Sunday, January 14, 2018

బెదిరించిన రాక్షస స్త్రీలకు తన మనో నిశ్చయం తెల్పిన సీత ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

బెదిరించిన రాక్షస స్త్రీలకు తన మనో నిశ్చయం తెల్పిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (15-01-2018)

రావణుడి ఆజ్ఞానుసారం, కోపంతో, ఎర్రటి కళ్లతో వున్న రాక్షస స్త్రీలు, సీత దగ్గరకు చేరి, అనేక రకాలైన కఠినమైన మాటలన్నారు. తెలివిలేనిదానివన్నారు. రావణుడిని భర్తగా ఎందుకొప్పుకోవని అడుగుతారు. రావణుడంటే ఎవరనుకుంటున్నావని నిలదీస్తారు. కులానికి తక్కువా అంటే, బ్రహ్మకుమారుడైన పులస్త్య మహాముని వంశంలో పుట్టినవాడని చెప్తారు. లోకంలో అందరికీ ఒకే తల వుంటే, వీడికి పది తలలున్నాయనీ, మూడులోకాల్లో వీడిని మించిన వాడు లేడనీ, గర్వించిన శత్రువులందరినీ జయించాడనీ, ఇట్టివాడు కాకపోతే మగడు ఎట్లాంటివాడై వుండాలని ప్రశ్నిస్తారు.

"ఏకజట" అనే రాక్షసి నచ్చచెప్తూ: "సీతా! రావణుడిని నీవు అల్పుడనుకుంటున్నావు. వాడి పుట్టు-పూర్వోత్తరాలు నీకు తెలియదు. బ్రహ్మ మానసపుత్రుడు. నాల్గవ ప్రజాపతైన పులస్త్యుడి సంకల్పంతో కలిగిన విశ్రవసుడి కొడుకు రావణుడు. బలంలో శత్రువులను ఏడిపిస్తాడు. ఇంత గొప్పవాడు తనంతట తనే వచ్చి నిన్ను ప్రార్ధిస్తుంటే ఎందుకు బిగుసుకుంటావు? వాడు మక్కువ చూపిస్తున్న కొద్దీ నీకు నిక్కువెక్కుతున్నదెందుకు?". పిల్లికళ్లు తెరిచి, గుడ్లు గిరగిరా తిప్పుతూ "హరిజట" అనే రాక్షసి: "ముఫ్పైమూడు కోట్ల దేవతలను జయించాడు రావణుడు. ఇంద్రుడుని చెరపట్టాడు. అలాంటి జగజ్జెట్టే నీకుతగిన మొగుడు....వరించు" అంటుంది. కోపంతో వళ్లుమరిచి కఠినంగా మాట్లాడుతూ "ప్రఘస" అనే మరో రాక్షసి: "తన ప్రియురాలిని, సుందరిని, పుణ్యాత్మురాలిని విడిచి నిన్ను కోరుతున్న శూరుడికి, పరాక్రమవంతుడికి, బలవంతుడికి భార్యకావాలని నీ అంతట నీవే పోయి అడగాలికాని, నిన్నింత బలవంతం చేయాల్నా? అందరు ఆడవాళ్లు అక్కడుండగా, వారందరు చూస్తుండగా వాడితో ఎలా రమించాలనుకుంటావేమో! పరవాలేదులే! అంతఃపురాన్ని వదిలేసి రావణుడే ఇక్కడకు వస్తాడు ఒంటరిగా. పిలుచుకుని రమ్మంటావా?" అని అడుగుతుంది.

"వికట" అనే రాక్షసి చనువుగా, దగ్గరకొచ్చి, కూర్చుని: "సీతమ్మా! రావణుడు యుద్ధంలో అవలీలగా నాగులను, గంధర్వులను, యక్షులను, పన్నగులను, దానవులను ఎన్నోసార్లు గెలిచాడు. అంతటి మహాత్ముడికి నీమీద మనస్సు కలిగింది. ఎందుకు ఇల్లాలివై సంతోషించవు?"అని ప్రశ్నించి, నిర్భాగ్యురాలివని నిందిస్తుంది. "దుర్ముఖి" అనే మరో రాక్షసి, రావణుడి పేరు చెప్తే సూర్యుడు లంకపై ఎండ కాయడు, గాలి వీయడానికి భయపడ్తాడు, చెట్లు భయపడి వాడొచ్చినప్పుడు పూలవాన కురిపిస్తాయి, కోరినప్పుడు మేఘాలు వర్షిస్తాయి, అంటుంది. అలాంటి మహిమగలవాడిని, రారాజును, దేవతల విరోధిని, రావణుడిని భర్తగా చేసుకుని సుఖపడమని హితబోధ చేస్తుంది.

