Monday, December 3, 2012

మంత్రివర్గ సమిష్టి బాధ్యత: వనం జ్వాలా నరసింహారావు


మంత్రివర్గ సమిష్టి బాధ్యత
వనం జ్వాలా నరసింహారావు
నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ 
హైదరాబాద్
సూర్య దినపత్రిక (07-12-2012)
          
ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ విషయంలో సీబీఐ అభ్యర్థనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం, దానికి కారణం చూపుతూ, ఆ కేసుకు సంబంధించిన నిర్ణయం అలనాడు రాజశేఖర రెడ్డి కాబినెట్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెప్పింది. ఇప్పుడు ప్రాసిక్యూషన్ తిరస్కరించిన నిర్ణయాన్ని కూడా మంత్రి మండలి సమిష్టి నిర్ణయంగా చెప్పింది. ఐతే, మంత్రి మండలి సభ్యుడైన డిఎల్ రవీంద్రారెడ్డి మాత్రం, తానీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని, తన వ్యతిరేకతను "భిన్నాభిప్రాయ నోట్" గా నమోదు చేయాలని డిమాండు చేశాడు. కాబినెట్ తీసుకున్న నిర్ణయానికి తాను బద్ధుడిని కానని కూడా అన్నాడు. మరి కొంచెం ముందుకు పోయి, గవర్నర్‌కు కూడా తన భిన్నాభిప్రాయ నిర్ణయాన్ని తెలియచేసి, దానిని రికార్డు చేయాల్సిందిగా పట్టుబట్టాడు. డీఎల్ రవీంద్రారెడ్డి నిర్ణయాన్ని పరోక్షంగా విమర్శించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బహిరంగంగానే, ఆయన చర్యను తప్పు బట్టారు. మంత్రి మండలి నిర్ణయానికి మంత్రులందరూ కట్టుబడి వుండాల్సిందే నని. భిన్నాభిప్రాయానికి తావు లేదని, ఒక వేళ నిర్ణయంతో ఏకీభవించక పోతే, రాజీనామా చేయడమో, తానే ఆయనను తొలగించడమో చేయాల్సి వుంటుందని స్పష్టం చేసాడు. ధర్మాన ప్రసాద్ రావు విషయంలో జరిగిన ఈ వివాదాస్పద అంశం చర్చనీయాంశమే!

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకగా చెప్పుకునే బ్రిటన్‌లో మంత్రివర్గ సమిష్టి బాధ్యత అనేది ఒక సత్ సాంప్రదాయం. అనాదిగా వస్తున్న సదాచారం. దీనికి చట్టబద్ధత ఎంత మేరకున్నదని ప్రశ్నించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇంతకూ, మంత్రివర్గ సమిష్టి బాధ్యత ఎవరికి? మంత్రివర్గం ప్రభుత్వ విది-విధానాల మీద తీసుకున్న నిర్ణయానికి సమిష్టిగా చట్ట సభలకు బాధ్యత వహిస్తారని దానర్థం. సాధారణ పరిభాషలో మాట్లాడుకోవాలంటే, సమిష్టి బాధ్యత అనే సూత్రం కింద, మంత్రివర్గంలోని సభ్యులందరూ, ప్రభుత్వ విధి-విధానాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎవరు-ఎక్కడ-ఏ సందర్భంలో మాట్లాడినా, ఒకే విధంగా మాట్లాడాలన్న భావన వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడి ప్రజలను తికమక పెట్ట కూడదు. ప్రజల ముందుకు ప్రభుత్వ విధానాన్ని తీసుకెళ్లేటప్పుడు అందరి అభిప్రాయం ఒక్కటి గానే వుండాలి. ప్రభుత్వం ఇమేజ్ దెబ్బ తినకూడదు. మంత్రివర్గ సభ్యులంతా, అధికార పక్షంలో ఒక ఐక్య సంఘటనలాగా వుండాలి. ఒక వేళ ఎవరికైనా భేదాభిప్రాయం వుంటే, దానిని బయట పెట్టే ముందర మంత్రివర్గ సభ్యుడిగా రాజీనామా చేయడం కనీస ధర్మం. అలా జరిగినప్పుడు, రాజీనామా చేసిన మంత్రి అభిప్రాయం సరైందన్న వాదన బలపడితే, మిగిలిన మంత్రివర్గం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకోవచ్చు. మరో విధంగా చెప్పుకోవాలంటే, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించ లేకపోతే, బహిరంగంగా విమర్శించడం తప్పనిసరిగా మానుకోవాలి.


         రాజ్యాంగ పరంగా అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయం ద్వారా, మంత్రి మండలిలోని ప్రతి ఒక్క సభ్యుడు, కాబినెట్‌లో తీసుకున్న ప్రతి నిర్ణయానికీ, వ్యక్తిగతంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకమైనప్పటికీ, బహిరంగంగా, దానిని సమర్థించాల్సి వుంటుంది. అందులో భాగంగానే, ఆ నిర్ణయం విషయంలో ఒకవేళ చట్ట సభలలో ఓటింగు జరుగుతే దానికి అనుకూలంగా ఓటేయాల్సి వుంటుంది. వాస్తవానికి ఇలాంటి సాంప్రదాయమే కమ్యూనిస్టు దేశాలలో కూడా మరో విధంగా అమలులో వుంది. పార్టీ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే ఆ సాంప్రదాయానికి "ప్రజాస్వామ్య కేంద్రీకరణ" అని పేరు పెట్టుకున్నారు వాళ్లు. కాబినెట్ సమిష్టి నిర్ణయం అన్నా, బాధ్యత అన్నా ఒకటే. ఒక వేళ మంత్రివర్గంలోని ఏ ఒక్క సభ్యుడి పైనైనా చట్ట సబలలో అవిశ్వాస తీర్మానం పెడితే, అది యావత్తు మంత్రివర్గం మీద పెట్టినట్లే. అది సభ ఆమోదం పొందితే మంత్రులందరి మీద అవిశ్వాసమే కాని, కేవలం ఆ ఒక్క మంత్రిమీద మాత్రమే కాదు. అలాంటప్పుడు మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాల్సిందే! ఆ తరువాత కొత్త మంత్రివర్గం అన్నా ఏర్పడవచ్చు, లేదా, చట్ట సభలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలను జరపాల్సిన అవసరమైనా కలుగుతుంది. సమిష్టి బాధ్యతకు, వ్యక్తిగత బాధ్యతకు కొంచెం తేడా వుంది. వ్యక్తిగత బాధ్యత అంటే, మంత్రులు తమ శాఖకు సంబంధించిన దైనందిన కార్యకలాపాలలో  రోజువారీగా తీసుకునే నిర్ణయాలు అని అర్థం. వారికి కేటాయించిన శాఖల నిర్వహణ బాధ్యత వ్యక్తిగతమైనటువంటిది. అలా శాఖాపరంగా తీసుకునే నిర్ణయాలకు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్న వారు మాత్రమే బాధ్యులవుతారు.
          
