Sunday, December 6, 2015

హిందూ వివాహం కడు రమ్యం : వనం జ్వాలా నరసింహారావు

హిందూ వివాహం కడు రమ్యం
నవ తెలంగాణ దినపత్రిక (07-12-2015)
వనం జ్వాలా నరసింహారావు

వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది నిశ్చితార్థం- "నిశ్చయ తాంబూలం". ఒక శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలుగా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు.

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు ఒక శ్లోక రూపంలో హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడిక్కడ. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం.

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. తెల్లవారక ముందే, ముత్తైదువలు పెళ్ళి కూతురుకు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు. స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.

మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. మేళ-తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు ఆ పనిని బావమరిదితో చేయిస్తారు. వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి, పార్వతి, సరస్వతిల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.

బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల” మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.

గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-…. …. …. త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న …… గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయిన … అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు. కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.

గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు. కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.

వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది. మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది.

ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పాలి కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని వరుడితో చెప్పించాలి. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.

వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద.


వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది.

ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ తర్వాత సప్తపది వుంటుంది. వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు.

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. End


2 comments:

  1. చాలా వివరంగా చెప్పారు సార్. కానీ ఈ పెళ్ళితంతు విసుగు పుట్టిస్తుంది. కంఠే బధ్నామి అనుకుంటాను సార్. వ్యాసం మీరు చాలా గొప్పగా వ్రాశారు సార్.

    ReplyDelete
  2. చాలా చక్కగా వివరించారు... ఇంకా మంత్రార్ధాలతో వివరిస్తే ఇంకా బాగుంటుంది

    ReplyDelete