Friday, July 6, 2018

ఐఏఎస్ అధికారికి ఏ శాఖా అప్రధానం కాదు : వనం జ్వాలా నరసింహారావు


ఐఏఎస్ అధికారికి ఏ శాఖా అప్రధానం కాదు
వనం జ్వాలా నరసింహారావు
సాక్షి దినపత్రిక (07-07-2018)
తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌ అధికారులు తమను “అప్రధానమైన” పోస్టుల్లో నియమిస్తున్నారనీ, సీనియారిటీ లేకపోయినా ఇతరులకు కీలక పోస్టులు కట్టబెడుతున్నారనీ, తమ పట్ల వివక్ష చూపుతున్నారనీ, ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు వార్తలొచ్చాయి. ఇలా చేయడం సరైంది కాదేమో! రాష్ర్ట ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం అవసరమైనప్పుడు బదిలీ చేసిన ఐఏఎస్‌ అధికారులలో కొందరు తమకు ప్రాధాన్యత పోస్టులు లభించలేదన్న అసంతృప్తితో వున్నారని వార్తలొస్తున్నాయివారిలో కొందరు తమ సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదనిమరి కొందరు తమను అంతగా ప్రజలతో సంబంధం లేని పదవులకు పంపారని-తామెంత బాగా పనిచేస్తున్నప్పటికీ తమ సమర్థతకు తగిన గుర్తింపు రాలేదనిఎవరికి తోచిన రీతిలో వారు తమ అసంతృప్తులను బహిరంగంగానే వెల్లడి చేయడం గమనించాల్సిన విషయం. తమపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని కూడా ఆరోపణలు చేస్తున్నారు వీరంతా. వాస్తవానికి, వీరంతా తమకప్పగించిన ఏ బాధ్యతనైనా, అది ఏ శాఖకు సంబంధించినదైనా అరమరికలు లేకుండా, ప్రధానమా? అప్రధానమా? అని ఆలోచించకుండా విధులు, బాధ్యతలు నిర్వర్తించాలి. అలా కాకుండా ఆరోపణలు చేయడం సమంజసమా?

1995 సెప్టెంబర్ నెలలో నాకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డెప్యుటేషన్ మీద ఉద్యోగం వచ్చినప్పుడు, అక్కడకు చేరుకోవడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. కారణం, ఆ సంస్థ చిరునామా కనుక్కోవడం కూడా చాలా కష్టమైంది. అప్పట్లో ఆ సంస్థలో పోస్టింగ్ అంటే ఒక పనిష్మెంట్ లాగా భావించేవారు. అదొక “అప్రధానమైన” శాఖ అని అక్కడికి పనిచేయడానికొచ్చే వారి అభిప్రాయం. ఒక ఏడాదిన్నర తరువాత నేనక్కడ పనిచేస్తున్నప్పుడే, స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర మీడియా సలహాదారుడిగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ అనే ఐఏఎస్ అధికారిని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ గా, శ్రీమతి ఊర్మిళా సుబ్బారావు అనే మరో ఐఏఎస్ అధికారిణిని అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించింది అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అందరూ అనుకునే విధంగా ఆలోచిస్తే వారికి ఒక విధంగా అది పనిష్మెంట్ పోస్టింగే!

వీళ్ళిద్దరినీ అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించినవారికి, వాళ్లిచ్చిన జవాబు, విశ్రాంతిగా పనిచేసుకోవడానికని. కాని, ఆ తరువాత జరిగిందేమిటి? 1995 లో ఎవరికీ అంతగా తెలియని ఆ శిక్షణా సంస్థ అచిరకాలంలోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంస్థగా, ప్రపంచ శిక్షణా సంస్థల చిత్రపటంలో అతిప్రదానమైన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నాటికీ ఆ సంస్థ పేరు అలాగే వుంది. దానికి కారణం, ఏ పోస్టింగ్ అయితే పనిష్మెంట్ పోస్టింగ్, అప్రధానమైన పోస్టింగ్ అని ఇతరులు అనుకున్నారో, అక్కడే, పీవీఆర్కే ప్రసాద్, ఊర్మిళా సుబ్బారావులు తమ అవిరళ కృషితో, అపారమైన నిబద్ధతతో ఆ సంస్థను అంచెలంచలుగా అభివృద్ధి చేశారు. అక్కడ ఇప్పుడు పనిచేయడం అంటే ఒక పెద్ద క్రెడిట్ గా భావిస్తారు ఎవరైనా. యావద్భారతదేశం తిరగడానికి , ఇంగ్లాండు దేశాన్నీ సందర్శించడానికి నాకు అవకాశం కలిగింది ఆ సంస్థ చలవవల్లనే!

