చతుర్వేద స్వాహాకార పురస్సర
మహారుద్ర పురశ్చరణ సహిత
అయుత చండీ మహాయాగం
వనం
జ్వాలా నరసింహారావు
లోక కళ్యాణానికి, విశ్వ శ్రేయస్సుకు ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిసెంబర్ 23, 2015 నుంచి డిసెంబర్ 27, 2015 (శ్రీమన్మధ
మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి బహుళ ద్వితీయ) వరకు, మెదక్ జిల్లా, జగదేవపూర్ మండల్, ఎర్రవల్లి గ్రామంలో వున్న
తన వ్యవసాయ క్షేత్రంలో అయుత చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి
అందరూ ఆహ్వానితులే అని సీఎం పత్రికా సమావేశంలో చెప్పారు.
సుమారు
నలబై వేల మందికి ఆయన ప్రత్యేకంగా ఆత్మీయ ఆహ్వానాలు పంపారు. అందులో
ఆయన...ఆహ్వానితులను "ధార్మిక మహాశయులారా" అని సంబోధిస్తూ, యాగం నిర్వహిస్తున్న సంకల్పాన్ని
వివరించారు. "జగన్మాత చండికా పరమేశ్వరి ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతం
సస్యశ్యామలంగా అలరారుతుంది. దుర్భిక్షం, దుఃఖం
అనేవి అ దరిదాపులకు కూడా రావు. అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవు. కలౌ చండీ
వినాయకౌ అనేది ఆర్ష వాక్యం. అంటే చండీ వినాయకుల ఉపాసన కలియుగంలో విశేష ఫలప్రదం అని
అర్థం. చండీమాత సకల దేవతా స్వరూపిణి. ఆమె అమ్మలగన్నయమ్మ. సృష్టి చక్రానికి
కారణమయ్యే బ్రాహ్మిగా,
సుఖ సంపదలతో చల్లగా కాపాడే
వైష్ణవిగా, సకల సౌభాగ్య మంగళాలను ప్రసాదించే
శాంకరిగా ఆ జగజ్జనని వేదాది వాజ్ఞయంలో స్తుతింపబడినది. ఆ చల్లని తల్లిని ప్రసన్నం
చేసుకుని, సకల జనపదాలకు, పట్టణాలకూ, జిల్లాలకూ, రాష్టానికీ, దేశానికీ, ప్రపంచానికీ, సుఖ శాంతులు, ఆయురారోగ్య భాగ్యాలనూ ఆకాంక్షిస్తూ
తలపెట్టిన పవిత్ర కార్యమే అయుత చండీ మహాయాగం. ఈ అమోఘ మహాయాగానికి అనాదిగా విశేష ప్రాచుర్యం
ఉంది. సమస్త ప్రాణులు సుఖ సంతోషాలతో శాంతియుత జీవనం సాగించాలనే సత్సంకల్పంతో ఈ
మహాయాగాన్ని నిర్వహిస్తున్నాము"...అని రాశారు.
యాగాన్ని
గురించి కూడా వివరించారు. ముఖ్యమంత్రి దంపతులు శ్రీమతి కల్వకుంట్ల శోభారాణి
, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు
అందులో..."మార్కండేయ పురాణంలోని సప్తశతీ అనే స్తవాన్ని పఠించడం ద్వారా సకల
సౌఖ్యాలూ కలుగుతాయి. ఈ మహాయాగం శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ
మహాస్వామి వారు, శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా
స్వామి వార్ల పవిత్ర మార్గదర్శనంలో పదివేల చండీ సప్తశతీ పారాయణము, కోటి నవార్ణ మంత్ర జపము, వెయ్యి సప్త శతీ హోమము, పది లక్షల నవార్ణ మంత్ర హోమము, వంద సప్తశతీ తర్పణము, లక్ష నవార్ణ మంత్ర తర్పణము, మార్జన, భోజనాది
పురశ్చరణ విధానంగా కొనసాగి అపూర్వ ఫలాలను అందిస్తుందని సకల శాస్తాల ఉపదేశం. సకల
జనుల సౌభాగ్యాన్నీ,
సుఖ శాంతులనూ, అభ్యుదయ పరంపరలను, సువృష్టినీ, సస్య సమృద్ధినీ, జనహితాన్నీ కాంక్షిస్తూ తలపెట్టిన ఈ
మహాపుణ్య యాగానికి మీరందరూ విచ్చేసి ధన్యులు కావాలని మేము హార్ధికంగా
ఆహ్వానిస్తున్నాము. ఈ సమాజ శ్రేయోయజ్ఞంలో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా
ఆకాంక్షిస్తున్నాము" అని పేర్కొన్నారు.
