Tuesday, December 22, 2015

బాలకాండ మందర మకరందం -వాసుదాసుగారి స్వవిషయం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందర మకరందం -వాసుదాసుగారి స్వవిషయం
వనం జ్వాలా నరసింహారావు

          నాది భారద్వాజ గోత్రం. ఆపస్తంబ సూత్రం. గోల్కొండ వ్యాపారి శాఖకు చెందినవాడిని. సుకవులకు స్నేహితుడను. నా తల్లి పేరు కనకమ్మ. తండ్రి రామచంద్ర రావు. వారికి కలిగిన ముగ్గురు కుమారులలో నేను నడిమి వాడిని. మండపాక పార్వతీశ్వర శాస్త్రులు-వారి కుమారుడు, దేవులపల్లె సుబ్బరాయ శాస్త్రులు-తమ్ముడు తమ్మన శాస్త్రులు, తిరుపతి వేంకటేశ్వర కవులు, మాడభూషి వేంకటాచార్యులు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, వేదం వేంకట రాయ శాస్త్రులు, అద్దంకి తిరుమల తాతాచార్యులు, ఆత్మకూరు శ్రీనివాసాచార్యులు మొదలైన పలువురు నా స్నేహితులు.

          గురువులై, దయా వంతులై, కళ్లకు కనిపించే దేవతలై, నాకు ధర్మ సాధనమైన దేహాన్నిచ్చిన తల్లి-తండ్రులను కొలిచి పాపం సమూలంగా నాశనం చేసుకుంటాను. దేహం లేకపోతే జీవుడే కార్యం చేయలేడు. ఏ ధర్మ కార్యం చేయాలన్నా, ఏ యోగం సాధించాలన్నా, దేహం అవసరం. అవి చేయకపోతే తరించే మార్గం లేదు. అట్టి దేహాన్నిచ్చి, ఉపకారం చేసిన తల్లి-తండ్రులుజీవించినా-మరణించినా సర్వదా పూజ్యులే.

          నా చిన్నతనంలో, పదకొండో ఏటనే, మా తండ్రి చనిపోతే, మా అన్నదమ్ములను, తల్లిని రక్షించిన మా పినతండ్రి ప్రశంసనీయుడు. ఆయన పేరు లక్ష్మణరావుగారు. ఆయనే చదువు నేర్పించారు. పదిహేనవ ఏటనే క్షయ వ్యాధికి గురైతే, తన దగ్గర వుంచుకుని, నానా విధ చికిత్సలు చేయించి బ్రతికించారు నన్ను. నీతి మార్గంలో, సుగుణంతో ప్రవర్తించడం నేర్పారు. నాకు ఆయనపై నున్న గౌరవం కొద్ది, కృతజ్ఞత చూపేందుకు "వంశావళి" రాసి ఆయన్ను స్తుతించానుదాని పేరే "కుమారాభ్యుదయం".

          నా అన్నగారి పేరు శేషగిరిరావు. నాకంటే చిన్నవాడి పేరు రంగారావు. నా భార్య రంగనాయకి. మాకు సంతానం లేదు. ఋణానుబంధం కొద్దీ పుట్టే మనుష్య రూప సంతానం లేదు కాని, ఇహ-పర సాధకమైన మానస సంతానం ఇంకా కలుగుతూనే వుంది. ఈ సంతానంలో పెద్దవాడు శ్రీరామచంద్రమూర్తే. ఆయన కలిగిన పిమ్మటే తక్కిన సంతానం కలిగింది. ఆయనే నాకు సంస్కర్త. ఈ గ్రంథ రచనారంభం 1900 వ సంవత్సరంలో జరిగింది.1904లో నా తల్లిగారు మరణించారు. నన్ను గురించి రాబోవు చరిత్రకారులు-కవులు పొరబడకుండా, నా విషయాలను  శ్రీకుమారాభ్యుదయంలో వివరంగా రాసాను.

