బాల కాండ
మందర మకరందం
ఎందుకు
చదవాలి? ఏం
తెలుసుకోవచ్చు?-7
వనం
జ్వాలా నరసింహారావు
విశ్వామిత్రుడు తొలుత
రాజు. గృహస్థుడు. భార్యతో సహా పోయి వానప్రస్థుడై తపస్సు చేసి రాజర్షి అయ్యాడు.
అడవిలో దొరికే పళ్లుమాత్రమే తిని తపస్సు చేసి, తర్వాత, ఋషి అయ్యాడు. అప్పటిదాకా
భార్యా పిల్లలు ఆయన వెంటే వున్నారు. తర్వాత ఒంటరిగా వుండి తపస్సు చేసి మహర్షి
అయ్యాడు. మహర్షులంతా జితేంద్రియులు కారు. కాబట్టి, జితేంద్రియుడు కావడానికి, పంచాగ్నుల మధ్య నిలిచి-ఆహారం మాని-వాయువే ఆహారంగా తపస్సు చేశాడు.
ఇంతచేసినా కామాన్ని జయించగలిగాడుగాని, కోపాన్ని జయించలేకపోయాడు. అదికూడా జయించేందుకు, మౌనంగా-కుంభకంలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. అప్పుడు అన్నీ జయించి
బ్రహ్మర్షి అయ్యాడు. జన్మతో వచ్చే బ్రాహ్మణ్యం కర్మతో రాదు. విశ్వామిత్రుడికి
వచ్చిందంటే దానికొక ప్రత్యేకమైన కారణముందనే అనాలి. ఎవరికైనా-ఎంత చేసినా కామ
క్రోధాలు అనివార్యం. వాటిని తనకు వశపడేటట్లు చేసుకున్నవాడే బ్రాహ్మణోత్తముడు.
అందుకే బ్రాహ్మణ్యం సులభమైంది కాదు.
సీతా రాముల కళ్యాణానికి ముందు ఇరు వంశాలవారు వంశ
క్రమాలను గురించి అడిగి తెలుసుకుంటారు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ
జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. కులం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ
కూడదు. వివాహంలో వధూవరుల కుల జ్ఞానం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి కులం, తండ్రి కులం పరీక్షించాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో పది రకాల వంశం వారిని వదలాలని శాస్త్రం చెపుతున్నది.
జాతకర్మాది క్రియలు లేని, పురుష సంతానంలేని, విద్యా శూన్యమై, మిగిలి దీర్ఘ రోగాలు కలదై, మూల రోగాలు కలదై, క్షయ-అజీర్ణం-అపస్మారం-బొల్లి-కుష్ఠు
రోగాలు కలదైన వంశాలతో వివాహ సంబంధం చేయరాదు. తోడబుట్టినవాడు లేని పిల్లను, తండ్రెవరో తెలియని దానిని వివాహం చేసుకోకూడదు.
ఇక్ష్వాకు వంశంలో
జన్మించిన సగరుడి తండ్రి అసితుడిని హైహయులు-తాల జంఘులు-మరికొందరు కలిసి రాజ్య
భ్రష్టుడిని చేసి తరిమేశారు. ఆయనప్పుడు హిమవత్పర్వతానికి పోయి నివసించాడు.
అక్కడప్పుడు సగరుడి తల్లి గర్భవతిగా వుంది. ఆ సమయంలో అసితుడు మరణించాడు. ఆయన భార్య
సహగమనం చేయబోతుంటే, చ్యవనుడు వారించి ఆమెను
తన ఆశ్రమంలో వుంచి రక్షించాడు. ఆమెకు పుట్టిన సగరుడికి తానే సంస్కారాదులు చేసి, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్ర విద్యలనూ నేర్పాడు. బుద్ధి తెలిసిన
సగరుడు తన తండ్రి వివరాలను అడిగితే, తల్లి ఆ వృత్తాంతమంతా వివరించింది. సగరుడు తండ్రిని తరిమిన వారితో
యుద్ధంచేసి, ఓడించాడు. గురువాజ్ఞ
ప్రకారం వారిని చంపలేదు. వారిలో యవనులను బోడితలల వారిగానూ, శకులను అర్థముండులుగా, బారదులను విరితల వారిగా జాతి భ్రష్టులను చేశాడు. అలా ఆ
క్షత్రియులందరినీ స్వాధ్యాయ హీనులుగా-వషట్కార రహితులుగా-స్వధర్మ హీనులుగా చేసి
దేశంనుండి వెళ్లగొట్టాడు సగరుడు.వీరే "మ్లేచ్ఛులు”. ఇప్పటి తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య
శబ్దంనుండి పుట్టినవారే. ఆర్యన్ కు వికృతి "అయిరాన్". అదే ఇరాన్ గా మారింది తదనంతరం.
