Wednesday, September 24, 2014

ఐదారు దశాబ్దాల క్రితం వ్యవసాయం ఎలా వుండేది? వనం జ్వాలా నరసింహారావు

ఐదారు దశాబ్దాల క్రితం వ్యవసాయం ఎలా వుండేది?
వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం, యవ్వనం తొలినాళ్లు, అలనాటి తీపి జ్ఞాపకాలు ఒకటి వెంట మరొకటి గుర్తుకొస్తుంటాయి అప్పుడప్పుడు. మా ఊరు, ఆ వూళ్లోని కొఠాయి (రచ్చ బండ), మా రెండంతస్తుల భవనం, ఆ భవనం ముందున్న స్థలంలో తెలతెలవారుతుండగానే ఇద్దరు పని మనుషులు శుభ్రం చేసి కలాపు నీళ్లు చల్లడం, కిలోమీటర్ దూరంలోని ముత్తారం-అమ్మపేట గ్రామాలు, అక్కడి రామాలయం-వేంకటేశ్వర స్వామి గుడులు, పక్కనే వున్న మా పెదనాన్నగారి గ్రామం వల్లాపురం, మా కచ్చడం బండి, పెంట బండి, మేనా, వరి పొలాలు, మల్లె తోట, మామిడి తోట, మిరప-మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, జొన్న చేలు, చేలలోని దోసకాయలు, మంచె, మా పది అరకలు, పది జతల ఎద్దులు, పది-పన్నెండు మంది పాలేర్లు (జీతగాళ్లు అనే వాళ్లం), పాడి పశువులు, మేకలు, వరి గడ్డి వాములు, మా ఇంట్లో బావి, బావి పక్కనున్న నిమ్మ-అరటి చెట్లు, మా ఇంటి వెనుక వంట ఇంటి పక్కన ఉదయాన్నే మజ్జిగ చిలికే ప్రక్రియ, అందులో వచ్చిన వెన్న పూస తినడం, ఉదయాన్నే తిన్న చద్ది అన్నం-మామిడి వూరగాయ కారం, మా ఎనిమిదిమంది అన్న దమ్ములం-అక్క చెల్లెళ్లు కలిసి వెండి కంచాలలో భోజనాలు చేయడం, సరదాగా కీచులాడు కోవడం, సాయంత్రం ఇంటి ముందు నీళ్లు చల్లి నవారు-నులక మంచాలు వేయడం, వాటిపై పక్కలు వేయడం, మా పదిమంది కుటుంబ సభ్యులు-అడపాదడపా వచ్చే బంధువులు కబుర్లు చెప్పుకుంటా పడుకోవడం, పడుకోని ఆకాశంవైపు చూసి ఆనందించడం..... ....... ఇలా ఎన్నో విషయాలు గుర్తుకు రాసాగాయి. మా చిన్నతనంలో, మా మామిడి తోటలో కాసిన పండ్లను వైశాఖ మాసంలో పది మందికి పంచిపెట్టిన విషయం కూడా జ్ఞప్తికి వస్తోంది. ఆ రోజుల్లో మా తోటలో వందల-వేల సంఖ్యలో మామిడి పండ్లు కాసేవి. తిన్నన్ని తిని పది మందికి పంచడం ఆనవాయితీగా ప్రతి ఏడు చేసే వాళ్లం. సరే...ఇప్పుడా తోట లేదు.....పండ్లు లేవు. ఇటీవలే మా అబ్బాయి ఆదిత్య మామిడితోట కొనడం, గతంలోని మోతాదులో కాకపోయినా కొన్ని పండ్లనైనా పంచే అవకాశం దొరకడం మా అదృష్టమే.

మా వూరి పేరు వనం వారి కృష్ణా పురం. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వుంది. ఒకప్పుడు ఖమ్మం తాలూకాలో వుండేది. గతంలో పాలేరు శాసనసభ నియోజక వర్గంలోను, ప్రస్తుతం మధిర నియోజక వర్గంలోను వుంది. కిలోమీటర్ దూరంలోని ముత్తారం రెవెన్యూ గ్రామానికి ఇది శివారు గ్రామం. ముత్తారంకు మరో శివారు గ్రామం కూడా వుంది. దాని పేరు కోదండరామపురం. ఈ మూడు గ్రామాలకు కలిపి మా వూరి పేరుమీద పంచాయతీ బోర్డు వుంది. మా పూర్వీకులు వనం కృష్ణరాయలు గారు కట్టించిన గ్రామమైనందున వూరికాపేరు వచ్చిందంటారు. ఇప్పుడైతే ఎక్కువమంది లేరు కాని, ఒకానొకప్పుడు, మా ఇంటి పేరు (వనం వారు) కుటుంబాలు సుమారు పాతిక వరకుండేవి మా వూళ్లో. కరిణీకం కూడా మా ఇంటి పేరువారిదే. ముత్తారం గ్రామంలో ఇటీవలే పునర్నిర్మించిన పురాతన రామాలయం కూడా వుంది.

మాకు మొదట్లో సుమారు నాలుగు వందల ఎకరాల భూమి వుండేది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో అమలైన కౌలుదారీ చట్టం-భూ సంస్కరణల చట్టం నేపధ్యంలో సుమారు రెండు వందల ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. అలా వచ్చిన పైకంతో ఖమ్మంలో ఒక ఇల్లు, ఊళ్లో ఒక ఇల్లు కట్టించారు నాన్నగారు. అమ్మగా మిగిలిన రెండు వందల ఎకరాల భూమిలో సొంతంగా సేద్యం చేసేవారు నాన్న. పది మంది పాలేర్లు, పది అరకలు, నాలుగైదు ఎద్దుల బండ్లు, చిన్న కచ్చడం బండి, పది జతల ఎద్దులు, వాటికి పెద్ద కొష్టం, పాడి గేదెలు-ఆవులు, వందల సంఖ్యలో మేకలు.....ఇలా అంగరంగ వైభోగంగా వుండేది చిన్నతనంలో. కాలికి మట్టి అంటకుండా పెంచారు మమ్ములను.

మా నాన్నగారు చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలంగా సుమారు 40 పుట్ల వడ్లు (పుట్టికి 75 కిలోల బరువుండే ఎనిమిది బస్తాలు), 20 పుట్ల జొన్నలు, 40-50 పుట్ల వేరు శనగ, 10 పుట్ల కందులు, 10 పుట్ల పెసలు, వీటికి తోడు మిరప కాయలు, పొగాకు, మామిడి పంట, మల్లెలు.....ఇలా... ప్రతి ఏటా పండేవి. మా భూమిలో సుమారు నలబై ఎకరాలను పాడి పశువుల మేత కొరకు బీడు భూమిగా వదిలే వాళ్లం. మా వూరి సరిహద్దు నుంచి పక్కనున్న మల్లన్నపాలెం సరిహద్దు వరకు వున్న భూమంతా మాదే! అందులో నల్ల రేగడి భూమి సుమారు నలబై ఎకరాలుండేది. వూరిపక్కనే పది ఎకరాల అంటు మామిడి తోట వుండేది. ఎకరం విస్తీర్ణంలో ముత్తారం దగ్గర ఐదారు పెద్ద నాటు మామిడి చెట్లు కూడా వుండేవి. ఆ చెట్లలో "పుట్ట మాకు" కాయలు కాసే చెట్టు ఒకటి వుండేది. ఆ కాయలనే వూరగాయలకు, పండిన తరువాత తింటానికి వాడే వాళ్లం. పచ్చిగా వున్నప్పుడు ఎంత పుల్లగా వుండేవో పండిన తరువాత అంతకంటే ఎక్కువ మోతాదులో తియ్యగా వుండేవి. నల్ల రేగడిలో జొన్న పంట వేసే వాళ్లం. ముత్తారం గ్రామ సరిహద్దులలోని వూర చెరువు కింద వరి పొలం సుమారు పాతిక ఎకరాలుండేది. అందులో వడ్లు పండేవి. వూర చెరువు లోపలి భాగం కూడా మా పట్టా భూమే. చెరువులోకి నీరు రాకపోతే, జనప పంట వేసే వాళ్లం. ఇప్పటికీ నా పేరు మీద, పోగా మిగిలిన ఏడెకరాల వరి పొలం (గుండ్ల పంపు) వుంది. అందులో ఏటా సుమారు రు. 50 వేల విలువైన పంట పండుతోంది. వల్లాపురం గ్రామ సరిహద్దుల్లోని "ఎర్రమట్టి చేను", ముత్తారం సరిహద్దుల్లోని "గుడిపాటి చేను", "జిట్టమర్రి చేను", మల్లన్న పాలెం సరిహద్దుల్లోని "రేగడి చేను", వూరి పక్కన వున్న బీడు అంచలంచలుగా అమ్మి వేశాం. "బోదుల సాహిబ్ చేను" తమ్ముడి అధీనంలో వుందింకా. అంటు మామిడి తోట లేదిప్పుడు. వరి పొలాలలో "బత్తులోరి పంపు", "నంది మిట్ట", "గుండ్ల పంపు" ఇంకా మిగిలున్నాయి.