          కళ్ల కలక లాంటి మనసును విషం లాగా బాధపెట్టే ధనం నా వద్ద లేదు. బిడ్డల జంజాటమూ లేదు. భోగభాగ్యాలూ లేవు. పేదరికం వలన భయం లేనేలేదు. రాముడిని తలచుకునేందుకు దీర్ఘ రోగముండనే వుంది. భగవంతుడు ఇచ్చింది వేళకింత వండి పెట్టేందుకు భార్య వుంది. ఇన్ని అనుకూలతలు వున్నప్పుడు శ్రీరాముడిని స్మరించాలి కదా!. విస్తార ధనం లేకపోవడం,బిడ్డలు లేకపోవడం,భోగాలు లేకపోవడం, ఇబ్బంది లేని పేదరికం, రోగ బాధ, భార్య వునికి, భగవన్నామ చింతనకు అనుకూలాలే కాని ప్రతికూలాలు కావు.

          పోయే ప్రాణాలు సుఖంగా పోనీ కుండా బంధువులు లబో-దిబో మొత్తుకుంటుంటే రామనామం స్మరించలేం కదా. శరీర రుగ్మతలు బాధ కలిగించక ముందే, బుద్ధిబలం చెడక ముందే, బంధువులు ఈసడించుకోక ముందే, యమ కింకరుల దర్శనం కాకముందే, శ్రీరామ-శ్రీరామ అని ఎవడు ధ్యానిస్తాడో వాడే సార్థక జన్ముడు. తక్కినవారి బ్రతుకు వ్యర్థం. మనస్సుకు ప్రియమైన మాటలతో హృదయ ప్రదేశంలో వుండే రఘురాముడిని భక్తితో స్మరించడంకంటే శ్రేష్టమైన మార్గం లేదు. తక్కిన మోక్ష మార్గాలన్నీ దీనికంటె తక్కువే.


          శ్రీరాముడిని స్మరించడం శ్రేయస్కరమే కాని అదెలా చేయాలి? ఉరికే రామ-రామ అంటుండాలా? లేక ఇంకేదైన మార్గముందా? రామ-రామ అని స్మరించిన వారిని మాత్రమే అది తరింప చేస్తుంది కాని, తరించాల్సిన ఇతరుల విషయమేంటి? మధురాహారం తానొక్కడే తినరాదు-నలుగురికి పెట్టి తను తినాలికదా! అందుకు తనతోపాటు లోకులు కూడా బాగుపడాలి. ఆ మార్గమేంటని ఆలోచించాను. పూర్వ రామాయణం-ఉత్తర రామాయణం పూర్తిగా తెనిగించిన పూర్వ కవులెవరూ లేరు కనుక, ఆరెండింటినీ పూర్ణంగా లోకానికి చెప్పాలి అనుకున్నాను. నారదుడు వాల్మీకికి రామ చరిత్రను ఉపదేశించింది మొదలు, రావణ వధానంతరం అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం వరకున్న కథ పూర్వ రామాయణం. అక్కడినుంచి నిర్యాణం వరకు ఉత్తర రామాయణం. ఈరెండింటినీ సమగ్రంగా-యథామూలంగా పలికినవారు పూర్వ కవులలో-నేటికవులలో ఎవరూలేరు. నేడున్న (వాసుదాసుగారి రోజుల్లో) రామాయణాల్లో మూలానుసరణం గా వుంటే అది సమగ్రంగా లేదు. సమగ్రంగా వున్నవనుకుంటే అవి మూలానుసరణం కాదు."తనది కొంత-తాళ్లపాక వారిది కొంత" అన్న చందాన వుంటే అది వాల్మీకి పలికిందెట్లా అవుతుంది?

