మరికొంత వెడల్పుతో-ఎత్తుతో గుహల మార్గాలు కనిపించాయి. అలా 50-60 గజాల దూరం ప్రయాణం చేయగలిగాం. ఉక్క పోయ సాగింది. ముందుకు సాగడం కష్టమైంది. మేం ప్రవేశించిన ప్రదేశంలో, కొంచెం దూరంలో, మరికొంత దూరంలో, గదుల లాంటి నిర్మాణాలు కనిపించాయి. ప్లాట్ ఫాం లాగా, వేదిక లాగా కొంత ఎత్తైన ప్రదేశాలు కూడా కనిపించాయి. ఒక ప్రదేశంలో, ఎత్తైన వేదిక వెనుక భాగంలో, విగ్రహాన్ని పోలిన సున్నపు పోత ఆకారం కనిపించింది. చీకటిలో అక్కడ బాటరీ ఫోకస్ వేసి చూచినప్పుడు, అదంతా బంగారం లాగా కళ్లకు కనిపించింది. బహుశా అది "లైమ్ స్టోన్ ఫార్మేషన్" కావచ్చు. ఉక్క పోత తీవ్ర తరం కావడంతో ఎక్కువ సమయం అక్కడ వుండలేకపోయాం. వెనుతిరిగాం. లోపల కొన్ని విరిగిపోయిన మట్టి కుండ ముక్కలు కూడా కనిపించాయి.

అక్కడ మాతో కూలీలు చెప్పినట్లు నిధి-నిక్షేపాలున్న దాఖలాలు లేవు. పెద్దగా ఆర్కియలాజికల్ ప్రాముఖ్యత వున్నా లేకపోయినా, జియలాజికల్ ప్రాముఖ్య తప్పకుండా వుంది. గుహలు-గుహ మార్గాలు అనేకం వుండి వుండాలి. భూగర్భ శాస్త్రజ్ఞులు అధ్యయనం చేయాల్సిందే. సహజ సిద్ధమైన గుహలుగా ఏర్పడడానికి ఎలా వీలవుతుందో తెల్సుకోవడానికి అక్కడ అధ్యయనం చేయవచ్చు. ఎలాంటి రకమైన రాతి కొండలలో గుహలు సహజంగా ఏర్పడే అవకాశం వుందో కూడా అధ్యయనం చేయవచ్చు. అలానే లైమ్ స్టోన్ ఫార్మేషన్ విషయంలోనూ అధ్యయనం చేయవచ్చు. ఆ ప్రదేశం మొత్తం పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పాటు చేయవచ్చు. అక్కడకు "జటప్రోలు జంక్షన్" కొల్లాపూర్ కు పడమటి దిక్కుగా కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలోనే వుంది. ఆ ప్రదేశంలో ఎన్నో దేవాలయాలు శ్రీశైలం కృష్ణా జలాలలో ముంపుకు గురైనందున పునర్నిర్మిస్తున్నారప్పట్లో. అంటే, జటప్రోలు జంక్షన్ కు ఈ గుహలున్న ప్రదేశానికి మధ్య దూరం 35 కిలోమీటర్ల లోపే.

అప్పట్లో ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తెస్తూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది. ఒక పత్రికలో కూడా ఈ విషయాలను గురించి రాయడం జరిగింది. ఇప్పుడా ప్రదేశం ఎలా వుందో ఏమిటో తెలియదు.అందుకే, నిధులున్నాయని ఎవరైనా చెపితే, అవి దొరికినా-దొరకకపోయినా, అక్కడ మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి రావచ్చు. ఇంతకీ విద్యారణ్య పాఠశాల ఆవరణలో నిధులు దొరుకుతాయో లేదో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!

మేమెళ్లిన రోజు రాత్రి "పెదవోట" అటవీ గ్రామస్థులు ఆ వూరి వాగు ఒడ్డున మాకు పెట్టిన విందు భోజనం జీవితాంతం మరువలేం! End

Saturday, February 18, 2012

ఆర్థిక మంత్ర (త్రి) పఠనం: వనం జ్వాలా నరసింహారావు


నెల్లూరు జిల్లా బెజవాడ గోపాలరెడ్డి నుంచి అదే జిల్లాకు చెందిన ఆనం నారాయణరెడ్డి వరకు
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపధ్యంలో, ఆదాయ వనరులు అంతగా ఆశాజనకంగా లేని తరుణంలో, "రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కుంటున్న నేపధ్యం" లో,  "వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకున్న తరుణం" లో, ఆటుపోటులకు ఎదురు నిల్చి-సాహసోపేతంగా ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర శాసనసభలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్లే లక్షా నలబై ఐదు వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్‌ను రూపొందించడంతో పాటు వ్యయాన్ని కూడా లక్షకోట్లు మార్కు దాటినట్లు ప్రకటించడం విశేషం. ప్రణాళికేతర వ్యయం రు. 91 లక్షల కోట్లుగా, ప్రణాళిక వ్యయం రు. 54 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిసారి "పేపర్ లెస్ బడ్జెట్‌ను" ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆనం రామనారాయణరెడ్డికి దక్కింది. ఉపాధి కల్పనకు, రాజీవ్ విద్యా ఉపాధి మిషన్‌కు, రాజీవ్ యువ కిరణాలకు పెద్ద పీట వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏటేటా సాగుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి (త్ర) పఠనకు ఏబైఏడేళ్ల సుదీర్ఘ చరిత్ర వుంది.

బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకూ: 1955-56 నాటి బెజవాడ గోపాలరెడ్డి ప్రసంగం నుంచి 2012-2013 ఆనం రామనారాయణరెడ్డి ప్రసంగం వరకు, ఆసక్తికరంగా పరిశీలించుకుంటూ-పరిశోధించుకుంటూ పోతే, అర్థశాస్త్రంలో-సామాజిక-రాజకీయ శాస్త్రాలలో ఎంతో మంది డాక్టరేట్లు పొందే అవకాశం వుంది.

