Monday, April 26, 2010

II-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-2) : వనం జ్వాలానరసింహారావు

అంతర్మధనం-2
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు

మే నెల 25, 2009న రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చూడడానికి ఒక పాత్రికేయుడిగా రాజ్ భవన్ కు వెళ్ళాను. వెంకట్ గారు వస్తే బాగుంటుందని నేను అనడంతో ఆయన కూడా వచ్చారు. ప్రమాణ స్వీకారం అయింతర్వాత ఇద్దరం కలిసి తెలిసిన ఒకరిద్దరిని కలుసుకుంటున్నప్పుడు సుబ్రహ్మణ్యం గారి దగ్గరనుంచి మర్నాడు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం గురించి ఫోన్ వచ్చింది వెంకట్ గారికి. మర్నాడు ఉదయం (మే నెల 26, 2009) పదకొండు గంటలకు సమావేశం జరిగింది. ఆరోగ్య-వైద్య శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి జె.సత్యనారాయణ గారు, కమీషనర్ అనిల్ పునీఠ గారు, 108-104 సేవల ప్రభుత్వ సలహాదారు పీ.కె.అగర్వాల్, (ఆర్థిక శాఖ) సీనియర్ మంత్రి శ్రీ రోశయ్య, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆ సమావేశంలో వున్నారు. సమావేశానికి ముందర ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ గారి దగ్గర అందరం కలిసాం. ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించిన వివరాలను సత్యనారాయణ గారు మాతో చర్చించారు. ఆయనకు ఏం చెప్పాల్నో-ఏ విధమైన సహాయం ప్రభుత్వం నుంచి అవసరమౌతుందో అన్న విషయాలపై అందరం ఒక అవగాహనకు వచ్చాం. అయితే దివంగత ముఖ్యమంత్రి అవేవీ పట్టించుకోలేదు. కేవలం సీ.ఇ.ఓ ను తనకవసరమైన వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ గారు, అగర్వాల్ గారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారు. తక్షణమే స్పందించారు. స్పందించి, జీ.వి.కె రెడ్డి గారికి ఫోన్ కలవమన్నారు.

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, అనునయంగా-ఆప్యాయంగా మాట్లాడుతూ, ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చవలసిన ఆవశ్యకతను వివరించిన పద్ధతి నిజంగా శ్లాఘనీయం.ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. "అన్నా... ఇంతకు ముందే నీతో చెప్పాను గదా! ఎన్నికల హడావిడిలో మరోమారు చెప్పడం కుదరలేదు. ఎవరో మహారాష్ర్ట్ర నుంచి పిరమిల్ అనే సంస్థ యాజమాన్యం ఇక్కడకు వచ్చి, మన 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణలో ఎందుకు ప్రయివేట్ భాగస్వామి కావాలి? మీరందరూ లేరా? మా ప్రభుత్వానికి అత్యంత ఆదరణీయమైన ఈ పథకానికి యాజమాన్య పరంగాను, ప్రయివేట్ భాగస్వామ్య పరంగాను అవసరమైన నిధులను మీరెందుకు సమకూర్చకూడదు? సమకూర్చమని కోరుతున్నాను. ప్రభుత్వం ఎలాగూ 95% మేర నిర్వహణ పరమైన నిధులను సమకూరుస్తుంది కదా !" అని అన్నారాయన తో. అటువైపు నుంచి ఆయన ఏం మాట్లాడోకాని, ఇటునుంచి రాజశేఖర రెడ్డి గారు మాత్రం "తప్పక-తప్పకుండా" అన్న మాటలను పదే పదే ఉచ్చరించడం మాకు వినపడింది. బహుశా ముఖ్యమంత్రి నుంచి జీ.వీ.కె కొన్ని హామీలు కోరినట్లు మేమర్థం చేసుకున్నాం. అవేమై వుంటాయో కూడా నాకు కొంతమేరకు అవగాహన అయింది. ఏదేమైనా సంక్షోబంలో వున్న ఇ.ఎం.ఆర్.ఐని గట్టెక్కించడానికి రాజశేఖర రెడ్డి గారు తీసుసుకున్న చొరవ-అది వెంటనే ఫలితమివ్వడంతో, సంతోషంతో సమావేశం నుంచి బయటకొచ్చాం. బయటకొస్తూనే మంత్రివర్గ పోర్ట్ పోలియోల జాబితా చూసుకొని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు 108-104 శాఖలను కేటాయించినట్లు తెలుసుకున్నాం. ఆయన్ను కలవాలని నిశ్చయించుకున్నాం. బహుశా ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, అత్యవసర సహాయసేవలకు ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయడం మన రాష్ర్ట్రంలోనే జరిగిందనాలి. ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారిదే.

