Wednesday, January 12, 2011

అరుదైన "కార్య నిర్వహణ అధికారి" స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి : వనం జ్వాలా నరసింహారావు

జనవరి 13, 2011 న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 92 వ జయంతి సందర్భంగా ...

అరుదైన "కార్య నిర్వహణ అధికారి" స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి
వనం జ్వాలా నరసింహారావు
ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పౌర సంబంధాల అధికారి

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండవ పర్యాయం డిసెంబర్ 1989 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు, ఆయన ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి పేరుతో పంపాల్సిన ఒక అధికారిక సందేశాన్ని తయారు చేసి చూపినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య నేనెప్పటికీ మరిచిపోలేను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జరుపుకుంటున్న సమావేశాలకు తయారుచేసిన ముఖ్యమంత్రి సందేశం, రాయడంలో నేనింకా "ఆరంభ దశ" లోనే వున్నానన్న అర్థం స్ఫురించే దిగా వుంది ఆయన వ్యాఖ్య. కొద్ది మార్పులతో మళ్లీ చూపించిన తర్వాత యథాతధంగా ఆమోదించి సంతకం చేశారు. అంతే...ఇక ఆ తర్వాత.. ముఖ్యమంత్రి సంతకానికి తీసుకెళ్లిన దేని నీ ఆయన నిశితంగా పరిశీలించడం కాని, విమర్శించడం కాని, వ్యాఖ్యానించడం కాని చేయలేదు. అయితే, ఆయన సంతకంతో పోవాల్సిన ప్రతి అంశంలోను ఆయన ఆలోచన ఎలా వుందో తెలుసుకున్న తర్వాతే కాగితం పైన పెట్టడం జరిగే ది. తన దగ్గర పనిచేసే అధికారులపై ఆయనకున్న విశ్వాసం బహుశా మరింకెవరికీ వుండదేమో. ఆయన మా పట్ల ఎలాంటి నమ్మకంతో వ్యవహరించేవారో, అలానే, మేమూ వుండేవాళ్లం. ముఖ్యమంత్రి కార్యదర్శి కే. ఆర్. పరమహంస, సంయుక్త కార్యదర్శులు జి. కిషన్ రావు-ఆర్ ఎం గోనెల, ఆంతరంగిక కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, ముఖ్య బధ్రతాధికారి రామచంద్ర రాజుల విషయంలోనూ ఆయనకు అదే నమ్మకం వుండేది. చెన్నారెడ్డి దగ్గర తప్ప మరే ముఖ్యమంత్రితో నేను పని చేయలేదు కాబట్టి, ఇతరుల విషయంలో నేనేమీ చెప్పలేను కాని, ఆయన మాత్రం తన దగ్గర పని చేసిన మమ్మల్ని చాలా విషయాల్లో సంప్రదించడం, సలహాలు-సూచనలు కోరడం జరుగుతుండేది. అవి ఒక్కొక్కప్పుడు చాలా చిన్న విషయాలే కావచ్చు, మరో సారి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాలే కావచ్చు. అలానే, ఆయన దగ్గర పనిచేస్తున్న "మా మాట" అంటే, అది "ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మాట" గానే చలామణి కావాలని ఎన్నో పర్యాయాలు బహిరంగంగానే అంటుండేవారు.

