శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-3
ధర్మపురి క్షేత్ర
నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా
నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద
రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి మూడో విడత పది పద్యాలు)
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-21
సీII తల్లి దండ్రులు భార్య తనయు లాప్తులు బావ
మరదు లన్నలు మేనమామగారు,
ఘనముగా బంధువుల్ కల్గినప్పటికైన
దాను దర్ల గ
వెంట దగిలిరారు;
యముని దూతలు ప్రాణ మపహరించుక
పోగ
మమతతో బోరాడి మాన్పలేరు;
బలగమందరు దుఃఖపడుట మాత్రమే
కాని,
యించుక యాయుష్య మీయలేరు;
తేII చుట్టములమీది
భ్రమదీసి చూర జెక్కి,
సంతతము మిమ్ము నమ్ముట
సార్థకంబు,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-22
సీII ఇభరాజవరద ! నిన్నెంత
పిల్చినగాని
మారు పల్కవదేమి మౌనితనమొ;
మునిజనార్చిత ! నిన్ను
మ్రొక్కివేడినగాని
కనులజూడ వదేమి గడుసుదనమొ ?
చాల దైన్యమునొంది చాటు
జొచ్చినగాని
భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ ?
స్థిరముగా నీపాద సేవ
జేసెదనన్న
దొరకజాల వదేమి ధూర్తతనమొ ?
తేII మోక్షదాయక
! యిటువంటి మూర్ఖజనుని
గష్ట పెట్టిన నీకేమి
కడుపునిండు ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-23
సీII నీ మీద కీర్తనల్ నిత్య గానము జేసి
రమ్య మొందింప నారదుడ గాను;
సావధానముగ నీ చరణ పంకజ సేవ
సలిపి మెప్పింపగ శబరి గాను;
బాల్యమప్పటి నుండి భక్తి నీయందున
గలుగను బ్రహ్లాద
ఘనుండగాను;
ఘనముగా నీ మీద గ్రంథముల్
కల్పించి
వినుతి సేయను వ్యాసమునిని
గాను;
తేII సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముడను;
హీనుడను, జుమ్మి; నీవు
నన్నేలుకొనుము;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-24
క II అతిశయంబుగ గల్లలాడ నేర్చితిగాని
పాటిగా సత్యముల్ బలుకనేర;
సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితిగాని
యిష్ట మొందగ నిర్వహింపనేర;
నొకరి సొమ్ముకు దోసిలొగ్గనేర్చితి గాని
చెలువుగా ధర్మంబు సేయనేర;
ధనము లీయంగ వద్దనగ నేర్చితిగాని
శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర;
తే II బంకజాతాక్ష ! నే నతి పాతకుడను
దప్పులన్నియు క్షమియింప దండ్రి నీవె;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-25
సీII ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు
మాయ సంసారంబు మరగి, నరుడు
సకల పాపములైన సంగ్రహించునుగాని
నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు;
తుదకు, గాలుని యొద్ద దూత
లిద్దరివచ్చి
గుంజుక చని వారు గ్రుద్దుచుండ,
హింస కోర్వగలేక యేడ్చి గంతులు వేసి
దిక్కులేదని నాల్గు దిశలు చూడ
తేII దన్ను
విడిపింప వచ్చెడి ధన్యుడెవడు?
ముందె నీదాసుడై యున్న
ముక్తిగలుగు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-26
క II అధిక విద్యావంతుల ప్రయోజకులైరి;
పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి,
సత్య వంతుల మాట జనవిరోధంబాయె;
వదరుపోతులమాట వాసికెక్కె;
ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,
పరమ లోభులు ధన ప్రాప్తులైరి,
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,
దుష్ట మానవులు వర్దిష్ణులైరి,
తే II పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తిలేదాయె, నిక నీవె చాటు మాకు,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-27
సీII భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు,
పాము కంఠము జేత బట్టవచ్చు,
బ్రహ్మ రాక్షస కోట్ల బారద్రోలగ వచ్చు,
మనుజుల రోగముల్ మాన్పవచ్చు,
జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు,
బదను ఖడ్గము చేత నదుమవచ్చు,
గష్టమొందుచు ముండ్ల కంపలో జొరవచ్చు,
దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు,
తేII బుడమిలో
దుష్టులకు జ్ఞానబోధ దెలిపి
సజ్జనుల జేయలే డెంత చతురుడైన,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-28
సీII అవనిలోగల యాత్రలన్ని చేయగవచ్చు,
ముఖ్యుడై నదులందు మునుగవచ్చు;
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వగవచ్చు,
దిన్నగా జపమాల ద్రిప్పవచ్చు,
వేదాల కర్థంబు విరిచి చెప్పగవచ్చు,
శ్రేష్ఠయాగములెల్ల జేయవచ్చు,
ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు,
నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,
తేII జిత్త
మన్యస్థలంబున జేరకుండ
నీ పదాంభోజములయందు నిలుపరాదు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-29
సీII కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు
పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు
చేతు లెత్తుచు బూజ సేయగల్గిన జాలు
తోరంపు గడియాలు తొడిగినట్లు,
మొనసి మస్తకముతో మ్రొక్కగల్గిన జాలు
చెలువమైన తురాయి చెక్కినట్లు,
గళము నొవ్వగ గథల్ పలుక గల్గిన జాలు,
వింతగా గంఠీలు వేసినట్లు,
తేII పూని
నిను గొల్చుటే సర్వ భూషణంబు,
లితర భూషణముల నిచ్చగింపనేల?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-30
సీII భువన రక్షక! నిన్నుం బొగడనేరని నోరు
ప్రజ కరోచకమైన పాడుబొంద,
సురవరార్చిత! నిన్నుజూడగోరని కనుల్
జలము లోపల నెల్లి సరపుగుండ్లు;
శ్రీ రమాధిప! నీకు సేవంజేయని మేను
కూలి కమ్ముడువోని కొలిమి తిత్తి;
వేడ్కతో నీకథల్ వినని కర్ణములైన
గఠిన శిలాదుల గలుగు తొలులు;
తేII పద్మలోచన!
నీమీద భక్తిలేని
మానవుడు రెండు పాదాల మహిషమయ్య!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
thank you sir
ReplyDelete