నేను మూడు సంవత్సరాల పాటు, మా గ్రామంలో వుండి వ్యవసాయం చేయించాను. రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొన్నాను. వ్యవసాయపు పనులు వేసవి కాలంలోనే మొదలయ్యేవి. పొలాలకు పెంట తోలే ప్రక్రియతో వ్యవసాయపు పనులు మొదలయ్యేవి. ఉగాది పండుగ కల్లా రాబోయే సంవత్సరానికి పాలేర్లను (జీతగాళ్లను) కుదుర్చుకునే వాళ్లం. ఆ రోజుల్లో పెద్ద పాలేరుకు సంవత్సరానికి పది నుంచి పన్నెండు బస్తాల జొన్నలిచ్చేవాళ్లం. జొన్నల ధర పెరిగినా, తగ్గినా అదే జీతం. మిగిలిన వాళ్లకు ఎనిమిది బస్తాలవరకిచ్చేవాళ్లం. వీరిలో కొందరిని వ్యవసాయ పనులకు, కొందరిని పాడి పశువులను కాసేందుకు, ఒకరిద్దరిని ఇంటి పనులకు ఉపయోగించుకునే వాళ్లం. మొదలు మా పాడి పశువుల వల్ల పోగైన పెంటను తోలే వాళ్లం. ఆ పెంటను నిలవ చేయడానికి మా పాత ఇంటిలోని స్థలాన్ని ఉపయోగించుకునే వాళ్లం. సుమారు నాలుగైదు వందల బండ్ల పెంట మా పశువుల ద్వారా పోగైంది వుండేది. మాకున్న ఐదు ఎద్దుల బండ్లను ఆ పని అయ్యేంతవరకు పెంట బండ్లలా వాడే వాళ్లం. దీనికి అదనంగా మా గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పొలాలు లేని వారి దగ్గర నుంచి పెంట ఖరీదు చేసి కొని పొలాలకు తోలే వాళ్లం. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది. పక్కనే వున్న మల్లన్నపాలెం గ్రామంలో అంతా యాదవులే (గొల్లలు) వుండేవారు. వారి దగ్గర "జీవాలు" (గొర్రెలు) వుండేది. వందల సంఖ్యలో వుండే జీవాలను పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవాళ్ళం. అదీ ఖరీదుకే. అలా వుంచడం వల్ల పొలాలలో జీవాల పెంట పోగయ్యేది. అది పొలాలకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో రసాయనిక ఎరువుల వాడకం అలవాటు ఇంకా సరిగ్గా కాలేదు. ఇళ్లలో పోగైన పెంటను, జీవాల పెంటను మాత్రమే ఎరువులాగా వాడే వాళ్లం. అదనంగా, చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వాళ్లం. తెల్లవారు జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చే వాళ్ళు జీతగాళ్లు. పొద్దున్నే చద్ది అన్నం తినే వాళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు పెంట బండి తోలేవాడిని. మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు వాళ్ల ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చి, ఎడ్లకు దానా వేయడం, నీళ్లు పెట్టడం లాంటివి చూసుకునేవారు. ఆ సంవత్సరానికి కావాల్సిన వ్యవసాయ పనులకు సంబంధించిన వాటిని ఒక గంట-రెండు గంటల పాటు చూసుకునేవారు. ఉదాహరణకు తాళ్లు పేనడం. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు. ఇలా తొలకరి జల్లులు కురిసే వరకు కొనసాగేది.

మా జీతగాళ్ల పేర్లు కొందరివి ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అచ్చయ్య అనే వ్యక్తి జీవనాధారం కొరకు ఎక్కడి నుంచో మా వూరికి నా చిన్నతనంలో వలస వచ్చాడు. మా నాన్న గారికి అతను నచ్చాడు. ఆయన దాదాపు పాతిక సంవత్సరాలకు పైగా మా పెద్ద పాలేరులాగా వుండేవాడు. మిగిలిన జీతగాళ్లందరు ఆయనను "అచ్చయ్యగారు" అని సంబోధించేవారు. మా నాన్నకు కుడి భుజంలాగా వుండేవాడు. మేం ఎన్నడూ ఆయనను పాలేరులాగా చూడలేదు. మా ఇంటి సొంతమనిషిలాగా చూసుకునే వాళ్లం. గౌరవించేవాళ్ళం. ఆయనకు భార్యా పిల్లలు లేరు. మా ఇంట్లోనే వుండేవాడు. ఆయన తరువాత ఆ పనికి దాసరి తిరుపతయ్యను పెట్టుకున్నాం. తరువాత కొన్నాళ్లు చాగంటి నారాయణ, ముండ్ర చంద్రయ్య ఆ పని చేశారు. దరిమిలా చాగంటి నారాయణ మా గ్రామ సర్పంచ్‌గా కూడా ఎన్నికయ్యాడు. ముండ్ర చంద్రయ్య కుమారుడు అప్పారావు కూడా గ్రామ సర్పంచ్ అయ్యాడు. వెంకులు ఇంటి పని చూసేవాడు. చెన్నయ్య అనే మరొక జీతగాడు వుండేవాడు. రోజంతా పని చేయడమే కాకుండా జీతగాళ్లు రాత్రుళ్లు మా ఇంటి ముందర నిద్రపోవడానికి వచ్చే వాళ్ళు. వాళ్లను పొద్దున్నే లేపి పొలం పనులకు పురమాయించేవాళ్ళం. ఇంటి పని చూసుకునే వెంకులు గేదెల, ఆవుల పాలు పితకడం, కవ్వంతో పెరుగు చిలికి మజ్జిగ చేయడం, అంట్లు తోమడం లాంటి పనులు చేసేవాడు. ప్రతి రోజు ఉదయం మా ఇంట్లో తయారైన మజ్జిగను తీసుకెళ్లేందుకు కొందరొచ్చేవారు. వాళ్లు ఇంట్లో తాము తినేందుకు జొన్నలు దంచుకుని, మా గేదెలు-ఆవులు తాగేందుకు మా ఇంటికి వచ్చి దాని తొక్కు వంచి పోయేవారు. బదులుగా మజ్జిగ (చల్ల అనే వాళ్లం) తీసుకు పోయే వాళ్లు. వేసవి కాలంలో, మా ఇంటి వెనుక కుండలో వుంచిన మజ్జిగను కడుపు నిండా ఎన్నో సార్లు తాగే వాళ్లం. ఇంట్లో పని చేయడానికి కుదుర్చుకున్న జీతగాడిని బట్టలు ఉతకడానికి వాడుకోక పోయే వాళ్లం. ఉదయాన్నే చాకలి వచ్చి విడిచిన బట్టలు తీసుకెళ్లి వూరి బయట వున్న వాగులోనో, చెరువులోనో వుతికి సాయంత్రం తెచ్చే వాళ్లు. మా ఇంట్లో వంట వండడానికి కూడా ఒకరుండేవారు

తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో దున్నడం, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు వేసే వాళ్లం. చెరువులకు నీళ్లు రావడం జరుగుతే వరి నాట్లు వేసే వాళ్లం. ఆ తరువాత జొన్న పంట వేసే వాళ్లం. వరి నాట్లు వేయడం నాకింకా బాగా గుర్తుంది. నాట్లు వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా మా గ్రామంలో వరి నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్ల రోజుల్లో నేను భోజనం పొలం దగ్గరకే తెప్పించుకుని చేసేవాడిని. అక్కడ చెరువు నీళ్లే తాగేవాడిని. ఆ నీరు తాగడానికి భయమేసేది కాదు. ఇప్పుడైతే మరి మినరల్ వాటర్! నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. ఒక్కో సారి రాత్రుళ్లు పోయి వంతుల వారీగా నీళ్లు పెట్టే వాళ్లం. నీళ్లు సరిపోకపోతే పొలాలలో ఒక పక్కన కొంత లోతు వరకు తవ్వి, నీటిని తీసి చేది పోయడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిద్రించే వాళ్ళం. ఆ ఆనందం ఇప్పుడు తలుచుకుంటుంటే ఒక మధురానుభూతిలాగా అనిపిస్తోంది. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది. రేట్లు పెంచమని అడపాదడపా కూలీలు ఆందోళన చేసే వాళ్లు కూడా. కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా నేను వాళ్లకు మద్దతిచ్చేవాడిని. నాట్ల సీజన్లో, కోతల సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు వచ్చేవారు.

ఇక వేరు శనగ పంట వ్యవహారం మరో విధంగా వుండేది. విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. ఇంటికి కూలి వాళ్లను పిలిచి, క్రితం సంవత్సరం పండిన వేరు శనగ కాయలను కొలిచి, వాటినుంచి విత్తులను తీయమని వాళ్లకు చెప్పే వాళ్లం. వాళ్లలో కొందరు తమ ఇంటికి తీసుకెళ్లి చేసేవారు, కొందరు మా ఇంట్లోనే చేసేవారు. సాయంత్రం కల్లా వాళ్ల-వాళ్ల సామర్ధ్యాన్ని పట్టి కుండెడో-రెండు కుండలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం రూపేణగానే ముట్టేది. విత్తులు తీసేటప్పుడు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో శనగ నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వాళ్లం. వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" పెట్టే వాళ్లం. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత కాదు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. అదెంతో ముచ్చటేసేది. మూడు నెలల తరువాత కూలి వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లం. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా తెచ్చుకునే వాళ్లం. ఇక మరో పంట జొన్న. వీటినే పచ్చ జొన్నలనే వాళ్లం. ఇటీవల కాలంలో నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చిన తరువాత జొన్న పంట దాదాపు ఎవరూ వేయడం లేదు. దీనికి కూడా ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వాళ్లం. కూలీ కింద కట్టలనే ఇచ్చే వాళ్లం. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది.

