శాసన సభ బడ్జెట్ సమావేశాలు 29-03-2012 న ముగిసిన సందర్భంగా
వనం జ్వాలా నరసింహారావు
“ఎనిమిదిమంది తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ సభ్యులు అసెంబ్లీలో స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సీట్ల వద్దే నిలబడి తెలంగాణ నినాదాలు చేశారు. అదే విధంగా తెలంగాణ తెలుగుదేశం సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు, సీపీఐ, బీజేపీ సభ్యులు, ఎవరికివారే, తెలంగాణ అంశంపై వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టాయి. సభాపతి నాదెండ్ల మనోహర్ వీటిని తిరస్కరించడంతో, టీ-టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ సభ్యులతోపాటు స్వతంత్య్ర ఎమ్మెల్యే నాగం జనార్థన రెడ్డి జై తెలంగాణ నినాదాలతో స్పీకర్ పోడియంను చుట్టు ముట్టారు. స్పీకర్ ఎంత వారించినా సభ సజావుగా సాగేందుకు వారు సహకరించక పోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే మరో మారు టీ-టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ సభ్యులు తెలంగాణ నినాదాలతో స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు. టీ-కాంగ్రెస్ సభ్యులు మాత్రం వారి సీట్ల వద్ద నిలబడి తెలంగాణకు అనుకూలంగా గొంతు విప్పారు. ఇదిలా ఉంటే... మరికొందరు శాసనసభ సభ్యులు కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారు స్పీకర్ పోడియం వద్దకు చేరుకోక మునుపే స్పీకర్ సభను మరోసారి వాయిదావేశారు. ఆ తరువాత మర్నాటికి వాయిదా వేశారు" ఇది ఒక రోజు శాసనసభ పరిస్థితి. ఈ పరిస్థితే ఐదారువారాల పాటు కొనసాగింది. అటు ప్రతిపక్షాల వారికి కాని, ఇటు అధికార పక్షానికి కాని శాసనసభ సజావుగా జరగాలని కాని, ప్రజా సమస్యలపై చర్చ జరగాలని కాని లేదనటానికి ప్రతిరోజూ చోటుచేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉదహరించవచ్చు.
ఐదారు వారాల పాటు జరిగిన రాష్ట్ర శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చ మచ్చుకు కూడా జరగలేదు. అలా జరగకపోవడానికి అధికార, ప్రతిపక్షాల సమష్టి బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణం. శాసనసభ ప్రతిరోజూ సమావేశమైంది కేవలం వాయిదాపడటానికే అని పౌరులందరికీ అర్థమైంది. సభ సమావేశం కాగానే, ఆనవాయితీగా, ప్రశ్నోత్తరాల అంశం చేపట్టాలని సభాపతి కోరడం, ఆయన నోట ఆ మాట వచ్చే లోపునే ప్లకార్డులతోనో, నినాదాలతోనో, వాయిదా తీర్మానాలతోనో, అలాంటి మరో అంశంతోనో, ప్రతిపక్షాలు ఎవరి ఎజెండాతో వారు సభ జరగకుండా అంతరాయం కలిగించేందుకు శ్రీకారం చుట్టడం జరిగేది. సభాపతి తన సహజ సిద్ధమైన నవ్వు ముఖంతో, సభ్యులను అత్యంత గౌరవ మర్యాదలతో సంబోధిస్తూ, సభకు అంతరాయం కలిగించ వద్దని, సాంప్రదాయాలు-సభా మర్యాదలు కాపాడమని విజ్ఞప్తి చేయడం, ఆయన మాట ఆందోళన చేస్తున్న సభ్యులు ఏ మాత్రం వినిపించుకోక పోవడం, అలా కొంత సేపు జరిగిన తరువాత, సభను పది-పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు వాయిదా వేయడం చోటుచేసుకునేది. ఆ తరువాత సమావేశం కావడం, అదే సీను మళ్లీ పునరావృతం కావడం, అలా ఒకటి-రెండు పర్యాయాలు జరిగిన తరువాత మర్నాటికి సభ వాయిదా పడడం నిత్యకృత్యమైపోయింది. సభను కొనసాగేలా చూడడానికి, సభాపతి, బిజినెస్ అడ్వైజరీ కమిటీని, ఫ్లోర్ లీడర్లతో సమావేశ పరిచి కొంతలో కొంత అవగాహన కుదిర్చినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. కాకపోతే, రాజ్యాంగపరంగా, తప్పనిసరిగా శాసనసభ చేపట్టాల్సిన అంశాలను మాత్రం, ఏదో ఒక పద్ధతిని అవలంబించి, కొనసాగించడం జరిగింది. ఉదాహరణకు, బడ్జెట్ ప్రసంగం అనుకున్న సమయంలోనే, అనుకున్న విధంగానే, అంతరాయం లేకుండా జరగడానికి, కొందరు సభ్యులను సభ నుంచి సస్పెండు చేయడం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం కూడా ఆగలేదు. సభ జరిగినా-జరగకపోయినా బడ్జెట్‌ను శాసనసభ గిలెటిన్ పద్ధతిన ఆమోదం పొందడమూ ఆగలేదు. ఎటొచ్చీ సభలోకి రాంది-సభ చర్చించనిది ప్రజా సమస్యలనే. దీనికి ప్రధాన కారణం సభ్యులు ప్రతిదినం ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలు-వాటికి సభాపతి నిర్ద్వందంగా తిరస్కరణ. వాయిదా తీర్మానాలలోని అంశాలను మరో పద్ధతిన లేవనెత్తితే బాగుంటుందని ప్రతి పక్షాలు భావించలేదు. పోనీ, ఒకటో-రెండో తీర్మానాలను అనుమతించితే సరిపోతుంది కదా అని సభాపతి భావించలేదు. అధికార-ప్రతి పక్షాల మధ్య పట్టు విడుపులు లేక పోవడంతో చివరికి జరిగింది ప్రజా సమస్యలను సభలో చర్చించకపోవడమే!
