Friday, March 9, 2012

గెలుపోటములకేనా ప్రాధాన్యం?: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దిన పత్రిక (10-03-2012)
వనం జ్వాలా నరసింహారావు

ఏభై జిల్లాల్లో ఒక్క సీటూ రాని కాంగ్రెస్‌, బీజేపీ పరిస్థితీ అంతంత మాత్రమే! , ఓడిపోయినా గట్టి పోటీనే ఇచ్చిన బీఎస్పీ, ములాయంకే మేలు చేసిన రాహుల్‌ ప్రచారం, 2 శాతం ఓట్ల తేడాతో ఎస్పీ విజయకేతనం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య లీల ఇది!-ఎడిటర్ సూర్య

మినీ సార్వత్రిక ఎన్నికలలో ఒక్క మణిపూర్‌లో మినహా, మరే రాష్ట్రంలోనూ, కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ స్థానాలు రాలేదు. గోవా ఊడిపోయింది. ఉత్తరాఖండ్‍లో పరిస్థితి కొంచెం మెరుగే అనాలి. గెలుస్తామనుకున్న పంజాబ్‌లోనూ ఆశ్చర్యకరంగా ఎదురు దెబ్బే తగిలింది. ఇవన్నీ ఒక ఎత్తైతే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో తగిలిన దెబ్బ ఇంకొంచెం ఘాటైందనే అనాలి. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎదురైన ఈ ఆశాభంగం దేనికి సంకేతమో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన ఎవరికైనా సహజంగానే బయటకు కనిపించేది, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉమ్మడిగా-విడివిడిగా ప్రచారం చేసినప్పటికీ, ఉత్తర ప్రదేశ్ ఫలితాలు ఇంత ఘోరంగా వచ్చాయనేదే. మరీ విడ్డూరం రాయ్ బరేలి, అమేథిలలో ఎదురైన ఓటమి. సుమారు ఏబై జిల్లాలలో ఒక్క టంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రాకపోవడం కూడా చెప్పుకోవాల్సిన విషయమే. భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితి ఇలా వుంటే, మరో జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే వుంది. ఒకవైపు సీట్ల సంఖ్య తగ్గడమే కాకుండా, మరోవైపు, ఓటర్లు కూడా నిరాదరణ కనబర్చారు బీజేపీ పట్ల. ఓడిపోతుందనుకున్న మాయావతి పార్టీ, ఓట్ల పరంగా చూస్తే గట్టి పోటీనే ఇచ్చిందనాలి. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో, అఖిలేష్-ములాయంల సమాజ్ వాదీ పార్టీ సంఖ్యాపరంగా తిరుగులేని మెజారిటీ సాధించి విజయ కేతనం ఎగురవేసింది.  గెలిచింది "ముస్లిం-యాదవ్" ల కాంబినేషన్ ఫార్ములావల్లనా? యాంటీ మాయావతీ ఓటుతోనా? మాయావతికి అంటగట్టబడిన బ్రాహ్మణ వ్యతిరేకతా? రాహుల్ అసమర్థతా? స్థానిక కాంగ్రెస్ నాయకత్వం వైఫల్యమా? చిన్న రాష్ట్రాల వాదన-రాష్ట్ర విభజన ప్రతిపాదన సరైంది కాదన్న భావనా? అవినీతికి వ్యతిరేకంగా పడ్డ ఓటే ఐతే, పంజాబ్‌లో అకాలీ-బీజేపీ కూటమి ఎలా గెలిచింది? ఉత్తరాఖండ్‍లో ఖండూరీ ఓడిపోయి, అవినీతి ఆరోపణలున్న ఫోక్రాల్ ఎలా గెలిచారు? అవినీతి ఆరోపణలున్న బీజేపీకి అన్ని సీట్లు ఎలా వచ్చాయి? సరే, గోవాలో అవినీతికి కాంగ్రెస్ మూల్యం చెల్లించిందనుకుందాం కాని ఇతర రాష్ట్రాలలో పరిస్థితి అలా లేదే?

నిజంగా కాంగ్రెస్‌కు ఆశాభంగం కలిగిందా? యువరాజు రాహుల్ ఉత్తర ప్రదేశ్‌కు వచ్చి, నలుమూలలా తిరిగి, చెమటోడ్చినా ఫలితం దక్కలేదందామా? ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు మరణావస్తలో వున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి జవ జీవాలు నింపేందుకు రాహుల్ ఏ మాత్రం కృషి చేయలేదా? రాహుల్ కరిష్మా అసలే మాత్రం పని చేయలేదా? ప్రియాంక పరిస్థితీ అంతేనా? యూపీలో తళుక్కుమంటూ మెరిసిన నవ యువ తార అఖిలేష్‌ సింగ్ యాదవ్ ముందు రాహుల్ ప్రభ వెలిసిపోయినట్లయిందా?  చివరికి... సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీలో లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఒక్క సెగ్మెంట్‌ను సొంతం చేసుకోలేక పోవడానికి కారణాలేమై వుండవచ్చు? మాయావతి నూతనంగా రూపొందించిన సామాజిక ఫార్ములా, బహుశా, ములాయం "ముస్లిం - యాదవ్ సమ్మేళన వ్యూహం" ముందు బలాదూరైందేమో? అగ్రవర్ణాల ఓట్లు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోయి వుండవచ్చు. ములాయం సింగ్ యాదవ్-అఖిలేష్ సింగ్ యాదవ్‍ల సమాజ్ వాదీ పార్టీకి 29% మంది ఓటర్లు మాత్రమే మద్దతిచ్చి అఖండమైన మెజారిటీ ఇచ్చారందామా? లేక అధిక సంఖ్యాక 71% మంది ఓటర్లు వ్యతిరేకించి, కేవలం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పుణ్యమా అని వారికి అధికారంలో కొచ్చే వీలు కలిగించిందని హెచ్చరించుదామా? మాయావతి బహు జన సమాజ్ వాదీకి వచ్చిన ఓట్లు (26%) ములాయం కంటే కేవలం మూడు శాతమే తక్కువ. జాతీయ పార్టీలైన భారతీయ జనతా, కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఓట్ల తేడా కూడా (16% - 14%) రెండు శాతమే. ములాయంకు వచ్చిన ఓట్లలో సగం వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు సీట్ల పరంగా పాతిక కూడా రాలేకపోవటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బ్యూటీ!



ఉత్తర ప్రదేశ్‌లో, ఖచ్చితంగా చెప్పాలంటే, ఓటర్లు వ్యతిరేకించింది మాయావతి బహు జన సమాజ్ వాదీ పార్టీని. ఎందుకంటే అధిప్పుడు అధికారంలో వుంది కాబట్టి. అలానే, అధికారంలోకి రావాలని, ఒకప్పుడు ఒంటరిగా, కొంతకాలం సంకీర్ణంలో అధికారం వెలగబెట్టిన భారతీయ జనతాపార్టీని కూడా ఓటర్లు తిరస్కరించారు. వాస్తవానికి, ఓట్ల లెక్కింపు మొదలైన ఆరంభంలో, ఆధిక్యతలను బట్టి భారతీయ జనతా పార్టీకి గణనీయమైన స్థానాలు వస్తాయని, బీఎస్పీతో కల్సి ప్రభుత్వం ఏర్పాటు చేసినా చేయొచ్చనీ బీజేపీ నాయకులు కొందరు భావించారు. కాసేపట్లోనే వారి ఆశలు తారుమారయ్యాయి. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీని కూడా ఓటర్లు మొదట్లో కొంచెం మురిపించారు. చివరకు వారి ఆశలూ అడియాశలయ్యాయి. బీఎస్పీ ఎలాగూ మొదటి నుంచీ ఓటమికి సిద్ధమయ్యే వుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, ఆ పార్టీని ఓటర్లు తిరస్కరించారనడం కంటే, అధికారంలోకి రావడానికి అంగీకరించ లేదనాలి. రాహుల్ "యాంటీ మాయావతి మంత్రం", ప్రచారం, కాంగ్రెస్ పార్టీకంటే కూడా సమాజ్ వాదీ పార్టీకే ఎక్కువ మేలు చేసింది. ఆ మాటకొస్తే, ములాయం సింగ్ యాదవ్ సారధ్యంలోని, అఖిలేష్ యువ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి ఓటర్లు గట్టి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అంతగా ఆదరించనూ లేదు. పెద్దగా అంగీకరించనూ లేదు. దానికి నిదర్శనం ఆ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు, మద్దతుగా వచ్చిన వాటికంటే చాలా ఎక్కువ కావడమే!

