2011 సంవత్సరంలో ఏం జరిగింది?
తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా! -3
వనం జ్వాలా నరసింహారావు
ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్న వారితో సహా, వివిధ రకాల ఆరోగ్య రుగ్మతల వల్ల, క్రమేపీ ఆరోగ్యం క్షీణించి, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకున్న వారికి కూడా, అత్యవసర వైద్య సహాయం-అత్యవసరంగా-సకాలంలో లభించేందుకు, "చికిత్సా నిరాకరణ" ను అడ్డుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న వైద్య విధానాన్ని అమల్లోకి తేవాలనుకుందీ సంవత్సరం. ఈ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు, రాష్ట్రవ్యాప్తంగా, సుమారు రెండువందల ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులను తొలిదశలో ఎంపిక చేయదలిచింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, ప్రాణాపాయ స్థితిలో వుండి, అకాల మరణం పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు మెరుగయ్యాయి. తొలుత రెండువందల ఆసుపత్రులకే పరిమితం చేయదల్చుకున్న ప్రభుత్వ నిర్ణయం దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు విస్తరించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సా నిరాకరణ నేరంగా పరిగణించే ఆలోచన ఈ ఏడాది చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర వైద్య విధానం సంపూర్ణంగా కార్యరూపం దాలిస్తే, ప్రాణాపాయ స్థితిలో వచ్చిన బాధితులు డబ్బులు చెల్లించ లేకపోయినా, వైద్య సేవలు అందించలేమని చెప్పి వెనక్కు పంపడానికి వీలు లేదు.
2011 ఏప్రిల్ నెలలో తరచుగా వినిపించిన పదం "మాచ్ ఫిక్సింగ్". ఒక అ నైతిక ఒప్పందంగా "మాచ్ ఫిక్సింగ్" అనే మాట ముద్ర పడింది. ఆ తరహా "అప నమ్మకం" అనే ఆయుధాన్ని రాష్ట్ర రాజకీయ నాయకులు విపరీతంగా వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం. ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, తరువాత జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్" అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. అదే కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు. ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా.
ప్రభుత్వ ప్రయివేటు భాగ స్వామ్యంలో, 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవలు, సంబంధిత ప్రభుత్వ శాఖలోని కొందరు అధికారుల అలసత్వం వల్ల, మే నెల కల్లా, గతంలో వలె సేవలందించలేని స్థితికి చేరుకున్నాయి. సగటున గతంలో హాజరయ్యే రోజువారీ అత్యవసర సహాయ సేవలు గణనీయంగా పడిపోయాయి. సేవలను కోల్పోతున్న వారిలో, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, చిన్న పిల్లలు కూడా వున్నారు. అత్యవసర చికిత్స ఆలశ్యమవుతే సంభవించేది మరణాలే కదా! అదే విధంగా, నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలలో పని చేస్తున్న సిబ్బంది సమ్మె సాకుగా చూపి, సిబ్బంది లేవనెత్తిన అంశాలను పరిష్కరించే బదులు, గత ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి, ప్రభుత్వమే సంబంధిత జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఆ నిర్ణయం తీసుకునేందుకు పూర్వం, 475 సంచార వాహనాల ద్వారా, ఆ సేవలందించిన యాజమాన్యం, రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో- తాము నివసిస్తున్న గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు కనీస వైద్య సౌకర్యాలు ఏ మాత్రం లేని, సుమారు ఇరవై వేల గ్రామాల ప్రజలకు, నెలకొక్క సారి, అది కూడా నిర్ధారిత తేదీన, అన్ని రకాల ప్రాధమిక వైద్య సౌకర్యాలను సమకూర్చింది. లబ్ది పొందిన లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలలో, అనేక మంది గర్భిణీ స్త్రీలు, ప్రసూతి స్త్రీలు, పసి పిల్లలు, చంటి పిల్లలు కూడా వున్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు ఆ సేవలెంతగానో తోడ్పడ్డాయి. డిసెంబర్ నెలనుంచి, కలెక్టర్ల ఆధ్వర్యంలో నడుస్తున్న అవే వాహనాలు, కనీసం ఒక్క రోజన్నా, ఒక్క గ్రామానికన్నా, నిర్ధారిత తేదీన వెళ్ళిన దాఖలాలు లేవని చెప్పాలి. ప్రజోపయోగంగా వున్న పథకాలను నిష్ప్రయోజనం చేయకూడదు. అలాంటి ప్రజోపయోగమైన పథకాలలో అత్యంత ప్రయోజనమైన వి, బహుళ జనా మోదం పొందినవి, రాజకీయాలకు అతీతంగా-కుల మతాలకు అతీతంగా ఉపయోగ పడేవి, 108 అంబులెన్సులు- నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలు-ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం సేవలు. వీటిని నిధుల లేమితో నీరు కార్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అన్న భావం ప్రజలలో కలిగిందీ ఏడాది.
