Monday, November 8, 2010

వీరప్ప మొయిలీ పాలనా సంస్కరణల కమిషన్ సిఫారసులు ఏమవుతున్నాయి? : వనం జ్వాలా నరసింహారావు

వీరప్ప మొయిలీ పాలనా సంస్కరణల కమిషన్
సిఫారసులు ఏమవుతున్నాయి?
వనం జ్వాలా నరసింహారావు

మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం, వీరప్ప మొయిలీ అధ్యక్షతన, ఆగస్ట్ 31, 2005 న ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్‌, మే నెల 31, 2009 న పదిహేను సుదీర్ఘమైన నివేదికల రూపంలో, అనేక రకమైన పాలనాపరమైన సిఫారసులు చేసింది. ఆ సిఫారసులను ఏఏ రంగాలలో-ఎంత మేరకు అమలు జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయంలో అధికారులకు కాని, మంత్రులకు కాని, వాటి అవసరం వున్న పౌరులకు కాని ఏ మాత్రం సమాచారం లేకపోవడం దురదృష్టకరం. అనేక రంగాలలో పాలనానుభవం కలిగిన వి. రామచంద్రన్, డాక్టర్ ఏపి ముఖర్జీ, డాక్టర్ ఏ హెచ్ కల్రో, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, వినితారాయ్ లాంటి ప్రముఖులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌లో, సభ్యులుగా వున్నారు. వారి సిఫారసులు, గతంలో పాలనా సంస్కరణలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ-కమీషన్ల సిఫారసుల మాదిరిగా కాకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం మర్చిపోయినట్లే స్పష్టమవుతోంది. అసలా మాటకొస్తే, కొత్త కమిషన్‌ని నియమించాలనే ఆలోచన చేసే ముందు ఇదివరకటి కమిటీలూ, కమిషన్‌లు చేసిన సూచనలూ, సిఫారసులపై ప్రభుత్వం దృష్టిసారించి, వాటి అమలుకు తగు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదేమో!

వీరప్ప మొయిలీ కమీషన్‌ను ప్రభుత్వం అనేక కీలకాంశాలపై అధ్యయనం చేయమని కోరింది. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థా స్వరూపం, పాలనలో నైతిక విలువలు, సిబ్బంది పాలన వ్యవహారాలను గాడిన పెట్టడం, ఆర్థిక యాజమాన్య పటిష్టత, రాష్ట్ర స్థాయి పాలనలో మార్పులు, జిల్లా పాలనా యంత్రాంగంలో మార్పులు, స్థానిక సంస్థల బలోపేతం, సోషల్ కాపిటల్, పౌర సదుపాయ పాలన, ఇ-పరిపాలనకు ప్రోత్సాహం, ఫెడరల్ స్ఫూర్తికి సంబంధించిన సమస్యలు, సంక్షోభ స్థితి యాజమాన్యం, పబ్లిక్ ఆర్డర్‌కు చెందిన పలు విషయాల్లో సూచనలివ్వమని కమీషన్‌ను కోరింది ప్రభుత్వం. కమీషన్ దశలవారీగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలను మూడు ప్రధాన విభాగాలుగా క్రోడీకరించింది. పాలనాపరమైన, సామాజిక-ఆర్థిక పరమైన, సెక్యూరిటీ పరమైన రంగాలకు చెందిన అంశాలుగా వాటిని పేర్కొన్నారు.