లంచ్ ముగించుకొనేలోపల, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి గారు జీ.వీ.కె కు ఫోన్ చేసి ఆయన్ను ఆ సాయింత్రం (మే నెల 26, 2009) నాలుగు-అయిదు గంటల సమయంలో కలిసే ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాన్నే చాకచక్యంగా "బోర్డ్ సభ్యుల సమావేశం" గా మలిచారు వెంకట్. ఈ లోగా 108-104 శాఖలకు కేటాయించిన కొత్త మంత్రిని మర్యాద పూర్వకంగా ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నాం. అక్కడినుంచి జీ.వీ.కె కార్యాలయం వున్న తాజ్ కృష్ణా హోటల్ కు వెళ్లాం. ఇక్కడొక విషయం చెప్పాలి.

ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగరాజు గారు సత్యం కుంభకోణంలో జైలుకెళ్లడానికి ముందర తన పదవికి రాజీనామా చేయడంతో, అంతవరకు ఆయన ఆహ్వానం మేరకు ఇ.ఎం.ఆర్.ఐ బోర్డ్ సభ్యులుగా వున్న వారందరూ ఒకరి వెంట ఒకరు రాజీనామాలు సమర్పించారు. చైర్మన్ ఎమిరిటస్ గా వున్న మాజీ రాష్ర్ట్రపతి కలాంతో సహా నలుగురు మినహా అందరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసినవారిలో, భారత రత్న ఏ.పీ.జె అబ్దుల్ కలాం, రామరాజు, తరుణ్ దాస్, కె.వి.కమత్, క్రిష్ణా పాలెపు, కిరణ్ కార్నిక్ లున్నారు. రాజీనామా చేయంది నలుగురు మాత్రమే. సీ.ఇ.ఓ వెంకట్ తో కలుపుకుని కేవలం అయిదుగురు సభ్యులే ఇక బోర్డ్ లో మిగిలారు. రాజీనామా చేయని మెకన్జీ మాజీ ఎం.డీ రజత్ గుప్తా, కర్నెగీ మిలన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ రెడ్డి, లోక్ సత్తా నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ, సుచిత్ర చైర్మన్ కృష్ణం రాజులను జీ.వీ.కె కార్యాలయానికి ఆహ్వానించారు వెంకట్. డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ, కృష్ణం రాజులు హాజరుకాగా, మిగిలిన ఇద్దరు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

తాజ్ కృష్ణా సమావేశమందిరంలో సరిగ్గా సాయింత్రం అయిదు గంటలకు మొదలైన సమావేశం సుమారు గంటన్నర పైగా సాగింది. ఆరంభంలో వెంకట్ గత నాలుగు నెలలుగా ఆయన చేసిన ప్రయత్నాలు, అందులో భాగంగా జీ.వీ.కె సంస్థ ఇ.ఎం.ఆర్.ఐ కి తోడ్పడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వైనం, మధ్యలో పిరమిల్ ఆసక్త్గి కనబరచడం-వెనక్కు తగ్గడం, ఆ రోజున ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశపు వివరాలు, జీ.వీ.కే తోడ్పాటుతో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాల్సిందిగా ముఖ్యమంత్రి చేసిన సూచనకు సంబంధించిన వివరాలను బోర్డ్ సభ్యులకు తెలియచేశారు. సమావేశంలో కొద్దిసేపు సీ.ఇ.ఓ వెంకట్ తో పాటు, ఆయన సహచరులం కొందరం కూడా పాల్గొన్నాం. జీ.వీ.కె తన భావాలను, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పట్ల-108 అత్యవసర సహాయ సేవల పట్ల తనకున్న గౌరవాన్ని, రాజుగారి పట్ల తనకున్న అభిమానాన్ని, ముఖ్యమంత్రి ఆదేశాల అమలు విషయంలో తనకున్న చిత్తశుద్ధిని, ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేయాల్సిన కృషిని చక్కగా వివరించారు. ఎంతో బిజీగా వున్న ముఖ్యమంత్రిని ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ అంత సులభంగా కలుసుగోగలిగి, సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చి, పరిష్కార మార్గాన్ని త్వరితగతిన అన్వేషించగలిగినందుకు ఆయన్ను అభినందించారు. రాజీనామా చేయకుండా కొనసాగుతున్న రజత్ గుప్తాను, రాజ్ రెడ్డిని, జయప్రకాశ్ నారాయణను, కృష్ణంరాజును మున్ముందు కూడా సభ్యులుగా కొనసాగమని విజ్ఞప్తి చేశారు జీ.వీ.కె. బోర్డ్ సభ్యుల కోరిక మేరకు, తక్షణమే ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా జీ.వీ.కె పదవీ బాధ్యతలు స్వీకరించారు . ఆ సాయింత్రం ముఖ్యమంత్రిని కూడా కలిశారు ఆయన. రాజుగారు రాజీనామా చేసిన నాలుగున్నర నెలలకు, ఆ విధంగా, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు నూతన అధ్యక్షుడిగా జీ.వీ.కె బాధ్యతలు చేపట్టారు. మర్నాడు పత్రికలన్నీ ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించాయి.

