బాలకాండ మందర మకరందం
సర్గ-1
వాల్మీకికి
రామాయణాన్ని ఉపదేశించిన నారదుడు
వనం
జ్వాలా నరసింహారావు
వేదాధ్యయనంలో సుసంపన్నుడు, వేదాంతవేత్త, బ్రహ్మజ్ఞాననిష్టుడు, జపపరుడు, వ్యాకరణాది
వేదాంగాలను తెలిసినవాడు, సరస్వతీ పుత్రులలో శ్రేష్టుడు, పరమాత్మ స్వరూపాన్ని బోధించేవాడు, యోగవేత్తలలో
ముఖ్యుడైన నారదుడొస్తాడు వాల్మీకి దగ్గరకు. భగవద్విషయాన్ని బోధించే యోగ్యతున్న
గురువు దొరకలేదనే నిర్వేదంతో శుష్కించిన మనన శీలుడు, తపశ్శాలి వాల్మీకి ఆయనకు సాష్టాంగ
నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్నించాడు.
"
తపమున స్వాధ్యాయంబున, నిపుణుని వాగ్విద్వరేణ్యు నిఖిల మునిజనా
ధిపు
నారదుసంప్రశ్నము, తపస్వి వాల్మీకి
యిట్టు, తమి గావించెన్ "
వాసుదాసుగారు కంద పద్యంలో రాసిన ఈ ప్రశ్నకు ప్రతి పదార్థ
తాత్పర్యంతో పాటు 500 పంక్తుల వ్యాఖ్యానం జోడిస్తారు."తపమున
స్వాధ్యాయంబున" అని అనడమంటే, ఆచార్యుడికుండాల్సిన గుణ సంపత్తిని
తెలపడమే. అంటే నారదుడు తపశ్శీలుడని, వేదాధ్యయన సంపన్నుడని అర్థం. అదేవిధంగా
నారదుడి సంయమన శక్తీ చెప్పబడింది. ఆయన అష్టాంగ యోగసిద్ధి కలవాడనే అర్థమూ
వస్తుంది. పర బ్రహ్మం ధ్యానించడంలో సమర్థుడనే మరో అర్థం కూడా వుంది. నారదుడు
గుణాతీతుడైన మహాయోగి-భక్తుడు.దీన్నిబట్టి ఈ గ్రంథంలోని ముఖ్యవిషయం
భగవత్ స్వరూపాను సంధానం అని బోధపడుతున్నది.
"వాగ్విద్వరేణ్యుడు" అంటే, కేవలం
వేదమే కాకుండా అర్థ జ్ఞానం కూడా నారదుడికి ఉన్నదని అర్థమొస్తుంది. "నిఖిల
ముని జనాధిపు" అనే విశేషణం సమాహితత్వమనే ఆచార్య గుణాన్ని తెలియచేస్తుంది.
మునులు మనన స్వభావులు. నిఖిల శబ్దం శేషంలేమిని తెలుపుతుంది. జన
శబ్దం అనేక తత్వాన్ని తెలుపుతుంది. వాగ్విద్వరేణ్యుడు అనేది మననాన్ని
తెలుపుతుంది. ఇలా ఇవన్నీ కలిపితే నారదుడికి "శ్రవణ మనన నిధి
ధ్యాసనాత్మకమైన యోగ పూర్తి" ఉందని అర్థం చేసుకోవాలి. "తపమున
నిపుణుడు" అంటే జ్ఞానాధికుడని-"ముని
జనాధిపుడు" అంటే ఉపాసుకులందు శ్రేష్ఠుడని, నారదుడిలో ఈ రెండూ పూర్ణ శక్తులుగా
వున్నాయనీ అర్థం.
నారదుడు భగవత్తత్వాన్ని సాక్షాత్కరించుకున్నాడని
ఆతర్వాత చెప్పిన పదాల్లో వుంది. నరుడికి సంబంధించిన అజ్ఞానాన్ని
ఖండించేవాడే నారదుడు. జ్ఞానాన్నిచ్చేవాడూ ఆయనే. ఇట్లా నారదుడిలోని ఆచార్య లక్షణాలను
సంపూర్ణంగా వర్ణించడం జరిగింది. ఇక వాల్మీకిలోని శిష్య లక్షణాలను చెప్పడం
కూడా జరిగింది. నిర్వేదం లేనివాడు ముముక్షువు కాలేడు. ఉపదేశార్హుడూకాడు. వాల్మీకి
నిర్వేదం కలవాడు-ఉపదేశ యోగ్యుడు. వల్మీకంలోనుండి పుట్టడం వల్ల ఇతనికి
వాల్మీకుడు అనే పేరొచ్చిందని బ్రహ్మంటాడు. భృగువంశంలోని ప్రచేతసుండనే ఋషి పదో
కొడుకు వాల్మీకనే సమాధానం కూడా వుంది. ఆయన వంశంలో పుట్టినందువల్ల వాల్మీకి
జాతి బ్రాహ్మణుడే అనాలి. బ్రహ్మ కూడా వాల్మీకిని ఓ సందర్భంలో "బ్రాహ్మణుడా" అని
సంబోధిస్తాడు.
“సంప్రశ్నము”
అన్న పదంద్వారా మిక్కిలి శ్రేష్ఠమైనప్రశ్న అడిగి, మంచివిషయాన్ని రాబట్టదలిచాడన్న అర్థం
స్ఫురిస్తుంది.ఆంధ్ర వాల్మీకిరామాయణం వేదార్థాన్ని విశదీకరిస్తుంది. తపశ్శక్తిగల వాల్మీకి
పరబ్రహ్మనిష్టుడైన నారదుడిని ప్రశ్నించిన విషయమూ పర బ్రహ్మమే. కాబట్టి
ముముక్షువులకు రామాయణం అవశ్య పఠనీయం. వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణానికి
ఇరవైనాలుగువేల గ్రంథాల పరిమితుంది. ముప్పై రెండక్షరాలను గ్రంథమంటారు. వెయ్యికి
ఒకటి చొప్పున 24,000 గ్రంథాలలో 24 గాయత్రీ వర్ణాలు చేర్చబడ్డాయి. అందులో
మొదటి వేయి మొదటి గాయత్రి అక్షరంలో మొదటిదైన "త" కారముంది. గ్రంథం
రచించేవారికి, పఠించేవారికి "త" కారం శుభ ప్రయోగం. రామాయణంలో
గాయత్రి ఇమడ్చబడిందంటే, గాయత్రితో విస్తరించబడిందనే అర్థం. భగవంతుడు
బ్రహ్మకు "దప తప" అని ఉపదేశించాడు. ఈ రెండక్షరాలనే వాల్మీకి గ్రంథం
ఆరంభంనుండే పాఠకులకు ఉపదేశిస్తాడు.
గురువు శిష్యుడిని ఏదాదిపాటు
పరీక్షించిన తర్వాతే ఉపదేశించాలని శాస్త్రం చెపుతున్నది. అలాంటప్పుడు
వాల్మీకి అడగంగానే నారదుడెట్లా ఉపదేశించాడన్న సందేహం కలగొచ్చు. అయితే శిష్యుడు
గురువు దగ్గరకొచ్చినప్పుడు, వచ్చినవాడు ఉపదేశించ బడడానికి అర్హుడా-కాదా అనేది గురువు
నిర్ణయించుకున్నవెంటనే ఉపదేశించవచ్చు. అర్హుడుకాదని భావిస్తే, వాడియోగ్యతను బట్టి, మూడుమాసాలనుండి
పన్నెండేళ్లవరకు తన దగ్గరుంచుకుని, వ్రతానుష్ఠానాలతో-ఆహార వ్యవహారాలతో వాడికి తగిన యోగ్యత వచ్చిందని
భావించిన తర్వాతే గురువు ఉపదేశిస్తాడు. హనుమదాచార్యుడు సీత దగ్గరకు పోయిన విధంగానే, కొందరు గురువులు అర్హులైన శిష్యులను వెదుక్కుంటూ పోతారని శాస్త్రాలు
చెపుతున్నాయి. బ్రహ్మ ఆదేశానుసారం నారదుడు వచ్చి వాల్మీకికి ఉపదేశించాడు కనుక
శిష్యుడినిక్కడ పరీక్షించాల్సిన అవసరం లేదు.
