మర్రి చెన్నారెడ్డితో
అనుభవాలు, జ్ఞాపకాలు-1
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ పీఆర్వో టు సీఎం
చెన్నారెడ్డి)
ఆంధ్రభూమి దినపత్రిక (11-07-2018)
స్వర్గీయ డాక్టర్
మర్రి చెన్నారెడ్డి రెండవ విడత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి
కొద్దికాలం ముందునుండీ నాకున్న పరిచయం వల్ల, ఆ తరువాత
ఆయన దగ్గర సీఎం పీఆర్వోగా పనిచేయడం వల్ల, ఆయనతొ నాకున్న
అనుబంధానికి సంబంధించిన కొన్ని అనుభవాల జ్ఞాపకాలు అప్పుడప్పుడూ మదిలో మెదలుతుంటాయి.
పాలనాపరమైన, మేధోపరమైన వాటిలో కొన్ని పదిమందితో పంచుకుంటే
మంచిదనే ఆలోచనే ఈ వ్యాసానికి నాంది. సీఎం గా డిసెంబర్ 3,
1989న చెన్నారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజుల్లో నేను రాజ్ భవన్లో, నాటి గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర, ఆమె
ఆధ్యక్షతన పనిచేస్తున్న “చేతన” అనే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు చేసే
స్వచ్చంద సంస్థ అడ్మినిస్ట్రేటివ్-ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నాను.
చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, ఆయన ఏపీసీసీ
అధ్యక్షుడిగా వున్నప్పుడు, శాసనసభ-లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ఆకాశవాణి వార్తా విభాగంలో నలబై రోజుల కాంట్రాక్టు మీద నేను తాత్కాలిక
విలేఖరిగా పనిచేసే అవకాశం లభించింది. చెన్నారెడ్డి పాల్గొన్న అనేక కార్యక్రమాలను
కవర్ చేసే వీలు అలా కలిగింది. అది నన్ను అంతకుముందే వున్న పరిచయానికి అదనంగా ఆయనకు
మరింత చేరువ చేసింది.
సీఎం గా ఆయన
బాధ్యతలు చేపట్టిన రెండు-మూడు రోజుల్లో చెన్నారెడ్డి దగ్గరనుండి నాకు ఫోన్
వచ్చింది. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. అధునాతన పరికరాల ఫోన్లు కూడా లేవు. నన్ను
వచ్చి కలవమని ఆయన దగ్గరనుండి పిలుపు. ఆయన కోరినట్లే తార్నాక లోని ఆయన ఇంటికి
వెళ్లాను. వెళ్ళిన కొద్ది సేపటికి ఆయన్ను కలవడం,
నాకు ఆయన ఒక పని అప్పచెప్పడం వెంట-వెంట జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్
వార్షిక ఉత్సవాలకు సీఎం సందేశం రాయమని నన్ను ఆయన ఆదేశించారు. నేనేదో చెప్పబోతుంటే, తనకంతా తెలుసనీ, నన్ను సీఎం పీఆర్వోగా నియమిస్తున్నాననీ
చెన్నారెడ్డి అన్నారు. నాకు ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. సరే...నేను
నాకు అప్పగించిన పని పూర్తి చేశాను....సందేశం రాశాను. తన సహజ శైలిలో ...”ఇన్సిపియెంట్”
(Incipient, meaning developing into a
specified type or role) అనే ఒక చిన్న కామెంట్
చేసి సందేశం మీద సంతకం చేశారు. ఆ కామెంటును నేను ఒక సూచనలాగా తీసుకుని, ఆయన ఆలోచనకనుగుణంగా ఆ తరువాత సందేశాలు రాసేవాడిని. ఏనాడూ, ఏ చిన్న సవరణ కూడా చేయకుండా నేను ఆయన ముందుంచిన ప్రతి సందేశం మీద సంతకాలు
పెట్టేవాడాయన.