ఇంతకీ, ఈ వాయిదా తీర్మానం అనే ఆయుధాన్ని ఇలా ప్రతిపక్షాలు విచ్చలవిడిగా ఉపయోగించుకోవచ్చా? ఒక వేళ ప్రతిపక్ష సభ్యులు అలా కోరినప్పుడు, ఎల్లవేళలా సభాపతి ఆ తీర్మానాలను తిరస్కరించవచ్చా? వాయిదా తీర్మానంలోని అంతరార్థం సభను వాయిదా వేయించడమే అనే అర్థం స్ఫురించే రీతిలో, సభాపతి, చివరకు చేస్తోంది సభను అరగంట-గంట వాయిదా వేసి, అప్పటికీ సభ్యుల ఆందోళన ఆగకపోతే, ఏకంగా మర్నాటికి వాయిదా వేయడమేనా? సభ్యుడు కోరుకుంది, సభాపతి అంగీకరించింది సభ వాయిదా వేయడమే ఐతే, దీనికింత రాద్ధాంతం ఎందుకు? అంటే, వాయిదా తీర్మానం మనం అనుకుంటున్నంత తేలికైన అంశం కాదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ తీర్మానానికి అత్యంత ప్రాధాన్యత వుంటుందనీ, దురదృష్టవశాత్తు కీలకమైన ఈ విషయాన్ని, అధికార-ప్రతిపక్షాలు అర్థం చేసుకోవడంలో ఎక్కడో కొంత లోపం వుందనీ బోధపడుతోంది.
సాధారణంగా శాసనసభలో చర్చకు చేపట్టాల్సిన అంశానికి సంబంధించి, అది కావాలని భావించిన సభ్యుడు, నోటీసు ఇవ్వడం ఆనవాయితీ. అది ప్రశ్నోత్తరాల రూపంలో కాని, మరో నిబంధన కింద చర్చకు చేపట్టాలని కానీ అడగడం జరుగుతుంది. వాయిదా తీర్మానం లక్ష్యం-ధ్యేయం వేరు. ప్రజా ప్రాముఖ్యత సంతరించుకున్న వర్తమాన కాలానికి చెందిన అత్యంత ప్రాధాన్యతా అంశాన్ని, దాని ద్వారా సంభవించనున్న తీవ్ర పరిణామాలను, చట్ట సభ దృష్టికి తెచ్చేందుకు, సరైన నోటీసు ద్వారా సభాపతిని కోరేదే వాయిదా తీర్మానం. రాష్ట్రంలో సంభవించిన ఒకానొక సంఘటన అత్యంత తీవ్రతరమైంది గా భావించిన నేపధ్యంలోనే, శాసనసభ ఆ విషయంలో ఇతర విషయాలన్నింటినీ పక్కకు పెట్టి ఆ విషయాన్నే చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని కోరడం జరగాలి. అంటే, శాసనసభ సాధారణంగా చేపట్టాల్సిన రోజువారీ కార్యక్రమాన్ని-ఎజెండాను వాయిదావేసి, ఈ అసాధారణ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం. ప్రభుత్వ పనితీరును-వైఫల్యాన్ని సూటిగా ఎత్తి చూపుతూ, ఈ అసాధారణ అంశంపై చర్చ జరగాలని సభ్యుడు కోరడమే వాయిదా తీర్మానం. ఉదాహరణకు, షెడ్యూల్డ్ కులాల-జాతుల వారిమీద, వెనుకబడిన-బలహీన వర్గాల వారిమీద, ఏదైనా అఘాయిత్యం జరిగి ప్రభుత్వం దానిని సరిగ్గా పరిష్కరించ లేకపోతే, అలాంటి అంశాన్ని వాయిదా తీర్మానం ద్వారా లేవనెత్తి, సభ దృష్టికి తెచ్చి చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇవ్వ వచ్చు. ఐతే, ఎటువంటి కారణం చూపకుండా సభాపతి ఆ తీర్మానాన్ని తిరస్కరించవచ్చు.
