బాల కాండ
మందర మకరందం
ఎందుకు
చదవాలి? ఏం
తెలుసుకోవచ్చు?-3
వనం
జ్వాలా నరసింహారావు
గ్రంథాన్ని చదవాలనుకునేవారు మూడు
విషయాలు అవశ్యంగా తెలుసుకోవాలి. గ్రంథం చెప్పిందెవరు? అతడి
నడవడి ఎలాంటిది? లోకులకతడు ఆప్తుడా? అని విచారించాలి. దీన్నే
వక్తృ విశేషం అంటారు. మేలుకోరి మంచే చెప్తాడన్న విశ్వాసానికి పాత్రుడైన వాడే
ఆప్తుడు. వీడి వాక్యమే ఆప్త వాక్యం. ఆప్త వాక్యం తోసివేయలేనటువంటిది. మొదటి
ఆప్తుడు భగవంతుడు. వేదం ఆప్తవాక్యం. ఫ్రజల మేలుకోరి, వేదార్థాలను, పురాణ-ఇతిహాస
శాస్త్రాలను, లోకానికి తెలిపినవారు ఆప్తులు. వారి
రచనలు ఆప్త వాక్యాలు. యధార్థాన్ని తను తెలుసుకుని, కామ-క్రోధ-లోభాలకు లోనుకాకుండా, తనెరిగిన
ఆ యధార్థ విషయాన్నే, ఇతరుల మేలుకోరి చెప్పడమే ఆప్త లక్షణం. అలాంటిదే
వాల్మీకికి బ్రహ్మానుగ్రహంవల్ల కలిగింది. కాబట్టి ఆయన పరమాప్తుడు.
రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ
శ్లోకంలో, ఆంధ్ర
వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన మొదటి పద్యంలో నాలుగు
పాదాలున్నాయి.
పాదానికి 13 అక్షరాలు. సాంఖ్యశాస్త్రంప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "ఓ" విష్ణు
అనే అర్థమున్న "మానిషాద"
శబ్దం "అ" కారాన్ని
సూచిస్తుంది. "ప్రతిష్ఠ” స్త్రీ లింగం. ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "ఉ" కారాన్ని
బోధిస్తుంది."నీక"
అనేది "ఉ" కార
మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "మ"
కారాన్ని బోధిస్తుంది.
వాసుదాసుగారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా
సూచిస్తుంది. "మానిషాదుండ... ...
అంటే లక్ష్మికి నివాస
స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడా" అనే
పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని
సూచిస్తుంది. "శాశ్వతహాయనముల"
అనే పదంలో రాముడు
దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను
తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ
అర్థాన్ని సూచిస్తుంది. ఇలా
రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ పద్యంలో.
పద్య రూపంలో శాపం ఇవ్వాలన్న తలంపు వాల్మీకికి లేదు. ఆయనా, తను
వూరికే దూషించిన వాక్యం శాపంగా మారిందేనని, వాల్మీకి ఆశ్చర్యపడ్డాడు. దీని యదార్థ భావాన్ని వివిధ రకాలుగా విశ్లేషించవచ్చు. వాల్మీకి నారదుడిద్వారా రామ కథనంతా-సర్వం తెలుసుకుంటాడు. కరుణ రస భరితంగా ఆ చరిత్రను గ్రంథస్థం చేయాలనుకుంటాడు. అందుకు ఆయనకి కరుణ రసం తగినంత పాళ్లలో వుండాలికదా! ఆ విషయాన్ని పరీక్షించగోరి, గతంలో భృగుమహర్షి ఇచ్చిన శాపాన్ని స్థిర పరిచేందుకు, శ్రీరాముడు బోయవాడి వేషంలో రాక్షసుడైన క్రౌంచపక్షిని చంపాడట. దీనినే శ్రీరాముడు-సీత అనే భార్యా-భర్తల ఎడబాటుగా అన్వయించుకోవచ్చు కూడా. ఏదేమైనా, వాల్మీకి రామాయణంలో చెప్పిన దానికి అర్థం వెతికేటప్పుడు, వాల్మీకి రామాయణమే ప్రమాణం కాని, ఇతర గ్రంథాలు ప్రమాణం కావు.
అలాంటప్పుడు, వాల్మీకి రామాయణం సత్యచరిత్రమనీ, అందులోని అనేక విషయాలు జరిగినవి-జరిగినట్లే, తెలుపబడ్డాయనీ చదువరులు మనస్సులో వుంచుకోవాలి. తక్కిన రామాయణాలన్నీ స్వమతాభిమానాన్ని, స్వమతాన్ని వుద్ధరించాలన్న ఆలోచనను తెలియబర్చేవి మాత్రమే. తన ఏడుపు కథను రాసేందుకు వాల్మీకికి తగినంత మోతాదులో ఏడుపు
గొట్టుందానని శ్రీరాముడు పరీక్షించాడనడం విడ్డూరమనే అనాలి. ఇంతకూ, వాల్మీకి రామాయణాన్ని శృంగార ప్రబంధంగా వ్యాఖ్యాతలందరు
అంగీకరించారు కాని, కరుణ
ప్రబంధంగా అంగీకరించలేదు. సీతా
వియోగం కూడా విప్రలంభ శృంగారమే.
వాల్మీకి బోయవాడిని రామచంద్రమూర్తి అని అనుకుని శపించలేదనేది
పూర్తి యదార్థం. ఆయన
రాముడి భార్య సీత తన ఆశ్రమంలో వుందన్న విషయం, ఆమె దుఃఖంతో పరితపిస్తున్న విషయం ఎరిగిన వాల్మీకి, ఆమె దుఃఖాన్ని మరింత పెంచడు కదా! తను పద్య రూపంలో అన్నది శాపంగా పరిణమిస్తుందని ఆయనకూ తెలియదప్పుడు. ఆయన మనస్సు లోని ఉద్దేశం తిట్టు రూపంలో పద్యంగా రావడానికి
కారణం, ఆయన
నాలుకపై సరస్వతి వుండడమే. పలికించింది
బ్రహ్మ పనుపున రామకథ వాల్మీకితో చెప్పించాలని వచ్చిన సరస్వతి. అంటే, కవి
అనుకోకున్నప్పటికీ, సరస్వతి
ఆయన నోట అలా పలికించిందనాలి.
శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే . అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన బాల కాండ మొదటి పద్యం లోనే
వివరించబడింది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే, వాల్మీకి రామాయణ రచన చేశారన్న విషయం కూడా కాండ
మొదటి పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి అవతరించడానికి పూర్వమే
వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం. రామాయణంలోని శ్లోకాలు, సర్గలు, కాండల వివరాలు కూడా మొదటి పద్యంలో చెప్పడం జరిగింది.
గ్రంథాలు మూడు రకాలు. ప్రభు సమ్మిత శబ్ద ప్రధానమైంది మొదటి రకం - అంటే, శబ్దాల ఆడంబరంతో రాజులాగా ఆజ్ఞాపించేది. ఇక రెండో రకం సుహృత్సమ్మిత అర్థ ప్రధానమైంది - అంటే, స్నేహితుడివలె బోధించేది. కాంతా సమ్మిత వ్యంగ్య ప్రధానమైంది మూడో రకం - అంటే, వ్యంగార్థమే ప్రధానంగా వుండి, ప్రియురాలివలె మనస్సుకు నచ్చచెప్పి చేయించేది. రామాయణం అర్థ ప్రధానమై ఇతిహాసంగాను - వ్యంగ్య ప్రధానమై కావ్యంగాను ప్రసిద్ధి పొందింది. రామాయణాన్ని సీతా మహా చరిత్ర అంటాడు వాల్మీకి. రామచంద్రమూర్తి చరిత్రకంటే, సీతాదేవి చరిత్ర ఉత్కృష్టమైందని దానర్థం. కౌసల్యా గర్భ సంభూతుడు రాముడు. అయోనిజ సీత. తండ్రి ఆజ్ఞ ప్రకారం అడవులకు వెళ్లినవాడు రాముడు. ఎవరి బలవంతం లేకపోయినా, కేవలం పతిభక్తితో అడవులకు పోయింది సీత. కష్ట కార్యాలు చేసినందువల్ల గట్టి దేహం కలవాడు రాముడైతే, ఎండకన్నెరుగని సుకుమారి సీత. స్వతంత్రుడై, శక్తుడై, తోడున్నవాడై, దుఃఖం అనుభవించాడు రాముడు. రాక్షసుడికి బందీగా, ప్రాణ భయంతో, నిరాహారిగా, అశక్తిగా, ఒంటరిగా దుఃఖ పడింది సీత. భక్తుల దోషాలను క్షమిస్తానన్నాడు రాముడు. భక్తుల్లో దోషాలే లేవన్నది సీత. కాకాసురుడికి శిక్ష విధించి క్షమించాడు రాముడు. తనను బాధించిన రాక్షస స్త్రీలను క్షమించింది సీత. లోకపిత రాముడైతే, లోకమాత సీత. తన చరిత్రకంటే సీతాదేవి చరిత్రే శ్రేష్ఠమైందని
రామచంద్రమూర్తే స్వయంగా అంటాడొకసారి. అందువల్లనే రామాయణాన్ని సీతా మహాచరిత్రమంటాడు
వాల్మీకి మహర్షి.
తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు రామాయణ
గానం చేస్తున్నారని తమ్ముళ్లతో అంటాడు శ్రీరామచంద్రుడు వారు తన ముందర గానం
చేస్తున్నప్పుడు. రామాయణం వేదార్థం కలది. శ్రుతి కటువుగా కాకుండా, విన సొంపై, కేవలం ఐహికానందం మాత్రమే కాకుండా, అమృతంలాగా మోక్షానందం కూడా కలిగించేది రామాయణం. అలలు ఎలా అంతం లేకుండా వస్తుంటాయో, అలానే రామాయణ కావ్యం కూడా ఎప్పటికప్పుడు
బ్రహ్మానందం కలిగిస్తూనే వుంటుంది. అసత్యమంటే ఎరుగని - అసత్యమాడని శ్రీరామచంద్రుడు తన మనసులో వున్న ఇదే విషయాన్ని బయటకంటాడు. ఆనందం రెండు రకాలు: విషయానందం, బ్రహ్మానందం. కమ్మని రుచికరమైన పదార్థాలను తినడం-ఇంపైన ధ్వనులను వినడం-పరిమళ పదార్థాలను చూడడం వలన కలిగే ఆనందం
విషయానందం. మోక్ష కాలంలో పరిపూర్ణ బ్రహ్మానుభవం ద్వారా కలిగే ఆనందం బ్రహ్మానందం.
(ఇంకా వుంది...ఈ శీర్షికే
ఏడు భాగాలుగా వస్తుంది..ఇది మూడో భాగం)
No comments:
Post a Comment