వాల్మీకి చరిత్ర గురించి కూడా ఇందులో
ఇమిడి వుంది. సీతా రామ లక్ష్మణులు చిత్రకూటంలో వాల్మీకిని కలిసినప్పుడు
ఆయనే తనగురించి ఇలా చెప్పుకున్నాడు: "రామా, నేను పూర్వం పరమ కిరాతకులతో పెంచబడ్డాను. పుట్టుకతో
బ్రాహ్మణుడనైనా, ఆచారరీత్యా శూద్రుడనయ్యాను. శూద్ర స్త్రీని పెళ్లి చేసుకుని
కొడుకులను పొందాను. దొంగల్లో చేరి దొంగనయ్యాను. జంతువుల పాలిటి యముడనయ్యాను. నేనున్న
భయంకర అడవిలో ఓ రోజు సప్తఋషులు కనిపిస్తే, వాళ్లను దోచుకుందామని, వారివెంట
పరిగెత్తాను. ’నీచ బ్రాహ్మణుడా, ఎందుకొచ్చావు?’
అని వారడిగారు. నాపుత్రులు ఆకలితో వున్నారు-వాళ్ల సంరక్షణ కై ఈ కొండల్లో అడవుల్లో
తిరుగుతున్నాను-వాళ్ల ఆకలి తీర్చేందుకు మీదగ్గరున్నవి దోచుకుందామని వచ్చానని
జవాబిచ్చాను. నన్నింటికి పోయి, నా పాపంలో వాళ్లు భాగం పంచుకుంటారేమో
కనుక్కుని రమ్మన్నారు మునులు. నేనొచ్చేవరకుంటామనికూడా చెప్పారు. వాళ్ల
మాటలు నమ్మి ఇంటికి పోయి వారు చెప్పినట్లే నా భార్యా-పిల్లలను
ప్రశ్నించాను. నేను తెచ్చింది తింటామన్నారే కాని నా పాపంతో సంబంధం
లేదన్నారు. వెంటనే మునుల వద్దకు పరుగెత్తుకుని పోయి, వాళ్ల
పాదాలపై పడి నన్ను రక్షించమని కోరాను. ఈ బ్రాహ్మణాధముడికి మోక్ష మార్గం
ఉపదేశిద్దామని తలచిన వారు ’రామ’ నామాన్ని తలకిందులు చేసి, వాళ్లు మరల వచ్చేవరకు, ’మరా
మరా’ అని ఎల్లవేళలా జపించమని ఆదేశించి పోయారు. ఆ
విధంగానే సర్వసంగ విహీనుడనై, నిశ్చలుడనై దీర్ఘకాలం జపించాను. నాపైన
పుట్ట పెరిగింది. నా తపోబలంతో, నేనక్కడ నాటిన దండమే వృక్షమయింది. ఇలా
వేయి యుగాలు గడిచిపోయాయి. ఋషులు మళ్లా వచ్చి లెమ్మని పిల్చారు. పుట్టనుండి
బయట కొచ్చిన నన్ను చూసిన మునులు నన్ను ’మునీశ్వర వాల్మీకీ ’ అని
పిలిచారు. నాకది రెండవ జన్మన్నారు".
"గుణవంతుడు,అతివీర్యవంతుడు,ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం
మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలుచేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని
స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో
దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని
పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి నారదుడిని.
(ప్రశ్నలు పదహారు. ఇది
తపస్సంఖ్యాకం. పదహారు కళలతో కూడినవాడు
పూర్ణ చంద్రుడు. అలానే పదహారు ప్రశ్నలకు జవాబుగా శ్రీరామచంద్రుడిని తప్ప
ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే శ్రీరాముడిది పూర్ణావతారం. శ్రీరాముడి
విషయమై తన అభిప్రాయాన్ని
దృఢపర్చుకోవడానికి, భగవద్విషయం ఉపదేశ రూపంగా గ్రహించేందుకు ఈ పదహారు
ప్రశ్నలడిగాడు వాల్మీకి.
బాల్యంలోనే శ్రీరాముడు
గుహుడులాంటి (నీచ) జాతివారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి
"వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరకపోవడం-జనకాజ్ఞ
జవదాటకపోవడం-పరశురాముడిని చంపకపోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని
తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే
విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా
అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను-సర్వభూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో
హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీష శరణాగతి
ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక పోవడం,చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం,రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది.విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే
రాముడికి అసూయ లేదనే కదా.ఇలానే రాముడు కాంతియుక్తుడనీ-భయంకరుడనీ పలుసందర్భాల్లో
అర్థమవుతుంది).
ఇన్నిగుణాలున్నవాడు ఎవరైనా వుంటారా? ఇలాంటి
విషమ ప్రశ్నలు వేసి తనను పరాభవిస్తున్నాడేమోనని నారదుడనుకోవచ్చునని భావించాడు
వాల్మీకి. అందుకే మళ్లా అంటాడు-వాస్తవార్థం తెలుసుకోగోరి అడిగానే
గాని పరీక్షించడానికి కాదని. శిష్యుడైన వాల్మీకికి తన గురువైన
నారదుడి జ్ఞానం తెలిసినందునే అలా అడిగాడు."ఇలాంటి వాడెవరో వినాలని మిక్కిలి
కుతూహలంగా వుంది ఓ ఉత్తమ మహర్షీ. ఇట్టి సత్పురుషుడిని గురించి
తెలపగలిగింది త్రిలోకజ్ఞుడివైన-త్రికాలజ్ఞుడివైన నీవే గాని ఇతరులకు
సాధ్యపడదు" అని అంటాడు వాల్మీకి. జవాబుగా నారదుడు: "వాల్మీకీ
నీ ప్రశ్నకు తగిన సమాధానం చెప్తాను. సావధానంతో విను" అంటాడు, భగవత్
గుణ వర్ణనానుభవం కలిగిందన్న సంతోషంతో.
(తాను ఏ విషయాన్ని బ్రహ్మ దగ్గర
తెలుసుకుని వాల్మీకికి ఉపదేశించాలని వచ్చాడో, ఆవిషయాన్ని గురించే వాల్మీకి
ప్రశ్నించినందువల్లా, శత కోటి పరిమితమైన రామాయణం తాను బ్రహ్మవల్ల విన్నందువల్లా, తనకు
తెలిసిన విషయమే వాల్మీకి అడిగినందువల్లా సులభంగా చెప్పొచ్చునని భావించాడు నారదుడు. రామగుణస్మరణమనే
అమృత పానానికి అవకాశం లభించిందని సంతోషపడ్తాడు. అయితే తెలియని విషయాన్ని అడగకుండా
తెలిసిన విషయమెందుకు అడిగాడు వాల్మీకి? శ్రీరాముడిని ఆయన ఎరుగునుకదా! అయోధ్య
సమీపంలోనే, ఆయన రాజ్యంలోనే వాల్మీకి ఆశ్రమం వుందికదా? శ్రీరాముడిని
గురించి వాల్మీకికీ తెలుసు-నారదుడికీ తెలుసు. మరి ప్రశ్న-జవాబు
ఎందుకు? వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు, జవాబిచ్చేవాడూ
వేదాంతజ్ఞులే. ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. అయితే, వాల్మీకి
వేసిన ప్రశ్న భగవంతుడి గురించే అయితే, ఆ భగవంతుడు సగుణుడా, నిర్గుణుడా, సాకారుడా, నిరాకారుడా, ద్రవ్యమా, అద్రవ్యమా, ఏకతత్వమా, అనేకతత్వమా
అని అడక్క గుణాలగురించే ఎందుకడిగాడు? అనుష్ఠానం ప్రధానంగాని, వాదం
కాదు. మామిడిపండు తింటేనే తీపో-పులుపో తెలుస్తుంది. అనుష్ఠాన
రూపకమైన భక్తి మార్గమే శ్రేష్ఠం. నారదుడు భక్తుడు. తత్వవిచారంకంటే
గుణ విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకీ ఆ కోవకి చెందినవాడే. అందుకే
భగవత్ గుణ వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు).