ఏక కాలంలో, జరిగిపోయిన సంవత్సరం ఆదాయ వనరులను సమీక్షించుకుంటూ, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ-వ్యయ అంచనాలతో మొదలవుతుంది బడ్జెట్ ప్రసంగ ఉత్సవాల సంరంభం. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, ఆదాయ వనరులకు సంబంధించిన గణాంక వివరాలే బడ్జెట్. సంక్షిప్త బడ్జెట్, అర్థశాస్త్ర పరిశీలన, సంవత్సర వార్షిక ప్రణాళిక, శాఖలవారీ వివరాలు, బడ్జెట్ విశ్లేషణ, ఇలా ఎంతో సమాచారాన్ని ఒకప్పుడు పుస్తకాల ద్వారా, ఇప్పుడు పేపర్ లెస్ ప్రక్రియ ద్వారా, తయారుచేసి, సంబంధిత లెక్కలను బహిర్గతం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ ఒక ఎత్తైతే, బడ్జెట్‌ను ప్రవేశపెట్తూ, ఆర్థిక మంత్రి చేసే ప్రసంగం మరో ఎత్తు. ఒక్కో ఆర్థిక మంత్రి, ఒక్కో రకంగా, తనదైన విశిష్ట శైలిలో, సభ్యులను-ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే పలువురిని ఆకట్టుకునే రీతిలో, బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసుకుంటారు. ఆయన ప్రసంగాన్ని, ఆ సమయంలో ఆయన ప్రదర్శించే మానరిజమ్స్ ను ఆసక్తిగా గమనిస్తుంటారెందరో. ఆర్థిక మంత్ర(త్రి) పఠనంలో, శ్లోకాలలోని బీజాక్షరాలలా, ప్రతి ఒక్క వాక్యానికి, బలీయమైన అర్థం-కారణం వుంటుంది. ఒక్కో సారి భావగర్భితంగా, నిగూఢంగా, స్పటికంలా కఠినంగా వుంటాయి మాటలు.

బెజవాడ గోపాలరెడ్డి జులై 8, 1955న చేసిన తన తొలి బడ్జెట్ ప్రసంగంలో నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన తెచ్చారు. పంచవర్ష ప్రణాళికల ప్రస్తావన తెచ్చి, దేశ చరిత్రలో అవి ఒక నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టాయన్నారు. మార్చ్  2, 1956 న చేసిన ఆ తరువాతి ప్రసంగంలో "విశాలాంధ్ర" గురించి ప్రస్తావించారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన ఘనతా ఆయనదే. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన వ్యయాన్ని చూపించి, భావితరాల వారిపై రుణభారం మోపడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన ఆనాడన్న మాటలు నేటికీ వరాల మూటలు. ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు.  రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?ఎనిమిదవ సారి, ఆర్థిక మంత్రిగా చివరిసారి, (మద్రాస్ శాసన సభలో నాలుగు సార్లు, ఆంధ్రలో రెండు సార్లు, ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు సార్లు) 1958-59 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 26, 1958 న బడ్జెట్ ప్రసంగం చేశారు బెజవాడ గోపాలరెడ్డి. అదే రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రప్రధమ మిగులు బడ్జెట్. ఇక ఆ తరువాత "కాసు పర్వం" మొదలైంది. "పరిమిత రెవెన్యూ ఆదాయంతో, మితిమీరిన ప్రభుత్వ రుణభారంతో, బంగారు భవిష్యత్‌పై ఊహాగానాలతో" రాబోయే ఏడాది గురించి మూడు ముక్కలతో కాసు బ్రహ్మానందరెడ్డి 1959-60 సంవత్సరపు ఆర్థిక మంత్ర పఠనం మొదలైంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, పిడతల రంగారెడ్డి లాంటి ఉద్దండ పిండాలు కూడా అదే తరహాలో ప్రసంగాలు తమదైన శైలిలో చేశారు. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

ఇంతకీ ఏమిటీ బడ్జెట్? ఇది కేవలం ఆర్థిక శాఖకు సంబంధించిన అంశమేనా? ఇతరులకు దాని విషయంలో-వివరాలు తెలుసుకోవడంలో ఏ అవసరం లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ అపోహలే. బ్రిటన్ ఆర్థిక మంత్రిని "ఛాన్సలర్ ఆఫ్ ద ఎక్స్ చెక్కర్" అని సంబోధిస్తారు. ఆయన ప్రతి ఏడాది, రాబోయే ఆర్థిక సంవత్సరపు ఆర్థిక అవసరాలు, ఆదాయ-వనరుల వివరాలున్న కాగితాలను "చిన్న తోలు సంచీ” లో వేసుకుని, పార్లమెంటుకు వెళ్లే ఆచారం అనాదిగా జరుగుతోంది. ఫ్రెంచ్ భాషలో బడ్జెట్ అంటే "చిన్న సంచీ" అని అర్థం అంటారు కొందరు. మనది బ్రిటీష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వారసత్వం. వాస్తవానికి చాలా విషయాలలో, బ్రిటీష్ కాలం నాటికీ, నేటికీ, బడ్జెట్ స్వరూప-స్వభావాలలో విప్లవాత్మకమైన మార్పులు అంతగా లేవంటారు ఆర్థిక నిపుణులు. చంద్రబాబునాయుడు కాలంలో "జీరో బేస్డ్‌ బడ్జెట్" అని పిలిచినా, ఇప్పుడు "పేపర్ లెస్" అని పిలిచినా, బడ్జెట్ స్వరూపం మాత్రం, తెలుగు దేశమైనా-కాంగ్రెస్ పార్టీ ఐనా, రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చినా కాపాడడం తప్పనిసరి అని భావించక తప్పదు. ప్రణాళికా కేటాయింపులంటే ఏమిటి? కేంద్రం విడుదల చేసే నిధులకు, మాచింగ్ గ్రాంట్‌లకు ఒక తీరు-తెన్ను అనేది వుందా? ఏ రంగానికి-ఎప్పుడు-ఎందుకు-ఎంత మేరకు నిధుల కేటాయింపులు పెంచాలి, లేదా, తగ్గించాలి అన్న విషయం గురించి సవివరమైన అధ్యయనం వుందా? వాస్తవ పరిస్థితులకు, ఎన్నికలలో చేసిన వాగ్దానాలకు, అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు, బడ్జెట్ అంచనాలకు-ఏడాది చివరలో జరిగిన వ్యయానికి పొంతన అనేది వుంటుందా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎప్పుడూ దొరకదు. ఐనా, ఏటా ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ ఆర్థిక శాఖామాత్యుడు, బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఆగదు. బడ్జెట్ బాగా లేదని ప్రతిపక్షాల విమర్శలు, బాగుందని స్వపక్షాల పొగడ్తలు ఎప్పుడూ పరిపాటే. పన్నులు విధించని ప్రభుత్వం వుండదు. వేసినందుకు విమర్శించని ప్రతిపక్షమూ వుండదు. చివరకు, ఇవన్నీ ఒక పక్కకు పోయి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కే, శాసన సభ ఆమోదం లభించడం ఖాయం. ఇటీవలి కాలంలో చర్చ జరగకుండానే "గిలెటిన్" పద్ధతిన సభ ఆమోదం లభిస్తోంది.