వాస్తవానికి వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు గారు ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా రాజీనామా చేసిన నాటినుంచి (జనవరి 7, 2009) జీ.వీ.కె ఆ పదవి చేపట్టిన రోజు (మే నెల 26, 2009) వరకు బాహ్య ప్రపంచానికి అంతగా అవసరంలేని-పట్టని పలు ఇబ్బందులకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ లోనైంది. అయినా ఒక్క రోజుకూడా 108 అత్యవసర సహాయ సేవలు, ఒక్క క్షణం కూడా ఆపబడలేదు. వెంకట్ కు, ఆయన సహచర యాజమాన్య బృందానికి, నెల-నెలా జీతాలు వచ్చినా-రాకపోయినా, అంబులెన్స్ లో పని చేసే పైలట్లకు-ఇ.ఎం.టీ లకు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (కాల్ సెంటర్) లో పని చేసే కమ్యూనికేషన్-డిస్పాచ్ ఉద్యోగులకు, ఇతర కింది స్థాయి వుద్యోగులకు (జిల్లా మేనేజర్లతో సహా) ఒకటి-రెండు రోజులు ఆలస్యమైనా ప్రతినెలా జీతాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ, ఐ.టి సంస్థ సత్యం సంక్షోభంలో పడిందని, ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగ రాజు నెలకొల్పిన (ప్రజలకు ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో 108 అత్యవసర సహాయక సేవలందించే) అత్యవసర యాజమాన్య పరిశోధనా నిర్వహణ సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) గతంలో మాదిరిగా ఇకముందు కూడా సేవలనందిస్తుందా అనే సందేహాన్ని వ్యక్తపరచని పత్రిక-ఛానల్ లేదనే చెప్పొచ్చు. జనవరి 7, 2009న రామలింగ రాజు తన పదవికి రాజీనామా చేసిన మర్నాడే-అంటే జనవరి 8, 2009న మన రాష్ర్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లాంటి హామీలనే జనవరి 9, 2009న కర్నాటక, గుజరాత్, ఉత్తరాంచల్ ప్రభుత్వాలు ఇచ్చాయి. ఆ తర్వాత ఒకటి-రెండు రోజుల్లో 108 అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న మిగతా రాష్ర్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా అవసరమైతే నూటికి-నూరు శాతం నిర్వహణ పరమైన నిధులిస్తామని ప్రకటించాయి. రాజశేఖర రెడ్డి గారిని కలిసి వచ్చిన మరుక్షణం నుంచే ఇ.ఎం.ఆర్.ఐకి ప్రయివేట్ భాగస్వామిగా నిధులను సమకూర్చ గలిగే ఆసక్తి వున్న వ్యక్తుల-సంస్థల కొరకు వెంకట్-ఆయన సహచరులు ప్రయత్నాలు చేయసాగారు. సంక్షోభం వుందని పత్రికలన్నీ ఎలుగెత్తి చాటుతున్నా, కొత్తగా మేఘాలయ రాష్ర్ట్రంలో ఫిబ్రవరి 2, 2009 న 108 అత్యవసర సహాయ సేవలు ప్రారంభించాం.

అయితే ఇ.ఎం.ఆర్.ఐ పడుతున్న ఇబ్బందులు ఒకరికి చెప్పుకోలేనివి. ఒక విధంగా "మింగలేకా-కక్కలేకా"అన్న చందాన వున్నటువంటివి.

