సీతాదేవి సందేహాన్ని తీర్చిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (02-07-2018)
వానర, భల్లూకరాజైన
సుగ్రీవుడు సీత నిమిత్తమై,
గొప్ప సైన్యంతో రాముడికి సహాయపడేందుకు నిర్ణయించుకున్నాడనీ, ఆయనతో వచ్చేవారంతా అసమాన పరాక్రమవంతులనీ, దేవతలతో సమానులనీ, మనోవేగం కలవారనీ, దిక్కులలో, ఆకాశంలో సంచరించేవారనీ, వారంతా శీఘ్రంగా రాబోతున్నారనీ, ధైర్యం చెప్పాడు
సీతకు హనుమంతుడు. వారెటువంటివారో చెప్తూ హనుమంతుడు ఇలా అంటాడు:
"ఎంతటి కష్టకార్యమైనా ఏ మాత్రం అలసట పడకుండా చేయగలుగుతారు. పరాక్రమవంతులు.
సముద్రంతో, పర్వతాలతో వ్యాపించివున్న భూమండలాన్ని
ఆకాశమార్గాన చుట్టిరాగల సమర్ధులు. వారికీ సముద్రం దాటడం చాలా చిన్నపని. వానరులలో
సముద్రాన్ని దాటగల నాలాంటివారు చాలామంది వున్నారు. సుగ్రీవుడి దగ్గరున్నవారందరూ
నాకంటే గొప్పవారో, సమానులో కాని తక్కువైన వాడొక్కడు కూడలేడు.
(విద్యాదరాతి వినయం అని ఆర్యోక్తి. సర్వ వేద వేదాంగ
పారంగతుడు హనుమంతుడు. వినయమంటే ఎలా వుండాలో హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి.
నిజానికి అనంత వానర వీరవాహినిలో ఆయన్ను మించిన వారెవరున్నారని? కానీ, వాగ్విదామ్
వీరత్వం కూడా ఆయన శుభలక్షణమే. ఇలా సీతమ్మకు విన్నవించడంలో ఉదాత్త గుణసంపత్తి ఏ
స్థాయిలో హనుమంతుడిని వరించిందో స్పష్టమౌతోంది).
వారిటుపక్కకు రానందున నువ్వు వారిని చూడలేదు. నా
పుణ్యంకొద్దీ నేను రాగలిగాను, నిన్ను చూడగలిగాను.
అంతమాత్రాన వానరులందరిలో నేనేమొనగాడినని నీవెట్లా నిశ్చయించావు? వానరులందరిలో
చిన్నవాడినీ, ఒక కోతినీ అయిన నేనే నిన్ను చూడగాలేంది, అసమాన బలవంతులైన
ఇతరుల సంగతి చెప్పాల్నా? రాజు శత్రువుల దగ్గరకు పంపేటప్పుడు, అల్పులను మొదట పంపుతాడుకాని, మహాబలవంతులను పంపడు కద!. ఇది రాజనీతి. ఎందుకంటే బలవంతుడు
శత్రువు దగ్గర చిక్కుపడితే తన బలం తగ్గుతుంది కాబట్టి".
(ఇది తెలివిగా చెప్పొచ్చు కాని, సత్యం కాదు. అయినా
ఇట్టి అసత్యం నిజంగా అసత్యం కాదు. ఇది సీతాదేవికి ధైర్యం చెప్పడానికి, చెప్పి ఆమెను ప్రాణాలతో వుంచడానికి చేసినపని. ఇందులో సదుద్దేశమేకాని, దురుద్దేశం లేదు.
అసత్యదోషమూలేదు. ఆమె సందేహనివృత్తి చేయడంకూడా ఆయన ఉద్దేశ్యం).
