శ్రీకృష్ణ
కమిటీ మనసులో మాట
నమస్తే
తెలంగాణ దినపత్రిక (23-08-2013)
వనం
జ్వాలా నరసింహారావు
విభజన దిశగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్
కమిటీ తీసుకున్న నిర్ణయం నేపధ్యంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఒక్కసారి మననం
చేసుకుంటుంటే ......ఆ నివేదిక పూర్తిగా విభజనకు అనుకూలంగానే చెప్పకనే చెప్పిందన్న
విషయం బోధపడ్తుంది!
నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ
కమిటీ సభ్యులు తమకు “అప్పజెప్పిన పని సులభమైంది కాదని”
అనడం కన్నా, బాధ్యత తీసుకునే ముందే, తమకంతగా చేతకాని బాధ్యత నెత్తిన వేసుకుంటున్నామని అనుకుంటే బహుశా
బాగుండేదేమో. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు,
బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? తేల్చనప్పుడు-తేల్చలేమని గుర్తించినప్పుడు, ఆ సంగతే చెప్పాలి కాని,
శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం ఎంతవరకు సబబు? పైగా తాము చెప్పలేని దానికి, పోనీ పదే-పదే చెప్తూ వస్తున్న దానికి (అందరికీ ఆమోద యోగ్యమైన
నివేదిక ఇస్తాం!) పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగంలోని
సూక్తులను పేర్కొనడం ఒక తెలివైన ఎత్తుగడ తప్ప మరోటి కాదు. కమిటీ
చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని
ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా
శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా
అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? సూచన-ఐదుకు ప్రభుత్వం అంగీకరించితే అది సమైక్య
వాదులకు అపజయమే కదా! సూచన-ఆరుకు
ఒప్పుకుంటే, ఇటు తెలంగాణ కోరుకునే వారికి, అటు సమైక్య వాదులకు అపజయమే కదా! జవహర్లాల్ నెహ్రూ
చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన
న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని,
సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ
విజయం చేకూరుస్తున్నామని చెప్పడం తగునా?
నివేదికలో ఏం చెప్పినా
ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట
మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. మహాభారత
యుద్ధం పూర్వ రంగంలో, కౌరవ-పాండవ
యుద్ధం నివారించడానికి శ్రీకృష్ణుడు హస్తినకు రాయభారానికి వెళ్లినట్లు వర్ణించడం
జరిగినా, వాస్తవానికి, యుద్ధాన్ని ఖాయం
చేసేందు కొరకే వెళ్లాడనేది జగమెరిగిన సత్యం. అదే జరిగింది
కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు కూడా. తర తరాల ఆంధ్రా నిలువెత్తు
దోపిడీకి నిదర్శనంగా శాశ్వతంగా మిగిలిపోయిన తెలంగాణ ప్రాంతం వారు చేయబోయే ఆధునిక
మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ
రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక
సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం,
మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం
విశేషం. మరో విధంగా చెప్పాలంటే, నాలుగు
కోట్ల తెలంగాణ ప్రజల న్యాయమైన కోర్కె సమంజసమని-సమర్థించాలని
మనసులో వున్నా, చేసిన ఆరు సూచనలలో వద్దనుకుంటూనే నాలుగు
సూచనలు విభజనకు సంబంధించినవి కావడం విశేషం. అంటే, విభజన సమస్య పరిష్కారానికి సరైన మార్గమని ఆయనకు తెలిసినా అసంబద్ధమైన
విభజనలను మొదలు సూచించి, చివరకు అసలు సిసలైన రాయభారం తరహాలో...
ఐదూళ్లిచ్చిన చాలును... అన్న చందాన పనికిమాలిన
సూచనతో సహా, అసలు సిసలైన ఒకే ఒక్క సూచన చేశారు. ఆయన చెప్పిన విధంగా, ఐదో సూచనకు అనుగుణంగా తప్ప,
వేరే రకంగా విభజనకు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు.
"అనివార్యమైతే - అంతా ఒప్పుకుంటేనే
పరిశీలించాలి" అని కమిటీ వ్యాఖ్య చేసిన "రాష్ట్రాన్ని సీమాంధ్ర-తెలంగాణగా విభజించి...
హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు
కొత్త రాజధాని ఏర్పాటు చేయడం" అన్న దానికి ప్రభుత్వం
ఒప్పుకుని, దానికి అనుగుణమైన చర్యలు చేపట్టి తేనే, బహుశా మహాభారత యుద్ధం లాంటిది నివారించవచ్చేమో! శ్రీకృష్ణ
కమిటీ సభ్యులంతా "మనసా-వాచా"
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయమైందని భావించినా, "కర్మనా" అనుకూలంగా లేకుండా-ప్రతికూలంగా కాకుండా తీర్పు లాంటి సూచన ఇవ్వడం అన్యాయం లాంటిదే!

ఒక వైపు సూచనలు చేస్తూనే
అవే సూచనలు "ఆచరణ యోగ్యమైనవి కావు" అని అనడం కూడా ఎంతవరకు సబబు? "కలిసి ఉండటమే
ఉత్తమం" అంటూనే, అదే "అత్యుత్తమమైన మార్గం" అని చెప్తూనే, సమైక్యాంధ్రకు అనుకూలమైన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే తెలంగాణలో
నిరసనలు తప్పక పోవచ్చని, పలు ప్రాంతాల్లో వ్యతిరేకత
ఎదురవుతుందని వ్యాఖ్యానించడంలోని ఆంతర్యం ఏంటి? సమైక్యంగా
వుండడానికి తెలంగాణ ప్రాంతం వారు అంగీకరించారనే కదా? అంటే
శ్రీకృష్ణ కమిటీ మనసులోని మాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదా? ఇంకొంచెం లోతుగా నివేదికను విశ్లేషిస్తే,"అనివార్యంగా
రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తెలంగాణను, సీమాంధ్రను
రెండు రాష్ట్రాలుగా విడదీయాలని, సీమాంధ్ర సొంత రాజధానిని
అభివృద్ధి చేసుకునే దాకా హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని"
మరో సూచన కనిపిస్తుంది. ఇది కూడా ప్రత్యేక
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిందనాలి కదా? ఏదేమైనా, ‘‘ఇదేమంత అభిలషణీయమైన పరిష్కారం కాదు.
అయినా సరే అనివార్యంగా విభజించాల్సి వస్తే అది మూడు ప్రాంతాల ప్రజల
ఆమోదంతో జరగాలి’’ అని చెప్పకనే చెప్పింది ప్రత్యేక తెలంగాణ
ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను
ప్రారంభించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభుత్వానికి". ఇతర సూచనలకు కూడా "తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర
వ్యతిరేకత వస్తుంది" అని కమిటీ అభిప్రాయ పడడమంటే,
నర్మ గర్భంగా తెలంగాణ ఏర్పాటు చేయమని చెప్పడమే కదా? కాకపోతే, ఎందుకో, ఏ కారణానో,
"సందిగ్ధత లేని" తరహాలో మనసులో మాట
చెప్పడానికి జంకింది శ్రీకృష్ణ కమిటీ.
మొదటి నాలుగు సూచనలలో “ఆచరణసాధ్యం కాని” ఒక సూచన, తెలంగాణలో
ఒప్పుకోనందున “అసాధ్యమని భావించిన” మరో
సూచన, ఏ ప్రాంతం వారికి “ఆమోదయోగ్యం
కాని” ఇంకొక సూచన, నక్సలిజం పెరగడానికి
అవకాశమున్నందున-ఏకాభిప్రాయం సాధ్యం కానందున “పనికి రాని” ఒక సూచన చేసిన కమిటీ, మిగిలిన రెండు సూచనలు సార్వజనీన సమ్మతమైనవని చెప్పడానికి సాహసించలేదు.
ఒకటి పరిశీలనకు తగిందిగా, మరొకటి సమస్యలకు
దారి తీసేదిగా కమిటీ మాటల్లోనే స్పష్టమవుతోంది. "రాష్ట్రాన్ని
సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి,
రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం-చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం"
ఏబై సంవత్సరాల క్రితం చెప్పి వుంటే కొంతైనా అమలయ్యేదేమో కాని
ఇప్పుడు అత్యంత అసాధ్యమైన విషయం. 1956 లో చేసుకున్న పెద్ద
మనుషుల ఒప్పందం స్ఫూర్తితో "తెలంగాణ ప్రాంతీయ మండలిని
ఏర్పాటు" చేయమని సూచించడం కన్నా తిరోగమన మార్గం లేదనాలి.
ఇన్నేళ్లు జరగంది, ఇప్పుడు జరుగుతుందన్న
నమ్మకం, విశ్వాసం భవిష్యత్ "సీమాంధ్ర
నాయకులు" ఎన్ని రాజ్యాంగ భద్రతలు కలిగించినా, తెలంగాణ ప్రజల్లో కలిగించడం జరగని పని. చట్టబద్ధమైన
సంప్రదింపులను ప్రాంతీయ మండలి నిర్వహించడం కాని, ప్రాంతీయ
మండలికి-రాష్ట్ర ప్రభుత్వానికి-శాసనసభకు
మధ్య ఎప్పుడైనా, ఏవైనా అభిప్రాయభేదాలు తలెత్తినపుడు...