ఈ నేపధ్యంలో, బడ్జెట్ స్వరూప-స్వభావాలు, పుట్టు-పూర్వోత్తరాలు, పూర్వా-పరాలు, తెల్సుకోవడం అవసరం. భారత రాజ్యాంగంలోని 266(3) ప్రకరణ, ప్రభుత్వ వ్యయంపై అటు లోక్ సభ-ఇటు శాసన సభల ఆధిపత్యాన్ని-నియంత్రణను స్పష్టం చేస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నియమ-నిబంధనల సంపుటి (మాన్యువల్) లోని మూడు భాగాలు స్థూలంగా ఈ విషయాలను తెలియచేస్తాయి. మొదటి భాగంలో బడ్జెట్‌ను ఎలా రూపొందించాలనేది, రెండులో వివిధ పత్రాలను క్షేత్ర స్థాయి నుండి సచివాలయం వరకు తెప్పించుకునే విధానం, మూడులో అనుబంధాలకు సంబంధించిన సమాచారం వుంటుంది. ప్రభుత్వ ఖాతాలకు చెందిన పద్దులు ఎలా వుండాలి? ఖాతా పద్దు-శీర్షిక (హెడ్ ఆఫ్ అకౌంట్) అంటే ఏమిటి? మేజర్-మైనర్ హెడ్ అంటే ఏమిటి? అనే అంశాలు కూడా వుంటాయి. బడ్జెట్ మాన్యువల్ లోని నియమాలను "పేరాలు" అని పిలుస్తారు. బడ్జెట్‌కు సంబంధించిన మరి కొన్ని వివరాలు అకౌంట్స్ కోడ్‌లోను, ఫైనాన్షియల్ కోడ్‌లోను వుంటాయి.

ప్రభుత్వం అంటే అతిపెద్ద వ్యవస్థ. అందులో వివిధ శాఖలు, ఉప శాఖలు, వందల-వేల సంఖ్యలో కార్యాలయాలు, వీటి ద్వారా ప్రజలకు చేరాల్సిన లక్షలాది పనులు వుంటాయి. వీటన్నిటి నిర్వహణకు, రకరకాల కార్యక్రమాల అమలుకు, వనరుల సేకరణ జరగాలి. అందుకే బడ్జెట్‌ను, "వార్షిక ఆర్థిక వివరణ", "వార్షిక విత్త వివరణ" గా పిలుస్తారు. వివిధ శాఖల అవసరాల మేరకు, ఆయా శాఖాధిపతుల సూచన మేరకు ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్ కేటాయింపులకు శాసనసభ ఆమోదం తప్పనిసరి. బడ్జెట్‌ను మూడు రకాలుగా విభజించుతారు. "సంచిత నిధి", "ఆకస్మిక వ్యయ నిధి", "ప్రభుత్వ ఖాతా" అని వీటిని అంటారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరే నిధులు-వనరులు, పన్నుల రూపేణా వచ్చే ఆదాయం, పన్నుల రూపేణా కాకుండా వచ్చే ఆదాయం, రుణ సేకరణ నిధులు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం లాంటివి "సంచిత నిధి" కిందకు వస్తాయి. ఒక శాఖ నుంచి వచ్చే నిధులు-వనరులు ఆ శాఖకే ఖర్చు చేయాలని నియమం లేదు. ఐన వసూల్లన్నీ సంచిత నిధి కిందకు జమ అవుతాయి. అలా సమకూరిన నిధులను బయటకు తీసి ఖర్చు చేయాలంటే శాసన సభ ఆమోదం కావాలి. కొన్ని సందర్భాలలో, కొన్ని పథకాలను, అత్యవసరంగా రూపొందించి అమలు చేయాల్సిన అవసరం కలగవచ్చు. ఆర్థిక సంవత్సరం మధ్యలో కాని, బడ్జెట్లకు శాసనసభ ఆమోదం పొందిన తరువాత కానీ, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగని పథకానికి ఖర్చు చేయాల్సిన అవసరం కలగవచ్చు. ఇందుకొరకు రాజ్యాంగపరంగా కలిగించిన వెసులుబాటునే "ఆకస్మిక వ్యయ నిధి" అంటారు. ఇదొక రకమైన శాశ్వత అడ్వాన్స్. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే "కార్పస్" లాంటిది. పథకాల అమలుకు దీని నుండి తీసుకుని, ఆ తరువాత అనుబంధ బడ్జెట్‌లో మంజూరు చేయించుకుంటుంది ప్రభుత్వం. వాడుకున్న మొత్తాన్ని తిరిగి అందులో జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక రకమైన బాంక్ లాంటిది. బాంకర్‍గా కొన్ని లావాదేవీలుంటాయి. ఉద్యోగుల భవిష్యత్ నిధికి, భీమా ప్రీమియంకు, కాంట్రాక్టర్ల నుండి సేకరించాల్సిన డిపాజిట్ల వంటివి "ప్రభుత్వ ఖాతా" లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఏదో ఒక రోజున ఆ డబ్బును తిరిగి వాపస్ చేయాల్సి వుంటుంది. అందుకే దీనిని వేరే ఖాతాగా చూపించడం జరుగుతుంది.

