బాల కాండ
మందర మకరందం
ఎందుకు
చదవాలి? ఏం
తెలుసుకోవచ్చు?-2
వనం
జ్వాలా నరసింహారావు
వాల్మీకి అడిగిన ప్రశ్నల్లో, నారదుడిచ్చిన
సమాధానంలో, విశేషణాలన్నీ భగవంతుడికే అన్వయించి చెప్పి, రామాయణాన్ని
పెద్ద వేదాంత గ్రంథం చేసారని ఆక్షేపించవచ్చు. ఆ గుణాలన్నీ ఉత్తమపురుషులకు కూడా
వుండొచ్చునని అనవచ్చు. శ్రీమద్రామాయణం ధ్వనికావ్యమని అర్థం చేసుకోవాలి. అదో
గూఢార్థగుంభితం. వ్యర్థ పదాలు, వ్యర్థ విశేషణాలు అసలే కనపడవు. రామాయణార్థం
సరిగ్గా గ్రహించాలంటే అనేక శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి
యదార్థ జ్ఞానం కలగదు. వాస్తవానికి నారదమంటే మేఘమని అర్థం. మేఘం
నీళ్లిస్తుంది. నిప్పులు కురిపించదు. నారదుడంటే జ్ఞాన దాత. జ్ఞాన
దాత చేయాల్సింది జ్ఞానముపదేశించడమో, మోక్ష విషయం చెప్పడమో అయ్యుండాలి. నారదుడు
నారాయణుడి వద్ద భాగవతాన్ని విని, పాంచరాత్ర ఆగమం ఏర్పరిచాడు. అందుకే
దాన్ని "నారద పాంచరాత్రం" అంటారు. ఇదే సాత్త్వతశాస్త్రం. వాల్మీకికి
ఉపదేశించిదిదే. ఆ ఉపదేశంతో వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. ఋషీశ్వరులు
సంభాషించుకొనేటప్పుడు లౌకిక ప్రసంగాలు చేయరు. కాబట్టే వాల్మీకి ప్రశ్నించింది అవతార
మూర్తి గురించే-నారదుడు జవాబిచ్చిందీ అవతార మూర్తిని గురించే. నారదుడు
చెప్పిన సంక్షిప్త రామాయణంలో, రాముడిని అడవులకు పంపినందువల్ల దశరథుడు మరణించడంతో, రాజ్యార్హుడైన జ్యేష్ఠ పుత్రుడు అరణ్యాలలో వున్నందున, రాజ్యం అరాజకం కాకుండా వుండాలని తలచిన వశిష్ఠుడు-ఇతర పెద్దలు, రాజ్యభారం వహించాలని భరతుడిని ప్రార్థించినా ఆయనొప్పుకోలేదని
వుంది. సూర్య
వంశపు రాజులకు పురోహితుడు వశిష్ఠుడు. ఆయన దశరథుడి అభిప్రాయం ప్రకారం
చెప్పినా భరతుడు తిరస్కరించడం సబబేనా-గురు వాక్యం మీరినట్లు కాదా అన్న
సందేహం రావచ్చు. అయితే రాజు చెప్పిన మాటలను మాత్రమే వశిష్ఠుడు చెప్పాడే కాని, పెద్దవాడుండగా
చిన్నవాడు రాజ్యం ఏలడం అన్యాయమని ఆయనకూ తెలుసు. ఇక భరతుడేమో భగవత్ పరతంత్రుడు. తనను, తన
దేహాన్ని, తన సర్వస్వాన్ని రామార్పణం చేసాడు. దాన్ని
మరల గ్రహించడమంటే పారతంత్ర్య విరోధమే. అంటే స్వరూప హాని కలగడమే. ఇది
ఆత్మహత్యలాంటి ఘోర పాపం. మాట వినకపోతే వశిష్ఠుడు శపించవచ్చు కాని ఆత్మ హాని కూర్చలేడు. అయినా
వశిష్ఠుడు ప్రార్థించాడే గాని శాసించలేదు.