సీతా కల్యాణ ఘట్టం
చదివినవారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం
చేస్తూ జనకుడు రాముడిని "కౌసల్యా సుత" అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? స్త్రీ పేరుతో పిలవకుండా, వాడుక పేరైన "రామా" అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే
ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు
కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు.
"ఈ సీత" అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి
పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా
స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు.
అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి "ఈ సీత" అని
చెప్పాడు. అలంకరించబడిన కల్యాణమంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో
తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి "ఈ సీత" అని చెప్పాడు జనకుడు.
"ఈ సీత" అంటే,అతి రూపవతైన సీతని, సౌందర్య-శౌకుమార్య-లావణ్యాదులలో
స్త్రీలందరిని అతిశయించిందని అర్థంకూడా వస్తుంది. "ఈ సీత" అంటే, "ఈ యగు సీత" అనే అర్థం కూడా వుంది.
రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడికంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు.
అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా
"ఈ సీత" అన్నాడు. రాముడెంత మహా సౌందర్య పురుషుడని పేరుందో, అంతకంటే తక్కువకాని సౌందర్యం ఆమె కుందని చెప్పదల్చుకున్నాడు జనకుడు.
సీత అంటే కేవలం నాగటి చాలనే కాదని, నాగటి చాలు భూమిని ఛేదించుకొని రూపంకలదిగా ఎలా అవుతుందో, అలానే భూమిని ఛేదించుకొని రావడంవల్ల సీత అనే పేరు ఆమెకు
ప్రఖ్యాతమయింది. దీనివల్ల ఆమె ఆభిజాత్యం తెలుస్తున్నది. సీత-నాగటి చాలు-అంటే
కాపువాడి కృషి ఫలింపచేసి, వాడికి ఫలం కలిగించేది.
అలానే రాముడు చేయబోయే కార్యాలన్నీ, సీత వలనే ఫలవంతమవుతాయనీ, ఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమని, ప్రతిఫలాపేక్ష లేకుండా అతడికి సహాయపడుతుందని జనకుడి మనస్సులోని
ఆలోచన.
ఆకాశ గంగానది శాఖైన సీత
ఏవిధంగా ఒకసారి తనను సేవించినవారి పాపాలను ధ్వంసం చేస్తుందో, అలానే "ఈ సీత" తనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను
ధ్వంసంచేస్తుంది. కౌసల్యా సుతుడైన రాముడు యోనిజుడని, సీత అయోనిజని, కాబట్టి ఆభిజాత్యంలో
రాముడికంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావన. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ
జనకుడు సగర్వంగా, "నాదుకూతురు"-తన కూతురని చెప్పాడు. అలాంటి తనకూతురును, ఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడు. సీతంటే జన్మపరిశుద్ధి
అనీ, "నాదుకూతురు" అంటే
నానా సపరిశుద్ధి అనీ తెలుపబడింది. "నీ సహధర్మచరి" అనడమంటే, రాముడి విషయంలో ఎలా వుంటుందోనని ఆలోచించాల్సిన పనిలేదనే అర్థం
స్ఫురిస్తుంది. రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మంమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది.
రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయి
నందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి
కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థులయందు తోడుగా వుంటుంది. వివాహ
లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే
తీసుకొమ్మని కూడా అర్థం.
పరశురాముడు శ్రీరాముడిని అడ్దగించి, తనతో ద్వంధ యుద్ధం చేయమని అడిగిన సందర్భంలో చాలా విషయాలు అవగతమౌతాయి. పరమార్థ జ్ఞానం దేవతలు క్రియా రూపంగా తెలిపేందుకు బ్రహ్మ
శివకేశవుల మధ్య పరస్పర ద్వేషం కలిగించి యుద్ధం చేయించాడు. ఒకరు చూసి చెప్పినదానిలా కాకుండా, కళ్లార చూసి, ఎవరెక్కువ బలవంతులో దేవతలు స్వయంగా
తెలుసుకున్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా, విష్ణువు ఎక్కువా-శివుడెక్కువా అని, తత్పక్షపాతులు విరివిగా గ్రంథాలు రాసారు. శివ కేశవులకు భేదం లేదని పురాణాలు ఘోషించాయి. భగవంతుడు-జనార్ధనుడు ఒకడే. సృష్టి-స్థితి-నాశనం చేసేందుకు బ్రహ్మని, విష్ణువని, శివుడని పేర్లు పెట్టుకున్నాడు. విష్ణువు అధికుడని దేవతలు గ్రహించారని
పరశురాముడు శ్రీరాముడికి చెప్పాడు. వింటిని లాక్కుంటూ పరశురాముడిలో వున్న వైష్ణవ
తేజస్సును కూడా శ్రీరామచంద్రమూర్తి లాక్కున్నాడని అర్థంచేసుకోవాలి. పరశురామావతారం ఆవేశావతారం. కార్యార్థమై, జీవుడిలో తత్కాలంవరకు, భగవంతుడి తేజస్సు ఆవహిస్తే అది ఆవేశావతారమవుతుంది. ఇక్కడ దేహం ప్రాకృతం. జీవుడు బద్ధుడు. ఇలాంటి ప్రకృతి సంబంధమైన అవతారాలు
పూజ్యమైనవికావు-మోక్షమిచ్చేవీ కావు. శ్రీరామావతారం పూర్ణావతారం. ఈ రెండు అవతారాలు కలిస్తే, తక్కువ తేజస్సు, ఎక్కువ తేజస్సులో కలిసిపోతుంది. పరశురాముడిలోని వైష్ణవ తేజం బయటికొచ్చి దేవతలందరు చూస్తుండగా
శ్రీరాముడిలో ప్రవేశించింది.
బాల కాండ చివరలో సీతారాములు అయోధ్యలో
వివాహానంతరం గడిపిన విషయాన్ని వివరించబడింది. అయోధ్యా నగరంలో శ్రీ సీతా
రాములు సర్వ సుఖాలు అనుభవించారని చెప్పడంలో వారిద్దరి అన్యోన్యత, అనురాగం, అవతార నేపథ్యం లాంటి అనేక
విషయాలు భావగర్భితంగా దర్శనమిస్తాయి. సీతను గూడి శ్రీరామచంద్రుడు ప్రియంగా గడిపాడు
అనిచెప్పడంలో, భోగానుభవంలో ప్రాధాన్యం
శ్రీరామచంద్రమూర్తికేనని చెప్పబడింది. సీత భోగ్య-రామచంద్రుడు భోగి. భోగ్యకంటే భోగి
ప్రధానం. "సీతనుగూడి ప్రియంగా", అనడమంటే, సీత దగ్గరలేని సమయం
దుఃఖకరమే కాని ప్రియంకాదని-కాజాలదని భావం. అయితే, సీతారాముల విహారంవలన కలిగే సంతోషం, సీతకే చెందాలని రామచంద్రమూర్తి అభిప్రాయం. ఇరువురి విషయంలోనూ, "కూరిమి" శబ్దాన్ని ప్రయోగించడమంటే, వారిరువురు పరస్పరం సమానమైన ప్రేమ కలవారై వున్నారని భావం. కూరిమి చెప్పబడిందే కాని, కామం గురించి చెప్పలేదు. అంటే, వారి ఐకమత్యానికి-పరస్పరానురాగానికి కారణం కూరిమిగాని, కామంకాదే. వారలా అనేక "ఋతువులు" గడిపారని వుంది గాని, అనేక సంవత్సరాలని లేదు. దానర్థం-వారు ఏ ఏ ఋతువుల్లో ఎలా సుఖపడాల్నో
అలానే సుఖపడ్డారని.
రామచంద్రమూర్తి కోరిక
కోరబోతున్నాడని ముందుగానే సీత ఎలా పసిగట్టగలదన్న సందేహం రావచ్చు. ఆమెకు అంత
శక్తెలా వచ్చిందంటే, ఆమె మైథిలికన్య-మహా
జ్ఞాని, మహాయోగైన జనక రాజు కూతురు
కనుక. దేశ స్వభావం-వంశ స్వభావం బట్టీ, దేవతతో సమానమైనందున ప్రాగల్భ్యాన్ని బట్టీ, సాక్షాత్తు లక్ష్మి కాబట్టి సహజ బుద్ధి విశేషాన్ని బట్టీ అమెకు ఆ
శక్తి వచ్చిందనాలి. సీతారాముల భోగ విషయంలో ఇక్కడ చెప్పబడిన లక్ష్మి నారాయణ ఉపమానం
పద్మ పురాణంలో కూడా వుంది. ఇక్కడ చెప్పింది దివ్యదంపతి భోగమే. ప్రాకృత కామ ప్రేరిత
సంభోగం గురించి ఎక్కడా చెప్పలేదు. అప్రాకృత దివ్య మూర్తులలో ప్రాకృత కామం వుండే
అవకాశం లేనేలేదు. వివాహం అయ్యేటప్పటికి తనకు ఆరు సంవత్సరాల వయస్సని సీతే
స్వయంగా-పరోక్షంగా రావణుడికి వనవాస కాలంలో చెప్పింది. ఆ వయస్సులో ఆంతర సంభోగానికి
అవకాశం లేదు. బాల కాండ వృత్తాంతమంతా 12 ఏళ్లు. బాల కాండ మందర
మకరందం చదివిన వారికి, రామాయణమంతా
చదివిన అనుభూతి కలగడంతో పాటు అనేకమైన అద్భుతాలు, రహస్యాలు వివిధ సందర్భాల్లో చెప్పిన కథల ద్వారా
తెలుసుకోవచ్చు.
నారదుడు వాల్మీకికి చెప్పిన సంక్షిప్త రామాయణం-వాల్మీకి
యోగదృష్టితో తెలుసుకున్న రామాయణం చదవడమంటే మొత్తం రామాయణాన్ని చదివినట్లే.
వాల్మీకి ప్రశ్నలకు నారదుడిచ్చిన సమాధానం ద్వారా, భగవంతుడు సాకారుడా-నిరాకారుడా అనే విషయం, తత్వ విచారం కంటే గుణ విచారమే శ్రేయస్కరమన్న విషయం, శ్రీరామచంద్రుడంటే పరతత్వమైన విష్ణుమూర్తేననీ, నారదుడు ఉపదేశించింది మోక్ష విషయమైన భగవంతుడి గురించేననీ బాల
కాండ చదివినవారికి బోధపడుతుంది. కవిత్వమంటే ఏమిటి, కావ్య లక్షణాలేంటి, ప్రబంధ లక్షణాలేంటి తెలుసుకోవచ్చు. ఉపాయ వివేచనం, శరణాగతికి ముఖ్య ఫలం, పురుష కారం, అధికార స్వరూపం, భగవత్ పారతంత్ర్యం, భాగవత పారతంత్ర్యం, అర్థపంచక జ్ఞానం, అకించినత్వం, ఆచార్యవరణం, ఔత్కంఠ్యత, నడవడి, వాసస్థానం, రామాయణం ద్వయార్థ వివరణరూపం, గాయత్రి, దుర్విచార పరిహారం, సంహర జిహాస, చతుష్షష్టి కళల గురించి వివిధ సందర్భాల్లో తెలుసుకోవచ్చు.
వీణల గురించి, మంత్రుల లక్షణాల గురించి, అతిథి అంటే ఎవరనే విషయం గురించి, బ్రహ్మచర్యం గురించి, సందర్భం లేకుండా తెలిసిన విషయమైనా చెప్పకూడదన్న విషయం గురించి, విష్ణు శబ్ద నిర్వచనం గురించి తెలుసుకోవచ్చు. సరయూ నది వృత్తాంతం, మలద కరూశాల వృత్తాంతం, సిద్ధా శ్రమ వృత్తాంతం, బలిచక్రవర్తి వృత్తాంతం, పరిణామ వాదం, కుశనాభుడి వృత్తాంతం, బ్రహ్మ దత్తుడి చరిత్ర, గంగానది వృత్తాంతం, కుమారస్వామి జననం, సగర చక్రవర్తి వృత్తాంతం, బ్రహ్మ కల్ప వివరణ, భగీరథ వృత్తాంతం, విశాలనగర వృత్తాంతం, క్షీరసాగర మథనం, గౌతమాశ్రమ వృత్తాంతం, విశ్వామిత్రుడి వృత్తాంతం-ఆయన రాజర్షిగా, మహర్షిగా, బ్రహ్మర్షిగా కావడం, వశిష్ఠ-విశ్వామిత్రుల యుద్ధం, త్రిశంకోపాఖ్యానం, శునస్సేపోఖ్యానం, గోదాన వివరణ లాంటి అనేక విషయాలు బాలకాండ మందర
మకరందం చదివితే తెలుసుకోవచ్చు.
వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక
ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన
అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి
తెలుసుకోవచ్చు, పరిశోధనా దృక్ఫదంతో చదివితే. ఇవన్నీ బాల కాండలోనూ దర్శనమిస్తాయి. బాలకాండ
మందర మకరంలో ఇవన్నీ వివరించబడ్డాయి. అందుకే-ఇందుకే చదవాలి.
...రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడికంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు.....
ReplyDeleteశివకేశవులకు అబేధం కదండీ. వారిరువురిలో న్యూనాధిక్యతలను తలచరాదండి.