అక్టోబర్ 31, 2012 న
ఇందిరాగాంధీ 28 వ వర్ధంతి సందర్భంగా
ఇందిరాగాంధీ 28 వ వర్ధంతి సందర్భంగా
తనదైన విదేశాంగ విధానంతో
చరిత్ర సృష్టించిన ఇందిరాగాంధీ
Surya Daily on 04-11-2012
చరిత్ర సృష్టించిన ఇందిరాగాంధీ
Surya Daily on 04-11-2012
వనం జ్వాలా నరసింహారావు
ఇందిరా గాంధి హత్యకు గురై 28 సంవత్సరాలు
దాటినా జాతీయ-అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు
అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. కోట్లాది
ప్రజలు అమెనెంతగా అభిమానించేవారో, అంత మోతాదులోనే, ఆమెలోని మంచి
చెడులను నిశితంగా విమర్శించేవారు ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమె దో
అరుదైన వ్యక్తిత్వం.
అణుయుగంలో, అంతరిక్ష యుగంలో
భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత ఇందిరా గాంధీదే. సోవియట్ వ్యోమ నౌకలో
భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే. ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న ప్రాంతాన్ని
విడిపోయేందుకు దోహదపడి, బంగ్లాదేశ్
ఆవిర్భావానికి కారకురాలై, ప్రపంచంలో భారతదేశాన్ని
ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఇందిరా గాంధీదే. పోఖ్రాన్‍లో
మొదటిసారిగా భూగర్భ అణ్వాయుధ ప్రయోగం జరిపించడం ద్వారా, ప్రపంచ
అణ్వాయుధ పటంలో భారతదేశానికి ఒక స్థానం ఏర్పరిచిన ఘనత ఇందిరా గాంధీదే. అగ్ర రాజ్యాల అణ్వాయుధ నిబంధనలకు తమ దేశం కట్టుబడి వుండదన్న సంకేతాలను
పరోక్షంగా ఇచ్చింది ఇందిర. అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం
వహించదని, తమ విదేశాంగ విధానం "భారత
అనుకూల విధానం" అనీ ఎలుగెత్తి చాటి చెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం
వహించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్
యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ, అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడింది. అవసరమైనప్పుడు, తప్పదనుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎదురు
తిరిగి తన సత్తా ఏమిటో నిరూపించింది.
ఇందిరాగాంధీ పేరు-ప్రతిష్టలు, దూరదృష్టి,
ఖండ-ఖండా తరాలు దాటిపోయింది. మానవాళి మొత్తం ఆమె విదేశాంగ విధానం వల్ల లబ్ది పొందింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానమంత్రిగా వున్న ఆమె
విధానాలు-నిర్ణయాల మూలంగా, అంతర్జాతీయ
సంబంధాలలో గణనీయమైన పురోగతి కనిపించింది. అంతర్జాతీయ
స్థాయిలో అమెకు అరుదైన గౌరవం, మర్యాదలు దక్కాయి. ఆమె అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ సంబంధాలకు చెందిన కార్యకలాపాలకు పరిచయం
కాబడింది. జవహర్లాల్ నెహ్రూ కుమార్తెగా, చిన్నతనం నుండే ఇందిరాగాంధీ, తన చుట్టూ వుండే
పరిసరాల ప్రభావం వల్ల, నెలకొన్న రాజకీయ వాతావరణం కారణాన,
అహర్నిశలూ దేశీయ వ్యవహారాలతో పాటు అంతర్జాతీయ సంబంధాలకు చెందిన
చర్చలలో పాల్గొనే అవకాశం తన ఇంట్లోనే లభించేది. నెహ్రూ
ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో, ఇందిరాగాంధీ తీన్ మూర్తీ
భవనానికి వచ్చే పలువురు విదేశీ ప్రముఖులకు అధికారిక ఆతిధ్య దాతగా వ్యవహరించేది.
అలా వచ్చిన వారిలో ప్రధానులు, రాష్ట్రపతులు,
విదేశాంగ మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు,
రాజ్యాధినేతలు, అనేక రంగాలలో నిష్ణాతులైన కీలక
వ్యక్తులు వుండేవారు. దానికి తోడు తండ్రి విదేశీ పర్యటనలలో
ఇందిర తప్పకుండా వెంట వుండేది. ఆమె ప్రధానిగా బాధ్యతలు
స్వీకరించిన కొద్ది రోజులలోనే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా,
భారత విదేశాంగ విధానాన్ని ఆసాంతం అర్థం చేసుకో గలిగింది.