ప్రశ్నకూ, జవాబుకూ
పొంతనుండాలి. అడిగిందొకటైతే చెప్పేది ఇంకోటి కాకూడదు. శిష్యుడు
ఒక విషయాన్ని ఏ అభిప్రాయంతో అడిగాడో తెలుసుకోలేక మరో రీతిలో గురువు సమాధానం చెప్తే
అది సరైన పద్దతి కాదు. నారదుడు వాల్మీకి అభిప్రాయాన్ని గ్రహించి అతనికి కావల్సిన రీతిలోనే
సమాధానం ఇస్తాడీవిధంగా: "ముని శ్రేష్ఠా, నీవు
శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని
వుండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్యమాత్రులందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తిగలవారెవరో చెప్తా, శ్రద్ధగా
విను. ఏ వంశంలోనైతే-ఏ ఇంటిలోనైతే, నిత్యం
భగవంతుడు ఆరాధించబడుతున్నాడో, అట్టి ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, ’రామా
రామా రామా’, అని లోకులు పొగిడే రామచంద్రమూర్తి అనే పేరుగలాయన జన్మించాడు. అతివీర్యవంతుడాయన. అసమానమైన-వివిధమైన-విచిత్రమైన
శక్తిగలవాడు. స్వయంగా ప్రకాశించగలడు. అతిశయంలేని ఆనందంగలవాడు. ఇంద్రియాలను-సకల
భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు
హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై
శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని
నాశనం చేసే వాడు. ఎత్తైన మూపురాలున్నవాడు. బలిసిన చెక్కిళ్లవాడు."
ఇంకా ఇలా చెప్తాడు నారదుడు
శ్రీరాముడిని గురించి: "శంఖంలాగా మూడు రేఖలున్న కంఠముందాయనకు. విశాలమైన
వక్షస్థలమున్నవాడు. గొప్పదైన విల్లు ధరిస్తాడు. ఆశ్రిత పాపాలనే శత్రు సమూహాలకు
ప్రళయకాల యముడిలాంటి వాడు. యుద్ధంలో భయంకరుడు. శ్రీరామచంద్రమూర్తి చేతులు మోకాళ్లకు
తగిలేంత పొడుగ్గా వుంటాయి. అందమైన వక్షం, అసమాన సౌందర్యమున్న నొసలు, చూసేవారిని
మైమరిపించే నడక గలవాడు. అందంగా-శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో
ఒకదానికొకటి సరిపోయే అవయవాలున్నాయి. ప్రకాశించే దేహ కాంతి, భయంకరమైన
శత్రువులకు సహించలేని ప్రతాపం, మనోహరమై-బలిసిన
మంచి వక్షం వున్నవాడు. కీర్తించదగిన నిడివి, వెడల్పాటి కళ్లు, ఎదుటివారు
మెచ్చుకునే వేషం, శ్లాఘ్యమైన శుభ చిహ్నాలు, శుభం కలిగించే ఆకారం, మంచిగుణాల
మనోహరుడాయన.
(కనుబొమలు, ముక్కు
పుటాలు, కళ్లు, చెవులు, పెదాలు, చను ముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్లు, పిక్కలు, ఎవరికి
సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక శాస్త్రంలో వుంది. జంట-జంటగా
వుండే ఈ అవయవాలలో, జంటలోని రెండు, ఒకదానికొకటి సమానంగా వుండడమే కాకుండా
ఆకారం సరిగా వుండాలి. ఇవన్నీ రాముడికున్నాయని భావన.)
ఇలా ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన
దివ్య మంగళ విగ్రహాన్ని గురించి చెప్పిన తర్వాత, నారదుడు ఆశ్రితులను రక్షించేందుకు
అనువైన గుణాలను చెప్పాడీవిధంగా: "శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన
ధర్మజ్ఞానంగలవాడు-క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా
ఆచరించేవాడు-చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు-సమస్త భూ జనులకు మేలైన కార్యాలనే
చేసేందుకు ఆసక్తి చూపేవాడు-దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను
అణచినందున వచ్చిన కీర్తిగలవాడు-సర్వ విషయాలు తెలిసినవాడు-బ్రహ్మ
జ్ఞాన సంపన్నుడు-మిక్కిలి పరిశుద్ధుడు-ఋజుస్వభావం గలవాడు-ఆశ్రిత
రక్షకుడు-ఆత్మతత్వం ఎరిగినవాడు-ఆశ్రితులకు, మాత, పిత, ఆచార్యులకు, వృద్ధులకు
వశ పడినవాడు-విష్ణువుతో సమానుడు-శ్రీమంతుడు-లోకాలను
పాలించ సమర్థుడు-ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు-ఎల్ల
ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు-ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో
ఆచరింపచేసేవాడు-స్వధర్మ పరిపాలకుడు-స్వజనరక్షకుడు-వేద
వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు-కోదండ దీక్షాపరుడు-సర్వ
శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి-జ్ఞాపకశక్తిగలవాడు-విశేషప్రతిభగలవాడు-సమస్త
ప్రపంచానికి ప్రియం చేసేవాడు-సాధువు-గంభీర ప్రకృతిగలవాడు-అన్ని
విషయాలను చక్కగా బోధించగలవాడు-నదులన్నీ సముద్రానికి పారినట్లే
ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు-అందరిమీద సమానంగా వారి, వారి
యోగ్యత కొద్దీ ప్రవర్తించేవాడు-గొప్పగుణాలున్నవాడు-ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగా
దర్శనమిచ్చేవాడు-సమస్తభూతకోటికి పూజ్యుడు-అన్నింటా గుణ శ్రేష్ఠుడు. ఆయనే
శ్రీరామచంద్రుడు. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా
నందనుడని పేరు తెచ్చుకున్నాడు.
(రాముడు తండ్రి పేరు చెప్పలేనివాడని కానీ, అందుకే తల్లి పేరు చెపుతున్నాడే కవి అనిగానీ భావించరాదు. దశరథుడు
నిష్కారణంగా శ్రీరాముడిని అడవులకు పంపాడు. కౌసల్య నవమీ వ్రతాలు చేసి రాముడిని
కనింది. భర్త చనిపోయినప్పటికీ, పుత్ర వాత్సల్యం వల్ల
జీవించి, శ్రీరామ పట్టాభిషేకాన్ని
చూసిన ధన్యురాలు. అట్టి ధన్యత దశరథుడికి కలగలేదు. పన్నెండు నెలలు
శ్రీరామచంద్రుడిని గర్భంలో ధరించింది కౌసల్య. ప్రధమ ముఖ దర్శనం కూడా కౌసల్యదే.
పాలు-నీళ్లు పోసి, ముద్దులాడిందీ కౌసల్యే.
బాల క్రీడలు చూసి ఆనందించిన ధన్యత కౌసల్యకు కలిగింది. "కౌసల్యా సుప్రజ
రామా" అని రాముడిని సంబోధించాడు విశ్వామిత్రుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖ
దర్శనం మొదలు కలిగింది కౌసల్యకేగాని దశరథుడికి కాదు. దశరథ పుత్రుడంటే ఏ భార్యకు
పుట్టిన ఏ కొడుకో అనుకోవచ్చు. కౌసల్యకు ఒక్కడే కొడుకు. శ్రీరాముడిని తన వెంట యాగ
రక్షణకై పంపమని విశ్వామిత్రుడు కోరినప్పుడు, పామరుడివలె అంగీకరించలేదు దశరథుడు. పుత్రుడి శ్రేయస్సు కోరి, కౌసల్య మారు మాట్లాడకుండా అంగీకరించిందే కాని, తన వళ్లో వుంచుకుని ముద్దులాడలేదు. అందుకే "కౌసల్యానంద
వర్థనుడు" అని నారదుడు, "కౌసల్యా సుప్రజ
రామా" అని విశ్వామిత్రుడు, "లోకచయభర్త శుభమతి యా కోసల
తనయ గాంచె" అని సీతాదేవి చెప్పడం గమనించాలి. దశరథుడికంటే కౌసల్యే
ప్రశంసనీయమైందని ఆమె పేరు చెప్పబడింది. కుశల భావమే కౌసల్యం).
"గాంభీర్యంలో సముద్రుడంతటివాడు. ధైర్యంలో
హిమవత్పర్వత సమానుడు. వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు. చంద్రుడిలా
చూసేందుకు ప్రియమైన వాడు. కోపంలో ప్రళయకాలాగ్ని. ఓర్పులో భూదేవంతటివాడు. దానంలో
కుబేరుడు. అసమాన సత్యసంధుడు. ధర్మానికి మారుపేరు. ఇటువంటి
పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు. శ్రీరామచంద్రమూర్తి సామాన్య రాజని
తలచొద్దు".
