అక్కడ పునరంకితం... ఇక్కడ దినదిన గండం
(సూర్య దిన పత్రిక:27-05-2011)
వనం జ్వాలా నరసింహారావు
కేంద్రంలో తొలి మలి విడతలు కలిపి ఏడేళ్లు; రాష్ట్రంలో సీఎంలు మారినా కాంగ్రెస్ దే పెత్తనం; అక్కడా, ఇక్కడా అధినేత్రే కీలకం; సమస్యల పరిష్కారంలో వైఫల్యమా, సాఫల్యమా?; అవినీతి విషయంలో ప్రజల ఆందోళన; ఇక్కడ పోగ్రెస్ రిపోర్టులూ లేవు, పునరంకితాలూ లేవు!; అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం!
అక్కడ, కేంద్రంలో మన్మోహన్ సింగ్ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలైన్స్" (యుపిఎ) తొలి-మలి విడతలు కలిపి అధికారంలో కొచ్చి ఏడేళ్లు, ఒక్క మలివిడత అధికారంలో కొచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక ఇక్కడ, ఆంధ్ర ప్రదేశ్ లో, పదేళ్ల విరామం అనంతరం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, తొలి విడత పూర్తి కాలం-మలివిడత నాలుగు నెలలు ఆయనే ముఖ్య మంత్రిగా, ఆయన మరణానంతరం రోశయ్య కొన్నాళ్లు-ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ముఖ్య మంత్రిగా, అధికారంలో కొచ్చి కూడా ఏడేళ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో వున్నది, విభిన్న విధానాలను పాటించే "పలు భాగస్వామ్య రాజకీయ పక్షాల సంకీర్ణ ప్రభుత్వం" కాగా, రాష్ట్రంలో వున్నది విరుద్ధ భావాల-వ్యక్తిగత ఎజెండాల-ఎత్తులకు పైఎత్తులు వేయగల సామర్థ్యం గల "ఏక పార్టీకి (కాంగ్రెస్) చెందిన సంకీర్ణ ప్రభుత్వం". అక్కడ అధికార బాధ్యతలు వహించేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే ఐనా, అధికారం చెలాయించేది యుపిఎ చైర్ పర్సన్-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఇక్కడ, రాజశేఖర రెడ్డి వున్న రోజుల్లో కొద్ది మోతాదులో, రోశయ్య గారి హయాంలో తగు మోతాదులో, ప్రస్తుతం పూర్తి మోతాదులో, ఎవరు ముఖ్యమంత్రైనా అధికారం పరోక్షంగా నడిపించేది, సోనియా నాయకత్వంలోని అధిష్ఠానం. ఈ నేపధ్యంలో, ఎన్నికల వాగ్దానాలైనా, కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన బడిన అంశమైనా, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనైనా, అమలైనా, పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడమైనా, అవినీతిని అరికట్టడమైనా-ప్రోత్సహించడమైనా, పదవుల పందేరమైనా, పార్టీని-పభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమైనా, "భావ సారూప్యం-పరస్పర విరోధ భావం" ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులపైనే ఆధార పడివుంటుంది. అదే జరుగుతున్నదిప్పుడు.
కేంద్ర ప్రభుత్వ సాఫల్యాలపై ప్రధాని మన్మోహన్ ఏటేటా విడుదల చేసే "ప్రోగ్రెస్ రిపోర్టు" ఈ ఏడాది కూడా విడుదలైంది. తాము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పాలనలోని విజయాలను గత ఏడాది విడుదల చేసిన రిపోర్టులో ఆయన ప్రస్తావించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడంలో తమ సర్కారు విజయం సాధించిందని అప్పట్లో ప్రధాని తెలిపారు. గడిచిన సంవత్సరం 8.5 శాతం వార్షిక వృద్ధిరేటు సాధిస్తామన్న ధీమాను ఆయన అప్పట్లో వ్యక్తం చేశారు. ఇరుగు, పొరుగు దేశాలతో సత్సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో ముందంజలో ఉన్నామన్నారు. నక్సల్స్ సమస్య తమ ముందున్న ప్రధాన అడ్డంకిగా ఆయన తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అయన గత ఏడాది చెప్పిన వాటిలో చేసినవి కొన్ని, చేయలేనివి మరి కొన్ని వున్నాయి. ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందే దిశగా, రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలోను, కేంద్ర మంత్రి వర్గంలోని కొందరు మంత్రుల సఫలతలను-విఫలతలను విశ్లేషించి చూపుతూ, యుపిఎ-2, మరో మారు ప్రోగ్రెస్ రిపోర్టు కార్డు విడుదల చేసింది. అవినీతి, ద్రవ్యోల్బణం, సంకీర్ణ కష్టాలు, ఆహార ధాన్యాల ధరల పెరుగుదల ప్రభుత్వాన్ని బాధిస్తున్న అంశాల్లో ముఖ్యమైనవిగా నివేదికలో పొందుపరచడం గమనిస్తే, వాటిని ఎదుర్కోవడంలో నాయకత్వం కొంత మేరకు విఫలమైన ట్లుగా భావించాల్సి వస్తుంది. ప్రధాని మన్మోహనే అయినప్పటికీ, ఆయన విడుదల చేసే రిపోర్టును మొదట యుపిఎ రధ సారధి, కాంగ్రెస్ అధినాయకి సోనియా గాంధీకి చూపి మరీ బహిర్గతం చేశారు ప్రధాని. ప్రభుత్వ విజయాలను గురించి విపులంగా పేర్కొన్నారు కూడా.
