Tuesday, December 20, 2011

రజబ్ అలీ రగడ: వనం జ్వాలా నరసింహారావు



తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 14
రజబ్ అలీ రగడ
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పద్నాలుగో అధ్యాయం ఇది).
రజబ్ అలీకి మాస్ లీడర్‍గా పేరుంది. జిల్లా నాయకత్వంతో ఆయనకు విభేదాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్ర సహకార బాంక్ ఎన్నికలలో పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి, రావెళ్ల సత్యంగారికి వ్యతిరేకంగా పనిచేసి, ఆయన ఓటమికి కారణమయ్యారు రజబ్ అలీ. 1965లో చంచల గూడా జైలులో వుండగా, సత్యంగారితో వాగ్వివాదం వచ్చి, ఆయనను చెప్పుతో కొట్టేశాడు. మోటూరు హనుమంత రావు, దేవులపల్లి వెంకటేశ్వర రావు, మానికొండ సుబ్బా రావు, గుంటూరు బాపనయ్య, దాట్ల సూర్యనారాయణ గార్ల లాంటి నాయకులంతా అక్కడే వుండడంతో, రజబ్ అలీ చర్యను చాలా సీరియస్‍గా తీసుకున్నారు. ముషీరాబాద్ జైలులో వున్న సుందరయ్య, బసవ పున్నయ్య, నాగిరెడ్డి, పుల్లారెడ్డి గార్లకు ఆ సంఘటనపై పూర్తి నివేదిక పంపారు. (డాక్టర్ వై.ఆర్.కె కూడా అప్పుడు అదే జైలులో వున్నారు). జైలు నుండి బయటకు వచ్చిన తరువాత కూడా రజబ్ అలీ, తన వారిని కూడ తీయటం ప్రారంభించాడు. అయినా ఆయనను సున్నితంగా మందలించి 1967 అసెంబ్లీ ఎన్నికలకు ఖమ్మం నియోజకవర్గం నుంచి నిలబెట్టి గెలిపించింది.
పార్టీకి, ఆయనకు ఖమ్మం పార్టీ నిర్మాణ సంబంధమైన విభేదాలు వచ్చాయి. పార్టీ లైన్‍తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెబుతూనే, పార్టీ నాయకత్వం పోకడ తనకు నచ్చ నందువల్ల విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. (ఖమ్మం జిల్లా పార్టీలో బ్రాహ్మణ పెత్తనం సాగుతున్నదని అంతర్గతంగా ప్రచారం చేశాడు). “ఖమ్మం డివిజన్ సిపిఎం పేరుతో ఆఫీసు బోర్డు పెట్టి, సెప్టెంబర్ 1971 నుండి 6 మాసాల పాటు సాగించారలా. తరువాత సిపిఐలో చేరారు.
1972, 1983, 1985, 1989, 1994 ఎన్నికలలో సిపిఐ పక్షాన పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. రజబ్ అలీ తో సిపిఐ కి వెళ్లిన వారిలో కొందరి పేర్లు గుర్తు చేసుకున్నారు డాక్టర్ గారు. వారు: తుళ్లూరు సత్యం (తనికెళ్ల), దొండపాటి వెంకయ్య (కొణిజర్ల), బొమ్మిశెట్టి నారాయణ (కొత్తగూడెం), వంకాయలపాటి వెంకయ్య, కర్నాటి కృష్ణయ్య, మహ్మద్ మౌలానా, వెంపటి రామకోటయ్య, వెంపటి సూర్యనారాయణ, ఆఫీసు రాఘవయ్య, చావా వెంకటేశ్వర రావు (కొక్కిరేణి), పారుపల్లి పుల్లయ్య, ఎర్రంనేని వెంకట నరసయ్య (గోకినేపల్లి) వున్నారు. వీరందరూ స్థానికంగా పలుకుబడి వున్నవారు, ఎక్కువగా కమ్మ కులానికి చెందినవారు కావడంతో జిల్లా మార్క్సిస్టు పార్టీకి బాగానే నష్టం కలిగిందని అన్నారాయన. ఆయన వెంట వెళ్ళిన వారంతా డాక్టర్‍గారికి వ్యక్తిగతంగా స్నేహితులే. కాని, రాజకీయంగా మార్క్సిస్టు పార్టీకి అండగా వున్నందుకు ఆగ్రహంతో వుండేవారు! వారి-వారి సంభాషణలలో డాక్టర్ గారిని "కొండపై కూర్చున్న గురువు" అని వ్యంగంగా చెప్పుకునే వారట. (డాక్టర్ గారి ఇల్లు, ఆసుపత్రి, గుట్టల బజారులో ఎత్తైన గుట్టపై వుంటుంది).
ఆ నాటి పార్టీ నాయకత్వాన్ని"బ్రాహ్మణాధిక్య గ్రూప్" గా చెప్పడం అత్యంత దారుణం అంటారు. వారంతా జంధ్యాలు తీసివేసి, కార్మికోద్యమానికి అంకితమైన త్యాగమూర్తులంటారాయన. ఉద్యమ క్షేమం తప్ప, మతం, కులం, ప్రాంతం లాంటి సంకుచిత భావాలు ఏ కోశానా లేనివారు.
కమ్మ కులానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు కూడా ఆయనతో వెళ్లలేదు. రావెళ్ల సత్యంగారు, బోజెడ్ల వెంకటనారాయణగారు, రాయల వీరయ్యగారు, బోడేపూడి వెంకటేశ్వరరావు, ఏలూరి లక్ష్మీనారాయణ, పయ్యావుల లక్ష్మయ్య, కట్టా వెంకటనర్సయ్య మరికొన్ని పేర్లు చెప్పవచ్చు. కొత్తగా సిపిఐ లో చేరిన వారితోనే, తరువాత ఘర్షణలు ఎక్కువగా వచ్చాయి. బోజెడ్ల వెంకటనారాయణగారి కుటుంబం రెండుగా చీలింది. ఆయన గ్రామం నుండి ఇల్లు-వాకిలి, భూమీ అన్ని వదిలి కొంతకాలం ఖమ్మంలో తలదాచుకున్నారు. రాయల వీరయ్యగారిని దారి కాచి దాడి చేస్తే ఎముకలన్నీ విరిగి చావుతప్పి బయటపడడానికి ఐదారు మాసాలు పట్టింది.

No comments:

Post a Comment