బాల కాండలోని సంక్షిప్త రామాయణంలో నారదుడు అయోధ్యకాండ అర్థాన్ని సంగ్రహంగా చెప్పి, పితృవాక్య పాలన అనే సామాన్య ధర్మాన్ని, స్వామైన భగవంతుడి విషయంలో దాసుడు చేయాల్సిన కైంకర్య వృత్తిని, ప్రపన్నుడు భగవత్ పరతంత్రుడిగానే వుండాలన్న విషయాన్ని, ప్రపత్తికి భంగం కలిగే పనులు ఎవరు చెప్పినా చేయకూడదనే విశేష
ధర్మాన్ని తెలియ పరుస్తాడు.
సీతను రక్షించ బోయి రావణుడి వల్ల చనిపోయిన జటాయువుకు దహన
సంస్కారాలు చేసి రాముడు శోకించాడని సంక్షిప్త రామాయణంలో నారదుడు చెప్పాడు. రామచంద్రమూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక
మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. మనుష్యులకెలాంటి శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు. మనిషికి శోక మోహాలు కలగడానికి కారణం కామ-క్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజో గుణాలవల్ల జన్మించినవే కామ-క్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు దొరక్కపోయినా-పోగొట్టుకున్నా శోకం కలుగుతుంది. మోహానికీ కారణం కోపమే. ప్రకృతి పరిణామమైన దేహం, ప్రకృతి గుణాలైన సత్వ-రజస్సు-తమస్సులను కలదై వుంటుందనీ, కొద్దో-గొప్పో ఈ మూడు గుణాలు లేకుండా దేహి వుండడనీ, రజస్సు కారణాన శోక-మోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వ జన్మలో చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం
అనుభవించాల్సివస్తుందనీ శాస్త్రం చెప్తుంది. అంటే, ప్రకృతి బద్ధుడైన పురుషుడు, ప్రకృతి గుణాలైన శోక-మోహాల వలన పీడించ బడుతాడని అనుకోవాలి. అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన విష్ణువు, ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడుతాడన్న సందేహం కలగొచ్చు. అవతార దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా?
రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తన కొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానని మాత్రమే
రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందని రామచంద్రమూర్తి
దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు.
పంపా తీరంలోని వనంలో హనుమంతుడనే వానరుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి, సూర్య నందనుడైన సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడని
చెప్పబడింది.
రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడు
హీనజాతివాడైనా, పురుషుడైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం
చెప్పడం జరిగింది. హీన స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి
సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడైన సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం
చూపడం జరిగింది. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే, భక్తికి అందరూ అధికారులేనన్న విషయం. అట్టి
అధికారం నీచ జాతులని చెప్పబడేవారిలోనే విశేషంగా కనిపిస్తుంది. జ్ఞానంతో
రామచంద్రమూర్తిని ఆశ్రయించేవారు కొందరే. భక్తితో ఆశ్రయించేవారు కోటానుకోట్లు. ఫలితం
ఇరువురికీ సమానమే.
ఒకే ఒక్క బాణంతో రాముడు వాలిని నేలగూల్చుతాడు అని చెప్పడంలో
చాలా అర్థముంది. తమ్ముడి భార్యతో సంగమించిన వాడికి శిక్ష వధ అని శాస్త్రాలు
చెప్తున్నాయి. శాస్త్ర
బద్ధుడైన రాముడు అట్లే చేశాడు. నేలబడేటట్లు కొట్టాడే కాని, ప్రాణంపోయేటట్లు కొట్టలేదు. ఎందుకంటే వాడి దోషం గురించి వాడికి చెప్పి ఇది ప్రాయశ్చిత్తం
అని తెలియచేసేందుకే. దీన్ని
బట్టి రాముడి ధర్మ బుద్ధి, సత్య
పరాక్రమం స్పష్టమవుతుంది.
