బ్రాహ్మణులంటే ఎవరు?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (06-12-2015)
నువ్వెవరివి? అని అడుగుతే
తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని
స్థితిలో వున్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని
అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే
రోజులొచ్చాయి. బ్రాహ్మణ విమర్శకులు, "ఓహో...బ్రాహ్మణులంటే
ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత
తెలుసా? బ్రాహ్మణులకి
ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన
చేయవచ్చా?" అన్న ఆలోచన కలుగజేయాలి. హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే
కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన
చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే
ఐనా, కొంత వ్యత్యాసం వుంది. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు
అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం.
"బ్రాహ్మణులు" అనే మాట
"బ్రహ్మన్" - అంటే "యజ్ఞం” అనే
పదం నుంచి వచ్చింది. యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే
"బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు.
వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే
బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా
పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ
వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని
"మాత్రులు" అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత
స్వభావులైన వారిని "బ్రాహ్మణులు" అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే
వారిని "శ్రోత్రియులు" అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను "అనూచానులు"
అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న
వారిని "భ్రూణులు" అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని "ఋషికల్పులు" అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని
"ఋషులు" అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని
"మునులు" అని అంటారు.
అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో
బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా
పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ
వున్నారు. నేపాల్‌లో "బహున్" లుగా, మయన్మార్‍లో "పొన్న" లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు.
దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు
దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని
తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం.
తెలుగు స్మార్త బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది
వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణకమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ
పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.
వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య
కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం
చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని
"వైదికులు" అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల
నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు
వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన
వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే
ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు.
ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.
వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు "నియోగులు".
వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని రకరకాల ఉప శాఖల
వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన
వారని. పౌరోహిత్యం వృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల
నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో
అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు. శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజులు
పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో
చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల
పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల
నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న
పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి
వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ
కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల
తెగ ఏర్పడి వుండవచ్చు. వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు
తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన
బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు.
బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు.
మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో
వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.
వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న
బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న
బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు
సబబు?
చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి
పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం
కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం
కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు
కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని
బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి
తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ
దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు.
అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి
చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య
దిన-దినం తగ్గిపోసాగింది.
5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ
బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు.
బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత
సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు
కొనసాగించేవారు దాదాపు లేనట్లే!
కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న
పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు
వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది
ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు
కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ
ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత
అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి
వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా
దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని
ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన
బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల
మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు
ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో
బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్
సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార
స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చేశాయని కూడా జర్నల్
రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు.
ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న
నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు
గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు.
ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం.
అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని
బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం
లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి
పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా
చూడడం సమాజం కర్తవ్యం! End
ReplyDeleteచాలా మంచి పరిశీలనాత్మక మైన టపా పెట్టారు .
జిలేబి
Nice..good post..
ReplyDeleteప్రస్తుత మన సమాజం లో ఎవరూ ఏదీ వినే స్థితిలో లేరని నా అభిప్రాయం...వారి ఓట్ల శాతం ఎంత ఉందో తేల్చగలిగితే తప్ప, రాజకీయులు బ్రహ్మణులను లెక్కలోకి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు...
ReplyDeleteGood one.
ReplyDeleteచాలా కఠోరమేన సత్యాన్ని చాలా సునాయాసంగా విశ్లెసంచారు. If a survey of brahmins is done now , the truth will be out on what the reservation policy has done to the society.
ReplyDelete