"రామలక్ష్మణులు ఎట్లా వస్తారా అనే సందేహం కానీ,
రారని శోకించడం కానీ వదులుకో. నీవు దుఃఖించే కాలంపోయింది. నేనుపోయి చెప్పగానే
ఒక్కగంతేసి, వానరులొస్తారిక్కడకు. రామలక్ష్మణులు, సూర్య, చంద్రుల్లాగా
నావీపుపైకెక్కి, నీ ఎదుట నిలుస్తారు. వారి బాణాగ్నికి లంకంతా పాడైపోతుంది. రావణుడిని సేనలతో
సహా చంపి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకుపోతాడు. మేమెప్పుడొస్తామా అని మా రాకకొరకు
ఎదురుచూస్తుండు. ఏ సాహసం చేయొద్దీలోపల. మండుతున్న అగ్నిహోత్రం లాగా రామచంద్రమూర్తిని
ఇక్కడ చూస్తావు. రాక్షసుడికేగతి పడ్తుందో చూడు. కొడుకులతో, చుట్టాలతో, మంత్రులతో చచ్చిపోయి రావణుడు
నేలకూలగా చూసిన నీవు దుఃఖ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటావు. రోహిణి చంద్రుడిని
కలుసుకున్నట్లు, నీవూ నీ మగడిని కలుస్తావు".
ఇట్లా పలురకాలుగా సమాధానపరిచి ప్రయాణానికి సిధ్ధపడిన
హనుమంతుడు, సీతకు మరింత ధైర్యం కలిగేటట్లు మరికొన్ని మాటలు చెప్పాడిలా: "అమ్మా!
విల్లు, బాణాలు ధరించిన రామలక్ష్మణులు, త్వరలోనే
లంకవాకిట్లో నిలుస్తారు. వారివెంట గోళ్లు, కోరలు
ఆయుధాలుగా వుండే, సమర్ధులైన, పర్వత సమానులైన వానరులుంటారు. రావణుడి భయం
వదులు. ఏ విషయంలోనూ రామచంద్రమూర్తికంటే గొప్పవాడెవరు? లక్ష్మణుడికి
సమానమైన వాడెవ్వడు? వారిరువురు అగ్ని, వాయువుల్లాంటివారు. ఈ రెండూ ఏకమైతే శత్రు
నిశ్శేషం చేస్తాయి. వీళ్లిద్దరూ నీకు సహాయంగా వస్తుంటే, నీకొచ్చిన భయం
లేదు. నేనుపోయి రామచంద్రమూర్తిని చూడటమే ఆలస్యం. ఆ వెంటనే భయంకర వానర సమూహంతో
బయల్దేరి వచ్చి శత్రువులను సంహరిస్తాడు. రాక్షసులు కాపాడుకుంటున్న ఈ లంక శాశ్వతంగా
దుఃఖాల పాలుకానున్నది. ఇంద్రుడిని శచీదేవి కలుసుకున్నట్లు, నీవూ
రామచంద్రమూర్తిని కలుసుకోబోతున్నావు. ధైర్యంగా వుండు".
వాడిపోతున్న మడిలోని పైరుపై వానచినుకులు పడడంతో, పచ్చబడ్డట్లు, హనుమంతుడి
ప్రియమైన మాటలు సీతకు మళ్లీ ప్రాణం పోసినట్లనిపించింది. బ్రతికాననుకుంటుంది. తన
భర్తను ఎలా కలిసే వీలుందో అలానే చేయమని మళ్లీ కోరుతుంది హనుమంతుడిని. ఇదివరలో
హనుమంతుడికిచ్చిన గుర్తుకాక,
ఇంకో రహస్యమైన గుర్తు చెప్తావినమంటుంది. అరణ్యంలో
తిరుగుతున్న రోజుల్లో, గండశైలం పక్కనున్నప్పుడు,
చెమటవల్ల తనముఖం మీదున్న చుక్కబొట్టు కరిగిపోతే, కాంతిహీనంగా
కనిపిస్తున్న తనకు, మణిశిలను అరగదీసి తన బుగ్గమీద బొట్టుగా వినోదంకోసం తిలకం దిద్దాడని చెప్తుంది.