సంక్షిప్త రామాయణం సుందర కాండలో హనుమంతుడికి, ఇంద్రజిత్తుకు మధ్య జరిగిన యుద్ధం, అందులో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి ఆయన చేతిలో హనుమంతుడి
ఓటమి గురించి చెప్పబడింది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని పడగొట్టాడు. అస్త్ర
బంధనం అభేద్యమని తెలియని మూఢులు- అతడి అనుచరులు, వూరికే
కిందపడ్డాడని అనుకున్నారు. తటాలున పైనబడి హనుమంతుడిని తాళ్లతో కట్టేసారు. నీచ
సాంగత్యాన్ని, తనపైన విశ్వాసం లేకపోవడాన్ని ఓర్చుకోలేని బ్రహ్మాస్త్రం
హనుమంతుడి కట్లు వదిలించింది. అది రాక్షసులకు తెలవదు. హనుమంతుడికి
తెలిసినా రావణుడిని చూసి మాట్లాడాలని, కట్లున్నవాడిలాగానే నటించాడు. ప్రపత్తికి
మహా విశ్వాసమే ప్రాణం. విశ్వాస లోపం జరుగుతే ప్రపత్తి చెడుతుంది. బ్రహ్మాస్త్రం
బంధాలకన్న తాళ్లు గట్టివనుకున్నారు మూఢ రాక్షసులు. అట్లాగే భగవంతుడికి శరణాగతులైనవారు, ఆయనమీద
నమ్మకం లేక, ఇతర ఉపాయాలను వెదికితే భ్రష్టులవుతారు.
రావణ సంహారం జరిగిన తర్వాత, విభీషణుడిని లంకా రాజ్యానికి ప్రభువుగా చేసి, వీరుడై, కృతకృత్యుడై, మనో దుఃఖం లేనివాడయ్యాడు శ్రీరాముడు అని చెప్పబడింది. అంటే, రావణ వధ, సీతా ప్రాప్తి, ప్రధానం కాదని, విభీషణ పట్టాభిషేకమే ప్రధానమని సూచించబడిందిక్కడ. ప్రధాన ఫలం ప్రాప్తించినప్పుడే ఎవరైనా కృతకృత్యుడయ్యేది - మనో దుఃఖం లేనివాడయ్యేది. సీతా ప్రాప్తి స్వకార్యం. దొంగలెత్తుకొని పోయిన తన సొమ్ము తాను తిరిగి
రాబట్టుకోవడంలాంటిది. చోరదండనమే
రావణ వధ. తనపని
తాను చేయడంలో గొప్పేముంది? విభీషణ
పట్టాభిషేకం ఆశ్రిత రక్షాధర్మకార్యం. ఆ అశ్రిత రక్షాభిలాషే రావణ వధకు ముఖ్య కారణం. సీతా ప్రాప్తి స్వంత కార్యం. అందుకే సీతను నిరాకరించగలిగాడుగాని, విభీషణుడి పట్టాభిషేకానికై ఉత్కంఠ వహించాడు శ్రీరాముడు.
రామాయణ రచనకు వాల్మీకిని బ్రహ్మ నియమించి వెళ్లిన తర్వాత, యోగదృష్టితో రామాయణాన్నంతా వాల్మీకి చూసినదాన్ని
వివరించడంవల్ల రామాయణం మొత్తం చదివే అవకాశం బాల కాండలో కలుగుతుంది.