          భగవత్ కథ రచించడం శ్రేయస్కరమని, భగవత్ చరిత్ర రచించే సుకవి తాను తరించి లోకులను తరింపచేస్తాడని భావించాను.అయితే,భగవత్చరిత్రలెన్నోవుండగా రామాయణరచనకే పూనుకోవడ మెందుకని అడుగవచ్చు.జనన-మరణరూపకమైన సంసారబంధంనుండి విముక్తిచేసేది రామకథ. భయంకరమైన సంసారమనే పగ్గాలను తెంచి వేసేందుకు, శాశ్వతమైన గొప్ప సౌఖ్యం పొందేందుకు, నాశనం లేంది-బాధలేంది అయిన వైకుంఠ ప్రాప్తి కలిగి, భగవత్ సాయుజ్యాన్ని పొందడానికి శ్రీ రామాయణం రాయడం ప్రారంభించాను. వాస్తవంలో కవికి, యోగికి భేదంలేదు. యోగి అనుభవించే ఆనందాన్ని, కవికూడా, ప్రతిపద్యంలో, ప్రతి పదంలో అనాయాసంగా అనుభవిస్తాడు. కవిత్వం చెప్పడం మొదలుపెట్టిన కవికి సుఖ దుఃఖాలు మనస్సులోకి రావు. ఎన్ని సద్గ్రంథాలు రాసినా మనస్సు నిర్మలంగా లేకపోతే పూర్ణ ఫలం రాదు. అందుకే ఎల్లప్పుడూ రామ కథ అనే పాల సముద్రంలో, జనన-మరణ బాధ తొలగి పోయేందుకు, స్నానం చేస్తుంటాను. రోగిని కాబట్టి, రామ కథ అనే మందు తీసుకుంటూ, మరల దుఃఖం-రోగం లేకుండా శాశ్వత సౌఖ్యం అనుభవిస్తాను.

            "రామ" అనే రెండక్షరాల మహాత్మ్యం సర్వజ్ఞుడైన శివుడికే తెలుసో-లేదో, అన్న అనుమానం వుంటే, నేను రామాయణం రాయడానికి పూనుకోవడం అవివేకమో-సాహసమో పండితులే చెప్పాలి. ఆంజనేయుడిలాగా శ్రీరాముడి సన్నిధానంలో దాసుడైవుండి ఆయన విషయం తెలుసుకున్నవాడిని కాను. రామనామ మహాత్మ్యమెరిగిన సర్వజ్ఞుడైన శివుడిని కాను. రామాయణం రాసిన దుర్వాసుడిని కాను. రాముడికి గురువైన విశ్వామిత్రుడిని కాను. వశిష్ఠుడినీ కాదు. బ్రహ్మ అవతారమైన వాల్మీకినీ కాదు. వారందరికీ రాముడితో సంబంధముంది. నాకే విధమైన సంబంధంలేదే. ఇలాంటి నాకు రామాయణమంతా రాయడం సాధ్యమయ్యేపనేనా? మరెందుకీ పనికి పూనుకున్నావయ్యా అంటే-ఎంత గొప్ప పండితుడైనా రామ కథ కొంచెమో-గొప్పో, గద్యంగానో-పద్యంగానో చెప్పకపోతే వాడు సుకవి కాడు కాబట్టి, రామాయణం శ్రద్ధగా రచించుదామనుకున్నాను.

నన్ను రక్షించే దేవత శ్రీరాముడే. ఆయన అనుగ్రహం పొందడానికి, రామాయణాన్ని రచించి వాగ్రూప కైంకర్యం చేస్తాను. ఇదే ముఖ్య కారణం. పూర్వం, రామాయణం ఎందరో రాసారుకదా, అంటే, ఎవరి పుణ్యం వారిదన్నదే నా సమాధానం. ఒకరి పుణ్యం మరొకరిని రక్షించదు కదా. ఇష్టదైవమైన శ్రీరాముడికి, ఆయన చరిత్రే రాసి, ఆయనకే సమర్పించడం త్రికరణ శుద్ధమైన ప్రశస్త మార్గం. రామ ధ్యానంలో అనురాగం కలిగేందుకు, మరల జన్మ అంటూ లేకుండేందుకు, రామాయణం రచిస్తాను.

