Sunday, March 16, 2014

చెన్నపట్నం తరలిన సాంస్కృతిక యోధులు… కె. బి. తిలక్ అనుభవాలు-జ్ఞాపకాలు:వనం జ్వాలా నరసింహారావు

చెన్నపట్నం తరలిన సాంస్కృతిక యోధులు
కె. బి. తిలక్ అనుభవాలు-జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణా విమోచన ఉద్యమం ఊపందుకుంటున్న ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వున్న రీతిలోనే, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ - నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రజా నాట్య మండలికి కూడా అదే పరిస్థితి ఎదురైంది అప్పట్లో. ఉండటం అయితే ఎల్. వి. ప్రసాద్ గారింట్లోనే అయినా తన అజ్ఞాత - ఉద్యమ కార్యక్రమాలను మాత్రం మరెన్నో ఇళ్ల నుండి నిర్వహిస్తుండే వారు తిలక్‌ గారు. భోజనం మాత్రం ఎక్కువగా ప్రసాద్ గారింట్లోనే.

నిషేధం, నీలినీడల్లో ప్రజా నాట్య మండలి తాలూకు వ్యక్తులు ఒక్కరొక్కరే మద్రాసు చేరుకోనారంభించారు. అలా వచ్చిన వారిలో తొలుతగా సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి ("మాభూమి" రచయితలుగా ప్రసిద్ధి కెక్కిన సుంకర - వాసిరెడ్డి), తుమ్మల వెంకట్రామయ్య (రచయిత), రాంభట్ల కృష్ణమూర్తి, షెట్టి ఈశ్వర రావు, తాపీ ధర్మారావు కొడుకు మోహనరావులు ఉన్నారు. ఓ విధంగా సాంస్కృతిక విభాగం అంతా చేరుకుంది మద్రాసుకు.

అలాగే వచ్చిన వారిలో - అక్కడికి అప్పటికే చేరుకున్న వారిలో - తాతినేని ప్రకాశరావు, వీరమాచనేని మధుసూదనరావు, మిక్కిలినేని, పెరుమాళ్లు, చదలవాడ కుటుంబరావు, రాంకోటి, కోగంటి గొపాలకృష్ణయ్యల్లాంటి భవిష్యత్ సినీరంగ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీరంతా ప్రజా నాట్య మండలి - కమ్యూనిస్టు ఉద్యమాల్లో తమ శక్తి మేరకు పనిచేసిన వారేనని వేరే చెప్పనక్కర్లేదు.

మరి వీళ్లకు మద్రాసులో ఓ ఆధారం దొరకాలి కధా. అది కె. ఎస్. ప్రకాశరావు గారు, తిలక్‌గారి ద్వారా ఎల్. వి. ప్రసాద్ గారు వీలయినంత వరకు కల్పించసాగారు. ఆ విధంగా సినీ పరిశ్రమలో ప్రజా నాట్య మండలి తాలూకు పలువురు కళాకారులు స్థిరపడడానికి నాంది జరిగింది. ఇతరుల ప్రోద్బలంతో కొంత కాలం పాటు ఎల్. వి. గారు కూడా (ఆంధ్ర) ప్రజా నాట్య మండలి అధ్యక్షుడిగా పనిచేశారు.

సరిగ్గా అదే ప్రాంతంలో కృష్ణా జిల్లాకు చెందిన కొందరు ధనవంతులు ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో ప్రసాద్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించారు. వారిలో నిర్మాతలు ఎ. వి. సుబ్బారావు, శేషగిరి రావులు ఉన్నారు. ఆ సంస్థను ప్రోత్సహించిన వారిలో తాతినేని ప్రకాశరావు గారు కూడా ఒకరు.

ఇదిలా వుండగా తిలక్ గారు అప్పుడప్పుడే సినీరంగంలో ఎడిటర్‌గా స్థిరపడుతున్న రోజులవి. సరిగ్గా అప్పట్లోనే కొండముది గోపాల రాయశర్మ గారు వ్రాసిన "శ్రీమతి" అనే స్క్రిప్ట్ సారథీ ఫిల్మ్స్ కు ఉద్దేశించబడింది వెలుగులోకి వచ్చింది. గృహప్రవేశం సినిమా తీసిన తర్వాత మోడల్ ప్రొడక్షన్స్, సారథి నుండి విడిపోయింది. "స్వతంత్ర ప్రొడక్షన్స్" అనే పేరుతో అదే రోజుల్లో మరో స్వంత కంపెనీని స్థాపించారు. ఇలా విస్తరించసాగాయి తెలుగు వారి ఫిల్మ్ కంపెనీలు రకరకాల కారణాల వల్ల. ఆ స్వతంత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ క్రిందే ఎల్. వి. ప్రసాద్ గారి దర్శకత్వంలో "ద్రోహి" అనే సినిమాను తీశారు కె. ఎస్. గారు.