స్వర్గీయ పీవీ నరసింహారావును మంత్రిమండలి లోకి తీసుకునే ముందర ఆయనకేం పోర్ట్ ఫోలియో కావాలని అడిగిన ఇందిరాగాంధీ, రక్షణ శాఖ కాని, విదేశాంగ శాఖ కానీ, మరేదైనా మంచిశాఖ కానీ ఆయన అడుగుతాడని భావించింది. దానికి భిన్నంగా విద్యాశాఖ కోరుకున్నాడట! అదేంటి అలాంటి అప్రధాన శాఖ అడిగావంటే, ప్రభుత్వంలో ఏదీ అప్రధామనమైన శాఖ కాదని జవాబిచ్చాడు పీవీ. ఆకాశానికంత ఎత్తుకు తీసుకెళ్ళాడు ఆ శాఖను పీవీ. అంతెందుకు...స్వర్గీయ ఇందిరాగాంధీని లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో మొదటిసారి మంత్రిగా చేరినప్పుడు, అందరూ ఆశ్చర్యపడేలా ఆమె కోరుకున్న శాఖ అప్పట్లో అందరూ అప్రధానమైనదని భావిచే సమాచార-ప్రచార శాఖ. స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి కేంద్రంలో మొట్టమొదట నిర్వహించిన శాఖ అప్పట్లో అందరూ అప్రధానమైనదని భావించిన ఉక్కు శాఖ. దానికి ఆయన ఎవరూ ఉహించని విధంగా వన్నె తెచ్చాడు.


స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి రెండవ సారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, నేను ఆయన దగ్గర పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్నప్పుడు, మునిసిపల్ శాఖ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించి, అప్పటి ఆ శాఖా మంత్రితో (స్వర్గీయ కోనేరు రంగారావు) రాజీనామా చేయించి, సంబంధిత ఐఏఎస్ అధికారి సీ అర్జున్ రావును, సాధారణంగా అందరూ భావించే అప్రధానమైన “విపత్తుల నిర్వహణ” శాఖకు కార్యదర్శిగా బదిలీ చేయించారు సీఎం. అది జరిగిన కొన్నాళ్లకే మే నెల 13, 1990 న తీవ్రమైన భయంకర పెను తుఫాను రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. విపత్తుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న అర్జున్ రావు, తన అసమాన ప్రతిభతో వేలాది మంది ప్రాణాలు కాపాడడానికి ముందస్తు చర్యలు చేపట్టడమే కాకుండా, సహాయ-పునరావాస చర్యలు అద్భుతంగా చేపట్టి “విపత్తుల నిర్వహణ” ప్రాధాన్యతను లోకానికి తెలియచెప్పాడు. ఆయనెప్పుడూ తనకు అప్రధానమైన శాఖ ఇచ్చాడని పిర్యాదు చేయలేదు. ఏ ముఖ్యమంత్రైతే ఆయన్ను “విపత్తుల నిర్వహణ” శాఖకు బదిలీ చేశాడో ఆయనే స్వయంగా పలుమార్లు అర్జున్ రావు సేవలను అభినందించారు. రీడర్స్ డైజెస్ట్ లాంటి ప్రముఖ మాహజైన్ ఆయన మీద ప్రత్యేక కథనం రాసింది.