(వాల్మీకి అడిగిన ప్రశ్నల్లో, నారదుడిచ్చిన
సమాధానంలో, విశేషణాలన్నీ భగవంతుడికే అన్వయించి చెప్పి, రామాయణాన్ని
పెద్ద వేదాంత గ్రంథం చేసారని ఆక్షేపించవచ్చు. ఆ గుణాలన్నీ ఉత్తమపురుషులకు కూడా వుండొచ్చునని
అనవచ్చు. శ్రీమద్రామాయణం ధ్వనికావ్యమని అర్థం చేసుకోవాలి. అదో
గూఢార్థగుంభితం. వ్యర్థ పదాలు, వ్యర్థ విశేషణాలు అసలే కనపడవు. రామాయణార్థం
సరిగ్గా గ్రహించాలంటే అనేక శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి
యదార్థ జ్ఞానం కలగదు. వాస్తవానికి నారదమంటే మేఘమని అర్థం. మేఘం
నీళ్లిస్తుంది. నిప్పులు కురిపించదు. నారదుడంటే జ్ఞానదాత. జ్ఞానదాత
చేయాల్సింది జ్ఞానముపదేశించడమో, మోక్ష విషయం చెప్పడమో అయ్యుండాలి. నారదుడు
నారాయణుడి వద్ద భాగవతాన్ని విని, పాంచరాత్ర ఆగమం ఏర్పరిచాడు. అందుకే
దాన్ని "నారద పాంచరాత్రం" అంటారు. ఇదే సాత్త్వతశాస్త్రం. వాల్మీకికి
ఉపదేశించిదిదే. ఆ ఉపదేశంతో వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. ఋషీశ్వరులు
సంభాషించుకొనేటప్పుడు లౌకిక ప్రసంగాలు చేయరు. కాబట్టే వాల్మీకి ప్రశ్నించింది అవతార
మూర్తి గురించే-నారదుడు జవాబిచ్చిందీ అవతార మూర్తిని గురించే).
"ఇటువంటి సుగుణాభిరాముడైన
శ్రీరామచంద్రమూర్తిని, జ్యేష్ఠ కుమారుడిని, మహాపరాక్రమశాలిని, సామగుణసంపదగలవాడిని, తనకు-ప్రజలకు
ప్రియుడైన వాడిని, భూజనుల క్షేమం కోరి ప్రవర్తించేవాడిని దశరథ మహారాజు తన
మంత్రుల అభీష్టం నెరవేర్చేందుకు, యువరాజును చేయాలని మనస్సులో అనుకుని, పట్టాభిషేకానికి
కావలసిన ప్రయత్నం చేయసాగాడు. దశరథుడి భార్య కైకేయి ఆ ప్రయత్నాలకు
అడ్డుపడింది. పూర్వం తనకిచ్చిన రెండు వరాలను నెరవేర్చమని కోరింది భర్తను. మొదటిది
శ్రీరామచంద్రమూర్తిని అరణ్యాలకు పంపడం, రెండోది తన కొడుకైన భరతుడికి యౌవరాజ్య
పట్టాభిషేకం చేయడం. రాముడికంటే సత్యం మీదే ప్రీతిగలవాడైన
దశరథుడు తన ప్రియ కుమారుడు శ్రీరాముడిని అడవులకు పంపాడు. రాజ్యపాలన
శక్తి, తండ్రిని ధిక్కరించి రాజ్యాన్ని గ్రహించే శక్తీ గల వీరుడైన
రాముడు, కైకకు సంతోషాన్నిచ్చే జనకుడి ఆజ్ఞ నెరవేర్చేందుకు అరణ్యాలకు
పోయాడు. అలా అడవులకు పోదలచిన శ్రీరాముడిని చూసి, ఆయనపై
స్నేహభావంగల చిన్న తమ్ముడు, వినయ సంపన్నుడు, అన్న ప్రీతికి పాత్రుడు, దశరథుడి
రెండో భార్య సుమిత్రా దేవి కొడుకైన లక్ష్మణుడు, పెద్దన్నగారి సేవ చేద్దామన్న కారణంతో
ఆయన వెంట పోయాడు అడవులకు. శ్రీరామచంద్రమూర్తికి ప్రాణ సమానురాలైన ఇల్లాలు, మనోహర
గుణవంతురాలు, స్వభావంచేతనే వినయ గుణాలు కలది, హిత
బోధయందు ఆసక్తిగలది, జనక మహారాజు కూతురు, దేవమాయలా అయోనిజగా జన్మించినది, మంచి
గుణాల కూడలి, లోకమంతా పొగిడే నడవడిగలిగిన పవిత్రురాలు, సాముద్రిక
శాస్త్ర ప్రకారం ఉత్తమస్త్రీలకుండాల్సిన శుభ లక్షణాలన్నీ వున్న దశరథ మహారాజు కోడలు, ఉత్తమ
స్త్రీ సీతాదేవి, చంద్రుడిని రోహిణి ఏ ప్రకారం ఎల్లవేళలా అనుసరించి పోతుందో, అలానే
నిండారు ప్రేమతో, తన భర్త వెంట పోయింది అడవులకు".
నారదుడు చెప్పడం కొనసాగిస్తూ ఇలా
అంటాడు: "సీతా లక్ష్మణుల లాగానే, పురజనులుకూడా
రాముడిని వెంబడించారు. రాముడిని విడిచిపెట్టలేక, సహించలేని వియోగ తాపంతో, తపించిన
అయోధ్య వాసులు శ్రీరామచంద్రుడు రావద్దని వారిస్తున్నా వినకుండా, ఆయన
వెంటబడి చాలాదూరం పోయారు. తండ్రికూడా కొంతదూరం పోయాడు. ధర్మ బుద్ధిపై అత్యంత ఆసక్తి వున్న
రాముడు గంగానదీ తీరం దగ్గరున్న శృంగిబేరపురం చేరాడు. అక్కడున్న ఆత్మ మిత్రుడు-గుహుడు, అనే
బోయ నాయకుడిని చూసి, సారథి సుమంత్రుడిని అయోధ్యకు పొమ్మంటాడు రాముడు. ఆతర్వాత
గుహుడు ఆ ముగ్గురినీ గంగ దాటిస్తాడు".
(శృంగిబేరపురమంటే, జింకా
కారం గల వూరు. అక్కడుంది ఆత్మలాంటి ప్రియమైన రాముడి మిత్రుడు గుహుడు. ఆయన
నిజమైన భక్తుడైనందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు. అంటే భగవంతుడిని మనం వెతుక్కుంటూ
పోవాల్సిన పనిలేదు. భక్తి మనలో వుంటే భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. రాముడు
శృంగిబేరపురం వచ్చాడన్న వార్త తెలుసుకున్న గుహుడు పరుగెత్తుకుంటూ వచ్చి రాముడిని
కౌగలించుకున్నాడట).
"ఇట్లా రాజకుమారులిద్దరు-రాజకుమారి
సీత,ముగ్గురు అడవి మార్గంలో గంగానదిని దాటి, భరద్వాజుడి
ఆజ్ఞానుసారం చిత్రకూట పర్వతం చేరుకుంటారు. అక్కడ ఓ పర్ణశాల (లక్ష్మణుడు
కట్టిన ఆకుల గుడిసె) నిర్మించుకుని అందులో సంతోషంగా నివసిస్తుంటారు. అక్కడ
అయోధ్యలో (తన కొడుకులు చిత్రకూటం చేరారని తెలిసిన) దశరథుడు
శ్రీరాముడిపై నున్న ప్రేమాతిశయంతో, ’రామా రామా’ అని ఏడ్చి-ఏడ్చి, చనిపోతాడు. తండ్రి
మరణించడంతో, రాజ్యార్హుడైన జ్యేష్ఠ పుత్రుడు అరణ్యాలలో వున్నందున, రాజ్యం
అరాజకం కాకుండా వుండాలని తలచిన వశిష్ఠుడు-ఇతర పెద్దలు, రాజ్యభారం
వహించాలని భరతుడిని ప్రార్థించినా ఆయనొప్పుకోలేదు.
