Monday, March 1, 2010

అమెరికాలో నేనుండగా... ....: "జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు": వనం జ్వాలా నరసింహారావు

అమెరికాలో నేనుండగా... ....
"జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు"
వనం జ్వాలా నరసింహారావు
(Please Click For Full Book)
అమెరికాలో శాంతా క్లారా వాలీ, మోంటిరే బే అక్వేరియం
మాలిబు బీచ్, డిస్నీ లాండ్, ఫెర్నాండో లోయ
హాలీవుడ్ స్టూడియోలు, బే వంతెన, గోల్డెన్‌గేట్ బ్రిడ్జ్
షుగర్ లాండ్, అష్టలక్ష్మి దేవాలయం, నాసా


శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న గూగుల్ సంస్థలో పనిచేస్తున్న మా అబ్బాయి ఆదిత్య - కోడలు పారుల్ రమ్మంటే సెప్టెంబర్, 2009 మూడో వారంలో అమెరికా దేశానికొచ్చాం-మూడోసారి. ఇక్కడుండగా రాయదల్చుకున్నవి, అన్నీ ఒక చోట చేర్చడం మొదలు పెట్టాను. ఆ క్రమంలోనే "జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు" పేరుతో వర్తమాన విషయాల మీద రాయడం కూడా ప్రారంభించాను. ఐదున్నర నెలల నా అమెరికా అనుభవాలతో పాటు, వాటితో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో సంబంధమున్న మరికొన్ని కూడా రాసుకుంటూ పోయాను.

"శాంతా క్లారా వాలీ"

అమెరికా-ఉత్తర కాలిఫోర్నియాలోని "శాన్ ఫ్రాన్ సిస్కో" సాగర తీరానికి దక్షిణ భాగాన వున్న అందమైన లోయ ప్రదేశమే మా అబ్బాయి ఆదిత్య వుంటున్న "శాంతా క్లారా వాలీ". శాంతా క్లారా కౌంటీ లోని ఎక్కువ భాగంతో సహా శానోజె నగరం కూడా ఈ లోయలోనే వున్నాయి. "హృదయాలను పులకరించే మధురమైన లోయ" గా ఒకప్పుడు కవులచే అభివర్ణించబడిన ఈ లోయ ప్రాంతమంతా, ఇప్పటికీ మైళ్ల పర్యంతం, అందమైన వృక్షాలు-పూల పొదలు-పళ్ల చెట్లు-కూరగాయల తోటలు, వ్యాపించి వుంటాయి. 1960 సంవత్సరం వరకు, ప్రపంచంలోనే అతి పెద్ద పళ్ల ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిందీ లోయ. చుట్టుపక్కలంతా సారవంతమైన భూమి వుండడంతో, వ్యవసాయ ప్రాధాన్యమైన ప్రాంతంగా ఒకప్పుడుండే శాంతా క్లారాలోని చాలా భాగం, క్రమేణ నగరంగా మారిపోయినప్పటికీ, ఇంకా గ్రామీణ ఛాయలు పరిసరాల్లో-ముఖ్యంగా లాస్ ఏంజల్స్ దిక్కుగా పోతుంటే ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. వాస్తవానికి, "శాంతా క్లారా వాలీ", ఈనాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన "సిలికాన్ వాలీ", ఒకదానిలో ఇంకోటి అంతర్భాగమే.

శాంతా క్లారా వాలీ ఉత్తర కొనే, శాన్ ఫ్రాన్ సిస్కో సాగర తీరానికి దక్షిణాన చివరి ముక్క. లోయకు నైరుతీ భాగాన అందమైన "శాంతా క్రజ్ పర్వత సముదాయం", ఈశాన్య భాగాన "డైబ్లో కనుమలు" వ్యాపించి వుంటాయి. శాంతా క్లారా నగర ప్రాంతంలోని లిక్ మిల్ రోడ్ లోని కారిలైల్ భవన సముదాయం (అపార్ట్ మెంట్స్) లో మా అబ్బాయి ఆదిత్య వుండే ఫ్లాట్ వుంది. శాంతా క్లారా చేరుకోవడానికి, హైదరాబాద్ శంషాబాద్ నుంచి బయలుదేరిన మే మెక్కిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం, శాన్ ఫ్రాన్ సిస్కో విమానాశ్రయంలో లాండ్ అవుతుంటే అదో అద్భుత దృశ్యంలాగా వుంటుంది. సరాసరి సముద్రం మీదనుంచి, అందులో పడబోతోందా అన్న భయం కలిగే విధంగా, పక్కనే నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. ఈ ఒక్కటే కాదు: చుట్టుపక్కలున్న, ఓక్ లాండ్, శాంతా క్లారా, సానోజ్ విమానాశ్రయాలు కూడా అలానే వుంటాయిక్కడ. చుట్టూ సముద్రం-మధ్యలో ఒక ద్వీప కల్పం లాగా విమానాశ్రయం.

"మోంటిరే బే అక్వేరియం"

శాన్ ఫ్రాన్ సిస్కో వచ్చిన మూడో రోజున పసిఫిక్ మహాసముద్రం ఒడ్డు నున్న సహజ సిద్ధమైన బ్రహ్మాండమైన "మోంటిరే బే అక్వేరియం" కు వెళ్లాం. కాలిఫోర్నియా రాష్ట్రంలో 1984లో నెలకొల్పబడిన ఈ అక్వేరియంకు ప్రతి సంవత్సరం సుమారు రెండు కోట్ల మంది దర్శకులు వచ్చిపోతుంటారు. ఇక్కడ 623 జాతులకు చెందిన 35,000 కు పైగా మొక్కలు, జలచరాలున్నాయి. మోంటిరే బే నుండి, గొట్టాల ద్వారా సముద్ర జలాలను అక్వేరియంలోకి నిరంతరం ప్రవహింప చేసే విధంగా శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. 33 అడుగుల ఎత్తున వుండి, 13 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యమున్న నిలువెత్తు వాటర్ టాంక్-దాని గుండా యావత్ సాగర జలచరాలను వీక్షించే ఏర్పాటు, మోంటిరే బే అక్వేరియంలోని ప్రధాన ఆకర్షణ. ప్రపంచం మొత్తంలోనే ఎక్కడా దొరకని అరుదైన కాలిఫోర్నియా "జైంట్ కెల్ప్" (ఎరువులాగా ఉపయోగపడే ఒక రకమైన గడ్డి మొక్క) ను, ఈ వాటర్ టాంక్ లో, జలచరాల నిత్యావసరాలను తీర్చేందుకు పెంచుతుంటారు. ఇలా పెంచడం కూడా ప్రపంచంలో మరెక్కడా జరగదు.

"మోంటిరే బే అక్వేరియం" డిజైన్ లోనే ఒక ప్రత్యేకతుంది. నిమిషానికి 2000 గాలన్ల సముద్ర జలాలను, రాత్రింబగళ్లు, వందకు పైబడి టాంకుల ద్వారా అక్వేరియంలోకి ప్రవహించే ఏర్పాటు చూడ ముచ్చటగా వుంటుంది. సందర్శకులు రకరకాల చేపలను నీటిపైనా-కిందా, స్పష్టంగా వీక్షించే వీలుగా వడబోసిన పరిశుద్ధమైన జలాలను పగటి సమయంలో ప్రవహింపచేస్తారు. రాత్రివేళల్లో యధా విధి సముద్ర జలాలు, సహజసిద్ధమైన సాగర ఆహారాన్ని దాని వెంట వచ్చే విధంగా, అక్వేరియం టాంకుల్లో ప్రవహిస్తుంటాయి. చెత్త నీరంతా తిరిగి సముద్రంలోకి విడువబడే విధంగా ఏర్పాట్లున్నాయి.

శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు

శాంతా క్లారా నుండి సుమారు 350 మైళ్ల దూరంలో వున్న లాస్ ఏంజల్స్ కు కారులో వెళ్లాం. సుమారు ఐదున్నర గంటల ప్రయాణం. శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య కారు ప్రయాణం చేస్తుంటే విస్తారమైన పంట భూములు, ట్రాక్టర్ల సహాయంతో వ్యవసాయం చేస్తున్న అమెరికన్లు, లారీలలో నింపుకొని తీసుకెళ్తున్న టొమాటోలు-బంగాళ దుంపలు, దారి పొడుగూ కనిపించే రోడ్ పక్కనున్న పంటపొలాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల-పళ్ల అమ్మకం దుకాణాలు, సాగునీరు-తాగు నీరు సరఫరాకు సంబంధించిన చెరువులు-నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు-రిజర్వాయర్లు, అనేకం దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తుంది మధ్య-మధ్యలో. ఆ సుందర దృశ్యాలను ఆస్వాదించుకుంటూ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బయలుదేరిన వాళ్లం, సాయంత్రం అయిదింటికల్లా మేముండాల్సిన బంధువుల ఫ్లాట్ కు చేరుకున్నాం. అమెరికాలో ఎవరినీ అడ్రెస్ అడగక్కరలేదు. జీ.పి.ఎస్ సహాయంతో సరాసరి ఇంటి ముందు వాలొచ్చు. వెళ్తూనే కాళ్లు-చేతులు కడుక్కొని, చీకటి పడగానే, అందరం సమీపంలోని "మాలిబు బీచ్" చూడ్డానికి వెళ్లాం.

"మాలిబు"

కాలిఫోర్నియా-పశ్చిమ లాస్ ఏంజల్స్ కౌంటీలో, సుమారు 20 మైళ్ల నిడివున్నపసిఫిక్ సముద్ర తీర ప్రాంతమే "మాలిబు" అని పిలువబడే చిన్న పట్టణం. పూనా-ముంబై మధ్యలో హిందీ సినిమా యాక్టర్లు కట్టుకున్నట్లే, హాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ తారలు మాలిబు పరిసరాల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మించుకున్నారు. దక్షిణ ప్రాంత కాలిఫోర్నియాకు చెందిన ధనవంతులైన పారిశ్రామిక వేత్తల ఇళ్లు కూడా మాలిబు బీచ్ ప్రాంతంలోనే వుంటాయి. మర్నాడు ఉదయమే డిస్నీ లాండ్ ప్రోగ్రాం వుంది కనుక ఆలశ్యం చేయకుండా, మాలిబు బీచినుంచి బయటపడి త్వరగా ఇల్లు చేరుకున్నాం.

“డిస్నీ లాండ్”

లాస్ ఏంజల్స్ లో మేమున్న ఫ్లాట్ నుంచి కాలిఫోర్నియా డిస్నీ లాండ్ పార్క్ వున్న "అనా హిమ్" ప్రదేశం సుమారు 40 మైళ్ల దూరంలో వుంటుంది. గంట సేపు ప్రయాణం. అనా హిమ్, కాలిఫోర్నియా (అమెరికా) లోని "థీమ్ పార్క్” తో సహా, డిస్నీ లాండ్ పేరు మీద పారిస్, టోక్యో, హాంగ్ కాంగ్ లో కూడా థీమ్ పార్కులున్నాయి. రిసార్ట్స్ పేరు మీద, కాలిఫోర్నియా, పారిస్, హాంగ్ కాంగ్, అమెరికా-ఫ్లారిడాలోని ఆర్ లాండ్, జపాన్-టోక్యోకు సమీపంలోని ఉరయసులో వున్నాయి. 2014 లో షాంగాయిలో ఇలాంటిదే ఒకటి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి చురుగ్గా. అద్భుతమైన థీమ్ పార్కుల్లో, అత్యంత పరమాద్భుతమైంది కాలిఫోర్నియాలోని అనా హిమ్ డిస్నీ లాండ్ థీమ్ పార్క్. అమెరికా వెళ్లిన వారెవరైనా, ఏ మాత్రం వీలున్నా, ఇక్కడకు కాని-ఆర్ లాండ్ కు కాని పోకుండా వుండరు.

వాల్ట్ డిస్నీ ప్రత్యక్ష పర్యవేక్షణ కింద రూపు దిద్దుకొని-నిర్మించబడిన ఈ ఏకైక డిస్నీ లాండ్ జులై 17, 1955న పాత్రికేయుల ప్రివ్యూగా మొదలై, మర్నాటినుంచి పర్యాటకుల సందర్శన కొరకు ఆరంభమయింది. దేశాధ్యక్షులు, అధినేతలు, ప్రధాన మంత్రులు, ముఖ్యాతి ముఖ్యులతో సహా సుమారు పదికోట్లకు పైగా సందర్శకులు థీమ్ పార్కుకొచ్చారిప్పటివరకు. సెప్టెంబర్ 1959 లో సోవియట్ రష్యా ప్రధాని నికితా కృశ్చేవ్ అమెరికాకు వచ్చినప్పుడు, డిస్నీ లాండ్ కు వెళ్లాలని చేసిన అభ్యర్థనకు అమెరికా అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా సానుకూలంగా స్పందించలేదు.

"మెయిన్ స్ట్రీట్-యు. ఎస్. ఏ", "అడ్వంచర్స్ లాండ్", "ఫ్రాంటియర్ లాండ్", "ఫాంటసీ లాండ్", "టుమారో లాండ్" లకు తోడుగా దరిమిలా ఏర్పాటుచేసిన "హాలిడే లాండ్", "న్యూ ఆర్లియన్స్ స్క్వేర్", " క్రిట్టర్ కౌంటీ", "మిక్కీస్ టూన్ టౌన్" లు ఇక్కడి థీమ్ పార్క్ లోని ఆకర్షణలు. మెయిన్ స్ట్రీట్ లో రైలు స్టేషన్, టౌన్ స్క్వేర్, సినిమా హాలు, సిటీ హాలు, ఎంపోరియం, దుకాణాలు, డబుల్ డెక్కర్ బస్ లాంటివి కనిపిస్తాయి. "అడ్వంచర్స్ లాండ్" లో "జంగిల్ క్రూజ్", "ఇండియానా జోన్స్ అడ్వంచర్", "టార్జాన్స్ ట్రీ హౌజ్" లున్నాయి. "జంగిల్ క్రూజ్" లో ఒక పడవలో ఎక్కించి సహజ సిద్ధంగా ఉన్న నదుల్లోంచి తీసుకెళ్తుంటే, నీళ్లల్లో-నీళ్ల పక్కన ఒడ్డుపైన, పాము, వినాయకుడి బొమ్మ, ఏనుగు, కోతి, ఎలుగుబంటులు, జిరాఫీ, సింహాలు, పులులు, రైనో, మొసలి, గిరిజన నృత్యం, మునులు --- ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఒక చోట పక్కనున్న గోడమీద ఉర్దూలో కూడా ఏదో రాసి వుంటుంది.

"ఇండియానా జోన్స్ అడ్వంచర్" భయంకరంగా అనిపించినా ఆహ్లాదకరంగా వుంటుంది. ఇండియానా జోన్స్ సినిమా ఆధారంగా రూపొందించారు దీన్ని. ఒక ఓపెన్ జీప్ లో కూర్చొబెట్టి, చీకటి గుహలగుండా, అత్యంత వేగంగా, బహుశా కంప్యూటర్ సహాయంతో తీసుకెళ్తారు. ఆసాంతం వ్యాఖ్యానం కొనసాగుతూనే వుంటుంది. జీపు అంతులేనన్ని కుదుపులుతో కదులుతుంటుంది. ఒక్కో చోట సరాసరి గుహను ఢీ కొట్టుకుంటున్నదా అనిపిస్తుంటుంది. అన్నింటికన్నా ప్రధాన ఆకర్షణ "జలాంతర్గామి" లో ప్రయాణం. సగ భాగం నీటిలో-సగ భాగం నీటిపైనా ప్రయాణించే పడవలో సుమారు పావుగంట సాగిన ప్రయాణంలో సముద్ర గర్భంలో జరిగే అద్భుతాలెన్నో తిలకించే ఏర్పాట్లు చేసారు. మరో ప్రదేశంలో వున్న "మిక్కీస్ టూన్ టౌన్" లో "మిక్కీ మౌస్" ను కలిసి ఫొటోలు దిగాం. చీకటి పడుతుంటే, నీటి మధ్యలో ప్రదర్శకులు, పడవపై ఆహ్లాదకరమైన నృత్యం చేసుకుంటూ సందర్శకులకు కను విందు కలించే "ఫాంటాస్మిక్"ను చూశాం. ఇదవుతూనే చివరిగా, ఆకాశంలో దీపావళి పండుగను మైమరిపించే బాణాసంచా మధురానిభూతిని కలిగిస్తాయి.