ఇందిరాగాంధీ చరిత్రను ప్రభావితం చేయడమే కాకుండా, చరిత్ర
సృష్టించింది కూడా. ఆమె రాజనీతిజ్ఞతతో అగ్రరాజ్యాలు ఒకదానిపై
మరొకటి నిరంతరం కత్తులు దూసుకోకుండా చేయగలిగింది. అలీనోద్యమం
ద్వారా అ రెండింటి మధ్య సమతుల్యం పాటించే ట్లు చూడగలిగింది. విదేశీ
వ్యవహారాలలో- విదేశాంగ విధానం అమలు పరచడంలో ఇందిరాగాంధీ,
అంతర్జాతీయ శాంతి-సౌభ్రాతృత్వం, నిరాయుధీకరణ, వలస వాద వ్యతిరేకత, జాతి వివక్షత వ్యతిరేకత అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. కామన్వెల్త్, అలీన దేశాల, ఐక్య
రాజ్య సమితి వేదికలను తన కనుకూలంగా, తన వాణిని
వినిపించేందుకు ఉపయోగించుకుంది ఇందిరాగాంధీ. ఆమె ప్రధానిగా
బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో, ప్రపంచం దాదాపు రెండు
బృందాలుగా విడిపోయింది. ఒక బ్లాక్‌కు అమెరికా, మరో దానికి సోవియట్ యూనియన్ దేశాలు నాయకత్వం వహించేవి. ఇరు దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం నిరంతరం సాగుతుండేది. అణ్వాయుధ పోటీ నెలకొని వుండేది. వలస వాద-సామ్రాజ్యవాద జ్ఞాపకాలు ఇంకా మిగిలే వున్నాయప్పటికి. జాతి వివక్షత పూర్తి స్థాయిలో చోటు చేసుకుంది. ప్రపంచ
శాంతి అందని ద్రాక్ష పండులాగా వుండేది. ఆ నేపధ్యంలో, అలీన సిద్ధాంతాన్ని ఆమె అమలు చేయసాగింది. దాన్నే ఒక
ఆయుధంలాగా ఉపయోగించసాగింది. అచిర కాలంలోనే, ఇందిరాగాంధీకి అలీన ఉద్యమ నేతగా, శాంతి కాముకురాలిగా,
స్వాతంత్రాభిలాషిణిగా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. 1983 లో
న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల ఉద్యమ ఏడవ సమావేశంలో ఛైర్ పర్సన్‌గా ఎన్నిక
కావడంతో ఆమె పేరు-ప్రతిష్టలు ఇనుమడించాయి. అదొక చారిత్రాత్మక సమావేశం. ఇందిర రాజనీతిజ్ఞతకు,
దూరదృష్టికి ఆ సమావేశం అద్దం పట్టింది. త్వరలోనే,
అలీనోద్యమం వూపందుకోసాగింది. ఆమె మూడేళ్ల
కాలపరిమితిలో ఆ ఉద్యమం అంచలంచలుగా అభివృద్ధి చెందింది.
ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతర్జాతీయ రంగంలో
ఇబ్బందుల్లో పడి వుంది భారతదేశం. చైనాతో యుద్ధం ముగిసి దాని ప్రభావం ఇంకా
తొలగిపోని రోజులవి. అంతర్జాతీయ సంబంధాలలో కొంత నిర్లిప్తత
చోటు చేసుకోవడం కూడా జరిగింది. ఇందిరాగాంధీ పదవిలోకి వస్తూనే
మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందనవచ్చు. ఆమె ప్రధానమంత్రి
పదవి చేపట్తూనే "అలీన విధానానికి" తన పూర్తి మద్దతును ప్రకటించింది. యుగోస్లేవియా
అధ్యక్షుడు మార్షల్ టిటో, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్
అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాజర్, ఇందిర ప్రధాని ఐన కొద్ది
రోజులకే, జులై 1966 లో తమ దేశాలకు ఆమెను ఆహ్వానించి ఆమెతో సమావేశమయ్యారు.
