కాంగ్రెస్ మేనిఫెస్టోకు కళ తెచ్చిన “చెన్నా”
మర్రి చెన్నారెడ్డితో
అనుభవాలు, జ్ఞాపకాలు-2
మర్రి
చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (12-07-2018)
(మాజీ పీఆర్వో టు సీఎం
చెన్నారెడ్డి)
పీసీసీ అధ్యక్షుడి హోదాలో హైదరాబాద్ వచ్చిన నాడు, బేగంపేట విమానాశ్రయంలో అశేష జనవాహిని,
సుమారు లక్షమందికి పైగా, ఆయనకు స్వాగతం పలికారు. నాటి పోలీసు
అధికారులు కూడా ఆయనను దాదాపు కాబోయే ముఖ్యమంత్రిగా పరిగణించి, విమానం దాకా ఆయన్ను తెచ్చే వాహనాన్ని అనుమతించారు. బ్రహ్మాండమైన
ఊరేగింపుతో బేగంపేట నుండి, తార్నాకా ఇంటికి వెళ్లారాయన. ఆయన
ఆధ్యక్షతన ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. అఖండ విజయం సాధించింది.
అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకి, పార్టీ అధినేత-ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి, పీసీసీ
అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే సవాళ్ళు విసరడం ఆరంభించారు
చెన్నారెడ్డి. జూన్ 3, 1989 న "నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్" నిర్వహించిన "జవహర్ రోజ్ గార్-పంచాయితీ రాజ్" సదస్సులో ఎన్ టీ రామారావు
సబ్సిడీ బియ్యం పథకం అంశం ప్రస్తావిస్తూ... ప్రతి
వ్యక్తీ తమ కాళ్లపై తామే నిలబడేలా, స్వయం కృషితో
జీవనాధారం పొందగలిగే స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందించాలి కాని, శాశ్వతంగా వారిని ఒకరిపై ఆధారపడేలా చేయకూడదని అన్నారు చెన్నారెడ్డి. పంచాయితీరాజ్ సంస్థల ద్వారా, స్థానిక
స్వపరిపాలన ద్వారా మాత్రమే అది సాధ్య పడుతుందని, కాంగ్రెస్
పార్టీ ఎన్నికల్లో, ఈ రెండింటి లో ఏది ముఖ్యమో అన్న
అంశంపైనే పోటీకి దిగి గెలుస్తుందని సవాలు విసిరారు. ఆ
నాటి సెమినార్ లో పాల్గొని ప్రసంగించిన ప్రముఖుల్లో పద్మభూషణ్ స్వర్గీయ సీ నరసింహన్
ఐసీఎస్, ప్రముఖ అఖిల భారత కమ్యూనిస్ట్ నాయకుడు స్వర్గీయ
మొహిత్ సేన్ కూడా వున్నారు.
నవంబర్-డిసెంబర్ 1989 లో జరిగిన ఎన్నికల్లో చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి
ఓడిపోడనుకున్న ఎన్ టీ రామారావును ఒక నియోజక వర్గంలోను, పార్టీని
రాష్ట్రంలోను ఓడించింది. ఆయన ఎన్నికల షెడ్యూల్
ప్రకటించడానికి ముందు చేసిన వివిధ ప్రసంగాల్లో విసిరిన సవాళ్లనే ఆ తర్వాత ఎన్నికల
మేనిఫెస్టోలో కూడా చేర్చారు. "అర్హులైన పేదలకే సబ్సిడీ
బియ్యం పథకం" పరోక్షంగా ప్రస్తావిస్తూ, పటిష్ఠమైన పౌర పంపిణీ వ్యవస్థ విధాన ప్రకటన మేనిఫెస్టోలో మొదటి అంశంగా
చేర్చింది కాంగ్రెస్ పార్టీ. అలానే స్వయం ఉపాధి పధకాల
ప్రస్తావన కూడా దానికి జత పరిచింది పార్టీ. ఎన్నికల
ప్రణాళికను తయారుచేయడానికి నియమించిన కమిటీ ఆ పనిని పూర్తి చేయడానికి పదిహేను
రోజులు తీసుకుంది. ముసాయిదాను అధ్యక్షుడి ఆమోదం కొరకు
చూపించినప్పుడు నేను కూడా అక్కడే వున్నాను. కేవలం పావు
గంటలోనే ఆసాంతం చదివి, తప్పులు
సరిదిద్దిన చెన్నారెడ్డి, అదనంగా మరో ఇరవై మూడు పేరాలు , కాగితంపై పెట్టిన కలాన్ని ఎత్తకుండా రాశారు. ఆయన
స్వదస్తూరీతో ఆ నాడు రాసిన మేనిఫెస్టో కాగితాలను, ఈ
నాటికీ, ఆయన జ్ఞాపకంగా నా వద్దనే భద్రపరుచుకున్నాను.