(సూర్య వంశపు రాజులకు పురోహితుడు
వశిష్ఠుడు. ఆయన దశరథుడి అభిప్రాయం ప్రకారం చెప్పినా భరతుడు తిరస్కరించడం
సబబేనా-గురు వాక్యం మీరినట్లు కాదా అన్న సందేహం రావచ్చు. అయితే
రాజు చెప్పిన మాటలను మాత్రమే వశిష్ఠుడు చెప్పాడే కాని, పెద్దవాడుండగా
చిన్నవాడు రాజ్యం ఏలడం అన్యాయమని ఆయనకూ తెలుసు. ఇక భరతుడేమో భగవత్ పరతంత్రుడు. తనను, తన
దేహాన్ని, తన సర్వస్వాన్ని రామార్పణం చేసాడు. దాన్ని
మరల గ్రహించడమంటే పారతంత్ర్య విరోధమే. అంటే స్వరూప హాని కలగడమే. ఇది
ఆత్మహత్యలాంటి ఘోర పాపం. మాట వినకపోతే వశిష్ఠుడు శపించవచ్చు కాని ఆత్మ హాని కూర్చలేడు. అయినా
వశిష్ఠుడు ప్రార్థించాడే గాని శాసించలేదు).
"రాజ్యమేలడానికి
కావలసిన దేహ బలం,సేనా బలం, ఇంద్రియనిగ్రహ బలం భరతుడికున్నప్పటికీ, శ్రీరామచంద్రచరణారవిందాల
అనుగ్రహం కొరకై చిత్రకూటానికి బయల్దేరి పోయాడు. ఒక్కడేపోలేదు. సర్వ
సైన్యంతో వెళ్లాడు.
(భరతుడు ఒంటరిగా పోతే అతడికొక్కడికి
తప్ప తక్కినవారెవరికీ తాను రాజు కావాలన్న కోరికలేదేమోనని రాముడనుకోవచ్చునన్న
సందేహమొక కారణం. సగౌరవంగా అన్నగారిని పిలవలేదని లోకులు సందేహించవచ్చు. తన
ప్రార్థన వినకున్నా ఇంతమంది అడిగారు కదా అని ఒప్పుకోవచ్చు).
చిత్రకూటం చేరిన భరతుడు, అన్నకు
తెలియని ధర్మం లేదనీ, పెద్దవాడుండగా చిన్నవాడు పట్టాభిషేకం చేసుకోకూడదని, రాముడే
రాజు కావాలనీ ప్రార్థిస్తాడు. తండ్రి ఆజ్ఞ మీరరాదని భావించిన రాముడు, ఇతరులను
సంతోషపెట్టే స్వభావమున్నప్పటికీ, దానికొరకు ఎలాంటి త్యాగమైనా
చేసేవాడైనప్పటికీ, అలా చేయడానికి బాధపడనివాడైనప్పటికీ, ఇతరుల
మనోరథం వ్యర్థం చేయడన్న కీర్తి సంపాదించినప్పటికీ, జనకుడి ఆజ్ఞను స్మరించి, రాజ్యం
అంగీకరించక-భరతుడి ప్రార్థన వ్యర్థం చేయక, తనకు ప్రతినిధిగా తన పాదుకలిచ్చి, భరతుడినప్పటికి
సమాధాన పరిచి, బలవంతంగా పంపుతాడు. శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం
చేసి, ఆయన దగ్గరుండి సేవ చేద్దామన్న కోరిక నెరవేరక పోవడంతో, ఆయన
బదులు ఆయన పాదుకలకు సేవ చేస్తూ, రాముడెప్పుడొస్తాడా-ఎప్పుడు
కళ్లారా చూస్తానా-ఎప్పుడు సేవిస్తానా అని ఎదురుచూస్తూ, శ్రీరాముడు
లేని అయోధ్యకు పోవడం ఇష్టం లేక, భోగ కాంక్ష-ఫల
కాంక్ష లేక, నంది గ్రామం అనె పల్లెటూరులో వుంటూ రాజ్యం చేస్తాడు భరతుడు".
(ఈ విధంగా నారదుడు అయోధ్యకాండ
అర్థాన్ని సంగ్రహంగా చెప్పి, పితృవాక్య పాలన అనే సామాన్య ధర్మాన్ని, స్వామైన
భగవంతుడి విషయంలో దాసుడు చేయాల్సిన కైంకర్య వృత్తిని, ప్రపన్నుడు
భగవత్ పరతంత్రుడిగానే వుండాలన్న విషయాన్ని, ప్రపత్తికి భంగం కలిగే పనులు ఎవరు
చెప్పినా చేయకూడదనే విశేష ధర్మాన్ని తెలియ పరుస్తాడు).
నారదుడు ఇంకా ఇలా చెప్తాడు: "భరతుడు
తన ఆజ్ఞ ప్రకారం తన పాదుకలను తీసుకుని అయోధ్యకు పోయిన తర్వాత అక్కడి పురజనులు
తానిక్కడున్నానని తెలిసి వీలున్నప్పుడల్లా తన్ను దర్శించడానికి వచ్చే అవకాశం
వుందని గ్రహిస్తాడు రాముడు. దానివల్ల ఆశ్రమవాసుల తపస్సుకు భంగం కలుగుతుందని భావిస్తాడు. ఈ
అలోచనరాగానే, ఇంద్రియాలను జయించిన సత్యస్వరూపుడైన రామచంద్రుడు దండకారణ్యం
చేరుకుంటాడు. విరాధుడిని చంపుతాడు. శరభంగుడిని దర్శిస్తాడు. సుతీక్షణుడిని
చూస్తాడు. అగస్త్యుడిని, ఆయన తమ్ముడు సుదర్శనుడిని దర్శిస్తాడు. అగస్త్యుడు
చెప్తే, ఆయన దగ్గరున్న ధనస్సును, ఖడ్గాన్ని, రెండంబుల
పొదలను,పదునైన అక్షయ శరాలను సంతోషంగా తీసుకుంటాడు.మునీశ్వరుల
దగ్గరుంటూ,వాళ్ల కోరిక మేరకు వారి తపస్సు భంగం చేసే
రాక్షసులను సంహరిస్తానని అభయమిస్తాడు రాముడు.
పంచవటిలో సీతారామ లక్ష్మణులు తమ
ఇష్టప్రకారం తిరిగే సమయంలో, జన స్థానంలో నివసించే కామ రూపిణి-భయంకర
రాక్షస స్త్రీ-శూర్పణఖ, ముక్కు చెవులు కోసి వికార రూపం
వచ్చేటట్లు చేస్తాడు లక్ష్మణుడు. ఇది తెలిసిన జన స్థానంలోని ఖర-దూషణ-త్రిషిరుడితో
సహా పద్నాలుగు వేల రాక్షసులు వీరిపైకి యుద్ధానికి వస్తారు. లక్ష్మణుడి
సహాయం లేకుండానే, రణరంగంలో పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి, పద్నాలుగు
వేల మందినీ, కేవలం భుజబలంతోనే వధిస్తాడు. తన బంధువుల మరణ వార్త విన్న రావణుడు, కోపంతో, తనకు
సహాయం చేయమని మాయలమారి రాక్షసుడు మారీచుడిని ప్రార్థిస్తాడు.
మహా బల పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయడం కీడని రావణుడికి సలహా
ఇస్తాడు మారీచుడు. ఆ ఆలోచన మాను కొమ్మని బోధిస్తాడు. మృత్యువు
ప్రేరేపిస్తుంటే, వాడిని తీసుకొని సీతారాములున్న చోటికి పోతాడు రావణుడు. వంచన
చేసే స్వభావం కలిగిన మారీచుడు బంగారువన్నెగల జింక రూపంతో సీతకు కనిపిస్తాడు. ఆ
జింక కావాలని సీత కోరితే, దాన్ని తేవడానికి పోయిన రాముడు అస్త్రంతో వధిస్తాడు. చస్తూ
’హా లక్ష్మణా’ అని అరుస్తాడు మారీచుడు. ఆ
ధ్వని విన్న లక్ష్మణుడు అన్నకు సహాయం చేద్దామని వెళ్తాడు. ఒంటరిగా
వున్న సీతను అపహరించుకుని పోతూ త్రోవలో అడ్డుపడ్డ జటాయువనే గద్దను చంపి లంకకు చేరి
సీతను అశోక వనంలో వుంచుతాడు రావణుడు".
"సీతను విడిపించే ప్రయత్నంలో
రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని, చనిపోవడానికి సిద్ధంగా వున్న
జటాయువును చూసి, ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు
రాముడు. తన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలో, చనిపోయిన
జటాయువుకు దహనసంస్కారాలు చేశాడు రాముడు. తనవల్ల కదా జటాయువుకింత దుఃఖం
కలిగిందని బాధపడి విలపిస్తాడు".