ఈ పంటలకు తోడు మేం మిరప తోట వేసే వాళ్లం. మధ్యలో బంతి పూల చెట్లు వేసే వాళ్లం. మా ఇంటి పక్కనే తోట వుండేది. అందులో ఒక పక్క మల్లె తోట కూడా వుండేది. తోటలో మోట బావి వుండేది. మోట తోలడం కూడా కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి. అప్పుడు మునిగి-నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్ కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను తడుపుకుంటూ పోతుంది. మోట తోలడం సరదాగా కూడా వుంటుంది. అలానే పొగాకు పంట కూడా వేసే వాళ్లం. వూరి బయట వున్న మరో తోటలో మొక్క జొన్న వేసే వాళ్లం. కొన్నాళ్లు దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేశాం. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించాం. ఇక మామిడి తోట సరేసరి. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వాళ్లం. జొన్న వూస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వాళ్లం. చేనులో దొరికే పెసలు తినే వాళ్లం.


ప్రతి పంటకు "పరిగ" అని వుండేది. మాకు జీతగాళ్లే కాకుండా, ఒకరిద్దరు మేమిచ్చే వార్షిక కూలీ మీద ఆధారపడి జీవించే వాళ్లున్నారు. వాళ్లు మాకు అవసరమైన చిల్లర పనులను చేసేవారు. ఉదాహరణకు మా జీత గాళ్లకు కావాల్సిన పాదరక్షలను తయారు చేసే వారుండేవారు. మా పొలాలకు నీరు పెట్టే నీరుకాడుండేవాడు. మా ఇంటి ముందు అలకడానికి కావాల్సిన ఎర్ర మట్టిని తెచ్చి పెట్టేవాడుండేవాడు. మా బట్టలుతికే వాళ్లు. మేమిచ్చే సమాచారాన్ని మా వూరి నుంచి ఇతర గ్రామాలకు తీసుకెళ్ళే మనిషి. ఇలా... కొందరుండేవారు. మా పొలాలలో పంటను మేం తీసుకెళ్ళిన తరువాత, పొలంలో మిగిలిన దాన్ని "పరిగ" అంటారు. అదంతా వాళ్లకే చెందుతుంది. పరిగ కూడా చాలా మోతాదులోనే వుంటుంది ఒక్కో సారి.

Saturday, September 20, 2014

ఐదారు దశాబ్దాల క్రితం నాటి విద్యాభ్యాసం కబుర్లు:వనం జ్వాలా నరసింహారావు

ఐదారు దశాబ్దాల క్రితం నాటి విద్యాభ్యాసం కబుర్లు
వనం జ్వాలా నరసింహారావు

        నేను పుట్టింది ఆగస్ట్ 8, 1948 . ఐదో తరగతి వరకూ బాల్యం అంతా మా వూరు లోనే. నా మూడో ఏట, చదువు ప్రారంభమైంది. మొదట, సమీప బంధువైన వనం ఎర్ర శేషయ్య గారి "కానీక బడి" లో చేర్పించారు నన్ను. ఉదయాన్నే బడికి పంపేవారు. అందరికంటే బడికి ముందు వచ్చిన విద్యార్థికి చేతి మీద "శ్రీ" అని శేషయ్య గారు రాసేవారు. తరువాత వచ్చిన వారి చేయిపైన "ఒక చుక్క" పెట్టేవారు. ఇలా ఒకరి తరువాత మరొకరు వస్తుంటే వాళ్ల చేతులపైన పెట్టే చుక్కల సంఖ్య పెరిగేది. "శ్రీ" పెట్టించు కోవడం కోసం పరుగెత్తుకుంటూ ముందుగా బడికి చేరుకునే వాళ్ళం. ఇప్పటి ప్రీ-స్కూల్, కెజి స్కూళ్ల లాగా మా చిన్నతనంలో గ్రామాలలో కానీక బడులుండేవి. ఆ బడిలోనే "ఓనమాలు" (, , , , , ...), "వంట్లు" (1,2,3,4,5...), "ఎక్కాలు" (ఒకాట్ల ఒకటి, ఒక రెండు రెండు, ఒక మూడు మూడు....), "కూడికలు-తీసివేతలు" (1+1=2, 2+2=4, 4+3=7.....1-1=0, 2-1=1…), "తెలుగు వారాలు" (ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని), "తెలుగు మాసాలు" (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము), "తెలుగు సంవత్సరాలు" (ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్యక, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను,  స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోథి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోథి, విశ్వావసు, పరాభవ,  ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదిచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్ర, దుర్ముఖి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ) లాంటివి నేర్పారు. నక్షత్రాలు, రాశులు, రుతువులు కూడా నేర్పించారు. చాలావరకు కంఠస్థం చేయించేవారు. అలా....ఒక ఏడాది గడిచి పోయింది.

ఆ తరువాత ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆ పాఠశాల అప్పట్లో ఒక పూరి పాకలో వుండేది. సాధారణంగా ఐదేళ్ల వయస్సు నిండిన తరువాతే మొదటి తరగతిలో చేర్పించాలి. నాకేమో అప్పటికింకా నాలుగేళ్లే! అందుకోసం పుట్టిన తేదీని మార్పించారు నాన్న గారు. నేను మా వూరి ప్రభుత్వ పాఠశాలలో చేరినప్పుడు అందులో మొదట్లో ఒకే ఉపాధ్యాయుడు పని చేసేవారు. కొద్ది కాలానికి మరో ఉపాధ్యాయుడిని పోస్ట్ చేశారు. గ్రామంలో చిన్నా-పెద్దా అందరూ వారిద్దరినీ "పాత పంతులు గారు" అని, "కొత్త పంతులు గారు" సంబోధించే వారు. అప్పట్లో మేం పెన్నులు ఉపయోగించక పోయేది. మొదట్లో పలకా-బలపం, తరువాత పెన్సిల్-రబ్బర్, మరో రెండేళ్లు గడిచిన తరువాత సిరా బుడ్డి-అందులో ముంచి రాసేందుకు ఒక పొడగాటి కలం ఉపయోగించే వాళ్లం. ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలోనే చదువుకుని, తరువాత అక్కడ పై తరగతులు ఇంకా ప్రారంభించనందున ఖమ్మం రికాబ్-బజార్ పాఠశాలలో చేరాను. రికాబ్-బజార్ పాఠశాల ఖమ్మం మామిళ్లగూడెంలోని మా ఇంటికి అతి సమీపంలో వుండేది అప్పట్లో. అక్కడే ఆరవ తరగతి నుంచి హెచ్.ఎస్.సీ వరకు ఆరు సంవత్సరాల పాటు చదువుకున్నాను.

హెచ్.ఎస్.సీ పరీక్షల్లో హయ్యర్ సెకండ్ క్లాస్ లో పాసవడమే కాకుండా లెక్కల్లో, సైన్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాను. ఎం.పీ.సీ (లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు తీసుకుని ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో చేరాను. ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. హెచ్.ఎస్.సీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న మాకు, మొట్ట మొదటిసారిగా పి.యు.సి లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే మొదట్లో కొంత ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది. భౌతిక, రసాయన శాస్త్రాలకు థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్స్ కూడా వుండేవి. అంతా కొత్తగా వుండేది. ఆ విషయాలలోకి పోయే ముందర ఒక్క సారి ఖమ్మం కళాశాల ఆవిర్భావం గురించి కొంత రాస్తే బాగుంటుందేమో!

ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ జీ వీ భట్, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఖమ్మానికి చెందిన కొందరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వర్గీయులు బొమ్మకంటి సత్యనారాయణరావు, సర్వదేవభట్ల నరసింహమూర్తి, పర్సా శ్రీనివాసరావు, కవుటూరి కృష్ణమూర్తి, రావులపాటి జానకి రామారావులతో ఏర్పాటైన ఆ కమిటీ, నిధుల సేకరణ మొదలెట్టారు. ఒకానొక సందర్భంలో, భద్రాచల రామాలయానికి చెందిన ఒక ఆభరణాన్ని వేలం వేసి, అలా సేకరించిన పైకంతో కళాశాల నెలకొల్పాలని భావించారట. అది తెలుసుకున్న, స్వర్గీయ శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు గారనే లోకోపకార గుణం గల మహానుభావుడు, లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని కలెక్టర్‌ను కలిసి చెప్పడం, ఆయన ఇచ్చిన మూలధనంతో కళాశాల రూపుదిద్దుకోవడం జరిగింది. తొలుత గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో నెలకొల్పారు కళాశాలను. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా, కళాశాల పేరు ముందర శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు పేరు కొనసాగిస్తూ వచ్చారు. దరిమిలా కళాశాలకు ఇల్లెందు రోడ్డులో నూతన భవనాలను నిర్మించి అక్కడకు మార్చారు. ఇటీవలే గెంటాల నారాయణరావు గారి విగ్రహాన్ని కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఆవిష్కరించారు.

కాలేజీ విద్యార్థిగా పి.యు.సి లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగింది. బహుశా నా క్లాస్ లో వున్న వాళ్లందరిలో నేనే వయసులో చిన్నవాడిననుకుంటా. కాలేజీ మైదానం పక్కనున్న షెడ్డుల్లో మా క్లాస్ జరిగేది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి. నాకు గుర్తున్న కొన్ని ఇంగ్లీష్ పాఠాలలో (రచయిత గుర్తుకు రావడం లేదు) "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా ఆకట్టుకునేది. తెలుగు మనుచరిత్రలోని ఒక పద్యం ఇంకా గుర్తుంది. "అటజనికాంచె భూమిసురు డంబరచుంబి, శిర స్సర జ్ఝరీ పటల, ముహుర్ముహు ర్లుఠ, దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల, పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌, కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌". ఇక జనరల్ స్టడీస్ క్లాసులు ఎంతో ఆహ్లాదకరంగా వుండేవి. వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి ఆసక్తికరంగా చెప్పేవారు అధ్యాపకులు. లెక్కల సార్ సబ్జెక్ట్ అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు బోధించేవారు. ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వాళ్లం. ప్రాక్టికల్స్ లో ఉపయోగించే కామన్ బాలెన్స్, పిప్పెట్, బ్యూరెట్ట్ లాంటివి ఇంకా గుర్తుకొస్తున్నాయి.