ఒక సందర్భంలో, ఎన్నికల
ముందు ఒక స్నేహితుడితో కలిసి చెన్నారెడ్డితో మాట్లాడుతూ, ఏ
పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చో అంచనా వేస్తున్నాం. అప్పటికే ఇంటలిజెన్స్ వర్గాల
సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి సుమారు 200 స్థానాల దాకా రావచ్చని సమాచారం వచ్చింది
చెన్నారెడ్డికి. అదే విషయం ఆయనతో ప్రస్తావించాను. ఆయనకు అధికారంలోకి రావాలని
వున్నా, అన్ని సీట్లు వస్తాయన్న నమ్మకం అంతగా లేదు.
నేనేప్పుడైతే 200 సీట్లు రాబోతున్నాయని అన్నానో, అలా వస్తే, నన్నే తన పీఆర్వో చేస్తానని అన్నాడు. అన్న మాట ప్రకారం చేశారు. వాస్తవానికి
ఆయన సీఎం కాగానే, 1978 లో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు
ఎవరెవరైతే ఆయనకు పర్సనల్ స్టాఫ్ గా పనిచేశారో వారందరినీ మళ్లీ నియమించుకున్నారు.
ఉదాహరణకు ఐఏఎస్ అధికారి కేఆర్ పరమహంసను తన కార్యదర్శిగా నియమించారు. ఒక్క పీఆర్వో
విషయంలోనే అప్పుడున్న స్వర్గీయ పర్వతాలరావు స్థానంలో నన్ను నియమించారు. అది ఆయనలో
వున్న గొప్పతనం. ఎన్నికల ముందు అన్న మాట ప్రకారం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకసారి ప్రధాని, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజీవ్
గాంధీ వచ్చారు. వెంట మణిశంకర్ అయ్యర్ వున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో
ప్రచారం మధ్యలో కల్వకుర్తిలో ఆగడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్ని సీట్లు వస్తాయని
రాజీవ్ గాంధి చెన్నారెడ్డిని అడిగారు. 40 పార్లమెంటు సీట్లు,
194 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని చెన్నారెడ్డి జవాబిచ్చారు. ఆశ్చర్యపోయిన రాజీవ్
గాంధి, అన్ని సీట్లు వస్తే చెన్నారెడ్డే ముఖ్యమంత్రి అని
వ్యాఖ్యానించారు. చెన్నారెడ్డి అన్నట్లుగానే కరెక్టుగా 194 స్థానాలు కాంగ్రెస్
గెలిచింది. అన్న మాట ప్రకారం, గెలిచిన శాసన సభ సభ్యుల్లో
చెన్నారెడ్డికి ఎంతమంది మద్దతున్నదనే అంశాన్ని పక్కన పెట్టి,
ఆయన్నే సీఎం చేసింది అధిష్టానం.