రిపోర్టులో ఏముందనేదాని కంటే, తాము చేసిందే దో చెప్పే ప్రయత్నమై తే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రం విషయానికొస్తే, రాజశేఖర రెడ్డి హయాంలో, ఏటేటా, ఆయన ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజున, "పునరంకిత సభలు" జరిగేవి. ఆ సందర్భంలో, తమ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చేసినా వాగ్దానాల అమలులో, ఎలా వడి-వడిగా అడుగులు వేసుకుంటూ పోయింది సవివరంగా-సభా ముఖంగా, అఖిల భారత స్థాయి-రాష్ట్ర స్థాయి అతిరధ-మహారధ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రజలకు తెలియ చేసేవారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంటివి ఎలా అమలవుతున్నాయో సగర్వంగా, బహిరంగసభ జరిపి చెప్పేవారు. ఆ పథకాల అమలులో జరుగుతున్నాయని భావించిన లోటుపాటులను కూడా ప్రజలు మరిచిపోయేలా, ఆయన వివరించేవారు. రెండో మారు ఆయన గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలలోపే విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ మరుసటి ఏడాది పునరంకిత సభ జరగనట్లే. రెండేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి నాయకత్వంలో, మే నెల 20, 2009 న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైందన్న సంగతే ఎవరికీ గుర్తున్న దాఖలాలు లేవు. పునరంకిత సభ దేవుడెరుగు! రాజశేఖర రెడ్డి రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటూన్న వారికి సహితం గుర్తుకు రాలేదు. అంతెందుకు...ఆయన వారసులమని చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కూడా గుర్తున్నట్లు లేదు. ప్రభుత్వం పునరంకిత సభలు జరపక పోయినా "రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని" పడగొట్టడం ఇష్ఠంలేని వారన్నా కనీసం మరో విధంగా నన్నా పునరంకితమై తే బాగుండేదేమో!
అసలు అక్కడా-ఇక్కడా (అటు కేంద్రం లోను, ఇటు రాష్ట్రం లోను) ఏం జరుగుతోందని నిశితంగా పరిశీలిస్తే, ఏదన్నా కనీసం జరుగుతోందా? అన్న అనుమానం వేస్తోంది. మన్మోహన్ సింగ్ నీతికి-నిజాయితీకి మారు పెరే కావచ్చు. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడో-బాధ్యుడో కావచ్చు. సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడే కావచ్చు. మంత్రి మండలి సభ్యులందరి మన్ననలను పొందుతుండవచ్చు. దేశ-విదేశాల్లో తనకూ-భారత దేశానికీ పేరు-ప్రతిష్టలు తెచ్చి పెడుతున్నాడన్న గుర్తింపు పొందివుండవచ్చు. ఇవేవీ, సామాన్యులకు పట్టదు. అందునా మధ్య తరగతి ప్రజానీకానికి అసలే అవసరం లేదు. వాళ్ల దృష్టంతా, అతి తక్కువ సమస్యలతో, ఎలా జీవన యానం సాగించాలన్న అంశంపైనే. ఆ అంశానికి సరాసరి సంబంధమున్న, ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలోని అధికార-అనధికార వ్యక్తుల్లో పేరుకుని-కూరుకుపోయిన అవినీతి అనే బ్రహ్మ పదార్థం గురించి మన్మోహన్ ఏం చేశాడన్నది వారి ముందున్న ప్రశ్న. రాజా టెలికాం స్కాం, సురేష్ కల్మాడి కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో పాల్పడిన అంతులేని అవినీతి లాంటి అంశాలు సామాన్యుడి మదిని అహర్నిశలు తొలి చేస్తుంటాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, నిత్యావసర వస్తువుల దరలు ధనవంతుడికి కూడా అందుబాటులోకి