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకగా భావించే బ్రిటన్‌లో, సమిష్టి బాధ్యత అనే సూత్రం, కేవలం మంత్రులకు మాత్రమే కాకుండా, మంత్రివర్గంలో పరోక్ష సభ్యులైన పార్లమెంటరీ ప్రయివేట్ సెక్రటరీలకు కూడా వర్తిస్తుంది. సమిష్టి నిర్ణయాల అమలు ఎలా వుండాలనే విధానాన్ని "మినిస్టీరియల్ కోడ్" లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాకపోతే, ఒకటి-రెండు పర్యాయాలు ఈ సూత్రాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. 1930 లో బ్రిటన్‌లో జాతీయ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు, మంత్రి మండలిలో భాగస్వాములుగా వున్న లిబరల్ పార్టీ సభ్యులకు "రక్షిత పన్నుల విధానం" విషయంలో కొంత వెసులుబాటు కలిగించడం జరిగింది. అదే విధంగా, 1975 లో, హెరాల్డ్ విల్సన్ ప్రధానిగా వున్నప్పుడు, యునైటెడ్ కింగ్ డం యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో కొనసాగాలా? వద్దా? అనే విషయంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగులో, తమకిష్టమైన విధంగా మంత్రివర్గ సభ్యులు ప్రచారం చేసుకోవచ్చని వెసులుబాటు కలిగించడం జరిగింది. కాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా, ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకత వ్యక్త పరిచిన క్లేర్ షార్ట్ ను మంత్రి మండలిలో కొనసాగడానికి, 2003 లో నాటి ప్రధాని టొనీ బ్లెయిర్ అంగీకరించడం మరో వెసులుబాటు. కాకపోతే, బహిరంగంగా కాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన షార్ట్ రాజీనామా చేయక తప్పలేదు. డేవిడ్ కామెరూన్ ప్రధానిగా వున్నప్పుడు, కన్సర్వేటివ్-లిబరల్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో వుండేది. కన్సర్వేటివ్ పార్టీ మంత్రుల నిర్ణయాన్ని బహిరంగంగానే లిబరల్ పార్టీకి చెందిన మంత్రులు విమర్శించే ఆనవాయితీ తలెత్తినప్పుడు. చేసేదేమీలేక, ప్రధాని మంత్రివర్గ సమిష్టి నిర్ణయం అనే సూత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. "వెస్ట్ లాండ్" విషయంలో 1986 లో, మార్గరెట్ థాచర్ మంత్రి మండలి సభ్యుడిగా వున్న, హాజెల్టైన్ రాజీనామా చేశాడు. వెస్ట్ లాండ్ వ్యవహారం థాచర్ ప్రభుత్వ హయాంలో తలెత్తిన ఒక పెద్ద రాజకీయ అపవాదు-కళంకం. అలనాటి యునైటెడ్ కింగ్ డం భవిష్యత్ హెలికాప్టర్ పరిశ్రమే ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన వ్యవహారం అది. రక్షణ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న మైఖేల్ హాజెల్టైన్ సూచనను మంత్రి మండలి తిరస్కరించింది. అమెరికన్ కంపెనీ చేతులలో వెస్ట్ లాండ్ ను విలీనం చేయాలన్న థాచర్ నిర్ణయంతో విభేదించిన హాజెల్టైన్  కాబినెట్ నుంచి వైదొలగాడు. ఆ తరువాత 1990 లో జరిగిన పార్లమెంట్ నాయకత్వ పోటీలో థాచర్ కు వ్యతిరేకంగా నిలుచుని ఓడిపోయాడు. అదే విధంగా 1990 లో యూరోప్ విధానం మీద కాబినెట్ తో ఏకీభవించని జాఫ్రీ రాజీనామా చేశాడు. విభేదించిన మంత్రులు వైదొలగారు కాని మంత్రి మండలిలో కొనసాగలేదు. ఇవన్నీ అతి కొద్ది ఉదాహరణలు మాత్రమే. ఏదేమైనా, బ్రిటన్ రాజ్యాంగంలో కాబినెట్ సమిష్టి బాధ్యత అనేది ఒక విడదీయలేని అనుబంధంలాంటి సాంప్రదాయం.

అలాంటప్పుడు మంత్రి మండలిలో సభ్యుడైనంత మాత్రాన, వ్యక్తిగతంగా ఒక శాఖను నిర్వహిస్తున్న మంత్రికి వ్యక్తిగత బాధ్యత లేదని అనుకోరాదు. తమ వ్యక్తిగత నడవడితో సహా, చట్ట సభలలో, గౌరవ సభ్యుల సందేహాలకు తమదైన శైలిలో నివృత్తి చేసే బాధ్యత మంత్రులందరి మీదా వుంటుంది. తమ శాఖలకు సంబంధించిన బిల్లులను చట్టసభలలో ప్రవేశ పెట్టే బాధ్యత కూడా వ్యక్తిగతంగా మంత్రులదే. వారు ప్రవేశ పెట్టిన బిల్లులతో సహా, వారి శాఖలు చెందిన పలు అంశాలపై చట్ట సభలకు వారే జవాబుదారీ అవుతారు. సభ్యుల ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా-మౌఖికంగా సమాధానాలివ్వడం, వారు పలు నిబంధనల కింద లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వడం, చట్ట సభల కమిటీల ముందు హాజరై వివరణలు ఇవ్వడం, చట్ట సభల ఉప సంఘాలలో సభ్యుడిగా తమ బాధ్యతలు నిర్వర్తించడం లాంటివి వ్యక్తిగత బాధ్యతలే. ఇవన్నీ వారి వ్యక్తిగత హోదాలో, కార్య నిర్వహణ బాధ్యతలలో భాగంగా చట్ట సభలకు జవాబుదారీగా వుండే ప్రక్రియ మాత్రమే. మరో విధంగా చెప్పుకోవాలంటే, చట్ట సభల ద్వారా, ఓటర్లకు-ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించడమే! వ్యక్తిగత బాధ్య అనే సాంప్రదాయం-చట్టం కింద, తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహారాల విషయంలో విధాన పరమైన-పాలనా పరమైన సీరియస్ తప్పులు దొర్లినా, వ్యక్తిగతంగా తప్పుడు విధానాలు అవలంబించినా, తప్పుడు పనులకు ప్రేరేపించినా, తన శాఖకు సంబంధించి రాబోయే పరిణామాలను ఊహించలేకపోయినా బాధ్యతల నుంచి తప్పుకోవడానికి రాజీనామానే పరిష్కారం. అలాంటి ఉదాహరణలూ కోకొల్లలు. 982 లో, ఫాల్క్ లాండ్స్ పై అర్జెంటీనా దాడి చేయబోతోందన్న విషయాన్ని ముందుగానే పసిగట్ట లేక పోయిన నాటి బ్రిటన్ విదేశాంగ మంత్రి లార్డ్ కారింగ్ టన్ తన సహాయకులైన ఇద్దరు జూనియర్ మంత్రులతో సహా రాజీనామా చేయాల్సి వచ్చింది. అలానే వైవాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చిన కన్సర్వేటివ్ మంత్రి సిసీల్ పార్కిన్ సన్ 1980 నాటి రాజీనామా. ఇటీవలి కాలంలో బ్రిటీష్ మంత్రిగా రాజీనామా చేసిన పీటర్ మాండిల్ సన్ వ్యవహారం కూడా వ్యక్తిగతంగా తప్పుడు నడవడి కలిగి వుండడమే! చట్ట సభలను తప్పు దోవ పట్టించిన మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలూ లేకపోలేదు.

ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే మంత్రి మండలి సక్రమంగా వ్యవహరించాలి. మంత్రి మండలిలోని ప్రతి సభ్యుడూ బాధ్యతాయుతంగా నడచుకోవాలి. ఎవరి దారి వారిదే అనుకోరాదు. తమ సహచరులు తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించి, ఆ నిర్ణయాన్ని అన్ని వేళలా సమర్థించడం సమంజసం. అలా చేయలేక పోతే రాజీనామా చేసి మంత్రి మండలి నుంచి వైదొలగడం మంచిది.

ఈ నేపధ్యంలో మంత్రి మండలికి ధర్మాన ప్రసాద రావు చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించినట్లయితే బాగుండేది. అలా కాకపోయినా కనీసం ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యక్తిగత ఖాతాలోకి పంపి వుండాల్సింది. ఈ రెండింటికి విరుద్ధంగా వాటిని కాబినెట్ సమిష్టి నిర్ణయంగా చూపడానికి ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా, ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ కు అనుమతి నిరాకరిస్తూ దానిని మంత్రివర్గ నిర్ణయంగా చూపాడు. డీఎల్ విభేదించాడు. కాని డీఎల్ కు వేరే దారి లేదు. ఎంతవరకైతే అది సమిష్టి నిర్ణయం అవుతుందో, దానికి డీఎల్ కట్టుబడి అన్నా వుండాలి, లేదా, రాజీనామా అన్నా చేయాలి.