అది జరిగిన కొద్ది నెలలకే అక్టోబర్‌లో, ఆ
ముగ్గురు దేశ నాయకుల త్రైపాక్షిక సమావేశం ఢిల్లీలో జరిగింది. సామ్రాజ్యవాదం, వలస వాదం వివిధ మార్గాల ద్వారా
ప్రపంచంలో ఇంకా ప్రబలి పోవడం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన ఆ ముగ్గురు నాయకుల
సమావేశం, ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో ఏదైనా అగ్ర రాజ్యం
జోక్యం చేసుకోవడమంటే శాంతికి విఘాతం కలిగించినట్లే అని ఒక సంయుక్త ప్రకటన విడుదల
చేయడంతో ముగిసింది. అదే సమయంలో ఉత్తర వియత్నాంపై జరుగుతున్న
బాంబు దాడుల విషయంలోను ఆందోళన వ్యక్తం చేసిన ముగ్గురు నాయకులు, తక్షణమే ఆ దాడులను నిలుపుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆ ముగ్గురు మధ్య కుదిరిన ఒడంబడిక ఒక విధంగా అమెరికా, చైనా దేశాలకు అప్పట్లో హెచ్చరిక లాంటిదే.
భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం
సాధించింది.
బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో
తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఇందిరా
గాంధీని ద్వేషించే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన సంపూర్ణ మద్దతును
పాకిస్తాన్ కు ఇచ్చిన నేపధ్యంలో, యుద్ధానంతరం ఆయనకొక ఘాటైన ఉత్తరం రాసిందామె. లక్షలాది
మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి పడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమకుందని, ఆ కర్తవ్య నిర్వహణలో యుద్ధం చేయాల్సి వస్తే, తాను చేసిన తప్పేమిటో స్పష్టం చేయాలని నిక్సన్
ను ప్రశ్నించింది. తనను, తన
దేశాధ్యక్షుడు నిక్సన్‍ను ఇందిరాగాంధీ చావు దెబ్బ తీయగలిగిందని సాక్షాత్తు హెన్రీ కిస్సింజర్
తన ఆత్మకథలో రాసుకున్నా డంటే, బంగ్లాదేశ్ విజయానికి అంత కంటే
పెద్ద అభినందన అక్కర్లేదు. అలనాటి భారత పార్లమెంటు ప్రతిపక్ష
నాయకుడు అటల్ బీహారీ వాజ్‍పాయ్ ఇందిరను దుర్గ మాతతో పోల్చాడు. ఆమె కేవలం చరిత్రనే సృష్టించలేదని, భూగోళాన్ని కూడా
సృష్టించిందని మరో ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్
మీద ఘన విజయం సాధించి, సిమ్లా ఒప్పందం కుదుర్చుకుని ఆమె తన
రాజనీతిజ్ఞతను చూపింది. పాకిస్తాన్ విషయంలో భారతదేశం
సత్సంబంధాలు కలిగి వుండాలని భావించిన ఇందిరాగాంధీ, ఇతర
పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ విషయంలోను అదే తరహాలో నడచుకుంది.
చైనాతో కూడా మంచి సంబంధాలుండాలనే కోరుకునే ది ఇందిరా గాంధీ. రెండవ సారి ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, 1980 లో
బెల్గ్రేడ్‍లో నాటి చైనా ప్రధాని హువాగూఫెంగ్ తో సమావేశమైంది. ఆ తరువాత కూడా ఆయన వారసుడు చైనా ప్రధాని ఝావ్ జియాంగ్ తో 1981 లో
కాంకన్‍లో సమావేశమైంది. ఆ తరువాత ఆమె మార్గంలోనే శాంతిని
కోరుకున్న చైనా దేశం తమ దూతగా, సీనియర్ ఉప ప్రధాని హువాంగ్‌హోని
భారత దేశానికి అదే సంవత్సరం పంపింది.
భారతదేశానికి సన్నిహితంగా, స్నేహంగా మసులుకుంటున్న సోవియట్
యూనియన్, అలీన విధానానికి కట్టుబడిన అఫ్గానిస్తాన్ పైన
దాడికి దిగడంతో ఎవరికి మద్దతు ప్రకటించాలన్న విషయంలో సందిగ్ధంలో పడిపోయింది
ఇందిరాగాంధీ. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా భారతదేశం
మాట్లాడుతుందని భావించిన అమెరికాకు నిరాశ మిగిలింది. అదే
సందర్భంలో పాకిస్తాన్‌కు ఆయుధాలను అమెరికా సమకూర్చే విషయంలో భారత-అమెరికా దేశాల మధ్య అభిప్రాయ భేదాలు బాగా పొడచూపాయి. అమెరికాకు తన తీవ్ర ఆక్షేపణ తెలియచేసింది ఇందిరాగాంధీ. తరువాత కొద్ది కాలానికి కాంకన్ సమ్మిట్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు
రొనాల్డ్ రీగన్, భారత ప్రధాని ఇందిరాగాంధీల కలయిక
పరిస్థితిలో కొంత మార్పుకు దోహదపడింది. 1982 లో నిర్వహించబడిన ఆసియా క్రీడలు, ఆ తరువాత 1983 కామన్వెల్త్
అధినేతల సమావేశం కూడా ఆమెకు ఒక విజయమే.
