బాల కాండ
మందర మకరందం
ఎందుకు
చదవాలి? ఏం
తెలుసుకోవచ్చు?-1
వనం
జ్వాలా నరసింహారావు
శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు
ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత
కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర
మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై
శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి
రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.
వాల్మీకి సంస్కృతంలో రచించిన
శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది,.
శ్రీమద్రామాయణంలో
నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు మహావిష్ణువైన
శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట
రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర
సాధకంబులైన "స్వధర్మాలలో, స్త్రీ ధర్మం సీతని, పురుష
ధర్మం శ్రీరామచంద్రమూర్తని లోకానికుపదేశించాడు వాల్మీకి. వారి
చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతే, భవిష్యత్ తరాలవారు అంధకారంలో పడిపోయి
దురాచార పరులై పోయేవారేమో! అట్టి మహోపకారం లోకానికి చేసిన వాల్మీకి మహర్షిని ఎంత
పొగిడినా తక్కువే.
శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు
జరిగిన సంగతులు తెలిపేది కాబట్టి దీనికి "బాల కాండ" అని
పేరు."కాండం"అంటే జలం-నీరు. శ్రీ
రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమనబడింది. శ్రీ
రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతుల" అర్థం నిక్షిప్తమైంది. బాల
కాండలో "ఓం భూః" అనే వ్యాహృత్యర్థం వుంది. అది
గ్రంథ పఠనంలో తెలుస్తుంది. ఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన
కారణభూతుడు" అని బోధపడుతుంది. జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు
వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి
పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. బాల కాండ వృత్తాంతమంతా 12 సంవత్సరాల కాలంలో జరిగింది.
రామాయణ రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, భగవద్విషయాన్ని బోధించే యోగ్యతలున్న
గురువు దొరకలేదనే నిర్వేదంతో శుష్కించి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడికి సాష్టాంగ నమస్కారం చేసి: "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం
మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని
స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో
దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని
పదహారు ప్రశ్నలు వేస్తాడు.
"తపమున స్వాధ్యాయంబున.. ... .. " అనే పద్యంతో ఆరంభం చేసి, రామాయణాన్నంతా, నారదుడి మాటల్లో ఉపోద్ఘాతంలా పాఠకులకు సంక్షిప్తంగా, ముందుగానే వివరించడం జరిగింది బాల కాండ మందర
మకరందంలో. నాటకానికి నాంది-ప్రస్తావనలు ఎలా అంతర్భాగాలో, రామాయణానికి ఇలాంటి ఉపోద్ఘాతం ఒక అంతర్భాగం. వ్యక్తి వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం అనే మూడు ప్రధాన విషయాలను, రామాయణం చదివే వారికి-దానిపై గౌరవం కలిగించేందుకు, ఈ ఉపోద్ఘాతంలో వివరించడం జరిగింది. కుశ లవులు రామాయణ గానం చేయడం, గ్రంథ రచన తదుపరి జరిగిన సంఘటన. ఎందుకు ఆరంభంలోనే దీన్ని రాయాల్సి వచ్చిందన్న
ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. త్రికాల జ్ఞానైన వాల్మీకి మహర్షి యోగ దృష్టితో రామాయణ వృత్తాంతమంతా
ఆద్యంతం మొదలే తెలుసుకున్న విధంగానే, ఈ విషయాన్నీ తెలుసుకుని, కుశ లవులతో చెప్పించినట్లుగా భావించాలి. వాస్తవానికి ఉపోద్ఘాతంలో తెలియచేసినట్లుగా, కుశ లవులు రామాయణ గానం చేసిన సంగతి ఉత్తర కాండలో సరైన సందర్భంలో
చెప్పడం జరిగింది. దాన్నే మొదటి మూడు సర్గల్లో స్వవిషయం గురించి, తనకు యోగ దృష్టి కలదని చెప్పడం గురించి, బ్రహ్మ సాక్షాత్కారం గురించి, రాయడాన్ని కొందరు వాల్మీకి ఆత్మ స్తుతిగా
ఆక్షేపించవచ్చు. వాస్తవానికి మొదటి మూడు సర్గల్లో "గ్రంథోత్పత్తి"
గురించి
చెఫ్ఫడం జరిగిందే కాని మరింకేమీ కాదు.
బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై
అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం
జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన
విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతని అర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణాగతికి పురుష కారం అవశ్యం. పురుష కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి
పట్ల దయ. ఈ గ్రంథంలో పురుష కారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం
పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే.
వాల్మీకి అడిగిన ప్రశ్నలు
పదహారు. ఇది తపస్సంఖ్యాకం. పదహారు కళలతో కూడినవాడు పూర్ణ చంద్రుడు. అలానే పదహారు ప్రశ్నలకు జవాబుగా
శ్రీరామచంద్రుడిని తప్ప ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే శ్రీరాముడిది పూర్ణావతారం. శ్రీరాముడి
విషయమై తన అభిప్రాయాన్ని
దృఢపర్చుకోవడానికి, భగవద్విషయం ఉపదేశ రూపంగా గ్రహించేందుకు ఈ పదహారు ప్రశ్నలడిగాడు
వాల్మీకి.
బాల్యంలోనే శ్రీరాముడు
గుహుడిలాంటి (నీచ) జాతివారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి
"వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరకపోవడం-జనకాజ్ఞ జవదాటక
పోవడం-పరశురాముడిని చంపకపోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని తెలుపుతాయి.
అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే
విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా
అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను-సర్వభూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో
హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీషణ
శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక
పోవడం, చేజిక్కిన రావణుడిని
విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని
తెలుపుతుంది. విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే
రాముడు కాంతియుక్తుడనీ - భయంకరుడనీ పలు సందర్భాల్లో అర్థమవుతుంది.