రాహుల్ గాంధీ ఓటమిని ఒప్పుకున్నానన్నారు. ప్రయాణంలో పాఠాలు నేర్చుకున్నానన్నారు. ఆయన తల్లి సోనియా గాంధీ, అధిక ధరలకు-ఓటమికి లింక్ పెట్టింది. స్థానిక నాయకత్వం విషయంలోనూ, అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ, తప్పులు జరిగినట్లు అంగీకరించింది. మన్మోహన్ సింగ్‌ను మార్చే ప్రసక్తే లేదని బల్ల గుద్ది మరీ చెప్పింది. ఇంతకీ, రాహుల్ గాంధీని భవిష్యత్‍లో ప్రధానిని చేయడానికే సోనియా ఆయనను ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలోకి ప్రచారానికి దింపిందనాలా? రాహుల్‌నే ప్రధానిని చేయదల్చు కుంటే సోనియాకు కేవలం ఐదంటే ఐదు నిమిషాల పని! దిగమని అనగానే దిగిపోయే మన్మోహన్ ఉన్నారు. ఆయన స్థానంలో రాహుల్ పేరు చెప్పగానే, "దేశ్ కీ నేతా రాహుల్" అని అరవడానికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు-నాయకులు సిద్ధంగా వున్నారు. ఐనా అలా జరగలేదు. జరుగుతుందన్న నమ్మకమూ లేదు. రాహుల్ కూడా తాను ఒక నేతగా ముందు ఎదగాలనుకున్నాడు. తానేంటో-తన సత్తా ఏంటో నిరూపించాలనుకున్నాడు. దానికి తన రాజకీయ క్రీడాస్థలంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను ఎంచుకున్నాడు. నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడుగా, రాజీవ్-సోనియాల కుమారుడుగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో బాధ్యతాయుతమైన పదవిలో వున్న వ్యక్తిగా, ఆయన జాతీయ నాయకుడిగా మాత్రమే ఎన్నికల ప్రచారంలో దిగుతానంటే కాదనే వారెవరూ లేరు. ఐనా, తనంతట తానే ఉత్తర ప్రదేశ్‌ను ఎంచుకున్నారు. 2007 శాసన సభ ఎన్నికలలో కేవలం 22 స్థానాలనే తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి,  2009 లోక్ సభ ఎన్నికలలో స్వయంగా ప్రచారం చేసి 22 లోక్ సభ స్థానాలను గెలిపించారు పార్టీకి. పటిష్టమైన పునాదిని కాంగ్రెస్ పార్టీ పరంగా వేసేందుకు మళ్లీ 2012 శాసనసభ ఎన్నికలలో కూడా రంగంలోకి, క్రియాశీలక పాత్ర పోషించి, అధికారంలో వున్న బీ ఎస్పీ ఓటమికి బాధ్యుడయ్యాడు. తన పార్టీ ఓడినా, మాయావతిని గద్దె దింపగలిగాడు. అంతవరకూ, రాహుల్ అభినందనీయుడే! ఇంతవరకూ, దశాబ్దాల తరబడి, ఏ కాంగ్రెస్ నాయకుడూ చేయని సాహసం చేసి, నాలుగు వందల స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్ట గలిగే స్థాయికి పార్టీని నడిపించగలిగాడు రాహుల్. ఓడితే ఓడు కాక! పార్టీని ఏక తాటిపై నిలపగలిగాడు. ఆయనకు తోడుగా స్థానిక నాయకత్వమే కనుక పనిచేసి వున్నట్లయితే, బహుశా ఫలితాలు మరికొంత మెరుగ్గా వుండేయేమో!   

ఇంతకూ, రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఇష్టం లేనివారు, ఆయనంటే గిట్టని వారూ, ప్రచారంలో ఆయన సఫలం కాకూడదని కోరుకున్నవారూ, ఓటమి పాలైతే మంచిదని మనసులో భావించిన వారూ, కాంగ్రెస్ పార్టీలో లేరని అనుకోరాదు. ఆయనెక్కడ ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారో, గెలిపించి ఎక్కడ ప్రధాని అవుతారో అని భయపడ్డ వారూ వున్నారు. నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం (రాహుల్? ప్రియాంకా?) త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే. ఆ కుటుంబానికి వ్యతిరేకంగా అహర్నిశలూ, కాంగ్రెస్ పార్టీలో వుంటూనే, పనిచేసేవారూ చాలామంది వున్నారు. ఉదాహరణకు, ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకుంటాడా? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీయవచ్చునేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు. అలానే చిదంబరాలూ, ఆజాదులూ, యాంటోనీలు చాలామందే వున్నారింకా!
      
తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగియగానే, ఆమె స్థానంలో కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ ను ప్రతిపాదించి, ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. వచ్చిన చిక్కల్లా కంట్లో నలుసులతోనే. అందుకే రాహుల్ సొంతంగా-స్వయంగా ఎదగాలని కోరుకుంది. ఇవ్వాళ ఉత్తర ప్రదేశ్‌లో రాహుల్‌కు అపజయం తాత్కాలికమే! భవిష్యత్‍లో అఖిలేష్ లాంటి వారిని రాహుల్ కలుపుకుని పనిచేయకూడదా? గుండాల-రౌడీల సమాజ్ వాదీ పార్టీకి రాహుల్ వ్యతిరేకుడు కాని, సౌమ్యుడు-సంయమనం పాటించేవాడూ ఐన అఖిలేష్ యాదవ్‌తో రాహుల్‌కు వైరం వుండాల్సిన అవసరం లేదే? End

Sunday, March 4, 2012

కాంగ్రెస్‌లో లబ్ది పొందాలంటే ధిక్కరించాల్సిందే!: వనం జ్వాలా నరసింహారావు




వనం జ్వాలా నరసింహారావు

నిర్ణయం తీసుకోవడంలో సుదీర్ఘకాలం జాప్యం జరిగినప్పటికీ, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వోటు వేసి, ధిక్కార స్వరం వినిపించిన కాంగ్రెస్ శాసన సభ సభ్యులమీద వేటు పడింది. వారితో సహా మరో రెబెల్, లోక్ సభ సభ్యుడు మేకపాటి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం సహితం కోల్పోయి, తమ భవిష్యత్‌ను తీర్చి దిద్దుకునే ప్రయత్నంలో పడిపోయారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను గమనిస్తే, ఒకరిపై ఇంకొకరు దుమ్మెత్తి పోసుకునే స్థితికి దిగజారి పోయిందనాలి. అధిష్ఠానం అంటే భయం కూడా లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. ఒక వైపు కిరణ్-బొత్స వర్గాలుగా, మరో పక్క సీమాంధ్ర-తెలంగాణ వాదులుగా, ఒకే ప్రాంతంలోని సమ్మతి-అసమ్మతి ముఠాలుగా, ఒకే జిల్లాలో రెండు చీలికలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు. అధిష్ఠానం తన వంతుగా, వర్గాలను-విభేదాలను, అందులోని వ్యక్తుల ఇష్టానుసారంగా, ఒక్కోసారి ఒక్కో విధంగా రెచ్చగొట్టే విధానం అవలంబిస్తుంటుంది. అప్పుడప్పుడూ, తన మాటను మరీ ఖాతరు చేయడం లేదని భావించినప్పుడు, ఒకరిద్దరి మీద తాత్కాలికంగానో-తాత్కాలిక శాశ్వతంగానో వేటు వేయడం, ఆ తర్వాత అదంతా తమ సొంత ఇంటి వ్యవహారంగా పేర్కొనడం, అందరూ సర్దుకోవడం జరుగుతుంటుంది. అందుకే, తాత్సారం చేసీ-చేసీ, ఇక తప్పదనుకున్నప్పుడు, పార్టీని ధిక్కరించిన శాసన సభ సభ్యులపై వేటు వేసింది. నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు.