“గవర్నర్ ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీ” ని
ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం కాని ఎండమావుల లాంటి ఆలోచనలు.
తెలంగాణ ఏర్పాటై, తెలంగాణకు చెందిన వారు
ముఖ్యమంత్రి కావాలనుకునే తెలంగాణ ప్రజలకు, తమ ప్రాంతం వాడే
మో "కేవలం కేబినెట్ మంత్రిగా" మిగిలి పోవడం ఆమోదయోగ్యమైన ప్రతిపాదన కానే కాదు. ముఖ్యమంత్రి
లేదా ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కీలక మంత్రిత్వ శాఖలను తెలంగాణ ప్రాంత నేతలకు
కేటాయించడం జరుగుతే, ప్రాంతీయ మండలి అధ్యక్షుడి హోదా ఏం
కావాలి? బహుశా ఆచరణ యోగ్యం కాని సూచనలలో అగ్ర భాగాన నిలిచే
సూచన ఇదేనేమో!
అన్నింటి కన్నా ఘోరమైంది,
రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా నామినేటెడ్ పోస్టులో నియమించబడిన
గవర్నర్ కు, ఈ ప్రతిపాదన ద్వారా విస్తృత అధికారాలను
కట్టబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం.
శ్రీకృష్ణ కమిటీ
మాటల్లోనే, తెలంగాణ-సీమాంధ్రలుగా
రాష్ట్రాన్ని విభజించడం, అత్యధిక తెలంగాణ ప్రజల మనోభావాలను
గౌరవించినట్లన్న భావన వుంది. తెలంగాణ లోని మెజారిటీ ప్రజలు
ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్న వాస్తవం కూడా కమిటీ చెప్పింది. "తప్పని పరిస్థితుల్లో-అన్ని ప్రాంతాల వారికి
ఆమోదయోగ్యమైతేనే" రాష్ట్ర విభజన జరగాలని కమిటీ
అభిప్రాయపడడం, పరోక్షంగా, అలాంటి
పరిస్థితులు కలుగుతాయని హెచ్చరించడమేనా? ప్రత్యేక రాష్ట్రం
ఏర్పాటు కావాలన్న చిరకాల డిమాండ్ నేపధ్యంలో, రాష్ట్ర విభజన
జరగకపోతే, ఉద్యమం కొనసాగే ప్రమాదముందని కమిటీ హెచ్చరిస్తుంది.
"నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం ఉద్యమాన్ని” అదుపు చేయగలిగితే" తప్ప ఉద్యమం ఎదుర్కోవడం
కష్టమవుతుంది కనుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఉత్తమం
అని సూచన చేసింది. (…”Likelihood of the agitation continuing in case the
demand is not met-unless handled deftly, tactfully and firmly as discussed
under option six-consideration has to be given to this option.)
రాష్ట్ర విభజన చేసేందుకు
నిర్ణయం తీసుకుంటే, రాజ్యాంగంలోని మూడవ ప్రకరణం కింద చెప్పిన
విధంగా, ముందుకు సాగితే మంచిదని కూడా కమిటీ సూచించింది.
అంటే, రాష్ట్ర రాజకీయ నాయకులతో సంప్రదింపులు
అనవసరం అన్న భావన వుంది కదా! ఎలాగూ చిదంబరం డిసెంబర్
తొమ్మిది ప్రకటనలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలయిందని స్పష్టంగా
చెప్పారు. కమిటీ అదే సూచించింది. కాంగ్రెస్
వర్కింగ్ కమిటీ, యుపియే సమన్వయ కమిటీ కూడా విభజనే అంటున్నది.
దిగ్విజయ సింగ్ పదే-పదే అదే అంటున్నారు. ఆంటోనీ కమిటీ సమైక్యం తప్ప ఏదైనా
కోరుకోమంటున్నది. ఇంకెందుకు ఆలశ్యం? పార్లమెంటులో బిల్లు
పెడితే ప్రధాన ప్రతిపక్షం బిజెపి-దాని ఎన్డీఏ మిత్ర పక్షాలు
సమర్థించడం ఖాయం కనుక, ఆ దిశగా అడుగులు వేస్తే అందరికీ మేలు. End