సంధ్యావందనం
వనం జ్వాలా నరసింహారావు
"సంధ్యావందనం ద్విజాతులకెంతో
ముఖ్యమైంది. సంధ్యావందనం చేయని బ్రాహ్మణుడు ప్రాణం లేని దేహంతో సమానం. ఇలా
ఆలోచిస్తే,
బహుశా, ఈ రోజుల్లో బ్రాహ్మణ జాతి సంధ్యావందనం
చేయని స్థితికి చేరుకుని, ఒక విధంగా పతనమై పోతున్నదనాలి. బ్రాహ్మణులమని
అనుకునేవారు తమ స్వరూపాన్నే మరచి, భ్రష్టులై పోవడానికి,
వారి భోగలాలసయే కారణమనాలి". ఇలా మనవి చేసుకుంటూ, వాసు దాస స్వామిగా పలువురు ఎరిగిన స్వర్గీయ వావిలికొలను సుబ్బారావు గారు
రాసిన "సంధ్యావందనం" అనే టీకా తాత్పర్య సహిత అమూల్య గ్రంధాన్ని
అంగలకుదురులోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజానికి చెందిన దాస శేష స్వామివారు,
ఏనాడో అరవై ఏళ్ల క్రితమే, పరిచయం చేశారు.
అందులో పేర్కొన్న పలు అంశాలు నేటికీ, ఆ మాటకొస్తే, ఏ నాటికైనా బ్రాహ్మణులమని అనుకునే వారందరూ విధిగా తెలుసుకుని
తీరాల్సిందే....అనుసరించాల్సిందే. వివరాల్లోకి పోతే.....
సంధ్యావందనానికి మొదటగా కావాల్సింది
యజ్ఞోపవీత ధారణ. ఆచమనం, సంకల్పం చేసి "యజ్ఞోపవీతం పరమం పవిత్రం,
ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్, ఆయుష్య మగ్ర్యం
ప్రతిముంచ శుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః" అని
జపిస్తూ మొదటి జంధ్యం వేసుకోవాలి. తరువాత తిరిగి ఆచమించి రెండవ జంధ్యం వేసుకోవాలి.
మరల ఆచమించి మూడోది వేసుకోవాలి. అలానే పాతది తేసి వేయడానికీ మంత్రం వుంటుంది.
ద్విజులకు తప్ప ఇతరులకు సంధ్యావందనం చేయడానికి అధికారం లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులంటారు. వీరికే వేదోక్త
కర్మాధికారం వుంది. ప్రాత స్నానం చేసిన తరువాతే సంధ్య వార్చాలి. సూర్య బింబం
ఎర్ర్తబారే సమయంలో సాయం సంధ్య చేయాలి. ఇక మధ్యాహ్న సంధ్య మధ్యాహ్నం చేయాలి.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వున్న సమయాన్ని ఐదు భాగాలు చేయాలి. మొదటిది,
అంటే, ఆరు గంటల నుంచి సుమారు రెండున్నర గంటల
సమయం ప్రాతః కాలం. ఒంటి గంట సమయంలో మధ్యాహ్న కాలం. సాయంత్రం ఆరు గంటలకు సాయంకాలం. సాయం
సంధ్యల కాలంలో, ప్రాతః సంధ్యా కాలంలో, మూడేసి
అర్ఘ్యాలను విడవాలి. ఉదయం అర్ఘ్యం విడిచేటప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలబడి,
వంగి విడవాలి. మధ్యాహ్నం చక్కగా నిలబడి, సాయంత్రం
కూర్చుండి సంధ్య చేయాలి. జపం కూడా అలానే చేయాలి. ఉదయం ఈశాన్య దిక్కుగా, సాయంకాలం వాయువ్య దిశగా, మధ్యాహ్నం తూర్పు దిక్కుగా
తిరిగి సంధ్య వార్చాలి. సరైన కాలంలో సంధ్య వార్చితే 10 మార్లు గాయత్రి జపం
చేస్తే చాలు. సమయం తప్పితే 108 మార్లు చేయాలి.