పి.యు.సి లో చేరిన తరువాత చదువు మీద కంటే ఇతర విషయాల మీద ఆసక్తి పెరగ సాగింది. కళాశాల రాజకీయాలపై-కమ్యూనిస్ట్ రాజకీయాలపై ఆసక్తి కలగడంతో పాటు, క్రికెట్ ఆటపై మోజు పెరగ సాగింది. ఆ రెండింటి ప్రభావం చదువుపై తీవ్రంగా పడింది. ఆ రోజుల్లో ఖమ్మం కాలేజీ ఎన్నికల రాజకీయాలు, శాసన సభ-లోక్ సభ ఎన్నికల రాజకీయాలను మరిపించే విధంగా వుండేవి. కాలేజీలోని రెండు ప్రధాన గ్రూపులకు, జిల్లాకు చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీల అండ దండలుండేవి. ఒకటి కాంగ్రెస్ పార్టీ కాగా, మరొకటి కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకా అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో చీలిపోలేదు. కళాశాల రాజకీయాలు స్థానిక కమ్మ హాస్టల్ కేంద్రంగా సాగుతుండేవి. కమ్మ హాస్టల్ లో నివసించే విద్యార్థులలో మెజారిటీ ఎవరి పక్షాన వుంటే వారికే కాలేజీ ఎన్నికలలో ఘన విజయం లభించేది. అందువల్ల కళాశాలలు వేసవి శెలవుల తరువాత ప్రారంభం కాగానే, రెండు గ్రూపుల వాళ్లు, హాస్టల్ పైన పట్టు సాధించేందుకు ముందస్తుగా ప్రయత్నాలు చేసేవారు. కళాశాల రాజకీయాలకు మరో కేంద్రం మామిళ్ల గూడెం లోని మా ఇల్లు.

          ఇంతకు ముందే చెప్పినట్లు నా పి.యు.సి చదువు పాడు కావడానికి మరో కారణం క్రికెట్ ఆట. కాలేజీలో చేరడంతోనే క్రికెట్ ఆడడం మొదలెట్టాను. "మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్" ఆధ్వర్యంలో మా బజారులోని ఒక ఖాళీ స్థలంలో ఆడడంతో పాటు, కాలేజీ మైదానంలో కళాశాల జట్టుకు ఆడడం కూడా చేసేవాడిని. లెక్చరర్ల మద్దతు కూడా బాగా లభించేది. విద్యార్థులతో సమానంగా వాళ్లు కూడా ఆటలో పాల్గొనేవారు. మా ఇంట్లో కూచుని క్యారం బోర్డు ఆడడమో, ఉదయం-సాయంత్రం క్రికెట్ ఆడడమో నిత్య కృత్యమై పోయింది. తీరిక దొరికినప్పుడు ఇంట్లో గదిలో కూడా, ఆ కాస్త స్థలంలో క్రికెట్ ఆడుతుంటే పక్క పోర్షన్ లో వుండే ఇంగ్లీష్ లెక్చరర్ కె. వై. ఎల్. నరసింహారావు గారు తరచుగ మందలించేవారు. పి.యు.సి చదువుతున్నప్పుడు, హెచ్.ఎస్.సీ చివరి రోజుల్లో కొనుక్కున్న సైకిల్ మీద ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే వాళ్లం. ఆ రోజుల్లో లెక్చరర్లు కూడా సైకిల్ మీదనే కాలేజీకి వెళ్తుండేవారు. కొందరైతే నడిచే వెళ్లేవారు. స్కూటర్లు, కార్లు లేనే లేవు.

పి.యు.సి పరీక్షలొచ్చాయి. అందరి లాగే రాసాను. ఫలితాలు నేను ఊహించినట్లే వచ్చాయి.... థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఎం.పీ.సీ గ్రూపులో మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఇంజనీరింగులో సీటు లభించే స్థాయిలో రాలేదు. బి. ఎస్సీ  డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను. చాలామంది ఫెయిలయ్యారు. ఒకరిద్దరు తప్ప ఇంజనీరింగులో-మెడిసిన్ లో సీట్లు తెచ్చుకున్నవారు లేరనే అనాలి.

ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో (ఎం.పీ.సీ గ్రూప్) పరీక్షలుండేవి. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య మధ్య శెలవులో వుండక పోయేది. సోమవారం పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.

          డిగ్రీలో ఎప్పటిలాగే చదువు, క్రికెట్, రాజకీయాలు కొనసాగాయి. డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే నేను ఖమ్మంలో చదివాను. మరుసటి ఏడాది హైదరాబాద్ వెళ్లిపోయాను. 1964 లో హైదరాబాద్ చేరుకున్న నేను, నాటి నుంచి నేటి వరకు, గత ఏబై సంవత్సరాలుగా, ఈ నగరంతో అనుబంధం పెట్టుకున్నాను. ఆ నాడు వచ్చిన నేను, ఇక్కడే స్థిరపడి పోతానని అప్పట్లో భావించలేదు.


Friday, September 19, 2014

మీడియాపై ఆంక్షలా? లక్ష్మణ రేఖలా? స్వీయ నియంత్రణలా? మార్గదర్శకాలా?

మీడియాపై ఆంక్షలా? లక్ష్మణ రేఖలా?
స్వీయ నియంత్రణలా? మార్గదర్శకాలా?

కారణాలేవైనా, కేబుల్‌ ఆపరేటర్లు, కొన్ని ఛానళ్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుని, ఆ ఛానళ్ల ప్రసారాలను గత కొద్ది కాలంగా నిలుపుదల చేశారు. అలా చేసే హక్కు తమకుందని వారి వాదన. మీడియాపై ప్రభుత్వపరంగా ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఛానళ్ల ప్రసారాల నిలుపుదల నిర్ణయం పూర్తిగా కేబుల్ ఆపరేటర్లదేనని ప్రభుత్వం అంటున్నది. అది వాస్తవం కాదని మీడియాకు చెందిన కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండుతో, కొందరు ఆందోళన చేయడం, ముఖ్యమంత్రి, సభాపతి వరంగల్ పర్యటనలో వున్నప్పుడు ప్లకార్డుల ప్రదర్శన చేయడం, ముఖ్యమంత్రి ఒక సభలో పాల్గొంటూ పరోక్షంగా స్పందించడం తెల్సిందే. ముఖ్యమంత్రి స్పందనలో విపరీతార్థాలు లాగే ప్రయత్నం జరిగింది దరిమిలా. అన్నీ కాకపోయినా ఒకటి రెండు పత్రికలు ముఖ్యమంత్రి మాటలను బాహాటంగానే వక్రీకరించడం, తమ భావ స్వేచ్ఛకు ఆయన మాటలు ప్రతిబంధకాలుగా చిత్రించడం జరిగింది. సాధారణంగా పత్రికా స్వేచ్ఛ గురించి అంతగా పట్టించుకోని ప్రెస్ కౌన్సిల్ ఈ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ మోతాదులోనే స్పందించి, ఒక త్రి సభ్య సంఘాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి అన్న మాటలు పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగించేవిగా వున్నాయా? లేదా? అన్న విషయంలో విచారణ  చేయమని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా, తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ సంస్కృతీ-సంప్రదాయాలకు వ్యతిరేకంగా, తెలంగాణ భాషకు-యాసకు వ్యతిరేకంగా....ఒక్క మాటలో చెప్పాలంటే అసలు పూర్తిగా తెలంగాణాకే వ్యతిరేకంగా పనిగట్టుకుని వార్తలు రాసేవారిని మాత్రం ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఆయన వాడిన పదజాలం కూడా అలాంటి వారి విషయంలోనే. స్వేచ్ఛ పేరుతో, ఆ ముసుగులో, లక్ష్మణ రేఖలు దాటొచ్చా?