సంచిత నిధిలో మూడు ఖాతాలుంటాయి. రెవెన్యూ, మూల ధనం, రుణ ఖాతాలుగా వీటిని పిలుస్తారు. ప్రభుత్వ నిర్వహణ కయ్యే ఖర్చులన్నీ రెవెన్యూ ఖాతా నుంచి చేస్తారు. భవనాల, రహదారుల నిర్మాణానికి, ప్రాజెక్టుల-ఇతర రకాల ప్రజల మేలుకోరి చేసే పనులకొరకు కావాల్సిన పెట్టుబడులను మూల ధనం ఖాతాలోకి చేర్చుతారు. గత సంవత్సరం రెవెన్యూ ఖాతాలోకి రావాల్సినవి మరుసటి సంవత్సరం వస్తే అవీ మూల ధనం ఖాతాలోకే పోతాయి. రుణ ఖాతాలోకి చేసిన అప్పులు, విడుదల చేసిన రుణాలు వస్తాయి. స్థానిక సంస్థలకు, రైతులకు ప్రభుత్వం విడుదల చేసే రుణాలన్నీ రికవరీ వివరాలతో సహా రుణ ఖాతా లోకి చేరతాయి. ప్రభుత్వానికి చెందిన ఆదాయ-వ్యయాలన్నీ ఈ మూడు విభాగాల్లోనే వుంటాయి. బడ్జెట్ పరంగా "సెక్టోరియల్ క్లాసిఫికేషన్" (వర్గీకరణ) పేరుతో ప్రభుత్వ శాఖలను నాలుగు తరగతులుగా విభజించుతారు. అవి: సాధారణ సేవల శాఖలు, సాంఘిక-సామాజిక సేవల శాఖలు, ఆర్థిక సేవల శాఖలు, ఆర్థిక సహాయక సేవల శాఖలు. ఈ సేవలన్నీ ఖాతాలలో పద్దుల రూపేణా చూపించడానికి మరో రకమైన విభజన వుంటుంది. వివిధ రకాలైన పద్దులను "మేజర్, మైనర్" హెడ్‌లుగా పిలుస్తారు. బడ్జెట్ పరిభాషలో వీటిని "ఏడంచెల" విభజన అంటారు. మొదటి అంచెలో ఏ శాఖ ఏ విభాగం కిందకు వస్తుందో నిర్ణయిస్తారు. ఆ శాఖకు ఒక నంబరు కేటాయిస్తారు. తదుపరి మిగిలిన ఐదు శాఖలను ప్రధాన పద్దు, అనుబంధ ప్రధాన పద్దు, చిన్న పద్దు, సవివరమైన పద్దులుగా పిలుస్తారు. కొత్తగా అనుబంధ సవివరణ పద్దును కూడా చేర్చారు. ఉదాహరణకు రెవెన్యూ ఖాతా పద్దులకు 1-1999 నంబర్లుంటాయి. ఒక్క హెడ్ ఆఫ్ అకౌంట్-ఖాతా పద్దు తెలుస్తే మిగిలినవన్నీ సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విభజన మన ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. అఖిల భారత స్థాయిలో అన్ని చోట్ల ఒకే రకంగా, యూనిఫాంగా వుంటాయి.

బడ్జెట్‌లో ఒక యూనిట్‌కు కేటాయించిన మొత్తాన్ని వినియోగం (అప్రోప్రియేషన్) అంటారు. బడ్జెట్ సంవత్సరం అంటే ఏప్రిల్ మొదటి తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ 31 వరకు. ఏ సంవత్సరానికి ఆమోదించిన మొత్తాన్ని అదే సంవత్సరం ఖర్చు చేయాలి. చేయక పోతే మురిగి పోతుంది. ప్రతి శాఖ మంత్రి తన శాఖ నిర్వహణకు కొంత మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా శాసన సభను కోరడాన్నే "డిమాండు" అంటారు. శాసన సభ ఆ డిమాండును ఆమోదించిన తరువాత దాన్ని "గ్రాంట్" అంటారు. ఇలా అన్ని శాఖల గ్రాంటులు కలిపి, బడ్జెట్ సమావేశాల చివరలో "ద్రవ్య వినియోగ బిల్లు" (అప్రోప్రియేషన్ బిల్) ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందుతారు. సభ ఆమోదం పొందిన దాన్ని "అప్రోప్రియేషన్ యాక్ట్" అంటారు. ప్రభుత్వం చేసే ప్రతి ప్రతిపాదనను క్షుణ్ణంగా చర్చించే అవకాశం-అధికారం శాసనసభ్యులకు వుంది. బడ్జెట్‍పై చర్చ ఇంకా ప్రారంభం కావాల్సి వుంది. ప్రారంభమైనా చర్చ పూర్తిగా కొనసాగుతుందా అనేది ప్రశ్నార్థకమే! చివరకు డిమాండ్లన్నీ ఎప్పటిమాదిరిగా గిలెటెన్ అయ్యే ప్రమాదమే ఎక్కువా కనిపిస్తోంది!

ఇంత సుదీర్ఘమైన ప్రక్రియలో బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదం లభించినా "బడ్జెట్‌లో" చూపించింది ఖర్చు చేయరని, ఖర్చు చేసింది బడ్జెట్‌లో చూపించరని (What is budgeted is not spent and what is spent is not budgeted!) ఆర్థిక నిపుణులు అంటుంటారు. End



Friday, February 17, 2012

అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?: వనం జ్వాలా నరసింహారావు


అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?