          ఆంగ్లేయుల పాలనలోని భారతీయ సివిల్ సర్వెంట్-రాజకీయ సంస్కర్త ఎలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడైతే...... ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధి, చిక్కుల్లో పడ్డ పార్టీని, ప్రక్షాలణచేసి-పునర్నిర్మించి-పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ ప్రాధమిక సభ్యత్వంస్వీకరించారు. అచిర కాలంలోనే, 1998 లో, కొందరు ఆమె జాతీయతను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత పదమూడేళ్లు గా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా-మకుటంలేని మహారాణిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె "ఏక వ్యక్తి అభిప్రాయమే", “ఏకాభిప్రాయంగా పరిగణలోకి తీసుకోవాలి.

          నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. విధేయులు అణిగిమణిగివుండి, దొరికిన దానితో సంతృప్తి పడుతుంటే, వ్యతిరేకులు అడపాదడపా ఎదురుతిరగకుండా వుండలేక పోయారు. మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్ ఎదురు తిరిగి పార్టీని వీడక పోయినట్లయితే, ఏ నాటికీ ప్రధాన మంత్రిఅయ్యేవారు కానే కాదు. జగ్జీవన్ రాంకు ఉప ప్రధాన మంత్రి దక్కిందంటే ఎదురు తిరిగి పార్టీని వీడడం వల్లనే! నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగలిగింది అందుకే. వారే కనుక వీర విధేయతతో పార్టీలో కొనసాగినట్లైతే, ఒక ప్రణబ్ ముఖర్జీ వలెనో, గులాం నబీ ఆజాద్ లాగానో, "మంత్రివర్గంలో స్థానం" తో సరిపుచ్చుకోవాల్సిందే.

          భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, అసంతృప్తులు, ధిక్కారాలు, ఎదురీతలు, చీలికలు అంతర్భాగాలే. చాలావరకు నెహ్రూ-గాంధి కుటుంబీకుల ఆధిపత్యం చుట్టూతా నే అవన్నీ చోటు చేసుకున్నాయనాలి. విశ్లేషించి చూస్తే, ఎదురు తిరగడమైనా చీలిక తేవడమైనా, మోతీలాల్ నెహ్రూతో మొదలెట్టి, ఆ వారసత్వ పరంపరలో ప్రతి ఒక్కరు, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగా నో వీడడమో, చీల్చడమో, “మనస్సాక్షి చెప్పినట్లునడచుకోమని కార్యకర్తలను ప్రోత్సహించడమో-పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయమూ జగమెరిగిన సత్యం. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

          నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యానికి ఆద్యుడైన ప్రధమ తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత అధ్యక్ష బాధ్యతఅప్ప చెప్పారు. వారసత్వానికి, బలమైన పునాదులు, 1929 లోనే వేశారు. ఆ కుటుంబ వారసత్వానికి పరోక్షంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, నెహ్రూను వ్యతిరేకించిన-వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్య లాంటి నాయకులందరినీ పార్టీలో మైనారిటీకి తగ్గించేందుకు సహకరించారనే ది వాస్తవం. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం (రాహుల్? ప్రియాంకా?) త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే.

          నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ఇందిర ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో, “సామ్యవాదులు”, “సంప్రదాయ వాదులుఅని పార్టీలో రెండు బలమైన వర్గాలుండేవి. ఆధిపత్యం కొరకు వీరు బహిరంగంగానే విమర్శించుకునే వారు. 1967 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పటికీ, మెజారిటీ భారీగా తగ్గింది. పార్టీలో మొరార్జీని ఓడించి ఇందిర ప్రధాని కాగలిగింది. తనను వ్యతిరేకించిన మొరార్జీని మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన ఆర్థిక శాఖనిచ్చింది ఇందిర. బాంకుల జాతీయం, రాజా భరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపధ్యంలో, మొరార్జీ దేశాయ్ తో సహా, హేమామేమీలైన సంప్రదాయ వాదులను బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, దానికి సారధ్యం వహించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వ ప్రధాన మంత్రి కాగలిగారు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగిన వారే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదగ గలుగుతారని నిరూపించారాయన.

          ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల-వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకున్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీని వీడిన యంగ్ టర్క్స్ఎస్ చంద్రశేఖర్ ప్రధాన మంత్రి స్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిర మరో విమర్శకుడు, ఐ కె గుజ్రాల్ కూడా రాజీనామా చేసి ప్రధాన మంత్రి కాగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల పూర్వ రంగంలో, ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్ రాం ఆమెను ఎదిరించి పార్టీని వదిలి, “కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీని స్థాపించి, జనతా కూటమితో కలిసి పోటీ చేయడం వల్లనే ఉప ప్రధాన మంత్రి కాగలిగారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. ఆమె వారసుడిగా ఎదుగుతున్న సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. “వీర విధేయులుదానికి మద్దతీయగా, “నిశ్సబ్ద వ్యతిరేకులుమౌనం పాటించారు. సమయం కొరకు వేచి చూడ సాగారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధి కి వారసత్వం ఇచ్చింది. ఇక నాటినుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్ అని వాడుకలో పిలవడం, ఏఐసీసీ () అని ఉపయోగించడం మొదలైంది.

          నెహ్రూ-గాంధి వారసత్వంలో నాలుగో తరం పార్టీ నాయకత్వం మొదలైంది. అప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్న రాజీవ్ గాంధి నాయకు డయ్యారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో, గతంలో ఎన్నడు సాధించలేనంత భారీ మెజారిటీతో రాజీవ్ పార్టీని గెలిపించారు. భారత జాతీయ కాంగ్రెస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరంలో 1985 లో, “ఇందిర కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ను, మంత్రివర్గంలో తీసుకుని ఆర్థిక శాఖను కేటాయించాడు. దరిమిలా వీపీ సింగ్ ధిక్కార ధోరణిని సహించలేని రాజీవ్, తల్లి ఇందిర ఏ విధంగా మొరార్జీ ని తొలగించిందో, అలానే, సింగ్ శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. ఎప్పుడైతే బోఫోర్స్కుంభకోణానికి సంబంధించిన సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, రాజీవ్ ఆయనను ఆ శాఖనుంచి కూడా తప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989 లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికై, “నేషనల్ ఫ్రంట్ప్రభుత్వానికి సారధ్యం వహించి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనే కనుక రాజీవ్ గాంధీకి వీర విధేయుడిగా వుండిపోయినట్లైతే, తన ఆర్థిక శాఖను కాపాడుకో గలిగే వాడే కాని, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగేవాడు కానే కాదు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో వున్న రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో ఆయన స్థానంలో పీవీ నరసింహారావు పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

          నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరకు చెందని వారికి, పార్టీ సారధ్యం-ప్రధాన మంత్రి పదవి రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. సోనియా తన చెప్పు చేతల్లో వుంటాడనుకున్న వ్యక్తి, సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో, భారత దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా మన్ననలందుకోవడం జరిగింది. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. సోనియా ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పలేదు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన దరిమిలా, పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది.

          ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్, ఎన్నికల్లో కాంగ్రెస్ పక్ష ప్రధాని అభ్యర్థిగా, భారత దేశంలో పుట్టిన వారి పేరునే ప్రకటించాలన్న నినాదం లేవదీశాడు. ధిక్కార స్వరం వినిపించాడు. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. స్థైర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్ ను తెర పైకి తెచ్చింది. ఎన్నికల అనంతరం యూపీయే ప్రభుత్వానికి సారధ్యం వహించడానికి ఆమె తిరస్కరించి, ఆయనను ప్రధానిని చేసింది. ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకుంటాడా? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీయవచ్చునేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు.

          తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగియగానే, ఆమె స్థానంలో కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ ను ప్రతిపాదించి, ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయ స్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా అమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా కంట్లో నలుసులతోనే. సోనియా ఆదేశాలిచ్చిందన్న సాకుతో, మొయిలీలు-అహ్మద్ పటేల్లు-ప్రణబ్ ముఖర్జీలు, వారు చెప్పారని ఆంధ్రా నాయకులు, జగన్ కు మంచిచెపుతున్నట్లు నటిస్తూనే, ఆమెకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం సోనియా చేస్తుండవచ్చు. కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయ స్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే సోనియాకు మంచిది. నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే.