కమీషన్ చేసిన సిఫారసులలో తొమ్మిది ప్రధానమైన అంశాలున్నాయి. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉపసంహరించుకుని, ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రభుత్వపరమైన అంశాలను మాత్రమే జాతీయ బధ్రత చట్టం పరిధిలో చేర్చాలన్నది మొదటి సిఫారసు. సమాచార హక్కు చట్టం అమలు పర్చాల్సిన ఇన్ఫర్మేషన్ కమీషన్ సభ్యులలో ఏభై శాతం సివిల్ సర్వీసు అధికారిక నేపధ్యం లేనివారిని నియమించాలన్నది రెండోది. పక్షపాత ధోరణితో కూడిన సాయుధ బలగాల 1958 చట్టాన్ని రద్దుచేసి, 1967 నాటి చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం దాని స్థానంలో అమలులోకి తేవాలనే ది మరొక సిఫారసు. మహిళలకు 33% రిజర్వేషన్‌లను కలిగించడంతో సహా పోలీసు వ్యవస్థలో సమగ్ర సంస్కరణలను తేవాలనేది మరో అంశం. పాతిక వేల జనాభాకు తక్కువున్న ప్రదేశాలలో స్థానిక న్యాయ స్థానాలను ఏర్పాటు చేసి సత్వర న్యాయం కలిగించాలన్నది మరొకటి. నైతిక విలువలతో కూడిన పాలనను అందించడానికి, ప్రధాని మినహా, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులందరినీ విచారణ పరిధిలోకి వచ్చేలా "నేషనల్ ఆంబడ్స్ మెన్" ఏర్పాటు; ఎంపీల-ఎమ్మెల్యేల నియోజక వర్గం అభివృద్ధి నిధుల పథకం రద్దు; కేంద్ర ఆర్థిక కమీషన్ తరహాలో రాష్ట్ర కమీషన్ల ఏర్పాటు; మేయర్లను నేరుగా ఎన్నుకునే విధానం అమలు పరచడం లాంటివి ఇతర సిఫారసులు. సిఫారసులన్నీ బాగానే వున్నాయి కాని, అమలు మాటేమిటనేదే జవాబులేని ప్రశ్న!

ఒక మార్పు మరో మార్పుకు దారితీస్తుంది. ఆర్ధిక సంస్కరణలు పాలనా సంస్కరణలను అనివార్యం చేశాయి. పరిపాలనా వ్యవహారాలలో మెరుగైన మార్పులను తీసుకురావాలనే సంకల్పానికి కొదువేమీ లేదు. స్వతంత్ర భారతంలో 45కు పైగా కమిటీలు, కమిషన్లు పాలనా వ్యవస్థలో తీసుకు రావలసిన మార్పులకు సూచనలు, సిఫారసులు చేశాయి. అవన్నీ అమలులోకి వచ్చాయా అన్న విషయాన్ని అటుంచితే ఆ కమిటీలు, కమిషన్లలో కొన్నిటి వ్యవహారాన్ని క్రమానుగతంగా సింహావలోకనం చేయాల్సిన అవసరం వుంది.

బ్రిటిష్, ముస్లిం అధికారుల నిష్క్రమణంతో ప్రభుత్వ అధికార క్రమంలో చోటుచేసుకున్న అనూహ్యమైన మార్పులు స్వతంత్ర భారత తొలి ప్రభుత్వానికి సమస్యాత్మకంగా పరిణమించాయి. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కడానికి 1947లో "సెక్రటేరియల్ రీ-ఆర్గనైజేషన్ కమిటీ” ని నియమించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా పెరుగుతూ వస్తున్న ప్రభుత్వ సిబ్బంది-క్షీణిస్తున్న వారి సామర్ధ్యం - అన్నిస్థాయిల్లో చోటుచేసుకుంటున్న అవినీతి అందరిని కలవర పరుస్తున్నది. ఈ కలవరాన్ని తగ్గించుకోవటానికి జరిగిన తొలి ప్రయత్నమే 1948లో ఏర్పాటైన "ఎకానమీ కమిటీ". ప్రభుత్వ యంత్రాంగ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి టాటెన్ హామ్ అనే బ్రిటిష్ పాలనా నిపుణుడు ఒక నివేదికను రూపొందించారు. క్రమబద్ధీకరించిన సూక్ష్మ స్థాయి సచివాలయ ఆవశ్యకతను ఆయన సమర్థించారు. మంత్రిత్వ శాఖలను నాలుగు ప్రధాన విభాగాలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ సచివాలయ వ్యవస్థాగత నిర్వహణకు గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ 1949లో కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ఆధారంగా 1950లో డిఫెన్స్ కమిటీ, ఎకనామిక్ కమిటీ, పార్లమెంటరీ-న్యాయ వ్యవహారాల కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ కమిటీలను నియమించారు.ప్రణాళికా సంఘం 1950లో ఏర్పాటైంది. వెన్వెంటనే ఎ.డి. గొరాడియా కమిటీని నియమించారు. ఈ కమిటీ సమర్పించిన రెండు నివేదికల ఆధారంగా 1951లో పాలనా పరంగా చేపట్టవలసిన సంస్కరణల గురించి విస్తృత స్థాయి చర్చలు జరిగాయి.సాధించిందేమిటనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!