అసలింతకీ అమల్లో వున్నాయని అందరూ భావిస్తున్నవి, "ఆంక్షలా"? "లక్ష్మణ రేఖలా"? "స్వీయ నియంత్రణలా"? "మార్గదర్శకాలా"? ఎవరికి వారే తమ ప్రయోజనాలకు అనుగుణంగా-అనుకూలంగా మలుచుకుంటున్న "ముసుగులా"?. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో మీడియా నిర్వహించాల్సిన పాత్ర గురించి, వారి బృహత్తర బాధ్యత గురించి, పరాయి వారు తమపై ఆంక్షలు విధించే బదులు వారే స్వయం సంయమనం పాటించే అంశం గురించి, రాజ్యాంగ బద్ధంగా మీడియా వారికున్న స్వాతంత్ర్యం గురించీ చర్చ నిరంతరం కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ తప్పొప్పులను విమర్శించే హక్కు మీడియాకుందంటూనే, ఆ హక్కుకు "హద్దులుండాలి" అని అనడం సబబే మో కాని, ఆ హద్దులకు "ఎల్లలు" ఎవరు-ఎలా గీయాలనే విషయంలోనే పేచీ వస్తున్నది. ఈ నేపధ్యంలో, "మీడియాకు లక్ష్మణ రేఖ" అన్న అంశంపై నిరంతరం చర్చ జరుగుతూనే వుంది. "వార్తలకు, వ్యాఖ్యలకు" తేడా లేకుండా పత్రికలు ప్రచురించడం వల్ల, పాఠకులు అయోమయానికి గురై, వ్యాఖ్యలనే వార్తలనుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

ఇటీవలి కాలంలో, మీడియా వ్యవహరించే తీరులో, ఊహించని ధోరణులు-విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విజ్ఞులు, మేధావులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పాత్రికేయ నాయకులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. సమాజంపై ఈ మార్పు ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని కూడా వారి అభిప్రాయం. అలా అభిప్రాయ పడుతున్న వారి పరోక్ష సూచనే "లక్ష్మణ రేఖలు" అన్న సిద్ధాంతానికి మార్గం చూపాయి. అయితే, లక్ష్మణ రేఖ అంటే, నియంత్రణ కాదని-కాకూడదని, మీడియా కూడా ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థల వలెనే, ప్రజలకు "జవాబుదారీగా-బాధ్యతాయుతంగా-పారదర్శకంగా" పనిచేసేందుకు దోహద పడేది మాత్రమేనని సర్ది చెప్పుకున్నారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల ప్రభుత్వాలన్నీ మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ, అడపాదడపా ఆంక్షలు విధించకుండా వుండడం జరగదు. భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ ప్రసాదించినప్పటికీ, ఆ స్వేచ్ఛ "నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా" వినియోగించుకోవడానికి, ప్రభుత్వ పరమైన నియంత్రణలకంటే స్వయం సంయమనం పాటించడమే మేలు.

ఒక్క విషయం మాత్రం వాస్తవం అనక తప్పదేమో. ఇటీవల కాలంలో, సామాజిక ప్రయోజనాలను కాపాడవలసిన మీడియా, ఆ పని చేస్తూనే, అది అనుకూలించనప్పుడు, కార్పొరేట్ గొంతును మాత్రమే వినిపిస్తున్నదని సర్వత్రా చర్చనీయాంశమైంది. మీడియా మొత్తం అలా, అన్ని వేళలా చేస్తున్నదని చెప్పలేం కాని, దాని ధోరణిలో సరికొత్త నిర్వచనాలు, సరికొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యతలు చోటు చేసుకోవడం మాత్రం కాదనలేం. ఎలెక్ట్రానిక్ మీడియా ప్రభావిత పాత్రికేయ రంగంలోని కొంత భాగం, తన విశ్వసనీయతను కోల్పోతున్నదనడానికి పలు ఉదాహరణలు దొరుకుతాయనవచ్చు. ఈ ధోరణికి తోడు, ఎలెక్ట్రానిక్ మీడియాలో నెల కొన్న పోటీ, మీడియా విశ్వసనీయతకు సవాలుగా మారింది. సంక్లిష్టమైన సామాజిక ప్రయోజనం కలిగే అంశాలను తగ్గించి ప్రసారం చేయడం, పైపై మెరుగులకు అనవసర ప్రాధాన్యతను ఇవ్వడం, సంచలన వార్తల కొరకు పరుగులు తీయడం, ఆ వార్తలను తమ ఛానల్ కంటే ముందుగా ఇతరులు ప్రసారం చేస్తారేమోనన్న ఆందోళనతో దృఢ పరచుకోకుండానే "బ్రేక్" చేయడం తరచుగా జరగడంతో మీడియా విశ్వసనీయత కోల్పోయేందుకు దారితీస్తున్నది. అలాంటప్పుడు, స్వయం సంయమానికి మించిన లక్ష్మణ రేఖలు కాని, ఆంక్షలు కాని, నియంత్రణలు కాని ఎంతవరకు ఆ విశ్వసనీయతను కాపాడ కలుగుతాయి?

భారత రాజ్యాంగంలో, "ఎగ్జిక్యూటివ్-జుడీషియరీ-లెజిస్లేచర్" వ్యవస్థలు ఎటువంటి కట్టుబాట్లకు, అదుపులు-అన్వయాలకు లోబడి తమ తమ కర్తవ్యాలను నిర్వహించాలో స్పష్టంగా వివరించబడింది. అయినా, అప్పుడప్పుడూ, ఆయా వ్యవస్థలను అత్యున్నత స్థాయిలో అజమాయిషీ చేసేవారి "యాక్టివిజం" వల్ల, అనుకోకుండానే అనర్థాలు కలగడం, వాటి పర్యవసానాలు పౌరుల మీద ప్రతికూల ప్రభావం చూపడం తెలిసిన విషయమే. కాకపోతే, రాజ్యాంగ బద్ధమైన ఆ వ్యవస్థలు తమ తప్పులను దరిమిలా సరిదిద్దుకోవడం కూడా జరిగింది. పోనీ పునఃపరిశీలన చేయడం జరిగింది. ఉదాహరణకు, పౌర హక్కులకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పును తీసుకోవచ్చు. దాదాపు 35 సంవత్సరాల క్రితం, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ-ఎగ్జిక్యూటివ్" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని అలనాటి సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు తీర్పిచ్చారు. అయితే, అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, తిరిగి అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం, ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. "ఫోర్త్ ఎస్టేట్" గా పిలవబడే మీడియా విషయంలో రాజ్యాంగపరంగా "అదుపులు-అన్వయాలకు" వీలు  కలిగించలేదు. అందుకే రాజ్యాంగంలో పొందుపరచిన పౌరుల "భావ ప్రకటనా స్వేచ్ఛ" అనే ప్రాధమిక హక్కును, స్వీయ నియంత్రణ లాంటి "అదుపులు-అన్వయాలకు" (Self Imposed Checks and Balances) లోబడి ఉపయోగించుకుంటే బాగుంటుందేమో.


వ్యక్తి భావ ప్రకటనా స్వేఛ్చకుండాల్సిన పరిమితులు-హద్దులు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. పౌరుల భద్రత, వైద్య పరమైన విషయాలు, నీతి వర్తన లాంటి అంశాల్లో గందరగోళం సృష్టించే పరిస్థితులకు  వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ దారితీయకూడదు. ఒక పౌరుడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, మరో తోటి పౌరుడి స్వేచ్ఛకు భంగం కలిగించ కూడదు. ఏ విధంగానైతే బహుళ ప్రయోజనాలకు ఒక వ్యక్తి స్వేచ్ఛ భంగం కలిగించ రాదో, అలానే, మీడియా స్వేచ్ఛ కూడా వుంటే మంచిదేమో. ఆ ప్రయోజనాలేంటో, ఆ పరిమితులేంటో నిర్ణయించుకోవాల్సింది విశ్వసనీయత కాపాడుకోవాల్సిన మీడియానే.

Wednesday, September 17, 2014

ఐదారు దశాబ్దాల క్రితం తెలంగాణ పల్లెల్లో జీవన విధానం:వనం జ్వాలా నరసింహారావు

ఐదారు దశాబ్దాల క్రితం తెలంగాణ పల్లెల్లో జీవన విధానం
వనం జ్వాలా నరసింహారావు

          పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యం కూడా లేని ఒక కుగ్రామంలో నివసిస్తుండె, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో ఆగస్ట్ 8,1948 న పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. ఉదయం నిద్ర లేవగానే, వేప పుల్ల నోట్లో వేసుకుని, దంత ధావనం చేస్తూ, ఇంటి బయట వీధిలో వున్న అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే వాళ్లం. వూళ్లో ఆ రోజున తీర్పు చెప్పాల్సిన పంచాయతీలేవన్న వుంటే, ఆ కార్యక్రమం కూడా మా వూరి పెద్దల సమక్షంలో, అదే సమయంలో అక్కడే జరిగేది. ఆ రోజుల్లో, గ్రామాల్లో పంచాయతీ తీర్పులు పదిమంది సమక్షంలోనే జరిగేవి. పెద్ద మనుషులిచ్చిన తీర్పుకు తిరుగు లేదు. వారు తీర్పు చెప్పారంటే ఆ గ్రామంలోని ఎవరైనా సరే బద్ధులై పోవడమే! పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిలో గ్రామంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, ఒకరిద్దరు దళితులు కూడా వుండేవారు.

          బాల్యంలో ఎక్కువగా "అచ్చన గిల్లలు", "వాన గుంటలు" ఆడేవాళ్లం. సాయంత్రాలు "గోలీలు", "బలిగుడు-చెడు గుడు" (కబడ్డీ), "బెచ్చాలు", "పత్తాలు", "జిల్ల గోనె", "దస్తీ ఆట". "తొక్కుడు బిళ్ల" ఆడేవాళ్లం. ఇంట్లో "పచ్చీసు" ఆడుతుంటే మేం కూడా వాళ్లతో కలిసి ఆడేవాళ్లం. మా చిన్నతనంలో మాకు ప్రధానమైంది "బ్రతుకమ్మ" లేదా "బతుకమ్మ" పండుగ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే సంబరమే! తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లం. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మ చెక్క లాడడం, బతుకమ్మ పండుగలో భాగం. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. బాల్యంలో...ఆ మాటకొస్తే కొంచెం పెద్దైన తరువాత కూడా ఆనందంతో జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు. జమ్మి చెట్టు దగ్గర గుమిగూడి, "శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం" అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. దసరా పండుగ రోజుల్లో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసేవారు. ఇక వూరి బయట వున్న జమ్మి చెట్టు వద్ద, "యాట" (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు. ఆనందంగా జరుపుకుంటుండే మరో పండుగ దీపావళి. దీపావళికి మా చిన్నతనంలో "రోలు-రోకలి" అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు. అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా) లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. ముక్కోటి ఏకాదశి రోజుల్లో జొన్న పంట "వూస బియ్యం" తయారయ్యేవి. జొన్న కంకులలోంచి అవి కొట్టుకుని వుడకబెట్టుకుని తింటుంటే బలే సరదాగా వుండేది.