కడప లోక్ సభ, పులివెందుల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపధ్యంలో, ఓటమి దరిమిలా ప్రభుత్వ భవిష్యత్ పై ఆసక్తికర పరిణామాలు సంభవించవచ్చని భావించిన నేపధ్యంలో, తన పార్టీ ఓటమిని ఎలా తీసుకుంటారని మీడియా వారడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఒక సారి ఓడిపోయినంత మాత్రాన, అది శాశ్వతంగా ఓటమి పాలైనట్లు కాదని సమాధానం ఇచ్చారు. ఓటమిని క్రికెట్ మాచ్ తో పోల్చి, ఉదాహరణగా, ఒకానొక అంతర్జాతీయ క్రికెట్ మాచ్ లో బలమైన టీమిండియా, బలహీనమైన బంగ్లాదేశ్ టీంతో ఓటమి పాలైన విషయాన్ని, తర్వాత, ప్రపంచ కప్పును గెలవడాన్ని చెప్పారు సీఎం. ఓటమి-గెలుపుల వరకు పోలిక బాగానే వుంది కాని, మిగతా విషయాలలో టీమిండియా సాధించిన విజయ రహస్యానికి-వ్యూహానికి వెనుక నున్న కృషి-పట్టుదల, ఓటమి పాలు కాకుండా వుండేందుకు, "కిరణ్ కుమార్ రెడ్డి కడప ఎన్నికల టీం" కు లేదనేది పలువురి మనసులో మాటగా చెప్పుకోవాలి. వాస్తవానికి, ఆద్యంతం, జగన్మోహన్ రెడ్డిని అత్యంత బలీయమైన శక్తిగానే ఊహించింది కాంగ్రెస్. కాకపోతే, ఎన్నికల వ్యూహరచన ఓటమి దిశగానే చేసింది. చివరకు ఓటమి పాలైంది. తన తండ్రి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టను అని అన్న జగన్ నోటితోనే, పడగొట్టి తీరుతాను అన్న దాకా ప్రేరేపించింది. ఏదేమైనా, గెలిచింది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐనప్పటికీ, ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడించింది ప్రభుత్వాన్ని. ఓడిపోయింది అధికారుల అలసత్వానికి ప్రతీకైన ప్రభుత్వం, ప్రభుత్వంలోని సమిష్టి బాధ్యతా రాహిత్యం, ఆ బాధ్యతా రాహిత్యానికి వూతమిచ్చిన కొందరు అధికారుల సంక్షేమ పథకాల అమలు తీరు. ఈ తప్పులను కనీసం రాబోయే ఏడాదన్నా సరి దిద్దుకుంటే మంచిదేమో!
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి మే 22వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. విదేశాంగ విధానమైనా, ఆర్థిక పరమైన నిర్ణయాలైనా, ఇరుగు-పొరుగు దేశాలతో సత్సంబంధాలైనా, ఒక్కొక్క దానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక్కో రీతిలో ప్రగతి సాధించింది. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "జాతీయ సమైక్యతా మండలి" లోని సభ్యుల జాబితా చూస్తే, రాజకీయాలకతీతంగా, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దేశంలో, అలాంటి కమిటీలను ఏర్పాటు చేయగలమన్న భరోసా ఇవ్వగలిగింది మన్మోహన్ ప్రభుత్వం. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పునరుద్ధరణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్ నిర్మాణ్ యోజన, ఆం ఆద్మీ ఆలోచన లాంటి పలు పథకాలకు యూపీఏ ప్రభుత్వం రూప కల్పన చేసింది-అమలు పరిచింది. ఆర్థిక సంస్కరణలను, మారుతున్న సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించడం యూపీఏ విజయాలలో ఒకటి. అలాగే విజయాలను-అపజయాలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక విషయం గుర్తుంచుకోక తప్పదు. ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ధర్మానికి అనుగుణంగానే, మంత్రివర్గ ఏర్పాటుతో సహా, అభివృద్ధి-సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన అమలు కూడా వుండి తీరుతుంది. ఇక అంతర్జాతీయ రంగానికి వస్తే, క్షణ క్షణానికి, మన దేశంలో జరుగుతున్న మార్పులతో సంబంధం లేకుండా, అంతో-ఇంతో గత ఎన్డీయే హయాంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాకుండా, నిర్ణయాలు తీసుకోక తప్పదు. మన్మోహన్ సింగ్ కూడా అలానే చేస్తున్నారనాలి.
అన్నీ విజయాలేనా అంటే, అక్కడక్కడ, అపజయాలు లేకుండా పోలేదు. దానికి ప్రకృతిది కొంత బాధ్యత అనుకుంటే, మానవ తప్పిదాలు మరికొంత దోహద పడ్డాయి. కరువు-కాటకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తే, నిబద్ధత లేని భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు, అవినీతికి అంకితమై పోయి, యూపీఏ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు. అలానే చమురు ధరల పెంపుదల. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంపై పడింది. నిత్యావసర వస్తువైన గాస్ మినహా మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంచనాలకు మించి పెరగడం ఒక అపజయంగా అనుకోవచ్చేమో! చమరు ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై కూడా పడింది. పౌర పంపిణీ వ్యవస్థను ఎంత పటిష్ట పరిచినా ఇంకా చేయాల్సింది చాలా వుంది. టెలికాం స్కాం యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది కొంతవరకు. అలానే, అత్యంత వైభవంగా-అంగరంగ వైభోగంగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. భారత దేశానికి మున్నెన్నడూ లభించని విధంగా బంగారు-రజత-కాంస్య పతకాలు లభించాయి. అవినీతిని అరికట్టాలన్న ధృఢ సంకల్పంతో పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం, టెలికాం, కామన్వెల్త్ క్రీడల స్కాంలను సీబీఐకి అప్ప చెప్పి తన చిత్త శుద్ధిని తెలియ చేసుకుంది.
(మరిన్ని మిగిలాయింకా)