అయ్యంగార్ నివేదికపై ఆర్.ఎ. గోపాలస్వామి 1952లో "ప్రభుత్వ యంత్రాంగం-సామర్ధ్యం పెంపుదల" పేరుతో ఒక నివేదిక సమర్పించారు. ఈ నివేదికను ఏలినవారు గోప్యంగా ఉంచారు. అమెరికన్ నిపుణుడు పాల్ ఏపెల్ బీ 1953-54లలో వరుసగా సమర్పించిన రెండు నివేదికలు మన పాలనా సంస్కరణలలో మైలు రాళ్లుగా ప్రశస్తిని పొందాయి. మెదటి నివేదికలో చేసిన 12 సిఫారసులలో "ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్" స్థాపన అతి ముఖ్యమైనది. అశోక్ చందా కమిటీ 1954లో సమర్పించిన "ప్రాజెక్టుల పూర్తి లో జాప్యాన్ని అరికట్టేందుకు అవసరమైన బడ్జెటరీ-ఆర్ధిక నియంత్రణల మార్పులు" అన్న నివేదికపై కేంద్ర మంత్రి మండలి అసలు చర్చించనేలేదు. ప్రభుత్వ సిబ్బందికి శాఖాపరమైన విషయాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇదే కాలంలో ఆర్ధిక మంత్రి చింతామణి దేశ్ ముఖ్ ఆర్థికపరమైన సంస్కరణలను అధ్యయనం చేసేందుకు చర్యలు చేపట్టారు. అఖిల భారత సర్వీసుల్లోనూ, గ్రూప్-1 కేంద్ర సర్వీసుల్లోనూ అభ్యర్ధుల నియామకానికి విశ్వవిద్యాలయ డిగ్రీ ఉండాల్సిన ఆవశ్యకతపై విద్యా శాఖ నియమించిన ఒక కమిటీ 1956లో నివేదిక సమర్పించింది. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు, 1962 లో సంతానం కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 1964లో సమర్పించిన నివేదికపై పార్లమెంటులో విశేష చర్చ జరిగింది. అంతేకాక ప్రభుత్వోద్యోగులలో ప్రకంపనలు సృష్టించింది. కేంద్రమంత్రులకు ప్రవర్తనా నియమావళి ఉండాలని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటుచేయాలని గాంధేయవాది అయిన సంతానం సూచించారు. దరిమిలా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను స్థానికంగా, సమితి-జిల్లా స్థాయిలలో ప్రవేశపెట్టడం వల్ల ఎదురయ్యే సమస్యలు, రాష్ట్రాల్లో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది పనితీరుకు సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రణాళికా సంఘం 1960లో వి.టి. కృష్ణమాచారి కమిషన్ ఏర్పాటు చేసింది. కృష్ణమాచారి 1962లో సమర్పించిన నివేదికలోని అన్ని సిఫారసులను ప్రభుత్వం అంగీకరించింది. ప్రజల ఆర్ధిక-సామాజికాభివృద్ధి అవసరాలకు అనుగుణంగా పనిచేయగల రీతిలో ఐ.ఎ.ఎస్. అధికారాల విస్తరణ జరగాలని, తదనుగుణంగా శిక్షణ ఇవ్వాలని కృష్ణమాచారి కమిషన్ సూచించింది. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి, పనితీరు మెరుగయ్యేందుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, సాంకేతిక సిబ్బంది సమన్వయంతో పనిచేయాలనీ, సహకారోద్యమం-సామాజికాభివృద్ధి కార్యక్రమం కలిసి పురోగమించాలని కూడా కృష్ణమాచారి సూచించారు. ప్రభుత్వ పాలనా వ్యవస్థ పనితీరును కూలంకషంగా అధ్యయనం చేసి, అది మరింత సమర్ధంగా పనిచేసేందుకు తగు సూచనలివ్వడానికి 1966లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన "అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్"(ఇదే మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్)ను నియమించారు. మొరార్జీ ప్రభుత్వంలో చేరిన దరిమిలా, ఆ కమిషన్‌కు కె. హనుమంతయ్య నేతృత్వం వహించారు. 20 అధ్యయన బృందాలు, నాలుగు నిపుణుల బృందాలు, ఒక టాస్క్ ఫోర్స్ నేర్పాటుచేసిన ఈ కమిషన్ నాలుగేళ్లు శ్రమించి 500కు పైగా సిఫారసులతో 20 నివేదికలను సమర్పించింది. రాజీవ్‌గాంధీ హయాంలో మాత్రమే ప్రభుత్వ సిబ్బందికి శిక్షణావశ్యకత అనే అంశం పాలనా సంస్కరణల్లో అతి ముఖ్యమైన అంశమని గుర్తించారు. 1980ల తొలినాళ్ళలో లక్ష్మీకాంత్ ఝా నేతృత్వంలో ఆర్ధిక పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏర్పాటైంది. ప్రభుత్వ ప్రాధమ్యాలు నియంత్రణ నుంచి అభివృద్ధి దిశగా మార్పుచెందాలని ఝా సూచించారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమవడంతో పాలనా సంస్కరణలకు సంబంధించి కూడా ప్రభుత్వ దృక్పథంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలో ఆర్ధిక క్రమశిక్షణ నెలకొల్పడానికి తగు సూచనలిచ్చేందుకు జాతీయ అభివృద్ధి మండలి, 1992లో అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూపట్ణాయక్ అధ్యక్షతన, ఒక కమిటీ నేర్పాటుచేసింది. ఉద్యోగులకిచ్చే కరవుభత్యాన్ని స్తంభింప చేయాలన్న సిఫారసుని పాటించకపోవడంతో బిజూ ఆ కమిటీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను కమిటీ నొక్కి చెప్పింది.