          అందుకే పార్టీలో చీలిక తప్పకపోవచ్చు. భారత జాతీయ కాంగ్రెస్(ఆర్-రాహుల్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్-సోనియా) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి-ప్రియాంక) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరగాలంటే, జగన్ లాంటి యువ నాయకులను వెంట వుంచుకోవాల్నా? వదిలించుకోవాల్నా? అన్న ఆలోచన చేయకుండా సోనియా వుండే అవకాశాలు లేనే లేవు! End

Friday, March 2, 2012

నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ సంస్కృతి: వనం జ్వాలా నరసింహారావు


నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ సంస్కృతి
వనం జ్వాలా నరసింహారావు

మేకపాటి రాజమోహన రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను సభాపతి మీరాకుమార్ ఆమోదించడంతో మరో కాంగ్రెస్ ధిక్కార స్వరం పార్టీని అధికారికంగా వీడినట్లయింది. ఆయన మద్దతిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఏనాడో పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. మరో ఎంపీ సబ్బం హరి కూడా పార్టీని వీడడమో, లేక, పార్టీ ఆయనను దూరం చేసుకోవడమో జరగొచ్చు. పార్టీని వదిలినా, "యుపిఎ" కు తన మద్దతుంటుందని చెప్పకనే చెప్పారు పరోక్షంగా జగన్. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, పార్టీని ధిక్కరించి ఓటు వేసిన వారి వ్యవహారం కూడా తేలిపోయింది. ఆ ధిక్కార స్వరాలన్నింటిపైనా వేటు పడింది. వీరంతా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లే లెక్క! వీరిలా కాంగ్రెస్ పార్టీని వీడడం, కొంత కాలానికి స్వగృహ ప్రవేశం చేయడం, కొత్తేమీ కాదువీరిలో కొందరి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాబోయే ఉప సమరంలో పోటీ చేసినా, మళ్లీ ఎన్నడో ఒకనాడు సొంత గూటికి చేరుకోరన్న నమ్మకం లేదు. మనరాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాలలోనూ ఇది మామూలు వ్యవహారమే!

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి భారత జాతీయ కాంగ్రెస్ () కు పోలికే లేదనాలి. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం. ఉదాహరణగా జైపాల్ రెడ్డి  లాంటివారిని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ () లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న మర్రి చెన్నారెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే.

పార్టీ వీడిన జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్ లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? శరద్ పవార్ గురించి ఏమనాలి ? సోనియా గాంధి విదేశీయతను తెర పైకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆయన కాదా ? ఇవ్వాళ ఆయన లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో ప్రధాన కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా? కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తే ధిక్కార స్వరాల, అసంతృప్తి జ్వాలల భారత కాంగ్రెస్ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుచేసుకోవచ్చు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, 1907 లో పార్టీలో చీలి కొచ్చింది. అలా వంద సంవత్సరాల పూర్వమే ధిక్కార స్వరాలకు అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు అధిష్టానాన్ని వ్యతిరేకించినప్పటికీ, మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం ఆది నుంచీ జరుగుతున్నదే.

1948-1950 మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య (నెహ్రూ బలపర్చిన వ్యక్తి), తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ (పటేల్ పక్షం) చేతిలో ఓటమి పాలయ్యారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, రాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాలాచారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్ కు ఆ పీఠం దక్కింది. ఆయన అధ్యక్షుడైన మరుక్షణం నుంచే, రాష్ట్రపతికి, ప్రధానికి వుండే అధికారాల-హక్కుల విషయంలో చర్చ మొదలైంది. ఒకవిధంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. వల్లభాయ్ పటేల్ చనిపోవడంతో, టాండన్ కు చిక్కులు మొదలయ్యాయి. ప్రధానిగా వున్న నెహ్రూ టాండన్ కు వ్యతిరేకంగా తన నిరసన తెలియచేసేందుకు, పార్టీ పదవులన్నిటి కీ రాజీనామా చేశారు. దేశానికి నెహ్రూ వల్ల కలిగే మేలు ఎక్కువని భావించిన టాండన్, స్వచ్చందంగా, అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. వెంటనే సమావేశమైన వర్కింగ్ కమిటీ, నెహ్రూను ఆయన స్థానంలో ఎన్నుకోవడంతో, పార్టీ పదవి-ప్రధాని పదవి ఒకే వ్యక్తి చేపట్టారు. నెహ్రూ మద్దతున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారని అంటారు. 1952 ఎన్నికలొచ్చాయి. రాజగోపాలా చారి మద్రాస్ ముఖ్య మంత్రయ్యారు. విద్యాధికుడైన దామోదరం సంజీవయ్యను, నెహ్రూ సలహామీద, మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజాజీ. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు.

1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చేసినాయన, తన మంత్రివర్గంలో ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తి కింద ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు, పివిజి రాజు ప్రభృతులు ఏకమై సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీగా అవతరించి, నీలంకు వ్యతిరేకంగా పనిచేశారు.

నీలం సంజీవరెడ్డిని జాతీయ రాజకీయాల్లోకి లాగడంతో, 1960 లో, రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. అప్పట్లో ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. అంతకుముందే అనధికారికంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీని, 1962 ఎన్నికల్లో, కాంగ్రెస్ లో విలీనం చేశారు మర్రి చెన్నారెడ్డి ప్రభృతులు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు. 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి, అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి, బాహాటంగానే నాయకత్వం వహించారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.

పీవీ మంత్రివర్గంలో పనిచేసిన జలగం వెంగళరావు, ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ ధిక్కార ధోరణి ప్రదర్శించిన వాడే. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. పీవీ స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో ఎమర్జెన్సీ హోం మినిస్టర్గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో (తన స్వంత జిల్లా) కనీసం గెస్ట్ హౌజ్ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్, 1989 లో గెలిచింది. కష్టం మీద చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కాగలిగారు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి.

నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. కాకపోతే ఆ తర్వాత సర్దుకు పోయేవారు. మూడు సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోతీలాల్ నెహ్రూ అధిష్ఠానాన్ని ధిక్కరించి స్వరాజిస్ట్ పార్టీలో చేరారు. స్వతంత్రం రాక పూర్వం మూడు పర్యాయాలు, వచ్చిన తర్వాత రెండు సార్లు అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు టాండన్ ను రాజీనామా చేయించేందుకు ధిక్కార ధోరణితో వ్యవహరించారు. సుభాష్ చంద్ర బోసును దింపే ప్రయత్నంలో గాంధీజీ అంతటి వాడే రాగ ద్వేషాలకు లోనయ్యారు. స్వతంత్రం వచ్చిన సమయంలో ఆచార్య కృపలానీ అధ్యక్షుడిగా వున్నారు. 1961-69 మధ్య కాలంలో నీలం సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్పల పర్వం కొనసాగింది. 1969 లో ఇందిరా గాంధీ శకం మొదలై, పార్టీ చీలిపోయి, జగ్జీవన్ రాం అధ్యక్షుడయ్యారు. అధిష్ఠానాన్ని సిండికేట్పేరుతో ధిక్కరించిన ఇందిర పార్టీనే చీల్చారు. కొన్నాళ్లు ఇతరులకు అవకాశమిచ్చిన ఇందిరా గాంధీ 1983 నుంచి 1985 వరకు స్వయంగా తానే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించింది. 1985 లో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది. ఇక అప్పటినుంచి హత్యకు గురయ్యేవరకు ఆయనే అధ్యక్షుడు. పీవీ, కేసరిల తర్వాత ఆ పీఠాన్ని 1998 లో అధిష్టించిన సోనియా గాంధీ, గత 14 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా, ఒంటి చేతితోఅధిష్ఠానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. పార్టీలో ఏకాభిప్రాయంఅంటే, సోనియా గాంధి అనే ఏక వ్యక్తి అభిప్రాయంగా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం విభజించి పెత్తనం సాగించడంఅనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే.