శాసనసభ ఒక సిట్టింగులో, ఒక్కో సభ్యుడికి, ఒక్క సారి మాత్రమే వాయిదా తీర్మానానికి నోటీసు ఇవ్వడానికి అర్హత వుంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులు తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, మొదటి సంతకం పెట్టిన వ్యక్తి మాత్రమే నోటీసు ఇచ్చినట్లు లెక్క. అతడి కోటా ఐపోయినట్లు భావించాలి. ఒకే అంశంపై, ఒకటికంటే ఎక్కువ నోటీసులు వస్తే, ఆ అంశాన్ని చర్చకు చేపట్టాలని నిర్ణయం జరుగుతే, ఎవరు ప్రతిపాదించిన అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో ఓటింగు చేపట్టడం జరుగుతుంది. సభ సమావేశం ప్రారంభం కావడానికి గంట ముందుగా వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వాల్సి వుంటుంది. నోటీసును నిర్ణీత ఫారంలో మాత్రమే ఇవ్వాలి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసే రోజున నోటీసులు స్వీకరించబడవు. వాయిదా తీర్మానం అంగీకరించాలా? తిరస్కరించాలా? అన్నది సభాపతి నిర్ణయంపైనే ఆధారపడి వుంటుంది. ఆయనదే తుది నిర్ణయం. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఐతే ఆయన నిర్ణయం కొన్ని సంప్రదాయాలమీద, రాజ్యాంగపరమైన మార్గదర్శకాలపైన ఆధార పడి వుండాలి. వాయిదా తీర్మానంలో లేవనెత్తిన అంశం వాస్తవంగా ప్రజా ప్రాముఖ్యత కలిగిందై వుండాలి... అది వర్తమాన కాలానికి చెందిన అంశమై వుండాలి... ఎప్పుడో భవిష్యత్‍లో జరగబోయే సంఘటనకు సంబంధించినది కాకూడదు...ఆ అంశంపై సభ అంతకుముందే చర్చించిన అంశం కాకూడదు... ఎవరైనా సభ్యుడి హక్కులకు భంగం వాటిల్లే అంశం కారాదు. నిబంధనల ప్రకారం వాయిదా తీర్మానం వుందని సభాపతి భావించి తేనే, ఆయన అంగీకరించుతాడు. అలా అంగీకరించితే, ప్రశ్నోత్తరాల సమయం ఐపోయిన తర్వాత, సభాపతి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చిన తరువాత, సభ అనుమతితో నోటీసు ఇచ్చిన సభ్యుడు ప్రవేశపెడ్తాడు. శాసనసభ సభ్యుల సంఖ్యలో కనీసం పదో వంతు మంది తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడితే, చర్చకు సభాపతి అనుమతి ఇస్తారు. వాయిదా తీర్మానానికి సంబంధించిన అంశం గురించి తన దగ్గర సరైన సమాచారం లేకపోతే, సంబంధిత శాఖా మంత్రిని వివరణ కోరిన తరువాత అంగీకరించడం కాని, తిరస్కరించడం కాని చేయవచ్చు. వాయిదా తీర్మానాన్ని సభ ఆమోదించితే (సాధారణంగా జరగదు) సభ ఆటోమేటిక్‌గా వాయిదా పడ్డట్లు లెక్క.
మొత్తం మీద, ఫిబ్రవరి 13న మొదలై, ఆరువారాలపాటు-సుమారు నెల రోజులు నడిచి, మార్చి 29 న ముగిసిన బడ్జెట్ సమావేశాల చివరి రెండు-మూడు రోజులు కూడా సజావుగా నడవలేదు. ఆ మాటకొస్తే, ప్రజాసమస్యల ప్రస్తావనే లేకుండా, ఆసాంతం బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. నామమాత్రపు చర్చ కూడా జరగకుండానే లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. ప్రజాధనం (దుర్)వ్యయంపై చర్చ లేకుండానే నలబై శాఖల పద్దులు గిలెటిన్ అయ్యాయి. పట్టుమని పది రోజులు కూడా పూర్తి స్థాయి చర్చలు జరగలేదు. ధరల పెరుగుదల కాని, తాగు నీటి సమస్య కాని, ధాన్యానికి గిట్టుబాటు ధర కాని, విద్యుత్ కోత అంశం కాని, తెలంగాణ సమస్యపై కాని, మద్యం ముడుపుల వ్యవహారం కాని, అవినీతి నిర్మూలన విషయం కాని, గిరిజన సమస్యలపై కాని, ఆ మాటకొస్తే ఏ ప్రజా సమస్యపై కాని సంతృప్తికరంగా కాకపోయినా నామమాత్రంగా నన్నా చర్చ జరగకపోవడం దురదృష్టం. సుమారు 100 సార్లకు పైగా స్పీకర్ సభను వాయిదా వేయడం జరిగింది. ఇక వారూ-వీరూ అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం విలువైన సభా సమయాన్ని వృథా చేశారనక తప్పదు. నిశితంగా పరిశీలిస్తే పలువురు-పలుమార్లు ఉద్దేశపూర్వకంగానే అడ్డుతగిలారా అన్న అనుమానం కలిగింది.
అధికార-ప్రతిపక్ష పార్టీల సమిష్టి బాధ్యతారాహిత్యానికి ముగిసిన శాసనసభ సమావేశాలే ప్రత్యక్ష నిదర్శనం!