అలా చెప్పి, ఆ సంగతి కూడా జ్ఞాపకం తెచ్చుకోమంటుంది
రాముడిని. ఇంకా శ్రీరాముడిని ఉద్దేశించి ఇలా పలుకుతుంది:
"పరాక్రమంలో ఇంద్రుడూ, వరుణుడూ కలిసికట్టుగా వచ్చినా నీకు సమానం
కారు. అంత పరాక్రమవంతుడవైన నీవు, నీ భార్యను, నీకు తెలియకుండా,
దొంగతనంగా రాక్షసులెత్తుకునిపోయి, బాధపెట్టుతుంటే, శత్రువులాగా ఎలా వూరుకుంటున్నావు? ఇదేమన్న
ప్రశస్తమైన కార్యమా? దశరథ రాజకుమారా! నీమనస్సును ఆకర్షించే శక్తి ఉన్నందునే, సముద్రజలాలలో
కౌస్తుభంలాగా పుట్టిన చూడామణిని నేను దాచుకున్నాను. నీవియోగమనే అగ్ని నన్ను దహిస్తుంటే, నీళ్లలో పుట్టి, చలువ గుణం వున్న చూడామణిని నాదగ్గర వుంచుకున్నందున, నీళ్లు అగ్నిని
చల్లార్చినట్లే, అది నా విరహాగ్నిని చల్లారుస్తుండేది. దీనిని చూడగానే నీవిరహాగ్నికూడా
చల్లారాలి! ఇప్పుడు దీన్ని కూడా ఎడబాస్తున్నాను. ఇక ఈ దుఃఖసాగరంలో నేను ప్రాణాలు
నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగైతే ఎందుకు పంపించానంటావా? ఇదివరదాకా దీని
దర్శనం నీ రూపాన్ని స్మృతికి తెస్తుండేది.
(పాదాభివందనం చేసినప్పుడల్లా చూడామణిపై రామచంద్రుడి చూపులు
పడతాయి కద! కాబట్టి ఆయన చూపులలో తాను చూపులు కలిపినప్పుడు ఆయనను చూసినట్లే!)
ఇప్పుడదిపోయి నిన్ను పిల్చుకొస్తుందన్న నమ్మకంతో పంపాను.
ఇది సముద్రంలో పుట్టిందికనుక,
సముద్రంవల్ల బాధలేకుండా నన్ను రక్షిస్తూ వచ్చింది. ఇక నన్ను
రక్షించేవారెవ్వరు?"
(దీనర్థం భగవంతుడు ఎల్లవేళలా జ్ఞాపకం వుండడానికి సీతాదేవి "చూడామణి"
వుంచుకున్నట్లే, ఓ పతకం కానీ, మరేదైనా చిహ్నం కానీ శరీరం పైన
ధరించాలెప్పుడూ. అదిపోతే ప్రాణం పోయినట్లే. అంగలకుదురులోని శ్రీకోదండరామసేవక సమాజ
సభ్యులు, సీతారామలక్ష్మణ పతకాన్ని ఎల్లవేళలా ధరిస్తారు. శరీరం వుంది భగవంతుడి స్మరణకే!
దేహం లేక పోతే భగవత్ స్మరణే లేదు. భగవంతుడిని స్మరిస్తేనే గాని భగవత్ ప్రాప్తి
లేదు. భగవత్ ప్రాప్తికై దేహ ధారణ చేయాలేకాని, మనమే విడిచిపెట్ట కూడదు. దానిని "అన్యప్రాకృత"
విషయాల్లో వినియోగించ కూడదు. దేహంపోయే లోపల భగవత్ ప్రాప్తి కలిగే ఉపాయాన్ని
వెతుక్కోవాలి. అట్టి దేహం మీద సీతాదేవి, సర్వాభరణాలు వదిలి "చూడామణి" ని మాత్రమే ప్రాణపదంగా
దాచుకుంది. దాన్నీ రామార్పణం చేసి, హనుమంతుడికి తన గుర్తుగా యిచ్చి, "సర్వస్వనిక్షేపం" చేసిందయింది).
"ప్రాణి పడటానికి వీలుకాని బాధలు పడుతూ, నోటితో
చెప్పలేని మాటలు వింటూ గుండెలదురుతుంటే, రాక్షసుల మధ్య చిక్కుకున్నా, నీవున్నావన్న ధైర్యంతో, నిన్నే
స్మరించి సహిస్తున్నాను. ఎంత కష్టపడైనా మరొకనెల బ్రతికుంటాను. ఈలోపల నువ్వురాకపోతే, ప్రాణాలు వాటంతటవే
పోతాయి. నేను నిలుపుకోలేను. రావణుడిని చూస్తేనే నా ప్రాణాలు పోతాయి. వాడు మహా
క్రూరుడు. ఇంత చెప్పినా నీ మనస్సు కరగకపోతే, ఇది నా పాప ఫలమేకాని నీ దోషంకాదు"అని దుఃఖంతో మగడిని
సంభోధిస్తూ హనుమంతుడితో పలుకుతుంది సీతాదేవి.
No comments:
Post a Comment