ఇంతెందుకు...చంద్రబాబునాయుడు హయాంలో వ్యవసాయం దండుగ అని విజన్ 2020 డాక్యుమెంటులో చెప్పడమంటే, ఆ శాఖ అప్రధానమైనదనే అనుకోవాలి కదా? ఒకప్పుడు అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కమీషనర్ పోస్టు అంటే ఏ పనీ లేదనే భావన వుండేది. ఇక ఇప్పుడు...వ్యవసాయ శాఖకున్న ప్రాధాన్యత అంతా-ఇంతా కాదు. దీనర్థం...ప్రభుత్వ శాఖల్లో ఏదీ అప్రధానమైనది కాదు...అన్నీ ప్రధానమైనవే...కాకపొతే వాటిని నిర్వహించేవారి సత్తాను బట్టి, వారి-వారి కృషిని బట్టి, సమయ-సందర్భాలను బట్టి, ఒక్కో శాఖకు ప్రధానమైనదిగానో, అప్రధానమైనదిగానో తాత్కాలికంగా గుర్తింపు వస్తుంది. ఫలానా శాఖ అప్రధానమైనది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఆ శాఖను నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిదే!

ఐఏఎస్‌కు ఎంపికైన వారికి సబ్ కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకుకేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకుపనిచేసే అవకాశం వుంది. ఇవన్నీ వారి-వారి సమర్ధతను బట్టి లభిస్తాయి. గతంలో, ఉమ్మడి రాష్ట్రంలోపలు సందర్భాలలో అర్హతలు కాకుండాపలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల అండతోవారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందారన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. "సమర్ధత" కన్నా, "చొరవ", "పలుకుబడి" ప్రాతిపదికలుగాప్రాధాన్యతల పోస్టులు దక్కించుకున్నారని అనేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత అలాంటి అవకాశం కోల్పోయిన కొందరు బహుశా తమను అప్రధానమైన శాఖలకు బదిలీ చేసారని ఆరోపిస్తున్నట్లు అర్థమవుతున్నది.

వీరి లాంటి కొందరు గతంలో పదవిలో వున్న ముఖ్య మంత్రుల దగ్గర వ్యక్తిగతంగా పలుకుబడి ఉపయోగించు కోగలిగిన వారైతేఇంకొందరు తెలుగు దేశం హయాంలో, కాంగ్రెస్ హయాంలోచాలా కాలం ఒకే పోస్టులో వుంటూ అధికారం, పెత్తనం పరోక్షంగా చెలాయించిన వారు కావడంతో ప్రస్తుతం బదిలీ చేసిన పోస్టులోకి వెళ్లాలన్న ఆలోచనను జీర్ణించుకొన లేక పోతున్నారేమో! ఏదేమైనాప్రభుత్వ యంత్రాంగంలో, అందునా ఐఏఎస్‌ స్థాయిలోఫలానా పోస్టు ప్రాధాన్యతకలదనిమరోటి మామూలుదనిఎవరైనా ఐఏఎస్‌ అధికారి భావించడమంటేఆ సర్వీసులో ఇంతకాలం పనిచేస్తున్న వారి అవగాహనా లోపమే అనాలిసమర్ధుడైన అధికారికి ఏ బాధ్యతలను ఇచ్చినాగతంలో పని చేసిన శాఖను అభివృద్ధి చేసినట్లేఅక్కడ కూడా రాణించగలరుఅసమర్థులకు ఏమిచ్చినా ఒకటే.

"భారత ఉక్కు వ్యవస్థగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించిన, "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)"భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాతఅప్పటి వరకుబ్రిటీష్ వారి పాలనలో అధికార స్వామ్యానికి ప్రతీకైన "ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్)" స్థానంలో ఆవిర్భవించింది. ఐఏఎస్ కు ఎంపికైన వారందరూసాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకుఒకటికి మించిన విభిన్న విద్యల్లోతమదంటూఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడాపలు రకాల వడపోత పద్ధతులను అవలంబించివిస్తృతమైన, కఠినమైన రాత, మౌఖిక పరీక్షా విధానం ద్వారారాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగ పరమైన రక్షణ వుంటుంది. కర్తవ్య నిర్వహణలోనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన ఆగత్యం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం కానిఒత్తిడులకు లోను కావడం కానిఏ మాత్రం లేదు.