అభ్యుదయ భావాల సాంఘిక ఇతి వృత్తంగా నిర్మించిన ద్రోహి సినిమాలో నటీనటులుగా ఎల్. వి. ప్రసాద్, కోన ప్రభాకర రావు (మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు ఆ తర్వాత) కె. ఎస్. ప్రకాశరావు, జి. వరలక్ష్మి, రాళ్లబండి కుటుంబ రావులు ఉన్నారు. తాపీ ధర్మారావు రచయిత కాగా ఆరుద్ర స్క్రిప్ట్ తయారిలో సహకరించారు. తాపీ గారు వ్రాసిన "దయ లేదా.. బీదల మీద దయలేదా..." అనే పాటకు బహుళ ప్రజా దరణ లభించింది. దానికి సంగీతం సమకూర్చింది పెండ్యాల.

ద్రోహి సినిమా తీసిన తర్వాత మరో సంస్థ వెలసింది. "ప్రకాశ్ ప్రొడక్షన్స్" అనే పేరుతో దాన్ని స్థాపించారు కె. ఎస్. ప్రకాశరావు గారు. అంతటితో ఆగకుండా "ఫస్ట్ నైట్" అనే సినిమాను తీసి, దానికి ఆయనే దర్శకత్వం వహించారు కూడా. కె. ఎస్. ప్రకాశరావు గారు ప్రఖ్యాత దర్శక - నిర్మాత రాఘవేంద్రరావు తండ్రి గారనే విషయం తెలిసిందే. కె. ఎస్. గారి వేరుకుంపటి ప్రయత్నాలు భవిష్యత్‌లో స్టూడియో స్థాపించే వరకూ వెళ్ళాయి.

కె. ఎస్. కజిన్ కోవెలమూడి భాస్కరరావు గారు కూడా మరో కంపెనీ స్థాపించారు. అదే "ప్రీమియర్ ఫిల్మ్స్". ఆయనతో పనిచేసిన కొందరు విడిపోయి మరో నూతన ఫిల్మ్ సంస్థ "నవయుగ"కు వచ్చారు. వారిలో అభ్యుదయ భావాల చదలవాడ, కాట్రగడ్డ శ్రీనివాస రావు - ఆయన తోడల్లుడు చంద్రశేఖర రావు, సూరెడ్డి విష్ణులు ఉన్నారు. వీరంతా దాదాపు కమ్యూనిస్టు పార్టీ - అతివాద సిద్దాంతాల అభిమానులే - సానుభూతిపరులే. అయితే వామపక్ష భావాల "వీరు" - "వారయి" వ్యాపార రంగంలో దిగారు - స్థిరపడ్డారు.

కామ్రేడ్ పి. సి. జోషి కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వున్న రోజుల్లో సర్కారు జిల్లాల్లోని ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు పలువురు ఆ పార్టీపై అభిమానం పెంచుకున్నారు. ప్రతి ఇంటిలోనూ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో పాటు కనీసం ఒక్కరైనా కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షితులయ్యే వారట. విచిత్రంగా ప్రతి ఇంటిమీద కాంగ్రెస్ - కమ్యూనిస్టు జండాలు ఎగిరేవి. ఇలా ఆకర్షితులైన చాలా మంది ప్రజా నాట్య మండలితో సంబంధాలు పెట్టుకోవడంతో కాలక్రమేణా మద్రాసుకు వచ్చి సినీ రంగంలో స్థిరపడి క్యాపిటలిస్ట్ లయ్యారు.

ఇక ఎల్. వి. ప్రసాద్ గారి విషయానికొస్తే - ఆయన మటుకు ఆయనకు ఏ ఉద్యమాలతో సంబంధం ఆదినుండీ లేదు. ఆయనది ఎప్పుడూ "ప్రొఫెషనల్ మోటివేషనే". ఆయన సామాజిక స్పందన కేవలం సినీ పరిశ్రమకే - పోనీ - సినిమాలు తీయడం వరకే పరిమితం. ఏ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గోనే వారు కాదాయన.

కొండముది గోపాల రాయశర్మ గారు "శ్రీమతి" అనే సినిమా స్క్రిప్ట్ తయారుచేసి సారథీ బ్యానర్ క్రింద సినిమా తీసేందుకు ఇచ్చారని చెప్పుకున్నాం గదా. దానికి అప్పట్లో డైరెక్టర్ ఎల్. వి. ప్రసాద్. "మేడమ్ ఎక్స్" అనే నవల ఆధారంగా తయారు చేయబడిందా స్క్రిప్ట్. "శ్రీమతి" సినిమా తీసేందుకు నూతన ఆర్టిస్టుల అన్వేషణలో ఆంధ్రా టూర్‌కెళ్లారు రచయిత కొండముది (ఆయన అప్పటికే నాటక రచయితగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు). డైరెక్టర్ ఎల్. వి. ప్రసాద్ పనిలో పనిగా లొకేషన్ (షూటింగ్ కొరకు) చూడడానికి అమరావతిని కూడా దర్శించారు అప్పుడే.

వారప్పుడు ప్రాథమికంగా ఎంపిక చేసి మద్రాసుకు రమ్మని పిలిచిన వారిలో దశాబ్ధాలపాటు సినీరంగాన్ని, దశాబ్దం పైగా ఆంధ్ర రాజకీయ రంగాన్ని శాసించిన నందమూరి తారక రామారావు గారు ఒకరు. మిగిలిన వారిలో బ్యాంకు ఉద్యోగి - రచయిత ప్రసాద్‌గారు, జర్నలిస్ట్ గా ఆంధ్ర పత్రికలో పని చేసిన వెంకట్రావు గారు, చిన్న చిన్న పాత్రలను సినిమాల్లో పోషించిన ముక్కామల గారి సోదరుడు వున్నారు. రచయిత ప్రసాద్ గారు అ తర్వాత కాలంలో, గవర్నర్ కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్‌ యాక్షన్ (నిసా) అనే స్వచ్చంద సంస్థ రూపొందించిన "భారతరత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమానికి స్క్రిప్ట్ తయారు చేస్తున్నప్పుడు తోడ్పడ్డారు.ఈ రూప వాణి కార్యక్రమం ఇందిర పాత్రను ధరించిన శ్రీమతి గీతారెడ్డి రాజకీయ రంగప్రవేశానికి బాటలు వేసింది. ఎం. ఎల్. ఎ గానూ, మంత్రి గాను ఆమె ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో స్థానం పొందిన సంగతి తెలిసిందే.

ఎన్టీ రామా రావు గారికి మూవీ టెస్ట్, స్టిల్ టెస్ట్, మేకప్ టెస్ట్ ప్రసాద్ గారు చేయించినప్పుడు ఎడిట్ చేసిన ఇద్దరు వ్యక్తులు శ్రీ రాజన్, శ్రీ తిలక్‌లు. ఎమెచ్యూర్ కెమెరామెన్ డి. వి. ఎస్. మణ్యం (సుబ్రహ్మణ్యంగా, గుంటూరులో ఎన్టీఆర్‌కు స్నేహితుడు కూడా ఆయన) స్టిల్‌ను తీశారు. అప్పట్లో స్టిల్ స్టూడియో ఎల్. వి. ప్రసాద్ గారింట్లోనే ఉండేదట. ఆ సందర్భం లోనే తిలక్‌మీద కూడా తీసిన ఓ స్టిల్ ఇప్పటికీ ఆయన వద్ద వుంది.

తిలక్ గారితో సహా అందరూ ఎన్టీ రామారావు గారినే ఎంపిక చేయడం, ఆయనంటే ఇష్టపడడం జరిగింది వెంటనే. అయితే దురదృష్టవశాత్తు "శ్రీమతి" సినిమా తీసే ప్రాజెక్టు వివిధ కారణాలవల్ల వాయిదా పడింది - కనీసం తాత్కాలికంగానన్నా వాయిదా వేయక తప్పలేదు. దరిమిలా సారథీ ఫిల్మ్స్, చల్లపల్లి రాజాగారి సోదరుడు రామకృష్ణ ప్రసాద్‌గారి ఆధ్వర్యంలోకి పోవటం, "విజయా" వారితో సహా ఇతరుల ప్రొడక్షన్స్ లో ఎల్. వి. ప్రసాద్ బిజీ కావటం కూడా "శ్రీమతి" వాయిదా వేయటానికి దోహదపడ్డాయి.

అప్పట్లో తిలక్, ఆ తర్వాత కె. ఎస్. ప్రకాశరావు గార్లకు మీర్జాపూర్ రాజా గారికి చెందిన "మీర్జాపూర్ స్టూడియో"తో సంబంధముండేది. ఆ స్టూడియో ఆధ్వర్యంలో శరత్ నవల ఆధారంగా "మన దేశం" అనే సినిమా నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. శ్రీ ఎల్. వి. ప్రసాద్ గారు దానికి దర్శకులు. నాయకుడి పాత్రను సిహెచ్. నారాయణ రావు పోషించగా, నాయకిగా ఆయన సరసన మీర్జాపూర్ రాజాగారి భార్య శ్రీమతి కృష్ణవేణి పోషించారు. అందులో సబ్ ఇన్ స్పెక్టర్ పాత్ర వేయటానికి అవకాశమిచ్చారు మొట్టమొదటి సారిగా శ్రీ ఎన్‌. టీ. రామారావుకు. అలా జరిగింది ఆయన సినీరంగ ప్రవేశం.


"వుడోకిన్" అనే రష్యన్ ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ మేకింగ్ - ఎడిటింగ్ మీద రచించిన ఓ చక్కని పుస్తకం తిలక్, ఎన్టీ ఆర్‌ కు బహూకరించారు అప్పట్లో. ఎన్టీ ఆర్‌ను విశ్వవిఖ్యాత నటుడిగా తీర్చిదిద్దడంలో ఆ పుస్తకం ఆయనకెంతగానో తోడ్పడిందని, అది ఎన్టీ ఆరే తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు తిలక్. (ఇంకా వుంది)

No comments:

Post a Comment