పాత్రికేయ మిత్రుడు పర్సా వెంకట్ ద్వారా 1988 లో పరిచయమైన మర్రి చెన్నారెడ్డి దగ్గరకు, అప్పట్లో గవర్నర్ కుముద్ బెన్ జోషి వద్ద పనిచేస్తుండే నేను, ఆయనుండే తారనాక ఇంటికి తరచూ పోతుండేవాడిని. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో అభిమానం వున్న కుముద్ బెన్ జోషి అప్పట్లో రాజ భవన్ ను "గాంధీ భవన్" చేసిందని పలువురు తెలుగు దేశం నాయకులు విమర్శించే వారు. ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ఆమెను కలవడానికి వచ్చేవారు కాని, నాకు గుర్తున్నంతవరకు చెన్నారెడ్డి మొదట్లో ఎప్పుడూ రాలేదు. ఇంతలో, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్న ఎన్ జనార్ధన రెడ్డి స్థానంలో ఇంకొకరిని నియమించి, ఆయన నాయకత్వంలో, త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎన్ టీ రామారావును ఓడించాలన్న ఆలోచనలో హైకమాండ్ వుందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే కుముద్ బెన్ జోషికి సన్నిహితుడుగా వుంటున్న జనార్ధన రెడ్డిని తొలగించడం అంత సులువైన విషయం కాదని కూడా అనుకునేవారు. కుముద్ బెన్ జోషి మాట అంటే అప్పటి ప్రధాని-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీకి అత్యంత నమ్మకం. ఆమె (పరోక్ష) మద్దతు లేకుండా పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగడం కష్టం. ఆ నేపధ్యంలో చెన్నారెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడమో-లేక-ఆయనే అలా ఏర్పాటు చేసుకుని వెళ్లడమో జరిగింది. ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల మద్దతును, ఆయన-ఆయన పీసీసీ అధ్యక్షుడుగా కావాలనుకునే మరికొందరు ఆంధ్రా నాయకులు కూడగట్టుకోవడంతో, వెళ్ళిన పక్షం రోజులకే, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా హైదరాబాద్ తిరిగొచ్చారు చెన్నారెడ్డి. ఆ రోజున ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో, "కాబోయే ముఖ్యమంత్రి" హోదాలో అఖండ స్వాగతం లభించింది. పోలీసు అధికారులు సైతం ఆయనను అదే స్థాయిలో విమానాశ్రయంలో ప్రోటోకాల్ మర్యాదలు చేశారు.

అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకి-పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావుకి, పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే సవాళ్ళు విసరడం ఆరంభించారు చెన్నారెడ్డి. జూన్ 3, 1989 న "నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్" నిర్వహించిన "జవహర్ రోజ్ గార్-పంచాయితీ రాజ్" సదస్సులో ఎన్ టీ రామారావు సబ్సిడీ బియ్యం పథకం అంశం ప్రస్తావిస్తూ... ప్రతి వ్యక్తీ తమ కాళ్లపై తామే నిలబడేలా, స్వయం కృషితో జీవనాధారం పొందగలిగే స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందించాలి కాని, శాశ్వతంగా వారిని ఒకరిపై ఆధారపడేలా చేయకూడదని అన్నారు చెన్నారెడ్డి. పంచాయితీరాజ్ సంస్థల ద్వారా, స్థానిక స్వపరిపాలన ద్వారా మాత్రమే అది సాధ్య పడుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో, ఈ రెండింటి లో ఏది ముఖ్యమో అన్న అంశంపైనే పోటీకి దిగి గెలుస్తుందని సవాలు విసిరారు. ఆ నాటి సెమినార్ లో పాల్గొని ప్రసంగించిన ప్రముఖుల్లో పద్మభూషణ్ సీ నరసింహన్ ఐసీఎస్, మొహిత్ సేన్ వున్నారు.

నవంబర్-డిసెంబర్ 1989 లో జరిగిన ఎన్నికల్లో చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ఓడిపోడనుకున్న ఎన్ టీ రామారావును ఒక నియోజక వర్గంలోను, పార్టీని రాష్ట్రంలోను ఓడించింది. ఆయన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు చేసిన వివిధ ప్రసంగాల్లో విసిరిన సవాళ్లనే ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. "అర్హులైన పేదలకే సబ్సిడీ బియ్యం పథకం" పరోక్షంగా ప్రస్తావిస్తూ, పటిష్ఠమైన పౌర పంపిణీ వ్యవస్థ విధాన ప్రకటన మేనిఫెస్టోలో మొదటి అంశంగా చేర్చింది కాంగ్రెస్ పార్టీ. అలానే స్వయం ఉపాధి పధకాల ప్రస్తావన కూడా దానికి జత పరిచింది పార్టీ. ఎన్నికల ప్రణాళికను తయారుచేయడానికి నియమించిన కమిటీ ఆ పనిని పూర్తి చేయడానికి పదిహేను రోజులు తీసుకుంది. ముసాయిదాను అధ్యక్షుడి ఆమోదం కొరకు చూపించినప్పుడు నేను కూడా వున్నాను. కేవలం పావు గంటలోనే ఆసాంతం చదివి, తప్పులు సరిదిద్దిన చెన్నారెడ్డి, అదనంగా మరో పదమూడు పేరాలు , కాగితంపై పెట్టిన కలాన్ని ఎత్తకుండా రాశారు. ఆయన స్వదస్తూరితో ఆ నాడు రాసిన మేనిఫెస్టో కాగితాలను, ఈ నాటికీ, ఆయన జ్ఞాపకంగా నా వద్దనే భద్రపరుచుకున్నాను.