“ఫెర్నాండో లోయ”

లాస్ ఏంజల్స్ ఉడ్ లాండ్ హిల్స్ నుంచి సుమారు 10 మైళ్ల దూరంలోని యూనివర్సల్ స్టూడియోలు, అందమైన “ఫెర్నాండో లోయ” లో వున్నాయి. సుమారు 250 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, వాయువ్యాన శాంత సుజనా కొండలు-పశ్చిమాన సిమి కొండలు-దక్షిణాన శాంత మోనికా కొండలు-తూర్పున వెర్డుగో కొండలు-ఈశాన్యంలో సాన్ గాబ్రియల్ కొండలతో వ్యాపించి వుంటుంది ఫెర్నాండో లోయ. లాస్ ఏంజల్స్ నది సమీపంలోనే ప్రవహిస్తుంటుంది. శాంత మోనికా కొండల పక్కనుంచి పోయే “ముల్హోలాండ్ డ్రైవ్”, ఫెర్నాండో లోయకు-హాలీవుడ్ కు మధ్య సరిహద్దని చెప్పుకోవచ్చు. యూనివర్సల్ సిటీ ప్రాంతంలో, 36 అంతస్థుల భవనంతో సహా పది సిటీ ప్లాజాలు, హాలీ వుడ్ స్టూడియో-థీమ్ పార్క్, వాణిజ్య-వినోద కేంద్రమైన యూనివర్సల్ సిటీ వాక్, యూనివర్సల్ సెట్టింగుల లాంటివి అనేకం వున్నాయి. 36 అంతస్థుల భవనంలోనే యూనివర్సల్ స్టూడియోలున్నాయి. అమెరికాలోని ఆరు భారీ సినీ స్టూడియోలలో ఒకటైన వీటిని, సుమారు 100 సంవత్సరాల క్రితం, 1912లో, జర్మనీ నుంచి వలస వచ్చిన జ్యూ స్థాపించాడు.

"హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలు"

నెల రోజులు కలియ తిరిగినా, ఇంకా-ఇంకా చూడాలని పించే ఆహ్లాద భరితమైన విహార స్థలం "లాస్ ఏంజల్స్ ఎంటర్ టైన్ మెంట్ రాజధాని" గా పేర్కొన బడే "హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలు". మొదలు చూసింది, "సైమన్ జె స్మిత్" దర్శకత్వంలో నిర్మించిన పదహారు నిమిషాల నిడివిగల "ష్రెక్-4-డి" లఘు చిత్రం. సినిమా ఆసాంతం, చూస్తున్నంతసేపు, మనమీదకు అందులోని పాత్రలు ఉరికొస్తున్న ఫీలింగ్‌కలిగేలా వుంటుంది. కూర్చున్న కుర్చీలు, కదలాల్సిన సీన్ వచ్చినప్పుడల్లా, దడ-దడ శబ్దం చేస్తూ, గగుర్పొడిచే విధంగా ముందుకూ-వెనక్కూ కదుల్తుండే ఏర్పాటు ఆటోమాటిక్ గా చేసుంటుంది థియేటర్ లో. "రివెంజ్ ఆఫ్ ది మమ్మీ"-భయంకరమైన అనుభూతినిచ్చే ఒక అడ్వంచర్స్ రైడ్. "జురాసిక్ పార్క్ రైడ్ అడ్వంచర్", నీళ్లలో కలిగించే మరో అనుభూతి. "అడ్వంచర్స్ ఆఫ్ క్యూరి యస్ గైడ్", "టెర్మినేటర్", "వాటర్ వరల్డ్", "హౌజ్ ఆఫ్ హారర్స్" లాంటివి మరికొన్ని చూశాం.

అన్నింటిలోకి అద్భుతమైన అనుభూతి “స్టూడియో టూర్”. సినిమాలు తీసేటప్పుడు ఉపయోగించే సాంకేతికపరమైన ట్రిక్కులు-టెక్నిక్కులు ప్రయోగాత్మకంగా దారి పొడుగూ ప్రదర్శించి చూపారు. సినిమాల్లో జలపాతాలను ఎలా సృష్టించేది, అగ్నిప్రమాదాలు ఎలా సంభవించేది, భూకంపాలు ఎలా చోటుచేసుకుంటాయి చూసి, సాంకేతిక పరంగా "సినిమా తీయడానికి కాదే దీ అనర్హం" అనిపించింది. ఎక్కడా అసహజంగా ఏదీ అనిపించదు. వర్షం కురిపించి-వరదలు-వాగులు సృష్టించి-అందులో కొట్టుకుపోతున్న వారిని చూసి క్షణం పాటు నివ్వెరపడి పోయాం. సినిమాల్లో ప్రమాదాలకు కార్లు గురైనప్పుడు అవి కింద-మీదా పడి ఎగురుతుంటే, బాంబు దాడుల్లో తునా-తునకలై పోతుంటే-అగ్ని ప్రమాదంలో మాడి-మసై పోతుంటే, ఇదంతా నిజంగా జరిగి నిర్మాతలకు నష్టం జరుగుతుందని బాధ పడతాం. అదంతా ఉట్టిట్టిదేనని స్టూడియో టూర్ లో తేలిపోయింది. అంతా సాంకేతికంగా జరిగే వ్యవహారమే. అలానే వంతెన మీద రైలో-బస్సో పోతుంటే, కూలినప్పుడు అందులో వున్న మనకు కలిగే భయబ్రాంతులను, భూకంపం వచ్చినప్పుడు మన మందులో ఇరుక్కొని పోతే ఎలా వుంటుంది కళ్లకు కట్టినట్లు చూడవచ్చు-అనుభూతి పొందవచ్చు. భారీ విమాన ప్రమాదం జరిగిన దుర్ఘటనలో చోటుచేసుకున్న పరిణామాలను దగ్గరగా చూడవచ్చు.

అమెరికా దేశంలోని రహదారులు

శాన్ ఫ్రాన్ సిస్కో, శాంతా క్లారా లోయ, డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోలు, సిలికాన్ లోయ, ఆరెకిల్, గూగుల్ సంస్థలున్న కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రత్యేకతుంది. ఆశ్చర్యం కలిగించే "బే వంతెన", "గోల్డెన్ గేట్ వంతెన" సముద్రం మీద కట్టబడింది ఇక్కడే. ఆహ్లాదం కలిగించే విహార స్థలాలెన్నో వున్నాయి. సమీపంలోని లాస్ వేగాస్ వెళ్లి "గాంబ్లింగ్" పత్తాల ఆట ఆడేందుకు దేశ-విదేశాల నుంచి పర్యాటకులొస్తుంటారు. న్యూ ఇయర్స్ డేకు వారి సంఖ్య అధికంగా వుంటుంది. శాన్ ఫ్రాన్ సిస్కో లోని డౌన్ టౌన్ రోడ్ మీద ప్రయాణం, అక్కడకు పోవడానికి సముద్రం పక్కనుంచి-దాదాపు సాగర జలాల అంచునుంచి చేరుకోవడం బలే సరదాగా వుంటుంది.