మరో పండుగ "సంక్రాంతి". ఆ పండుగ రోజుల నాటి గొబ్బిళ్లు, హరిదాసులు, "గంగిరెద్దులు", రేగు పళ్లు....మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి. సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. ధాన్యం కొలవడానికి "కుండ" లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" వుండేవి. కుండకు పదిన్నర మానికలు...మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు...తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు...సోలకు నాలుగు గిద్దెలు...ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో కాని, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. పొలంలో కల్లం పూర్తైన తరువాత, వూళ్లోని కొంత మందికి "మేర" అని ఇచ్చే ఆచారం వుండేది. గ్రామంలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, నీరుకాడు, షేక్ సింద్....ఇలా కొద్ది మందికి కల్లంలో కొంత ధాన్యం వారు ఏడాది పొడుగూ చేసే పనులకు ప్రతిఫలంగా ఇవ్వడం ఆనవాయితీ. ఆ ప్రక్రియ అంతా కళ్లల్లో మెదుల్తూంది. అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా జరుపుకునే పండుగ "పీర్ల పండుగ". గ్రామంలో "పీర్ల గుండం" వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి, ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు.


చిన్నతనంలో ప్రతి ఇంట్లో ఇంకా తెలతెలవారుతుండగానే, పొద్దున్నే లేవడం, విశాలమైన ఇంటి వాకిలి శుభ్రం చేయడం, ఇంటి ముందర కలాపి జల్లడం జరిగేది. వాకిలి శుభ్రం చేయడానికి పొడగాటి కందికట్టె చీపురు (పొలికట్టె) ఉపయోగించేవారు. కలాపి జల్లే నీళ్లలో పశువుల పేడను కలిపేవారు. ఆ తతంగమంతా దాదాపు గంట సేపు జరిగేది. అలానే, ఉదయాన్నే కొందరు "జొన్న తొక్కు" వంపడానికి వచ్చే వారు. బదులుగా "చల్ల" పోయించుకు పోయేవారు. వారొచ్చే వేళ కల్లా, ఇంటి వెనుక వంట ఇంటి పక్కన "చల్లచిలికేవారు. ఒక గుంజకు "కవ్వం" కట్టి తాడుతో పెరుగు చిలికి చల్ల చేసేవారు. పెద్ద బానెడు చల్ల, అందులో పెద్ద "వెన్న ముద్ద", చల్లలో చాలా భాగం మునిగి పోయి తయారయ్యేది. ఎండాకాలంలో మేం ఉదయాన్నుంచే చల్ల ముంచుకుని తాగే వాళ్లం. వెన్న పూస కూడా తినే వాళ్లం. వెన్న పూస నుంచి "నెయ్యి" తయారు చేసేవారు. ఇటీవలి కాలంలో నేను చల్ల చిలకడం చూడలేదు…..వెన్న మునగడం కూడా చూడలేదు.

నా చిన్నతనంలో మా వూళ్లో, ఆ మాటకొస్తే జిల్లా కేంద్రం ఖమ్మంలో మేముండే మామిళ్లగూడెంలో విద్యుత్ సరఫరా లేదు. కిరోసిన్ దీపాల వెలుగులోనే వుండేవాళ్లం. 1961 ప్రాంతంలో....విద్యుత్ స్థంబాలు పాతారు. అంతవరకూ, పెట్రోమాక్స్ లైట్లే వీధి దీపాలు. సాయంత్రం కాగానే, చీకటి పడటానికి కొంచెం ముందర, మున్సిపాలిటీ వాళ్లొచ్చి స్తంభాలకు వీధి దీపాలు తగిలించి పోయేవారు. ఇప్పటి లాగా ఆ రోజుల్లో ఫ్లెష్‌ ఔట్ మరుగుదొడ్లుండేవి కావు. సఫాయివాడు (స్కావెంజర్) ప్రతి రోజు వచ్చి శుభ్రం చేసేవాడు. వాడికి, నెలకు అప్పట్లో ఐదు రూపాయలిచ్చినట్లు గుర్తు.

వంటా-వార్పూ అంతా కట్టెల పొయ్యిల మీదే. స్నానానికి నీళ్లు కాగ పెట్టడం కూడా కందికట్టె నిప్పుల మీదే. ఇక ఇంట్లో వుంది "ఓపెన్ బాత్ రూమే"! స్నానాల గదికి పైకప్పు కూడా లేదుపనివాడు బావిలోంచి నీళ్లు తోడి పోస్తుంటే అలా...ఒక గంట సేపు స్నానం చేసే వాళ్లం. వారానికోసారి తలంట్లుండేవి (తల మీద స్నానం). దాని కొరకు ప్రత్యేకంగా పని వాళ్లుండే వారు. ఇంటి అవసరాలకు కావాల్సిన "ఇసురు రాయి" తో పిండి (శనగ, బియ్యం, జొన్న) విసరడానికి, రోట్లో కారం-పసుపు దంచడానికి, దోస వరుగులు-మామిడి వరుగులు కోసి ఎండ పెట్టడానికి, మొక్క జొన్నలు వలవడానికి, అలాంటి పనులనేకం చేయించడానికి కూడా పనివాళ్లు వుండే వారు. వారికి సరిపడా కూలిచ్చేవారు. పంటలు చేతి కొచ్చిన రోజుల్లో అలాంటి వారికి కొంత బోనస్ కూడా ఇచ్చేవారు నాన్న గారు.

చిన్నతనంలో ప్రయాణ చేయడానికి కచ్చడం బండి వుండేది. సైజు కొంత చిన్నగా వుంటుంది. కచ్చడం బండి పైన ఒక గుడిసె లాంటిది అమర్చి వుంటుంది. లోపల కూర్చోవడానికి చిన్న నులక మంచం (దాన్ని "చక్కి" అని పిలిచే వాళ్లం) వేయాలి. ముందర బండి తోలేవాడు కూచోవడానికి "తొట్టి" వుంటుంది. సామానులు చక్కి కింద అమర్చే వాళ్లం. ఎక్కువలో-ఎక్కువ ముగ్గురు-నలుగురు కంటే అందులో కూర్చోవడం కష్టం. ఇక వాటికి కట్టే ఎద్దులు కూడా చిన్నవిగానే వుంటాయి. ప్రయాణానికి పోయే ముందర వాటిని అందంగా అలంకరించేవాళ్లం. ముఖాలకు పొన్న కుచ్చులు”, “ముట్టె తాళ్లు”, మెడకు మువ్వలు-గంటలు”, బండి చిర్రలకు (ఎద్దుల మెడపై బండి "కాణీ" వేసినప్పుడు అది జారి పోకుండా రెండు చిర్రలు అమర్చే వాళ్లం) గజ్జెలు, ఎద్దుల మెడలో వెంట్రుక తాళ్లు, నడుముకి టంగు వారుఅలంకరించేవాళ్లం. ఎద్దులను అదిలించడానికి తోలేవాడి చేతిలో "చండ్రకోల" వుండేది. అది తోలుతో చేసేవాళ్లు. ఎద్దులు బండిని లాక్కుంటూ పరుగెత్తుతుంటే, ఆ గజ్జెల చప్పిడి, మువ్వల సందడి, టంగు వారు కదలడం....చూడడానికి బలే సరదాగా వుండేది.

ఇంటి పక్కనే వున్న వడ్రంగి "కొలిమి" లో ఇనుప కడ్డీలను పెట్టి కాల్చడం, వాటిని సమ్మెట పోటుతో కొట్టడం, కొలిమిలో నిప్పు ఆరిపోకుండా ఉపయోగించే "తిత్తులను" వూదడానికి ఎల్లప్పుడూ ఒక మనిషి వుండడం చూసుకుంటూ కాలక్షేపం చేసే వాళ్లం. అక్కడ వ్యవసాయ పనిముట్లయిన "అరకలు", "నాగళ్లు", "బురద నాగళ్లు", "దంతెలు", "బండి రోజాలు"....లాంటివి తయారు చేస్తుంటే బలే ముచ్చటగా వుండేది. ఆ పనితనానికి ఆశ్చర్యపోయే వాళ్లం. బండి చక్రాలకు రోజాలను అమర్చడం చాలా కష్టతరమైన పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి "ఇరుసు" తయారు చేసే విధానం కూడా చాలా కష్టమైంది. తొలకరి వర్షాలు పడుతుండగానే వ్యవసాయ పనులు మొదలయ్యేవి. ఆ పనుల్లో మొదటి కార్యక్రమం వ్యవసాయ పనిముట్లను బాగు చేయించుకుని దున్నడానికి సిద్ధంగా వుండడమే.

జిల్లా కేంద్రం ఖమ్మం వెళ్లాలంటే మార్గమధ్యంలో వున్న "మునేరు" దాటాలి. ఏటి దగ్గర కూర్చుని, ఇంటి నుంచి తెచ్చుకున్న పలహారమో, చద్ది అన్నమో (మామిడికాయ వూరకాయ కలుపుకుని) తింటుంటే బలే మజా వచ్చేది. తిన్నంత తిని, కడుపు నిండా ఆ ఏటి నీళ్లే తాగే వాళ్లం. నేను ఖమ్మం లో చదువుకోవడం ప్రారంభించిన కొద్ది కాలానికి మా వూరు గుండా మొదట్లో మట్టి రోడ్డు, తరువాత మెటల్ రోడ్డు, మరి కొంత కాలానికి డాంబర్ రోడ్డు వేశారు. ప్రస్తుతం డబుల్ రోడ్డు వేస్తున్నారు.