ఈ
యాగ నిర్వహణకు భారీ ఏర్పాట్లను చేసారు. మహాయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
హాజరుకానున్నారు. చివరి రోజు నిర్వహించే మహా పూర్ణాహుతి కార్యక్రమానికి ఆయన
హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్లు రోశయ్య, సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రమణ, చలమేశ్వర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భోసలే, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అనేకమంది ప్రముఖులు
హాజరవుతున్నారు.
కఠినమైన
నియమ నిష్ఠలతో వందలమంది రుత్విజుల దుర్గ సప్తశతి పారాయణం చేస్తుంటే.. ఒకేసారి
1100మంది ఏకశబ్దంగా పారాయణం చేస్తుంటే.. 106 హోమగుండాలు హవిస్సులతో
ప్రజ్వరిల్లుతుంటే ప్రపంచం యావత్తు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లేలా దీవెనలు
అందుకుంటున్న భావన భక్తుల హృదయాలను పులకించేలా చేస్తుంది. అసాధారణ అయుత చండీ
మహాయాగానికి ఎర్రవల్లి గ్రామం వేదికగా మారింది. ఈ మహాయాగానికి చేస్తున్న
ఏర్పాట్లుకూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా ముఖ్యమంత్రి
కేసీఆర్ తన సొంత ఖర్చుతో చేసిన ఏర్పాట్లు నభూతో.. నభవిష్యతి..!
అయుత
చండీ మహాయాగం నిర్వహణ లో ప్రధానమైన యాగశాల నిర్వహణే అత్యంత కఠినం. అదే ప్రధానం.
యాగ నిర్వహణకు చేస్తున్న అన్ని ఏర్పాట్లకుగాను 18 ఎకరాల వరకు స్థలాన్ని చదును
చేయగా.. యాగశాలను 3 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రత్యేకంగా యాగశాల
పైకప్పును ఏర్పాటు చేశారు. ఈ యాగశాలలో 8 వేల మంది ఒకేసారి కూర్చోవచ్చు. అయుత చండీ
మహాయాగం నిర్వహించేందుకు యాగశాలలో మొత్తం 106 హోమగుండాలు ఏర్పాటు చేశారు. చండీ
దీక్షా వస్ర్తాలు ధరించిన వారికే ఈ యాగశాలలోకి ప్రవేశం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి
మధ్యాహ్నం 12.30 గంటల వరకు పారాయణం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 3.45 గంటల నుంచి 7
గంటల వరకు జపం చేస్తారు. యాగశాలలో ప్రధాన వేదికపై అమ్మవారి విగ్రహం పడమరవైపు
చూసేలా ఏర్పాటు చేయగా.. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా రుత్విజులు కూర్చుండి దుర్గ
సప్తశతి పారాయణం చేస్తుంటారు. యాగంలో భాగంగా హోమాగ్నిగుండాల్లో సమర్పించేందుకుకూడా
20 టన్నుల మోదుగను హవిస్సుగా వాడుతారు. 12 టన్నుల పాయసం, 4000 కిలోల ఆవునెయ్యిని
ఉపయోగిస్తున్నారు. మొత్తం 3వేల మంది రుత్విజులు ఆరేడు రాష్ర్టాల నుంచి వస్తుండగా..
ఇందులో 1100 మంది రుత్విజులు అత్యంత ప్రధానం.
అంత్యంత
నియమనిష్ఠలతో సాగించే అయుత చండీ మహాయాగానికి వేలమంది వేదపండితులు, బ్రాహ్మణులు, రుత్విజులు వస్తున్నప్పటికీ.. ఇందులో
1100 మంది పాత్రనే ప్రధానమైనది. వీరు దుర్గ సప్తశతిని ఏక కంఠంతో పారాయణం
చేస్తుంటారు. ఇది ఏకోత్తరవృద్ధి పద్ధతిలో సాగుతుంది. మొదటిరోజు 1100 సార్లు, రెండో రోజు 2200, మూడో రోజు 3300, నాలుగోరోజు 4400 సార్లు పారాయణం
చేస్తారు. ఇలా మొత్తం 10వేల సార్లు అయిన తరువాత అంటే.. ఐదో రోజు హోమం
నిర్వహిస్తారు. చివరగా పూర్ణాహుతి ఉంటుంది. యాగమంతా శృంగేరి పీఠం నియమాలు, సూచనల ప్రకారమే నిర్వహిస్తారు.