1997 మేలో పాలనా సంస్కరణల దిశగా మరో కీలకమైన ప్రయోగానికి అంకురార్పణ జరిగింది. అప్పటి ప్రధాని గుజ్రాల్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ప్రభుత్వాల పనితీరు, జవాబుదారీతనం, కార్య సాధనపైన ప్రజలకు రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతోందని, పాలనా వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అత్యవసరంగా కొన్ని చర్యలు చేపట్టాలనీ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీని పర్యవసానమే ఒక కార్యాచరణ ప్రణాళిక, తద్వారా కేంద్రం, రాష్ట్రాల్లో ఫలవంతమైన, బాధ్యతాయుతమైన సుపరిపాలనను ప్రజలకు అందివ్వడం. ఈ సమావేశానికి ఏడునెలలక్రితం (1996నవంబర్లో) జరిగిన ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో "బాధ్యతాయుతమైన ప్రభుత్వపాలన" అన్న అంశంపై ప్రారంభమైన జాతీయ చర్చకు ముఖ్యమంత్రుల సమావేశం ముగింపనీ, ఇక జరగాల్సింది తొమ్మిదంశాల కార్యాచరణ ప్రణాళిక అమలేనని, అది సత్వరమే పూర్తిచేస్తామని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు జాతికి వాగ్దానం చేశారు. కాలం చెల్లిన చట్టాలను సమీక్షించి కొత్త చట్టాలను రూపొంచుకోవాలని గుజ్రాల్ అన్నారు. చట్టం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలేగాని ఇబ్బందులు కలుగజేయకూడదని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రులు ఇదే తీరులో గంభీరోపన్యాసాలు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే గుజ్రాల్ ప్రభుత్వం పతనమైయింది. ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులలో పలువురు ఉన్నత అధికారిక-అనధికారిక పదవులలో ఇప్పటికీ కొనసాగుతున్న వారున్నారు. మరి కొంతమంది ప్రతిపక్షంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.