          దేవతలు-ఋషులు-లోకులందరూ మేలని శ్లాఘించిన, వాల్మీకి సంస్కృత రామాయణాన్ని శ్రీరామచంద్రుడి కుమారులే లోకంలో ప్రకటించారు. తెలుగులో అట్లే చేయడానికి, రామచంద్రుడి తనయుడ నైన నాకూ అధికారం వుంది. పూర్వం తన చరిత్రను తన కొడుకులు వినిపిస్తే విన్న చెవులతోనే, ఈ తనయుడు వినిపిస్తున్న అదే చరిత్రను మరల రాముడు వినాలి. ఉత్తమ కావ్యాలకు ఏ మూడు విశేష లక్షణాలుండాలో, అవన్నీ ఈ గ్రంథంలో వున్నాయి. కృతి పతి శ్రీరామచంద్రుడు. కృతి వక్త శ్రీరామచంద్రమూర్తి కుమారుడు. కృతిలోని విషయం శ్రీరామ చరిత్ర. కాబట్టి ఏలోపం లేదు.

          గ్రంథ రచనకు పూనుకున్నప్పుడు కొంత అధైర్య పడినా, భగవంతుడు తన పాలిట వున్నాడని ధైర్యం తెచ్చుకున్నాను. నేనొకప్పుడు రామకోటి రాయడం మరిచిపోతే, ఇరువురు బైరాగులు కనిపించి, రామకోటి రాయడం కొనసాగించమని బోధించారు. ఈ ఇరువురు రామ లక్ష్మణులే కాని ఇతరులు కారు. నా శ్రేయస్సు కోరిన వారిరువురు, ఈ గ్రంథ రచనలో కూడా సహాయపడతారని నా విశ్వాసం. దానికి నిదర్శనం, గ్రంథ రచన మొదలెట్టిన కొన్నాళ్లకే నాకు ఆంధ్ర పండితుడిగా ఎక్కువ వేతనంతో ఉద్యోగం లభించడం. రామాయణ కథ అనే పాలసముద్రాన్ని "మందరం" తో చిలకాలనుకున్న నాకు, భగవంతుడు తోడుగా వుండి, కార్యం నెరవేర్చి, అమృతాన్ని అనుభవించేటట్లు చేస్తాడని నమ్మకం.

          శుభకరమై-సత్యమై-మునీశ్వరులు గౌరవించే దై-సజ్జనులు అనుభవించదగిందై-నవరస యుక్తమై-మనస్సుకు ఆహ్లాదమిచ్చేదై - భక్తితత్వం తెలిపేదై-ఆదికావ్యమై-దోషరహితమై-శుద్ధమై-పద్యాలతో నిబంధించ బడినదై-శాస్త్రబద్ధమై-వేదార్థం కలదై-పవిత్రమై-సర్వాదియుక్తమై-గానం చేసేందుకు వీలున్నదై-వినుటకింపై-సమస్త జనులు స్త్రోతం చేసేదై-దేవత సంబంధమై-పార్వతీ, పరమేశ్వరులతో సేవించబడినదై-శ్లాఘ్యమైన రామాయణ కావ్యాన్ని ఆంధ్రభాషలో రచిస్తాను. ఉత్తమ కావ్య లక్షణాలన్నీ, మూల రామాయణంలో లాగానే ఆంధ్ర రామాయణంలో కూడా వున్నాయి.

          సంస్కృత భాషలో వాల్మీకి శ్రీమద్రామాయణం రాసారు. ఆంధ్ర భాషా వ్యాకరణం రచించినవారిలో మొదటివాడాయన. ఆదికవి-ఆంధ్ర వ్యాకృతి కర్తైన వాల్మీకి తాను రచించిన శ్రీమద్రామాయణానికి సరియైందని తాను రచించిన వ్యాకరణ లక్షణాలతో బద్ధమైనదైన నా అంధ్ర పద్య రామాయణానికి సంతోషపడడా?

            (వాల్మీకి వ్యాకరణమనే చిన్న తాళపత్ర గ్రంథాన్ని, కీర్తిశేషులైన గుమ్ముడూరు వేంకట రంగారావు గారి దగ్గరుండేది.ఆయన్ను ఎన్నిసార్లడిగినా ఇస్తానన్నాడే కాని ఇవ్వలేదు. చివరకు దానినెవరికో ఇచ్చానన్నాడు).

