దేవహూతిని వివాహం చేసుకున్న కర్దమ ప్రజాపతి
శ్రీ మహాభాగవత కథ-11
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (18-11-2024)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
సకల ప్రజాపతైన బ్రహ్మ ప్రజలను సృష్టించడం కొరకు ముందుగా ప్రజాపతులను సృష్టించాడు. వారు ఏమి సృజించాలని అనుకున్నారు, మరీచ్యాది మహా మునులు అఖిల జగత్తును ఎలా సృష్టించారు, ప్రజాపతులు భార్యా సమేతంగా ఏం సృష్టించారు, స్త్రీలు లేకుండా ఏం సృష్టించారు అనే విషయాలను చెప్పమని విదురుడు కోరగా, మైత్రేయుడు ఆయనకు చతుర్ముఖ బ్రహ్మ చేసే యక్షాది దేవతాగణ సృష్టిని సవివరంగా తెలియచేశాడు.
సృష్టికర్త జీవులకు అగోచరుడు. మాయతో కూడి ఉంటాడు. కాల స్వరూపుడు. నిర్వికారుడు. ఆయన సృష్టి ఎలా చేయాలని తీవ్రంగా ఆలోచించాడు. అప్పుడు ఆయనందు సత్త్వం, రజస్సు, తమము అనే మూడు గుణాలు పుట్టాయి. ఆ గుణత్రయంలో రజో గుణం నుండి మహాత్తత్త్వం పుట్టింది. దాన్నుండి మూడు గుణాల అంశతో అహంకారం పుట్టింది. అహంకారం నుండి పంచతన్మాత్రలు, దాని నుండి పంచభూతాలు పుట్టాయి. ఈ పంచభూతాలే సృష్టికి, సృష్టి నిర్మాణానికి హేతువులు. అయితే వీటిలో వేటికీ భువన నిర్మాణ కర్మకు సామర్థ్యం లేదు. అవన్నీ కలిసి పాంచభౌతికమైన బంగారు గుడ్డును సృజించాయి. ఆ గుడ్డు మహాజలాలలో వృద్ధి పొందుతూ ఉన్నది. ఆ హిరణ్మయ అండాన్ని ‘నారాయణుడు’ అనే పేరుతో పరబ్రహ్మం వెయ్యి దివ్య సంవత్సరాలు అధిష్టించి ఉన్నాడు. ఆ నారాయణుడి నాభి నుండి సకల జీవులకు ఆశ్రయభూతమైన ఒక పద్మం పుట్టింది. దానిని ఆశ్రయించుకుని చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. అతడే అఖిల జగత్తును సృష్టించాడు.
చతుర్ముఖ బ్రహ్మ తామిస్రం, అంధతామిస్రం, తమము, మొహం, మహామోహం అనే పంచ మోహాలతో కూడిన అవిద్యను పుట్టించాడు. అప్పుడు విధాత తన తమోమయ దేహాన్ని విసర్జించాడు. విధాత వదలిన దేహం ఆకలిదప్పులకు నివాసమై రాత్రిమయం అయింది. అందులో నుండి యక్ష రాక్షసులు అనే ప్రాణులు పుట్టాయి. వెంటనే వారికి ఆకలి దప్పులు వేశాయి. వారిలో కొందరు బ్రహ్మదేవుడిని భక్షిద్దామని అంటే, మరికొందరు రక్షిద్దామని అన్నారు. ఆ నిమిత్తంగా వారికి ‘యక్షులు’, ‘రక్షసులు’ అన్న పేర్లు వచ్చాయి. తరువాత విధాత తేజస్సుతో వెలుగొందే ఒక శరీరాన్ని ధరించి, దేవతలను సృష్టించాడు. సృష్టించి శరీరాన్ని విడిచి పెట్టగా అది పగలుగా రూపొంది దేవతలకు ఆశ్రయం అయింది. ఆ తరువాత తన కటి ప్రదేశం నుండి అసురులను సృష్టించి, శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించాడు.
తన సృష్టిలో పాపాత్ములైన రాక్షసులు కూడా పుట్టారనీ, వారినుండి తనను రక్షించమని వేడుకున్నాడు శ్రీహరిని. అప్పుడు శ్రీహరి, బ్రహ్మ తన ఘోరమైన శరీరాన్ని త్యాగం చేయమని చెప్పడంతో ఆయన అలాగే చేశాడు. ఆ త్యాగమయ శరీరం నుండి ‘సంధ్యాసుందరి’ అనే సౌందర్యవంతమైన లలనారత్నం పుట్టింది. అలా సాక్షాత్కరించిన సంధ్యాదేవిని దానవులు కౌగలించుకున్నారు. ఆమెను గురించిన వివరాలు అడిగారు. అందరూ కలిసి ఆమెను పట్టుకున్నారు. అది చూసిన బ్రహ్మ మనసులో ఉప్పొంగిపోయాడు. తన చేతిని ఆఘ్రాణించగా అప్సరసలు, గంధర్వులు పుట్టారు. వెంటనే విధాత తన శరీరాన్ని విడిచి పెట్టాడు.