బాలకాండలో రామాయణం మొత్తం సంక్షిప్త రామాయణంగా నారదుడు వాల్మీకికి బోధించాడు. దీనిని బాల రామాయణం అని కూడా అంటారు. బాలకాండలో ఈ భాగం చదివితే, రామాయణమంతా సంక్షిప్తంగా తెలుసుకున్నట్లే. ఇదే
సంస్కృతంలో ప్రధమ సర్గ. ఈ సర్గ మొదటి శ్లోకంలో, మొదటి అక్షరం "త"
కారం తో
మొదలవుతుంది. ఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. కడపటి శ్లోకంలోని కడపటి అక్షరం "యాత్". గాయత్రి మంత్రం లోని కడపటి అక్షరమూ ఇదే. గాయత్రిలోని ఆద్యంతక్షరాలు చెప్పడంతో ఈ సర్గ గాయత్రి సంపుటితమని
తెలుస్తున్నది. ఈ నియమం ప్రకారమే వాల్మీకి వేయి గ్రంథాలకు మొదట ఒక్కొక్క గాయత్రి
అక్షరాన్ని వుంచడంతో 24,000 గ్రంథమయింది. 24,000 గ్రంథమంటే 24,000 శ్లోకాలని అర్థంకాదు.
32 అక్షరాల
సముదాయానికి గ్రంథమని పేరు.
ఒక శ్లోకంలో 32
అక్షరాల కంటే
ఎక్కువ వుంటే, 32 అక్షరాలు మాత్రమే గ్రంథంగా భావించాలి. ప్రధమ సర్గలో ఆద్యంతక్షరాల మధ్యభాగంలో, తక్కిన అక్షరాలుండవచ్చేమోనన్న సందేహంతో, వాసుదాసుగారు, ఆ దిశగా శోధించినా కానరాలేదు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన, ఎరిగిన విజ్ఞులు ఎవరైనా వుంటే, మరింత వివరంగా దీనికి సంబంధించిన అంశాలను వెల్లడిచేస్తే, వారికి సవినయంగా నమస్కరిస్తానని, తన అంధ్ర వాల్మీకి రామాయణంలోని బాల కాండ మందరంలో
రాసారు. ఒకవేళ తక్కిన అక్షరాలు కనిపించకపోయినా లోపంలేదనీ, ఆద్యంతాక్షరాలు గ్రహించడంతో సర్వం గ్రహించినట్లేనని అంటారు
వాసుదాసుగారు. ఏదేమైనా శ్రీమద్రామాయణం "గాయత్రి సంపుటితం"
అనడం
నిర్వివాదాంశం. యతిని అనుసరించే, ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని కడపటి శబ్దం "అరయన్" య కారంతో ముగించబడింది. తెలుగులో "త్"
శబ్దం కడపట
రాకూడదు-దానికి ముందున్న "య"
కారాన్నిగ్రహించాలి.
నారదుడు చెప్పిన రామ చరిత్రను విన్న
వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించాడు. నారదుడు పోయింతర్వాత, వాల్మీకి, శిష్యుడితో
తమసాతీరంలో తిరుగుతూ, ఒక క్రౌంచమిధునాన్ని చూశాడు. ఆయన చూస్తుండగానే, బోయవాడొకడు, జంటలోని
మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడ పక్షి ఏడుపు విన్న వాల్మీకి, ఎంతో
జాలిపడి, బోయవాడిని శపించాడు. ఇలా ఆదికవి నోటినుండి వెలువడిన
వాక్యాలు సమాక్షరాలైన నాలుగు పాదాల (శ్లోకం) పద్యమయింది. అదే
విషయం గురించి ఆలోచిస్తూ, శిష్యుడు భరద్వాజుడితో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి
బ్రహ్మదేవుడు వచ్చి, రామాయణం రాయమని ఉపదేశించి, సర్వం ఆయనకు తెలిసేట్లు వరమిచ్చి
పోయాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాలని నిశ్చయించుకున్నాడు.సంక్షిప్తంగా
నారదుడు చెప్పిన రామ చరిత్రను, వాల్మీకి వివరంగా చెప్పాలనుకున్నాడు.
(ఇంకా వుంది...ఈ శీర్షికే
ఏడు భాగాలుగా వస్తుంది..ఇది రెండో భాగం)
No comments:
Post a Comment