అలానే క్రుకెడ్ రోడ్. రోడ్డంతా, నేరుగా, ఒంపులు-వంకర టింకరలు లేకుండా, సుదూరంలో ఆకాశం నేలను తాకుతున్నట్లు, అద్భుతమైన సుందర దృశ్యం లా కనిపిస్తుంటుంది. ఆ రహదారి మీద కారులో పోతుంటే భయం కూడా వేస్తుంది. కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత వెనుక-ముందు ఎటు చూసినా-వళ్లు గగుర్పొడుస్తుంది. రోడ్డుకు ఇరు పక్కలా, ఇళ్లు-కారు పార్కింగులుంటాయి. మేం ఆ దారిగుండా వెళ్తున్నప్పుడు, మధ్యలో గుర్రపు స్వారీమీద గుజరాతీ పెళ్లి బృందం కనిపించింది. కారు నడిపేవాడి నైపుణ్యం మీదే అంతా ఆధారపడి వుంటుంది. లేదా దైవాధీనం. ప్రమాదాలకు నిలయమైనట్లున్నా, ఒక్క ప్రమాదం కూడా మాకంట కనపడలేదు. కొన్ని సంవత్సరాల క్రితం సంభవించిన భారీ భూకంపం తాలూకు గుర్తు లింకా కొన్ని అక్కడక్కడా ఆ ప్రాంతంలో కనిపిస్తాయి.

అమెరికా దేశంలోని నలు మూలల నుంచి వందల మైళ్ల దూరం అనాయాసంగా-సునాయాసంగా సొంత కార్లలో, స్వయంగా నడుపుకుంటూ ప్రయాణం చేసి ఇక్కడి ప్రదేశాలు చూసి పోగలగడానికి ప్రధాన కారణం దేశమంతా శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన రహదారులు-అమల్లో వున్న డ్రైవింగ్ నిబంధనలు-చిత్త శుద్ధిగా వాటిని ఆచరణలో పెట్తున్న వాహనదారులు. అహర్నిశలూ అలసటొచ్చే దాకా పనిచేసే అమెరికన్లు, వారాంతపు శెలవులు గడపడానికి, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, వందల మైళ్ల వేగంతో వాహనాలు నడిపినా, వారి అంతిమ లక్ష్యమైన సుఖప్రదమైన జీవితం గడిపేందుకు, గిరిగీసుకున్నట్లుగా, కొన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వం అజమాయిషీ చేస్తుందా-లేదా అని గమనించకుండా, పౌరులందరూ వాటిని పాటిస్తుంటారు. అందులో రహదారి నియమ నిబంధనలు ఒకటి. ఉదాహరణకు "కార్ పూల్ మార్గం". వేగంగా వెళ్లడానికి అనువుగా వుండే ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే, కారులో, ఇద్దరికంటే ఎక్కువ మంది వుండాలి. అలా లేని కారు నడిపే వ్యక్తి, ఎవరు గమనించినా-గమనించకున్నా, "కార్ పూల్ మార్గం" లోకి వచ్చే ధైర్యం చెయ్యడు.

ఇరువైపుల నుంచి, అంతర్ రాష్ట్ర రహదారుల్లో కనీసం రెండో-మూడో "చానల్స్" లేదా "పాస్ వేస్" (లేన్లు) ఏర్పాటుంటుంది. వాహనం నడిపేవారు, వారి-వారి వేగానికనుకూలంగా, సరిపడే విధంగా, ఒక లేన్లో ప్రయాణిస్తుంటారు. "ఎల్లప్పుడూ కుడి వైపునే నడపండి-లేన్ మారటానికి మాత్రమే ఎడమ వైపుకు తీసుకోండి" అన్న బోర్డులుంటాయి ప్రతి చోటా. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే, అందుబాటులో ఎడమ వైపున వున్న లేన్ లోకి మారి, వాహనం నడపాలి. వెనుకా-ముందు పోతున్న ఏ వాహనానికి-అది నడుపుతున్న వారికి, ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా, హారన్ మోగించ కుండా, లేన్లు మారాలి. అదే పనిగా హారన్ మోగించుకుంటూ, ఇతరులకు వీలైనంత అసౌకర్యం కలిగించుకుంటూ, వాహనాలు నడిపే వారెవరూ వుండరు. బధ్రతా కారణాల దృష్ట్యా, వాహనం నడిపే వ్యక్తి-ముందు సీట్లో నడిపే వారి పక్కన కూర్చొన్న వ్యక్తి, విధిగా "సీట్ బెల్ట్" కట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాల నిబంధనల ప్రకారం వెనుక సీట్లో కూచున్న వారు కూడా సీటు బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పట్టుబడితే, ఆ బాధ్యత, కారు నడుపుతున్న వాడిపైన వేస్తారు పోలీసులు.

ప్రపంచ ప్రఖ్యాత "బే వంతెన"

డిస్నీ లాండ్, యూనివర్సల్ హాలీవుడ్ స్టూడియోల తర్వాత చూసిన వాటిలో, ప్రపంచ ప్రఖ్యాత "బే వంతెన" గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విశేషం ఏంటంటే, సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ ఈ వంతెనపై, ఇంతవరకు, ఏ విఘ్నం లేకుండా కొనసాగుతున్న వాహనాల రాకపోకలకు, ప్రప్రధమంగా, మేం వెళ్లొచ్చిన మర్నాటినుంచి, అంతరాయం ఏర్పడింది. యాదృచ్చికమే కావచ్చు గాని, తాత్కాలికంగా చేపట్టిన రిపేర్ల సందర్భంగా, ఏర్పడిన అంతరాయం వల్ల వారం రోజుల వరకు దీన్ని మూసి వుంచారు.

శాన్ ఫ్రాన్ సిస్కో, ఓక్ లాండ్ లు పక్క-పక్కనే వున్న రెండు ప్రదేశాలు. దాదాపు జంట నగరాలని పిలవచ్చు. ఈ రెంటి మధ్య - రెంటినీ వేరు చేస్తూ, సముద్రముంటుంది. 1870 నుంచే రెంటిని కలుపుతూ, సముద్రం మీద వంతెన నిర్మించాలని భావించినప్పటికీ, 1930 లో-అప్పటి అమెరికా అధ్యక్షుడు, హెర్బర్ట్ హూవర్, ఆ ప్రతిపాదనకు అంగీకరించి, పూర్తి మద్దతు ప్రకటించిన తర్వాతే, ఆ కల నెరవేరింది. ప్రపంచంలోని అతిపెద్ద నిడివిగల వంతెనల్లో ఒకటైన బే బ్రిడ్జ్ పై, ప్రతి రోజు, దాదాపు మూడు లక్షల వాహనాలు అటు-ఇటు వచ్చి పోతుంటాయి. 1848–1855 నాటి "గోల్డ్ రష్" నేపధ్యంలో లక్షన్నర మంది ఇతర ప్రాంత అమెరికన్లు-లక్షన్నర మంది విదేశీయులు, మొత్తం మూడు లక్షలకు పైగా స్త్రీ-పురుష భేదం లేకుండా-పిల్లా జెల్లాతో సహా, భూ మార్గం-సాగర మార్గం-ఇతర మార్గాల ద్వారా కాలిఫోర్నియాకు చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే ఒక టోల్ బ్రిడ్జ్ సముద్రం మీద నిర్మించాలన్న ఆలోచన జరిగింది. అదే కార్యరూపం దాల్చి, 1933 కల్లా నిర్మాణం మొదలయింది. నవంబర్ 12, 1936 న, "గోల్డెన్‌గేట్" ప్రారంభానికి ఆర్నెల్ల ముందర, వాహనాల రాకపోకలు దానిమీద మొదలయ్యాయి.

"గోల్డెన్‌ గేట్ బ్రిడ్జ్"

ఇంద్ర ధనుస్సును తలదన్నే శోభాయమాన రంగులతో-వీనులకు విందైన ధ్వనులతో-అందంగా అలరారే వింత వింత కాంతులతో రంజిల్లుతూ, అద్భుతమైన భారీ శిఖరాలు-కేబుల్లు కలిగి, చాలా పొడుగ్గా వుండే, శాన్ ఫ్రాన్ సిస్కో "గోల్డెన్‌ గేట్ బ్రిడ్జ్" ప్రపంచంలోని అత్యంత సుందరమైన వంతెనల్లో అగ్రస్థానంలో వుంటుందంటారు.