ఏబై-అరవై ఏళ్ల కింద గ్రామాలలో నెలకొన్న కొన్ని పరిస్థితులను మననం చేసుకుంటుంటే, ఇప్పటికీ-అప్పటికీ వున్న తేడా కొట్టొచ్చినట్లు అర్థమవుతుంది. ఉదాహరణకు, నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా "సుస్తీ" (వంట్లో బాగా లేక పోతే-జ్వరం లాంటిది వస్తే) చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు, ఆయుర్వేదం వారు, పాము-తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలిక వైద్యులు....ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. మా వూళ్లో ఇంతమంది లేరు కాని, అల్లోపతి వైద్యం నేర్చుకున్న ఒక డాక్టర్, ఆయుర్వేదం వైద్యం తెలిసిన మరో డాక్టర్ వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. ఇద్దరికీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లు ఎంజా, మలేరియా-చలి జ్వరం) .పీ.సీ టాబ్లెట్లు ఇచ్చేవారు. ఒక సీసాలో తయారు చేసిన "రంగు నీళ్లు" కూడా ఇచ్చేవారు. తగ్గితే తగ్గినట్లు, లేకపోతే, రోగి కర్మ అనుకునేవారు ఆ రోజుల్లో. వూళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని ఖమ్మం పోయే వాళ్లు. ఖమ్మంలో కూడా ఆ రోజుల్లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు ఎక్కువగా లేరు.


          ఒక్కసారి చిన్నతనం రోజులు, ఇప్పటి రోజులు తలచుకుని పోల్చి చూసుకుంటే, ఎంత అభివృద్ధి చెందామో అర్థమవుతుంది. మా వూరికి ఇప్పుడు విద్యుత్ సరఫరా వుంది. ఖమ్మం నుంచి రావడానికి-పోవడానికి చక్కటి డబుల్ రోడ్ డాంబర్ రహదారి వుంది. దానిపై అన్ని వేళలా తిరగడానికి ప్రభుత్వ బస్సులున్నాయి. 24 గంటలు అందుబాటులో 108 అంబులెన్స్ వుంది. సాగర్ నీళ్లు వచ్చి గ్రామంలోని మూడొంతుల భూమి సస్యశ్యామలం అయింది. ఒకనాడు ఒకరిద్దరు క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే వున్న ఖమ్మంలో వందలాది మంది అయ్యారిప్పుడు. మా వూళ్లో ఒక పెట్రోల్ బంక్ కూడా వచ్చిందిప్పుడు. కనీసం పది మందికన్నా కార్లు, ఏబై వరకు ఇతర వాహనాలు వున్నాయి. ఫోన్ లేని ఇల్లు, మొబైల్ వాడని వ్యక్తి మా వూళ్లో కనిపించవు. మార్గ మద్యంలో వున్న ఏరు మీద వంతెన కట్టుతున్నారు. ఖమ్మం పోయే దారిలో ఖమ్మం సమీపంలో ఏటిపైన మరో వంతెన కట్తున్నారు. నడకతో కొన్నాళ్లు, సైకిల్ పైన కొన్నాళ్లు, ఎడ్ల బండిపైన కొన్నాళ్లు, ప్రయివేట్ బస్సుపైన కొన్నాళ్లు, స్కూటర్ మీద ప్రయాణం చేసి కొన్నాళ్లు ఖమ్మం-మా వూరి మధ్యన తిరిగిన మేం, ఇప్పుడు సరాసరి హైదరాబాద్ నుంచి ఉదయం బయల్దేరి కారులో మా వూరికి వెళ్లి, కొన్ని గంటలక్కడ గడిపి, రాత్రి కల్లా హైదరాబాద్ చేరుకో గలుగుతున్నాం. ఎడ్ల బండిలో ప్రయాణం చేసిన నేను విమానాలలో తిరుగుతున్నాను. ఆర్.ఎం.పి డాక్టర్ చికిత్సకే పరిమితమైన మేం ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ వైద్యం చేయించుకుంటున్నాం. పలకా-బలపం పట్టిన నేను కంప్యూటర్ ను ఉపయోగిస్తున్నాను. ఇంత అభివృద్ధి జరిగినా ఇంకా జరగాల్సిందెంతో వుంది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల లాగా ఖమ్మం కూడా నిర్లక్ష్యానికి గురైందే. బహుశా రాబోయే రోజుల్లో తెలంగాణ దృక్ఫధంతో అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం. End

Thursday, September 11, 2014

ఐదు దశాబ్దాల క్రితం నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు:వనం జ్వాలా నరసింహారావు

ఐదు దశాబ్దాల క్రితం నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (11-09-2014)

          1964 జూన్ నెలలో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం. ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూడా బస్ స్టాండ్ చేరుకునే సరికి సాయంత్రం ఏడు దాటింది. అప్పట్లో ఎక్స్ ప్రెస్ బస్సు కాదది. ఒకరకమైన ఫాస్ట్ పాసింజర్ లాంటిది. కండక్టర్ ఇష్టమొచ్చిన చోట బస్సును ఆపేవాడు. చిక్కడపల్లి వెళ్లడానికి గౌలిగూడా నుంచి రిక్షా కుదుర్చుకున్నాం. రిక్షా వాడిని మొదలు "చల్తే క్యా" అని అడగాలి. అంతా హింది-ఉర్దూ కలిసిన భాష. "కహా జానా సాబ్" అని వాడు అడగడం...మేం చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ" అని చెప్పడం, అంగీకరించిన రిక్షా వాడు "బారానా" (75 పైసలకు సమానం) కిరాయి అడుగుతే, మేం "ఛె ఆనా" (వాడడిగిన దాంట్లో సగం) ఇస్తామనడం, చివరకు "ఆఠానా" కు కుదరడం జరిగిపోయింది. గౌలిగూడా, ఇసామియాబజార్, సుల్తాన్ బజార్, బడీ చావిడి, కాచి గుడా చౌ రాస్తా, వై.ఎం.సి.ఏ మీదుగా చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ" లో వున్న మామయ్య ఇంటికి సుమారు ఎనిమిది గంటల రాత్రి సమయంలో చేరుకున్నాం. అలా మొదలైంది నా హైదరాబాద్ అనుభవం.

1964 జూన్ నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. విద్యా నగర్ అడ్డీకమేట్ లో ఒక గది అద్దెకు తీసుకున్నాను. నెలసరి అద్దె పది రూపాయల లోపే! అప్పట్లో నాన్న గారు నాకు నెలకు వంద రూపాయలు ఖర్చులకొరకు పంపేవారు. రెండు నెలలు శెలవులు పోగా, మిగిలిన పది నెలల మొత్తం మీద వెయ్యి రూపాయలు వచ్చేవి. ఫీజులకు పోను, నెలంతా ఖర్చులకు పోను, ఇంకా నెలకు పది-పదిహేను రూపాయలు మిగిలేవి. అవి దాచుకునేవాడిని. శెలవుల్లో ఇంటికి వెళ్లేటప్పుడు తమ్ముళ్లకు-చెల్లెళ్లకు ఏమన్నా కొనుక్కోపోయేవాడిని. ఎన్ని కొన్నా ఇంకా డబ్బులు మిగిలేవి. అప్పట్లో, నారాయణ గుడాలోని "యాక్స్" టైలర్ దగ్గర కాని, "పారగాన్" టైలర్ దగ్గర కాని బట్టలు  కుట్టించుకునేవాడిని. అప్పట్లో కుట్టు కూలీ ఐదారు రూపాయల కంటే మించకపోయేది. ఇప్పటి లాగా అప్పట్లో "రెడీ మేడ్" దుస్తులు ఎక్కువగా లభించకపోయేవి. ఎక్కువగా "టెరిలీన్", "వులెన్" దుస్తులు లభించేవి. కాటన్ తక్కువే. మొదట్లో "బాటం వెడల్పు" గా వుండే పాంట్లు కుట్టించుకునే వాళ్లం. ఆ తరువాత "గొట్టం" పాంట్ల ఫాషన్ వచ్చింది. అవి పోయి "బెల్ బాటం" వచ్చాయి. పాంటు కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా కొన్నాళ్లు ఫాషన్‌గా వుండేది.

విద్యా నగర్ లో వున్నంత కాలం భోజనం సమీపంలోని చెలమయ్య హోటెల్ లో తినేవాడిని. చెలమయ్య హోటెల్ ఇడ్లీలు కూడా తినేవాడిని ఉదయం పూట. విద్యా నగర్ నుంచి కాలేజీకి వెళ్లడానికి "3-డి" బస్సు ఎక్కి, నారాయణ గుడాలో దిగి, నడుచుకుంటూ, విఠల్ వాడీ మీదుగా వెళ్లేవాడిని. ఒక్కో సారి "చారనా" బాడుగ ఇచ్చి "చార్మీనార్ చౌ రాస్తా" (ఇప్పటి ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్) వరకు రిక్షాలో వచ్చి, అక్కడ నుంచి "7-సి" బస్సెక్కి, వై.ఎం.సి.ఏ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లేవాడిని కాలేజీకి. చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండేదప్పట్లో. చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), గోలకొండ సిగరెట్ (నీలం రంగు పాకెట్ లో వచ్చే) కర్మాగారం అక్కడే వుండేవి. చార్మీనార్ చౌ రాస్తా నుంచి విద్యానగర్‍కు వెళ్లడానికి పక్కా రోడ్డు లేదప్పట్లో. ఆ మార్గంలో సిటీ బస్సులు నడవకపోయేవి. విద్యా నగర్ పక్కనే జమిస్తాన్ పూరాకు వెళ్లడానికి "రామ్ నగర్ గుండు" మీద నుంచి వెళ్లే వాళ్లం. చార్మీనార్ చౌ రాస్తా-ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్ నుంచి (ఇప్పుడున్న) టాంక్ బండ్‍ను కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండ్‍ను కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. దానిని తొలగించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొదట్లో సాధ్యపడలేదు. ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి టాంక్ బండ్ పక్కగా ప్రస్తుతం వున్న "ఫ్లయిఓవర్" కూడా లేదప్పుడు. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. డ్రైవర్ కాకుండా ముగ్గురికంటే ఎక్కువగా టాక్సీలో కూర్చోనీయక పోయే వాళ్లు. ఆటోలు కూడా వుండేవి కాని అంత పాపులర్ కాదు. ఆటోలలో ఇద్దరు పాసింజర్లకే పర్మిషన్. టాక్సీలకు కిలోమీటర్‌కు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు.


సిటీ బస్సుల్లో ప్రయాణం ఇప్పటి లాగా కష్టంగా వుండేది కాదు. హాయిగా ప్రయాణం చేసే వాళ్లం. "ఆగే బడో" అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది. కనీస చార్జ్ ఒక "అణా"-ఆరు "నయాపైసలు" వున్నట్లు గుర్తు. ఉదాహరణకు విద్యా నగర్ నుంచి నారాయణ గుడాకు కాని, చార్మీనార్ చౌ రాస్తా నుంచి వై.ఎం.సి.ఏ కు కాని "అణా" లేదా ఆరు పైసలు రేటుండేది. ఇంతకీ "అణా" ఏంటనే ప్రశ్న రావచ్చు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో కొన్నాళ్ల వరకు-బహుశా ఒక ఆర్నెల్ల వరకనుకుంటా, ఇంకా అణా-బేడలు చలామణిలోనే వుండేవి. అందుకే ఇక్కడ కొంత మన నాణాల గురించి ప్రస్తావిస్తే బాగుంటుందేమో! ఆగస్ట్ 15, 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అమల్లో వున్న కరెన్సీ నాణాలు "దశాంశ" తరహా నాణాలు కావు. రూపాయను పదహారు "అణాలుగా, ఎనిమిది "బేడలుగా, నాలుగు "పావలాలుగా, రెండు "అర్థ రూపాయలుగా విభజించి చలామణిలో వుంచారు. ఒక "అణాకు నాలుగు పైసలు...రూపాయకు 64 పైసలు. 1957 లో "డెసిమల్" పద్ధతిలోకి చలామణిని మార్చింది ప్రభుత్వం. అయితే 1964 (నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల) వరకు, నాన్-డెసిమల్ (అణా, బేడ, పావలా...), డెసిమల్ పద్ధతులు రెండింటినీ వాడకంలో వుంచారు. అణా గుండ్రంగా, బేడ నాలుగు పలకలుగా-పచ్చ రంగులో వుండేవి. ఆ తరువాత నాన్-డెసిమల్ నాణాల వాడకం ఉపసంహరించింది ప్రభుత్వం. ఇప్పుడు మనం పైసలుగా వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో "నయా పైసలుగా పిలిచేవారు. 1, 2, 5, 10, 20, 25, 50 (నయా) పైసల నాణాలు చలామణిలో వుండేవి.

విద్యా నగర్ లో ఎక్కువ రోజులుండలేదు. అక్కడ నుంచి కాలేజీకి వెళ్లి రావడం ఇబ్బందిగా వుండడంతో మకాం మార్చి, హిమాయత్ నగర్ లో ఒక గది అద్దెకు తీసుకున్నా. అద్దె పది రూపాయలు. ఇద్దరం వుండేవాళ్లం. చెరి ఐదు రూపాయలు. కాలేజీకి వెళ్లే దారిలో వై.ఎం.సి.ఏ కి ఎదురుగా "ఇంద్ర భవన్" అనే ఇరానీ రెస్టారెంటులో ఆగుతుండేవాళ్లం ఒక్కొక్కప్పుడు. అక్కడ కాకపోతే, కాలేజీ ఎదురు గుండా (ఇప్పటికీ వుంది) "సెంటర్ కెఫే" కి పోయే వాళ్లం. ఇరానీ "చాయ్" (బహుశా) 15 పైసలిచ్చి తాగే వాళ్లం. ఒక్కోసారి "పౌనా" తాగే వాళ్లం. 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లం. అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి వెళ్లి "సాయిబాబా మిఠాయి భండార్" లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్ మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లం. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. చిక్కడపల్లి రోడ్డు మీద వున్న మరో హోటెల్ "గుల్షన్ కెఫే" కి కూడా వెళ్తుండేవాళ్లం. గుల్షన్ కెఫే సమీపంలో "రూబీ ఆర్ట్ స్టూడియో" వుండేది. పక్కనే "ప్రజా ఫార్మసీ మెడికల్" షాప్, దానికి ఎదురుగా "మహావీర్ మెడికల్ షాప్" వుండేవి. చిక్కడపల్లి మా మామయ్య ఇంటికి పోయే సందులోనే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకట స్వామి ఇల్లుండేది. ఆయనను తరచుగా చూస్తుండేవాళ్లం. శెలవుల్లో హిమాయత్ నగర్‌లో వున్న "గాయత్రీ భవన్" కు కాని, నారాయణ గుడాలో వున్న తాజ్ మహల్ కు కాని టిఫిన్ తింటానికి వెళ్లే వాళ్లం. ఇక భోజనం ఎప్పుడూ నారాయణ గుడా తాజ్ మహల్ హోటల్లోనే. అప్పట్లో తాజ్ మహల్ లో 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కునే వాళ్లం. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్లగలిగే వాళ్లం. ఇక భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. నేను స్టూడెంటుగా వున్నంతకాలం ఒక్క తాజ్ మహల్ హోటెల్ లోనే భోజనం చేశాను. క్రమేపీ రేట్ పెరుక్కుంటూ పోయింది. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్" ఇడ్లీ కూడా రాని పరిస్థితి!

నారాయణ గుడా తాజ్ మహల్ హోటెల్ లో సాయంత్రాలు కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ "ముర్కు" తిని, "వన్ బై టు" కప్పు కాఫీ తాగి (బహుశా అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట పడే వాళ్లం. తాజ్ మహల్ నుంచి బయటికొచ్చి, కాసేపు నారాయణ గుడా బ్రిడ్జ్ పక్కనున్న పార్క్ లో కూచుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఒక్కో సారి స్నేహితులతో కలిసి, హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకా పోయి, తిరిగి తాజ్ మహల్ హోటెల్ కు వచ్చి భోజనం చేసి రూమ్ కు వెళ్లే వాడిని. మధ్య-మధ్య నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ వై.ఎం.సి.ఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్ బజార్, కోఠి తిరిగి వచ్చే వాళ్లం. తిరుగు ప్రయాణం, ఒక వేళ అలిసిపోతే, బస్సులో చేసే వాళ్లం. హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. దాని ముందర నుంచి చీకటి పడిన తరువాత వెళ్లాలంటే కొంచెం భయమేసేది కూడా.

హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్" టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి. వి. కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి కాకుండా నారాయణ గుడాలో "దీపక్ మహల్", హిమాయత్ నగర్ లో "లిబర్టీ", సికిందరాబాద్ లో "పారడైజ్", "తివోలీ" థియేటర్లుండేవి. సికిందరాబాద్ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూపించేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఇప్పుడున్న థియేటర్లు ఏవీ అప్పుడు లేవు. ముషీరాబాద్‌లో "రహమత్ మహల్" టాకీసుండేది. అలానే నారాయణ గుడా దీపక మహల్ పక్కన "రాజ్ కమల్" బార్ అండ్ రెస్టారెంట్ (ఇప్పటికీ వుంది) వుండేది. బహుశా అందులో మద్యపానం అలవాటు చేసుకోని వారు అరుదుగా వుంటారేమో! నాకు బాగా గుర్తుంది….. డిగ్రీ పరీక్షల్లో, చివరిగా, మాడరన్ ఫిజిక్స్ పేపర్ అయిపోయిన తరువాత, మధ్యాహ్నం పూట, మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్ బార్‌కు వెళ్లి, "గోల్డెన్‌ ఈగిల్" బీర్ తాగాను. అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ నన్ను వదలలేదు. మరో మూడేళ్లలో నా తాగుడికి "గోల్డెన్‌ జూబ్లీ" సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో! అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న బీర్ బాటిల్ ఇప్పుడు వంద దాటి పోయింది...అప్పట్లో కేవలం గోల్డెన్‌ ఈగిల్ లాంటి ఒకటి-రెండు బ్రాండులే వుండగా, ఇప్పుడు లెక్క లేనన్ని వున్నాయి!  


నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్స్ లర్) డి. ఎస్. రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపుకు మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు (మొన్నటి వరకూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి) మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966 లో, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న డి. ఎస్. రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ (పేరు గుర్తుకు రావడం లేదు) ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నా కింకా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి. ఎస్. రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్. రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్ లర్‍గా డి.ఎస్. రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో "గ్రేస్ మార్కులు" ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి!