రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
మరో మారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం, ఈనెల
18న ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స
సత్యనారాయణలకు ఆయన దగ్గరనుంచి పిలుపు రావడమే. ఏ క్షణాన్నైనా జాతీయ స్థాయిలో సార్వత్రిక
ఎన్నికలు, తదనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు, రాష్ట్ర మంత్రులపై సీబీఐ కేసులు, ఇతరత్రా సమస్యల నేపథ్యంలో
రాహుల్ రాష్ట్రంపై దృష్టి సారించవచ్చు. ఈ సమావేశంలో,
రాహుల్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని రాజకీయ పరిశీలకులు
భావిస్తున్నారు. అలానే తెలంగాణ అంశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని సూచనలు చేయవచ్చేమో.
కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాహుల్ పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో కొన్నాళ్ల క్రితం భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ ఇప్పటికే
6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశమై పార్టీ
పరిస్థితులను సమీక్షించారు. ఆ కొనసాగింపుగా, ఈనెల 17,
18, 19 తేదీల్లో పలు రాష్ట్రాల సీఎంలు,
పీసీసీ నేతలతో భేటీ కావాలనుకుంటున్నారట. ఇందులో భాగంగానే 18వ తేదీన ఆంధ్రప్రదేశ్,
కేరళ, తమిళనాడు నేతలతో రాహుల్ సమావేశమవుతున్నారు.
రాష్ట్ర-దేశ రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా
గమనిస్తున్న పరిశీలకులు అసలేం జరుగుతోంది? జరుగబోతోంది? అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రానికి
సంబంధించినంతవరకు, మరి కొద్ది రోజుల్లో తేలనున్న జగన్ వర్గ
కాంగ్రెస్-తెలుగుదేశం అసంతృప్తి ఎమ్మెల్యేల అనర్హత
భవితవ్యంలో, ఆ తరువాత తేలనున్న ఉప ఎన్నికల ఫలితాలను ఇప్పటి
నుంచే వివిధ కోణాలనుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు విశ్లేషకులు.
ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చాలా తేలికగా
కనిపించవచ్చు కాని వాస్తవానికి అంత చిన్న విషయమేమీ కాదనాలి. ప్రపంచంలోనే
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనికి, ప్రభుత్వ పదవి లేకపోయినా-ప్రధాని కాకపోయినా, మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియా
గాంధీ, ఆమె కుమారుడు-ఢిల్లీ పీఠం బావి వారసుడు రాహుల్
గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం రాబోయే రాష్ట్ర ఉప ఎన్నిక-దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా కలగక మానదంటున్నారు ఆ పరిశీలకులు.
ఆంధ్ర ప్రదేశ్ లో పాద రసంలాగా ఎగబాకుతున్న యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో రాజకీయ
గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో యావత్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందడుగు
వేస్తోంది.
జైలుపాలైన జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని-తిరుగుబాటు
ధోరణిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సహించే స్థితిలో లేదు. ఆయనకు
ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది-ఇంకా చేస్తూనే వుంది.
గతంలో జరిగిన ఉప ఎన్నికలను కూడా, తమకు అనుకూలంగా, ఒక ఆయుధంలాగా మలచుకుందామని, జగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. కాని
దురదృష్ట వశాత్తు అది సాధ్యపడలేదు. వీటన్నింటి నేపధ్యం ఒకటే!
సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వానికి, ఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించి, రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! భావి
భారత ప్రధానిగా చూడడమే! అది సాధ్యపడుతోందా? లేదా? అంటే అది వేరే సంగతి!
అధిష్ఠానంకు ఈ తరహా ఆలోచన రావడం, అమలుచేయడం,కొత్తేమీకాదు. గతంలో కూడా, అధిష్ఠానానికి ఎదురుతిరిగిన మహామహులను-ఉద్దండ
పిండాలను నిరంకుశంగా కాల రాసింది. ఎంతో మంది అతిరథ-మహారథులను అర్థ రధులుగా చేసింది. ఒక్క మాటలో
చెప్పాలంటే, "సమిష్ఠి నాయకత్వం" అన్న
మాటే గిట్టదు అధిష్ఠానానికి. అధిష్ఠానం అంటే ఎవరో కాదు.
ఒకనాడు నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిర, రాజీవ్ (మధ్యలో సంజయ్) లు కాగా
ఇప్పుడు సోనియా. ఆ ఏక వ్యక్తుల అభిప్రాయమే ఏకాభిప్రాయం-సమిష్ఠి అభిప్రాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం
కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే!వారెంత ప్రజాదరణ కల నాయకులైనా, పరిణితి చెందిన నాయకులైనా, ఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనా, తలవంచక-దాసోహం అనక తప్పదు. ఏడాది తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేని
ప్రస్తుత పరిస్థితులలో, మరో ప్రాంతీయ పార్టీని
బ్రతికి బట్ట కట్టనిస్తుందా? ఆంధ్ర
ప్రదేశ్ లో ఇప్పటికే ఒకటి-రెండు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా, పరువు-ప్రతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన
కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ పార్టీని
మనుగడ చేయనిస్తుందా? పోనీ ఏం చేయగలుగుతుంది? అన్నింటికన్నా ముఖ్యమైంది, పవర్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోగలగడం. పవర్
పాలిటిక్స్ ను అనుసరించాలంటే, ఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర
లేదు. పవర్ పాలిటిక్స్ ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి
తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ
ధోరణి లేదు. "నెహ్రూ-ఇందిర-గాంధీ" వారసత్వ సంపదను పదికాలాలపాటు పదిలంగా
ఉంచడానికి, కాంగ్రెస్ అధిష్టానం, పవర్ పాలిటిక్స్ ను, అవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరే, తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. కాకపోతే, అన్నివేళలా అధిష్ఠానం ఆలోచనలు
విజయవంతమవుతున్నాయా అంటే, బెడసి కొట్టిన
సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో
విధంగా రాహుల్‌ను ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని
అడ్డగించినవారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే!
ప్రధాన మంత్రి పదవికి ప్రణబ్ కుమార్ ముఖర్జీ కంటే అర్హుడు మరెవ్వరూ
లేరనాలి. ఆయన ఆ పీఠాన్ని అధిరోహించితే అడ్డు చెప్పేవారు కాని, చెప్పగలిగేవారు కాని పార్టీలో ఎవరూ లేరు. అందుకే, రాహుల్‌కు దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు మరో
విధంగా పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్టింది నెహ్రూ-ఇందిర-గాంధీ వారసత్వం. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు
నేర్చుకునేవారు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోవడం తేలికే! యుపిఎ
భాగస్వామ్య పార్టీల ప్రస్తుత-మాజీ నాయకులు శరద్ పవార్, అజిత్ సింగ్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు
చేసింది సోనియా నిర్ణయం. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితే, ఎల్లప్పుడూ వాడే సిబిఐ దర్యాప్తు లాంటి బ్లాక్
మెయిల్ ఆయుధం వారిపై కూడా ప్రయోగించే వీలుందని అందరికీ తెలిసిన విషయమే! ఇక
రాష్ట్రం విషయానికొస్తే, జగన్మోహన్
రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎదుర్కునేందుకు అధిష్ఠానం తనముందున్న తురుఫ్ ముక్కలన్నింటినీ
బయటకు తెచ్చింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన తీవ్ర పదజాలంతో కూడిన
వ్యాఖ్యలు కూడా అందులో భాగమే. గతంలో, ఎప్పుడైతే పద్దెనిమిది
మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయించనున్నారని పసికట్టిందో, అప్పుడే, చిరంజీవిని తనవైపు గుంజుకుంది. ఆ
తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి
కట్టబెట్టింది. కీలకమైన (గత) ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను జైలు పాలు చేసింది. ఇంకా జైలులోనే కొనసాగించే వ్యూహం
పన్నింది.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు ముదురుతుండగా, మరోవైపు, రోగ లక్షణాలు
ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్
వేగంగా పాకుతుండడంతో, వ్యాధిని నియంత్రించడం
కష్ట తరమై పోతోంది. బహుశా నూట ఇరవై ఎనిమిదేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితిని, ఇంతకంటే మంచిగా ఎవరూ వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం
వచ్చిన నాటినుంచీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
ఏర్పాటైన నాటినుంచీ, కాంగ్రెస్ పార్టీకి
కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లో, ఆ తరువాత 1994-2004 మధ్యలో, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అస్తిత్వాన్ని మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని
కోల్పోయినా, డాక్టర్ మర్రి
చెన్నారెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే
విధంగా 1994-2004 మధ్య కాలంలో
అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ
వైభవాన్ని పొంది 2009లో మరో మారు
ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ
స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, ఆద్యతన భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న
నమ్మకం కుదరకపోవడం, పార్టీని అపజయ పరంపరలకు
గురిచేస్తోంది.