సముద్ర గర్భం నుండి ఆవిర్భవించి, ఆకాశాన్ని తాకుతున్నదా అన్న చందాన కనిపించే ఈ పసిఫిక్ మహా సముద్రం పైన కట్టిన "వారధి" ని తనివితీరా చూసేందుకు, సంవత్సరం పొడుగూ-ముఖ్యంగా వేసవి రోజుల్లో, సుమారు కోటి మంది పర్యాటకులు వస్తుంటారని అంచనా. అద్భుతమైన ఆ వంతెన వరకు వెళ్లి, దాని మీదుగా ప్రయాణం చేసి, ఆ పక్కకు చేరుకుని, అలా నిలబడి ఎన్ని గంటలు గడిపినా తనివి తీరదనే అనాలి. ఇక దానిపై నడవడం గాని, సైకిల్ మీద తిరగడం గాని చేయడమంటే, ఏదో అడ్వంచర్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. "బే బ్రిడ్జ్" లాగా, ఇది కూడా శాన్ ఫ్రాన్ సిస్కో, ఓక్ లాండ్ లను కలిపి, రెండు ప్రాంతాల మధ్య, రవాణా సౌకర్యం సులభ తరం-వేగవంతం చేస్తుంది. అమెరికా ఉత్తర-దక్షిణ అంతర్ రాష్ట్ర రహదారి-హైవే లో, పసిఫిక్ మహా సముద్రం మీద నిర్మించిన "గోల్డెన్‌ గేట్ బ్రిడ్జ్", ఓక్ లాండ్ తో సహా, శాన్ ఫ్రాన్ సిస్కో - ఉత్తర దిశగా వున్న అమెరికన్ కౌంటీలకు మధ్య కీలకమైన వారధిగా రాక పోకడలకు ఉపయోగ పడుతున్నది.

అమెరికాలో వార్తా పత్రికలు చదువుతారా?

అమెరికా వచ్చినప్పటి నుంచి, "న్యూ యార్క్ టైమ్స్" దినపత్రికకు చందా కట్టి ఇంటికి తెప్పించుకునే ఏర్పాటు చేసుకున్నాను. అమెరికాలో సర్వ సాధారణంగా ఎవరు పత్రికలకు చందా కట్టి తెప్పించుకునే అలవాటుండదు. ఆన్ లైన్‌లోనే చదువుతారు. చందా కట్టకపోయినా, వారంలో కొన్ని రోజులు పత్రికల వాళ్లు ఉచితంగానే వేసి పోతూంటారు. తెల్లవారక ముందే, ఎప్పుడు వేస్తాడో-ఎవరు వేస్తాడో తెలియదు గాని, లేచేసరికి ఇంటి ముందర, చక్కటి ప్లాస్టిక్ కవర్లో, వర్షం కురిసినా తడవకుండా వుండే విధంగా పెట్టి, ఇంటి ముందర వేసి పోతారు. నాలాంటి వాళ్లు వచ్చినప్పుడు తప్ప వాటి జోలికి సాధారణంగా పోరు ఇక్కడుండే మనవాళ్లు గాని, అమెరికన్లు గాని. యధా ప్రకారం "ట్రాష్" లోకన్నా పోతుంది-లేదా-ఇంట్లోకి తేబడి తెరవకుండా "ట్రాష్” లోకన్నా పోతుంది. ఒకవేళ తెరవడమంటూ జరుగుతే, అందులో వుండే "కూపన్లు" చించు కోవడానికి మాత్రమే పరిమితం చేసి, మిగతాది ట్రాష్ లోకి చేరుస్తారు.

షుగర్ లాండ్

నవంబర్ 9, 2009న హ్యూస్టన్ లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు వెళ్లాం. శాన్ ఫ్రాన్ సిస్కోకు, హ్యూస్టన్ కు, టైమింగ్స్ లో తేడా వుంటుంది. హ్యూస్టన్లో రెండు గంటలు ముందుంటుంది. మేం ఈ తేడాలు పాటించకుండా మా ఏర్పాటు మేం చేసుకున్నాం. మా గడియారాల్లో ఇండియా టైమ్ ను మార్చకుండా, ఏ ప్రదేశంలో వున్నా, అక్కడి పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా, అదే టైమ్ ను చూసుకుండే వాళ్ళం. ఉదాహరణకు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు (అక్టోబర్ వరకు) ఉదయం ఏడు గంటలవుతే, హైదరాబాద్ లో సాయంత్రం ఏడున్నర గంటలయ్యేది. మా దృష్టిలో శాన్ ఫ్రాన్ సిస్కోలో అప్పుడు ఉదయం ఏడున్నర గంటలయినట్లుగా భావించేవాళ్లం. అలానే హ్యూస్టన్లో అప్పుడు (మేం వచ్చేసరికల్లా) ఉదయం ఏడు గంటలవుతే, ఇండియాలో సాయంత్రం ఆరున్నర గంటలయ్యేది. మా వరకు మాకు, హ్యూస్టన్లో ఉదయం ఆరున్నర గంటల కింద లెక్కే. ఇండియాలో ఉదయాన్ని సాయంత్రం లాగా, సాయంత్రాన్ని ఉదయం టైమ్ లాగా చూసుకున్నాం కనుకనే జెట్ లాగుల లాంటివి మమ్మల్ని భాదించలేదు. గడియారంలో టైమ్ కూడా మార్చలేదు. తిన్నా-తాగినా-నిద్ర పోయినా-పొద్దున లేచినా, అవే టైమ్స్ పాటించాం.

కిన్నెర వాళ్లుంటున్న షుగర్ లాండ్ ప్రాంతంలో, పక్క-పక్కనే వున్న, "న్యూ టెరిటరీ", "టెల్ ఫెయిర్‌" ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో చాలా మంది భారతీయులే. అందులోను ఎక్కువమంది తెలుగు వారే. ఎనభై వేలకు పైగా జనాభా వున్న షుగర్ లాండ్ సిటీ టెక్సాస్ రాష్ట్రంలో-ఫోర్ట్ బెండ్ కౌంటీలో వుంది. హ్యూస్టన్-షుగర్ లాండ్-బే టౌన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇదొక ముఖ్యమైన ప్రాంతం. టెక్సాస్ రాష్ట్రంలో అతి తొందరగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఇదొకటని అంటుంటారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి-మార్కెటింగ్ సంస్థగా గుర్తింపు పొందిన "ఇంపీరియల్ షుగర్" కేంద్ర కార్యాలయం షుగర్ లాండ్ లోనే వుంది. ఫోర్ట్ బెండ్ కౌంటీ లో, మాస్టర్ ప్రణాళిక ఆధారంగా నిర్మాణాలు జరిగిన ప్రదేశాల్లో షుగర్ లాండ్ ను మించింది లేదు. ఫస్ట్ కౌంటీ, షుగర్ క్రీక్, రివర్ స్టోన్, న్యూ టెరిటరీ, టెల్ ఫెయిర్‌, గ్రేట్ వుడ్ లాంటి ఎన్నో మాస్టర్ ప్రణాళికల కమ్యూనిటీ కాలనీలతో అలరారే అందమైన అమెరికన్ "ఛండీగఢ్" నగరం షుగర్ లాండ్. హ్యూస్టన్ పరిసరాల్లో ఎక్కడ తిరుగుతున్నా, భారతదేశంలోని ఏ హైదరాబాద్ లోనో తిరుగుతున్నట్లు వుంటుంది. వాతావరణం కూడా దాదాపు అలానే వుంటుంది. అలానే గుళ్లు-గోపురాలు, పెళ్లిళ్లు-పేరంటాలు, సాయంకాల సమావేశాలు, వీకెండ్ పార్టీలు, విందులు-వినోదాలు, అన్నీ అచ్చు హైదరాబాద్ లో మాదిరి అనుభూతే కలిగింది. స్నేహితులు, బంధువులు ఒకరి కష్ట సుఖాలు మరొకరు తెలుసుకుంటూ, అహర్నిశలు అండ-దండగా వుంటుంటారు. నిజంగా ఇక్కడ వీళ్లని చూసి, కలివిడిగా వుండే విధానం నేర్చుకోవాలనిపించింది.

“అష్టలక్ష్మి దేవాలయం"-"గోదా దేవి కల్యాణం"

షుగర్ లాండ్ లో “అష్టలక్ష్మి దేవాలయం" త్రిదండి చిన జీయర్ స్వామి ఆలోచనా సరళిని అనుసరించి వుంటుంది. హ్యూస్టన్లో, ఆ మాటకొస్తే అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో (చిన్న చిన్న ప్రదేశాల్లో కూడా) హిందు సంస్కృతి-సాంప్రదాయాలకు నిలయమైన అనేక దేవాలయాలు నెలకొల్పారు మన తెలుగు వారు. పిట్స్ బర్గ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సాక్షాత్తు తిరుమల దేవాలయంతో పోల్చడం అందరికి తెలిసిన విషయమే. దరిమిలా అమెరికాలోని పలు ప్రాంతాల్లో పిట్స్ బర్గ్ కు ధీటుగా దేవాలయాలు వెలిశాయి. సిన్స్ నాటిలో, డేటన్ లో వున్న దేవాలయాలను చూశాం. పిట్స్ బర్గ్ కు వెళ్లినప్పుడు, అక్కడున్న సాయిబాబా గుడిని కూడా చూశాం. అవి ఏవీ కూడా మన దేశంలోని పురాతన దేవాలయాలకు తీసిపోవు. పూజా-పునస్కారాలు కూడా శాస్త్రోక్తంగా, పాండిత్యం తెలిసిన అర్చకులే నిర్వహిస్తుంటారు. అన్నింటికన్నా విశేషం, మన మతాన్ని గౌరవిస్తూ, మన దేవాలయాల నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమెరికన్ ప్రభుత్వం రక్షణ కలిగించడం. సెక్యులరిజం అనేది మనదేశంలో ఎంతవరకు పాటిస్తున్నామో చెప్పలేం కాని, ఇక్కడ మాత్రం మన భావాలను గౌరవిస్తున్నారు. ఇక్కడ దేవాలయాల్లో అర్చకులుగా వచ్చేవారికి, రెలిజియస్ కోటా కింద వీసాలు జారీ అవుతాయి. కొందరు పూజారులు, తమ లాంటి వారిని ఇండియా నుంచి పిలిపించి, వారికి జీవనోపాధి కలిగిస్తున్నారు.

శ్రీ శ్రీ శ్రీ త్రి దండి రామానుజ చిన జీయర్ స్వామి బోధనలకనుగుణంగా, వైదిక సాంప్రదాయాన్ని-వేదాల్లోని విజ్ఞానాన్ని, నేటి తరం-భావి తరాల వాళ్ళకు అందించడమనే ప్రధాన ధ్యేయంగా ఈ దేవాలయం వివిధ కార్యక్రమాలను చేపడ్తుంది. పాంచరాత్ర ఆగమ సూత్రాలను తు. చ తప్పకుండా పాటిస్తూ స్థాపించబడిన అష్ట లక్ష్మి దేవాలయం, నిర్వహణలోనూ అవే అనుసరిస్తుంటుంది. చిన జీయర్ స్వామి, పెద జీయర్ స్వామి నిలువెత్తు ఫొటోలు, ఆళ్వార్ల ఫొటోలు, గోదా దేవి ఫొటోలు అక్కడ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. లక్ష్మి నారాయణ స్వామిని, ఆయన సరసన ఆది లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, గజ లక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యా లక్ష్మి, ధన లక్ష్మి విగ్రహాలు దర్శనమిస్తాయిక్కడ.

హ్యూస్టన్లో వుంటున్న తెలుగు వారు (ప్రధానంగా), ఇతర భారతీయులు తరచుగా కలుసుకునే పుణ్యం-పురుషార్థం కలుగజేసే "సాంప్రదాయ-సాహితీ సంగమం" అష్ట లక్ష్మి దేవాలయం.

ప్రతి సంక్రాంతి ముందర వచ్చే భోగి పండుగ నాడు చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే "గోదా దేవి కల్యాణం" ఉత్సవానికి హాజరవడం శ్రీమతికి అలవాటు. ముత్తారం దేవాలయంలో చేయించడం కూడా అలవాటుగా మారింది. గత సంవత్సరం, జీయర్ స్వామి ఆశ్రమం వెళ్లి, అక్కడ వేలాది మంది భక్తుల సరసన కూర్చొని, గోదా దేవి కల్యాణంలో పాల్గొన్నాం. ఈ సారి ఎలా అనుకుంటుంటే, భగవంతుడే ఆ ముచ్చట తీర్చాడు. చిన జీయర్ స్వామి చేయించిన రీతిలోనే, దాదాపు వేయి మందికి పైగా హాజరయిన భక్తుల సమక్షంలో, అష్టలక్ష్మి దేవాలయంలో వైభవంగా జరిగిన గోదా దేవి కల్యాణ మహోత్సవంలో 51 డాలర్లు చెల్లించి, అందులో పాల్గొన్నాం.

శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు కూడా మూడు దేవాలయాలను చూశాం. వాటిల్లో కాలిఫోర్నియా సాగర తీరంలో నివస్తున్న హిందువులందరికొరకు 1985 లో నిర్మించిన ఫ్రీమాంట్ దేవాలయం ఒకటి. మరో ప్రాముఖ్యత సంతరించుకున్న గుడి స్ప్రింగ్ టౌన్ లో వున్న "లివర్ మోర్ శివ-విష్ణు దేవాలయం". దీన్నే "హిందువుల సంస్కృతీ కేంద్రం" అని కూడా పిలిస్తారు. మొదట్లో తాత్కాలిమైన నిర్మాణం మాత్రమే వున్న గుడికి శాశ్వతమైన భారీ దేవాలయంగా నిర్మించ తలపెట్టినప్పుడు పునాది రాయిని వేసింది నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు. దేవాలయ నిర్మాణ శిల్పులు, ఆగమ పండితులు భారత దేశం నుండి వచ్చారు. సాంస్కృతిక కేంద్రానికి సంబంధించిన ఉత్సవాలను పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ జరిపించారు. విశాలమైన ఆవరనలో వున్న ఈ గుడికి వేల సంఖ్యలో భక్తులొస్తుంటారు. పండుగ దినాల్లో పదివేలకు పైగా భక్తులు దైవ దర్శనానికి వస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఆ దేవాలయం వెళ్లి ఉత్తర (వైకుంఠ) ద్వారం గుండా విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నాం. మా మనుమరాలు కనక్ తో కూడా అక్కడకు వెళ్ళాం ఒక సారి.

"లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్"

వారాంతపు శెలవు దినాన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హ్యూస్టన్ "నాసా" కేంద్రానికి వెళ్లొచ్చాం. 1957లో, అలనాటి సోవియట్ యూనియన్, కృత్రిమ అంతరిక్ష నౌకను మొదటిసారిగా ప్రయోగించడంతో, స్పందించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, ఏడాది తిరక్కుండానే, 1958 లో "నేషనల్ ఎయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్"-"నాసా" ను, స్థాపించాడు. హ్యూస్టన్ నగరంలో, 1961 లో "ప్రయాణీకుల అంతరిక్ష నౌకా కేంద్రం" గా అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ రూపకల్పన చేసి నెలకొల్పిన ఇక్కడి "నాసా" కార్యాలయం పేరును, జాన్సన్ మరణానంతరం, ఆయన స్మృతి చిహ్నంగా, "లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్" గా మార్చారు. గత నాలుగైదు దశాబ్దాలుగా మానవ అంతరిక్ష యానానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి-విజయవంతంగా అమలుకు రంగం సిద్ధం చేసిన సంస్థల్లో, ప్రపంచంలో అగ్రగామిగా పేరు తెచ్చుకుంది.