ఇందిరాగాంధి-యాసర్ అరాఫత్
ఇందిరాగాంధీ అనుసరించిన విదేశాంగ విధానంలో అత్యంత ప్రాముఖ్యమైంది
అరబ్ దేశాలతో నెలకొల్పిన మైత్రీ సంబంధాలు. ఆమె కాలంలో భారత-అరబ్ సంబంధాలలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమైంది. అరబ్
ప్రపంచం వ్యవహారాలలో అత్యంత శ్రద్ధ కనబర్చ సాగింది ఇందిరాగాంధి. ప్రపంచ దేశాలలో తమకు సరైన ప్రాతినిధ్యం కావాలన్న అరబ్ దేశాల డిమాండుకు
ఇందిర తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. పశ్చిమాసియా
సమస్యలలో అత్యంత కీలకమైన పాలస్తీనా విమోచన విషయంలో ఇందిర తన ఆందోళనను అన్నిరకాల
కనపర్చేది. వారికి మద్దతుగా ప్రపంచ వేదికలైన ఐక్య రాజ్య సమితి,
ఆఫ్రో-ఆసియా, అలీన దేశాల
సమావేశాలలో మాట్లాడుతుండేది. ఎమర్జెన్సీ తరువాత జరిగిన
ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఇజ్రాయిల్‌కు అనుకూలమైన విదేశాంగ
విధానాన్ని పాటించారు. ఆమె తిరిగి అధికారం చేపట్టగానే,
ఆ విధానాన్ని చెత్త బుట్టలో పడేసి, పాలస్తీనా-అరబ్ అనుకూల విధానానికి మళ్లీ శ్రీకారం చుట్టింది. స్వదేశంలోను,
అంతర్జాతీయం గాను ఇందిరపై ఎన్నో రకాల ఒత్తిడులు వచ్చినప్పటికీ,
పాలస్తీనా విమోచన సంస్థ నాయకుడు యాసర్ అరాఫత్‌ను న్యూఢిల్లీకి
ఆహ్వానించి, దౌత్య సంబంధాలను నెలకొల్పింది ఇందిరాగాంధీ.
అరబ్ దేశాలకు చెందిన గమాల్ అబ్దుల్ నాజర్ కోడలుగా, సౌదీ రాజు కూతురుగా, యాసర్ అరాఫత్ సోదరిగా, అరబ్ దేశాలు ఇందిరాగాంధీని అభివర్ణించేవి. అమెను "అల్‍సయ్యిదా ఇందిరాగాంధీ" అని పిల్చుకునేవారు
వాళ్లు.
ఇందిరాగాంధీ, ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన విదేశాంగ
విధానం ఈ నాటికీ ఒక విధంగా అమల్లోనే వుందనాలి. ఆమె తరువాత
అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ కాలంలోను, అటల్
బిహారీ వాజ్‍పాయ్ కాలంలోను, పీవీ నరసింహారావు కాలంలోను,
ఇప్పటి మన్మోహన్ సింగ్ కాలంలోను ఇంకా అవే విధానాలు కొనసాగుతున్నాయి.
ఆమె పేరు వాడకుండా వారెవరి హయాంలోను విదేశాంగ విధానాన్ని విశ్లేషించ
లేదంటే అతిశయోక్తి కాదు. తండ్రి నెహ్రూ లాగా కాకుండా,
ఒక పటిష్టమైన-నిర్ణయాత్మక దౌత్యవేత్తగా
ఇందిరాగాంధీ తనదంటూ ఒక శైలిని అనుసరించేది. జనవరి 24,1966 న
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే, మార్చ్ లో,
తన మొదటి అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో భాగంగా పారిస్, లండన్, వాషింగ్టన్, మాస్కో నగరాలను దర్శించింది. అక్కడి ప్రభుత్వ విధానాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేసింది. ఉత్తర వియత్నాంపై అమెరికా బాంబ్ దాడులను ఆపేయాల్సిందిగా అమెరికా
అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌కు విజ్ఞప్తి చేసింది. జెనీవా
సమావేశాన్ని మరో మారు ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. జాన్సన్‌కు ఆమె డిమాండ్ రుచించలేదు. టిబెట్ విషయంలో
నెహ్రూ అనుసరించిన మెతక విధానానికి విరుద్ధంగా, సిక్కింను భారత్ల
దేశంలో విలీనం చేసింది.
ఇందిరాగాంధీ పెత్తనం చేస్తుంటే, ఎదురు తిరిగే ధైర్యం, అంతర్జాతీయ రంగంలో ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో! వియత్నాం, గ్రెనెడా, పశ్చిమాసియా,
మధ్య అమెరికా, ఆఫ్రికా దేశాలపైన, హిందూ మహాసముద్రం మీద, ఫాక్‍లాండ్స్ మీద అమెరికా
దురాక్రమణను ఇందిర ఖండిస్తే, వ్యతిరేకించే సత్తా ఆ దేశానికి
లేదు. మరో వైపు తన మిత్రదేశమైన సోవియట్ యూనియన్ జెకొస్లోవేకియా,
అఫ్గానిస్తాన్ దేశాలపై చేసిన దాడిని కూడా అమె ఖండించింది. కంపూచియా, నమీబియా స్వాపో ప్రభుత్వాలను భారత దేశం
గుర్తించడం ఇందిర పట్టుదలకు చిహ్నాలు. గర్వపడడం ఇందిరాగాంధీ
సహజ సొత్తు. తనమీద తనకు ఎనలేని విశ్వాసం. తాను ఇబ్బందులలో వున్నప్పటికీ కూడా రాజీ పడని మనస్తత్వం. 1971 లో
నెలకొన్న క్లిష్ట పరిస్థితులలో, అత్యవసరంగా సోవియట్ యూనియన్
సైనిక సహకారం-రాజకీయ మద్దతు కోరాల్సి వచ్చింది ఆమెకు.
ఐనప్పటికీ, ఆమె తన మాస్కో పర్యటనలో కించిత్తు
కూడా వెనుకడుగు వేయలేదు. నాటి సోవియట్ ప్రధాని కొసిజిన్‍తో
మొదటి రోజు తన పర్యటనలో చర్చలకు ఆమె విముఖత చూపింది ఇందిర. కారణం
ఆ దేశంలో అప్పుడాయన నంబర్ వన్ కాదు-నంబర్ టు మాత్రమే.
అధ్యక్షుడు బ్రెజ్నేవ్‍తో మరుసటి రోజున చర్చలకు అంగీకరించింది.
ఇందిర అధికారంలో లేని 1977-1979 మధ్య
కాలంలోనూ ఆమె ప్రవర్తనలోను, పట్టుదలలోను మార్పు రాలేదు.
ఆ కాలంలో ఆమె లండన్ పర్యటనకు పోయిందో సారి. అప్పుడు
కూడా ఆమె పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. అమెను కలిసివారిలో
ప్రపంచ నాయకులు, అధికారిక-అనధికారిక
వ్యక్తులు పలువురున్నారు.
ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవి.
ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. ఇదే విధానాన్ని ఆమె విదేశాంగ నీతిలో కూడా పాటించింది.
అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఆ దేశ ప్రయివేట్ పౌరుడిగా, ప్రధాని ఇందిరను కలిసిన సమయంలో, ఇరవై నిమిషాలు
గడిచిన తర్వాత, ఇంకెంత సేపు ఆ సమావేశం కొనసాగుతుందని,
నిక్సన్ వెంట వచ్చిన విదేశాంగ ప్రతినిధిని హిందీలో అసహనంగా ప్రశ్నించింది.
ప్రశ్న హిందీలో వేసినా, దాని గూడార్థాన్ని గ్రహించిన నిక్సన్
సంభాషణను త్వరగా ముగించి వెళ్ళాడని అనధికార వార్తగా పత్రికలు ప్రచురించాయి
అప్పట్లో. అందులోని నిజానిజాలు ఎంతవరకో గాని, ఆమెలోని అసహనం
పాలు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువై, ఇంటర్వ్యూలలో ప్రశ్నలకు
సరైన సమాధానాలు ఇవ్వకపోవడమో, నిశ్శబ్దం పాటించడమో, అదో రకంగా నవ్వు ముఖం పెట్టడమో, ఎదురు ప్రశ్నలు
వేయడమో చేసేదని విశ్లేషకులు అంటుండేవారు.
ఆమెకు ఆమే సాటి!