రాష్ట్ర శాసనసభలో 2012-2013 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు. అది ఆయన ఒక్కడి తప్పు కాదు. ఆ పాపం ఆనాటి నుంచీ నేటిదాకా కొనసాగిస్తున్న గత ప్రభుత్వాలది కూడా. ఏళ్ల తరబడి పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వ రధ సారధులది, ఆ ప్రభుత్వాలలో పని చేసి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆయన పూర్వీకులది, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మంత్రుల అడుగు జాడలలో నడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రులదీ కూడా! ఏదేమైనా కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కొంత అభినందించాల్సిందే.
కిరణ్ సర్కారు మానస పుత్రికలైన మూడు పథకాలు... యువజనులకు ఉపాధి సంక్షేమం, మహిళల కోసం స్త్రీ నిధి, రైతుల కోసం వడ్డీలేని రుణాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్ ద్వారా సాధికారత కల్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి-ఆనం రామనారాయణ రెడ్డిలు రాష్ట్ర బడ్జెట్‌ను సమ్మోహనాస్త్రంగా ప్రయోగించారు. ఎన్నికల నాటికి వైఎస్‌ను మరిపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. "యువజనులు, స్త్రీలు, రైతులు" లక్ష్యంగా తీర్చిదిద్దిన బడ్జెట్ ఇది అన్న ముద్ర పడే విధంగా జాగ్రత్త పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంతో పాటు నిరుపేద వర్గాల కోసం ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాటిని కొంత మేరకు కొనసాగిస్తూనే, యువజనులు, రైతులు, మహిళలను ఆకట్టుకునే కొత్త పథకాలపై దృష్టిపెట్టారు. అలానే "రాజీవ్ యువ కిరణాల" కు పెద్ద పీట వేశారు. లక్షకు పైగా ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ చెప్తున్న ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా కొత్త ఉద్యోగుల వేతనాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. అంటే చెప్పింది చెయ్యబోతున్నారన్న మాట. మహిళలకు పావలా వడ్డీని కూడా తీసివేసి "వడ్డీ లేని రుణాలు" ఇస్తామంటూ ప్రకటించారు. స్వయం సహాయ బృందాల సభ్యులు, రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకునే లక్ష రూపాయల లోపు రుణానికి జీరో వడ్డీ అని, రైతులు పావలా వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం తెచ్చుకోవచ్చని, దానికి అనుగుణంగానే బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ అంకెల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. రూపాయికే కిలో బియ్యం పథకం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. విద్యుత్ సబ్సిడీని పెంచారు. స్కాలర్‌షిప్‌‍లకు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్‌కు, బీసీ సంక్షేమానికి, సాంఘిక సంక్షేమానికి, గిరిజన సంక్షేమానికి, మైనారిటీ సంక్షేమానికి, విద్య, వైద్యం, గృహ నిర్మాణంకు కేటాయింపులు కొద్ది మొత్తాలనుంచి, భారీ మొత్తాలకు పెంచడం జరిగింది. రాజకీయంగా పట్టు సాధించేందుకు "ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి" ని మరింత బలోపేతం చేశారు. ఇంతకీ ఈ కేటాయింపులలో వాస్తవికత ఎంత? బడ్జెట్‌లో కేటాయించిందే సంబంధిత శాఖలకు ఖర్చు చేస్తారా? కేటాయించని వాటి కింద అసలు ఖర్చే కాదా? అన్న ప్రశ్నలకు మళ్లీ వచ్చే ఏడాదే సమాధానం దొరకాలి. ఉదాహరణకు గత ఏడాది జలయజ్ఞంకు కేటాయించిన నిధులలో మూడు వంతులు మాత్రమే వినియోగించడం జరిగింది. మిగాతావి మురిగిపోయినట్లే కదా? అలా ఎందుకు జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో, నీటి పారుదల రంగానికి, పాఠశాల విద్యకు అధికంగా కేటాయింపులు జరిగాయనేది వాస్తవం. అవి ఖర్చు చేస్తే మంచిదే!
ఇలా కేటాయింపులు చేయడం, రాజకీయాలను దృష్టిలో వుంచుకుని ప్రాధాన్యతలను నిర్ధారించడం, బడ్జెట్‌లో రాజకీయ ఉపన్యాసాలు చేయడం, ఆనవాయితీగా వస్తున్నదే. ఈ విషయంలో తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు ఒకరికంటే మరొకరు మిన్న అని చెప్పక తప్పదు. ఉదాహరణకు 2001-2002 ఆర్థిక సంవత్సరానికి నాటి తెలుగుదేశం హయాంలో, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, విజన్ 2020 భవిష్యత్ దర్శిని లక్ష్య సాధనకు కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిరూపమే ఆ సంవత్సరపు బడ్జెట్ అన్నారు. అప్పట్లో రాష్ట్ర వార్షిక ప్రణాళిక అంచనా తొమ్మిదివేల కోట్ల రూపాయల లోపే! కాకపోతే అప్పటికే రుణభారం సుమారు ఏబై వేల కోట్ల రూపాయలకు చేరుకునే సూచనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికే వున్న ఆ రుణ భారం దిన-దినాభివృద్ధి చెంది, నేటికి తీర్చలేని స్థితికి చేరుకుంది. ఆర్థికాభివృద్ధి అంటే ఇదే! దీనికి ఏ ప్రభుత్వం నుంచీ సమాధానం లేదు-రాదు.
మన రాష్ట్రంలో శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి సుమారు అరవై ఏళ్ల చరిత్ర-నేపధ్యం వుంది. 1955-56 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకు, 57 పర్యాయాలు పలువురు ఆర్థిక మంత్రులు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వారిలో రోశయ్య లాంటి కొందరు రికార్డు స్థాయిలో పదమూడు సంవత్సరాలు, బెజవాడ గోపాలరెడ్డి లాంటి వారు ఎనిమిది సంవత్సరాలు (మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత వుంది. జులై 8, 1955 న బెజవాడ గోపాలరెడ్డి మొట్టమొదటి సారిగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, రెవెన్యూ ఆదాయం కేవలం రు. 2, 198 లక్షలుగా, రెవెన్యూ వ్యయం రు.  2, 564 లక్షలుగా, రెవెన్యూ లోటు రు. 366 లక్షలుగా, నికర లోటు రు.  434 లక్షలుగా చూపించారు. ఇప్పటి లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్లకు, లక్ష కోట్ల వ్యయానికి, నాటి బడ్జెట్లకు పోలికే లేదు! అలానే ఆయన, మరుసటి సంవత్సరం రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ సమర్పిస్తూ చేసిన ప్రసంగం నేటికీ స్ఫూర్తిదాయకమే. దానిని ఎరలా తీసుకున్నా వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం వుంది. మార్చ్ 2, 1956 నాటి ఆ బడ్జెట్ ఉపన్యాసంలో, విశాలాంధ్ర ప్రస్తావన తెచ్చారు బెజవాడ గోపాలరెడ్డి. విశాలాంధ్ర ఏర్పడితే అదే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న చివరి బడ్జెట్ ప్రసంగం అని ప్రారంభించారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపు దిద్దుకుంటున్న తరుణంలో రాష్ట్రాల పునర్విభజన నివేదికపై జరుగుతున్న చర్చల సారాంశాన్ని సభ్యులకు తెలియచేశారాయన. అలానే, తెలుగు మాట్లాడే వారందరికీ, ఒకే రాష్ట్రం వుంటే బాగుంటుందన్న విషయాన్నీ, వుండాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేసారు (ఆయన భావాలతో నేను ఏకీభవిస్తున్నట్లు అర్థం కాదు). తన సుదీర్ఘ ప్రసంగంలో ఉద్దండ కవులైన అల్లసాని పెద్దన్న, బమ్మెర పోతన్న, రామరాజ భూషణుడు, తిక్కన సోమయాజిల పేర్లను ప్రస్తావిస్తూ, ఆ మహానుభావులు నడిచిన నేలలో నివసించే తెలుగు వారందరూ, వారి అడుగుజాడలలో ఐకమత్యంతో మెలుగుతారన్న విశ్వాసాన్ని బెజవాడ గోపాలరెడ్డి వెల్లడించారు. విశాలాంధ్ర స్థాపనకు కష్టాలు భరించాల్సి వుంటుందనీ, తరువాత బాధ్యతలు పెరుగుతాయనీ, ప్రజలు సర్దుబాటు ధోరణిలో మసలుకుంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన హెచ్చరించారా నాడే!
అంతటితో తన బాధ్యత తీరిందనుకోలేదు బెజవాడ గోపాలరెడ్డిగారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను జులై 3, 1957 న రాష్ట్ర శాసన సభలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనే దక్కించుకున్నారు. సాంప్రదాయానికి భిన్నంగా తన బడ్జెట్ ప్రసంగం వుంటుందని మొదలే విశదపర్చారాయన ఆనాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా వివరించి, దానిపైన శాసనసభ, పత్రికారంగం, దేశ ప్రజల స్పందన తెలుసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన ఖర్చును చూపడం ఆయన ఆనాడే వ్యతిరేకించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికో, విద్యుత్ ఉత్పాదన కొరకో, అప్పులు చేస్తే పరవాలేదని, శాంతిభద్రతలకు-ఆరోగ్య విద్యా సదుపాయాలకు-కమ్యూనికేషన్స్ రంగానికి, ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసి ఆ ఖర్చును భావితరాల వారిని భరించమనడం కన్నా, మనమే ఆ బరువు మోయడం సమంజసమని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం, ఫలితాలు ఇప్పుడు అనుభవించి, భారాన్ని కొడుకులకు, మనుమలకు, ముని మనుమలకు అందచేయడం తప్పుడు విధానమని. అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కాని, రిజర్వ్ బాంకును కాని, రాష్ట్ర ఆర్థిక భారాన్ని మొత్తానికి-మొత్తం నెత్తిన వేసుకోమనడం సరైంది కాదని కూడా ఆయన ఆనాడే సూచించారు. ఇక్కడో చక్కటి మాట చెప్పారు. రాష్ట్రాలలో అమలు కావాల్సింది, ఇక్కడి ప్రభుత్వాలు అమలుపర్చే కేంద్ర ప్రణాళిక కాదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణాలతో-నిధులతో-ఆర్థిక సహాయంతో అమలు పరిచే రాష్ట్ర ప్రణాళిక అని స్పష్టం చేసారు. మన ఆర్థిక వనరులతో, మన పన్నుల విధానంతో, పొదుపు చర్యలతో, స్వయంగా రుణాలు సమకూర్చుకోవడంతో, కేంద్ర ప్రభుత్వ సహాయానికి అదనంగా ప్రణాళికను రూపొందించుకోవాలని బెజవాడ గోపాలరెడ్డి అన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు.
 రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి చెప్పిన విశాలాంధ్ర విషయం కాని, తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?
ఈ నేపధ్యంలో అల నాడు తన జిల్లాకే చెందిన బెజవాడ గోపాలరెడ్డి బడ్జెట్ ప్రసంగాల స్ఫూర్తిని, ప్రవేశ పెట్టిన తీరును, ఈ నాటి ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతవరకు అనుకరించారనేది నిర్ణయించాల్సింది పాఠకులే! 