బ్రహ్మ విడిచిన దేహాన్ని విశ్వావసువు మొదలైన గంధర్వులు, అప్సరసలు తీసుకున్నారు. బ్రహ్మ నిద్ర రూపంలో శరీరాన్ని ధరించి, పిశాచాలను, గుహ్యకులను, సిద్దులను, భూతాలను పుట్టించాడు. వాళ్ళను చూసి విధాత కళ్లుమూసుకుని తన శరీరాన్ని విసర్జిస్తే దానిని వాళ్లు తీసుకున్నారు. తరువాత అజుడు అదృశ్యదేహుడై పితృ దేవతలను, సాధ్యులను పుట్టించాడు. తరువాత బ్రహ్మ తనకు ప్రతిబింబంగా ఉన్న శరీరం నుండి కిన్నరులను, కింపురుషులను పుట్టించాడు. విధాత శయనించి కాళ్లు-చేతులు కదిలించగా రాలిన రోమాలన్నీ పాములయ్యాయి. తరువాత జగత్పావనులైన మనువులను సృష్టించాడు. వారికి తన దేహాన్ని ఇచ్చాడు.
బ్రహ్మ తిరిగి ఋషి వేషాన్ని ధరించి ఆత్మస్వరూపుడై ఋషిగణాలను పుట్టించాడు. వారికి తన శరీరాంశములైన సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వైరాగ్యం... ఇత్యాదులను.... ఒక్కొక్కరికి ఇచ్చాడు.
ఇదిలా ఉండగా, కృత యుగంలో, బ్రహ్మ ప్రజలను సృష్టించడానికి కర్దమ ప్రజాపతిని నియమించాడు. ఆయన సంతోషించి సరస్వతీ నదీ తీరంలో పదివేల దివ్య సంవత్సరాలు లక్ష్మీనాథుడిని పూజించగా ఆయన ప్రత్యక్షమైనాడు. వెంటనే కర్దముడు ఆయనకు సాష్టాంగ పడ్డాడు. ఆయన్ను స్తుతించాడు. తనకు వివాహం చేసుకోవాలని ఉన్నదనీ, సరైన స్త్రీ కోసం ఆయన పాదాలను ఆశ్రయించాననీ అన్నాడు. స్వాయంభవ మనువు తన భార్య శతరూపను వెంటబెట్టుకుని, వివాహం కావాల్సిన తన కూతురుతో సహా కర్దముడి దగ్గరకు ఆ మర్నాడే వస్తాడని, ఆయన పుత్రికను తనకిచ్చి పెళ్లి చేస్తాడని విష్ణువు చెప్పాడు. ఆమెకు కర్దముడి ద్వారా 9 మంది అత్యంత సౌందర్యవతులైన కన్యలు పుట్టుతారానీ, వారి వల్ల మునీంద్రులు కొడుకులను కంటారనీ, చివరి దశలో తాను ఆయన భార్య గర్భంలో ప్రవేశించి పుత్రుడై పుట్టి తత్త్వాన్ని బోధిస్తాననీ చెప్పి శ్రీహరి అంతర్థానమయ్యాడు. కర్దముడు బిందు సరోవరానికి వెళ్లాడు. దాని దగ్గరే ఆయన తపోవనం ఉన్నది.
ఆ తీర్థాన్ని భార్యతో, కూతురుతో స్వాయంభవ మనువు సందర్శించాడు. అక్కడ కర్దముడిని చూసి ఆయన పాదాలకు మొక్కాడు మనువు. ఆయన ఆగమనానికి కారణం ఏమిటని అడిగాడు కర్దముడు. జవాబుగా, దేవహూతి అనే తన కూతురు కర్దముడిని పెళ్లిచేసుకోవాలన్న తలంపుతో వచ్చిందని, ఆమెను స్వీకరించమనీ అన్నాడు మనువు. వివాహానికి ఒప్పుకున్న కర్దముడు ఒక నిబంధన పెట్టాడు. తాను ఆమెకు సంతానం కలిగేవరకు మాత్రమే గృహస్తుడిగా ఉండి, తరువాత సన్న్యాసాశ్రమాన్ని స్వీకరిస్తానని అన్నాడు. అలాగే అని అంగీకరించి ఇద్దరికీ వివాహం చేశారు. ఆ తరువాత తిరిగి వెళ్ళిపోయాడు. స్వాయంభవ మనువు ఆ తరువాత నిత్యం హరి భక్తితో, విష్ణు సేవలో, సర్వ భూతాలకు హితం కలిగిస్తూ, 71 మహాయుగాలు ఘన చరిత్రుడై పరిపాలించాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)