చంద్రుడిపై కాలుమోపే కార్యక్రమం విజయవంతంగా ముగిసి, వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి తిరిగొస్తుంటే, ప్రపంచం కళ్లన్నీ హ్యూస్టన్ మీదనే కేంద్రీకృతమయ్యాయి. జులై 20, 1969 రోజున చంద్రమండలం మీద కాలిడిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, అక్కడ నుంచే, "హ్యూస్టన్, ఈగిల్ లాండయింది" అనడం, కొన్ని గంటల్లోనే, అపోలో నౌక "లూనార్ మాడ్యూల్‌" నుంచి ఆయన సహచర వ్యోమగాములు, నిచ్చెన ద్వారా దిగి అంతరిక్షంలో పాదం పెట్టి, "మానవుడికి ఇదొక చిన్న అడుగే కాని, మానవాళి మనుగడ దిశగా వేసిన పెద్ద అడుగు" అని ప్రకటించడం, ఇక్కడి వారికి మరపు రాని సంఘటన. ఇంతవరకు జరిపిన అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన అలనాటి "ప్రత్యక్ష ప్రసారాలు", వ్యోమగాముల శిక్షణా వివరాలు, మిషన్ కంట్రోల్ కేంద్రం, చంద్ర మండలం నుంచి తెచ్చిన శిలలు, "నాసా" వాహనంలో పర్యటన, అంతరిక్షంలో నౌకను పంపే సమయంలో అడుగడుగునా చోటు చేసుకునే సంఘటనలు, వినోద కార్య క్రమాల కూడలి హ్యూస్టన్లోని "నాసా" కేంద్రం.

"నెలనెలా తెలుగు వెన్నెల"-"సాహిత్యం-మానవ విలువలు"

హ్యూస్టన్ కు వచ్చిన రెండువారాలకు నవంబర్ 21న, అక్కడి తెలుగువారు ప్రతినెలా నిర్వహించుకునే "నెలనెలా తెలుగు వెన్నెల" కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, "హిందూత్వం-మార్క్సిజం-రామాయణం-మానవ విలువలు" గురించి మాట్లాడమన్నారు. ఆ సంస్థ ముఖ్య నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ పిల్లుట్ల సుదేష్, నేను శాన్ ఫ్రాన్ సిస్కోలో వుండగానే, హ్యూస్టన్ వచ్చినప్పుడు తమ సంస్థ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించారు. నా కంటె ముందు-నా తర్వాత ఆ సంస్థ ఆహ్వానించిన గౌరవ-ముఖ్య అతిథుల్లో అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, "కళాప్రపూర్ణ శ్రీమతి ఎ. అనసూయాదేవి గారు, హనుమాన్ స్వామి ఆచార్యులు గారు, కళానాధభట్ట వీరభద్ర శాస్త్రి గారు, రామ్మోహన్ గారు, వెన్నెలకంటి మాణిక్యం గారు, వేదాంతం రాఘవ గారు, ఆచార్య పాడూర్ జగదీశ్వరన్ గారు, సరోజ శ్రీ శ్రీ గారు, ఆర్టిస్ట్ చంద్ర గారు, పప్పు నరసింహమూర్తి గారి లాంటి ప్రముఖులున్నారు.

శ్రీ సుదేష్ గారు నాకు మా అమ్మాయి కిన్నెర ద్వారా హ్యూస్టన్ లో పరిచయమైన "మంచి సాహితీ మిత్రుడు". ఎక్కడో వేల మైళ్ల దూరం వచ్చి తెలు తల్లికి సేవచేస్తున్న మంచి మనసున్న కుటుంబం వారిది. శంకరాభరణం శంకరశాస్త్రి గారింట్లో పాదం మోపితే "సరిగమలు" వినిపిస్తాయని సినిమాలో చూసినట్లే, వీళ్ళింట్లోకి వెళ్తే, మరచిపోతున్న మన సంస్కృతీ-సాంప్రదాయాలు కళ్ల ముంద సాక్షాత్కరిస్తాయి. హిందువుల సాంప్రదాయ పండుగలకైనా, ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డే లాంటి సందర్భంలోనైనా, న్యూ ఇయర్స్ డే కైనా, ఆయన-కుటుంబ సభ్యులు శ్రద్ధతీసుకుని చేసే ఏర్పాట్లు చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత మధ్యలో పదిరోజుల పాటు మా కనక్ బారసాలకు శాన్ ఫ్రాన్ సిస్కో వెళ్లి, డిసెంబర్ 30 న తిరిగి వచ్చాం. అలా రావడంవల్ల న్యూ ఇయర్స్ డే సందర్భంగా, డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, సుదేష్ కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విందు-వినోద కార్యక్రమం మా అమెరికా పర్యటనలో ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోతుందనాలి. చిన్న పిల్లలు, చిన్న పిల్లల్లా పెద్దలు, ఆడా-మగ తేడా లేకుండా, కలసి-మెలసి ఆనందంగా, తూరుపు-పడమరల సంగమంగా ఎంతో వేడుకగా జరుపుకొని, అర్థరాత్రి పన్నెండవుతూనే "హేపీ న్యూ ఇయర్ టు యూ" అంటూ కేరింతలు వేశారందరూ. అలానే సంక్రాంతి సంబరాలు జరిపించారు.

అమెరికాలో సొంత ఇల్లు

ఇక్కడివారు చాలామంది, గృహప్రవేశం కావాలంటే తిథి-వార-నక్షత్రాలతో సహా ఇల్లు కొనేటప్పుడు వాస్తుకూడా చూస్తుంటారు. భారతదేశంలో-ఆంధ్ర ప్రదేశ్ లో, ఎవరైనా-ఏ విధంగా శాస్త్రం చెప్పిన పద్ధతిలో గృహప్రవేశం చేస్తుంటారో, అదే విధంగా ఆవగింజ తేడా లేకుండా, ప్రతి విషయంలోనూ శ్రద్ధగా కార్యక్రమాలు చేస్తారు. ద్వారం ముందు గడప వద్ద మంచి గుమ్మడికాయ పగల గొట్టడం, బూడిద గుమ్మడికాయ ఇంటి ముందరుంచడం, దేవుడిని ఈశాన్యంలో ఏర్పాటుచేయడం, పుణ్యాహవాచన, పాలు పొంగించడం, గణపతి పూజ లాంటి కార్యక్రమాలన్నీ యధా విధిగా జరిపించుతారిక్కడి బ్రాహ్మణుడు.

అమెరికాలో ఇల్లు కొనడమనేది కొంచెం కష్టం అనిపించినా, వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ పోతే, ఇంటి తాళం చేతులు చేతికందుకోవడానికి నాలుగైదు నెలల కంటే ఎక్కువ పట్టదు. ఇల్లు కొనాలనుకునేవారి ఆదాయ వనరులు-అసలు ఆదాయం, దాని ఆధారంగా ఎంత ఋణ సౌకర్యం పొందే వీలుంది, నెలసరి ఖర్చెంత, దాచుకున్న డబ్బునుంచి కట్టగలిగేదెంత, తీసుకోదల్చిన ఋణం మీద చెల్లించే స్తోమతున్న వడ్డీ రేటు లాంటి విషయాల ప్రాతిపదికగా, అందులో అనుభవమున్న స్నేహితుల-నిపుణుల సలహా సంప్రదింపులతో ఆరంభించడం మంచిది.

అమెరికా-హ్యూస్టన్ నగరంలోని షుగర్ లాండ్ లో, మా అమ్మాయి కట్టుకున్న ఇంట్లో గృహ ప్రవేశానికి అర్థరాత్రి వచ్చిన వారిలో చాలామంది, హడావిడిగా వెళ్లడానికి సిద్ధమౌతుంటే, కారణమేంటని అడిగాను కొందరిని. అప్పటికే ఆలశ్యమైందని అంటూ, మరికొన్ని గంటల్లో "బ్లాక్ ఫ్రైడే" అమ్మకాలు మొదలైతాయనీ, వీలైనంత త్వరగా మాల్స్ దగ్గరికెళ్లి క్యూలో నిలబడాలనీ వెళ్లిపోయారు వాళ్లు. ఆ తర్వాత మా అమ్మాయి చెప్పింది-బహుశా గృహప్రవేశంతో బిజీగా లేనట్లైతే, తనుకూడా, వెళ్లేదానినేమోనని. అమెరికా దేశమంతా అత్యంత ఆహ్లాదంగా-ఆడంబరంగా ప్రతిఏటా జరుపుకునే "కృతజ్ఞతలు తెలుపుకునే రోజు"-థేంక్స్ గివింగ్ డే, ఈ సంవత్సరం, గురువారం (నవంబర్ 26, 2009) నాడు, జన్మతః అమెరికన్లతో సహా, ప్రవాస భారతీయులు-ఆంధ్రులు కూడా జల్సాగా జరుపుకున్నారు. వారిలో కొందరైతే అమెరికన్ల సాంప్రదాయ వంటకమైన "టర్కీ" ని కూడా తయారు చేసుకొని, భందు మిత్రులతో కలిసి భోంచేశారు. ఇంకొందరు సహచర అమెరికన్ మిత్రులతో గడిపారు. థేంక్స్ గివింగ్ డే ఒక పండగైతే, మరుసటి రోజు వచ్చే బ్లాక్ ఫ్రైడే ను మరింత ఆర్భాటంగా ఎంజాయి చేస్తారు అమెరికన్లు-అమెరికాలో స్థిరపడ్డ అమెరికనేతరులు. వాస్తవానికి ఈ రెండు రోజులకొరకు అమెరికాలో వున్న వారంతా ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తుంటారు. ఉద్యోగస్థులకు-విద్యార్థులకు పెద్ద ఆట విడుపిది. లాంగ్ హాలీడే గా, అయిదారు రోజుల ముందునుంచే శెలవు వాతావరణం సర్వత్రా నెలకొని వుంటుంది.

పదేళ్ల క్రితం అమెరికాకు ఇప్పటి అమెరికాకు పోలికే లేదు

ఆరంకెల డాలర్ల నెలసరి ఆదాయం-ఆరు గదుల అందమైన ఇల్లు కోల్పోయి, తినడానికి తిండి -ఉండడానికి ఇల్లు లేక, గంపెడు కుటుంబంతో, కేవలం ప్రభుత్వ సహాయంతో జీవించే అమెరికన్ల సంఖ్య రోజు-రోజుకు పెరిగిపోతుంది. కనీ-వినీ ఎరుగని ఆర్థిక మాంద్యం నేపధ్యంలో ఉపాధి కోల్పోయిన పలువురు, ఉద్యోగాలకు దరఖాస్తులు పంపడం-అవన్నీ బుట్ట దాఖలా కావడం సర్వసాధారణ విషయమై పోయిందిప్పుడు అమెరికాలో. నిరుద్యోగ సమస్య వృద్ధి రేట్ నానాటికి పెరుగుతూ 10% దాటిందిప్పుడు. పది సంవత్సరాల క్రితం జులై 1999లో మొదటిసారి నేనొచ్చిన అమెరికాకు ఇప్పటి అమెరికాకు పోలికే లేదు. అప్పుడదో "భూతల స్వర్గం-భోగ భూమి". భారతదేశమంటే అక్కడ నుండి ఇక్కడ కొచ్చి స్థిరపడినవారికి కూడా కేవలం "కర్మ భూమి" మాత్రమే ! రెండో పర్యాయం మార్చ్ 2003లో వచ్చినప్పుడు అమెరికా ఇరాక్ తో భీకర సంగ్రామంలో కూరుకుపోయింది. "భవిష్యత్ ప్రకంపనలు" అమెరికా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే కొట్టొచ్చినట్లు కనబడ్డాయప్పటికే. అనుకున్నంతా అయిందనిపిస్తోదిప్పుడు. రాజకీయాలనుంచి, సామాజిక జీవన శైలి వరకు-దైనందిన జీవనశైలి తో సహా, ప్రతి విషయంలోను వైరుధ్యం స్పష్టంగా గోచరిస్తున్నది. ప్రతివారిలో ఏదో అ భద్రతా భావం, ఏదో కోల్పోతున్నా మన్న తపన, ఎలా అంతో-ఇంతో వెనకేసుకోవాలన్న ఆలోచన కనిపిస్తుందిప్పుడు. ఈ విషయంలో అమెరికన్లకు, వలస వచ్చి స్థిరపడిన ఇతర దేశీయులకు తేడా ఏ మాత్రం లేదనాలి.

అమెరికా 44వ అధ్యక్షుడుగా, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతీయుడైన బారక్ హుస్సేన్ ఒబామా జనవరి 20, 2009న అధికారం చేపట్టాడు. ఒక వైపు అంతర్జాతీయ ఉగ్రవాదం, మరో వైపు తీవ్ర ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తున్న క్లిష్ట తరుణంలో అధ్యక్షుడయ్యాడు ఒబామా. ఆయన పదవీకాలమంతా లోటు బడ్జెట్ తోనే గడపాల్సి వస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాక్, అఫ్గానిస్థాన్‌ సమస్యలతో సహా ఆర్థిక పరమైన విషయాలన్నిటికి సంబంధించి మొదటి సంవత్సరం తాను చేయాలనుకుంటున్న కార్యాచరణ ప్రణాళికను అధికారం చేపట్టడానికంటే ముందే సిద్ధం చేసుకున్నాడు ఒబామా.

అధ్యక్షుడు నల్లజాతివాడైనా, జాతి వివక్షత పూర్తిగా సమసి పోయినట్లు లేదింకా. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందినప్పటికీ, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతి వారికి ఉద్యోగాలు దొరకడం కష్టమై పోతున్నది. నల్ల వారినుండి ఎంత వ్యతిరేకత వచ్చినా రాజకీయంగా తనకు ఎటువంటి నష్టం కలగదని ఒబామా భావిస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి, అమెరికాలోని నల్ల జాతి ఓటర్లందరూ ఓటింగ్ లో పాల్గొన కుండా ఇళ్లలో కూరుచున్నా, ఒబామా గెలిచేవాడు. తెల్ల వారిలో అధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమైన వ్యక్తిగా, నల్లజాతివారి పక్షాన పక్షపాత దృష్టితో వ్యవహరించనివాడిలా పేరు తెచ్చుకుంటున్నాడు ఒబామా.

ఒబామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య సంస్కరణల చట్టం దిగువ సభ ఆమోదం పొంది, సెనేట్ ఆమోదం కొరకు ఎదురుచూస్తున్నది. చట్టంగా రూపు దిద్దుకునే సమయానికి దాని రూపురేఖలెలా వుంటాయనేది ఇంకా ప్రశ్నార్థకమే. అయితే గుడ్డిలో మెల్ల లాగా, 2009 డిసెంబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నదని, ఆర్థిక మాంద్యంలో వెసులుబాటు కలుగుతున్నదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నట్లు మీడియా కథనాలొస్తున్నాయి. అదెంతవరకు వాస్తవమో కాలమే తేల్చాలి. ఇవన్నీ ఇలా వుండగా, అక్టోబర్ 9, 2009న, ఒబామాకు నోబెల్ శాంతి బహుమానం ప్రకటించడం-దాన్ని ఆయన ఆస్లో నగరంలో నిరసన ధ్వనుల మధ్య అందుకోవడం జరిగింది.అంతర్జాతీయ సమస్యలు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ సమస్య తీవ్రత, జాతి వివక్షత, అమెరికాపై పెరిగిపోతున్న ఉగ్రవాద ప్రభావం, స్వపక్ష-విపక్షాలనుండి ఎదురవుతున్న విమర్శలతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఒబామా భవిష్యత్ లో మిగిలున్న మూడేళ్ల కాలాన్ని ఎలా పూర్తిచేసుకుంటాడోననేది ఆసక్తికరమైన విషయమే.

No comments:

Post a Comment