Sunday, December 2, 2012

వామ పక్ష ఐక్యత అత్యంత అవశ్యం: వనం జ్వాలా నరసింహారావు



వామపక్ష ఐక్యత మిధ్యేనా?
సూర్య దినపత్రిక 
(14-12-2012) and (16-12-2012)
వనం జ్వాలా నరసింహారావు

భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్సలైట్లుగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగే యులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి సైద్ధాంతిక విభేదాలతో సహా అనేక కారణాలున్నాయి. ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, భారత దేశంలో కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. ఎం ఎన్ రాయ్ పట్ల సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఏర్పడ్డ విశ్వాసం, 1920 లో, తాష్కెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు దోహదపడింది. భారత దేశానికి మరి కొద్ది రోజుల్లో స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. దరిమిలా, మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్ చీలికకు పునాదులు పడ్డాయి. పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్ గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్ గా నియమించింది. యుద్ధం నేపధ్యంలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన "చైనా అనుకూల వాదులు" గా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.

క్రమేపీ సంభవించిన పరిణామాల మూలంగా పార్టీలో చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964 లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు.

కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా-ఆ తరువాత పన్నెండు గా చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి, ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. 1981 లో, భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాంగేను, పార్టీ నుంచి బహిష్కరించారు. డాంగేను ఆయన కూతురు సారధ్యంలో ఆవిర్భవించిన "అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీకి" ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత. ఆ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల సాధ్య పడకపోవడంతో, మోహిత్ సేన్ నాయకత్వంలో పనిచేస్తున్న "ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ" తో కలిసిపోయి "యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ" గా విలీనమయింది. మరోవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పరిస్థితీ అంతే అనాలి.  ఆంధ్ర ప్రదేశ్ లో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఓంకార్ కూడా పార్టీని వదిలి వేరే కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పారు. అదే విధంగా నల్గొండకు చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, తెలంగాణా సాయుధ పోరాట వీరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి కూడా పార్టీని వీడి మరో పార్టీ పెట్టారు. అఖిల భారత స్థాయిలో సోమనాథ్ ఛటర్జీ స్థాయి నాయకులనుంచి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్ట బడ్డ పలువురిని పార్టీ వదిలించుకుంది. మరోవైపు ఆ పార్టీ నుంచి నక్సల్‍బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన తీవ్రవాదులు, మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నారింకా.


ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి (ఉభయ) కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ 1989 లో అధికారం కోల్పోయింది. 1949  లో అధికారంలో కొచ్చిన చైనా పార్టీలోను మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీల వ్యూహం ఎలా వుంటుందో చూడాలి.

కేరళలో ప్రభుత్వాలు మారినా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీకి, ఓటింగ్ శాతంలో పెద్దగా మార్పుండదు. కేవలం రెండు శాతం తేడాతో అటు కాంగ్రెస్ కాని, ఇటు సిపిఎం సారధ్యంలోని వామపక్ష కూటమి కాని పాలన సాగిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే, ఇప్పటికీ 40% ఓట్లు సిపిఎం ఖాతాలో వున్నాయి. మరెందుకు సిపిఎం అక్కడ ఓడిందంటే దానికి కారణాలు అనేకం వున్నాయి. ప్రధాన కారణం రాజకీయమే! ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ నెలకొని వుండేది. 1977 నుంచి మొన్న ఓడి పోయేంతవరకూ అదే పరిస్థితి కొనసాగింది. ఆ నేపధ్యంలో తనకున్న బలంతో సిపిఎం సులువుగా గెలవడం సాధ్యపడింది. మొట్టమొదటి సారిగా, 2011 లో జరిగిన ఎన్నికలలో, కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్-కొన్ని ముస్లిం సంస్థలు-మావోయిస్టుల ఐక్య సంఘటనతో పోటీ చేసి ఓటమిపాలైంది సిపిఎం. అందరూ ఆ పార్టీ ఓటమికి కృషి చేశారు. ఆ పార్టీలలో ఏ ఒక్క దాన్నైనా బహుశా సిపిఎం అవలీలగా ఓడించి వుండేదేమో! ఎందుకు అన్ని పార్టీలు సిపిఎం కు వ్యతిరేకంగా అలా ఐక్యం అయ్యాయి? కారణాలు అనేకం.

పశ్చిమ బెంగాల్‌లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంటే, తృణమూల్ కాంగ్రెస్ బలపడ సాగింది. ఆ పరిస్థితుల్లో కొంత రాజీ మార్గాన్ని అనుసరించి తృణమూల్ కాంగ్రెస్ తో సంధి కుదుర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ బాధ్యత నెత్తి నేసుకుని విజయం సాధించింది ప్రణబ్ ముఖర్జీ. మరి ముస్లింలకు ఎందుకు దూరమైంది సిపిఎం సారధ్యంలోని వామపక్ష ఐక్య సంఘటన? నందిగ్రాం కాల్పుల సంఘటనలో ముస్లింల మరణం వారిని సిపిఎంకు దూరం చేసింది. నందిగ్రాం సిపిఐ స్థానం. దానికి తోడు రాష్ట్రంలో అక్కడక్కడ చోటు చేసుకున్న మత కలహాలు కూడా ముస్లింలను వామపక్షాలకు దూరం చేసింది. సచార్ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింది. రాష్ట్రంలో ముస్లింల వెనుకబాటు తనాన్ని ఉదహరించింది. ఒక విధంగా ఆ నివేదిక సిపిఎం కళ్లు తెరిపించింది. సిపిఎంకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సచార్ కమిటీ నివేదికను ఉపయోగించుకున్నాయి. వాస్తవానికి సిపిఎం సారధ్యంలోని వామపక్ష ప్రభుత్వంలో ముస్లింలకు సామాజికంగా-రాజకీయంగా పెద్ద ఎత్తున లాభం చేకూరింది. అది వేరే విషయం.