ఈ నేపధ్యంలో, ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్న కాంగ్రెస్ వారి వలసలు, మరో వైపు "తెరాస" ఆకర్షణ, రాబోయే సాధారణ ఎన్నికలలో ఓటమి పాలవుతామన్న కాంగ్రెస్ వారి భయం, రాష్ట్రంలో పార్టీని ఏ దిశగా తీసుకుపోనున్నదో అనే విషయంలో వేచి చూడాల్సిందే! నేడు పార్టీని వీడుతున్న వారిలో-లేదా-పంపబడుతున్న వారిలో అందరూ కాకపోయినా కొందరైనా సొంత గూటికి రాక మానరు. కథ మళ్లీ మామూలే!End 

Thursday, March 1, 2012

బడుగాగ్ని మండేలా: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

కోలుకుంటున్న నల్ల జాతి మహాత్ముడు, వర్ణ- జాతి వివక్షపై పోరాటం, భారత రత్న’ అందుకున్న విదేశీయుడు, 27 సంవత్సరాల జైలు జీవితం, దూర విద్య ద్వారా న్యాయశాస్త్రంలో డిగ్రీ,  మండేలా పోరాటాలకు, భారత్‌ మద్దతు - ఎడిటర్ సూర్య

ఆరోగ్యం కుదుటబడిన నెల్సన్ మండేలా, జోహన్స్ బర్గ్ లోని తన స్వగృహంలో, నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇటీవల కాలంలో మధ్య మధ్య క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు, దక్షిణాఫ్రికా మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం, ఆందోళనతో గమనిస్తోంది. దీర్ఘకాలంగా ఇబ్బందికి గురిచేస్తున్న ఉదర కోశ సంబంధమైన వ్యాధికి మండేలాకు లాపరోస్కోపిక్ చికిత్స చేశారు. జాత్యహంకార శ్వేత జాతి పాలకుల గుండెలలో నిద్రపోయిన నల్లజాతివారిపాలిట మహాత్ముడు నెల్సన్ మండేలా తొంబైనాలుగేళ్ల వయసులో పూర్తిగా తెల్లబడ్డ జుట్టుతో, బలహీనంగా, ఎంతో ముదుసలిగా కనిపిస్తున్నారని ఆయనను చూసిన విదేశీ పాత్రికేయులంటున్నారు. కర్ర సహాయంతో నడుచుకుంటూ, ఆయన నిత్యం అధ్యయనం చేసే గదిలోకి వెళుతుంటారు. కాళ్లకు చెప్పులు ధరించేటప్పుడు వణకుతుంటారు. అతికష్టం మీద కుర్చీలో కూర్చుని, వెనుకకు వాలి, ఒక్కో కాలుని ఇబ్బందికరంగా పైకి లేపి, ఎదురుగా వుంచిన చిన్న బల్లపై పెట్టుకుని దీర్ఘాలోచనలో మునిగిపోతే, ఆయన భార్య గ్రీసా ఆ సమయంలో ఆయన పాదాలను సవరిస్తుంటారు. ఆయన కుర్చీ పక్కనే, మండేలాను ఇరవయ్యేడు సంవత్సరాల పాటు జైలులో నిర్బంధానికి గురిచేసిన జాత్యహంకారుల ఆంగ్ల, ఆఫ్రికన్ భాషల వార్తాపత్రికలు, మాగజైన్లు ఒక బల్లపై పడివుంటాయి. ఆయన కుడి పక్కన, ఆయనకు వినిపించేంత దగ్గరలో, కబుర్లు చెప్పుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూచుంటారు. మండేలా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నా, పాత జ్ఞాపకాలను ఇంకా నెమరేసుకుంటూనే కాలం గడుపుతుంటారు. "ఆయనలో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది".

జులై 18, 1918 న జన్మించిన నెల్సన్ ఆర్ మండేలా, దక్షిణాఫ్రికా మొట్టమొదటి ఎన్నికైన అధ్యక్షుడిగా, 1994-1999 మధ్య కాలంలో పనిచేశారు. అధ్యక్ష పీఠం అధిష్టించడానికి పూర్వం, దీర్ఘకాలం, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన ధీరుడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక విభాగానికి నాయకుడు. 1962 లో అరెస్టు కాబడి, శిక్షకు గురై, జీవిత ఖైదీగా 27 సంవత్సరాల పాటు జైలులో గడిపారు. ఫిబ్రవరి 11, 1990 న విడుదలై, ప్రభుత్వంతో విజయవంతంగా చర్చలు జరిపి, 1994 లో "బహుళ జాతి ప్రజాస్వామ్యం" స్థాపనకు కారకుడైనాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యారు. 1993 నోబెల్ శాంతి బహుమానం, అదే ఏడాది టైమ్స్ మాగజైన్ "మాన్ ఆఫ్ ద యియర్" గౌరవం, 1980 లో జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ బహుమతి, 1988 లో "లెనిన్ శాంతి బహుమతి", 1990 లో "భారతరత్న" ఆవార్డు అందుకున్నారు మండేలా. భారతదేశ పౌరుడు కాకపోయినా ఆయనకు "భారతరత్న" పురస్కారం ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం. 1973 లో లీడ్స్ విశ్వవిద్యాలయంలో శాస్త్రజ్ఞులు కనుగొన్న ఒక అణు రేణువుకు "మండేలా పార్టికిల్" అని పేరు పెట్టారు. న్యూఢిల్లీలోని ఒక రోడ్డును నెల్సన్ మండేలా మార్గం అని పిలుస్తారు.

తింబు రాజ వంశానికి చెందిన మండేలా పితామహుడు కూడా ఒక రాజుగా ప్రసిద్ధిగాంచిన వాడే. తన తండ్రి పదమూడు మంది సంతానంలో పాఠశాలకు వెళ్లిన మొదటి వాడు మండేలానే. పాఠశాలలోనే ఆయన టీచర్ మండేలా పేరు ముందర "నెల్సన్" చేర్చింది. 1937 లో కళాశాలలో చేరిన మండేలా, ఫోర్ట్ హారే యూనివర్సిటీలో ఇంకా మొదటి సంవత్సరం చదువుతుండగానే, విశ్వవిద్యాలయం విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘం చేపట్టిన ఉద్యమంలో పాలు పంచుకోవడంతో, బహిష్కృతుడై, దూర విద్య ద్వారా డిగ్రీ చదువు పూర్తి చేశాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకులతో, స్నేహం ఏర్పడింది. అలనాటి ఆయన స్నేహితులు దరిమిలా యావజ్జీవిత స్నేహితులుగా మిగిలిపోయారు.

1948 లో దక్షిణాఫ్రికా దేశంలో జరిగిన ఎన్నికలలో, వర్ణ-జాతి వివక్షతను సమర్థిస్తున్న జాత్యహంకార ఆఫ్రికన్ల జాతీయ పార్టీ గెలుపొందడంతో, మండేలా రాజకీయాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టాడు. అదే రోజుల్లో మహాత్మా గాంధీ ప్రభావం మండేలా మీద బాగా పడింది. 150 మంది సహచరులతో సహా డిసెంబర్ 5, 1956 న మండేలాను అరెస్ట్ చేసి కొద్దికాలం తరువాత విడుదల చేసింది ప్రభుత్వం. 1961 లో, "ఎంకే" అన్న పేరుతో పిలువబడిన, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక విభాగానికి మండేలా నాయకు డయ్యారు. ప్రభుత్వ సైనికులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. విద్రోహ-విధ్వంసక చర్యలకు కూడా సమన్వయకర్తగా వ్యవహరించారాయన. అవి కూడా ఫలితాన్నివ్వకపోతే, వర్ణ-జాతి వివక్షతను ఆపు చేయలేకపోతే, గొరిల్లా తరహా పోరాటానికి కూడా సిద్ధమవ్వాలని ఒకానొక సందర్భంలో పిలుపిచ్చారు మండేలా. ఏళ్ల తరబడి జాత్యహంకార శ్వేత జాతీయుల వర్ణ-జాతి వివక్షతకు అడ్డూ-అదుపూలేకపోవడంతో, అహింసా మార్గం వదిలి, హింసాయుత మార్గంలో పోతే మంచిదన్న ఆలోచన కూడా చేశారాయన. "ఎంకే" ఆధ్వర్యంలో వర్ణ-జాతి వివక్షత చూపుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మొదలెట్టిన గొరిల్లా పోరాటంలో, సాధారణ పౌరుల ప్రాణాలు కూడా పోవడంతో, మండేలా స్పందించారు. తన నాయకత్వంలోని కొందరిని ఆయన తీవ్రంగా విమర్శించడమే కాకుండా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అంగీకరించారు. ఇదిలా కొనసాగుతుండగానే, ఆగస్ట్ 5, 1962 న మండేలాను అరెస్ట్ చేసిఅక్టోబర్ 25, 1962 న తొలుత ఐదేళ్ల పాటు శిక్ష విధించింది ప్రభుత్వం. జూన్ 12, 1964 న ఇతర సహచరులతో సహా మండేలాకు యావజ్జీవ శిక్ష విధించింది న్యాయస్థానం.
ఇందిరా గాంధీ సమక్షంలోఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం 
న్యూ ఢిల్లీలో ప్రారంభోత్సవం చేసిన నాటి చారిత్రాత్మక ఫొటో

ఆయన 27 సంవత్సరాల జైలు జీవితంలో మొదటి 18 ఏళ్లు "రాబిన్ ఐలాండ్" జైలులో వుంచింది ప్రభుత్వం. దక్షిణాఫ్రికా శ్వేత జాతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయుల హక్కులకొరకు పోరాడుతున్న యోధుడిగా, జైలులో వున్న రోజుల్లో, మండేలాకు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడం మొదలైంది. జైలులో వుండగా, ఒక సున్నపు క్వారీలో, కఠినతరమైన కూలీ పని చేయించారు మండేలాతో. జైలు జీవితం చాలా దుర్భరంగా వుండేది. నల్ల జాతి ఖైదీలని, శ్వేత జాతీయులని విడి-విడిగా వారిని చూసేవారు జైలు సిబ్బంది. ఆహార విషయంలోనూ వివక్షత పాటించేవారు. రాజకీయ ఖైదీలకు ప్రత్యేకించి ఏ హక్కులూ వుండకపోయేది. మండేలాను చూడడానికి ఆరు నెలలకు ఒకసారి ఒక విజిటర్‌ను, చదవడానికి ఆర్నెల్లకి ఒక్క సారి ఒక్క ఉత్తరాన్ని అనుమతించేవారు! వచ్చిన ఆ ఒక్క ఉత్తరమైనా, ఎన్నాళ్లకో కాని మండేలాకు చేర్చేవారు కాదు. అది కూడా పూర్తిగా చినిగి, చదవడానికి పనికిరాని విధంగా చేసేవారు జైలు అధికారులు. ఇంత నిర్బంధంలో కూడా, జైలులో దూర విద్య ద్వారా చదువుకుని, లండన్ విశ్వ విద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డిగ్రీ సంపాదించారు మండేలా. మార్చ్ 1982 లో, సహచర ఖైదీలతో సహా, మండేలాను, రాబిన్ ఐలాండ్ జైలు నుండి, పోల్స్ మూర్ జైలుకు మార్చింది ప్రభుత్వం.

"రాజకీయ ఆయుధంగా హింసాయుత మార్గాన్ని వ్యతిరేకించడానికి" నెల్సన్ మండేలా అంగీకరిస్తే, ఆయనను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు బోథా ఫిబ్రవరి 1985 లో సంసిద్ధత వ్యక్తం  చేసారు. ఆయన సూచనను మండేలా నిర్ధంద్వంగా తిరస్కరించారు. "ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మీద నిషేధం వున్నంతకాలం నాకు స్వేచ్ఛ ఇస్తాననడంలో అర్థం లేదు. స్వతంత్ర వాయువులు పీలుస్తున్న వారే చర్చలకు అర్హులు కాని, నా లాంటి జైలులో వున్నవారు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలు కాదు" అని తన కూతురు ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం పంపారు మండేలా. చివరకు నవంబర్ 1985 లో బోథా నేషనల్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధికి, మండేలాకు మధ్య మొదటి విడత సమావేశం చోటుచేసుకుంది. అదే రోజుల్లో సమావేశం జరిగిన వోల్క్స్ ఆసుపత్రిలో మండేలా ప్రొస్టేట్ సర్జరీ అనంతరం కోలుకుంటున్నారు. అలాంటి సమావేశాలు మరి కొన్నిమరో నాలుగేళ్లు జరిగినప్పటికీ, ఫలితం అంతగా కనపడలేదు. కాకపోతే, భవిష్యత్ చర్చలకు అవి పునాదులేశాయి.1988 లో మండేలాను "విక్టర్ వెర్స్ టర్" జైలుకు తరలించి, విడుదల చేసేంతవరకు అక్కడే వుంచారు.

"నెల్సన్ మండేలాను విడుదల చేయాలి" అన్న నినాదంతో, ఆయన జైలులో వున్నంత కాలం, జాతీయ-అంతర్జాతీయ స్థాయి ఒత్తిడులు దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై వచ్చాయి పలుమార్లు. రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయ విభాగం ప్రతినిధులు ఎన్నో మార్లు మండేలాను జైలులో కలుసుకున్నారు. 1989 లో బోథా స్థానంలో ఫ్రెడెరిక్ విలియం క్లర్క్ దేశాధ్యక్షుడయ్యారు. ఏడాది తిరక్కుండానే, మండేలా విడుదల నిర్ణయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మీద, ఇతర వర్ణ-జాతి వివక్షత వ్యతిరేక సంస్థల మీద అంతవరకున్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తొలుత ప్రకటించి, ఆ తరువాత ఫిబ్రవరి 1990 లో మండేలాను విడుదల చేసింది ప్రభుత్వం. ఆయన విడుదల కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. విడుదలైన రోజున జాతినుద్దేశించి మండేలా ప్రసంగం చేశారు. శ్వేత జాతీయులతో సఖ్యతకు-సహ జీవనానికి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి తన నిబద్ధతను వ్యక్త పరుస్తూనే, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక పోరాటం ఆగిపోలేదని ఇంకా కొనసాగుతుందని ప్రకటించారు మండేలా.

జైలునుంచి విడుదలైన మండేలా తిరిగి 1990-1994 మధ్య కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 27, 1994 న బహుళ జాతీయులందరూ పాల్గొన్న మొదటి ఎన్నికలు జరిగాయి. 62%  ఓట్లను పొందిన ఆఫ్రికన్ జాతీయ కాంగ్రెస్ నాయకుడు మండేలా, మే 10, 1994 , నల్ల జాతి వారికి చెందిన ప్రప్రధమ దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడయ్యారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లు నిదర్శనంగా, క్లర్క్ కూడా మంత్రివర్గంలో చేరారు. "ట్రేడ్ మార్క్ బాటిక్ చొక్కాలను" ధరించుతూ, అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాఫ్రికా గౌరవాన్ని ఇనుమడించే విధంగా ఆయన అధ్యక్ష పాలన కొనసాగింది. ఉచిత వైద్యం, సంక్షేమ పథకాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు, విద్యకు ప్రాధాన్యత, భూ సంస్కరణల అమలు, కార్మికులతో సత్సంబంధాలు లాంటివి ఆయన పాలనలో చెప్పుకోదగ్గవి. కల్నల్ గడ్డాఫీ లిబియాకు, అమెరికా-బ్రిటన్ దేశాలకు మధ్య విభేదాలను తొలగించేందుకు మండేలా కృషి చేశారు.

మండేలా మొదటి భార్యతో పదమూడేళ్లు కాపురం చేసి విడాకులిచ్చారు. దానికి ప్రధాన కారణం, మండేలా నిరంతరం ఉద్యమంలో పాల్గొనడమే! ఆ తరువాత రెండు సార్లు మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. తన 80 వ పుట్టిన రోజున 1998 లో ఇప్పుడున్న మూడో భార్య గ్రీసా మాషెల్‍ను వివాహమాడారు మండేలా. ఆమె దివంగత మొజాంబిక్ అధ్యక్షుడు సా మోరా మాషెల్ భార్య. పెళ్లికి ముందు అది జరగడానికి ఎన్నో దఫాలుగా చర్చలు సాగాయి. రెండవ పర్యాయం ఎన్నికలలో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న మండేలా, తన రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. అప్పటినుంచి, రకరకాల సాంఘిక-మానవ హక్కుల సంస్థలకు సలహాదారుడిగా పనిచేయడం ప్రారంభించారు మండేలా.   జులై 2001 లో మండేలాకు ప్రోస్టేట్ కాన్సర్ వున్నట్లు నిర్ధారణ ఐంది. చికిత్స కూడా జరిగింది. 2003 లో పొరపాటున ఆయన మరణ వార్తను సిఎన్ఎన్ ప్రసారం చేసింది. తప్పు సరి దిద్దుకుంది. 2007 లోనూ అలాంటి పొరపాటే మరో విధంగా జరిగింది. వాస్తవానికి మండేలా ఆ సమయంలో మొజాంబిక్ లో కులాసాగా గడుపుతున్నారు.

జూన్ 2004 లో, తన  85 వ ఏట, ప్రజా జీవనం నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించారు మండేలా. ప్రజలకు తన అవసరం వుందని తాను అనుకున్నప్పుడు తానే ప్రజలకు పిలుపిస్తానని, వారి వద్దకు వస్తానని, తనను వారు పిలువ వద్దని విజ్ఞప్తి చేశారు. అన్నమాట ప్రకారం అలానే వుండి పోయారు. ఆగస్ట్ 22, 2007 న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మర్యాదపూర్వకంగా మండేలాను కలిసింది ఆమె దక్షిణాఫ్రికా పర్యటనలో. ఇరువురు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా, 1967 లో, భారత దేశంలో, ఇందిరా గాంధీ సమక్షంలో, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం న్యూ ఢిల్లీలో ప్రారంభోత్సవం చేసిన నాటి చారిత్రాత్మక ఫొటోని మండేలాకు బహుకరించారు సోనియా గాంధీ. వాస్తవానికి, ఇందిరా గాంధీ, తన విద్యార్థి దశ నాటి నుంచీ, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, వారి పోరాటానికి మద్దతుగా ఎల్లప్పుడూ వుంటుండేవారు. అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాయభార హోదా కలిగించింది కూడా. జనవరి 25, 1995 న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఉపన్యాసం ఇవ్వడానికి న్యూ ఢిల్లీకి వచ్చారు మండేలా.

మండేలా లాంటి అరుదైన మహా నాయకులు పది కాలాల పాటు ఆరోగ్యంగా వుండాలని కోరుకుందాం.  

Sunday, February 26, 2012

ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్ డార్ఫ్: వనం జ్వాలా నరసింహారావు


బహుముఖ క్రియాత్మక వ్యూహంతో 
గిరిజనుల సమస్యలకు సూచనలిచ్చిన 
ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్ డార్ఫ్
          
              ఒకనాటి నిజాం హైదరాబాద్ రాష్ట్రం-ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ లోని, ఆదిలాబాద్ జిల్లా, జైనూర్ మండలం, మర్లవాయి గ్రామంలో అనేక సంవత్సరాలు నివసించిన ప్రపంచ ప్రఖ్యాత మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్ జ్ఞాపకార్థం, అక్కడి గిరిజన సాంప్రదాయాల ప్రకారం, అంతిమ సంస్కారాలు జరిపించడానికి ఆయన కుమారుడు నికోలస్, మనుమడు హేమెన్‍డార్ఫ్ జూనియర్, ఆ గ్రామానికి వచ్చారని పత్రికలలో వార్తలొచ్చాయి. సతీమణి ఎలిజబెత్‌తో కల్సి హేమెన్‍డార్ఫ్ ఆ  ప్రాంతానికి నిజాం రాష్ట్ర "ఆదివాసీ సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ" సలహాదారుడుగా, 1941 లో అడుగుపెట్టి, అక్కడే ఒక గుడిసెలో సంవత్సరాల తరబడి వుండిపోయారు. భార్య మరణానంతరం లండన్ వెళ్లి అక్కడే మరణించారు. బహుశా హేమెన్‍డార్ఫ్ స్థాయిలో రాష్ట్ర గిరిజన సమస్యలపై అధ్యయనం చేసి సూచనలిచ్చిన వారు ఎవరూలేరంటే అతిశయోక్తి కాదు.

ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్, ఆస్ట్రియా దేశంలో, సంపన్నుల కుటుంబంలో జన్మించినప్పటికీ, యవ్వనంలో అడుగుపెట్తూనే, రబీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం పట్ల ఆకర్షితుడై, భారతీయ సంస్కృతీ-సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. వియన్నాలో మానవ పరిణామ శాస్తాన్ని, పురావస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేసారు. నాగా హిల్స్ లో నివసిసించే గిరిజన సామాజిక వ్యవస్థ స్థితిగతులపై పరిశోధనాత్మక వ్యాసాన్ని రాశారు. సమకాలీన మానవ పరిణామ శాస్త్రజ్ఞులతో పరిచయాలు పెంపొందించుకోవడానికి హేమెన్‍డార్ఫ్ లండన్ నగరానికి వెళ్లారు. 1936 లో నాగాలాండుకు వచ్చి అక్కడి గిరిజనుల భాష నేర్చుకున్నారు. కొంతకాలం నీఫా-ఈశాన్య సరిహద్దు భారత ప్రాంతానికి వెళ్ళి, నిజాం ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసేందుకు దక్షిణ భారతానికి వచ్చారు. ఆయన గిరిజన సమస్యలపై తీసుకున్న చొరవ వల్ల, నాటి నిజాం ప్రభుత్వం హేమెన్‍డార్ఫ్ ను రాష్ట్ర గిరిజన, వెనుకబడిన వర్గాల "ఆదివాసీ సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ" సలహాదారుడిగా ఎంపిక చేసేందుకు దోహదపడింది. వారి సమస్యలలో ప్రధానమైంది భూమి సమస్య.

దలైలామాతో వోన్ ఫ్యూరర్ హేమెన్‍డార్ఫ్


సలహాదారుడి పాత్రను పోషించుకుంటూ, అనేక ప్రదేశాలలో గిరిజన విద్యా సంస్థలను నెలకొల్పడం, వినూత్నమైన పథకాలను వారి సంక్షేమం కొరకు రూపొందించడం, వాళ్ల సంస్కృతీ-సంప్రదాయాలను పరిరక్షించడం లాంటి కార్యక్రమాలను కూడా హేమెన్‍డార్ఫ్ చేపట్టడం జరిగింది. 1953 లో నేపాల్ దేశానికి వెళ్లి అక్కడి గిరిజనుల సమస్యలపైనా అధ్యయనం చేశారు. భారతదేశంలోని గిరిజనులపై అధ్యయనం చేయాలన్న ఆయన ఆసక్తి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరడానికి దారితీసింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో నివసించే వారితో సహజీవనం చేస్తూ, వారి జీవన స్థితిగతులపై పరిశోధనలు జరిపారు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే గోండుల, చెంచుల, రెడ్డిల మీద అధ్యయనం హేమెన్‍డార్ఫ్ కు ప్రధాన అంశంగా మారింది. ఆయన ప్రయాణం చేసిన గిరిజన ప్రాంతాలు చాలావరకు అంతకు ముందు ఎవరూ వెళ్లనివే! సమాంతరంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిని కూడా కొంతకాలం చేశారు. మానవ జాతి శాస్త్రంపైపది "ఏక విషయక రచన" లు చేశారు. వాటిలో ప్రధానమైనవి చెంచుల మీద, గిరిజన రెడ్డిల మీద, గోండుల మీద, నేపాల్ గిరిజనుల మీద, నాగాల మీద ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు. మానవజాతి శాస్త్రంపై ఏకంగా సుమారు 3650 పేజీల అధ్యయన గ్రంధం రాశారు. వృద్ధాప్యంలో మానవ పరిణామ శాస్త్రంలో అధ్యాపకుడిగా లండన్‌లో ఉద్యోగం చేస్తూ, భార్య మరణానంతరం 1987 లో అనారోగ్యానికి గురై, కోలుకోలేక, చివరకు జూన్ 11, 1995 న ఆయన 85 వ ఏట లండన్‌లో మరణించారు.

హేమెన్‍డార్ఫ్ చొరవతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవ పరిణామ శాస్త్ర (యాంథ్రపోలొజీ) విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాఖలోనే ఆయన ఆచార్యుడుగా పనిచేసేవారు. ఆ శాఖలో మొదటి బాచ్ విధ్య్రార్థిగా చదివిన వరంగల్ జిల్లా వాసి పి. కమలా మనోహర రావు, దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ప్రప్రధమ డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ తెగల-వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా ఆరంభించడానికి కూడా హేమెన్‍డార్ఫ్ కారకులు. ఆ శాఖలో ట్రయినీ నిర్వాహకుడుగా పనిచేసేందుకు కమలా మనోహర్ రావును ఎంపిక చేశారు హేమెన్‍డార్ఫ్. 1985 లో రాష్ట్ర ప్రభుత్వం పాలనా సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు "రుస్తుంజీ అసోసియేట్స్" ను కన్సల్టెంటులుగా నియమించింది. ప్రప్రధమ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా 1966 లో ఆ శాఖ ఏర్పడినప్పుడు బాధ్యతలు స్వీకరించి, 1975 లో పదవీ విరమణ చేసిందాకా ఆ శాఖలోనే పనిచేసిన పి. కమలా మనోహర రావును గిరిజన సంక్షేమానికి సంబంధించినంతవరకు సంస్కరణల విషయంలో సూచనలిచ్చేందుకు రుస్తుంజీ నియమించింది.

ఆంధ్ర ప్రదేశ్ లో గిరిజన సంక్షేమ పాలనా విధానాన్ని క్రమబద్ధం చేయడానికి హేమెన్‍డార్ఫ్ శిష్యుడు కమలా మనోహర రావు "ఏక గవాక్ష పద్ధతి" ని సూచించారు. దాంతో పాటు వికేంద్రీకరణ దిశగా బహుముఖ క్రియాత్మక వ్యూహాన్ని కూడా సూచించారు. ఆ నివేదిక పలువురి ప్రశంసలను అందుకుంది. హేమెన్‍డార్ఫ్ తన లెటర్ హెడ్ మీద, స్వదస్తూరీతో, కమలా మనోహర రావుకు నివేదిక విషయంలో తన అభిప్రాయాలను తెలియచేస్తూ, ఒక సుదీర్ఘమైన వుత్తరం రాశారు. ఆ లేఖ రాసిన తేదీ 11-12-1985. అప్పట్లో ఆయన ఆఫ్రికా-ఆసియా దేశాల లండన్ అధ్యయన సంస్థలో పనిచేస్తున్నారు. కాకపోతే వుత్తరం రాసింది హైదరాబాద్ "రాక్ కాజిల్" హోటెల్ లో వున్నప్పుడు. ఆ నివేదిక తయారుచేసినందుకు కమలా మనోహర రావును అభినందించారాయన. గిరిజన ప్రాంతాలలో విప్లవాత్మకమైన మార్పులకు సంబంధించి కమలా మనోహర రావు చేసిన విశ్లేషణలను హేమెన్‍డార్ఫ్ పొగిడారు. ఆ నివేదికలో గిరిజన ప్రాంతాలలో ప్రాజెక్ట్ అధికారి ఏర్పాటుకు సంబంధించిన అంశం కూడా వుంది. కలెక్టర్‌తో సమానమైన అధికారిక హోదాకల ప్రాజెక్ట్ అధికారి నియామకం ఆవశ్యకతను హేమెన్‍డార్ఫ్ గట్టిగా సమర్థించారు. గిరిజన సహకార సంస్థ పనితీరుకు సంబంధించి, స్వతంత్ర ప్రతిపత్తిగల గిరిజన సాంస్కృతిక పరిశోధనా శిక్షణా సంస్థ ఏర్పాటు గురించి, సచివాలయ స్థాయిలో షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవహారంలో పాలనాపరమైన మార్పుల గురించి ఆ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ హేమెన్‍డార్ఫ్ అభినందనలందుకున్నాయి.

సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ తెగల-వెనుకబడిన వర్గాల విభాగాన్ని పటిష్టం చేయడానికి హేమెన్‍డార్ఫ్ తన శిష్యుడు, కమలా మనోహర రావును ఎంపిక చేసుకున్నారు. ఆ కలయిక ఫలితంగానే, వరంగల్ జిల్లాలో, "హైదరాబాద్ గిరిజన ప్రాంతాల నియంత్రణ చట్టం 1949" అమలుకు నోచుకుంది. దరిమిలా హేమెన్‍డార్ఫ్ సూచనతో, వారిరువురి కృషి ఫలితంగా, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖను వేరు చేయడం జరిగింది. దానికి డైరెక్టర్‌గా కమలా మనోహర రావును ఎంపిక చేసింది ప్రభుత్వం. 

గిరిజనులను "ఆది వాసీలు" గా సంబోధించడానికి కారణం, ఆది నుంచీ భారతావనిలో నివసిస్తున్నవారు వారేనని. ఆంగ్లంలో ఆదివాసీలనే, "ఎబ్ ఒరిజినల్స్" గా, హిల్ ట్రయిబ్స్" గా,  "ఫారెస్ట్ ట్రయిబ్స్" గా రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రాధమిక దశలో అసలైన గిరిజనులు గుట్టలపైన, అడవుల్లోను, గుహలలోను, చెట్ల నీడలలోను నివసించేవారు. నాగరిక ప్రజలను చూడగానే వారిలో ఏదో భయం వేసేది. సాధారణంగా నీటి వసతి సహజసిద్ధంగా లభించే ప్రాంతాలనే వారు తమ నివాసాలుగా ఎంచుకునేవారు. ఒక ఆవాస స్థలమంతా కలిసి పది-పదిహేను గుడిసెల కంటే ఎక్కువ వుండకపోయేది. ఆ గుడిసెలకు కిటికీల లాంటివి కాని, తలుపుల లాంటివి కాని వుండకపోయేది. మట్టితో- వెదురు కర్రలతో తయారైన గుడిసెలోనే వారి నివాసం. ఇక వారి ఇంటి పేర్లు ఒక జంతువు పేరుకు సంబంధించి కాని, ఒక చెట్టుకు సంబంధించి కాని వుండేవి. ఇప్పటికీ ఇంకా అలానే వున్నాయనవచ్చు. ఉదాహరణకు "నక్కల", "మామిడి", "గుర్రం", "పాముల" లాంటి ఇంటి పేర్లతోనే వారిని సంబోధించేవారు.

ప్రభుత్వాలెన్ని మారినా గిరిజన సమస్యలు ఎప్పటికప్పుడు తెరమీదకొస్తూనే వుంటాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కలిసి వున్నప్పుడు, అప్పటి బ్రిటీష్ పాలన, గిరిజనులను జనజీవన స్రవంతిలో కలుపుతూ, మిగతా వారి మాదిరిగానే ఒకే గొడుగు కిందకు తెచ్చింది. కాకపోతే కొన్ని రాయితీలు కలిగించింది. ఒక రకమైన నిర్దిష్ట జాతికి-భాషకు చెందిన సామాజిక వర్గంగా ఆదివాసీలకు పూర్తి రక్షణలు కలిగిస్తూ, ఏజెన్సీ వ్యవస్థను 1839 చట్టం ద్వారా వలస పాలన ప్రవేశ పెట్టింది . అలా మొదలైంది గిరిజన సంక్షేమం. అయినా ఆదిలో ఎలా వుందో ఇంకా అలానే వున్నాయి వారి జీవన స్థితిగతులు.

ఈ నేపధ్యంలో, ఏ ప్రాంతంలోనైతే హేమెన్‍డార్ఫ్  ఆయన సతీమణి ఎలిజబెత్‌తో కలిసి, గిరిజనుల సంక్షేమం కొరకు ఏళ్ల తరబడి కృషి చేశారో, అవే పరిసరాలలో, వారిద్దరినీ శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు జ్ఞాపక చిహ్నాలను ఏర్పాటుచేయడం అభినందించాల్సిన విషయం. హేమెన్‍డార్ఫ్  భార్య ఎలిజబెత్ మరణానంతరం (హైదరాబాద్ లో) ఆమెను మర్లవాయి గ్రామంలోనే సమాధి చేసారు. అప్పుడక్కడ లేని హేమెన్‍డార్ఫ్, తనకూ ఆమె పక్కనే సమాధి కావాలన్న కోరికను వ్యక్త పరిచారు. ఆయన కోరినట్లు గానే అక్కడి గిరిజనులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు, ఇన్నేళ్లకు మళ్లా ఆ ప్రాంతానికి ఆయన కుమారుడు నికోలాస్, మనుమడు జూనియర్ హేమెన్‍డార్ఫ్ వచ్చి వారికి నివాళులర్పించడం విశేషం. End