Friday, September 23, 2016

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు : వనం జ్వాలా నరసింహారావు

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (24-09-2016)

            ప్రయివేట్ కోచింగ్ సెంటర్లలో చదివే విధ్యార్థులకు పోటాపోటీగా, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థినీ విద్యార్థులు ఎంసెట్-2016 పరీక్షలలో గణనీయమైన సంఖ్యలో ఉత్తెర్ణులై, మెడిసిన్ విభాగంలో 40 సీట్లు, బిడిఎస్ లో 20 సీట్లు సంపాదించి తమ ప్రతిభను చాటడమే కాకుండా, సంస్థకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. ఈ విజయానికి అదనంగా ఇక్కడే చదివిన మరికొందరు గురుకుల విద్యార్థులు కేంద్రీయ విశ్వ విద్యాలయంలో 25 సీట్లను పొందడంతో పాటు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో 6 సీట్లు, అజీం ప్రేమ్ జీ విద్యాసంస్థల్లో 11 సీట్లు, ఐఐటిలు, ఎన్ఐటిలలో 45 సీట్లు, చార్టడ్ ఎకౌంటెన్సీల్లో 5 సీట్లుసాధించారు.

గురుకుల విద్యాసంస్థల విధ్యార్థులు కనబరిచిన ప్రతిభను తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచేందుకు,  వీటిని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే పరిమితం చేయకుండా, మైనారిటీలకూ, వెనుకబడిన తరగతులవారికీ ప్రవేశం కల్పించేందుకూ నిర్ణయించారుఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల సంఖ్యకు అదనంగా కేవలం మైనారిటీ విద్యార్థులకు ఉపయోగపడేలా మరో 89 గురుకుల పాఠశాలలను నెలకొల్పడం జరుగుతుంది. తద్వారా, మైనారిటీలకు ఈ పాటికే ప్రారంభించిన 71 గురుకులాల (వాటిలో బాలురకు 39, బాలికలకు 32) సంఖ్యను 160కి పెంచటం జరిగిందిగతంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కోటి చొప్పున 120 మైనారిటీ గురుకుల పాఠశాలలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికి,  గురుకుల పాఠశాలల్లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్న మైనారిటీ విద్యార్థల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో, మరో 40 అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావించారు. గురుకుల పాఠశాలల్లో మొదట 5,6,7  తరగతులో విద్యార్థులను చేర్చుకుని, ఏడాది గడుస్తున్న కొద్దీ, పైతరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల విద్యాసంస్థ ఆ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను చేపట్తుంది. మైనారిటీలలో విద్యా ప్రమాణాలు తగ్గు ముఖం  పట్టడం, మధ్యలోనే చదువు మానేసేవారి సంఖ్య పెరగటం వల్ల ఈ సమస్యను అధిగమించాల్సిన ఆవశ్యకత వుంది అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.   మైనార్టీలకు మెరుగైన విద్యా విధానాన్ని అందించడానికి నాణ్యమైన గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, ఆ తరువాత తగు ఉద్యోగ అవకాశాలను కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచటం లక్ష్యంగా ఎంచుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు

అలాగే బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున మరో 120 గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారు. బీసీ కులాలకు చెందిన వారికి మెరుగైన భవిష్యత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారికి ఉత్తమమైన విద్యను అందించి తద్వారా మంచి పునాది వేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్దారు. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీరి కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీటిలో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించనున్నారు. ఇంతకు ముందు, బాబాసాహేబ్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంలో, 100 నూతన గురుకుల పాఠశాలలను, 30 గురుకుల డిగ్రీ కాలేజీలను, ప్రత్యేకించి అణగారిన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ద్వారా, 2016-17 విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వీటితో పాటు ఎస్.టి.విద్యార్థులకు  అదనంగా  మరో 50 విద్యాలయాలను అదే విద్యా సంవత్సరంలో దశల వారీగా ఆరంభించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేయడానికి, వారి భవిష్యత్ ను చక్కగా తీర్చిదిద్దటానికి తీసుకుంటున్న చర్య ఇది.

టీఆరెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కోన్న విధంగా, కేజి స్థాయి నుండి పిజి స్థాయి వరకు ఉచిత నిర్భంద విద్యను అందించే క్రమంలో పెద్ద సంఖ్యలో  గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఉపక్రమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు ప్రత్యేకించి ఇవి ఉపయోగపడతాయి. గురుకుల విద్యా సంస్థల నుండి ఒక ఆధునిక విజ్ఞానదాయిక తరాన్ని ఆవిష్కృతం చేయగలమన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి అనేక సార్లు వ్యక్తపరచారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థలలో చదివి బయట ప్రపంచంలో అడుగుపెట్టిన వారు, రానున్నరోజుల్లో, భారత దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికీ దిశా నిర్దేశాలు చేయడానికి, ప్రగతి బాటలు వేయడానికి, అవసరమైన మేధోసంపత్తి కలిగినవారై వుంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఈ పాటికే 135 గురుకుల విద్యా సంస్థలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ నిర్వహణలో నడుస్తున్నాయి. వీటిలో సుమారు 77, 000 మంది విద్యార్థులున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఎస్సీలకు 74 పాఠశాలలు, బిసీలకు 23 పాఠశాలలు, ఇతరులకు 47 పాఠశాలలు (మొత్తం  279) ఉండేవి.   ఇప్పుడు ప్రత్యేకించి మైనారిటీలకు ఏర్పాటు చేయదల్చుకున్న 89 అదనపు గురుకుల పాఠశాలలు, బీసీలకు ఏర్పాటుచేయాలనుకున్న 120 పాఠశాలలు కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాటుచేస్తున్న గురుకుల విద్యాసంస్థల సంఖ్య 480కి చేరుతుంది.   వీటిలో ఎస్సీలకు 103, ఎస్టీలకు 51, ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు 30,  మైనారిటీలకు 160, బిసీలకు 120, జూనియర్ కళాశాలలు వున్నాయి.   లోగడ వున్నవి, కొత్తగా ఏర్పాటు చేస్తున్నవి అన్నీ కలిపితే, వచ్చే విద్యా సంవత్సరం నాటికి రికార్డు స్థాయిలో 760 గురుకుల విద్యా సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పబడి సుమారు 2.3 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యాసంస్థకు చెందిన విధ్యార్థులు అనేక రకాలుగా నిర్వహించబడే పోటీలలో ముందంజలో వున్నారుతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన కొన్నాళ్లకే జూన్ 2014 లో, ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్ర సంస్థగా రూపుదిద్దుకుంది. సంస్థ ఏర్పాటయినప్పటి నుంచే ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్ కు, మెరుగైన, నాణ్యమైన విద్యా ప్రమాణాలతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు నిర్వాహకులు.

          సీనియర్ ఐ.పి.ఎన్. అధికారి డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ స్వఛ్చందంగా ముందుకు వచ్చి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, గణనీయమైన సేవలందించటంలో ప్రత్యేక కృషి చేసారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్దిగా చదువుకున్న ఆయన ఈ స్థాయికి చేరుకోవటం విశేషం. ఆయనకి స్ఫూర్తి వారి తల్లి గారు. ఆవిడ రోజువారీ కూలీగా చిన్నప్పటి జీవితాన్ని ఆరంభించి ఎసోసియేట్ ప్రొఫెసర్ గా, డాక్టర్ గా ఎదగగలిగారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టభద్రులు కావడానికి పూర్వం అక్కడ పరిచయమైన కొందరి స్ఫూర్తితో ఆయన ఆలోచనల్లో బలీయమైన కోరికగా ఇక్కడ పనిచేయటానికి బాటలు వేసింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనపై పెట్టుకున్న నమ్మకానికి, తనకు అప్పచెప్పిన గురుతరమైన బాధ్యతకి, తనపై చూపించిన ఆదరణకు, తాను ఎప్పటికీ బద్ధుడినై, కృతజ్ఞతతో ఉంటూ లక్షల మంది భవితవ్యాన్ని తీర్చిదిద్దటంలో, భాగమైన కెజి-టు-పిజి కార్యక్రమాన్ని ముందుకుతీసుకుపోవడంలో తనవంతు కృషి చేస్తానని ప్రవీణ్ అన్నారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థలకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకురావటంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవటంలో తనవంతు పాత్ర నిర్వహిస్తానని కూడా ఆయన అన్నారు.