(రామచంద్రమూర్తి విష్ణువు
అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు.
మనుష్యులకెలాంటి శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు. మనిషికి శోక మోహాలు కలగడానికి కారణం
కామ-క్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజో గుణాలవల్ల
జన్మించినవే కామ-క్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు
దొరక్కపోయినా-పోగొట్టుకున్నా శోకం కలుగుతుంది. మోహానికీ కారణం కోపమే. ప్రకృతి
పరిణామమైన దేహం, ప్రకృతి గుణాలైన
సత్వ-రజస్సు-తమస్సులను కలదై వుంటుందనీ, కొద్దో-గొప్పో ఈ మూడు గుణాలు లేకుండా దేహి వుండడనీ, రజస్సు కారణాన శోక-మోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వ జన్మలో చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం
అనుభవించాల్సివస్తుందనీ శాస్త్రం చెప్తుంది.
అంటే, ప్రకృతి బద్ధుడైన పురుషుడు, ప్రకృతి గుణాలైన శోక-మోహాల వలన పీడించ బడుతాడని అనుకోవాలి.
అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన విష్ణువు, ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడుతాడన్న సందేహం కలగొచ్చు. అవతార
దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా?
రామావతారం పూర్ణావతారమే.
అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు.
రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం
కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని
మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం
కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం
ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన
తానే వారి దుఃఖానికి కారణమయ్యానేనని మాత్రమే రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు
వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం
కలిగిందోనని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి
దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు).
“అడవులన్నీ వెతుక్కుంటూ పోయి, శ్రీరాముడు
భయంకర-వికార స్వరూపుడైన కబంధుడనే రాక్షసుడిని చంపి దహనం చేసాడు. శాప
విముక్తుడైన కబంధుడు, పంపా తీరంలో వున్న శబరిని చూసిపొమ్మని బోధించాడు. ఆమె
శ్రేష్ఠ ధర్మమైన గురు శుశ్రూషను ఆచరించేదనీ, అతిథి పూజలాంటి సకల ధర్మాలను
ఎరిగినందున, ఆ బోయసన్యాసినిని తప్పక చూడమనీ అంటాడు”.
(సన్యాసిని అంటే,
కాషాయ వస్త్రాలు కట్టి, బోడి తల చేయించుకుని, చతుర్థాశ్రమస్వీకారం చేసిందని
అర్థంకాదు. కామ్యకర్మాలు చేయకపోవడమే నిజమైన సన్యాసం. జ్ఞానం
సన్యాస లక్షణం).
“శత్రుసంహార దక్షుడైన రాజకుమారుడు
శ్రీరామచంద్రమూర్తి శబరిని కలిశాడు. ఆమె నిండు శ్రద్ధా భక్తులతో
సమర్పించిన ఆతిథ్యాన్ని కడు ప్రీతితో స్వీకరించాడు. సీతను వెతికే పనిలో తన అభీష్టం
నెరవేరేందుకు శబరి చెప్పిన విధంగానే పంపా సరస్సు చేరుకుంటాడు రాముడు”.
(ఈ పంపే కన్నడంలో హంపి అయింది. ఇది
బళ్లారి దగ్గరుంది. రాముడు తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చే గుణంగలవాడని చెప్పడమే
అరణ్యకాండ సారాంశం. దాన్నింతవరకు చెప్పాడు నారదుడు. స్నేహితులకై
చేపట్టిన కార్యాన్ని నెరవేర్చడమనే గుణాన్ని కిష్కింధ కాండ సారాంశంగా ముందు చెప్పబోతున్నాడు).
"పంపా తీరంలోని వనంలో హనుమంతుడనే
వానరుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి, సూర్య నందనుడైన సుగ్రీవుడితో
స్నేహంచేసాడు రాముడు. తనకథ, సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు రామచంద్రుడు. చెప్పిన
తర్వాత, సుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు”.
(రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది
అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడు హీనజాతివాడైనా, పురుషుడైనందున
అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం చెప్పడం జరిగింది. హీన
స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడైన
సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం జరిగింది. దీన్నిబట్టి
తెలిసేదేమిటంటే, భక్తికి అందరూ అధికారులేనన్న విషయం. అట్టి
అధికారం నీచ జాతులని చెప్పబడేవారిలోనే విశేషంగా కనిపిస్తుంది. జ్ఞానంతో
రామచంద్రమూర్తిని ఆశ్రయించేవారు కొందరే. భక్తితో ఆశ్రయించేవారు కోటానుకోట్లు. ఫలితం
ఇరువురికీ సమానమే).
తనకూ-తన అన్న వాలికి విరోధం కలిగిన
విధాన్ని సుగ్రీవుడు రాముడికి వివరిస్తాడు. వాలిని చంపుతానని రాముడు ప్రతిజ్ఞ
చేస్తాడు. వాలి బల పరాక్రమాలు వినిపించి అంతటి బలవంతుడిని చంపగలడా
రాముడని సందేహం వెలిబుచ్చుతాడు సుగ్రీవుడు. తనకు నమ్మకం కలిగేలా, ఓ
పెద్దకొండలాగున్న దుందుభి అనే రాక్షసుసుడి కళేబరాన్ని చూపించి, దాన్ని
చిమ్మమని రాముడిని కోరతాడు సుగ్రీవుడు. ఇంత చిన్న పరీక్షా అని చిరునవ్వుతో, దాన్ని
అలకగా కాలిబొటనవేలితో, పేడును చిమ్మినట్లు, పది ఆమడల దూరంలో పడే విధంగా చిమ్ముతాడు
రాముడు. వాలికంటే రాముడు బలశాలి అనే నమ్మకం కుదిరేందుకు మరో పరీక్ష
పెట్టాడు సుగ్రీవుడు. సాల వృక్షాన్ని భేదించ మంటాడు. ఆయన కోరిక నెరవేర్చేందుకు, మళ్ళీ
సందేహానికి తావులేకుండా వుండేందుకు, సాల వృక్షాలను ఛేదించి, అవుండే
కొండను భేదించాడు. ఆయన బాణం రసాతలానికి పోయి తిరిగి ఆయన చేతిలోకి వచ్చింది. దాంతో
సుగ్రీవుడు తృప్తిపడ్డాడు. తనపగ తీరబోతుందన్న నమ్మకంతో వానర రాజ్యం లభించబోతుందన్న ఆశతో, సంతుష్టి
పడిన మనస్సుతో, రామచంద్రమూర్తిని తీసుకొని కిష్కింధకు పోయాడు".
"ఆ వెంటనే బంగారువన్నె దేహ కాంతిగల
వానరేశ్వరుడు-సూర్యపుత్రుడు, సుగ్రీవుడు సింహనాదం చేశాడు. ఆ
ధ్వనిని విన్న ఇంద్రకుమారుడు వాలి సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి బయల్దేరతాడు. రాముడి
సహాయం సుగ్రీవుడి కుందని తార ఆయనకడ్డుపడుతుంది. తమ్ముడితో సంధిచేసుకొమ్మంటుంది. ఇతరులతో
యుద్ధం చేస్తున్న తనను ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఎందుకు చంపుతాడని తారను సమాధాన
పరిచి సుగ్రీవుడిని యుద్ధానికి ఒప్పిస్తాడు. తన మిత్రుడిని తన ఎదుటే నొప్పిస్తుంటే
కళ్ళారా చూసిన రాముడు, శరణాగత ఆర్తత్రాణపరాయణత్వం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని
భావించి, ఒకే ఒక్క బాణంతో వాలిని నేలగూల్చుతాడు. వాలిని
యుద్ధంలో చంపిన రాముడు, సుగ్రీవుడు కోరినట్లే, వాలి పరిపాలిస్తున్న వానర రాజ్యానికి, సుగ్రీవుడిని
వాలి స్థానంలో ప్రభువును చేస్తాడు".
(తమ్ముడి భార్యతో సంగమించిన వాడికి
శిక్ష వధ అని శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్ర బద్ధుడైన రాముడు అట్లే చేశాడు. నేలబడేటట్లు
కొట్టాడే కాని, ప్రాణంపోయేటట్లు కొట్టలేదు. ఎందుకంటే వాడి దోషం గురించి వాడికి
చెప్పి ఇది ప్రాయశ్చిత్తం అని తెలియచేసేందుకే. దీన్ని బట్టి రాముడి ధర్మ బుద్ధి, సత్య
పరాక్రమం స్పష్టమవుతుంది).
"శ్రీరామచంద్రమూర్తి తన కోరిక
నెరవేర్చడంతో సుగ్రీవుడు తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం, మిక్కిలి
బల పరాక్రమవంతులైన వానరులను, సీతాదేవిని వెదికేందుకు, నాలుగు
వైపులకు పంపించాడు. వారిలో ఒకడైన హనుమంతుడికి, జటాయువు సోదరుడైన సంపాతి, సీతాదేవి
లంకలో వుందని చెప్తాడు. ఆయన మాట ప్రకారం, సుమారు నూరామడల సముద్రాన్ని
సునాయాసంగా దాటి రావణాసురుడేలే లంకా పట్టణానికి చేరుకుంటాడు హనుమంతుడు. లంక
ప్రవేశించిన హనుమంతుడు, రావణుడి అంతఃపురం దగ్గరలోవున్న అశోక వనంలో శోకిస్తూ, తన
భర్తనే ధ్యానిస్తూ, తపోబలంతో-శీల సంపత్తితో, నిజ
వర్చస్సుతో ప్రకాశిస్తున్న సీతాదేవిని చూశాడు. అగ్నిహోత్రుడి మిత్రుడి కుమారుడైన
హనుమంతుడు, సీతాదేవి తనను నమ్మేందుకు, శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన రామ
ముద్రికను చూపిస్తాడు. దుఃఖ పడవద్దనీ, రాముడు త్వరలో వచ్చి సీతను చెరనుండి
విడిపిస్తాడని అంటూ ఆమెను సమాధాన పరిచాడు. రామ లక్ష్మణులిరువురు సముద్రమెట్లా
దాటుతారని-దాటినా, ఇంతటి బలశాలి రావణుడి నెట్లా
జయించగలరని సందేహం వెలిబుచ్చుతుంది సీత. సూర్యపుత్రుడైన సుగ్రీవుడితో
రామచంద్రమూర్తికి స్నేహం లభించిన విషయం
చెప్తాడప్పుడు ఆమెకు ధైర్యం కలిగేందుకు హనుమంతుడు".
"ఒక్క వానరుడే ఇంత పనిచేస్తే, వానర
సేనతో రామచంద్రమూర్తి వచ్చి, లంకనంతా ధ్వంసం చేయడంలో సందేహం లేదు
అని రావణాసురుడనుకోవాలనీ-దాంతో సీతాదేవికి ధైర్యం కలగాలనీ భావించాడు
హనుమంతుడు. అందుకు ముందుగా రావణుడి
బలమెంతో తెలుసుకునేందుకు, వాడిని యుద్ధానికి ఈడ్చి తన్నాలనుకుంటాడు హనుమంతుడు. అలా
చేస్తే వాడికి తెలివొచ్చి సీతను అప్పగించి సమాధానపడ్తాడని తలుస్తాడు. వెంటనే
హనుమంతుడు పరాక్రమంతో ఉపక్రమించి, అశోక వనం తలవాకిటున్న ద్వారాన్ని
విరగ్గొట్టి, సేనానాయకులందరినీ-ఏడుగురు మంత్రి పుత్రులనూ చంపి, అక్షయ
కుమారుడిని హతమార్చి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడు. బ్రహ్మ
వరంతో ఆ కట్లు తెగిపోయినట్లు తెలిసినా, రావణుడిని చూసి వాడితో మాట్లాడాలని
భావించి, తనను ఈడ్చుకుంటూ పోతున్న రాక్షసులను చంపక విడిచిపెట్టాడు. సీతాదేవిని
తప్ప తక్కిన లంకంతా భస్మం చేసి, శీఘ్రంగా రామచంద్రమూర్తికి సీతాదేవి
వార్త తెలపాలని, లంక విడిచి మరలి పోతాడు హనుమంతుడు. ధీరాగ్రగణ్యుడైన
శ్రీరామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి, ’ రామా చూసితి సీతను - శీలం
విడవక జీవించి వున్న దానిని ’ అని చెప్తాడు.
(ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో
హనుమంతుడిని పడగొట్టాడు. అస్త్ర బంధనం అభేద్యమని తెలియని మూఢులు అతడి అనుచరులు. వూరికే
కిందపడ్డాడని అనుకున్నారు వాళ్ళు. తటాలున పైనబడి హనుమంతుడిని తాళ్లతో
కట్టేసారు. నీచ సాంగత్యాన్ని, తనపైన విశ్వాసం లేకపోవడాన్ని
ఓర్చుకోలేని బ్రహ్మాస్త్రం హనుమంతుడి కట్లు వదిలించింది. అది
రాక్షసులకు తెలవదు. హనుమంతుడికి తెలిసినా రావణుడిని చూసి మాట్లాడాలని, కట్లున్నవాడిలాగానే
నటించాడు. ప్రపత్తికి మహా విశ్వాసమే ప్రాణం. విశ్వాస
లోపం జరుగుతే ప్రపత్తి చెడుతుంది. బ్రహ్మాస్త్రం బంధాలకన్న తాళ్లు
గట్టివనుకున్నారు మూఢ రాక్షసులు. అట్లాగే భగవంతుడికి శరణాగతులైనవారు, ఆయనమీద
నమ్మకం లేక, ఇతర ఉపాయాలను వెదికితే భ్రష్టులవుతారు. ఇంకో
విషయం: "చూసితి సీత" నంటాడు. ఇక్కడ
చూడడం ప్రధానం. అందుకే మొదలు చూసిన సంగతి చెప్తాడు. అయితే
ఆ చూసింది సీతనే సంగతి తర్వాతొచ్చే విధంగా చూసితి సీత నంటాడు. ఇక
ఇక్కడినుంచి యుద్ధ కాండ వృత్తాంతం చెప్తాడు నారదుడు).
"సూర్యవంశంలో జన్మించిన
శ్రీరామచంద్రుడు, సూర్యుడి కొడుకైన సుగ్రీవుడితో-అతడి
సైన్యంతో, దక్షిణసముద్రపు తీరం చేరి, దాటేందుకు దారిమ్మని సముద్రుడిని
ప్రార్తిస్తాడు. దారివ్వని సముద్రుడిపై కోపించిన రాముడు, సూర్యుడితో
సమానమైన బాణాలను వేసి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఆ
క్షోభకు గురైన సముద్రుడు, తన భార్యలైన నదులతో సహా నిజ స్వరూపంతో వచ్చి, రామచంద్రమూర్తి
పాదాలపై పడి, క్షమించమని వేడుకుని, నలుడితో సేతువు కట్టించమని ఉపాయం
చెప్తాడు. అదే ప్రకారం చేసి, దానిపై సేనలతో నడచిపోయి, లంకలో
నిర్భయంగా ప్రవేశించి, యుద్ధభూమిలో రావణుడిని చంపి, సీతాదేవిని చూసి, ఇన్నాళ్ళూ
పగవాడింట్లో వున్న ఆడదానిని ఎట్లా స్వీకరించాలా అని సిగ్గుపడి, సీతాదేవిని
కఠినోక్తులాడుతాడు. పతివ్రతైన సీత, తన పాతివ్రత్య మహిమను లోకానికంతా
తెలపాలని తలచి, లక్ష్మణుడు పేర్చిన చితిలో మండుటెండలో ప్రవేశిస్తుంది. అప్పుడు
అగ్నిహోత్రుడు సీతను బిడ్డలాగా ఎత్తు కొచ్చి, సీతాదేవి వంటి పతివ్రతలు లోకంలో లేరనీ, ఆమెలో
ఎట్టి లోపంలేదనీ, ఆమెను గ్రహించమని శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. శ్రీరాముడామెను
మరల స్వీకరించి, బ్రహ్మ రుద్రాదిదేవతలందరు మెచ్చుకుంటుంటే
సంతోషిస్తాడు".