శృంగేరి నుంచి ముఖ్యమైన రుత్విజులు వస్తారు. వారికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు
చేశారు. ప్రారంభం రోజున శృంగేరి పీఠం సీఈవో గౌరీశంకర్ వచ్చి ఇందులో పాల్గొంటారు.
శృంగేరిలో ఎలాంటి వ్యవస్థ ఉంటుందో.. ఈ యాగం పూర్తయ్యే వరకుకూడా అలాంటి వ్యవస్థనే
ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎక్కడికక్కడ విడిదులు, నిర్మాణాలు చేపట్టారు. యాగశాల
ఎదురుగానే రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా, గవర్నర్లు, ఇతర వీవీఐపీలకు మరో తాత్కాలికంగా
ఆవాసాలను ఏర్పాటు చేశారు. వెదురు,
గడ్డితో వీటిని నిర్మించారు.
సామాన్యులకుకూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశం ఉంటుంది. సామాన్యులు యాగశాల
సమీపం వరకు రావచ్చు. ప్రతిరోజూ 50 వేల మందికి భోజన వసతికూడా ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ వేయి మంది మహిళలు కుంకుమార్చనలు చేసేలా వసతి కల్పిస్తున్నారు.
చండీ హోమానికి
సంబంధించి నవ చండీ యాగం,
శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత చండీ యాగం, లక్ష చండీ యాగం అని వేర్వేరు విధాలైన యాగాలున్నాయి.
ఇవన్నీ కూడా మహా కాళి,
మహా సరస్వతి, మహాలక్ష్మి, అమ్మవార్లందరికీ కలిపి నిర్వహించేవి.
నవ
చండీ యాగం ఒక్క రోజులో చేసే యాగం. 9 సప్త శతి పారాయణాలు చేసి దశాంశం హోమం చేయడం, తర్పణం, దంపతి, సువాసిని, కన్యక పూజ చేయడం దీని విశిష్టతలు.
శత
చండీ యాగం ఐదు రోజులు చేసే యాగం. పదిమంది రుత్విక్కులుంటారు. మొదటి రోజు పది సప్తశతి (7x 100=700) పారాయణాలు చేసి 40 వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. రెండవ
రోజు 20 సప్త శతి పారాయణాలు చేసి 30 వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. మూడవ రోజు 30 సప్త శతి పారాయణాలు చేసి 20 వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. నాలుగవ రోజు 40 సప్త శతి పారాయణాలు చేసి 10 వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. అంటే మొత్తం వంద పారాయణాలు, లక్ష నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. ఈ నాలుగు రోజుల్లో ప్రతి రోజూ నవావరణ పూజ, చతుష్షష్టి యోగినీ దేవతల పూజ, దీప
సహిత బలి, కల్పోక్త పూజతో పాటు కుంకుమార్చన కూడా
చేస్తారు. ఇవికాక అవధారలు చేస్తారు. అవధారలంటే...చతుర్వేద పారాయణాలు, శాస్త్ర, సంగీత, ఇతిహాస, పురాణ సేవలు. ఐదవ రోజు అగ్ని ప్రతిష్ట
చేసి ఏడు వేల ఆహుతులతో అమ్మ వారికి పరమాన్న ద్రవ్యంతో, పదివేల నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు జరిపి అవభృతం చేస్తారు. తరువాత
యాగ సమాప్తి చేస్తారు. ఆ తరువాత అన్న సంతర్పణ కార్యక్రమం వుంటుంది.
సహస్ర
చండీ యాగం ఐదు రోజులు చేసే యాగం. వందమంది రుత్విక్కులుంటారు. మొదటి రోజు 100 సప్తశతి
పారాయణాలు చేసి 4 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. రెండవ రోజు 200 సప్తశతి పారాయణాలు చేసి
3 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. మూడవ
రోజు 300 సప్తశతి పారాయణాలు చేసి 2 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. నాలుగవ రోజు 400 సప్తశతి పారాయణాలు చేసి
1 లక్ష నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. అంటే
మొత్తం వెయ్యి పారాయణాలు 10 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజూ నవావరణ పూజ, చతష్షష్టీ యోగినీ దేవతల పూజ, దీప సహిత బలి, కల్పోక్త పూజతో పాటు కుంకుమార్చన కూడా
చేస్తారు. ఇవికాక అవధారలు చేస్తారు. ఐదవ రోజు అగ్ని ప్రతిష్ట చేసి 7 లక్షల ఆహుతులతో
అమ్మ వారికి పరమాన్న ద్రవ్యంతో లక్ష నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు జరిపి అవభృతం చేస్తారు. తరువాత
యాగ సమాప్తి చేస్తారు. ఆ తరువాత అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది.