పీసీసీ అధ్యక్షుడుగా చెన్నారెడ్డి చేపట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా
చేపట్టిన "కోటి సంతకాల సేకరణ" కార్యక్రమం, "జైల్ భరో" ఉద్యమం ప్రజల స్పందనకు ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలి. నిజాం కళాశాల మైదానంలో డిసెంబర్ 3, 1989 న
ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన చేసిన తొలి ప్రసంగంలో, ప్రజలకు అయిష్టం కలిగించేది, ఇబ్బందులకు
గురిచేసేది, ఆమోదయోగ్యం కానిది ప్రభుత్వం చేయడం తగదని
అన్నప్పుడు, "హెల్మెట్లు" విధిగా ధరించడం మాకిష్టం లేదంటూ ప్రేక్షకుల నుంచి కేకలు వినిపించాయి. తక్షణమే స్పందించిన చెన్నారెడ్డి, ధరించమని
బలవంతంగా ఎవరిపైనా రుద్దమని అన్నారు. అలా అంటూనే, బధ్రత దృష్ట్యా వాటిని ధరించితేనే మంచిదంటూ సూచన కూడా చేశారు. అదీ ఆయన స్పందించే శైలి. ఎన్టీ రామారావు
ప్రభుత్వం వున్నప్పుడు, హెల్మెట్లు ధరించే విషయంలో ఒకసారి
పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన సీనియర్ పాత్రికేయుడు భండారు శ్రీనివాసరావు
(అప్పుడు ఆయన మాస్కో రేడియోలో పని చేస్తున్నాడు) కు, ముఖ్యమంత్రి
హోదాలో మర్రి చెన్నారెడ్డి తన నిర్ణయం గురించి ఉత్తరం కూడా రాశారు!
ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి వెళ్లే ప్రతి సందేశంలో, పత్రికా ప్రకటనలో ఆయన దైన శైలి, వ్యక్తిత్వం కొట్టొచ్చినట్లు కనబడేలా సంబంధిత వ్యక్తిగత సిబ్బందికి ఆయన
ఆలోచనా ధోరణి తెలియ చేసేవారు చెన్నారెడ్డి. ముఖ్య
మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే, ఆయనను అభినందిస్తూ
వచ్చిన వేలాదిమంది అభిమానులకు, చెన్నారెడ్డి నుంచి ఆయన
సంతకంతో వెళ్ళిన "కృతజ్ఞతల ప్రత్యుత్తరం" కేవలం ధన్యవాదాలకే పరిమితం చేయలేదు. అద్వితీయమైన
శైలిలో ఆయన తన అభిమానులకు చేరవేయాలనుకున్న సందేశాన్ని మాతో రాయించారు. అధికారం మారడంతో తనకు తెలుగుదేశం నుంచి వారసత్వంగా సంక్రమించిన "ఛిన్నాభిన్నమైన పాలనా వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను", అత్యవసరంగా ప్రక్షాళన చేయడానికి వారి సహకారం అందించమంటూ, తన జవాబులో కోరారు చెన్నారెడ్డి.
బ్లిట్జ్ సంపాదకుడు ఆర్ కే కరంజియా
చెన్నారెడ్డిని అభినందిస్తూ రాసిన వుత్తరం గురించి ఆయన చాలా మందితో ప్రస్తావించారు. అప్పట్లో పంజాబ్ రాష్ట్రంలో నెల కొన్న శాంతి బధ్రతల సమస్యను-హింసాత్మక సంఘటనలను తన వుత్తరంలో పేర్కొన్న కరంజియా, చెన్నారెడ్డి కనుక మరికొంత కాలం ఆ రాష్ట్ర గవర్నర్ గా కొనసాగి
వున్నట్టయితే, బహుశా, పరిస్థితులు
మరోలాగా-శాంతియుతంగా వుండేవని చెప్పారు. తన పట్ల ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం ఒక అసాధారణమైన గౌరవంగా భావించిన
చెన్నారెడ్డి కరంజియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి దర్బారా సింగ్ చనిపోయిన వార్త ఆ రాత్రి బాగా
పొద్దు పోయిన తర్వాత తెలిసింది. అప్పటికే ఇంటికొచ్చిన
నేను, ఆ విషయాన్ని చెన్నారెడ్డి దృష్టికి తెచ్చి, సంతాప సందేశం ఆయన మాటల్లో చెప్పమని కోరాను. అప్పటికే
అర్థరాత్రి కావచ్చింది. ఆయన గవర్నర్ గా పని చేసినప్పుడు, దర్బారా సింగ్ పంజాబ్ ముఖ్య మంత్రిగా వుండేవారు. "పర్సనల్ టచ్" తో సందేశం చెప్పారు.
(మిగతాది రేపు)
Nice Blog
ReplyDelete