పీసీసీ అధ్యక్షుడుగా చెన్నారెడ్డి చేపట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన "కోటి సంతకాల సేకరణ" కార్యక్రమం, "జైల్ భరో" ఉద్యమం ప్రజల స్పందనకు ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలి. నిజాం కళాశాల మైదానంలో డిసెంబర్ 3, 1989 న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన చేసిన తొలి ప్రసంగంలో, ప్రజలకు అయిష్టం కలిగించే ది, ఇబ్బందులకు గురిచేసే ది, ఆమోదయోగ్యం కానిది ప్రభుత్వం చేయడం తగదని అన్నప్పుడు, "హెల్మెట్లు" విధిగా ధరించడం మాకిష్టం లేదంటూ ప్రేక్షకుల నుంచి కేకలు వినిపించాయి. తక్షణమే స్పందించిన చెన్నారెడ్డి, ధరించమని బలవంతంగా ఎవరిపైనా రుద్దమని అన్నారు. అలా అంటూనే, బధ్రత దృష్ట్యా వాటిని ధరించితే నే మంచిదంటూ సూచన కూడా చేశారు. అదీ ఆయన స్పందించే శైలి.

ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి వెళ్లే ప్రతి సందేశంలో-పత్రికా ప్రకటనలో ఆయన దైన శైలి-వ్యక్తిత్వం కొట్టొచ్చినట్లు కనబడేలా సంబంధిత వ్యక్తిగత సిబ్బందికి ఆయన ఆలోచనా ధోరణి తెలియ చేసేవారు చెన్నారెడ్డి. ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే, ఆయనను అభినందిస్తూ వచ్చిన వేలాదిమంది అభిమానులకు, చెన్నారెడ్డి నుంచి ఆయన సంతకంతో వెళ్ళిన "కృతజ్ఞతల ప్రత్యుత్తరం" కేవలం ధన్యవాదాలకే పరిమితం చేయలేదు. అద్వితీయమైన శైలిలో ఆయన తన అభిమానులకు చేరవేయాలనుకున్న సందేశాన్ని మాతో రాయించారు. అధికారం మారడంతో తనకు తెలుగుదేశం నుంచి వారసత్వంగా సంక్రమించిన "ఛిన్నాభిన్నమైన పాలనా వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను", అత్యవసరంగా ప్రక్షాళన చేయడానికి వారి సహకారం అందించమంటూ, తన జవాబులో కోరారు చెన్నారెడ్డి. బ్లిట్జ్ సంపాదకుడు ఆర్ కే కరంజియా చెన్నారెడ్డిని అభినందిస్తూ రాసిన వుత్తరం గురించి ఆయన చాలా మందితో ప్రస్తావించారు. అప్పట్లో పంజాబ్ రాష్ట్రంలో నెల కొన్న శాంతి బధ్రతల సమస్యను-హింసాత్మక సంఘటనలను తన వుత్తరంలో పేర్కొన్న కరంజియా, చెన్నారెడ్డి కనుక మరికొంత కాలం ఆ రాష్ట్ర గవర్నర్ గా కొనసాగి వున్నట్టయితే, బహుశా, పరిస్థితులు మరోలాగా-శాంతియుతంగా వుండేవని చెప్పారు. తన పట్ల ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం ఒక అసాధారణమైన గౌరవంగా భావించిన చెన్నారెడ్డి కరంజియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి దర్బారా సింగ్ చనిపోయిన వార్త ఆ రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత తెలిసింది. అప్పటికే ఇంటికొచ్చిన నేను, ఆ విషయాన్ని చెన్నారెడ్డి దృష్టికి తెచ్చి, సంతాప సందేశం ఆయన మాటల్లో చెప్పమని కోరాను. అప్పటికే అర్థరాత్రి కావచ్చింది. ఆయన గవర్నర్ గా పని చేసినప్పుడు, దర్బారా సింగ్ పంజాబ్ ముఖ్య మంత్రిగా వుండేవారు. "పర్సనల్ టచ్" తో సందేశం చెప్పారు.