అయుత
చండీ మహా యాగంలో తొలుత గురు ప్రార్థన, గణపతి
పూజ, పుణ్యాహవచనం చేసి ఈ మహాయాగం నిర్విఘ్నంగా
జరగడానికి మహా గణపతికి అధర్వ వేదోక్త రీతిగా సహస్రమోదక హోమాన్ని నిర్వహిస్తారు. తిరిగి
గణపతి పూజ, పుణ్యాహవచనం చేసి దేవనాంది, అంకురారోపణ, రుత్విగ్వరణం చేస్తారు. తరువాత కలశ స్థాపన, దీప స్థాపన, చండీ యంత్ర స్థాపన, కలశంలో, యంత్రంలో
దేవతా ఆవాహన, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ఇది ఐదు రోజులు
చేసే యాగం. 1000 మంది రుత్విక్కులుంటారు. మొదటి రోజు 1000 చండీ పారాయణాలు చేసి 40 లక్షల
నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
రెండవ రోజు 2000 సప్తశతి పారాయణాలు
చేసి 30 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. మూడవ
రోజు 3000 సప్తశతి పారాయణాలు చేసి 20 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. నాలుగవ రోజు 4000 సప్తశతి పారాయణాలు చేసి
10 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. అంటే
మొత్తం పది వేల సప్త శతీ పారాయణాలు, కోటి
నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
ఈ నాలుగు రోజుల్లో ప్రతి రోజూ
నవావరణ పూజ, చతష్షష్టీ యోగినీ దేవతల పూజ, దీప సహిత బలి, కల్పోక్త పూజతో పాటు కుంకుమార్చన కూడా
చేస్తారు. ఇవికాక అవధారలు చేస్తారు.
అయుత
చండీ మహా యాగంలో చివరి రోజు అగ్ని ప్రతిష్ట చేసి 70 లక్షల ఆహుతులతో (అయుత అంటే 10 వేలు. సప్తశతి అంటే 700x10000) అమ్మ వారికి పరమాన్న ద్రవ్యంతో
10 లక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ
దేవతలకు ఆజ్య హోమం,
తర్పణం చేసి ఇంద్ర శక్త్యాది దేవతలకు
బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు జరిపి అవభృతం చేస్తారు. తరువాత యాగ సమాప్తి చేస్తారు. ఆ తరువాత అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఎన్ని ఆహుతులు అగ్నికి సమర్పణ చేస్తున్నామో
అంత మందికి అన్న సమర్పణ చేయడం మంచిది. దీనిని పదో వంతు, వందో వంతు మందికి కూడా చేయవచ్చు. అది అమ్మ
వారిని, వారి గణాలను సంతృప్తి పరచడానికి చేసే మహత్తర
కార్యక్రమం.
ఈ
ఐదు రోజుల్లో ప్రతిరోజూ చతుర్వేద స్వాహాకారాలు (అంటే నాలుగు వేదాల్లోని ప్రతి ఒక్క
మంత్రంతో హోమం), దుర్గా హోమం, శ్రీసూక్త హోమం, గౌరీ హోమం, సరస్వతీ హోమం, మహాసౌరం చేస్తారు. ముత్తైదువులతో కుంకుమార్చనలు
కూడా జరుగుతాయి. ఈ హోమాన్ని100 హోమ కుండాలతో చేస్తారు. యజమాని హస్త ప్రమాణం ఆధారంగా
తీసుకుని చేస్తారు. దీనిలో 100 సృక్‍లు, 1000
సృవలతో చేస్తారు. 4 వేల కిలోల బియ్యం, 5 వేల కిలోల బెల్లం, 4 వేల కిలోల నెయ్యి తదితరాలతో శాస్త్ర
ప్రమాణంగా నిర్ణయించిన హోమ ద్రవ్యాలను ఉపయోగిస్తారు.
ప్రధానంగా
ఈ నెల 23 నుంచి మహాయాగం మొదలవుతుండగా.. 21 నుంచి పలు కార్యక్రమాలు
ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో
వెల్లడించారు. అయుత చండీ పురశ్చరణ మహాయాగ వైదిక కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి.
21.12.2015
(సోమవారం)
ఉదయం:
గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనము, దేవనాంది, అంకురార్పణము, పంచగవ్య మేళనము, ప్రాశనము, గో పూజ, యాగశాల
ప్రవేశము, యాగశాల సంస్కారము, అఖండ దీపారాధన, మహాసంకల్పము, సహస్రమోదక మహాగణపతి హోమం, మహా మంగళహారతి, ప్రార్థన, ప్రసాద వితరణము.