లేనంత ఘోరంగా పెరిగి పోతుంటే, తమ దగ్గర పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్న పైకం బాహాటంగా అవినీతి చక్రవర్తులు స్వాహా చేస్తుంటే, నిశ్శబ్దంగా-నిబ్బరంగా గమనించడం తప్ప చేయగలిగిందేమీ లేదన్న భావన ప్రజల్లో కలగడాన్ని, మన్మోహన్ రిపోర్టులో ఏ విధంగా వివరించబడిందో అర్థం కావడం లేదు. అహర్నిశలు భాగస్వామ్య పక్షాలను ఎలా మంచి చేసుకోవాలన్న తపన, మంచి చేసుకోక పోతే ప్రభుత్వం మనుగడ వుండదేమోనన్న ఆందోళనతో కాలం గడుపుతున్నదేమో కేంద్ర ప్రభుత్వం అన్న భావన పలువురి లో కలగడంలో తప్పులేదే మో!
ఇక మన రాష్ట్రం విషయానికొస్తే అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం! రాజశేఖర రెడ్డి అకాల మరణం రాష్ట్ర రాజకీయాలలో-అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో అంతుచిక్కని శూన్యాన్ని తెచ్చి పెట్టింది. ఆయన బ్రతికున్నంత కాలం ఆయనతో ఎట్లా వేగాలో-ఆయన్నెట్లా అదుపుచేయాలా అని ఆలోచించిన కాంగ్రెస్ అఖిల భారత స్థాయి అధినాయకత్వం, ఆయన మరణానంతరం, ఆయనకు ధీటైన వారసులెవరో తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయింది. ఆయన ప్రారంభించిన పథకాలకు నిధులెలా సమకూర్చాలో అని మధన పడిన అలనాటి ఆర్థిక మంత్రి రోశయ్య, ముఖ్య మంత్రయ్యాక, ఆ పథకాలను ఎలా ఊడగొట్టాలో అన్న ఆలోచనలో పడిపోయారు. ఆయన తర్వాత ముఖ్య మంత్రిగా అధిష్టానం ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల మద్దతు కూడగట్టడంలోనే సమయమంతా గడిచిపోతుంది. మరో వైపు అధికార యత్రాంగం ఎవరికివారే యమునాతీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఏ పథకం అమలు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందో, ఏ పథకం అమలు చేస్తే ప్రజాభిమానాన్ని చూరగొనొచ్చో, అన్న విషయం మంత్రులకు తెలియదు. తెలియ చేయాల్సిన అధికారులకు ఆ సంగతే పట్టదు. పట్టించుకున్న ఒకరిద్దరు అధికారులకు సముచితమైన గుర్తింపు వుండదు. అందుకే ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్టులు లేవు. పునరంకితం ప్రస్తావనే లేదు.
ఇవన్నీ ఇలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప మరేదీ కానందున, అన్ని పార్టీల వారికి చెందిన వారిలో వీలున్నంత మందిని, తమ వైపు ఆకర్షించుకునే కార్యక్రమంలో వారు నిమగ్నమై వున్నారు. సోనియా గాంధీని ఎదుర్కుని కడపలో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయ భేరీకి కాచుక్కూచున్నారు. తమ పార్టీలో వున్న వారు తెలంగాణ పేరు మీదో-మరే కారణానో పార్టీ వదిలి పోకుండా జాగ్రత్త పడుతూ, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో ఆధిక్యాన్ని పెంచుకునే పనిలో టీడీపి వుంది. అధికారం ఎట్టి పరిస్థితుల్లోను కోల్ఫొకుండా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకుండా వేయాల్సి నన్ని ఎత్తులు వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిజీగా వుంది. ఇక బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతరులు ఇవేవీ తమకు పట్టనట్లు, వారి సహజ ధోరణిలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నంలో వారున్నారు.
ప్రజలకు మాత్రం అంతా అయోమయం-అంతా అస్తవ్యస్తం-అంతా గందరగోళం గా కనపడుతున్నవి!
No comments:
Post a Comment