నయవాక్యాలతో సీతను ఒప్పించ లేకపోయిన రాక్షస స్త్రీలు, ఒక్క గుంపుగా చేరి, క్రూరంగా గర్జిస్తూ, బెదిరింపు మాటలనసాగారు. "సీతా! మనస్సు హరించే అంతఃపురంలో పరుపుల మీద పడుకోవడానికి ఎందుకు ఒప్పుకోవు? ఏల పడుకోనంటున్నావు? మనిషివైనందున, మనిషి భార్య కావడమే గొప్పనుకుంటున్నావు. ఇంకెక్కడి రాముడు? నీవేమో ఇక్కడ, ఆయనెక్కడో? ఆయన మీద మనసుంచి ఏడవడమెందుకు? రాముడిని చూడడం అసత్యం. రాక్షసరాజు రావణుడే నీకు తగిన భర్త. స్వీకరించు. నీవు మనిషివైనందున, పనికిమాలిన మనిషిని, రాజ్యం లేనివాడిని, ఏడుస్తున్న దరిద్రుడిని, బలహీనుడిని, భర్తగా తలుస్తున్నావు. ఈ రావణుడు మనుషులను తినేవాడు. జనుల దృష్టిలో గొప్పవనుకున్న పదార్ధాలన్నింటినీ అనుభవిస్తున్న వాడు. రాక్షసరాజు. ఇటువంటివాడిని మగడిగా చేసుకుని యధేచ్ఛగా సుఖించకూడదా?" అంటూ తననీవిధంగా పరుష వాక్యాలతో బాధిస్తున్న రాక్షసస్త్రీలతో, కారుతున్న కన్నీళ్లను, కొనగోటితో తుడుచుకుంటూ, మెల్లగా తన మనసులోని మాటలను చెప్పసాగింది సీత.

"ఓరాక్షస స్త్రీలారా! నామాట మీ చెవికెక్కడం లేదా? మీరు చెప్తున్న మాటలు లోకం మెచ్చేవికావు. మీకు ఘోరపాపాన్ని కలిగిస్తాయి. మనుష్య స్త్రీ, రాక్షసుడి భార్యకావడం ఎక్కడైనా జరిగిందా? కావాలంటే నన్ను చంపి తినండి. చెడుమాటలు మానేయండి. దరిద్రుడు, రాజ్యహీనుడు, మరెట్టివాడైనా, సువర్చలకు సూర్యుడిలా, నామగడే నాకుగొప్ప" అంటుంది సీత రాక్శస స్త్రీలను వుద్దేశించి. (కల్పాదిలో బ్రహ్మకు కొడుకు పుట్టి, తనపేరేంటో చెప్పమని ఏడుస్తాడు. "రుద్రుడు" అని నామకరణం చేస్తాడు బ్రహ్మ. మళ్లా ఏడుసార్లు ఏడుస్తాడు రుద్రుడు. అప్పుడు: "భవ-శర్వ-ఈశాన-పశుపతి-భీమ-ఉగ్ర-మహదేవ" అని ఏడుపేర్లు పెట్తాడు. ఆ ఎనిమిదిమందికి "సూర్య - జల - మహి - వాయు - వహ్ని - ఆకాశ దీక్షిత బ్రాహ్మణ - సోమ" దేహాలను ఇచ్చి, "సువర్చల-ఉష-సుకేశి-శివ-స్వాహా-దిశ-దీక్ష-రోహిణి" అనే ఎనిమిదిమందిని భార్యలుగా ఇచ్చాడు. ఇక్కడ చెప్పబడిన సువర్చలే ఆమె. సూర్యుడు తన వేడితో ఎంతో తపించేట్లు చేస్తున్నా సువర్చల అతన్ని విడిచిపోలేదు).


సీతాదేవి అన్న మాటలకు ప్రత్యుత్తరంగా, రావణుడిచే ఆజ్ఞాపించబడిన రాక్షస స్త్రీలు, కఠినవాక్కులనే బాణాలతో ఆమెను నొప్పించసాగారు. ఎటూకదలకుండా, పెదవి విప్పకుండా, శింశుపావృక్షం మీదనుండి రాక్షస స్త్రీలు జానకిని బెదిరిస్తూ అన్న మాటలన్నీ విన్నాడు హనుమంతుడు. రావణుడు రాకముందే తాను చూసిన స్త్రీని సీతాదేవిగా నిర్ణయించుకున్న హనుమంతుడు, సీతా-రావణుల సంభాషణవల్ల, తన నిర్ణయాన్ని స్థిరపర్చుకున్నాడు. అన్ని దుర్భాషలాడిన వారిమీద, హనుమంతుడు లంఘించి బుధ్ధి చెప్పొచ్చునుకాని, అలాచేయడం దూతలక్షణం కాదని వూరుకున్నాడు. దూతకృత్యం సీతాదేవిని చూడడం, మాట్లాడి రామ ముద్రికను ఇవ్వడమే. ఇదిముఖ్యం. దీన్ని పాడుచేయకూడదు. పైగా యుద్ధంచేసే సమయంకాదిది. ఆ స్థలంలో యుద్దం జరిగితే సీతాదేవి బెదరవచ్చు. వచ్చిన పని అయిపోతే యుధ్ధమెప్పుడైనా చేయవచ్చునని ఓర్పువహిస్తాడు హనుమంతుడు

No comments:

Post a Comment