Monday, February 6, 2012

పాలనా రథంలో సరిగమలు-పదనిసలు: వనం జ్వాలా నరసింహారావు


పాలనా రథంలో సరిగమలు-పదనిసలు
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వంపై ప్రత్యక్ష-పరోక్ష యుద్ధం ప్రకటించారు. సిబిఐ జరుపుతున్న దర్యాప్తు వ్యవహార ప్రక్రియ కేంద్రంగా మొదలెట్టిన ఐఏఎస్‌ల సమరం దరిమిలా నేరుగా సర్కారుపైనే గురిపెట్టే వరకు పోయింది. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో "సెక్షన్ ఆఫీసర్" స్థాయి నుంచి సెక్రటరీమంత్రుల-ముఖ్యమంత్రి(?) వరకు అంతో-ఇంతో అందరూ దంచుకుంటారన్న అర్థం స్ఫురించే రీతిలో మీడియా ముందు ఐఏఎస్‌ల యూనియన్ నాయకులు అక్కసు వెళ్లబుచ్చారు. పైగా ఈ విషయం మీడియాతో సహా అందరికీ తెల్సిందే అన్నట్లు మాట్లాడారు! వారి మాటలను బట్టి, తమలో (అధికారుల) కొందరితో సహా కొందరు అనధికారులు(మంత్రులు) భారీ మొత్తంలో అవినీతికి కారణమై వుండవచ్చనీ, అందరినీ సమ న్యాయంతో శిక్షించాలనీ అర్థం చేసుకోవచ్చు. తప్పు జరిగిన విషయం, పరోక్షంగానైనా నేరంలో పాలు పంచుకున్న విషయం ఒప్పుకున్నందుకు వారిని అభినందించాల్సిందే!