చెన్నారెడ్డికి ఒకరు రాసిచ్చిన ఉపన్యాసం చదివే అలవాటు ఏనాడూ లేదు. ఏ సభలోనైనా, కనీసం గంటకు తక్కువ లేకుండా, ఆశువుగా మూడు భాషల్లో-ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు-ల్లో, అనర్గళంగా మాట్లాడే వారు. ప్రతి ఉపన్యాసంలోని అంశాలు పదిలంగా పది కాలాల పాటు దాచుకోతగినంత విలువైనవి. ఆయన ప్రసంగాలను ఆడియో రికార్డు చేయించి (అప్పట్లో ఇంకా వీడియోలు ఇంకా ప్రాచుర్యం పొందలేదు) తర్జుమా చేయించి టైప్ చేయించడం జరిగింది. విలువైన ఆయన ఉపన్యాసాలన్నీ సమాచార పౌర సంబంధాల శాఖలో బహుశా వుండొచ్చు. కొన్నింటి కాపీలు నేను కూడా బధ్ర పరచుకున్నాను ఇప్పటికీ. ఆయన అనుభవాల-జ్ఞాపకాల సారాంశం రంగరించి తన ఉపన్యాసాల్లో, వర్తమాన పరిస్థితులకు అన్వయించి చెప్పేవారు చెన్నారెడ్డి. తాను డాక్టర్ అయినా మంత్రిగా ఆరోగ్య శాఖ కోరుకోక పోవడానికి కారణం, తనకు చదువు చెప్పిన అధ్యాపకులు ఇంకా పనిచేస్తుండగానే, వారికి మంత్రిగా వుండడం సమంజసం కాదనే వారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ పేరు మీద, వ్యవసాయ విశ్వ విద్యాలయం వున్న హిమాయత్ సాగర్ ప్రాంతాన్ని "రాజేంద్ర నగర్" గా తనే మార్చిన విషయం ఓ సందర్భంలో చెప్పారు.

లౌక్యంలో కూడా చెన్నారెడ్డి ది అరుదైన శైలి. 1990 మే నెల బ్లిట్జ్ ఆంగ్ల వార పత్రికలో ఆయనతో పత్రిక ప్రతినిధి చేసిన ఇంటర్వ్యూ వచ్చింది. ఆ నెల మొదటి తేదీన నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో ఆ ప్రతినిధి చెన్నారెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను కూడా పక్కనే వున్నాను. మారుమూల గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని నక్సలైట్ ప్రాబల్యమున్న ఆ గ్రామంలో ప్రారంభించడానికి అక్కడకు వెళ్లిన ముఖ్య మంత్రితో జరిపిన ఇంటర్వ్యూ అది. ఢిల్లీలోని "రాజకీయేతర కాంగ్రెస్ ముఠా నాయకులకు" చెన్నారెడ్డి హెచ్చరిక చేసినట్లు, జాతీయ స్థాయిలో అలాంటి నాయకుల వైఫల్యం మూలాన్నే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని ఆయన అన్నట్లు, కొన్ని వివాదాస్పదమైన అంశాలున్నాయందులో. అలాగే మరో చోట, చెన్నారెడ్డి, శరద్ పవార్, వీరేంద్ర పాటిల్ తెలుగు గంగ పేరుతో తిరుపతిలో సమావేశమై, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వచ్చింది. ఆ విషయాలను కంగారు పడుతూ ఆయన దృష్టికి తెచ్చినప్పుడు, "అలా ఎవరైనా అనుకుంటే పర్వాలేదు" అనడం నన్ను ఆశ్చర్య పరిచింది. బుద్ధుడి విగ్రహం టాంక్ బండ్ నీళ్లలో పడి పోయినప్పుడు, అంతవరకు దాని కొరకు జరిగిన వ్యయం, నీళ్లలోంచి తీస్తే కాబోయే అదనపు వ్యయం, పదే-పదే చెప్పే వారే కాని, తీయడానికి ఏం చెయ్యబోతున్నారో ఎప్పుడూ చెప్పలేదు.