"దేవతా సమూహాల గౌరవం పొందిన
శ్రీరామచంద్రమూర్తి, తను చేసిన పని, లోకోపకారం-లోక
సమ్మతమైన పనైనందున, సంతోషపడ్తాడు. రావణాసుర వధనే ఆ మహాకార్యాన్ని చూసిన
దేవతలు-మునులు- ముల్లోక వాసులు, రావణుడి బాధ తొలిగిందికదా అని
సంబరపడ్డారు. తదనంతరం విభీషణుడిని లంకా రాజ్యానికి ప్రభువుగా చేసి, వీరుడై, కృతకృత్యుడై,
మనో దుఃఖం లేనివాడయ్యాడు శ్రీరాముడు
(రావణ వధ, సీతా
ప్రాప్తి, ప్రధానం కాదని, విభీషణ పట్టాభిషేకమే ప్రధానమని
సూచించబడిందిక్కడ. ప్రధాన ఫలం ప్రాప్తించినప్పుడే ఎవరైనా కృతకృత్యుడయ్యేది - మనో
దుఃఖం లేనివాడయ్యేది. సీతా ప్రాప్తి స్వకార్యం. దొంగలెత్తుకొని పోయిన తన సొమ్ము తాను
తిరిగి రాబట్టుకోవడంలాంటిది. చోరదండనమే రావణ వధ. తనపని
తాను చేయడంలో గొప్పేముంది? విభీషణ పట్టాభిషేకం ఆశ్రిత రక్షాధర్మకార్యం. ఆ
అశ్రిత రక్షాభిలాషే రావణ వధకు ముఖ్య కారణం. సీతా ప్రాప్తి స్వంత కార్యం. అందుకే
సీతను నిరాకరించగలిగాడుగాని, విభీషణుడి పట్టాభిషేకానికై ఉత్కంఠ
వహించాడు శ్రీరాముడు).
ఇంద్రాది దేవతల వరాలు పొంది, ఆ
వర బలంతో యుద్ధంలో మరణించిన వానరులకు ప్రాణం పోసి బ్రతికించి, మిత్రులైన
సుగ్రీవ విభీషణులతో కలిసి సార్థక నామధేయమైన అయోధ్యకు పుష్పక విమానంలో బయల్దేరి
పోతాడు శ్రీరాముడు. త్రోవలో భరద్వాజుడి ఆశ్రమంలో దిగి, తనరాక
విషయం భరతుడికి చెప్పాల్సిందిగా ముందు హనుమంతుడిని ఆయన వద్దకు పంపుతాడు. తర్వాత
పుష్పక మెక్కి అయోధ్యకు పోతూ, దారిలో గతంలో జరిగిన వృత్తాంతమంతా
సుగ్రీవుడికి చెప్తాడు. సాధుచరిత్రుడైన భరతుడుండే నందిగ్రామంలో దిగి, తమ్ములతో
సహా జడలు తీసేస్తాడు".
"సీతామహాలక్ష్మి తోడుండగా, సూర్యతేజుడైన
శ్రీరామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని తిరిగి యదార్థంగా పొందడంతో ముల్లోకాలు మిక్కిలి
సంతోషించాయి. శ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయి. సంతోషాతిశయంతో
కలిగిన గగుర్పాటుతో సాదువులు, ధర్మాత్ములు బలపడ్డారు. శ్రీరామరాజ్యంలో
సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని, యీతిబాధలుకాని
లేవు. పుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదు. స్త్రీలు
పాతివ్రత్యాన్ని విడవలేదు. వారికి వైధవ్య దుఃఖం లేదు. ఎక్కడా అగ్నిభయంలేదు. శ్రీరామరాజ్యంలో
నీళ్లలో పడి చనిపోయినవారు లేరు. పెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదు. దొంగలు
లేరు. ఆకలికి-జ్వరానికి తపించినవారు లేరు. నగరాలలో, గ్రామాలలో, నివసించే
జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగి, భోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి
సుఖమనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలను, యజ్ఞాలను
చేసి, బ్రాహ్మణులకు లెక్కపెట్టలేనన్ని ఆవులను, ధనాన్ని
దానమిచ్చి, తనసుఖాన్ని వదులుకోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ
పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు. శ్రీరామచంద్రమూర్తి, రాజ్య
హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించి, వారి
పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి, వారంతా స్వధర్మాన్ని వీడకుండా
కాపాడాడు. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే
నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీ, పరధర్మానుష్ఠానం
పతనకారణమనీ తెలియచేశాడు. శ్రీరామచంద్రమూర్తి పదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని
పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు".
రామాయణ పఠనంవల్ల ఇహపర లోకాల్లో సౌఖ్యంకలిగే
విషయాన్ని నారదుడు చెప్తాడీవిధంగా: "రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి
మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం
కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది
వేద స్వరూపమై, వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార
సాగరాన్ని తరింపచేస్తుంది కూడా. ఇది వినేవారు-చదివేవారు, అంతమాత్రాన
సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు-కూతుళ్లతో, మనుమలు-ఇష్ట
బంధువులతో అనుభవించి, మరణించిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి
చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు
చదవగా విన్నా, అర్థ విచారం చేసినా, బ్రాహ్మణుడికి వేద వేదాంగాలు అధ్యయనం
చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుంది. క్షత్రియుడికి సర్వాధిపత్యం
కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుంది. శూద్రుడికి
అపారమైన గొప్పతనం లభిస్తుంది. కాబట్టి నాలుగువర్ణాలవారు, స్త్రీ-పురుషులు, దీన్ని
చదవాలి-వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే
చదివి వినిపించాలి. చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని-కన్నదానిని, విశేషంగా
మననం చేయాలి. ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి".
(ఇక్కడితో సంక్షిప్త రామాయణం సమాప్తం. దీనిని బాల రామాయణం అని
కూడా అంటారు. ఇదే సంస్కృతంలో ప్రధమ సర్గ. ఈ సర్గ మొదటి శ్లోకంలో, మొదటి అక్షరం "త" కారం తో మొదలవుతుంది. ఇది గాయత్రి
మంత్రంలోని మొదటి అక్షరం. కడపటి శ్లోకంలోని కడపటి అక్షరం "యాత్".
గాయత్రి మంత్రం లోని కడపటి అక్షరమూ ఇదే. గాయత్రిలోని ఆద్యంతక్షరాలు చెప్పడంతో ఈ
సర్గ గాయత్రి సంపుటితమని తెలుస్తున్నది. ఈ నియమం ప్రకారమే వాల్మీకి వేయి గ్రంథాలకు
మొదట ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని వుంచడంతో 24,000 గ్రంథమయింది. 24,000 గ్రంథమంటే 24,000 శ్లోకాలని అర్థంకాదు. 32 అక్షరాల సముదాయానికి
గ్రంథమని పేరు. "గ్రంథోధనే వాక్సందర్భే ద్వాత్రింశ ద్వర్లసంహతౌ" అన్న
శ్లోకంలో ఇది విశదమవుతుంది.
ఒక శ్లోకంలో 32 అక్షరాల కంటే ఎక్కువ వుంటే, 32 అక్షరాలు మాత్రమే గ్రంథంగా భావించాలి. ప్రధమ
సర్గలో ఆద్యంతక్షరాల మధ్యభాగంలో, తక్కిన
అక్షరాలుండవచ్చేమోనన్న సందేహంతో, వాసుదాసుగారు, ఆ దిశగా శోధించినా కానరాలేదు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన, ఎరిగిన విజ్ఞులు ఎవరైనా వుంటే, మరింత వివరంగా దీనికి సంబంధించిన అంశాలను వెల్లడిచేస్తే, వారికి సవినయంగా నమస్కరిస్తానని, తన అంధ్ర వాల్మీకి రామాయణంలోని బాల కాండ మందరంలో రాసారు. ఒకవేళ
తక్కిన అక్షరాలు కనిపించకపోయినా లోపంలేదనీ, ఆద్యంతాక్షరాలు గ్రహించడంతో సర్వం గ్రహించినట్లేనని అంటారు
వాసుదాసుగారు. ఏదేమైనా శ్రీమద్రామాయణం "గాయత్రి సంపుటితం" అనడం
నిర్వివాదాంశం. యతిని అనుసరించే, ఆంధ్ర వాల్మీకి
రామాయణంలోని కడపటి శబ్దం "అరయన్" య కారంతో ముగించబడింది. తెలుగులో
"త్" శబ్దం కడపట రాకూడదు-దానికి ముందున్న "య"
కారాన్నిగ్రహించాలి).
jai sri ram
ReplyDelete