ఐతే, అసలు విషయం ఇంకొంత లోతుగా ఆలోచించాలి. అధికారుల-అనధికారుల మధ్య వుండాల్సిన సంబంధాలు, మంత్రివర్గ సమిష్టి బాధ్యత, కార్యదర్శి మంత్రికి ఫైలు పంపే విధానం, రొటీనా-ప్రత్యేకత సంతరించుకున్నదా? అన్న అంశాలను కూడా వారు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. సిబిఐ జాయింటు డైరెక్టర్ వ్యవహార శైలినీ తప్పుబట్టారు. పాలనాపరమైన అంశాలలో ఆయనకు అవగాహన లేదంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. జీవో ఇచ్చిన వాళ్లు దోషా? ఇప్పించిన వాళ్లు దోషా? అన్న మీమాంసలనూ లేవనెత్తారు. తెర వెనుక (ఏం జరిగిందో బయటపెట్టడానికి సిద్ధపడకపోయినా) ఎంతో తతంగం జరిగే ఆస్కారం గురించీ మాట్లాడారు ఐఏఎస్‌లు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాము ఎలాంటి పరిస్థితులలో "తప్పు" చేశారో చెప్పకనే చెప్పారు పాపం! మంత్రులు తీసుకునే "నిర్ణయాలను" తాము అమలు పరిచే వారమేనని "భాష్యం" చెప్పారు. స్వతంత్రంగా ఏ ఒక్క ఐఏఎస్ అధికారి నిర్ణయం తీసుకోలేరని మరో కొత్త సంగతిని బయట పెట్టారు. బిజినెస్ రూల్స్ ను, కోడ్ ఆఫ్ కండక్టును, బాధ్యతలను, మంత్రులు-కార్యదర్శులు-ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలనే విషయాన్ని పూస గుచ్చినట్లు వివరించారు. ఇంతకూ తమదేమీ తప్పు లేదని, అంతా మంత్రులదే అన్న చందాన మాట్లాడారు. ఎవరు-ఎవరిని-ఎలా వేధిస్తున్నారన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ వ్యవహారమంతా అర్థం చేసుకోవడానికి ఐఏఎస్‌ల-మంత్రుల మధ్య ఎలాంటి అవగాహన వుండాలి, ఎవరు-ఎవరికి-ఎంత మేరకు జవాబుదారులు, నిర్ణయాల బాధ్యత సమిష్టి దా? కేవలం జీవోలను జారీ చేసినవారి దేనా? లేదా చివరగా "అప్రూవ్డ్‌" అని సంతకం పెట్టిన మంత్రి-ముఖ్యమంత్రిదా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఐఏఎస్ అధికారులలో ధిక్కారణ ధోరణి కొంత కనిపించింది. ఐతే, అది ఆయన మీద కాదు. ఆయన మంత్రివర్గ సభ్యులమీద మాత్రమే. అప్పట్లో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు తాము కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీ అన్న చందాన పనిచేయడం జరిగింది. దాని ఫలితమే ఇప్పుడు వారి ఆవేదనకు కారణమనొచ్చు. ఒకానొక సందర్భంలో, శాసనసభ ఆవరణలో, పలువురి సమక్షంలో, ఒక అమాత్యుడు, తన శాఖ కార్యదర్శి-శాఖాధిపతి (ఇద్దరూ ఐఏఎస్ అధికారులే) కుమ్మక్కై తనతో తప్పు చేయించారని బాహాటంగా విమర్శించారు. మరో మంత్రి, తన శాఖలో జరిగిన తప్పంతా అధికారుల మీద తోసేశాడు. ఇలా మంత్రులకు-అధికారులకు సంబంధాలు బెడిసికొట్టడం ఇప్పుడేమీ కొత్త కాదు. అనాదిగా జరుగుతున్నదే.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో, సివిల్ సర్వెంట్లకు-అమాత్యులకు మధ్య ఎలాంటి సంబంధాలుండాలనే చర్చ ఏనాడో మొదలైంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఐనందున, చాలావరకు బ్రిటీషు సాంప్రదాయాలనే పాటిస్తున్నాం, అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. కాకపోతే ఆచరణలోకి వచ్చేటప్పటికి, మనదైన శైలిలో భాష్యం చెప్పుకుంటున్నాం. వారి మధ్య సంబంధాలంటే, ఎవరికి తోచిన సంప్రదాయాలను వారు పాటించడం కాదు. తమదే సరైందన్న వాదన వినిపించడమూ కాదు. "సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలు" అన్న అంశంపై బ్రిటన్‌లో, 1985 లో, "ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" రూపొందించి, వారి మధ్య వుండాల్సిన సంబంధాలను అందులో పొందుపరిచారు. మరో పదేళ్ల తరువాత ఆ మెమొరాండంకు 1995 లో కొన్ని సవరణలు చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సమీక్షించడం సబబేమో! మెమొరాండంలో పేర్కొన్నట్లు, మంత్రులు చట్టసభలకు ఎలా జవాబుదారీ అవుతారో, అలానే, సివిల్ సర్వెంట్లు (ఐఏఎస్ అధికారులు) మంత్రులకు జవాబుదారీగా వుండాలి. అంటే, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా వుండడం అని అర్థం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా, తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం అధికారి ప్రధమ కర్తవ్యం. సంబంధిత మంత్రికి అవసరమైన తగు సూచనలిస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాలలో సహకరిస్తూండాలి. తమ ఇష్టా-అయిష్టాలకు అతీతంగా, విధానాల రూపకల్పనలో-నిర్ణయాల అమలులో తోడ్పడుతూ, ఎన్నికలలో చేసిన వాగ్దానాలను వాస్తవం చేయాలి. మంత్రులందరూ విద్యావంతులు కానక్కరలేదు. కేవలం విద్యావంతులు మాత్రమే మంత్రులు కావాలని అనుకోవడమంటే, మంత్రి మండలి మరో "బ్యూరోక్రసీ" అవుతుంది కాని "డెమొక్రసీ" వ్యవస్థ కాదు. మంత్రుల నిర్ణయం కార్యదర్శుల-శాఖాధిపతుల సలహా-సూచనల మేరకే అన్నది అక్షర సత్యం.

ప్రభుత్వమంటే, సమిష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మండలి, దాని అధినేత ముఖ్యమంత్రి. ఏ ఒక్క మంత్రి పొరపాటు చేసినా, బాధ్యత అందరిది అన్న విషయాన్ని మరిచిపోయిన నేటి కాలం మంత్రులు, బాహాటంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రినీ తప్పుపట్టుతున్నారు. పాలనాపరమైన విధాన నిర్ణయాలలో మంత్రికి రాజ్యాంగపరంగా ఎంత బాధ్యత వుందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యత వుంది. సంబంధిత శాఖ మంత్రికి సివిల్ సర్వెంటు తోడ్పడడమంటే, తనకు తెలిసిన సమస్త సమాచారంతో పాటు, తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా-నిష్పక్షపాతంగా-రాగద్వేషాలకు అతీతంగా, సలహాలు-సూచనలు ఇవ్వాలి. వారిచ్చే సలహా మంత్రి ఆలోచనా ధోరణికి భిన్నమైనదైనా, అనువైన-శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాల్సిందే! సివిల్ సర్వెంట్లు ఉద్దేశపూర్వకంగానో, మరే ఇతర కారణాలవల్లనో, అలా చేయకుండా, వేరే విధంగా చేసి మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసినా, తప్పుదోవపట్టించినా, అది అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఇంతా జరిగిన తరువాత, ఇదంతా రికార్డు అయిన తరువాత, మంత్రి తీసుకునే నిర్ణయంపై అధికారికి ఎటువంటి అభిప్రాయభేదాలున్నా, అరమరికలు లేకుండా, చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో , ఆ నిర్ణయాన్ని అమలు చేసితీరాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం స్పష్టంగా చెపుతోంది. ఎమ్మార్ కుంభకోణంలోగాని, జగన్ అక్రమాస్తుల సంపాదన ఆరోపణల విషయంలోగాని, ఓబులాపురం గనుల వ్యవహారంలో కాని, ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్న మరే అంశం విషయంలో కాని, అధికారుల-మంత్రుల మధ్య ఇదంతా ఎంతవరకు చోటుచేసుకున్నదనేది బహిర్గతం కావాల్సిన సమయం వచ్చింది. అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే, ప్రభుత్వ పనితీరు, పాలనలో సమర్ధత, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి.