తాను ఏ విషయాన్ని బ్రహ్మ దగ్గర
తెలుసుకుని వాల్మీకికి ఉపదేశించాలని వచ్చాడో, ఆవిషయాన్ని గురించే వాల్మీకి ప్రశ్నించినందువల్లా, శత
కోటి పరిమితమైన రామాయణం తాను బ్రహ్మవల్ల విన్నందువల్లా, తనకు
తెలిసిన విషయమే వాల్మీకి అడిగినందువల్లా సులభంగా చెప్పొచ్చునని భావించాడు నారదుడు. రామగుణస్మరణమనే
అమృత పానానికి అవకాశం లభించిందని సంతోషపడ్తాడు. అయితే తెలియని విషయాన్ని అడగకుండా తెలిసిన
విషయమెందుకు అడిగాడు వాల్మీకి? శ్రీరాముడిని ఆయన ఎరుగును కదా! అయోధ్య
సమీపంలోనే, ఆయన రాజ్యంలోనే వాల్మీకి ఆశ్రమం వుంది కదా? శ్రీరాముడిని
గురించి వాల్మీకికీ తెలుసు-నారదుడికీ తెలుసు. మరి ప్రశ్న-జవాబు
ఎందుకు? వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు, జవాబిచ్చేవాడూ
వేదాంతజ్ఞులే. ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. అయితే, వాల్మీకి
వేసిన ప్రశ్న భగవంతుడి గురించే అయితే, ఆ భగవంతుడు సగుణుడా, నిర్గుణుడా, సాకారుడా, నిరాకారుడా, ద్రవ్యమా, అద్రవ్యమా, ఏకతత్వమా, అనేకతత్వమా
అని అడక్క గుణాలగురించే ఎందుకడిగాడు? అనుష్ఠానం ప్రధానంగాని, వాదం
కాదు. మామిడిపండు తింటేనే తీపో-పులుపో తెలుస్తుంది. అనుష్ఠాన
రూపకమైన భక్తి మార్గమే శ్రేష్ఠం. నారదుడు భక్తుడు. తత్వవిచారంకంటే
గుణ విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకీ ఆ కోవకి చెందినవాడే. అందుకే
భగవత్ గుణ వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు.
అందంగా-శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలు రాముడికి వున్నాయని
నారదుడు వాల్మీకికి చెప్పడంలో చాలా అర్థముంది. కనుబొమలు, ముక్కు
పుటాలు, కళ్లు, చెవులు, పెదాలు, చను ముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్లు, పిక్కలు, ఎవరికి
సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక శాస్త్రంలో వుంది. జంట-జంటగా
వుండే ఈ అవయవాలలో, జంటలోని రెండు, ఒకదానికొకటి సమానంగా వుండడమే కాకుండా
ఆకారం సరిగా వుండాలి. ఇవన్నీ రాముడికున్నాయని భావన. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా నందనుడని శ్రీరామచంద్రుడు పేరు తెచ్చుకున్నాడని
నారదుడంటాడు. రాముడు తండ్రి పేరు చెప్పలేనివాడని కానీ, అందుకే తల్లి పేరు చెపుతున్నాడే అనిగానీ భావించరాదు.
దశరథుడు నిష్కారణంగా
శ్రీరాముడిని అడవులకు పంపాడు. కౌసల్య నవమీ వ్రతాలు చేసి రాముడిని కనింది. భర్త
చనిపోయినప్పటికీ, పుత్ర వాత్సల్యం వల్ల
జీవించి, శ్రీరామ పట్టాభిషేకాన్ని
చూసిన ధన్యురాలు. అట్టి ధన్యత దశరథుడికి కలగలేదు. పన్నెండు నెలలు
శ్రీరామచంద్రుడిని గర్భంలో ధరించింది కౌసల్య. ప్రధమ ముఖ దర్శనం కూడా కౌసల్యదే.
పాలు-నీళ్లు పోసి, ముద్దులాడిందీ కౌసల్యే.
బాల క్రీడలు చూసి ఆనందించిన ధన్యత కౌసల్యకు కలిగింది. "కౌసల్యా సుప్రజ
రామా" అని రాముడిని సంబోధించాడు విశ్వామిత్రుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖ
దర్శనం మొదలు కలిగింది కౌసల్యకేగాని దశరథుడికి కాదు. దశరథ పుత్రుడంటే ఏ భార్యకు
పుట్టిన ఏ కొడుకో అనుకోవచ్చు. కౌసల్యకు ఒక్కడే కొడుకు. శ్రీరాముడిని తన వెంట యాగ
రక్షణకై పంపమని విశ్వామిత్రుడు కోరినప్పుడు, పామరుడివలె అంగీకరించలేదు దశరథుడు. పుత్రుడి శ్రేయస్సు కోరి, కౌసల్య మారు మాట్లాడకుండా అంగీకరించిందే కాని, తన వళ్లో వుంచుకుని ముద్దులాడలేదు. అందుకే "కౌసల్యానంద
వర్థనుడు" అని నారదుడు, "కౌసల్యా సుప్రజ
రామా" అని విశ్వామిత్రుడు, "లోకచయభర్త శుభమతి యా కోసల
తనయ గాంచె" అని సీతాదేవి చెప్పడం గమనించాలి. దశరథుడికంటే కౌసల్యే
ప్రశంసనీయమైందని ఆమె పేరు చెప్పబడింది. కుశల భావమే కౌసల్యం. (ఇంకా వుంది...ఈ శీర్షికే ఏడు భాగాలుగా వస్తుంది)
No comments:
Post a Comment