            రామాయణం గాయత్రి గర్భితం. మూలంలో గాయత్ర్యక్షరాల లాగానెఈ రామాయణం లో కూడ ఈ పద్యాక్షరాలు అక్కడక్కడా అమర్చబడ్డాయి. అవి వేయి పాదాలకొకటి చొప్పున కనిపిస్తాయి. గాయత్రిలో భగవంతుడి తేజస్సు (శక్తి) చెప్పబడింది. దీంట్లో భగవంతుడే చెప్పబడ్డాడు.

          ఇక ఒంటిమిట్టలోని శ్రీరామచంద్రమూర్తిని సేవిస్తాను. శ్రీరాముడు బమ్మెర పోతనామాత్యుడికి మోక్షమిద్దామనుకున్నాడు. అందుకే ఆయన వాక్యాలలో నిలిచి అమృతరసధారలు చిలికే రీతిలో తీయటి మాటలను ఆయన భాగవతంలో పలికించాడు ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి. అలా పోతనకు ముందుగాని, ఆయన అంతే వాసులలోగాని, పోతన తర్వాతగాని, ఆయనకంటే గొప్పవారు లేకుండేరీతిలో తానేపలికిన ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి, పోతనకు వలె నాపైకూడా అనుగ్రహ బుద్ధినుంచాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తన కరుణా కటాక్ష వీక్షణాలతో నన్ను రక్షించమని సీతాదేవిని కోరుకుంటున్నాను. నేను కోరుకున్నట్లే సీతాదేవి సహాయం నాకు విశేషంగా లభించింది.

శ్రీమద్రామాయణ రచనా కార్యక్రమం ఒక గొప్ప కార్యం. కష్ట కార్యం. దీర్ఘకాలం పట్టే కార్యక్రమం. నేనేమో రోగిని. ఒక కాలు వీట, ఒక కాలు కాట ఉంచుకుని ఏ దినం ఏమవతుందోనన్న బ్రతుకు పాటు నిశ్చయం లేని క్రూర రోగిని. కాబట్టి జీవన్మృతుడిని. ఇట్టి పరిస్థితులలో, నేనా కృతిని రచించడం మొదలుపెట్టడమంటే, పూర్తి అవుతుందో-కాదో అన్న సందేహం కలగాల్సిందే. అప్పుడు నీ అనుమతి కోరగా, నీ విచ్చిన ప్రత్యుత్తరం: "ఉత్తిష్ఠ హరిషార్దూల లంఘయస్వ మహార్ణవమ్’"అని.నీవలా అభయమిచ్చి నీ సేవకులైన హరులలో నన్నూ ఒకడిగా గ్రహించావు. నీ పలుకే ఆధారంగా, నీమాట నువ్వే దక్కించుకుంటావన్న ధైర్యంతో, నా లోపాలను లక్ష్యపెట్టక, నీ చరిత్ర రాసేందుకు సంకల్పించాను. ఆ తర్వాత ఏం చేసినా నీ ఇష్టం. శిక్షించినా సంతోషమే-రక్షించినా సంతోషమే. ఆ విచారం నాకు లేదు. నేను చేయాల్సిన పని నేనే చేస్తాను.


శ్రీ రామార్పణమస్తు.

2 comments:

  1. అక్షర లక్షలు చేసే మాటలు పరిచయం చేస్తున్నారు. ధన్యోస్మి...

    కృతి పతి శ్రీరామచంద్రుడు. కృతి వక్త శ్రీరామచంద్రమూర్తి కుమారుడు. కృతిలోని విషయం శ్రీరామ చరిత్ర. కాబట్టి ఏలోపం లేదు.

    అందుకే ఎల్లప్పుడూ రామ కథ అనే పాల సముద్రంలో, జనన-మరణ బాధ తొలగి పోయేందుకు, స్నానం చేస్తుంటాను. రోగిని కాబట్టి, రామ కథ అనే మందు తీసుకుంటూ, మరల దుఃఖం-రోగం లేకుండా శాశ్వత సౌఖ్యం అనుభవిస్తాను.


    రాముడే వైద్యుడు, రాముడే మందు, రాముడే ధైర్యం, రాముడే సర్వం.
    శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః

    ReplyDelete