సంధ్యావందనం బ్రాహ్మణ. క్షత్రియ, వైశ్యులకు
ముఖ్యంగా బ్రాహ్మణులకు సంపాదించి ఇచ్చిన వంశ పరంపరాగతమైన నిక్షేపం. అంటే, బ్రాహ్మణుడనేవాడు, గాయత్రీ జపం ద్వారానే, నిస్సంశయంగా ముక్తి పొందుతాడు. ఇతర జపాలేవి చేసినా, చేయక
పోయినా, గాయత్రి జపించిన వాడు భూతదయ గలవాడిగాను, బ్రాహ్మణుడి గాను పిలవబడటానికి అర్హుడవుతాడు. అసలు "సంధ్య" అంటే
ఏమిటి? సందిలో చేయడానికి యోగ్యమైంది సంధ్య. అలానే, సంధ్యా కాలం అంటే, రాత్రి-పగలు కలిసే కాలం. ఆ కాలంలో
చేయబడే కర్మను సంధ్య అంటారు. అంత మాత్రాన సంధికాలంలో చేసే ప్రతి కార్యం సంధ్య అని
పిలవాలని లేదు. కాకపోతే, కొన్ని స్మృతులు మధ్యాహ్న సంధ్యను
కూడా పేర్కొన్నాయి. ఆ విధంగా సంధ్యలు మూడయ్యాయి. బ్రాహ్మణుడు సంధ్య వార్చకపోతే,
గొప్ప కీడు కలుగుతుందని అనేక స్మృతులలో చెప్పబడింది. కీడు
కలుగుతుంది అంటే, ధన నష్టం-ధాన్య నష్టం అని మాత్రమే కాదు.
అట్టి వాడికి మరు జన్మలో హీన జాతులయందు పుట్టుక కలుగుతుందని అర్థం. ఎన్ని జన్మాల
పుణ్య ఫలంగానో సంపాదించిన బ్రాహ్మణ్యం, సోమరితనం వల్ల
కోల్పోయి, హీన జాతులయందు పుట్టడానికి దారితీయడం కంటే మించిన
కీడు ఏముంటుంది? సంధ్య వార్చని బ్రాహ్మణుడు శూద్రుడితో
సమానమై, భ్రష్ట బ్రాహ్మణుడిగా లోకం దూషిస్తుంది. సంధ్యను
ఉపాసించని ద్విజుడు సూర్యుడిని హింసించినట్లే!
ఇంతకీ సంధ్యలో ఉపాసించబడే
దేవత ఎవరు? స్త్రీయా? పురుషుడా?
"గాయత్రీం చింతయే ద్యస్తు" అని జప కాలంలో
"గాయత్రీ" ధ్యానం చెప్పబడింది. సంధ్యా గాయత్రీ, సావిత్రీ,
సరస్వతీ శబ్దాలు మహతీ వాచకాలు. కాబట్టి, ఆ
దేవతలు స్త్రీలే అని చెప్పుకోవాలి. ఐనప్పటికీ, సంధ్యా ది
దేవత స్త్రీ యని ఉపాసించాలా? పురుషుడని ఉపాసించాలా? అని సందేహం వచ్చినప్పుడు, వసిష్ట మహర్షి జవాబుగా,
"ఏది సంధ్యయో, అదే ప్రపంచాన్ని ప్రసవించే
శక్తి. అది మాయాతీతం. నిష్కల ఈశ్వరుడి ముఖ్య శక్తి. తత్వ త్రయాల వల్ల కలిగేది.
అందువల్ల, సంధ్యా ది దేవత భగవచ్చిచ్ఛక్తి అని
గ్రహించాలి" అని చెప్పారు.
దేహం అత్యంత మలినమై తొమ్మిది రంధ్రాలతో
కూడి వుంటుంది. రాత్రి-పగలు దాని నుంచి మురికి వెలువడుతూనే వుంటుంది. కాబట్టి
ప్రాతః కాల స్నానంతో దేహం పైనున్న మురికి పోగొట్టుకోవాలి. స్నానం చేసి మాత్రమే
సంధ్య వార్చాలి. ఇక సాయం సంధ్య విషయానికొస్తే, గురువు ద్వారా ఉపదేశం పొందిన
గాయత్రిని నిలుచుండి జపించుకుంటూ, సూర్యుడు అస్తాద్రికి
చేరగానే సాయం సంధ్య ప్రారంభించాలి. సూర్యుడు, నక్షత్రాలు
లేని రే పగటి సంధికాలం సాయం సంధ్య వార్చాలి. అంటే, సూర్యుడు
అస్తమించిన తరువాత, నక్షత్ర దర్శనం కాక ముందు, సాయం కాల సంధ్య; నక్షత్రాలు కనబడకుండా పోయిన తరువాత
సూర్యుడు ఉదయించక ముందు ప్రాత సంధ్య, వార్చాలి. ఉత్తమ కాలంలో
వార్చబడిన సంధ్య స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
ముఖ్య కాలంలో సంధ్య వార్చని వాడు పూర్ణ బ్రాహ్మణుడు కాడు. పన్నెండు రోజులు వరుసగా
సకాలంలో సంధ్య వార్చకపోతే, నాలుగు వేదాలు చదివిన
బ్రాహ్మణుడైనా, శూద్రుడితో సమానమైన వాడే! కాకపోతే వీటన్నింటికీ
శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్తాలు సూచించిబడినాయి.
సంధ్యావందనంలో
అనుష్టించాల్సిన మార్గాలలో ప్రాణాయామం ఒకటి. ఆసనం మీద కూర్చుండి, నడుం, వీపు, కంఠం, శిరస్సు సమంగా వుంచి, వంపు లేకుండా చేసి, మొదట ఎడమ వైపు ముక్కు భాగాన్ని కుడిచేతి బొటన వేలితో మూసి, కుడి వైపున్న ముక్కు భాగంతో తనలో వున్న గాలినంతా విడిచిపెట్టాలి. ఇలా చేసి,
కుడి ముక్కు రంధ్రాన్ని బిగించి, ఎడమ ముక్కుపై
వున్న వేలిని తొలగించి, మెల్లగా గాలిని లోపలికి పీల్చాలి.
పీల్చి, వెంటనే ఆ ముక్కును కూడా కడపటి రెండు వేళ్లతో
బిగించాలి. అలా బిగించి, గాలిని లోపల కొంచెం సేపు నిలిపి
కుడి వైపు ముక్కు మీద వేలు తొలగించి, మెల్లగా గాలిని
విడవాలి. ప్రాణాయామం చేసేటప్పుడు పెదవులు తెరవరాదు. పన్ను-పన్ను తాకకూడదు.
దిక్కులు చూడ కూడదు. దృష్టి ముక్కు కొనపైనే వుండాలి. మూలాధారం బిగించాలి. శ్రీమన్నారాయణుడుని
హృదయంలో నిలిపి ధ్యానించాలి. ఆ ధ్యానంలో గాయత్రిని జపించాలి. ఒక మంత్రాన్ని
అర్థాను సంధానంతో మనస్సులో పలుమార్లు వల్లించుకుంటూ, ఆ
మంత్రాధిష్ఠాన దేవతను, హృదయంలో మనస్సు చలించకుండా నిలపడాన్ని
"జపం" అంటారు. జపం చేయడానికి ముందు, మూడు మార్లు
ప్రాణాయామం చేయాలి. గాయత్రిని 10 మార్లు కాని, 108 మార్లు కాని జపించాలి.
ఇది జప సంఖ్య. జపమాలిక సహాయంతో కాని, వ్రేళ్లతో కాని లెక్కించాలి.
కుడి చేతి ఉంగరపు వేలు నడిమి గణుపు నుంచి కింది కొచ్చి, కడపటి
వేలు కింది గణుపు నుంచి పైకి పోయి, ఉంగరపు వేలి పై గణుపు,
నడిమి వేలి పై గణుపు, చూపుడు వేలు పై గణుపు,
దాని కింది గణుపు, ఆ దాని కింది గణుపు....ఇలా
పది లెక్కించాలి.
ఆ తరువాత చేయాల్సింది ఆచమనం...అంటే, శాస్త్ర
ప్రకారం చేయాల్సిన జలపానాది కార్యం. అజ్ఞానంతో ఆచమనం చేయకుండా కార్యాలు చేసేవాడు
నాస్తికుడితో సమానం. వాడు చేసే పనులన్నీ వ్యర్థమే. నిలబడి కాని, వంగి కాని ఆచమనం చేయకూడదు. కూర్చుండి మూడు మార్లు జలాన్ని తాగాలి. "కేశవ", "నారాయణ", "మాధవ"...ఈ మూడు అనుకుంటూ వేరు-వేరుగా జలాన్ని తాగాలి. ఒక్క సారి
నీళ్లు తీసుకుని మూడు పేర్లు చెప్పకూడదు. అక్కడి నుంచి వరుసగా "గోవింద",
"విష్ణు" అంటూ చేతులు కడుక్కోవడంతో మొదలెట్టి,
"మధుసూధన", "త్రివిక్రమ",
"వామన", "శ్రీధర",
"హృషీకేశ", "పద్మనాభ",
"దామోదర", "సంకర్షణ",
"వాసుదేవ", "ప్రద్యుమ్న",
"అనిరుద్ధ", "పురుషోత్తమ",
"అధోక్షజ", "నారసింహ",
"అచ్యుత", "జనార్ధన",
"ఉపేంద్ర" అను స్తుతిస్తూ, చివరగా "హరయే శ్రీ కృష్ణాయ" అంటూ పూర్తి చేయాలి.
ఓం కేశవాయ స్వాహా...ఓం నారాయణాయ స్వాహా.......ఓం హరయేనమః...ఓం శ్రీకృష్ణాయనమః అంటూ, వారి వారి సంప్రదాయం ప్రకారం,
ఆచమనం చేయాలి. ఆ తరువాత, "ఓం భూః! ఓం భువః! ఓం సువః!
ఓం మహః! ఓం జనః! ఓం తపః!
ఓం సత్యం! ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ ! ఓ మాపో జ్యోతీ రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువ
రోమ్ !" అని ప్రాణాయామం చేయాలి. చేసి,
ఇలా సంకల్పం చెప్పుకోవాలి. "శ్రీ గోవింద గోవింద మహావిష్ణురాజ్ఞయా
ప్రవర్తమాన స్సాద్య బ్రహ్మణో ద్వితీయపరార్థే, శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే,
జంబూద్వీపే, భరత వర్షే, భరత
ఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్యే
ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావరీ మధ్యప్రదేశే, సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక
చాంద్రమానేన.....సంవత్సరే....ఆయనే...ఋతౌ.....మాసే.....పక్షౌ....తిధౌ.....వాసరే.....శ్రీవిక్ష్ణునక్షత్రే
శ్రీ విష్ణు యోగో, శ్రీ విష్ణు కరణే, ఏవం
గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ, శ్రీ
పరమేశ్వరముద్దిశ్య మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం....సంధ్యా
ముపాసిష్యే". అలానే, "ఓం అచ్యుతాయనమః, ఓం అనంతాయనమః, ఓం గోవిందాయనమః....." అనే ద్వాదశ
నామాలు చెప్పాలి. ఆ తరువాత మార్జన మంత్రాలొకటి రెండు ఉచ్ఛరించాలి. మార్జన మంత్రాలన్నీ
చెప్పిన తరువాత, పరిశుద్ధుడై, అర్ఘ్యం విడవాలి.
ఇలా విడవడానికి ముందు స్మృత్యాచమనం చేయాలి. తరువాత, దోసిట్లో
నీళ్లుంచుకుని, సూర్యుడికి ఎదురుగా నిలుచుండి, ""ఓం భూః! ఓం భువః! ఓం సువః!
ఓం మహః! ఓం జనః! ఓం తపః!
ఓం సత్యం! ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్" అన్న గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ, మూడుసార్లు అర్గ్యం విడవాలి.
సర్వ వేదాలను అధ్యయనం చేస్తే ఎలాంటి
పుణ్యం కలుగుతుందో, సమస్త తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలం కలుగుతుందో,
అటువంటి ఫలమే జనార్ధనుడైన దేవుడిని స్తుతిస్తే పురుషుడికి
కలుగుతుంది. అందుకే, చివరగా...ఇలా
అనుకోవాలి...."వాసుదేవుడవగు నీవు నివసించిన కారణం వల్ల మూడు లోకాలు
నిలుస్తున్నాయి. సర్వాంతర్యామివైన ఓ వాసుదేవా! నువ్వు సర్వ భూతాలకు నివాస
స్థానానివి. అలాంటి నీకు నమస్కారం" అని అంటూ, "చతుస్సాగర
పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం
భవతు......ప్రవరాన్విత....గోత్రః....సూత్రః....శాఖాధ్యాయీ, అహంభో
అభివాదయే" అంటూ ముగించాలి.
No comments:
Post a Comment