అలనాడు నీలం సంజీవరెడ్డి, ఆయన తరువాత ఆయన వారసుడుగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో విజయం
సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్
రాజశేఖర రెడ్డి మినహా, ఈ రాష్ట్ర కాంగ్రెస్
ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారో, అధిష్ఠానాన్ని నమ్మించిన వారో, అధిష్ఠానాన్ని ఆ కట్టుకోగలిగిన వారో, లాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే ముఖ్యమంత్రులు
కాగలిగారు. ఆ ఆచారం జవహర్లాల్
నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం సంజీవయ్య నుంచి నేటి కిరణ్ కుమార్
రెడ్డి వరకూ అదే వరస. వీరిలో సమర్ధులు లేరని
కాని, "దిగుబడి" కి సమర్ధత కొలమానం కాదని కాని భావన కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో ఎత్తు. ఎన్టీ
రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కాని, ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో
ఓడినప్పుడు కాని, త్రి ముఖ పోటీ
జరిగినప్పుడు కాని, కాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి
సారిగా దానికి భారీ గండి పడింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల
ఫలితాలు ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పాయి. తెలంగాణ ప్రాంతంలో తెరాస గండి
కొడుతుంటే, సీమాంధ్రలో జగన్ పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర
పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది.
2009 ఎన్నికల్లో
అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి
హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ
ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, భారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి
నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. నెత్తి
మీద కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం
చేసినా ఫలితం శూన్యం.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు మిట్టాడుతున్న
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య
వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా
నెలకొని వుంది. కళ్ల ముందర, ఈ పరిస్థితిని అధిగమించడానికి, మార్గాలేవీ కనిపించడం లేదు. గత
ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడేందుకు, దేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన రాష్ట్ర
కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు. పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలో, మన్మోహన్ సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని
పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ
ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఏ విధంగా
అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు
కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర,రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న
సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డ కో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని
అంటగట్టిన అధిష్ఠానం, ఏ నాడన్నా
ఆయనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందా? ఆయన మంత్రి వర్గాన్ని ఆయనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందా? పదవుల పందేరం చేయనిచ్చిందా?ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష
పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందా? తన మంత్రివర్గంలో అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో
కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వుందా? ముందు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం
అధిష్ఠానానికి ఉంది.
బహుశా, తమిళనాడు
తరహాలో, ఏదో ఒక ప్రాంతీయ
పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్‌కు
తప్పదా? అలాంటప్పుడు, ఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు
కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే
అవకాశాలున్నాయా? రాష్ట్ర విభజన చేయక
తప్పదా? ప్రత్యేక తెలంగాణ
రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?
2014 లో జరుగనున్న
సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా
గాంధీ కుమారుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న రాహుల్‌గాంధీ, ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్త మౌతున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స
మొదలు పెట్టారంటున్నారు. అందులో భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి
పోతున్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి
ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు
జరిపారు. అధినేత్రి సోనియా
ఆదేశాలతోనే రాహుల్ రంగ ప్రవేశం చేశారా? లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా తేలాల్సిన విషయమే.
ఏదేమైనా
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. End
No comments:
Post a Comment