తన దగ్గర పనిచేసిన అధికారులపై ఆయనకున్న విశ్వాసం తిరుగులేనిది...బహుశా ఇది
అరుదైన శైలేమో! ఆయన మా పట్ల ఎలాంటి నమ్మకంతో వ్యవహరించేవారో, అలానే, మేమూ వుండేవాళ్లం. ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన కే. ఆర్. పరమహంస, సంయుక్త కార్యదర్శులు జి. కిషన్ రావు, ఆర్ ఎం గోనెల, ఆంతరంగిక కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, ముఖ్య బధ్రతాధికారి
రామచంద్ర రాజుల విషయంలోనూ ఆయనకు అదే నమ్మకం వుండేది. తన
దగ్గర పని చేసిన మమ్మల్ని చాలా విషయాల్లో సంప్రదించడం, సలహాలు-సూచనలు కోరడం జరుగుతుండేది. అవి ఒక్కొక్కప్పుడు
చాలా చిన్న విషయాలే కావచ్చు, మరో సారి అత్యంత
ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాలే కావచ్చు. మా సలహా ఆయన
అంగీకరించనూ వచ్చు, లేదా, తిరస్కరించనూ
వచ్చు. ఆయన దగ్గర పనిచేస్తున్న "మా మాట" అంటే, అది "ముఖ్యమంత్రి
చెన్నారెడ్డి మాట" గానే చలామణి కావాలని ఎన్నో
పర్యాయాలు బహిరంగంగానే అంటుండేవారు. అలా అనధికారిక
ఆదేశాలు కూడా ఇచ్చారు!
నన్నుచెన్నారెడ్డి గారికి పరిచయం చేసింది పాత్రికేయ
మిత్రుడు, నాకు దూరపు బంధువు,
పర్సా వెంకట్. 1989 సంవత్సరం పూర్వార్థంలో, మరో ఏడాదిలో
ఎన్నికలు వస్తాయనగా, నాటి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎన్టీ రామారావును ఓడించగల
సమర్థుడైన వ్యక్తికి ఏపీసీసీ అధ్యక్షత బాధ్యతలు అప్పచెప్పాలని అఖిలభారత కాంగ్రెస్
కమిటీ అధిష్టానం ఆలోచన చేస్తున్న రోజులవి. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా స్వర్గీయ
నేదురుమల్లి జనార్ధన రెడ్డి వ్యవహరిస్తున్నారు. జలగం వెంగళ్ రావు కేంద్రంలో
పరిశ్రమల మంత్రిగా వున్నారు. రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా, అధిష్టానంలో కీలక వ్యక్తిగా స్వర్గీయ హెచ్కేఎల్ భగత్ పేరు ప్రచారంలో
వుండేది. రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణకు అధిష్టానం దగ్గర బాగా
పలుకుబడి వుందని చెప్పుకునేవారు. వీరందరికంటే ఎక్కువగా,
స్వతహాగా కాంగ్రెస్ అభిమానైన నాటి గవర్నర్ కుముద్ బెన్ జోషికి రాజీవ్ గాంధీతో
సాన్నిహిత్యం, ఆయన దగ్గర పలుకుబడి బాగా వుండేది. వీరందరికీ
ఇష్టమైన వారే పీసీసీ అధ్యక్షుడిగా అయ్యే అవకాశాలు వుండేవప్పుడు. సరిగ్గా ఈ
నేపధ్యంలో నాకు చెన్నారెడ్డి గారితో పరిచయం అయింది. ఆ పరిచయం పెరిగింది.
నా పరిచయాన్ని
కొనసాగించుకుంటూనే, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా కావడానికి ఎవరెవరి
సహాయం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన నేను కూడా నా వంతుగా చేసినప్పుడు మదిలో
ఆదిరాజు మెదిలాడు. అప్పుడు ఢిల్లీలో పాత్రికేయుడిగా మంచి పలుకుబడి సంపాదించుకున్న
ఆదిరాజుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన్ను
చెన్నారెడ్డి దగ్గరకు ఒక సాయింత్రం తీసుకెళ్ళాను. అయితే అంతకు ముందు దాదాపు
పది-పన్నెండేళ్లగా వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. 1978-80 మధ్యకాలంలో మొదటి
సారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఆయన మీద కాంగ్రెస్ అసంతృప్తి
నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పుడు, ఆ వివరాలను
ముందుగానే మీడియా ద్వారా బహిర్గతం చేసి, అగ్నికి ఆజ్యం పోసి, చెన్నారెడ్డికి కోపం కలిగించాడు ఆదిరాజు. ఇద్దరి మధ్యా తీవ్ర వివాదానికి
దారితీయడం, ఒకరితో మరొకరు మాట్లాడుకొని పరిస్థితులకు
దారితీయడం జరిగింది. ఆ నేపధ్యంలో ఒకరిని మరొకరు ఆహ్వానించారని (వాస్తవానికి
ఎవరు-ఎవరినీ ఆహ్వానించలేదు) ఇద్దరికీ చెప్పి ఇద్దరినీ కలిపాను నేను.
ఆదిరాజును తన గదిలో చూడగానే చెన్నారెడ్డి “ ఏం
ఆదిరాజూ....ఏం పని మీద వచ్చావు?” అని తన సహజ ధోరణిలో
ప్రశ్నించాడు. “నాకు మీతో ఏం పని లేదు...మీరు రమ్మని అడిగితే వచ్చాను” అని కోపంగా
జవాబిచ్చి, “డాక్టర్ సాబ్... ఐ యాం గోయింగ్...ఇఫ్ యు ఇన్వైట్
మీ అగైన్ అండ్ వాంట్ మీ టు కం, ఐ విల్ సీ” అంటూ కుర్చీ లోంచి
దూకుడుగా లేచాడు. ఇద్దరికీ సర్ది చెప్పడం మా వంతైంది. చివరకు ఇద్దరూ ఆప్యాయంగా
పలకరించుకోవడం జరిగింది. పదేళ్ళ క్రితంనాటి కోపాలు ఇద్దరూ మర్చిపోయి
మాట్లాడుకున్నారు. చెన్నారెడ్డికి తన వంతు సహాయం చేస్తానని మాటిచ్చాడు.
అన్నట్లుగానే ఢిల్లీలో అప్పట్లో అధిష్టాన వర్గానికి అత్యంత కీలక వ్యక్తిగా
వ్యవహరిస్తున్న హెచ్ కె ఎల్ భగత్ ను, నాటి కేంద్ర పరిశ్రమల
మంత్రి జలగం వెంగళ్ రావును, పార్లమెంటు సభ్యుడు ద్రోణంరాజు
సత్యనారాయణను సంప్రదించాడు ఆదిరాజు. ఎవరి ప్రయత్నం ఫలించిందో చెప్పలేం కాని, 1989 ఉత్తరార్థంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి స్థానంలో డాక్టర్ మర్రి
చెన్నారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం.
చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షిడిగా నియామకం జరగడానికి
పూర్వరంగంలో, ఆ విషయానికి సంబంధించి, అధిష్టానంతో మాట్లాడడానికి, వాళ్ళను ఒప్పించడానికి, తన వంతు లాబీయింగ్ చేసుకోవడానికి, ఆయన డిల్లీ వెళ్లిన
సందర్భం నాకు ఇంకా గుర్తుంది. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు వీడ్కోలు పలకడానికి
వెళ్ళింది కేవలం నలుగురైదుగురం మాత్రమే. నాకు గుర్తున్నంతవరకు చెన్నారెడ్డి
డిల్లీలో పదిహేను రోజులు మకాం వేశారు. ప్రతిరోజూ కాకపోయినా అడపా-దడపా నాతో
మాట్లాడేవారు. అవుననో, కాదనో అనిపించుకునేవరకు డిల్లీలోనే
వుంటే మంచిదనే అభిప్రాయం నేను వెల్లడించే వాడిని. మొత్తం మీద నియామకం ఖాయం
చేసుకునే మరీ వచ్చారు.
(సశేషం)
No comments:
Post a Comment