ముఖ్యమంత్రులందరూ నాడు ఏకగ్రీవంగా ఆమోదించి, నిర్ణీత కాలవ్యవధిలో అమలుచేయదలపెట్టిన కార్యాచరణ ప్రణాళికలోని తొమ్మిదంశాలేమిటి ? సిటిజన్ చార్టర్ తయారీ, జవాబుదారీ పరిపాలన, కట్టుదిట్టంగా త్వరితగతిన ప్రజల సాధక బాధకాలను నివారించగల వ్యవస్థ, గ్రామ-పట్టణ స్థాయిలలో స్థానిక సంస్థలకు అధికారాల నిచ్చే పౌర సేవలను వికేంద్రీకరించడం, చట్టాలను, ప్రభుత్వ నియమనిబంధనలు సమీక్షించటం, పారదర్శకత-సమాచార హక్కు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలకవసరమైన సమాచారాన్ని పొందే పౌర సదుపాయ కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసేవారికి ప్రవర్తనా నియమావళి, అవినీతి నెదుర్కొని పరిపాలనను ప్రక్షాళన చేయడం, ప్రభుత్వాధికారుల పదవీ కాలంలో స్థిరత్వం అనేవే ఈ తొమ్మిదంశాలు. బాధ్యతాయుత, జవాబుదారీ పరిపాలనందించడానికి ఈ కార్యాచరణ ప్రణాళికను దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యల ద్వారా అమలుపర్చాలని ఆ సమావేశంలో తీర్మానించారు కూడా. ప్రతి అంశంపైనా తీర్మానం చేసిన ఆర్నెల్లు లోపుగా తగు చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ప్రతి అంశంపైన కేంద్ర-రాష్ట్రాల్లో సాధించిన ప్రగతిని కేంద్ర కేబినెట్, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిరంతరం సమీక్షించాలని కూడా నిర్ణయించారు. అయిదేళ్ళ అనంతరం సమీక్ష జరిగింది. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలన్నీ అసంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడయింది. మళ్ళీ కధ మొదటికొచ్చింది. ఈ నేపధ్యంలో వీరప్ప మొయిలీ అధ్యక్షతన కేంద్రంలోని యు.పి.ఎ. ప్రభుత్వం మరో పాలనా సంస్కరణ కమిషన్ ఏర్పాటు చేసింది. కొత్త కమిషన్ ని నియమించాలనే ఆలోచన చేనే ముందు ఇదివరకటి కమిటీలు, కమిషన్‌లు చేసిన సూచనలు, సిఫారసులపై ఒకింత దృష్టి సారించి వాటి అమలుకు తగు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది. అసలా మాటకొస్తే సమాచార హక్కు చట్టం అమలులో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నయో పరిశీలిస్తే చాలు. ఏ రాష్ట్రంలోనైనా చట్ట స్పూర్తితో సమాచార కమిషనర్ల ఎంపిక జరుగుతుందా ? సూచనలు, సిఫారసులను ప్రజోపయోగకరంగా అమలు చేయనప్పుడు కొత్త కమిషన్లను నియమించడమెందుకు ? పోనీ, నియమించిన కమీషన్ చేసిన సిఫారసులనన్నా అమలు పరిచే దిశగా ప్రభుత్వం ఏ మేరకు అడుగు లేసింది? ఇప్పటికైనా ఈ అంశాలపై దృష్టి సారిస్తే మంచిదే మో!

3 comments:

  1. ఇంతకు ముందటి కమీషన్ల గురించి చక్కని సమాచారం అందించారు. వీరప్ప మొయిలీ కమీషన్ విషయానికి వస్తే ఇప్పటికి 15 నివేదికలు అనేక ముఖ్యమైన విషయాల మీద సమర్పించారు.

    మొదటి రిపోర్ట్ - అమలు చేశారు. సమాచార హక్కు చట్టం దాని ఫలితమే.
    6 వ రిపోర్టు - స్థానిక సంస్థల గురించి. ముసాయిదా బిల్లు తయారు చేసి రాష్ట్రాల రివ్యూ కూడా పూర్తి చేశారు. బిల్లు ప్రవేశ పెట్టడం ఇంకా జరగ లేదు.

    ఇవి కాకుండా, పోలీస్ రిఫారంస్ మరియూ, న్యాయ వ్యవస్థలో మార్పుల మీద మంత్రి మండలి కొంత పని ప్రారంభించింది.

    మొత్తం మీద మీరన్నట్టు, ఇదంతా మరికొంత పారదర్శకంగానూ వేగం గానూ జరగాల్సిన అవసరం ఉంది.

    దురదృష్టవశాత్తూ.. ఎంత మంది MP లు, ఎన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారో చూస్తే పరిస్థితి కొంత నిరాశాజనకంగానే ఉంది.

    ReplyDelete
  2. RIGHT TO INFORMATION ACT 2005 PASSED BY LOK SABHA ON 11 MAY 2005. PRESIDENT ASSENTS ON 15 JUNE 2005. GAZETTE NOTIFICATION ON 21 JUNE 2005. Came in to effect in second week of October 2005. All this before Veerappa Moily was appointed as commission Chairman.
    Regards,
    Jwala

    ReplyDelete
  3. Sorry. My mistake due to a small confusion.

    RTI is the necessary framework for implementing the first report. Some of the recommendations of first report are being considered currently to strengthen RTI. But it looks like there is no political consensus on that even within the ruling alliance.

    ReplyDelete