అధికారులు సరైన సలహాను సరైన సమయంలో ఇవ్వకపోయినా, తప్పు జరగడానికి ఆస్కారమున్న సలహాను ఇచ్చినా, మంత్రులను మభ్య పెట్టినా, మంత్రులకు తెలియకుండా అత్యంత రహస్య సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేసినా, దాని దుష్ప్రభావం సంబంధిత మంత్రులపైనా, యావత్ మంత్రి మండలిపైనా, ప్రభుత్వ పాలనా రధం పైనా, పడుతుంది. పర్యవసానం ఏదైనా తప్పొప్పులకు బాధ్యుడు మాత్రం మంత్రే. సివిల్ సర్వెంట్ల (ఐఏఎస్ అధికారుల) పై రాజకీయ ఒత్తిడుల ప్రభావం కూడా పడవచ్చు. రాజకీయ లబ్దికోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, తమ ఆలోచనా ధోరణికి అనుగుణంగా వుండే సలహాను మాత్రమే ఇవ్వాలని-అలాంటిదే పొందాలని, సివిల్ సర్వెంట్లపైనా ఒత్తిడులు వచ్చే అవకాశాలు చాలా సార్లు వస్తాయి. బ్రిటన్ లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలలో ఇది అరుదుగా జరగొచ్చు. మన దేశంలో ఇలాంటివి చాలానే. వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా-విరుద్ధంగా, ఐఏఎస్ అధికారులతో తప్పు చేయించే ధైర్యం ఎంతమంది మంత్రులకు వుంటుందనేది ప్రశ్నార్థకం. మంత్రి ప్రోద్బలం లేకపోయినా అలాంటి తప్పులు అధికారులు చేసే అవకాశాలు లేవా?

ఏదేమైనా ఇటీవలకాలంలో, అఖిల భారత సర్వీసులకు చెందిన "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" అధికారులు కొందరు వివాదాలలో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, మంత్రులకు వంతపాడడం, బెడిసికొట్టినప్పుడు మంత్రులదే తప్పని వాదించడం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం, అలవాటుగా మారిందన్న సంకేతాలొస్తున్నాయి. ఒక ఎస్. ఆర్. శంకరన్ లాగా పిలిపించుకునే వారిని వేళ్లమీద లెక్కించాల్సి వస్తోంది. కారణం: అత్యంత బాధ్యతతో కూడిన పదవులు అతి పిన్న వయసులోనే చేపట్టి నందువల్ల కావచ్చు. మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. సంప్రదాయాలను పాటించకపోవడం కావచ్చు. సివిల్ సర్వీసులలో సంస్కరణలు అమలు కాకపోవడం వల్ల కావచ్చు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.

"ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" (ఐఏఎస్) ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి "ఉక్కు వ్యవస్థ" గా అభివర్ణించారు. స్వాతంత్ర్యానంతరం, ప్రభుత్వ విధి-విధానాల రూపకల్పనలో సహాయపడేందుకు, నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలనా యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో "ఐఏఎస్" ఆవిర్భవించింది. అంతకుముందు ఆంగ్లేయుల పాలనలో ఆ పనిచేస్తూ వచ్చిన, "ఇండియన్ సివిల్ సర్వీస్" కు విప్లవాత్మకమైన మార్పులు-చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించింది ప్రభుత్వం. ఈ సర్వీసుకు ఎంపికైన అభ్యర్థులు పౌర పరిపాలనలోను, విధానాల రూపకల్పనలోను-నిర్ణయాలలోను, ఆంతరంగిక-విదేశీ సంఘర్షణలను చాకచక్యంగా  అంచనావేసి నివారించడంలోను, కీలక పాత్ర పోషించ దగ్గ వ్యక్తులై వుంటారు. సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు విభిన్న రకాల విద్యలలో తమదంటూ ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన అభ్యర్ధులను ఒక క్రమ పద్ధతి ప్రకారం, విస్తృతమైన-కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. ఇలా ఎంపికైన వారి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత వుంటుంది. కార్య నిర్వహణ అధికారాల విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కూడా లేదు. దేశ సమగ్రత-సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు ఈ వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని సర్దార్ పటేల్ అనేవారు.

ఐఏఎస్‌కు ఎంపికైన వారికి సబ్ కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు, పనిచేసే అవకాశం వుంది. ఇవన్నీ వారి-వారి సమర్ధతను బట్టి లభించాలి. కాని, ఇటీవల కాలంలో, పలు సందర్భాలలో అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల అండతో, వారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందుతున్నారన్న ఆరోపణలు అనేకం వస్తున్నాయి. "సమర్ధత" కన్నా, "చొరవ", "పలుకుబడి" ప్రాతిపదికలుగా, ప్రాధాన్యతల పోస్టులు దక్కించుకుంటున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, మంత్రుల ఆదేశాలకు అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటూ తాత్కాలిక లబ్ది పొందుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గణనీయంగా పెరిగింది. దాని ఫలితం ఇప్పుడు తెలుస్తోంది. ఏదైనా పాలనాపరమైన నిర్ణయం ప్రజోపయోగం కొరకు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అధికారులు, మంత్రుల ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం "ఒత్తిడి" కిందకు రాదు. అది సరైన సమయంలో సరైన స్పందన అనాలి. అలా కాకుండా మంత్రుల వ్యక్తిగత ప్రయోజనాలకొరకు తల ఊపితే దాని ఫలితం అనుభవించక తప్పదు. "ఆన్ రికార్డ్" అభ్యంతరం చెప్పాలి. అలా జరిగిందో, లేదో, తెలుసుకునే ప్రయత్నమే సిబిఐ దర్యాప్తు అని భావించాలి. కాకపోతే, సిబిఐ ఎందుకు రాజకీయ నాయకులను విచారించడం లేదో అనేదే అంతుచిక్కని ప్రశ్నదోషులైన వారు రాజకీయ నాయకులైతే తప్పకుండా విచారణ జరగాలు. శిక్షార్హులు కావాలి.

ఐఏఎస్ అధికారులు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజం ఎత్తడం ఇదే మొదటి సారి కాదు. లోగడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, దాదాపు ఇంతే మోతాదులో, రాష్ట్రం వేధింపులనుండి రక్షించమని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి, జనవరి 1989 లో అలనాటి ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి, హెచ్ కే బాబు  ఫిర్యాదు చేశారు. కాకపోతే, అప్పట్లో ఫిర్యాదుకు కారణం, ఇప్పటి లాగా సిబిఐ వేధింపులు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుండే ఏసిబి సంస్థ సుమారు నలభైమంది ఐఏఎస్‍లపై దర్యాప్తు చేపట్టడమే. అప్పట్లో ఐఏఎస్ అధికారులతో కొందరి ఐపిఎస్ అధికారులు కూడా జతగా తమ గోడు మీడియా ముందు వెళ్లబుచ్చుకోవడం విశేషం. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం 1989 లో చేసిన ఫిర్యాదుకు స్పందించిన అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి కల్యాణ కృష్ణన్ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. ఆర్. నాయర్‌ను ఢిల్లీకి పిలిపించారు కూడా . ఇప్పుడు కూడా రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగును కలిసి సిబిఐ మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో వుంది. ఏం జరుగనున్న దో వేచి చూడాలి.