ఆయన మంత్రి వర్గంలో పనిచేస్తున్న ఒక సీనియర్ మంత్రిపై అవినీతి ఆరోపణలొచ్చాయి. చెన్నారెడ్డి ముఖ్య మంత్రి అయిన రెండు నెలలకే అది జరిగింది. ఆరోపణలు చేసిన వారు బలమైన సాక్ష్యాధారాలున్నట్లు చెప్పడం జరిగింది. తనకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలనుకున్న చెన్నారెడ్డి ఏం చేయాలన్న సందిగ్ధంలో పడ్డారు. బహుశా తాను అడగ తల్చుకున్న వారందరినీ సలహా అడిగి వుండొచ్చు. ఆయన దగ్గర పనిచేస్తున్న మా వంతు కూడా వచ్చింది. ఫిబ్రవరి 6, 1990 రాత్రి పదకొండు గంటల సమయంలో చెన్నారెడ్డి గారి ఫోన్ వచ్చింది. అప్పట్లో ఇంకా సెల్ ఫోన్లు లేవు. ఆ మంత్రి విషయంలో ఏం చేస్తే బాగుంటుందని ఆయన ప్రశ్న వేశారు. ఆయన ఎలా చేస్తే బాగుంటుదనుకుంటే అలానే చేయమని బుద్ధిగా సమాధానం. అన్నీ తాను అనుకున్నట్లే చేయడానికి ఎందుకంత మంది వ్యక్తిగత సిబ్బంది అని మరో ప్రశ్న. ఆయన మనసులో మాట అర్థం చేసుకుని చెప్పాల్సింది చెప్పడం, అదెలా అమలు పర్చాలని ఆయన అడగడం, ఆ బాధ్యత నెత్తిన వేసుకోవడం, ఆ మంత్రి మర్నాడు రాజీనామా చేయడం జరిగింది. అదీ ఆయన లౌక్యం.

మే నెల 1990 లో ఆంధ్ర ప్రదేశ్ లో భీకరమైన తుఫాను వచ్చింది. అదే రోజుల్లో వైద్య చికిత్స కొరకు అమెరికా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నారు చెన్నారెడ్డి. అనుకున్న రోజున కుటుంబ సభ్యులు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లడం, బోర్డింగ్ పాసులు తీసుకునే వరకు రావడం జరిగింది. మంత్రి వర్గ సభ్యులకు చెప్పి పోవడానికి సచివాలయానికి వచ్చారు ముఖ్య మంత్రి చెన్నారెడ్డి. అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున రావు, ముఖ్య మంత్రి కార్యదర్శి పరమహంస, మరికొందరు, చెన్నారెడ్డి అమెరికా పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ఆఖరు క్షణంలో ప్రయాణం మానుకున్నారు. అంతా సర్దు బాటు అయింతర్వాత, రెండు-మూడు వారాల అనంతరం వెళ్లారు. వెళ్లిన తర్వాత కూడా, ఆసుపత్రిలో చేరేంతవరకు, ప్రపంచ బాంక్ అధికారులతో చర్చలు జరుపుతూనే వున్నారు. బహుశా చెన్నారెడ్డి ఆ రోజుల్లో ప్రపంచ బాంకు ప్రతినిధులతో పెంచుకున్న అనుబంధమే, నేటి ప్రభుత్వాల వరకూ, కొన సాగుతుందనడంలో అతిశయోక్తి లేదే మో! End.

1 comment:

  1. అవినీతిని వ్యవస్థీకరించి,జాతీయ మీడియాలో చందారెడ్డి గా పేరుగాంచి,అబిడ్స్ లో వన్ వే ట్రాఫిక్ పెట్టడం లాంటి చిన్న చిన్న విషయాలలో గూడా అవినీతి చేశాడనే ఖ్యాతి (?)గాంచినవాడు.డబ్బు ఇస్తాడనే భరోసాతో aproved అనీ,ఆ డబ్బు చేతికందకపోతే not approved అని వ్రాసాడని,సదరు వ్యక్తి ఆదుర్దాపడీ డబ్బు చెల్లించగానే note approved అని ఫైలు నోట్ మార్చినట్లుగా కధలు వినిపించినిమాట గురించి గూడా వ్రాస్తే బాగుండేదేమో!

    ReplyDelete