మే నెల 26, 2009 న డాక్టర్ జీ.వీ.కె రెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పది రోజులకు జూన్ 3, 2009 న బోర్డ్ సమావేశమైంది. వివిధ రంగాలలో నిష్ణాతులుగా ప్రసిద్ధికెక్కిన మరో ముగ్గురు ప్రముఖ వ్యక్తులను బోర్డ్ సభ్యులుగా చేర్చుకున్నారు. అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన మాజీ ఇండియన్ అడ్మినిస్ర్టేటివ్ సర్వీసెస్ అధికారి డాక్టర్ అబిద్ హుస్సేన్, మాజీ సీ.బి.ఐ డైరెక్టర్-మాజీ జాతీయ మానవ హక్కుల కమీషన్ డైరెక్టర్ జనరల్ డీ.ఆర్. కార్తికేయన్, ఎల్ అండ్ టీ సంస్థ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్-మాజీ ప్రెసిడెంట్ ఏ. రామకృష్ణ లను అప్పుడున్న అయిదుగురు సభ్యులకు అదనంగా బోర్డ్ సభ్యులుగా జీ.వీ.కె ఆహ్వానించారు . అంతే కాకుండా, జీ.వీ.కె సంస్థ పక్షాన, చైర్మన్ గా డాక్టర్ జీ.వీ.కె రెడ్డి-ఆయన భార్య శ్రీమతి ఇందిర కృష్ణారెడ్డి-వైస్ చైర్మన్ గా ఆయన కుమారుడు శ్రీ జీ.వీ. సంజీవరెడ్డి-సభ్యుడుగా శ్రీ ఎస్. భూపాల్ కూడా వుండే ఏర్పాటు చేశారు.

ఆ వెంటనే సమావేశమైన బోర్డ్ సభ్యులు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పేరును ఇకముందు "జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ"గా మార్చాలని నిర్ణయించారు. అలా మార్చడం వల్ల "ప్రాణాలను కాపాడే అత్యవసర సహాయక సేవలు మరింత పటిష్ఠ పడేందుకు జీ.వీ.కె నిబద్ధత ప్రతిబింబిస్తుందని, తద్వారా సేవలందించడం మరింత వేగవంతంగా-నైపుణ్యంగా-ఆచరణాత్మకంగా-పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని" బోర్డ్ సభ్యులు అభిప్రాయ పడ్డారు. దేశం నలుమూలలకూ అత్యవసర సహాయ సేవలు విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని, అవి మరింత పటిష్ఠ పడేలా చర్యలు తీసుకుంటానని నూతన అధ్యక్షుడు పత్రికాముఖంగా ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి ఎగువగా, ఇనుమడించిన పారదర్శకతతో-ఆధునిక యాజమాన్య, నాయకత్వ సిద్ధాంతాలకనుగుణంగా అత్యవసర సహాయక సేవలను జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తుందని వైస్ చైర్మన్ గా నియమితులయిన సంజీవరెడ్డి ప్రకటించారు. మిగతా సభ్యులందరూ వారికి వంతపాడారు.

మరెందుకీ సంస్థ-అది అందిస్తున్న అత్యవసర సహాయ సేవలు ఇబ్బందులకు లోను కావాలి? అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు-జీ.వీ.కె హామీలు కాగితాలకే పరిమితమా? లేక యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? పోనీ అధికారులు రాజశేఖర రెడ్డి లేని లోటును పరోక్షంగా ప్రదర్శిస్తున్నారా? ఒకవైపేమో "నిబద్ధత “ను కలిగున్న జీ.వీ.కె-మరో వైపేమో రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానంటున్న ముఖ్యమంత్రి రోశయ్య గారు-108 శాఖను నిర్వహిస్తున్న మంత్రి గారేమో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి (జగన్మోహన్ రెడ్డి గారి) అనుయాయుడు-అన్నింటికన్నా మించి పాతికేళ్ళ పైబడి యాజమాన్య నిర్వహణ అనుభవం, కష్ట కాలంలో బాధ్యతలు నైపుణ్యంతో నెరవేర్చిన సీ.ఇ.ఓ వెంకట్. అంగట్లో అన్నీ వున్నా... అల్లుడి నోట్లో శని అన్న చందాన వుంది అత్యవసర సహాయ సేవలు. ఈ సేవల కొనసాగింపు ప్రభుత్వ (లాభాపేక్ష లేని) ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకే ఒక పెను సవాలు. వ్యక్తిగత పట్టింపులకు-పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన-అమలు చేయాల్సిన ఈ సేవలు కేవలం ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో కావు-కాకూడదు.

No comments:

Post a Comment