 ఏడాదికి పైగా శిక్షణానంతరం ఏదో ఒక సబ్ డివిజన్ లోసబ్ కలెక్టర్ గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు-సిసలైన అధికార రుచి చవి చూసే అవకాశం అలా లభిస్తుంది వారికి. దాంతో పాటేప్రజాసేవ చేసే అవకాశం కూడా ప్రప్రధమంగా కలుగుతుంది. సబ్ కలెక్టర్ గా పనిచేసిన కొందరినిఅక్కడి ప్రజలు ఎన్నటికి మరవ లేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్ కలెక్టర్ తర్వాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి గా, జాయింటు కలెక్టరు గా పదోన్నతి పొంది మరో మెట్టుకు ఎదుగుతారు. ఇక ఆ తర్వాత, సుమారు ఏడెనిమిది ఏళ్లకుజిల్లా కలెక్టర్ గా నియామకం దొరుకుతుంది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలుఇక ఆ తర్వాతఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు. కొందరికి రక-రకాల కారణాలవల్ల ఈ పదవులు దక్కకుండావాటికి సమానమైన పదవులు (ఉదాహరణకుడిప్యూటీ కార్యదర్శిగాసంయుక్త కార్యదర్శిగాకార్పొరేషన్లలో ఉన్నతాధికారిగామునిసిపల్ కమీషనర్లుగా) దొరుకుతాయి. ఇలా లూప్ లైనులలోకి మళ్లించబడే అలాంటి ఐఏఎస్ అధికారుల ఎదుగుదల సాదా-సీదాగా సాగుతుంది. వారికి ఏ పోస్టు ఇచ్చినా సర్దుకుని పోతుంటారు. అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకతదానికి ఎంపికైనవారికి ఒక "జిల్లా కలెక్టర్గా పని చేయడమే.

కలెక్టర్ పదవిని సుమారు పది సంవత్సరాల పాటువివిధ జిల్లాలలో చేపట్టి (అందరూ కాకపోయినా కొందరైనా) శాఖాధిపతులుగానోకార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగా నోసచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగానో పని చేసేందుకు రాజధానికి చేరుకుంటారు. వారి-వారి సామర్థ్యాన్ని బట్టిప్రత్యేక తరహా నైపుణ్యాలను బట్టి వారికి పదవులు లభిస్తాయి. ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచిరాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత, అటు పిమ్మట సొంత రాష్ట్రానికోకేంద్ర సర్వీసులకోవిదేశాలలో పదవులకో వెళ్లిన తర్వాతఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడంమరో వైపు అసలు-సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ పదవి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానోకేంద్ర కాబినెట్ కార్యదర్శిగా నో నియామకం కావడం. ఆ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. మిగిలిన పోస్టులన్నీ ఒకేరకమైన ప్రాదాన్యను సంతరించుకున్నవనే అనాలి.

అందుకేఇటీవల బదిలీ అయిన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు అప్రాధాన్యత పోస్టింగులు ఇచ్చారనడం సరైంది కాదు. అలా భావించే ఐఏఎస్ అధికారులున్నారంటేఅది వారి అవగాహనా రాహిత్యమే అనాలి. ఉదాహరణకు తమకు అప్రధానమైన పోస్టింగులు ఇచ్చారని ఆరోపణ చేస్తున్న వారి నూతన శాఖలను పరిశీలిస్తే వాటిలో ఏదీ అప్రధానమైనది కాదని స్పష్టంగా తెలుస్తుంది. వీరిలో ఒకరు గతంలో కలెక్టర్ గా, ఆబ్కారీ కమీషనర్ గా, రెవెన్యూ శాఖ ముఖ్య (ప్రత్యేక ప్రధాన) కార్యదర్శిగా పని చేసి ఇప్పుడు ఎస్సీ-ఎస్టీ కమీషన్ కు కార్యదర్శి అయ్యారు. మారుతున్న సమాజంలో, సమాజంలోని బలహీన వర్గాలవారికి చేయూతను అందించాల్సిన ఈ సమయంలో బహుశా దీనికంటే మంచి ప్రాధాన్యత కల పోస్టు లేదేమో! అలాగే మరొకరిని పోస్టింగ్ చేసిన మునిసిపల్ శాఖ అయినా, ఇంకొకళ్ళను పోస్టు చేసిన హోం శాఖ అయినా, పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ శాఖ అయినా, ఆర్ఖైవ్ శాఖ అయినా. అన్నీ ప్రధానమైనవే ఆలోచించి చూస్తే. కాదేదీ అప్రధానమైంది.

No comments:

Post a Comment