సాయంకాలం: వాస్తు రాక్షోఘ్నహోమం, అఘోరాస్త్రహోమం.
22.12.2015 (మంగళవారం)
ఉదయం:
గురు ప్రార్థన, గణపతి పూజ, గో పూజ, ఉదకశాంతి, ఆచార్యాది రుత్విగ్వరణము, త్రైలోక్య మోహన గౌరీ హోమం, మహామంగళహారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణము.
సాయంకాలం: రుత్విగ్వరణము, దుర్గాదీపనమస్కార పూజ, రక్షాసుదర్శన హోమం.
23.12.2015 (బుధవారం)
ఉదయం:
గురు ప్రార్థన, గణపతి పూజ, గో పూజ, మహామండప
స్థాపనం, చండీ యంత్రలేఖనము, యంత్ర ప్రతిష్ఠ, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ఠ, నవావరణార్చన, ఏకాదశ న్యాసపూర్వక సహస్ర చండీ
పారాయణము, పంచబలి, యోగినీ
బలి, మహారుద్ర యాగ సంకల్పం, రాజశ్యామల, మహారుద్ర పురశ్చరణ చతుర్వేద యాగ
ప్రారంభం, మహాసౌరము, ఉక్తదేవతా జపములు, మంత్ర పుష్పము, విశేష నమస్కారములు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళహారతి, ప్రసాద వితరణము
సాయంకాలం: ధార్మిక ప్రవచనం, సాయంకాలం కోటి నవాక్షరీ పురశ్చరణ, విశేష పూజా ఆశ్లేషా బలి, అష్టావధాన సేవ, రాత్రి 7.30 గంటలకు శ్రీరామలీల
(హరికథ)
24.12.2015, (గురువారం)
ఉదయం:
గురు ప్రార్థన, గణపతి పూజ, ఏకాదశ న్యాసపూర్వక ద్విసహస్ర చండీ
పారాయణం, నవావరణ పూజ, యోగినీ బలి, మహాధన్వంతరీ యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణ, మహాసౌరము, ఉక్తదేవతా జపమేలు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణము.
సాయంకాలం:
ధార్మిక ప్రవచనము,
కోటి నవాక్షరీ పురశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారములు, శ్రీచక్ర మండలారాధన, అష్టావధాన సేవ, ప్రసాద వితరణము, రాత్రి 7.30 గంటలకు శ్రీరామలీల
(హరికథ).
25.12.2015, (శుక్రవారం)
ఉదయం:
గురు ప్రార్థన, గో పూజ, ఏకాదశ
న్యాసపూర్వక త్రి సహస్ర చండీ పారాయణం, నవావరణ
పూజ, నవగ్రహ హోమము, యోగినీ బలి, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణ, మహాసౌరము, ఉక్తదేవతా జపమేలు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణ.
సాయంకాలం:
ధార్మిక ప్రవచనం, కోటి నవాక్షరీ జపం, పార్ధివ లింగ పూజ, అష్టావధాన సేవ, మహా మంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణము, రాత్రి 7.30 గంటలకు శ్రీరామలీల
(హరికథ).
26.12.2015, (శనివారం)
ఉదయం:
గురు ప్రార్థన, గణపతి పూజ, ఏకాదశ న్యాసపూర్వక చతుస్సహస్ర చండీ
పారాయణం, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం, మహాసౌరము, ఉక్తదేవతా జపమేలు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణ
సాయంకాలం:
ధార్మిక ప్రవచనం, కోటి నవాక్షరీ జపం, అష్టావధాన సేవ, మహా మంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణము, రాత్రి 7.30 గంటలకు శ్రీమాతా
భువనేశ్వరీ చక్రి భజన
27.12.2015, (ఆదివారం)
ఉదయం:
గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కుండ సంస్కారము, ప్రధాన కుండములో అగ్ని ప్రతిష్ఠ, అగ్ని విహరణం, స్థాపితా దేవతా హవనం, సపరివార అయుత చండీ యాగం, అయుత లక్ష నవాక్షరీ, ఆజ్యాహుతి, మహాపూర్ణాహుతి, వసోర్ధారా, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళహారతి, రుత్విక్ సన్మానము, కలశ విసర్జనము, అవబృథ స్నానము, మహదాశీర్వచనము, ప్రసాద వితరణము, యాగ సంపూర్ణం.
అయుత చండీ యాగం గురుంచి సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు - మురళి, ఎక్స్ ప్రెస్ టీవీ
ReplyDeleteVery enlightening piece on Ayuta Maha Chandi Yagam
Delete