            విద్యకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. పేదరికాన్ని, దారిద్ర్యాన్ని కూకటి వేళ్లతో పెకళించడానికి, అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడానికి విద్య ఎంతో అవసరం. విద్యాబుద్ధులు కలిగించే గురువే తల్లితండ్రుల పాత్రని పోషిస్తూ, సర్వవిధాల విధ్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. గురుకుల విద్యనందించటం ద్వారా అద్భుత ఫలితాలు చేకూరడంతో పాటుగా ప్రతిభావంతులైన విద్యార్ధులు, వారి కలలు సాకారం పొందేందుకు, మట్టిలోంచి మాణిక్యాలను సృష్టించేందుకు గురుకుల విద్య దోహద పడుతోంది. గురుకులాల ఆవిర్భావంతో ఈ విద్యా సంస్థలను పెద్ద ఎత్తున మంచి పేరు రావటం ఆరంభమయ్యింది. ఎన్ని ప్రైవేటు విద్యా సంస్థలు పుట్ట గొడుగుల్లా విస్తరిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయి వరకు గురుకులాల పరిధిని విస్తరించాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ఈ గురుకుల పాఠశాలలు బోర్డు పరీక్షలలో సాధించే ఉత్తీర్ణతల సంఖ్య 15% పైమాటగానే నిలుస్తోంది. అఖిల భారత సర్వీసులకు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, రాజకీయాలు, వ్యాపారం, పర్వతారోహణ వంటి వాటిలో ఎందరికో ప్రవేశం కల్పిస్తుంది. గడచిన దశాబ్ద కాలంలో దాదాపు 200 పైగా విద్యార్ధులు ఐఐటిలకు, ఎన్ఐటిలకు, వైద్య రంగానికి, డెంటల్ కళాశాలలకు గురుకుల విద్యాసంస్థల నుంచి ఎంపికయ్యారు.

            గురుకుల విద్యా సంస్థల్లోని ప్రతీ పాఠశాలలో చక్కటి భవనంతో పాటు, ఒక డార్మిటరీ, వంటశాల, భోజనశాల, పని వారికి ఇళ్ళు, ఆటలకు మైదానం ఉంటాయి. ఒక సారి ప్రవేశం పొందిన అనంతరం నెలకు ఒక్క సారి మాత్రమే తల్లి తండ్రులను కలిసేందుకు, శెలవు రోజుల్లో మాత్రమే వారి వారి ఇళ్ళకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. టీచర్లూ అదే క్యాంపస్ లోనే ఉంటూ విద్యార్థుల అవసరాలకనుగుణంగా పాఠ్యాంశాల-పాఠ్యేతర అంశాల పరంగా, క్రీడా సంబంధమైన అంశాల కనుగుణంగా దిశా నిర్దేశం చేస్తూ అహర్నిశలు కంటికి రెప్పలా వారిని పర్యవేక్షిస్తుంటారు. వీరి విద్యకు అవసరమైన అన్ని ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. పన్నెండవ తరగతి అనంతరం వారికి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళ వసతి కల్పించి వారికి వచ్చే పారితోషికంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేలా చూస్తారు. గురువులగానే కాకుండా తల్లితండ్రులుగా వారికి విలువలను నేర్పించటంలోనూ ఉపాధ్యాయులు దోహదపడతారు.


            తెలంగాణ గురుకుల విద్యా విధానాన్ని అనుకరించి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అవసరాలకనుగుణంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం కష్టమేమీ కాదు. విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు కాని, ఈ నమూనా తప్పకుండా, అణగారిన వర్గాల్లో ఆణిముత్యాల్ని వెలికితీస్తుంది. సురక్షితమైన, సుస్థిరమైన, సమగ్రమైన రీతిలో తీర్చిదిద్దబడిన పిల్లలు వారి కుటుంబాలనే కాకుండా సమాజాన్నీ తగురీతిన తీర్చిదిద్దటంలో సఫలీకృతులౌతారు అనటం నిర్వివాదాంశం. End

No comments:

Post a Comment