ఇదిలా వుండగా పశ్చిమ బెంగాల్ లో అంతో-ఇంతో ప్రాబల్యం వున్న మావోఇస్టులు సిపిఎం పట్ల వున్న వ్యతిరేకతతో, వాళ్లకు పూర్తి ఆధిక్యం వున్న లాల్ గఢ్ లాంటి ప్రాంతాలలో గట్టి పోటే  ఇవ్వడంతో, వామపక్షాలకు అదనంగా నష్టం వాటిల్లింది. పార్టీకి చెందిన కొందరు మేధావులు మావోఇస్టులపై చర్యలు తీసుకోవడానికి వ్యతిరేకత చూపించడంతో, సిపిఎం నాయకత్వాన వున్న ప్రభుత్వం కొంత వారిపట్ల సంయమనం పాటించాల్సి వచ్చింది. ఆ కారణంగా వారు బలపడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారయ్యారు. వారు ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ కు సిపిఎంకు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినప్పటికీ, దరిమిలా, ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. వామపక్ష ఓటమికి మరో కారణం వారిలోని అనైక్యత కూడా. పశ్చిమ బెంగాల్ వామపక్ష కూటమిలో తలెత్తిన అభిప్రాయ భేదాలు, సిపిఎంపై ధిక్కార ధోరణి, కాంగ్రెస్ పార్టీపై స్థిరంగా పోరాడటానికి అవరోధాలయ్యాయి. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు కాకుండా త్రిపురలో కూడా వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం బలంగా వున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు మినహాయిస్తే దేశంలో ఎక్కడా అవి నామ మాత్రపు పోటీ కూడా ఇచ్చే స్థితిలో లేవని అనవచ్చు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికొస్తే, 1964 చీలిక తరువాత, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో మాదిరి కాకుండా, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా చీలిపోయి, సిపిఎం-సిపిఐ లు దాదాపు చెరి సమానంగా పార్టీ కాడర్ ను పంచుకున్నాయి. కాకపోతే, నాయకత్వం చాలా మటుకు సిపిఐ వైపు మొగ్గితే, సభ్యుల పరంగా, పరపతి పరంగా-పలుకుబడి పరంగా సిపిఎం వైపుకు మళ్లింది. ఆస్తులు, వార్తా పత్రిక, కార్యాలయాలు దాదాపు మొత్తంగా సిపిఐకి దక్కాయి. ఇతర రాష్ట్రాల కంటే, సరి సమానంగా వున్న ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య పోరాటం ప్రారంభమైంది. ఈ పోరాటానికి ప్రధాన కేంద్రం ఖమ్మం జిల్లా కావడం విశేషం. దీనికి కారణం లేకపోలేదు. జిల్లాలో సిపిఐ కాడర్ రీత్యా బలహీనంగా వున్నప్పటికీ, నల్లమల గిరిప్రసాద్ లాంటి రాష్ట్ర స్థాయి నాయకులు ఆ జిల్లాలో వుండడం జరిగింది. ఐనప్పటికీ, ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులలో చాలా మంది (చిర్రావూరి, మంచికంటి, బోడేపూడి, డాక్టర్ వై.ఆర్.కె, పర్సా, కె ఎల్), కాడర్ లో 90% మంది, సిపిఎంతో వుండి పోయారు. పక్కనే వున్న కమ్యూనిస్ట్ లకు బలమైన మరో జిల్లా నల్గొండలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆ జిల్లాలో మూడింట రెండు వంతుల మంది సిపిఎంతో, ఒక వంతు మంది సిపిఐతో వుండి పోయారు. జిల్లా నాయకత్వం సరి సమానంగా చీలిపోయిందనవచ్చు. భీమిరెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి వారు సిపిఎంతో, ధర్మ భిక్షం, ఆరుట్ల దంపతులు సిపిఐతో వుండి పోయారు. వ్యక్తిగతంగా ధర్మ భిక్షం, ఆరుట్ల దంపతులు బహుళ జనాదరణ పొందిన నాయకులు. అలానే సిపిఎం పక్షాన వున్న వారు కూడా. ఈ కారణాన ఆంధ్ర ప్రదేశ్ లో సరి సమాన బలంతో వున్న సిపిఐ, సిపిఎంల మధ్య తరచూ ఘర్షణలు తలెత్తడం మొదలైంది. ఖమ్మం, నల్గొండ జిల్లాలలో అవి ఎక్కువ మోతాదులో జరిగేవి. ఇరు వైపులా హత్యా రాజకీయాలకు బలైన వారూ లేకపోలేదు. ఖమ్మం ఎమ్మెల్యేగా-సుజాత నగర్ ఎమ్మెల్యేగా దీర్ఘకాలం వున్న రజబ్ అలీ ఎప్పుడైతే సిపిఎంను వదిలి వెళ్లాడో, అప్పుడే పార్టీ కొంత బలహీన పడే పరిస్థితులు ఎదురయ్యాయి జిల్లాలో. కారణం అతడికి పార్టీ కాడర్ ఆదరణ వుండడమే. ఆయనో మాస్ లీడర్ కావడమే. ఈ కారణాల వల్ల ఖమ్మం జిల్లాలో ఏ ఘర్షణ తలెత్తినా, సిపిఎం, సిపిఐ చెరో పక్కన మద్దతు ఇవ్వడం ప్రారంభమైంది. అస్తిత్వం కోసం, గుర్తింపు కోసం సిపిఐ పోరాడుతుంటే, వున్న పట్టును బిగింపు చేయడం కోసం, మరింత ఆధిపత్యం కోసం సిపిఎం పోరాడ సాగింది. ప్రతి చిన్న విషయం సీరియస్ గా తీసుకోవడంతో ఘర్షణలు హత్యా రాజకీయాలుగా మారిపోయాయి. ఇరువైపులా చాలా మంది చనిపోయారు. సిపిఎం పక్షాన వున్న వారు అధికంగా మంది హత్యకు గురయ్యారు.

ఖమ్మం జిల్లా పోరాట ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడసాగింది. రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల మధ్య వివాదాలకు-విభేదాలకు మరింతగా దారి తీసింది. పర్యవసానంగా ఎన్నికల రాజకీయాలపై ఆ ప్రభావం పడింది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత కూడా, రాష్ట్రం మొత్తం మీద ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరినా ఖమ్మం జిల్లాలో కుదర లేని పరిస్థితి తలెత్తింది. 1975 లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఖమ్మం జిల్లా సిపిఎం నాయకత్వం మొత్తం అరెస్టుకు గురి కావడంతో, లేక, అజ్ఞాతవాసానికి పోవడంతో, సిపిఐ రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రయత్నించింది. అప్పట్లో సిపిఐ ఎమర్జెన్సీకి, ఇందిరా గాంధీకి మద్దతిచ్చింది. ఇందిరా గాంధీ ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమానికి మద్దతిచ్చింది. ఆ తరువాత ఎమర్జెన్సీ అనంతరం 1977 లో జరిగిన ఎన్నికలలో, ఖమ్మంలో ఇరువురూ, ఒకరి మీద మరొకరు పోటీ చేశారు. ఆ ఎన్నికలలో సిపిఐని దాదాపు ఓటర్లు తిరస్కరించారు ఆ జిల్లాలో. సిపిఎంకు ఆధిక్యత వచ్చింది. దరిమిలా భటిండాలో జరిగిన సిపిఐ మహా సభలో, ఎమర్జెన్సీకి, ఇందిరా గాంధీకి మద్దతిచ్చినందుకు పశ్చాత్తాపం వెలిబుచ్చుతూ తీర్మానం చేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్పని ఒప్పుకున్నారు. సిపిఎంకు స్నేహ హస్తం అందించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని, వామపక్ష ఐక్యత అంటూ నినాదం అందుకుంది సిపిఐ. 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, దేశం మొత్తం మీద సిపిఐ-సిపిఎంలు ఎన్నికల అవగాహన కొచ్చాయి. సిపిఐ తన పంథా మార్చుకుంది. ఖమ్మంలో మళ్లీ విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. రెండు పార్టీలు ఒకరి మీద ఇంకొకరు పోటీ చేసుకున్నాయి. కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు మెండుగా వున్న నేపధ్యంలో సిపిఐ అడ్డు పుల్ల వేసింది. జనతా పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చింది. జలగం కాంగ్రెస్ తో చేతులు కలిపింది. రాష్ట్రం మొత్తం మీద ఐక్యత వాతావరణం చెడిపోవడానికి ఖమ్మం కేంద్రమైంది. ఖమ్మం జిల్లా కీచులాటలు రాష్ట్రం మొత్తం మీద పడ్డాయి మరో మారు. ఆ తరువాత 1984 ఎన్నికలలో సిపిఐ, సిపిఎంలు రెండూ పోటీ చేశాయి ఖమ్మంలో. తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎన్టీ ఆర్ సిపిఎంకు మద్దతు ప్రకటించినా, స్థానిక కాడర్ కొందరు ఉపేంద్రయ్య ప్రేరణతో లోపాయకారీగా-బహిరంగంగా సిపిఐకి ప్రచారం చేయడంతో ఓట్లు చీలి పోయి జలగం వెంగళ్ రావు గెలిచారు. 1989 లో సిపిఐ బహిరంగంగా సిపిఎంకు మద్దతిచ్చినా, లోపాయకారీగా వ్యతిరేకించడంతో మళ్లీ జలగం గెలువగలిగారు. అదే పరిస్థితి 1991 లో కూడా. 1996 లో తెలుగు దేశం మద్దతుతో సిపిఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం గెలిచాడు. 1998, 1999 2004, 2009 ఎన్నికలలో పరిస్థితిలో మార్పు లేదు. కమ్యూనిస్టులు గెలవలేక పోయారు.

వామపక్ష ఐక్యత దెబ్బతినడానికి, ఒక విధంగా చెప్పుకోవాలంటే, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ రాజకీయాలే ప్రధాన కారణం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. 1967 లో సిపిఎంలో చీలిక వచ్చి నక్సలైట్లు విడిపోయారు. విడిపోవడానికి కొన్ని రోజుల ముందర పాలకొల్లులో సిపిఎం సమావేశమైంది. ఆ సమావేశంలో అధిక సంఖ్యాక సభ్యులు నక్సలైట్ ఉద్యమానికి మద్దతు పలికారు. మరో విధంగా చెప్పుకోవాలంటే పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య, మోటూరి మినహా సిపిఎం రాష్ట్ర స్థాయి అగ్ర నాయకత్వంలో చాలా మంది ఉద్యమానికే తమ మద్దతన్నారు. అలా మద్దతిచ్చిన తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర రావు, కొల్లా వెంకయ్య ప్రభృతులంతా అగ్ర శ్రేణి నాయకులే. మోటూరు హనుమంతరావు సతీమణి ఉదయం కూడా వారి పక్షానే మాట్లాడింది. సుందరయ్య గారిని ఆ సమావేశంలో దాదాపు మాట్లాడనివ్వలేదు. మొత్తం మీద నక్సలైట్ చీలిక సిపిఎంకు రాష్ట్ర స్థాయిలో పెద్ద నష్టమే మిగిల్చింది. కాకపోతే ఖమ్మంలో అంతగా ప్రభావం పడలేదు. సాయుధ పోరాటమే పరమావధిగా భావించిన నక్సలైట్లతో వామపక్ష ఐక్యతనేది సాధ్య పడేది కాని విషయం. ఇక సిపిఐ, సిపిఎం విభేదాలు అధికమవుకుంటూ, సంచిత ప్రభావం చూపడంతో, వారిరువురి మధ్య కూడా ఐక్యత పొసగడం కష్టమై పోయింది. వీటికి తోడు "వ్యక్తిగత అహం", ఒకరిని మరొకరు దెబ్బతీయాలనే బలీయమైన భావన ఐక్యతకు అడ్డు పడ్డాయి. ఉదాహరణకు 1999 లో జరిగిన ఎన్నికలలో ఖమ్మం నియోజక వర్గం పోటీ తీసుకుందాం. అధికారికంగా ఆ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వర రావుకు సిపిఎం పార్టీ మద్దతు ప్రకటించింది. కాని జిల్లా నాయకత్వం పువ్వాడను ఓడించే ప్రయత్నం చేశారు. ఓడించారు కూడా. చివరకు రాష్ట్ర స్థాయి అగ్రనాయకత్వానికి కూడా అందులో అంతో ఇంతో భాగం వుందనే విషయం అప్పుడు బహిర్గతమైంది కూడా.

ఇప్పుడున్న పరిస్థితులలో వామపక్షాలు కలిసి పనిచేయకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకమే! ఎందుకని ఐక్యత అత్యవసరం అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీలు క్రమేపీ బలహీన పడడానికి అనైక్యత కూడా ఒక కారణం కాదా? అని ప్రశ్నించుకోవాలి. అలాంటప్పుడు ఐక్యతకు ఏం చేయాలి? అన్నింటికన్నా ఉత్తమమైంది విలీనం కావడం. కాని అది ఇప్పుడు సాధ్యపడదే! "రెండు కత్తులు ఒక ఒరలోఇమడడం" సాధ్యమా? మరేం చేయాలి? గతంలో చేసిన కొన్ని తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవడం ఇరు పార్టీల ప్రధమ కర్తవ్యం. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలనే తీసుకుందాం. సిపిఎం పార్టీలో అంతర్గతంగా, ప్రజారాజ్యం పార్టీతో కలిసి పోటీ చేయాలా? వద్దా? అన్న చర్చ వచ్చింది. పార్టీ సచివాలయ సభ్యులలో మెజారిటీ మంది పీ ఆర్ పీతో పోవాలని తీర్మానించారు. కాని జరిగిందేమిటి? పోలిట్ బ్యూరో చెప్పిందని అంటూ, మహా కూటమితో కలిసి పోటీ చేశారు. అది పెద్ద తప్పు. అలాంటి ఎన్నికల పొత్తు తప్పులు గతంలో కూడా చేసారు. సిపిఐ అదే పొరపాటు చేసింది. ఇద్దరూ ఒకే కూటమిలో వున్నా ఐక్యత లేదనే అనాలి. అదే విధంగా 2004 లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి తప్పు చేశాయి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీతో పోటీ చేస్తూ, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో కలిసి పోటీ చేయడం ఎంతవరకు సబబు? బషీర్ బాగ్ కాల్పుల నేపధ్యంలో, ఏదో విధంగా తెలుగు దేశాన్ని ఓడించాలనుకున్నారే కాని, భవిష్యత్ లో జరగనున్న పరిణామాలను ఊహించలేకపోయారు. అలాగే, 2009 లో ముదిగొండ కాల్పుల నేపధ్యంలో కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా మహా కూటమితో చేతులు కలిపారు. తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు సిపిఎం కార్యాలయానికి రావడం, ఆయనను వెళ్లేటప్పుడు కారు వరకూ నాయకులు సాగనంపడం మీడియాలో చూశాం. అలానే ప్రజా రాజ్యాన్ని కాదనడం జరిగింది. బర్ధన్ తో చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లడానికి నిరాకరించిన సిపిఐ నాయకుడు నారాయణ, చివరకు జాతీయ నాయకత్వం సూచనతో తెలుగుదేశం వున్న మహా కూటమిలో చేరడానికి అంగీకరించాడు.

వామపక్ష పార్టీలు దెబ్బతినడానికి రాష్ట్రీయ, జాతీయ కారణాలతో పాటు అంతర్జాతీయ కారణాలు కూడా లేకపోలేదు. సోవియట్ యూనియన్ లో కమ్యూనిస్ట్ పతనం పెద్ద దెబ్బే తీసింది. ఆ దేశం నుంచి వచ్చే కమ్యూనిస్ట్ భౌతిక, మేధో సామగ్రి ఆగిపోయింది. నైతికత దెబ్బ తినింది. ఇదొక పెద్ద కారణంగా భావించవచ్చు. అదే విధంగా 1978 తరువాత చైనా అవలంబిస్తున్న నూతన ఆర్థిక విధానం కూడా కొంత కారణం అనాలి. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా బలంగా వున్నప్పటికీ, అలనాటి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంలో కొంత మార్పు కొట్టొచ్చినట్లు కనపడ సాగింది. సామ్యవాదం చివరి మెట్టు అనేది, నూతన ప్రజాస్వామ్యం మధ్యే విడత అన్న నినాదంతో ఆర్థిక విధానంలో మార్పులు తెచ్చింది చైనా ప్రభుత్వం. "సామ్యవాద మార్కెట్ ఎకానమీ" అన్న నినాదం కూడా తెచ్చారు. దీంతో, చైనా పెట్టుబడిదారీ విధానం వైపు దృష్టి సారిస్తున్నదన్న పేరు వచ్చింది. సామ్యవాదం విఫలమవుతున్న దని, దానికి ఇక భవిష్యత్ లేదని భావించే స్థితికి చాలా మంది వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీది బూజుపట్టిన సిద్ధాంతం అనే ప్రచార వాతావరణం నెలకొంది. కమ్యూనిజాన్ని వీడడం వల్లనే చైనా విజయాలను సాధిస్తోందని కూడా అనడం మొదలైంది. ఇదిలా వుండగా, మరో పక్క అమెరికా తిరుగులేని శక్తిగా ప్రపంచంలో ఎదగ సాగింది. ఈ నేపధ్యంలో భారత దేశంలోని వామపక్ష ఉద్యమం కూడా కొంత దెబ్బ తినింది. 

వామ పక్ష ఉద్యమం ఇబ్బందులకు లోను కావడానికి మరో కారణం, 1991 తరువాత భారత దేశంలో అమల్లోకి వచ్చిన నూతన ఆర్థిక విధానం అని చెప్పుకోవచ్చు. దేశంలో పేదరికం ఒకవైపు వుండగా, ఒక సంపన్న మధ్యతరగతి పెరుగుతున్నది. అది నోరున్న వర్గం. దానికి అన్ని ప్రచార వనరులు వున్నాయి. జనం నూతన ఆర్థిక విధానాలవైపు మళ్లించగల వనరులవి. ఆ వర్గాలను ఎలా ప్రభావితులను చేయాలో ఇంకా వామ పక్షాలకు తెలియడం లేదు. ఆ విధానాన్ని అర్థం చేసుకోవడంలో వామ పక్షాలు కొంత అవగాహనా లోపానికి గురయ్యాయి. ఫలితంగా వామ పక్షాలు బలహీన పడసాగాయి. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత వామపక్షాలపైన వుంది. అది విడి-విడి పోరాటాలతో కుదరదు. తదనుగుణమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన పాత్ర కూడా వుంది. చీలిపోయిన వామ పక్షాలకు ఇది సాధ్యపడని విషయం. సైద్ధాంతిక పరంగా, ఆర్థిక అంశాల పరంగా ఎదుర్కోవాలి. అదే విధంగా ప్రస్తుతం నెలకొన్న పోటీ తత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నా, నైతికంగా ఆ శక్తిగలది ఒక్క వామపక్షానికే. బీదరికానికి వ్యతిరేకంగా పోరాడాలన్నా వామ పక్షాలకే చేతనవుతుంది. అందుకే ఐక్యత అత్యంత అవసరం. విలీనమా ఎలాగూ సాధ్య పడదు. కనీసం కలిసి మెలిసి ఐక్యంగా పోరాటమన్నా చేయాలి. తప్పదు.

అలాంటప్పుడు వామ పక్ష ఐక్యతకున్న అవరోధాలేంటి? మొదటిది-ముఖ్యమైంది, "వ్యక్తిగత అహం". రెండోది, ఇరు పార్టీలకున్న"ఆస్తులు". మూడోది, "గుర్తింపు". ఎవరి చైతన్య వేదికలు వారికే వున్నాయి. ఎవరి విద్యార్థి యూనిట్లు వారికే వున్నాయి. ఎవరి రైతు సంఘాలు వారికే వున్నాయి. ఎవరి ప్రజా సంఘాలు వారికే వున్నాయి. అలానే మిగాతావి. పార్లమెంటులో పని చేయడానికే, నాలుగు ప్రధాన వామ పక్షాల మధ్య సరైన అవగాహన లేదింతవరకు. ఉదాహరణకు అణు బిల్లే తీసుకోవచ్చు. ఎవరి దారి వారిదే ఐందప్పుడు. అంతెందుకు...సిపిఎం సభ్యులలో-నాయకత్వంలో భేదాభిప్రాయాలు పొడచూపాయి. సాక్షాత్తు సోమనాథ్ ఛటర్జీలాంటి వారే బయటకు పోవాల్సి వచ్చింది. సిపిఎం అలనాటి యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తరువాత మూడో ఫ్రంట్ స్థాపించడానికి సిద్ధపడ్డాడు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్. ఆ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతో, వామ పక్ష ఐక్యత దెబ్బ తినింది. అలాంటి అవరోధాలెన్నో! ఆంధ్ర ప్రదేశ్ విషయానికొస్తే, ఉదాహరణలుగా పోలవరం ప్రాజెక్ట్, తెలంగాణ ఉద్యమం తీసుకోవచ్చు. అటు సిపిఐ ఒకటి చెప్తే, మరో వైపు సిపిఎం ఇంకోటి చెప్తుంది. పరిష్కారానికి చెరో మార్గం సూచిస్తారు నాయకులు. ఉద్యమించడానికి చెరో జండా పట్టుకుని బయల్దేరుతారు. కలిసి ఎందుకు పోకూడదు? ఇలాంటి పలు సమస్యల విషయంలో, సిపిఐ, సిపిఎం పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి రాలేవా? ఒకే విధానం అవలంభించడం అంత కష్టమైన పనా? ఇలాంటి వాటి మీద మాట్లాడకుండా ఐక్యత ఎలా సాధ్యం?

ఎవరికైనా తమ సిద్ధాంతాలపైన, తమ పార్టీ పైన, అమితమైన విశ్వాసం వుండడం సహజం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, స్థూలంగా సామ్యవాదానికి అనుకూలమైన వ్యక్తులు-సంస్థలు కూడా కాలానుగుణంగా తమ విధానాలను మార్చుకోవడం జరుగుతున్నది. మెరుగులు దిద్దుకోవడం కూడా గమనిస్తూనే వున్నాం. 19-20 శతాబ్దాలకు చెందిన ఒక సిద్ధాంతంగా మార్క్సిజం చాలా గొప్పది. ఆ సిద్ధాంతం అజేయం. దానిని ఒక  మౌలిక సిద్ధాంతంగా అంగీకరిస్తూనే, చైనా, క్యూబా, వియత్నాం లాంటి చాలా దేశాలలో, అక్కడ నెలకొన్న దేశకాల పరిస్థితులను బట్టి తమ విధానాలను, ఎత్తుగడలను మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. కొందరు మార్క్సిస్టు మేధావుల ఇటీవలి రచనలు కూడా ఇలాంటి మార్పులనే సూచిస్తున్నాయి. మార్క్సిస్టు పార్టీ కూడా 1964 లో తనకు తానే రచించుకున్న కార్యక్రమంలోని ఐదారు సూత్రీకరణలను 2000 సంవత్సరంలో సవరించుకుంది. అలాంటి సవరణలు, మార్పులు అనివార్యం-అవసరం-ఆహ్వానించదగ్గది.

కాక పోతే, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలలో ఇటీవల దురదృష్టవశాత్తు ఒక అధికార స్వామ్య ధోరణి బలపడి పోతుంది. తాము చెప్పిందే వేదం అన్న భావన నుండి బయట పడలేక పోతున్నారు. మరింత మంది మిత్రులను సంపాదించుకోవడమెలా? ప్రజలను అధికంగా ఆకట్టుకోవడం ఎలా? అన్న దానికి భిన్నంగా, శత్రువులను పెంచుకుంటూ పోయే ధోరణి, మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకునే ధోరణి పెరుగుతుంది. తమతో నూటికి నూరు శాతం ఏకీభవించిన వారే మిత్రులుగా, ఒక్క శాతం విబేధించినా శత్రువులుగా పరిగణిస్తున్నారు. తమ చుట్టూ తామే కాంక్రీటు గోడలు కట్టుకునో, లేక, వెనుకటి సుశ్రోత్రియులలగా మడి కట్టుకునో వుంటున్నారు. విమర్శలు సహృదయంతో స్వీకరించడం తగ్గిపోతుంది. వారి ఉపన్యాసాలలో, వ్యాసాలలో పార్టీ వ్యతిరేకులు-ద్రోహుల లాంటి పదాలు పుష్కలంగా దొర్లుతుంటాయి. వారితో కలిసి కూర్చోవడం, మాట్లాడడం కూడా అసభ్యం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక్కసారి వెనుతిరిగి చూసుకునే ఓపిక, సహనం వుంటే అది విదితమవుతుంది. ఒక నాడు విమర్శించిన-విమర్శలకు గురైన వారితోనే, తొమ్మిది పార్టీలని, పదకొండు పార్టీలని ఐక్య వేదికలని గర్వంగా చెప్పుకోవడం ఎలా వుంటుంది? అలాగే, తమతో విభేదించే వారిపై సామాజిక వెలి చేయించే వరకూ వెళ్తోంది. పార్టీలో వుంటూ అనేక త్యాగాలు చేసిన వారు ఈ నాడు ఏ కారణంగానైనా విభేదిస్తే, బహిష్కృతులై ఇతర పార్టీలలోకి వెళ్తే, వారు చచ్చినా, వారింట శుభ కార్యం జరిగినా, వెళ్ల రాదంటూ ఆంక్షలు, ఆజ్ఞలు జారీ చేసే వరకు వీరి జాడ్యం ముదురుతున్నది. ఇవి చిన్న విషయాలుగానే కనిపించవచ్చు. ఈ ధోరణి విశాల వామ పక్ష ఐక్య వేదిక నిర్మాణానికి దీర్ఘకాలికంగా దాటలేని అడ్డంకులుగా మారుతాయి. పార్టీల నాయకత్వాలు, కాడర్ కూడా, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలివి.

ఐనా వామ పక్ష ఐక్యత అత్యంత అవశ్యం!

Thursday, November 29, 2012

ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు


ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (01-12-2012
          
2009 లోక్ సభ ఎన్నికల అనంతరం ఏర్పాటైన యుపిఎ లో, భాగస్వామ్య పక్షాలుగా తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఎన్సీపి, నేషనల్ కాన్ఫరెన్స్, జె ఎం ఎం, ముస్లింలీగ్, మజ్లిస్ లతో సహా మరో రెండు చిన్న పార్టీలున్నాయి. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సమాజ్ వాదీ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఐతే తృణమూల్ కాంగ్రెస్ అలిగి సంకీర్ణాన్ని విడిచి పెట్టిన తరువాత, మైనారిటీలో పడి పోయిన ప్రభుత్వానికి, సమాజ్ వాదీ పార్టీతో పాటు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన బహుజన సమాజ్ పార్టీ కూడా తన మద్దతును ప్రకటించింది. ఆ తరువాత డిఎంకె కూడా ప్రభుత్వంపై అలక పూనింది. మధ్యలో మజ్లిస్ కాంగ్రెస్ కు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఐనప్పటికీ యుపిఎకి పెద్దగా సంఖ్యాపరమైన నష్టం కలగలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఓటింగ్ తో కూడిన చర్చకు ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో లోక్ సభలో బలాబలాలను అంచనా వేసిన విశ్లేషకులకు, యుపిఎ బలం 265 మంది సభ్యులని తేలింది. 22 మంది సభ్యులున్న సమాజ్ వాదీ, 21 మంది సభ్యులున్న బహుజన సమాజ్ పార్టీ కూడా మద్దతిస్తే, దాని బలం 300 దాటుతుంది. కాకపోతే రాజ్యసభలో కొంత ఇబ్బంది కలగవచ్చు. అధికార పక్షం పరిస్థితి ఇలా వుంటే, ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేసే దశలో లేవు. అదే యుపిఎ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా మిగిలిపోయింది.


మరోవైపు బిజెపి సారధ్యంలోని ఎన్డీయే, మూడో, నాలుగో ఫ్రంటులు రాబోయే ఎన్నికల కోసం ఎవరి వ్యూహంలో వారున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని-యుపిఎని వీడిన అలనాటి మిత్ర పక్షాలు కాని, ఇంకా కలిసి వున్న ఇతర చిన్న-చితకా పార్టీలు కాని రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అవి తనతో కలిసి ఎన్నికల ముందు అవగాహన కుదుర్చుకుని పోటీ చేసే కంటే, అవి వేరుగా పోటీ చేసి, వీలై నన్ని స్థానాలు గెల్చుకుని, ఎన్నికల అనంతరం సంకీర్ణంగా ఏర్పడితే మంచిదన్న ఆలోచనలో వుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, యుపిఎ ప్రభుత్వం "యాంటీ ఇన్‍కంబెన్సీని" తట్టుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. దానికి తోడు అవినీతి ఆరోపణలు కూడా వున్నాయి. తన పార్టీకి ఎలాగూ గతంలో వచ్చి నన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ భావనలాగా కనిపిస్తోంది. తనతో కలిసి పోటీ చేసి తన మైలను భాగస్వామ్య పక్షాలు అంటించుకునేకంటే, విడిగా పోటీ చేసి మంచి పేరుతో కొన్ని స్థానాలు గెలవడం మంచిదన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా వుంది. అదే జరుగబోతుంది. ఈ నేపధ్యంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగబోతోంది అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, నేటిదాకా, గత ఆరు దశాబ్దాల కాలంలో, రాజకీయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆ మార్పులను వివిధ కోణాలనుంచి పరిశీలన చేయవచ్చు. ఆ మార్పులలో ప్రధానంగా గమనించాల్సిన విషయం, ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత పెరగడం. ఒకప్పుడు ఏ ఒకటో-రెండో రాష్ట్రాలకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ వేళ్ల్లూనుకు పోయి, పార్లమెంటులో తమ బలాన్ని చాటుకుంటున్నాయి. గత రెండు-మూడు సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని గమనిస్తే, జాతీయ పార్టీలకంటే అవి అధికంగా వున్నాయి. అంటే జాతీయ పార్టీల ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో తగ్గుకుంటూ పోతుంటే, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుక్కుంటూ పోతోంది. భారత్ దేశ రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న మరో ప్రధానాంశం, వోటు వేసే వారిలో అధిక శాతం మంది బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు చెందిన వారు కావడం. మహిళలు కూడా పెద్ద ఎత్తున పురుషులకంటే అధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. వీటన్నిటి ప్రభావం ఏ మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందో విశ్లేషించాలంటే, ప్రాంతీయ పార్టీల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఈ నేపధ్యంలో ఇక్కడ కొన్ని మౌలికాంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకు పోతుంటే, మరొక వైపు, జాతీయ పార్టీలు బలహీన పడిపోవడంతో, పార్లమెంటులో మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ ఒక్క జాతీయ పార్టీకి సాధ్యపడదు. మెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమే. ఎప్పుడైతే, ఏ ఒక్క జాతీయ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించుకోలేదో, ఇప్పటి లాగే, ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం లేదు. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలతో అవగాహన ఎన్నికల ముందా? తరువాతా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఉదాహరణకు 2009 ఎన్నికలే తీసుకుంటే, ఎన్నికల ముందు ఎక్కువగా కలిసి కట్టుగా-ఉమ్మడిగా పోటీ చేయడం జరగలేదు. ఎన్నికల అనంతరమే అవగాహన కొచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయలేదని అర్థం కాదు. ఎన్నికల ముందు అవగాహన వుంటే సంకీర్ణాలు మనుగడ సాగించడం సులభం. ఎన్నికల అనంతరం అవగాహనకు వస్తే, బెదిరింపుల మధ్య, సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కష్టం అవుతుంది. 1999-2004 మధ్య అధికారంలో వున్న బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమైనా,  2004-2009 మధ్య అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వమైనా, అస్థిరత-స్థిరత్వం మధ్య ఊగిసలాడినప్పటికీ, పూర్తికాలం పాటు కొనసాగాయి. అది ఒక విధంగా గొప్ప విషయమే. ఇక 2009 తరువాత అధికారంలో కొచ్చిన యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం అహర్నిశలూ బెదిరింపులను ఎదుర్కుంటూనే మనుగడ సాగిస్తోంది. వస్తున్న బెదిరింపులన్నీ ప్రాంతీయ పార్టీల నుంచే కావడం విశేషం.

సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో, పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల సంఖ్య లెక్కకు మించి పోయింది. సభలో జరిగే చర్చలలో నాణ్యత లోపించడంతో పాటు, సభ నిర్వహణ కష్ట సాధ్యమై పోయి, వాయిదాపడడం సర్వసామాన్యమైన విషయంగా మారిపోయింది. రకరకాల పార్లమెంటరీ తీర్మానాలతో సభ ఏనాడూ సజావుగా సాగనీయడం లేదు ప్రతిపక్షాలు. అధికార పక్షంలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన ప్రాంతీయ పార్టీ వారు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అనేక చర్యలకు పాలపడుతున్నారు. పర్యవసానంగా సభలో చర్చించి సభ ఆమోదం పొందాల్సిన అనేక బిల్లులు ప్రవేశపెట్టడానికి కూడా నోచుకోక పోవడం దురదృష్టం. ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులు చర్చ జరగకపోవడంతో చాలా కాలంపాటు పెండింగ్‌లో పడిపోతున్నాయి. పార్టీల సంఖ్య పెరగడంతో పార్లమెంటరీ ప్రక్రియకే ముప్పు వాటిల్లడంతో పాటు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు రావడంతోను, ప్రాంతీయ పార్టీలు అధికసంఖ్యలో ఆవిర్భవించడంతోను, ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది. ఒక్కో ఎన్నిక జరిగే కొద్దీ, పోటీలో వుండే పార్టీల సంఖ్య పెరగ సాగింది. 1952 లోక్ సభ ఎన్నికలలో కేవలం  55 పార్టీలు మాత్రమే రంగంలో వుంటే,  2009 ఎన్నికల కల్లా వాటి సంఖ్య 370 కి చేరుకుంది. ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే, 1957 లో మాత్రమే అతి తక్కువగా కేవలం 16 పార్టీలు మాత్రమే పోటీలో వుండగా, అత్యంత అధిక సంఖ్యలో 2009 లో పోటీకి దిగాయి. వీటి సంఖ్య రాబోయే ఎన్నికలలో ఇంకా పెరగొచ్చు. మొదటి ఎన్నికలలో పోటీ చేసిన 55 పార్టీలలో, 18 రాష్ట్ర స్థాయి పార్టీలు, 29 రిజిస్టర్డ్ పార్టీలు కాగా జాతీయ పార్టీల సంఖ్య కేవలం 8 మాత్రమే!  వాటి సంఖ్య 2004 లో 6 కు పడి పోయింది. కాగా అదే ఎన్నికలలో పోటీలో వున్న 230 పార్టీలలో, 36 ప్రాంతీయ పార్టీలు, 188 రిజిస్టర్డ్ పార్టీలు వున్నాయి. దానర్థం ఒకవైపు ప్రాంతీయ-రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య పెరుగుతూ పోతుంటే, జాతీయ పార్టీల సంఖ్య తగ్గుకుంటూ పోతోంది. అదే విధంగా 1952 లోక్ సభ ఎన్నికల అనంతరం పార్లమెంటులో 22 పార్టీలకు ప్రాతినిధ్యం లభించగా, 2009 ఎన్నికల అనంతరం 37 పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. అత్యంత తక్కువగా కేవలం 12 పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది 1957 ఎన్నికల అనంతరం. ఏ విధంగా పార్టీల సంఖ్య, అవి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే వాటి సంఖ్య పెరుగుకుంటూ పోతుందో ఈ లెక్కలు తెలియచేస్తాయి.

ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడమంటే, రాజకీయ పోటీ తత్వంలో మార్పుల రావడమే. మొదట్లో, రాష్ట్ర శాసన సభలలో జాతీయ పార్టీలకు పోటీగా వున్న ప్రాంతీయ పార్టీలు దరిమిలా పార్లమెంటులో జాతీయ పార్టీలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతీయ పార్టీకి ప్రజల మద్దతు-ఓటర్ల మద్దతు లభిస్తున్న తీరుతెన్నులను పరిశీలిస్తే, వారు పూర్తిగా జాతీయ పార్టీలను మరిచిపోతున్నారే మో అనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాలలో ప్రధాన పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, ఏదో ఒక జాతీయ పార్టీకి మధ్యన వుంటే, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఆ పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, మరో ప్రాంతీయ పార్టీకి మధ్యనే వుంటోంది. ఎన్నికల రంగంలో ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు మూడు-నాలుగు స్థానానికి పరిమితమై పోవడం కూడా కష్టమవుతోంది. ప్రాంతీయ పార్టీలతో పోల్చి చూస్తే, దేశం మొత్తం మీద జాతీయ పార్టీలకు పోలైన ఓట్ల శాతం తగ్గుకుంటూ వస్తోంది. ప్రధానంగా 1996 ఎన్నికల తరువాత ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒకవైపు గెలిచిన స్థానాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న ప్రాంతీయ పార్టీలు, మరో పక్క ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంటున్నాయి. 1984 లో ప్రాంతీయ పార్టీలన్నిటికీ కలిపి 11.2% ఓట్లు రాగా, 2009 ఎన్నికల నాటికి 28.4% కి పెరిగింది. రాబోయే ఎన్నికలలో 30% దాటినా ఆశ్చర్య పోనక్కరలేదు. దానర్థం జాతీయ పార్టీలకు కనీసం రెండు వందల స్థానాలన్నా రావడం కష్టమే!  ఎక్కువమంది ఓటర్లలో జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీలే మంచివన్న అభిప్రాయం వుండి వుండాలి. రాష్ట్రాల పాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లో వుండాలని కోరుకోవడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం నడుచుకోవాలంటే, పార్లమెంటులో కూడా వాటికి గణనీయమైన స్థానాలను గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా కానుంది. ఎన్నికల అనంతరం యుపిఎ, ఎన్డీఏ లలో ఎవరు ఎక్కువగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించుకోగలరో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ముఖ్యంగా డిఎంకె, అన్నా డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీ, తెలుగు దేశం, ఎన్సీపి, జనతాదళ్, శివ సేన, అకాలీదళ్, బిజూ జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్సీపి లాంటి పార్టీల మద్దతు కీలకమవుతుంది. వీటిలో చాలా వరకు, ప్రస్తుతానికి యుపిఎ, ఎన్డీఏ లలో ఏదో ఒక దాంట్లో భాగస్వాములుగా వున్న ఈ పార్టీలు అన్నీ కలిసి సుమారు 200-250 స్థానాలు గెల్చుకునే అవకాశం వుంది. వీరంతా కలిసి ఒక ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌గా ఏర్పడితే జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లే! అందుకే రాబోయే ది ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త! 

Wednesday, November 28, 2012

గవర్నర్‍ వ్యవస్థను విమర్శించడం ఎంతవరకు సబబు?: వనం జ్వాలా నరసింహారావు


గవర్నర్‍ వ్యవస్థను విమర్శించడం 
ఎంతవరకు సబబు?
    వనం జ్వాలా నరసింహారావు
రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు ! 
నమస్తే తెలంగాణ (4-12-2012)                     

రాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన సమయం ఇవ్వడం లేదని, ధర్మాన కేసు లో తమ పార్టీ నాయకుల విజ్ఞప్తిని వివరించడానికి అవకాశం కల్పించడం లేదని, గవర్నర్ రాజ్యాంగ రక్షకునిగా వ్యవహరించాలి కాని, సోనియా ఏజెంటుగా వ్యవహరిస్తే తాము గవర్నర్ల వ్యవస్థపైనే పోరాడాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగానే పరిగణించాలి. గవర్నర్ రవీంద్ర భారతికి వెళ్లినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా తమకు అభ్యంతరం లేదని, ఢిల్లీ యాత్రలు చేసినా పరవాలేదని, రాజ్యాంగబద్ధంగా గవర్నర్ చేయాల్సిన పని చేయాలని, చేయకపోతే తమ పార్టీ నిలదీయడం ఖాయమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, గతంలో రహస్య గూఢచారి ఉద్యోగం చేసిన నరసింహన్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా అదే పని చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. గవర్నర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని, రాష్ట్రపతులను కలవడంలో తప్పు లేదు కాని, సోనియాను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ను గాంధీ భవన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఒక సారి, నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, కొందరు గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. గవర్నర్ తరచూ ఢిల్లీకి వెళ్లి నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలూ వున్నాయి. పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శా వుంది. ధర్మాన కేసును ఆయన ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే! కొన్ని కొన్ని విషయాలలో ఆయన నిర్ణయం ఎలా వుంటుందో నని ఎదురు చూడని పార్టీ రాష్ట్రంలో లేదు. ఆయన నిర్ణయాలు ఒక్కోసారి ఒక్కో పార్టీకి సంతోషకరం గా వుంటున్నాయి. మరి కొందరికి ఇబ్బందులు కలగ చేస్తున్నాయి. 



కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

2009 సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, ఆ తరువాత ఆయన వారసుడిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తదుపరి, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు అలనాటి ముఖ్యమంత్రి రోశయ్యా? నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్సార్సీపి నాయకుడు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి ముఖ్యమంత్రిని ఇరుకున పెడుతున్న కొందరు కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? కిరణ్ కుమార్ రెడ్డికి సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం.

పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.

కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో ఢిల్లీకి వెళ్లి వస్తే తప్పేంటి?

గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఒకసారి తన ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.

ఏదేమైనా, తొందరపడి గవర్నర్‌ను విమర్శించడం, వ్యవస్థనే కించపరచడం భావ్యం కాదు. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు.